సాక్షి,సిటీబ్యూరో: మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానున్న ఎల్‌బీనగర్– అమీర్‌పేట్ మెట్రో రైలుకు అనుగుణంగా సేవలను విస్తరించేందుకు గ్రేటర్ ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఉప్పల్– అమీర్‌పేట్, మియాపూర్– అమీర్‌పేట్ కారిడార్లలో రెండు వైపులా ఉన్న కాలనీలకు సిటీ బస్సులను అనుసంధానం చేసినట్టే.. ఎల్‌బీనగర్–అమీర్‌పేట్ మార్గంలోని కాలనీలకూ విస్తరించేందుకు కసరత్తు చేపట్టింది. ఈ మార్గంలో సమాంతరంగా తిరిగే బస్సులను ఇకపై కొత్త మార్గాల్లోకి మళ్లించనున్నారు. మరోవైపు ఎల్‌బీనగర్– అమీర్‌పేట్ మెట్రో ప్రారంభమైతే ఇటు ఎల్‌బీనగర్ నుంచి నాంపల్లి, లక్డీకాపూల్ మీదుగా అటు ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ మీదుగా రెండు ప్రధాన కారిడార్లలో మియాపూర్‌కు మెట్రో కనెక్టివిటీ పెరగనుంది.
దీంతో ఆర్టీసీకి ప్రయాణికుల ఆదరణ తగ్గే అవకాశం ఉంది. మొదటి కారిడార్ వల్ల ఆర్టీసీపై పెద్దగా ప్రభావం కనిపించలేదు. కానీ రెండో కారిడార్ అందుబాటులోకి రావడం ద్వారా అతి పెద్ద రూట్ల మధ్య ‘మెట్రో అనుసంధానం’ పెరుగుతుంది. దీంతో ఆర్టీసీ ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో మెట్రో వైపు వెళ్లే అవకాశముంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మెట్రో సమాంతర మార్గాల స్థానంలో మెట్రోకు అభిముఖంగా ఉండే రూట్లకు సిటీ బస్సుల సేవలను విస్తరించేందుకు ఆర్టీసీ అధికారులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఈ మేరకు తాజాగా ఎల్‌బీనగర్– అమీర్‌పేట్ కారిడార్‌కు రెండు వైపులా గల కాలనీలపై సర్వే ప్రారంభించారు. మెట్రో రైలు పట్టాలెక్కే నాటికి గ్రేటర్ ఆర్టీసీ రూట్ కోర్సుల్లో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి.
వంద కాలనీలకు అదనపు సర్వీసులు
ప్రస్తుతం హయత్‌నగర్ నుంచి ఎల్‌బీనగర్ మీదుగా, వనస్థలిపురం ఎన్జీఓస్ కాలనీ నుంచి ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, నాంపల్లి, ఖైరతాబాద్, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మియాపూర్, బీహెచ్‌ఈఎల్, లింగంపల్లి మార్గంలో 804 బస్సులు తిరుగుతున్నాయి. ఇవి ప్రతి రోజు సుమారు 7295 ట్రిప్పులు వేస్తున్నాయి. ఇప్పటి దాకా ఆర్టీసీకి అత్యధికంగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గాలు ఇవే. ఈ మార్గాల్లో బస్సుల ఆక్యుపెన్సీ 65 శాతానికి పైగా ఉంది.
త్వరలో ఎల్‌బీనగర్–అమీర్‌పేట్ మెట్రో అందుబాటులోకి వస్తే 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉన్న ఈ రూట్‌కోర్సుల్లో సమూలమైన మార్పులు చేయనున్నారు. ఎల్‌బీనగర్ నుంచి అమీర్‌పేట్ మీదుగా మియాపూర్ వరకు బస్సుల సంఖ్యను గణనీయంగా తగ్గించనున్నారు. లింగంపల్లి, బీహెచ్‌ఈఎల్ మీదుగా వచ్చే బస్సులను మియాపూర్ వరకు పరిమితం చేస్తారు. అలాగే హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం రూట్‌లలో వచ్చే బస్సులను ఎల్‌బీనగర్ వరకు పరిమితం చేస్తారు. ఈ కారిడార్‌లో సమాంతరంగా నడిచే బస్సులను పూర్తిగా రద్దు చేయడం కాకుండా ప్రయాణికుల రద్దీ, ఆదరణకు అనుగుణంగా మార్పులు ఉంటాయి.
సమాంతర రూట్ బస్సులను కుదించడం వల్ల మెట్రోకు రెండు వైపులా ఉండే సుమారు 100 కాలనీలకు అదనపు సర్వీసులు పెరిగే అవకాశం ఉంది. దీంతో కర్మన్‌ఘాట్, బీఎన్‌రెడ్డినగర్, నందనవనం, ఇబ్రహీంపట్నం, బాలాపూర్, మీర్‌పేట్, కోహెడ, తదితర ప్రాంతాల్లోని కొత్త కాలనీలకు బస్సులను విస్తరిస్తారు. ఈ రూట్లలోంచి ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్లకు సిటీ బస్సులను కనెక్ట్ చేస్తారు. అలాగే పాతబస్తీలోని వివిధ ప్రాంతాల నుంచి ఇటు దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్‌కు, అటు లక్డీకాపూల్‌కు సిటీ బస్సుల కనెక్టివిటీని పెంచేందుకు కార్యాచరణ చేపట్టారు. దీంతో ఇప్పటికిప్పుడు వంద కాలనీలకు అదనపు సదుపాయం లభిస్తుంది. అలాగే ప్రధాన కారిడార్లకు ప్రత్యామ్నాయంగా కాలనీలకు విస్తరించడం వల్ల ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుందని ఆర్టీసీ భావిస్తోంది. 100 కాలనీలతో ప్రారంభించి మెట్రోకు దూరంగా ఉన్న సుమారు 500 కాలనీలు, శివారు గ్రామాలకు బస్సులను పెంచనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
మియాపూర్‌లో పెరిగిన ఆక్యుపెన్సీ..
ఉప్పల్–అమీర్‌పేట్–మియాపూర్ మెట్రో కారిడార్‌లో రెండు వైపులా కాలనీలకు మెట్రో అందుబాటులోకి రావడంతోనే ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టారు. చిలుకానగర్, హేమానగర్, బోడుప్పల్, నాగోల్, బండ్లగూడ, ఘట్కేసర్, నారపల్లి తదితర ప్రాంతాలకు ట్రిప్పులను పెంచారు. అలాగే మియాపూర్ మార్గంలో అపురూపకాలనీ–హైటెక్‌సిటీ, జగద్గిరిగుట్ట–వీబీఐటీ, జేఎన్‌టీయూ–హైటెక్‌సిటీ, కూకట్‌పల్లి–హైటెక్‌సిటీ, అమీర్‌పేట్–హైటెక్‌సిటీ తదితర ప్రాంతాలకు 60 బస్సులను అదనంగా ప్రవేశపెట్టారు. దీంతో ఈ రెండు రూట్లలో కాలనీలకు బస్సుల కనెక్టివిటీ పెరిగింది.
ఇప్పుడు ఈ బస్సులన్నీ ప్రతి రోజు 70 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ షెడ్యూల్స్ విభాగం ఉన్నతాధికారి శ్రీధర్ తెలిపారు. ‘పెద్ద బస్సులు వెళ్లగలిగే అన్ని ప్రాంతాలకు సిటీ బస్సులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇక చిన్న కాలనీలకు వెళ్లాలంటే పెద్ద బస్సులకు సాధ్యం కాదు. ప్రయాణికుల ఆదరణకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రణాళికలను రూపొందిస్తూనే ఉన్నా’మని తెలిపారు.
గ్రేటర్ ఆర్టీసీ ఇలా..
మొత్తం డిపోలు: 29
సిటీలో తిరిగే బస్సులు: 3,560
మొత్తం ట్రిప్పులు: 42 వేలు
ప్రయాణికుల సంఖ్య: 33 లక్షలు
రూట్లు: 1050
సగటు ఆక్యుపెన్సీ: 65 శాతం
Comments
Please login to add a commentAdd a comment