city bus
-
బస్సు అద్దాన్ని పగులగొట్టి...కండక్టర్‌పై పామును విసిరి...
నల్లకుంట (హైదరాబాద్): మద్యం మత్తులో ఉన్న ఓ మహిళ నల్లకుంట ప్రాంతంలో హల్చల్ చేసింది. చెయ్యెత్తినా సిటీ బస్సు ఆపకపోవడంతో ఆగ్రహంతో బీర్ బాటిల్ విసిరేయడమే కాకుండా.. ప్రశ్నించిన లేడీ కండక్టర్‌పై పామును విసిరేసింది. జవహర్‌నగర్ ప్రాంతానికి చెందిన బేగం (50) గురువారం సాయంత్రం విద్యానగర్–ఎన్సీసీ గేటు మధ్య రహదారిపై నిలుచుంది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆమె ఆ ఇరుకైన రోడ్డులోని లక్కీ ఎక్స్ రోడ్ వద్ద సిటీ బస్సుల్ని ఆపే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన ‘107 వీ’సర్వీస్ నెంబర్ కలిగిన బస్సు అక్కడకు రావడంతో ఆపాలంటూ బేగం చెయ్యి ఎత్తింది. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకున్న డ్రైవర్ ఆపకుండా ముందుకు వెళ్లారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన బేగం తన చేతిలో ఉన్న సంచి నుంచి బీర్ బాటిల్ తీసి బస్సు వైపు విసిరింది. దీంతో బస్సు వెనుక అద్దం పగిలిపోయింది. లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును ఆపడంతో కిందికి దిగి వచ్చిన కండక్టర్ స్వప్న బేగంను నిలదీశారు. మద్యం మత్తులో ఉన్న బేగం తన చేతి సంచి నుంచి పామును బయటకు తీసి కండక్టర్‌పై విసిరారు. పాము పక్కకు పడటంతో కండక్టర్‌కు ముప్పు తప్పింది. బేగం అంతటితో ఆగకుండా కండక్టర్‌తో వాగ్వాదానికి దిగింది. ఈలోపు సమాచారం అందుకున్న నల్లకుంట పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పాము కోసం స్నేక్ క్యాచర్ల సాయంతో వెతికినా ఫలితం దక్కలేదు. కండక్టర్ ఫిర్యాదు మేరకు బేగంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బేగంపై బస్సు అద్దాన్ని «ధ్వంసం చేయడం, కండక్టర్‌తో దురుసుగా ప్రవర్తించడం, పాము పట్ల అమానుషంగా ప్రవర్తించడం తదితర ఆరోపణలతో కేసు నమోదైంది. -
ఘోరం: గుండెపోటుతో డ్రైవర్ మృతి.. బస్సు బీభత్సం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. రన్నింగ్ బస్సులో డ్రైవర్ గుండె పోటుతో సీటులోనే కన్నుమూశాడు. ఆపై బస్సు పలు వాహనాలపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. జబల్పూర్లో ఓ సిటీ బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ హఠాత్తుగా గుండెపోటుతో డ్రైవర్ సీటులోనే కన్నుమూశాడు. దీంతో బస్సు అదుపు తప్పి పలు వాహనాలపైకి బస్సు దూసుకెళ్లింది. సిగ్నల్ ప్రాంతం కావడం, బస్సు వేగం తక్కువగా ఉండడం, సిగ్నల్ దగ్గర ఓ ఈ-రిక్షాను ఢీ కొట్టడంతో బస్సు ముందుకెళ్లి ఆగిపోయింది. బస్సు ప్రయాణికులతో పాటు ఈ-రిక్షా బోల్తా పడగా.. అందులోని ఇద్దరు చిన్నారులతో పాటు మొత్తం ఆరు మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. బస్సు ఢీ కొట్టడంతో ఓ పెద్దాయన గాయపడగా.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. డ్రైవర్ హర్దేవ్ పటేల్ గత పదేళ్లుగా సిటీ మెట్రో బస్సు సర్వీసుకు పని చేస్తున్నారు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన స్టీరింగ్‌పైనే కుప్పకూలిపోయాడు. CAUGHT ON CAMERA - A city bus in Madhya Pradesh's Jabalpur ran into several vehicles, killing 2, after its driver died of sudden heart attack. #Jabalpur #MadhyaPradesh #Accident pic.twitter.com/MvOEq3lbHV — TIMES NOW (@TimesNow) December 2, 2022 VIDEO CREDITS: TIMES NOW -
Pramod Kumar: సిటీ బస్ ప్రాణం తీసింది
సాక్షి, బెంగళూరు(యశవంతపుర): బెంగళూరు నగరంలో గుంతల రోడ్లు, బీఎంటీసీ (బెంగళూరు మెట్రో ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్) సర్వీసులు మనుషుల ప్రాణాలను తీసేస్తున్నాయి. తాజాగా ఓ యువకుడిపై బస్సు దూసుకెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు... హాసన్ జిల్లా చెన్నరాయపట్టణకు చెందిన ప్రమోద్ కుమార్ (24) లగ్గేరిలో ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో విధులు ముగించుకుని కామాక్షిపాళ్య రింగ్ రోడ్డు చౌడేశ్వరి నగర హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో వస్తుండగా వాయువేగంతో వస్తున్న బీఎంటీసీ బస్సు బైక్‌ను ఢీకొంది. కిందపడిన ప్రమోద్‌పై దూసుకెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్‌ను హసిమ్ ఆసబ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. యశవంతపుర–బనశంకరిల మధ్య సంచరించే బస్‌లోని ప్రయాణికులు ఘటన జరిగిన సమయంలో డ్రైవర్‌ను చితకబాది పోలీసులకు అప్పగించినట్లు స్థానికులు తెలిపారు. చదవండి: (తుంగా కాలువలో చంద్రశేఖర్ మృతదేహం.. రోదించిన ఎమ్మెల్యే) -
బస్సులో మహిళ హల్చల్.. ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి
సాక్షి, విజయవాడ: నగరంలో ఓ మహిళ హల్చల్ చేసింది. ఆవేశంలో ఊగిపోతూ విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి చేసింది. ఆమె ఓవరాక్షన్‌కు బస్సులో ఉన్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. వివరాల ప్రకారం.. విజయవాడలోని కంట్రోల్ రూమ్ సమీపంలో ఆర్టీసీ బస్సులో ఓ మహిళ హల్చల్ చేసింది. ఆర్టీసీ బస్సు తన బైకును ఢీకొట్టడంతో సదరు మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కోపంలో ఊగిపోతూ బస్సును ఆపింది. అనంతరం, బస్సులో డ్రైవర్‌ను ఎడాపెడా చితకబాదింది. కాగా, ఘటన పోలీసుల దృష్టికి చేరడంతో విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: అబద్దాలకు లిమిట్ లేదా.. 1983లో చంద్రబాబు టీడీపీలో ఉన్నారా?: అంబటి ఫైర్ -
ఆర్టీసీ బస్సులో మహిళలతో కండక్టర్ అసభ్యకర ప్రవర్తన
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల కండక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో రంగంలోకి దిగిన షీ టీమ్స్.. అతడిని అదుపులోకి తీసుకున్నాయి. ఈ ఘటన నాచారం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నగరంలోని సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఓ మహిళా ప్రయాణికురాలితో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సయీద్ అమీన్(40) బస్సులో మహిళా ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. బస్సు టికెట్స్ ఇచ్చే క్రమంలో మహిళా ప్రయాణీకులను తాకరాని చోట తాకుటుండటంతో వారు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఈ క్రమంలో ఓ మహిళా ప్రయాణీకురాలు ధైర్యం చేసి నాచారాం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఈ విషయాన్ని టీ షీమ్స్ దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన షీ టీమ్స్.. బస్సులో నిఘా ఉంచి కండక్టర్ అమీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. ఇలా చేస్తాడని ఎవరు అనుకోరు -
ఇంటి నుంచి నేరుగా ప్రయాణించేలా ... బస్సు టు క్యాబ్
సాక్షి హైదరాబాద్: గ్రేటర్లో ప్రజా రవాణా సదుపాయాలు విరివిగా అందుబాటులో ఉన్నప్పటికీ ‘సీమ్‌లెస్’ జర్నీ ఒక కలగానే మారింది. నగరంలోని ప్రధాన రూట్లలో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. కానీ ప్రయాణికులు తమ ఇంటి నుంచి నేరుగా మెట్రో స్టేషన్‌కు చేరుకొనే సదుపాయం లేదు. వందల కొద్దీ కాలనీలు, బస్తీలు, నగరంలోని అనేక ప్రాంతాలు మెట్రో రైలుకు దూరంగానే ఉన్నాయి. మరోవైపు కాలనీలకు మినీ బస్సులను నడపాలనే ప్రతిపాదన కూడా ఇప్పటికీ అమలుకు నోచలేదు. ఇక హైదరాబాద్ నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకొనే వారికి కూడా లాస్ట్‌మైల్ కనెక్టివిటీ అందుబాటులో లేదు. బస్సు దిగిన ప్రయాణికులు గమ్యం చేరుకొనేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో అన్ని అలైటింగ్ పాయింట్ల వద్ద క్యాబ్ సేవలను ఏర్పాటు చేసి ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందిస్తోంది. ఎదురు చూపులు లేకుండా... ప్రస్తుతం నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి ఓలా, ఉబెర్ క్యాబ్‌లు నడుస్తున్నాయి. రైల్వేస్టేషన్‌కు చేరుకోవడానికి ముందే ప్రయాణికులు క్యాబ్‌లను బుక్ చేసుకోవచ్చు. శంషాబాద్ విమాశ్రయంలోనూ ఈ తరహా క్యాబ్ సదుపాయం ఉంది. అలాగే మహాత్మాగాంధీ, జూబ్లీ,దిల్సుఖ్నగర్, బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్, తదితర బస్స్టేషన్లు, కోఠీ. కాచిగూడ, కూకట్పల్లి, హయత్‌నగర్ వంటి ప్రయాణ ప్రాంగణాల నుంచి క్యాబ్‌ల సేవలను ఏర్పాటు చేయడం వల్ల సిటీ బస్సులు వెళ్లలేని కాలనీలకు ప్రయాణికులు చేరుకోవచ్చు. బస్సు కోసం పడిగాపులు అవసరం లేకుండా లాస్ట్‌మైల్ వరకు ప్రయాణ సదుపాయం లభిస్తుంది. మరోవైపు ఆర్టీసీపైన ప్రజల్లో మరింత విశ్వసనీయత పెరుగుతుంది. ఇందుకనుగుణంగా క్యాబ్‌ల అనుసంధానంపైన దృష్టి సారించినట్లు ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. ‘బస్సు దిగిన వాళ్లు ఆటో, క్యాబ్ వంటి వాహనాల్లో తమకు నచ్చినది ఎంపిక చేసుకొని వెళ్లవచ్చు.కానీ ఆర్టీసీ అలైటింగ్ పాయింట్ల వద్ద క్యాబ్‌లు ఉంటాయనే భరోసా ముఖ్యం. అందుకోసమే ఈ అనుసంధాన ప్రక్రియ..’ అని వివరించారు. అలైటింగ్ పాయింట్ల గుర్తింపు త్వరలోనే నగరంలోని అన్ని ప్రాంతాల్లో అలైటింగ్ పాయింట్లను గుర్తించనున్నారు. ఏయే ప్రాంతాల నుంచి ప్రయాణికులు ఎక్కడికి బయలుదేరుతున్నారనే అంశం ప్రాతిపదికగా వీటి ఎంపిక ఉంటుంది. సిటీ బస్సులు చేరుకోలేని ప్రాంతాలకు క్యాబ్‌లు వెళ్లే విధంగా అలైటింగ్ కేంద్రాలను గుర్తిస్తారు. మరోవైపు ప్రయాణికుల అవసరాలు, డిమాండ్‌కు అనుగుణంగా క్యాబ్‌ల అనుసంధానం ఉంటుంది -
సిటీ బస్సులో సీఎం స్టాలిన్.. కాన్వాయ్ ఆపి మరీ..
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరిపాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతున్నారు. తాజాగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా అనే విషయాన్ని తనే స్వయంగా పరిశీలించడానికి శనివారం అకస్మాత్తుగా కాన్వాయ్ దిగి చెన్నైలోని కన్నగి నగర్ వైపు వెళ్తున్న సిటీ బస్సు ఎక్కారు. ఈ సందర్భంగా సీఎం బస్సులోని ప్రయాణికులతో సంభాషించారు. చదవండి: (స్టాలిన్ సర్కారు సరికొత్త పథకం) తమిళనాడులో అమలవుతున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణం గురించి ఎలా భావిస్తున్నారో స్టాలిన్ ప్రత్యేకంగా మహిళల్ని అడిగి తెలుసుకున్నారు. నగరంలో వివిధ బస్సు సర్వీసుల గురించి ఫిర్యాదులు, అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. బస్సుల్లో ఇంకా ఎటువంటి సౌకర్యాలు అవసరమో అడిగి తెలుసుకున్నారు. కరోనా నిబంధనల్ని పాటిస్తూ ప్రయాణాలు చేయాలని ప్రయాణికులకు సీఎం స్టాలిన్ సూచించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు సీఎంతో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు. చదవండి: (బంగారంతో పెట్టుబడి.. సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం) అసెంబ్లీ ఎన్నికలకు ముందు డీఎంకే 400 పేజీల మేనిఫెస్టోలో సిటీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, ప్రభుత్వ రంగంలోని మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఆరు నెలల నుంచి సంవత్సరానికి పెంచడం, ప్రసూతి సాయంగా రూ.24,000 అందించడం, మహిళలపై నేరాలను విచారించడానికి ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు వంటి పథకాలను మేనిఫెస్టోలో పొందుపరిచింది. -
సిటీ బస్సులో ప్రయాణించిన సీఎం స్టాలిన్
-
సిటీ బస్సులు తిరిగేది ఇక ఈ సమయంలోనే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల సమయాల్లో మార్పులు చేసింది. హైదరాబాద్‌లో సిటీ బస్సులు తిరిగే సమయాన్ని కుదించింది. తెల్లవారుజామున 4 గంటలకే మొదలయ్యే సర్వీసుల సమయాన్ని 6 గంటలకు మార్చింది. తిరిగి రాత్రి 7 గంటలకల్లా చివరి ట్రిప్పు పూర్తయ్యేలా షెడ్యూల్ రూపొందించింది. మొత్తంగా రాత్రి 9 కల్లా బస్సులు డిపోలకు చేరనున్నాయి. కొన్ని సిటీ సర్వీసులు నైట్ హాల్ట్ సర్వీసులుగా నడుస్తుండగా ఇకపై అవి రాత్రి 9 గంటలకల్లా చివరి ట్రిప్పు ముగించేలా సమయాన్ని మారుస్తారు. మరోవైపు జిల్లా, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు యథావిధిగా నడవనున్నాయి. రాత్రి కర్ఫ్యూ మొదలవక ముందే బయలుదేరి.. కర్ఫ్యూ సమయంలో గమ్యం చేరే బస్సులు బస్టాండ్లలో ప్రయాణికులను దింపాక వారు ఇళ్లకు వెళ్లేందుకు ఆటోలు, క్యాబ్‌లు వినియోగించుకోవచ్చు. అయితే ప్రయాణ టికెట్‌ను చూపాల్సి ఉంటుంది. రిజర్వేషన్ ఉంటేనే.. హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఎక్కువగా రాత్రిపూటనే బయలుదేరుతాయి. ఈ సర్వీసులు యథావిధిగా నడుస్తాయి. కర్ఫ్యూ ఉన్నా బస్సుల్లో ప్రయాణించాల్సిన వారు ప్రయాణ టికెట్‌ను చూపించి బస్టాండ్లకు చేరుకోవచ్చు. తగినంత మంది ప్రయాణికులు ఉంటేనే బస్సులు రాత్రి వేళ నడుస్తాయని, లేకుంటే రద్దవుతాయని అధికారులు తెలిపారు. దీనిపై ముందుగా సమాచారం ఇస్తామని, టికెట్ డబ్బులను వాపస్ చేస్తామని పేర్కొన్నారు. యథావిధిగా రైళ్లు: రాత్రి కర్ఫ్యూతో ప్రమేయం లేకుండా రైళ్లు యథావిధిగా నడవనున్నాయి. కర్ఫ్యూ వేళల్లో స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు చెక్‌పోస్టుల వద్ద పోలీసులకు టికెట్లు చూపాలి. స్టేషన్ల వద్ద ప్రీపెయిడ్ ఆటోలు, ట్యాక్సీలకు అనుమతి ఇవ్వాలని రైల్వే అధికారులు పోలీసులను కోరారు. చదవండి: ఈ బస్సు ఎక్కడికీ వెళ్లదు.. ఎందుకంటే పక్కాగా తెలంగాణ అంతటా కర్ఫ్యూ -
ఇక మీరు ఎదురుచూస్తున్న బస్సు రాకపోవచ్చు..
సాక్షి, సిటీబ్యూరో: సిటీ బస్సు కోసం ఎదురు చూస్తున్నారా? మీరు ఎదురుచూస్తున్న బస్సు రాకపోవచ్చు.. ఏదో ఒక ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందే! నిజమే... నష్ట నివారణలో భాగంగా ఆర్టీసీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇక నుంచి ఆదాయానికి అనుగుణంగానే బస్సులు నడుస్తాయి. ఈ మేరకు ఆర్టీసీ భారీ కసరత్తు చేస్తోంది. రూట్ల వారీగా ప్రయాణికుల రద్దీ మేరకే బస్సులు నడిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం బస్సులు తిరుగుతున్న సుమారు 1,150 రూట్లలో రద్దీ ఎక్కువగా ఉండేవి? రద్దీ తక్కువగా ఉండేవి? గుర్తించి నడుపుతారు. ఉదాహరణకు ఉదయం మల్కాజిగిరి నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లేవారు తక్కువగా ఉంటే బస్సు రాదు. అదే సమయంలో సికింద్రాబాద్ నుంచి మల్కాజిగిరికి వెళ్లేవారు ఎక్కువగా ఉంటే బస్సు వస్తుంది. రూట్ల వారీగా ప్రయాణికుల రాకపోకలు, సమయాన్ని అంచనా వేసి బస్సులు నడపనున్నారు. బస్ చార్జీల పెంపు వల్ల కొంత మేరకు ఆదాయం లభించినా, పూర్తిస్థాయిలో నష్టాలను అధిగమించడం సాధ్యం కాకపోవడంతో ఈ తరహా పొదుపును పాటించేందుకు కార్యాచరణ చేపట్టారు. కిలోమీటర్‌కు రూ.16 చొప్పున వస్తున్న నష్టాన్ని బాగా తగ్గించుకోవాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ‘కొన్ని రూట్లలో డీజిల్ ఖర్చులు కూడా రావడం లేదు. పట్టుమని పది మంది కూడా కనిపించరు. అలాంటప్పుడు బస్సు వేయడం ఎందుకు?’ అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇలా ప్రణాళిక... ♦ ఉదయం 5–6గంటల వరకు నగర శివార్ల నుంచి సిటీలోకి వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో నడిచే బస్సులను తగ్గిస్తారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఘట్కేసర్, హయత్‌నగర్, నాగారం, పటాన్చెరు, చెంగిచెర్ల లాంటి శివారు ప్రాంతాల్లోంచి తెల్లవారుజామున బయలుదేరే వారి సంఖ్య తక్కువగా ఉన్నట్లు ఆర్టీసీ అంచనా. ♦ అలాగే మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటల వరకు ప్రయాణికుల రాకపోకలు తగ్గుతాయి. అప్పుడు ట్రిప్పుల సంఖ్యను తగ్గిస్తారు. ♦ రాత్రి 9 తర్వాత కొన్ని రూట్లలో ప్రయాణికులు ఉండడం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు ఉప్పల్ నుంచి మెహిదీపట్నం వెళ్లేవారి కంటే మెహిదీపట్నం నుంచి ఉప్పల్‌కు వెళ్లే వారే ఆ సమయంలో ఎక్కువగా ఉంటారు. ఈ మార్పులకు అనుగుణంగా బస్సులు నడుస్తాయి. ♦ ప్రస్తుతం గ్రేటర్లో 3,550 బస్సులు ప్రతిరోజు 42వేల ట్రిప్పులు తిరుగుతుండగా... సుమారు 10వేల ట్రిప్పుల వరకు తగ్గించుకునేందుకు ఆర్టీసీ ప్రయత్నిస్తోంది. ♦ ఈ మేరకు ఉదయం 4–6గంటల వరకు, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2గంటల వరకు, రాత్రి 9–11 గంటల వరకు నడిచే బస్సులు తగ్గనున్నాయి. ♦ 42,000ప్రతిరోజుట్రిప్పులు ♦ 3,550ప్రస్తుతం నగరంలోనడుస్తున్నబస్సులు ♦ 10,000ఆర్టీసీ తగ్గించుకోవాలనిభావిస్తున్నట్రిప్పులు ప్రైవేట్ దోపిడీకి అవకాశం ఆదాయం వచ్చే మార్గాల్లో బస్సులను ఎక్కువగా నడిపి, ఆదాయం లేని మార్గాల్లో తగ్గించుకోవాలనే ఆర్టీసీ వ్యాపార దృక్పథంతో ప్రయాణికులపై ప్రైవేట్ భారం పడనుంది. ఆటోలు మరింత అడ్డగోలుగా దోచుకుంటాయి. పీక్ అవర్స్ పేరిట అధిక చార్జీలు విధిస్తున్న క్యాబ్‌లు... ఆ చార్జీలను మరింత పెంచనున్నాయి. ఆర్టీసీ బస్సులు ఉంటే చాలు ఏ రాత్రయినా క్షేమంగా ఇంటికి వెళ్లవచ్చుననే భరోసా ఇక ఉండకపోవచ్చు. ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. అక్కడలా.. ఇక్కడిలా బెంగళూర్‌లో కోటి 18లక్షల జనాభా ఉంది. ఇక్కడ సుమారు 6,500 బస్సులు ఉన్నాయి. గ్రేటర్‌లోనూ జనాభా కోటికి చేరింది. కానీ 3,550 బస్సులే ఉన్నాయి. కొత్త బస్సులు కొనే ప్రతిపాదన పక్కన పెట్టి.. ఉన్న బస్సులను, ట్రిప్పులను తగ్గించుకునే చర్యలకు ఆర్టీసీ దిగడం గమనార్హం. -
సాహస ప్రయాణం.. ప్రాణాలతో చెలగాటం
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో నగరంలో సిటీ బస్సుల సర్వీసుల కొరత ఎంత తీవ్రంగా ఉందో ఈ చిత్రాలు అద్దం పడుతున్నాయి. ఉదయం ఎన్నో ప్రయాసలకోర్చి కళాశాలలకు వెళ్లిన విద్యార్థులకు తిరిగి ఇళ్లకు చేరేందుకు సరైన రవాణా సదుపాయం అందుబాటులో ఉండడంలేదు.తిరుగుతున్న అరకొర బస్సుల్లో చోటు దొరక్క విద్యార్థినులు ఫుట్‌బోర్డ్‌పై వేలాడుతూ ప్రయాణం చేస్తుంటే.. విద్యార్థులు బస్సు వెనుక వేలాడుతూప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు.ఈ సంఘటన మంగళవారం సాయంత్రం దిల్సుఖ్నగర్ నుంచి ఎల్బీనగర్ వెళుతున్న బస్సులో కనిపించింది. -
పింక్ టికెట్
‘స్త్రీ సాధికారత’ అనే మాట అర్థమైనట్లే ఉంటుంది కానీ, అర్థమేంటని అడిగితే మాత్రం సరిగ్గా అర్థమయ్యేలా చెప్పలేం. దేన్నైనా సాధించుకునే అధికారం సాధికారత. అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు, సొంతకాళ్లపై నిలబడే హక్కు, నలుగుర్ని పోషించే హక్కు... ఇవన్నీ కలిస్తే సాధికారత. స్త్రీ సాధికారత అంటే స్త్రీకి ఈ హక్కులన్నీ ఉండటం. స్త్రీ సాధికారతకు విద్య ఉండాలి. ఉద్యోగం లేదా ఉపాధి ఉండాలి. ఇవి సాధించడానికి ‘మొబిలిటీ’ ఉండాలి. మొబిలిటీ అంటే కదిలే వెసులుబాటు. ఇంటి నుంచి బయటికి స్వేచ్ఛగా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా వెళ్లొచ్చే సదుపాయం ఉన్నట్లయితే.. అన్ని అర్హతలుండీ కేవలం కదిలే అవకాశాల్లేక గృహిణులుగా మాత్రమే ఉండిపోయిన ఎందరో మహిళలకు ‘మొబిలిటీ’ వస్తుంది. ప్రయాణ ఖర్చులను భరించలేక, ప్రయాణంలో భద్రత లేక ఇంటి చుట్టుపక్కల ఉండే స్కూళ్లు, కాలేజీలతో సరిపెట్టుకునే అవసరం ఉండదు. మంచి స్కూల్లో సీటోస్తే వెళ్లి చేరిపోతారు. మంచి ఆఫీస్‌లో ఆఫర్ వస్తే చాలీచాలని జీతంతో పాత ఉద్యోగాన్నే పట్టుకుని వేళ్లాడే పని ఉండదు. మొబిలిటీలో సాధికారత వచ్చేస్తుంది. లేదా సాధికారతకు దారి పడుతుంది. మంగళవారం నుంచి ఢిల్లీ సిటీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఉచిత ప్రయాణ సౌకర్యం మాత్రమే కాదు, వారి భద్రత కోసం అన్ని బస్సులలో కలిపి సుమారు 13 వేల మంది మార్షల్స్‌ను నియమించారు! ఈ సంఖ్య గతంలో 3,400 మాత్రమే ఉండేది. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ (డీటీసీ) ప్రస్తుతం 3,700 బస్సులను నడుపుతోంది.ప్రైవేటుగా మరో 1800 బస్సులను (క్లస్టర్ బస్సులు) నడుపుతోంది. వీటన్నిటిలోనూ మహిళలకు ఉచిత ప్రయాణమే. సిటీ బస్సెక్కగానే కండక్టరే వచ్చి టికెట్ ఇస్తాడు. డబ్బులు తీసుకోడు. మహిళలకు మాత్రమే ఇచ్చే ఆ టికెట్ లేత గులాబీ రంగులో ఉంటుంది. మహిళలకు ఈ సదుపాయాన్ని కల్పించడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్టోబర్ 29న అన్నాచెల్లెళ్ల పండగైన ‘భాయ్ దూజ్’ (సోదరుని ఆశీస్సులు) రోజును ఎంచుకున్నారు. కేవలం సిటీ బస్సులకే కాకుండా, నోయిడా–ఎన్‌సిఆర్ (నేషనల్ రీజినల్ క్యాపిటల్) సర్వీసులు, విమానాశ్రయానికి, ఇతర ప్రత్యేక స్థలాలకు డీటీసీ నడిపే బస్సులకు కూడా ఈ ఉచితం వర్తిస్తుంది. బస్సు ఎక్కిన మహిళా ప్రయాణికులకు పది రూపాయల టిక్కెట్ ఇస్తారు. ఆ టికెట్‌తో ఆ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆ బస్సు దిగి ఇంకో బస్సు ఎక్కినప్పుడు అందులోనూ పది రూపాయల టిక్కెట్ ఇస్తారు. అలా మహిళలు ఢిల్లీ అంతా ప్రయాణించవచ్చు. -
ఏదీ చార్జీల పట్టిక?
సాక్షి,సిటీబ్యూరో: సిటీ బస్సుల్లో చార్జీల పట్టిక ప్రదర్శించాలని సాక్షాత్తు రవాణాశాఖ మంత్రి ఆదేశాలు బేఖాతరయ్యాయి. గురువారం నగరంలోని ఏ బస్సులోనూ పట్టిక కనిపించకపోగా.. తాత్కాలిక సబ్బంది యథావిధిగా తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఇష్టారాజ్యంగా చార్జీల దోపిడీకి తెగబడ్డారు. బస్‌పాస్‌లను అనుమతించడం లేదు. ఆర్టీసీ నిర్వహణ తీరు అస్తవ్యస్తంగా మారింది. అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రవాణా మంత్రి ప్రకటించారు. ప్రతి బస్సులోనూ స్టేజీ నుంచి స్టేజీ వరకు చార్జీల పట్టికను ప్రదర్శించాలని చెప్పారు. కానీ ఇలాంటి చార్జీల పట్టికలు అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రయాణికులు తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లు అడిగినంత చెల్లించక తప్పడం లేదు. ఇటు సిటీ బస్సుల్లోనూ, అటు దూరప్రాంతాల నుంచి వచ్చే బస్సుల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. గత ఆరు రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. స్కూల్ బస్సులు, టూరిస్టు, కాంట్రాక్ట్ బస్సులకు తాత్కాలిక పర్మిట్లను ఇచ్చారు. మ్యాక్సీ క్యాబ్‌లు, మినీ బస్సులను ప్రజారవాణా వాహనాలుగా వినియోగిస్తున్నారు. వీటితో ఆర్టీసీలోని అద్దె బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. అలాగే తాత్కాలిక ప్రాతిపదికపైన నియమితులైన కండక్టర్లు, డ్రైవర్ల సహాయంతో ఆర్టీసీ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. ఇలా ఆర్టీసీ గ్రేటర్ జోన్లో ప్రతిరోజు సగటున 1000 నుంచి 1100 బస్సులు తిరుగుతున్నాయి. 2000 మంది ప్రైవేట్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌కు అనుగుణంగా బస్సులను నడుపుతున్నారు. కండక్టర్‌కు రోజుకు రూ.1000, డ్రైవర్‌కు రూ.1500 చొప్పున చెల్లిస్తున్నారు. అయినప్పటికీ తాత్కాలిక సిబ్బంది టికెట్ల రూపంలో వసూలు చేసిన నగదును జేబులో వేసుకుంటున్నారు. పైగా తక్కువ దూరానికే అదనపు చార్జీ వసూలు చేస్తూ చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. చార్జీల దోపిడీపై ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల ప్రయాణికులు నేరుగా పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. మరి కొన్నిచోట్ల ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. అధిక చార్జీలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రతి బస్సులో చార్జీల పట్టికను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే అన్ని రకాల బస్‌పాస్‌లను అనుమతించాలని ప్రకటించారు. కానీ ఈ ఆదేశాలు ఎక్కడా అమలుకు నోచుకోలేదు. కనిపించని నియంత్రణ వ్యవస్థ గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 29 డిపోల్లో 19,903 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరంతా డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, శ్రామిక్‌లు, సూపర్వైజర్లు, చీఫ్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ డిపోమేనేజర్ తదితర కేటగిరీల్లో పనిచేస్తున్నారు. కానీ సమ్మె నేపథ్యంలో ప్రస్తుతం 58 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. వీరిలో డిపో మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు, రీజనల్ మేనేజర్లు, షెడ్యూలింగ్ అధికారులు, డిప్యూటీ చీఫ్ పర్సనల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వంటి ఉన్నత, మధ్య శ్రేణి అధికారులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. సాధారణంగా బస్సుల నిర్వహణలో సూపర్వైజర్లు, చీఫ్ ఇన్స్పెక్టర్లు, కంట్రోలర్ వంటి ఉద్యోగులు నిర్వహించే విధులు కీలకమైనవి. అలాగే బస్సుల్లో టిమ్స్ యంత్రాల ద్వారా టిక్కెట్లు ఇవ్వడం వల్ల బస్సులో ప్రయాణం చేసిన వారు, టిక్కెట్‌పై లభించిన ఆదాయం వంటి వివరాలు లభిస్తాయి. కానీ ప్రస్తుతం ఈ యంత్రాంగం ఏదీ లేదు. కేవలం బస్సులను డిపోల్లోంచి బయటకు తీసి రోడ్డెక్కించడమే లక్ష్యంగా అధికారులు పని చేస్తున్నారు. దీంతో ప్రైవేట్ సిబ్బంది దోపిడీని నియంత్రించే వ్యవస్థ కొరవడింది. అలాగే క్షేత్రస్థాయిలో బస్సుల నిర్వహణను పర్యవేక్షించే యంత్రాంగం, నిఘా కూడా లేకపోవడంతో ఏ బస్సులో ఎంత చార్జీ వసూలు చేస్తున్నారనే లెక్కలు లేకుండా పోయాయి. మొదలైన తిరుగు ప్రయాణాలు మరోవైపు దసరా సందర్భంగా సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో రద్దీ నెలకొంటోంది. అలాగే వివిధ జిల్లాల నుంచి నగరానికి వస్తున్న ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లోనూ రద్దీ భారీగానే ఉంటోంది. రైలు దిగిన ప్రయాణికులు సకాలంలో బస్సులు లభించక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. సిటీ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లుగానే ప్రైవేట్ వాహనాల్లోనూ దోపిడీ కొనసాగుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటు ఆర్టీసీ బస్సులు, అటు ప్రైవేట్ వాహనాలు ప్రయాణికులను ఎడాపెడా దోచుకోండం గమనార్హం. ఆర్టీసీకి భారీ నష్టమే.. ప్రైవేట్ సిబ్బంది తీరు వల్ల ప్రయాణికులపైన భారం పడడమే కాకుండా ఆర్టీసీకి సైతం తీవ్ర నష్టం వాటిల్లుతోంది. బస్సులను నడుపుతున్నప్పటికీ రోజుకు రూ.20 లక్షలకు మించి ఆదాయం రావడం లేదు. అందులోనూ చాలా వరకు ప్రైవేట్ సిబ్బంది దినసరి వేతనాల చెల్లింపులకే సరిపోతుంది. ‘కొన్ని రూట్లలో బస్సులకు వినియోగించిన డీజిల్ ఖర్చు కూడా లభించడం లేద’ని ఓ డిపో మేనేజర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
పంజాగుట్ట వద్ద ఆర్టీసీ బస్సులో కాల్పుల కలకలం
-
సిటీ బస్సులో కాల్పులు
సాక్షి, హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధికారిక కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో భద్రతా విధులు నిర్వర్తించే ఓ హెడ్ కానిస్టేబుల్ విచక్షణ కోల్పోయాడు. సిటీ బస్సులో ఫుట్‌బోర్డుపై ప్రయాణించడమే కాకుండా లోపలకు జరగాలంటూ కోరిన సహచర ప్రయాణికుడితో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో అనాలోచితంగా తన సర్వీస్ పిస్టల్‌తో గాల్లోకి కాల్పులు జరిపాడు. రంగంలోకి దిగిన హైదరాబాద్ వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సమాచారం అందించారు. విచక్షణ కోల్పోయి... ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన శ్రీనివాస్ నాయుడు (59) ఆ జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. కొన్నేళ్లుగా డెప్యుటేషన్‌పై ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో (ఏపీ ఐఎస్‌డబ్ల్యూ) విధులు నిర్విర్తిస్తున్నాడు. ఏపీకి చెందిన ప్రముఖులకు, రాజకీయ/కీలక కార్యాలయాలకు ఈ విభాగం భద్రత కల్పిస్తుంటుంది. ఏడాదిగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద విధులు నిర్వర్తిస్తూ కుటుంబంతో కలసి కూకట్‌పల్లిలో ఉంటున్నారు. గురువారం ఉదయం విధులకు హాజరైన శ్రీనివాస్... తన జీతం డబ్బు డ్రా చేసుకోవడానికి 10.30 గంటలకు పంజాగుట్టలో ఉన్న ఆంధ్రా బ్యాంక్‌కు వెళ్లారు. అక్కడ పని ముగించుకొని తిరిగి విధులకు వెళ్లేందుకు పంజాగుట్ట హిమాలయ బుక్‌హౌస్ వద్ద ఉన్న బస్టాప్‌లో కంటోన్మెంట్ డిపోకు చెందిన 47సీ (సికింద్రాబాద్ నుంచి మణికొండ) రూట్ నంబర్ బస్సు ఎక్కారు. అయితే ఆయన బస్సు ఫుట్‌బోర్డుపైనే నిలబడి ఉండటంతో మరో స్టాప్ వద్ద ఓ చానల్ కెమెరామెన్ బస్సు ఎక్కుతూ శ్రీనివాస్‌ను లోపలకు వెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో శ్రీనివాస్ ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయి తన నడుముకు ఉన్న .9 ఎంఎం సర్వీస్ పిస్టల్ తీసి పైకి గురిపెట్టి బెదిరింపు ధోరణిలో ట్రిగ్గర్ నొక్కారు. అప్పటికే ఆ ఆయుధం కాగ్ (తూటా పేలేందుకు సిద్ధమై ఉండటం) అయి ఉండటంతో ట్రిగ్గర్ నొక్కగానే పెద్ద శబ్దం చేస్తూ టాప్‌లో నుంచి దూసుకుపోయింది. అయితే బస్సు టైరు పేలిందేమోనని డ్రైవర్ బస్సును పక్కకు ఆపగా శ్రీనివాస్ వెంటనే బస్సు దిగి పంజాగుట్ట చౌరస్తా వైపు పరిగెత్తారు. బస్సులో వచ్చిన శబ్దంపై సహచర ప్రయాణికుల్ని ఆరా తీయగా ఓ వ్యక్తి కాల్పులు జరిపారని, బస్సు టాప్‌లోంచి తూటా దూసుకుపోయిందని వారు చూపించారు. కాల్పులు జరిపిన వ్యక్తి సఫారీ దుస్తులు వేసుకొని పోలీస్‌లా ఉన్నారని తెలిపారు. దీంతో డ్రైవర్, కండక్టర్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారి సూచనల మేరకు మణికొండ వరకు వెళ్లి ప్రయాణికుల్ని గమ్యస్థానానికి చేర్చి తిరిగి డిపోకు చేరుకున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదైంది. బస్సు పైకప్పులోకి దూసుకెళ్లిన బుల్లెట్, బస్సు దిగి పరిగెడుతున్న శ్రీనివాస్ సీసీ కెమెరాల ద్వారా గుర్తింపు... ఈ ఘటనపై దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన వెస్ట్‌జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు కండక్టర్, డ్రైవర్‌తోపాటు సదరు చానల్ కెమెరామెన్‌ను కూడా విచారించారు. కాల్పులు జరిపింది పోలీసు విభాగానికి చెందిన వ్యక్తిగా అనుమానించారు. హిందూ శ్మసాన వాటిక వద్ద బస్సు దిగిన ఆ వ్యక్తి తిరిగి వెనక్కి వచ్చినట్లు తేలడంతో ఆ మార్గంలోని సీసీ కెమెరాలు పరిశీలించారు. అందులో రికార్డు అయిన అనుమానితుడి ఫీడ్ నుంచి ఫొటోలు సంగ్రహించారు. వాటి ఆధారంగా అతడిని ఏపీ ఐఎస్‌డబ్ల్యూకు చెందిన శ్రీనివాస్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ నుంచి సర్వీస్ పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ డిసెంబర్లో పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఈలోగా ఇలా కేసులో చిక్కుకోవడం గమనార్హం. కాగా, ఈ ఘటనపై ఆరా తీసిన ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకుర్ జనాల మధ్య శ్రీనివాస్ కాల్పులు జరపడం చట్టారీత్యా తీవ్ర నేరంగా అభివర్ణించారు. నిందితుడిపై శాఖాపరంగా, చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
పంజాగుట్టలో ఆర్టీసీ బస్సులో కాల్పులు
పంజగుట్ట : ఆర్టీసీ బస్సులో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. బస్సు దిగిపొమ్మన్నందుకు ఓ వ్యక్తి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగాడు. గన్ తీసి ఫైరింగ్ చేశాడు. బుల్లెట్ బస్సు రూఫ్ టాప్ నుంచి దూసుకుపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా హడలిపోయారు. ప్రయాణికులతో పాటు బస్సు డైవ్రర్ ఆందోళనకు గురయ్యారు. సికింద్రాబాద్ నుంచి ఫిల్మ్ నగర్ వెళ్తున్న 47L బస్సు (AP28Z4468)లో పంజగుట్ట శ్మశాన వాటిక వద్ద గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, డైవ్రర్ బస్సు ఎక్కడా నిలపకుండా వెళ్లినట్టు సమాచారం. కాల్పులు జరిపిన వ్యక్తి సఫారీ డ్రెస్‌లో ఉన్నాడని ప్రయాణికులు తెలిపారు. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు బస్సుతో పాటు కాల్పులు జరిపిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బస్సెక్కాలంటే ఎండలో ఉండాల్సిందే..!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో నిలువ నీడ లేని బస్టాపులు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. ఎప్పుడొస్తుందో తెలియని సిటీ బస్సు కోసం గంటల తరబడి చెమటలు పోస్తూ ఎదురుచూడక తప్పడం లేదు. నగరంలోని అనేక ప్రాంతాల్లో బస్షెల్టర్లు లేవు. ప్రయాణికులు ఎక్కడికక్కడ మండుటెండల్లోనే బస్సుల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. ఒకవైపు మార్చి రెండో వారానికే ఎండలు భగ్గుమంటున్నాయి. మరో రెండు నెలల పాటు నగరం నిప్పుల కొలిమిని తలపించనుంది. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులు సైతం నిప్పుల కొలిమిలో నించొని బస్సుల కోసం ఎదురు చూడక తప్పం లేదు. గ్రేటర్ హైదరాబాద్‌లో 2200 బస్టాపులు ఉంటే కేవలం1000 చోట్ల మాత్రమే షెల్టర్లు ఉన్నాయి. అధునాతన బస్‌షెల్టర్లకు శ్రీకారం చుట్టిన జీహెచ్ఎంసీ ముచ్చటగా మూడు ఏసీ బస్షెల్టర్లతో ముగించేసింది. ఆ షెల్టర్లలోనూ అరకొర ఏసీ సదుపాయమే. దీంతో సగ టు ప్రయాణికుడికి మండుటెండే బస్‌షెల్టర్‌గా మిగిలింది. ముఖ్యంగా నగర శివార్లలోని అనేక ప్రాంతాల్లో వందలాది బస్టాపుల్లో ప్రయాణికులు ఎండల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. పెరుగుతున్న స్టాపులు–తగ్గుతున్న షెల్టర్లు... నగరం విస్తరిస్తున్న కొద్దీ సిటీ బస్సుల రాకపోకలు కూడా విస్తరిస్తున్నాయి. ప్రతి సంవత్సరం వందల కొద్దీ కొత్త కాలనీలు ఏర్పాటవుతున్నాయి.ఇదే క్రమంలో బస్టాపుల సంఖ్య కూడా పెరుగుతుంది. కానీ ఇందుకు తగినవిధంగా షెల్టర్లు మాత్రం అందుబాటులోకి రావడం లేదు. ఒకప్పుడు నగమంతటా కేవలం 1500 బస్టాపులు ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 2200 కు పెరిగింది. పైగా ప్రతి సంవత్సరం బస్టాపులు అదనంగా వచ్చి చేరుతున్నాయి. మరోవైపు ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు మెట్రో రైల్ నిర్మాణ పనుల దృష్ట్యా కొన్ని స్టాపులు ఒక చోట నుంచి మరో చోటుకు మారుతున్నాయి. ఈ క్రమంలో బస్టాపుల సంఖ్యకు అనుగుణంగా షెల్టర్లు మాత్రం పెరగడం లేదు. ఆర్టీసీ లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్‌లో 2200 బస్టాపులు ఉంటే జీహెచ్ఎంసీ లెక్కల్లో మాత్రం 1800 స్టాపులు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం అధికారుల అంచనా ప్రకారం వెయ్యి చోట్ల షెల్టర్లను ఏర్పాటు చేశారు. కానీ వీటిలోనూ మెట్రో పనులు, రోడ్ల నిర్వహణ, తదితర కారణాల దృష్ట్యా బస్షెల్టర్లు మారుతున్నాయి. ప్రజా రవాణా రంగంలో ఇప్పటి వరకు ఆర్టీసీయే అతి పెద్ద సంస్థ. ప్రతి రోజు సుమారు 33 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. సిటీ బస్సులు రోజుకు 9 లక్షల కిలోమీటర్లకు పైగా తిరుగుతున్నాయి. అయితే ప్రయాణికుల అవసరాలు, డిమాండ్‌కు తగిన ప్రాధాన్యత మాత్రం లభించడం లేదు. దీంతో పిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు మండుటెండల్లో మాడిపోతూ ప్రయాణం చేయాల్సి వస్తుంది. సమన్వయ లేమి... మరోవైపు జీహెచ్ఎంసీ, ఆర్టీసీల మధ్య సమన్వయ లేమి వల్ల కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 2005 వరకు బస్షెల్టర్ల నిర్వహణ ఆర్టీసీ పరిధిలో ఉండేది. దీంతో అవసరమైన బస్టాపుల్లో షెల్టర్లను ఏర్పాటు చేయడంతో పాటు, వాటిపైన వాణిజ్య ప్రకటనల ఆదాయం కూడా ఆర్టీసీకి కొంత ఊరటనిచ్చేది. కానీ షెల్టర్ల నిర్వహణ జీహెచ్ఎంసీ పరిధిలోకి మారిన తరువాత ప్రయాణికుల డిమాండ్‌కు, షెల్టర్ల ఏర్పాటుకు మధ్య సమన్వయం లేకుండా పోతోంది. నగరంలోని అన్ని ప్రధానమైన బస్షెల్టర్లలో బస్సుల రాకపోకలపైన రూపొందించిన టైమ్‌టేబుల్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆర్టీసీ గతంలోనే జీహెచ్ఎంసీకి సూచించింది. సుమారు 850 షెల్టర్లను ఎంపిక చేశారు. కానీ జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు 64 షెల్టర్లలో మాత్రమే బస్సుల రాకపోకల సమాచారాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఎప్పుడొస్తుందో తెలియని బస్సు కోసం ప్రయాణికులు నిరీక్షించడం తప్ప మరో గత్యంతరం లేదు. -
సిటీ బస్..మెట్రో రూట్
సాక్షి,సిటీబ్యూరో: మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానున్న ఎల్బీనగర్– అమీర్‌పేట్ మెట్రో రైలుకు అనుగుణంగా సేవలను విస్తరించేందుకు గ్రేటర్ ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఉప్పల్– అమీర్‌పేట్, మియాపూర్– అమీర్‌పేట్ కారిడార్లలో రెండు వైపులా ఉన్న కాలనీలకు సిటీ బస్సులను అనుసంధానం చేసినట్టే.. ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలోని కాలనీలకూ విస్తరించేందుకు కసరత్తు చేపట్టింది. ఈ మార్గంలో సమాంతరంగా తిరిగే బస్సులను ఇకపై కొత్త మార్గాల్లోకి మళ్లించనున్నారు. మరోవైపు ఎల్బీనగర్– అమీర్‌పేట్ మెట్రో ప్రారంభమైతే ఇటు ఎల్బీనగర్ నుంచి నాంపల్లి, లక్డీకాపూల్ మీదుగా అటు ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ మీదుగా రెండు ప్రధాన కారిడార్లలో మియాపూర్‌కు మెట్రో కనెక్టివిటీ పెరగనుంది. దీంతో ఆర్టీసీకి ప్రయాణికుల ఆదరణ తగ్గే అవకాశం ఉంది. మొదటి కారిడార్ వల్ల ఆర్టీసీపై పెద్దగా ప్రభావం కనిపించలేదు. కానీ రెండో కారిడార్ అందుబాటులోకి రావడం ద్వారా అతి పెద్ద రూట్ల మధ్య ‘మెట్రో అనుసంధానం’ పెరుగుతుంది. దీంతో ఆర్టీసీ ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో మెట్రో వైపు వెళ్లే అవకాశముంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మెట్రో సమాంతర మార్గాల స్థానంలో మెట్రోకు అభిముఖంగా ఉండే రూట్లకు సిటీ బస్సుల సేవలను విస్తరించేందుకు ఆర్టీసీ అధికారులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఈ మేరకు తాజాగా ఎల్బీనగర్– అమీర్‌పేట్ కారిడార్‌కు రెండు వైపులా గల కాలనీలపై సర్వే ప్రారంభించారు. మెట్రో రైలు పట్టాలెక్కే నాటికి గ్రేటర్ ఆర్టీసీ రూట్ కోర్సుల్లో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. వంద కాలనీలకు అదనపు సర్వీసులు ప్రస్తుతం హయత్‌నగర్ నుంచి ఎల్బీనగర్ మీదుగా, వనస్థలిపురం ఎన్జీఓస్ కాలనీ నుంచి ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, కోఠి, నాంపల్లి, ఖైరతాబాద్, అమీర్‌పేట్, కూకట్పల్లి, మియాపూర్, బీహెచ్ఈఎల్, లింగంపల్లి మార్గంలో 804 బస్సులు తిరుగుతున్నాయి. ఇవి ప్రతి రోజు సుమారు 7295 ట్రిప్పులు వేస్తున్నాయి. ఇప్పటి దాకా ఆర్టీసీకి అత్యధికంగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గాలు ఇవే. ఈ మార్గాల్లో బస్సుల ఆక్యుపెన్సీ 65 శాతానికి పైగా ఉంది. త్వరలో ఎల్బీనగర్–అమీర్‌పేట్ మెట్రో అందుబాటులోకి వస్తే 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉన్న ఈ రూట్కోర్సుల్లో సమూలమైన మార్పులు చేయనున్నారు. ఎల్బీనగర్ నుంచి అమీర్‌పేట్ మీదుగా మియాపూర్ వరకు బస్సుల సంఖ్యను గణనీయంగా తగ్గించనున్నారు. లింగంపల్లి, బీహెచ్ఈఎల్ మీదుగా వచ్చే బస్సులను మియాపూర్ వరకు పరిమితం చేస్తారు. అలాగే హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం రూట్లలో వచ్చే బస్సులను ఎల్బీనగర్ వరకు పరిమితం చేస్తారు. ఈ కారిడార్‌లో సమాంతరంగా నడిచే బస్సులను పూర్తిగా రద్దు చేయడం కాకుండా ప్రయాణికుల రద్దీ, ఆదరణకు అనుగుణంగా మార్పులు ఉంటాయి. సమాంతర రూట్ బస్సులను కుదించడం వల్ల మెట్రోకు రెండు వైపులా ఉండే సుమారు 100 కాలనీలకు అదనపు సర్వీసులు పెరిగే అవకాశం ఉంది. దీంతో కర్మన్‌ఘాట్, బీఎన్‌రెడ్డినగర్, నందనవనం, ఇబ్రహీంపట్నం, బాలాపూర్, మీర్పేట్, కోహెడ, తదితర ప్రాంతాల్లోని కొత్త కాలనీలకు బస్సులను విస్తరిస్తారు. ఈ రూట్లలోంచి ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్లకు సిటీ బస్సులను కనెక్ట్ చేస్తారు. అలాగే పాతబస్తీలోని వివిధ ప్రాంతాల నుంచి ఇటు దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్‌కు, అటు లక్డీకాపూల్‌కు సిటీ బస్సుల కనెక్టివిటీని పెంచేందుకు కార్యాచరణ చేపట్టారు. దీంతో ఇప్పటికిప్పుడు వంద కాలనీలకు అదనపు సదుపాయం లభిస్తుంది. అలాగే ప్రధాన కారిడార్లకు ప్రత్యామ్నాయంగా కాలనీలకు విస్తరించడం వల్ల ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుందని ఆర్టీసీ భావిస్తోంది. 100 కాలనీలతో ప్రారంభించి మెట్రోకు దూరంగా ఉన్న సుమారు 500 కాలనీలు, శివారు గ్రామాలకు బస్సులను పెంచనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మియాపూర్‌లో పెరిగిన ఆక్యుపెన్సీ.. ఉప్పల్–అమీర్‌పేట్–మియాపూర్ మెట్రో కారిడార్‌లో రెండు వైపులా కాలనీలకు మెట్రో అందుబాటులోకి రావడంతోనే ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టారు. చిలుకానగర్, హేమానగర్, బోడుప్పల్, నాగోల్, బండ్లగూడ, ఘట్కేసర్, నారపల్లి తదితర ప్రాంతాలకు ట్రిప్పులను పెంచారు. అలాగే మియాపూర్ మార్గంలో అపురూపకాలనీ–హైటెక్‌సిటీ, జగద్గిరిగుట్ట–వీబీఐటీ, జేఎన్టీయూ–హైటెక్‌సిటీ, కూకట్పల్లి–హైటెక్‌సిటీ, అమీర్‌పేట్–హైటెక్‌సిటీ తదితర ప్రాంతాలకు 60 బస్సులను అదనంగా ప్రవేశపెట్టారు. దీంతో ఈ రెండు రూట్లలో కాలనీలకు బస్సుల కనెక్టివిటీ పెరిగింది. ఇప్పుడు ఈ బస్సులన్నీ ప్రతి రోజు 70 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ షెడ్యూల్స్ విభాగం ఉన్నతాధికారి శ్రీధర్ తెలిపారు. ‘పెద్ద బస్సులు వెళ్లగలిగే అన్ని ప్రాంతాలకు సిటీ బస్సులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇక చిన్న కాలనీలకు వెళ్లాలంటే పెద్ద బస్సులకు సాధ్యం కాదు. ప్రయాణికుల ఆదరణకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రణాళికలను రూపొందిస్తూనే ఉన్నా’మని తెలిపారు. గ్రేటర్ ఆర్టీసీ ఇలా.. మొత్తం డిపోలు: 29 సిటీలో తిరిగే బస్సులు: 3,560 మొత్తం ట్రిప్పులు: 42 వేలు ప్రయాణికుల సంఖ్య: 33 లక్షలు రూట్లు: 1050 సగటు ఆక్యుపెన్సీ: 65 శాతం -
సిటీ బస్సుల్లో ‘సేఫ్’ జర్నీ!
సాక్షి, సిటీబ్యూరో: బస్సుల రాకపోకలపై ప్రయాణికులకు ఇక నుంచి ప్రత్యక్ష సమాచారం లభించనుంది. నగరంలోని ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోక లపై ‘హైలైట్స్’ మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రయాణికులకు ప్రత్యక్ష సమాచారం అందజేస్తున్న తరహాలోనే బస్సుల రాకపోకలపైన ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేసేందుకు ‘సేఫ్’ (సొసైటీ ఫర్ యాక్సిడెంట్ ఫ్రీ ఎన్విరాన్మెంట్) అనే సంస్థతో ఆర్టీసీ తాజాగా ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ రోడ్లపై నడిచే బస్సుల కదలికలను ఎప్పటికప్పుడు నమోదు (వెహికల్ ట్రాకింగ్) చేయడంతో పాటు, బస్సుల రాకపోకలపైన ప్రయాణికులకు ప్రత్యక్ష సమాచారాన్ని అందజేస్తుంది. ఇందుకోసం అన్ని చోట్ల ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేస్తారు. మొదట ఏసీ బస్షెల్టర్లతో ప్రారంభించి ఆ తరువాత క్రమంగా నగరంలోని అన్ని బస్టాపులకు ఈ ప్రత్యక్ష సమాచార బోర్డులను విస్తరిస్తారు. అలాగే ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో సేఫ్ యాప్ ద్వారా కూడా బస్సుల రాకపోకలపై ప్రత్యక్ష సమాచారాన్ని తెలుసుకోవచ్చు. దీంతో ఇంటి నుంచి బయలుదేరే సమయంలోనే తాను ఎక్కాల్సిన బస్సు ఇంకా ఎంత దూరంలో ఉన్నది, ఏ సమయానికి తాను ఉన్న చోటుకు వస్తుందనే వివరాలు ప్రయాణికుడికి తెలిసిపోతాయి. అలాగే సేఫ్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా లభించే డేటాను ‘టీ–సవారీ’లో అప్డేట్ చేస్తారు. దీంతో ప్రయాణికులకు ఈ యాప్ ద్వారా ఓలా, ఊబర్ తదితర వాహనాలతో పాటు బస్సుల వివరాలు కూడా లభిస్తా యి. మెట్రో రైల్వేస్టేషన్లకు అందుబాటులో ఉన్న బస్సుల వివరాలను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. ఇప్పటికే గ్రేటర్ ఆర్టీసీలో 1200 బస్సులకు వీటీపీఐఎస్ (వెహికల్ ట్రాకింగ్ అండ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) టెక్నాలజీనీ అమలు చేస్తున్నారు. కానీ ఇది మొక్కుబడిగానే అమలవుతోంది. ప్ర యాణికులకు ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు లభించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వెహికల్ ట్రాకింగ్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థను అమలు చేసేందుకు సేఫ్ సంస్థతో ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది. మొదట నగరంలోని అన్ని ఏసీ, మెట్రో లగ్జరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సులకు సేఫ్ వెహికల్ ట్రాకింగ్ వ్యవస్థను అమలు చేసి ఆ వివరాలను ప్రయాణికుల మొబైల్ ఫోన్‌కు, బస్టాపుల్లోని ఎల్ఈడీ బోర్డులకు అనుసంధానం చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని 3650 బస్సులకు ఈ టెక్నాలజీని అమలు చేసిన అనంతరం తెలంగాణలోని 10,093 బస్సులకు దీనిని విస్తరిస్తారు. హైలైట్స్ తరహాలో సమాచారం.... గ్రేటర్లో బస్షెల్టర్ల ఆధునీకరణకు అనుగుణంగా బస్సుల సమాచారం అందుబాటులో లేకపోవడం పెద్ద లోపంగా ఉంది. నగరంలోని 26 ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లు, సికింద్రాబాద్; నాంపల్లి, కాచిగూడ, మల్కాజిగిరి తదితర ప్రధాన స్టేషన్ల ద్వారా ప్రతి రోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రాకపోకలు సాగించే 121 ఎంఎంటీఎస్ సర్వీసుల ప్రత్యక్ష సమాచారాన్ని తెలియజేసేందుకు ‘హైలైట్స్’ దోహదం చేస్తుంది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు తాము ఎదురు చూస్తున్న రైల్వేస్టేషన్‌కు ఎంఎంటీఎస్ ఎంత దూరంలో ఉన్నదీ ప్రత్యక్షంగా తెలిసిపోతుంది. సరిగ్గా ఇలాంటి పరిజ్ఞానం ద్వారానే బస్సుల రాకపోకలను ప్రయాణికులకు అప్డేట్ చేస్తారు. బస్టాపులను జియో ఫెన్సింగ్ చేస్తారు. ప్రధాన కార్యాలయంలోని సర్వర్ రూమ్ నుంచి ఈ మొత్తం వ్యవస్థను నియంత్రిస్తారు. మొదట నగరంలో అమలు చేసిన తరువాత హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–విజయవాడ, మెట్టుపల్లి–కరీంనగర్, హైదరాబాద్–వరంగల్ వంటి ప్రధాన రూట్లకు విస్తరిస్తారు. టి–సవారీతో అనుసంధానం... మరోవైపు ఈ సమాచారాన్ని టి–సవారీతో అనుసంధానం చేయడం వల్ల ప్రయాణికుడికి ఒకే సమ యంలో అన్ని రకాల ప్రజారవాణా వాహనాల సమాచారం అందుబాటులోకి వస్తుంది. తద్వారా వాటిలో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకొని బయలుదేరవచ్చు. ఉదాహరణకు మియాపూర్ నుంచి అమీర్‌పేట్ వరకు మెట్రో రైల్లో వచ్చిన వ్యక్తికి తాను ట్రైన్ దిగే సమయానికి అమీర్‌పేట్‌లో బస్సు, ఓలా, ఊబెర్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బైక్స్ వంటి వాటిలో ఏది అందుబాటులో ఉంటే అందులో బయలుదేరవచ్చు. సేఫ్ సంస్థ నుంచి ఆర్టీసీకి లభించే ఈ సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా ఉచితం. ఇందుకు ప్రతిగా వ్యాపార ప్రకటనలపైన ఆ సంస్థ ఆదాయాన్ని ఆర్జించనుంది. ఒకటి, రెండు నెలల్లో ఈ సరికొత్త సాంకేతిక వ్యవస్థ ఆచరణలోకి రావచ్చునని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
సిటీ బస్సు డ్రైవర్లకు అడ్డు అదుపు లేదు..
సాక్షి, సిటీబ్యూరో: ఒక నిమిషం పాటు ఒక సిటీ బస్సు రోడ్డు మధ్యలో నిలిస్తే ఏమవుతుందో తెలుసా...కనీసం అరకిలోమీటర్ వరకు వాహనాలు నిలిచిపోతాయి. 10 నిమిషాల పాటు ట్రాఫిక్ రద్దీ నెలకొంటుంది. అలాంటిది ఒకేసారి 1000 బస్సులు వేర్వేరు చోట్ల రోడ్డు మధ్యలో నిలిచిపోతే ఎలా ఉంటుంది. కచ్చితంగా మొత్తం అన్నిచోట్లా కలిపితే...500 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించినట్లవుతుంది. విలువైన పనిగంటలు వృథా అవుతాయి. ఉదయాన్నే విధులకు హాజరుకావలసిన సిటీజనులు రోడ్లపైనే పడిగాపులు కాయాల్సి వస్తుంది. సిటీ బస్సుల అడ్డగోలు నిర్వహణ, విచక్షణా రహితమైన డ్రైవింగ్, యథేచ్ఛగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కారణంగా నగరంలో ఉదయం, సాయంత్రం అదే పరిస్థితి నెలకొంటోంది. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రేటర్లో ప్రతి రోజు తిరిగే 3550 బస్సులు ఒకరకమైన ట్రాఫిక్ టెర్రర్ను సృష్టిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా తిరిగే మరో లక్ష ఆటో రిక్షాలు ఈ ట్రాఫిక్ టెర్రర్‌కు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ విషయాలే వెల్లడయ్యాయి. యథేచ్చగా ‘బే’ఖాతరు... నగరంలో సుమారు 2 వేల బస్టాపులు, మరో 500 బస్‌బేలు ఉన్నాయి. ఇవి కాకుండా రెతిఫైల్, దిల్సుఖ్నగర్, సనత్‌నగర్, కోఠి, కాచిగూడ, ఫలక్‌నుమా, తదితర ప్రాంతాల్లో బస్స్టేషన్లు ఉన్నా యి. బస్స్టేషన్లలో నిలిచే బస్సులు మినహాయించి మిగతా వాటిలో 80 శాతం రోడ్లపైనే ఆపేస్తున్నారు. బస్టాపులు, బస్‌బేలకు దూరంగా రోడ్డు మధ్యలో ఆపుతున్న అడ్డదిడ్డంగా నడిపేబస్సులు వల్ల ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోతుంది.వాహనాల రాకపోకలు, ఇరుకు రోడ్ల కారణంగా నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రెతిఫైల్ బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్, గురుద్వారా, తదితర ప్రాంతాల్లో అడ్డగోలుగా తిరిగే బస్సులు ఆ ట్రాఫిక్ రద్దీని మరింత విషవలయంగా మారుస్తున్నాయి. ఉదాహరణకు రెతిఫైల్ వద్ద ‘యు’ టర్న్ తీసుకొనేందుకు అవకాశం లేదు. కానీ బస్సులన్నీ అక్కడే యూటర్న్ తీసుకోవడం వల్ల తీవ్రమైన రద్దీ నెలకొంటోంది. ఉప్పల్ నల్లచెరువు నుంచి ఉప్పల్ క్రాస్ రోడ్డు వరకు రెండు వైపులా ఆరు బస్టాపులు ఉన్నాయి. ఈ బస్టాపుల్లో కాకుండా రోడ్డు మధ్యలో నిలిపివేయడం వల్ల రెండు వైపులా బోడుప్పల్ చౌరస్తా నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు కనీసం 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోతుంది. హబ్సిగూడ, తార్నాక, సికింద్రాబాద్, హిమాయత్‌నగర్, దిల్‌షుఖ్‌నగర్, కోఠీ, ఆబిడ్స్, తదితర అన్ని ప్రాంతాల్లో బస్‌బేలు, బస్టాపులు ఉన్నప్పటికీ రోడ్లపైనే దర్జాగా ఆపేస్తున్నారు. ఎక్కేదెలా దిగేదెలా.... ఏ బస్సు ఎక్కడ ఎప్పుడు ఆగుతుందో తెలియదు.ఎప్పుడు కదులుతుందో తెలియదు. దీంతో ప్రయాణికులు బస్సెక్కాలన్నా, దిగాలన్నా కష్టంగానే ఉంటుంది. బస్టాపులో నించున్న ప్రయాణికులు వాహనాలను దాటుకొని రోడ్డు మధ్యలో ఉన్న బస్సును చేరుకోవాలి. కానీ అప్పటికే ఆ బస్సు ఆగి. ముందుకు కదులుతుంది. బస్సు దగిన వాళ్లు ట్రాఫిక్ మధ్యలోంచి రోడ్డు చివరకు రావడం కూడా దుస్సాధ్యంగా మారింది. మరోవైపు ఒకటెనుక ఒకటి వరుసగా వచ్చే నాలుగైదు బస్సులు ఒకేసారి రోడ్డు మధ్యలోనే ఆగిపోవడం వల్ల వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. బస్టాపులో బస్సు నిలిపి ప్రయాణికులను ఎక్కించుకొనేందుకు అవకాశం ఉన్నప్పటికీ చాలా మంది డ్రైవర్లు ఏ మాత్రం లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా రోడ్లపైనే ఆపేస్తున్నారు.అడ్డగోలు డ్రైవింగ్ కారణంగా ప్రతిరోజు లక్షలాది మంది వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ సంస్థాగతమైన క్రమశిక్షణాచర్యలు తీసుకోవడంలో ఆర్టీసీ ఘోరమైన ఉదాసీనతను ప్రదర్శిస్తోంది. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్య మరింత నరకప్రాయంగా మారింది. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ భయానకంగా మారుతుంది. అమీర్‌పేటలో ఇలా.. కేసులంటే లెక్కలేదు... బస్‌బేల్లో బస్సులు ఆపకపోవడం వల్ల అనేక చోట్ల అవి ఆటోరిక్షాలకు అడ్డాలుగా మారాయి. బస్‌బేల్లో ఆటోలు ఉండడం వల్లనే బస్సులు రోడ్లపైన ఆపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.కానీ బస్సులను సక్రమంగా బస్టాపుల్లో,బస్‌బేల్లో నిలపకపోవడం వల్లనే ఆటోలు పాగా వేస్తున్నాయని పోలీసులు, ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రతి నెలా సగటున 1000 నుంచి 1500 కేసులు నమోదవుతున్నాయి. వీటిలో విచక్షణారహితమైన పార్కింగ్, రోడ్డు మధ్యలో నిలిపే బస్సులే 60 శాతం ఉన్నాయి.35 శాతం సిగ్నల్ జంపింగ్ కేసులు ఉంటే మరో 5 శాతం వరకు సెల్‌ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన కేసులు ఉన్నాయి. ఇవి కేవలం పోలీసులు నమోదు చేసినవి. కానీ పోలీసుల దృష్టిలో పడకుండా ఇష్టారాజ్యంగా నిబంధనలు ఉల్లంఘించే నడిపే డ్రైవర్లు, బస్సులు ప్రతి రోజు వెయ్యికి పైగా ఉంటాయని అంచనా. అమలుకు నోచని క్యూరెయిలింగ్... ముంబయి తరహాలో సిటీ బస్సుల రాకపోకలపైన నియంత్రణ, ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాన్ని కల్పించే లక్ష్యంతో క్యూ రెయిలింగ్‌ల ఏర్పాటు కోసం జరిపిన అధ్యయనం అటకెక్కింది.నగరంలోని కూకట్పల్లి,ఈఎస్ఐ,కేపీహెచ్‌బీ,ఎన్ఎండీసీ,సరోజినీదేవి ఆసుపత్రి,నానల్‌నగర్,బాపూనగర్,లకిడికాఫూల్, నాంపల్లి, గృహకల్ప,లోతుకుంట,బోయిన్పల్లి,తదితర చోట్ల బస్‌బేలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. బస్‌బేల పరిస్థితి ఇది... నగరంలో తిరిగే బస్సులు : 3550 వివిధ మార్గాల్లో ఉన్న బస్టాపులు : 2000 బస్షెల్టర్లు : 1307 ప్రస్తుతం ఉన్న బస్ బేలు : 500 జీహెచ్ఎంసీ ప్రతిపాదించిన బస్‌బేలు :220 క్యూరెయిలింగ్ కోసం ప్రతిపాదించినవి : 14 కొత్తగా కట్టించిన బస్‌బేలు : లేవు -
‘బయో’ బస్సులు భేష్
సాక్షి, సిటీబ్యూరో : నగరంలో ‘బయో’ బస్సులు పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం 19 డిపోల్లో బయోడీజిల్‌ను వినియోగిస్తున్నారు. గ్రేటర్‌లోని 29 డిపోల్లో ఉన్న 3572 బస్సులను సైతం ఈ ఇంధనం పరిధిలోకి తెచ్చేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. పర్యావరణ ప్రమాణాలను కాపాడడం, కాలుష్య కారకాల నియంత్రణ లక్ష్యంతో ఇప్పటికే సీఎన్జీ బస్సులు నడుపుతున్న గ్రేటర్ ఆర్టీసీ....ఆ దిశగా బయో ఇంధనానికి శ్రీకారం చుట్టింది. సాధారణ హైస్పీడ్ డీజిల్‌కు 10 శాతం చొప్పున బయో డీజిల్‌ను వినియోగిస్తున్నారు. దీనివల్ల ఇంధనం పూర్తిగా మండి కాలుష్యకారకాలు తగ్గుతాయి. ప్రతి రోజు 250 కిలోమీటర్ల చొప్పున తిరిగే ఒక బస్సు సాధారణంగా 55 లీటర్ల హైస్పీడ్ డీజిల్‌ను వినియోగిస్తుండగా దానికి 10 శాతం చొప్పున బయోడీజిల్‌ను వినియోగిస్తున్నారు. అంటే 49.5 లీటర్ల హైస్పీడ్ డీజిల్‌కు 5.5 లీటర్ల బయోడీజిల్‌ను వినియోగిస్తున్నారు. ఈ లెక్కన నగరంలో ప్రస్తుతం 23,569 లీటర్ల బయోడీజిల్‌ను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇంధనానికి అయ్యే ఖర్చులో రోజుకు రూ.94,276 చొప్పున ఏటా రూ.3.40 కోట్ల ఇంధన వ్యయం ఆదా అవుతోంది. ప్రయోగాత్మకంగా అమలు... ప్రజారవాణా వాహనాలకు సహజ ఇంధనాలను వినియోగించాలన్న భూరేలాల్ కమిటీ సిఫార్సుల మేరకు ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణకు దిగింది. మేడ్చల్, హకీంపేట్, కంటోన్మెంట్ డిపోలలో సీఎన్జీ బస్సులను ప్రవేశపెట్టింది. దశలవారీగా అన్ని డిపోలను సీఎన్జీ పరిధిలోకి తేవాలని భావించినప్పటికీ డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడంతో 138 బస్సులకే పరిమితమయ్యారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా బయో ఇంధనంపై దృష్టి సారించారు. అప్పట్లో దిల్సుఖ్నగర్–పటాన్చెరు మధ్య కొన్ని ‘బయో’బస్సులను నడిపారు. హైస్పీడ్ డీజిల్‌కు 5 శాతం, 10 శాతం, 20 శాతం చొప్పున మూడు కేటగిరీల్లో బయో ఇంధన వినియోగాన్ని పరీక్షించారు. 20 శాతం వినియోగించిన బస్సుల్లో ఇంజన్‌తో పాటు, కొన్ని విడిభాగాలు పాడైపోయాయి. అలాగే 5 శాతం వినియోగించిన బస్సుల్లో ఇంధనం పూర్తిస్థాయిలో మండకపోవడం వల్ల సల్ఫర్ వంటి హానికారకాలు అలాగే ఉండిì పోయాయి. 10 శాతం బయోడీజిల్ వినియోగించిన బస్సుల్లో ఇంధనం పూర్తిగా మండిపోయి సల్ఫర్ వంటి కాలుష్యకారకాలను నియంత్రించగలిగినట్లు ఆర్టీసీ ఇంజనీరింగ్ నిపుణులు అంచనాకు వచ్చారు. పైగా బయోడీజిల్‌లో ఇమిడి ఉండే 11 శాతం ఆక్సీజన్ కాలుష్యకారకాలను పూర్తిగా మండించేందుకు దోహదం చేస్తున్నట్లు గుర్తించారు. అప్పట్లో సదరన్ బయో డీజిల్ సంస్థతో ధరల విషయంలో ఒక అంగీకారం కుదకరపోవడంతో సరఫరా నిలిచిపోయింది. తిరిగి 2016 నుంచి వినియోగిస్తున్నారు. బయోడీజిల్ వినియోగం వల్ల వాతావరణ కాలుష్యానికి కళ్లెం పడడమే కాకుండా ఆర్టీసీకి డీజిల్ ఖర్చు బాగా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో బయో డీజిల్ వినియోగం చేపట్టాలి. ఇదీ లెక్క ... ఆర్టీసీలో మొత్తం బస్సులు : 35720 బయోడీజిల్ బస్సులు : ప్రస్తుతం 2550 సీఎన్జీ బస్సులు : 138 ఒక లీటర్ హైస్పీడ్ డీజిల్ పైన దూరం: 4.5 కిలోమీటర్లు బయోడీజిల్ వల్ల : 4.7 కిలోమీటర్లు సీఎన్జీ వల్ల : 5 కిలోమీటర్లు గ్రేటర్ హైదరాబాద్‌లో సిటీ బస్సులు ప్రతి రోజు 10.09 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. ప్రతిరోజు 42,275 ట్రిప్పులలో 33 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. -
చార్జింగ్ లేదని దించేశారు..
సూరారం: ఎక్కడైనా బస్సు మొరాయిస్తే ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి పంపిస్తారు. కానీ టికెట్లు జారీ చేసే (ఈ–పోస్) మెషిన్ చార్జింగ్ అయిపోయిందనే సాకుతో కుత్బుల్లాపూర్ పరిధిలోని హెచ్ఎంటీ రోడ్డులో ప్రయాణికులను బస్సులోంచి దించేశారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో అటువైపు బస్సులు రాకపోవడంతో చాలాసేపు ఎదురుచూసి ఇతర బస్సుల్లో ప్రయాణించారు. కండాక్టర్ ముందుగానే మెషిన్‌ను చెక్ చేసుకొని ఉండాల్సిందిగా ప్రయాణికులు పేర్కొన్నారు. -
స్టేషన్ ఎదుట ప్రేమికుడి ఆత్మహత్యాయత్నం
చిట్టినగర్(విజయవాడపశ్చిమం): ప్రేమించిన యువతిని తనకు కాకుండా చేస్తున్నారంటూ ఓ యవకుడు గురువారం కొత్తపేట పోలీస్‌స్టేషన్ ఎదుట బస్సు కింద పడేందుకు ప్రయత్నించాడు. ఆ యువకుడిని వారించేందుకు పోలీసులు, కుటుంబీకులు తీవ్రంగా ప్రయత్నించారు. సేకరించిన వివరాల ప్రకారం... ఇస్లాంపేటకు చెందిన అనస్ అదే వీధిలో ఉంటు న్న యువతిని ప్రేమించాడు. రెండు రోజుల కిందట ఇద్దరు ఇంటి నుంచి పరారై పెళ్లి చేసుకుని తమ పెద్దల నుంచి రక్షణ కావాలంటూ సీపీని ఆశ్రయించారు. సీపీ కార్యాలయం నుంచి కొత్తపేట పోలీ స్‌స్టేషన్‌కు చేరింది. యువతి ప దో తరగతి మార్కుల జాబితా తీసుకురావాలని పోలీసులు పేర్కొన్నారు. గురువారం ఉదయానికి అమ్మాయి ప్రేమించిన అబ్బాయితో వెళ్లేందుకు ససేమిరా అనడంతో యువకుడు పోలీస్‌స్టేషన్ బయటకు వచ్చి అటుగా వెళుతున్న సిటీ బస్సు చక్రాల కింద తలపెట్టేందుకు ప్రయత్నించాడు. పోలీసులు, అక్క డే ఉన్న మరి కొంతమంది యువకుడిని అడ్డుకున్నారు. కేటీ రోడ్డుపై పెద్దఎత్తున ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. -
బెంగళూరులో కిరాతకం
బొమ్మనహళ్లి (బెంగళూరు): బెంగళూరు సిటీ బస్సులో ప్రయాణిస్తున్న వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన ఓ వ్యక్తిని ముగ్గురు దుండగులు ప్రయాణికుల ముందే కత్తులతో నరికి చంపారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు బస్సు దిగి పరుగులు తీశారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోనప్పన అగ్రహారలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ప్రొద్దుటూరుకు చెందిన సురేష్ (30) బుధవారం ఉదయం నగర సమీపంలోని ఆనేకల్ పట్టణం నుంచి బెంగళూరుకు వస్తున్న సిటీ బస్సులో ఎక్కాడు. మార్గమధ్యంలో దుండగులు బస్సును మరో వాహనంతో చేజింగ్ చేస్తూ వచ్చి కోనప్పన అగ్రహార సమీపంలో సిటీ బస్సులోకి ఎక్కారు. బస్సులో సుమారు 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నా లెక్క చేయకుండా దుండగులు కత్తులు, కొడవళ్లతో సురేష్‌ను నరికారు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత బస్సు నుంచి పరారీ అయ్యారు. బస్సులో కలకలం రేగడంతో డ్రైవర్ బస్సును నిలిపాడు. ఈ రక్తపాతంతో ప్రయాణికులు కేకలు వేసుకుంటూ తలోదిక్కు పరుగులు పెట్టారు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ప్రయాణికులతో కిటకిటలాడుతున్న రైళ్లు,బస్సులు
-
సిటీ బస్సుల్లో ‘చిల్లర’ సమస్యకు చెక్!
సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. టికెట్ల ధరలను రూ.5, రూ.10 డినామి నేషన్లలోనే ఉండేలా సవరించింది. దీంతో ఇక రూపాయి, రెండు రూపాయల చిల్లర సమస్య దాదాపుగా తీరిపోనుంది. ఇదే సమయంలో పలు స్టాపుల మధ్య చార్జీల్లో మార్పులు జరగను న్నాయి. ఇప్పటివరకు రూ.7గా వున్న కనీస టికెట్ ధర రూ.5కు తగ్గనుంది. దీంతోపాటు రూ.8, 11, 13, 17, 22, 28 వంటి చార్జీలను ఆయా ధరలకు (రూ.5, రూ.10, రూ.15, రూ.20, రూ.25, రూ.30గా) మార్చారు. హైదరాబాద్, వరంగల్ల లోని సిటీ బస్సులకు ఇది వర్తిస్తుంది. అయితే బస్సు పాసుల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. సంక్రాంతి రోజు (సోమవారం) నుంచే ఈ సవరించిన చార్జీలు అమల్లోకి వస్తాయని ఆర్టీసీ ఎండీ రమణారావు వెల్లడించారు. చిల్లర లేక గొడవలు.. 2016 జూన్‌లో ఆర్టీసీ టికెట్ ధరలను సవరిం చింది. దీంతో సిటీ ఆర్డినరీ బస్సుల్లో కనిష్ట టికెట్ ధర రూ.7 గా మారింది. స్టేజీల సంఖ్య పెరిగే కొద్దీ రూ.8, 9, 11, 13, 16, 17, 18, 19... 28 వరకు వివిధ ధరలు నిర్ణయించారు. మెట్రో బస్సుల్లో రూ.8 నుంచి రూ.31 వరకు, మెట్రో డీలక్స్లలో రూ.9 నుంచి రూ.32 వరకు నిర్ధారిం చారు. అయితే టికెట్ ధరల కారణంగా చిల్లర సమస్య ఉత్పన్నమైంది. ప్రయా ణికులు సరిపడా చిల్లర ఇవ్వక పోవడం, కండక్టర్ల వద్ద చిల్లర సరిపోకపోవడంతో.. ఇద్దరు ముగ్గురు ప్రయాణికులకు కలిపి నోట్లు ఇచ్చి చిల్లరగా మార్చు కొమ్మని చెప్పాల్సి వచ్చింది. దీని కారణంగా ప్రయాణికులు, కండక్టర్ల మధ్య వాగ్వా దాలు, ఘర్షణలు కూడా జరిగాయి. ఆర్టీసీ అధికారులకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో టికెట్ ధరలను హేతుబద్ధీకరించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఇవీ చార్జీల్లో మార్పులు - సిటీ ఆర్డినరీ బస్సుల్లో.. కనీస టికెట్ ధర రూ.7 నుంచి రూ.5కు తగ్గింది. రూ.8 నుంచి రూ.11 టికెట్ ధరలు రూ.10గా.. రూ.13 నుంచి రూ.17 ధరలు రూ.15గా.. రూ.18 నుంచి రూ.22 వరకు ధరలు రూ.20గా.. రూ.23 నుంచి రూ.27 వరకున్న ధరలు రూ.25గా.. రూ.28 టికెట్ రూ.30గా మారింది. - మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో.. రూ.8 నుంచి రూ.12 వరకున్న టికెట్ ధరలను రూ.10కి మార్చారు. రూ.13 నుంచి రూ.17 వరకు ధరలు రూ.15గా.. రూ.18 నుంచి రూ.22 వరకు చార్జీలు రూ.20గా.. రూ.23 నుంచి రూ.27 వరకు ధర రూ.25గా.. రూ.29 నుంచి రూ.31 వరకు చార్జీలు రూ.30గా మారా యి. - మెట్రో డీలక్స్ బస్సుల్లో.. రూ.9, రూ.11 టికెట్ ధరలు రూ.10గా మార్చారు. రూ.13 నుంచి రూ.17 ధరలు రూ.15గా.. రూ.18 నుంచి రూ.22 వరకు ధర రూ.20గా.. రూ.23 నుంచి రూ.26 వరకు చార్జీలు రూ.25గా.. రూ.28 నుంచి రూ.32 వరకున్న ధరలు రూ.30గా మారాయి. - ఇక చిన్న పిల్లల టికెట్ ధరను సాధారణ టికెట్ ధరలో సగంగా నిర్ధారించారు. అయితే ఇందు లోనూ చిల్లర సమస్య రాకుండా సమీపంలోని రౌండ్ ఫిగర్ ధరకు (రూ.5, 10, 15.. ఇలా) మార్చుతున్నారు. ఉదాహరణకు పెద్దవారి టికెట్ రూ.25 ఉంటే చిన్నపిల్లల టికెట్ రూ.15గా ఉంటుంది. -
సిటీ బస్.. ఇక స్మార్ట్
సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సు ఇక స్మార్ట్‌గా మారనుంది. ఏ బస్సు ఎక్కడ ఉందో, ఎంత సేపట్లో బస్టాపునకు చేరుకుంటుందో తెలిపే సాంకేతిక పరిజ్ఞానం మన అరచేతుల్లో నిక్షిప్తం కానుంది. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన వెహికల్ ట్రాకింగ్ అండ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(వీటీపీఐఎస్)తో సిటీ బస్సులను అనుసంధానించనున్నారు. బస్సుల రాకపోకల్లో వేగాన్ని, నాణ్యతను, పారదర్శకతను పెంచేం దుకు అనుగుణంగా రూపొందించిన ఈ పరిజ్ఞానాన్ని ఫ్రాన్స్ మనకు అందజేయనుంది. ఈ మేరకు శనివారం బస్‌భవన్‌లో ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండర్ నేతృత్వంలోని ప్రతి నిధుల బృందంతో రవాణా శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ, ఆర్టీసీ ఎండీ రమణారావు ఫ్రాన్స్ బృందంతో సంప్రదింపులు జరిపారు. పూర్తిగా ఫ్రాన్స్ ఆర్థిక సాయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును వచ్చే 9 నెలల్లో 2 రూట్లలో మూడు దఫాలుగా ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు. ఈ ఫలితాలను బట్టి అన్ని రూట్లకు, అన్ని బస్సులకు జీపీఎస్ ఆధారిత వెహికల్ ట్రాకింగ్ వ్యవస్థను అనుసంధానం చేస్తారు. వీటీపీఐఎస్‌ను సమర్థంగా అమలు చేసేందుకు ప్రతి బస్సు ట్రాకింగ్‌ను ప్రయాణికులకు అందుబాటులో ఉంచేందుకు ఒక ప్రత్యేక మొబైల్ యాప్‌ను కూడా రూపొందించనున్నారు. ఈ యాప్ ద్వారా బస్సు జాడ తెలుసుకున్న ప్రయాణికులు తమ రాకపోకల్లో అంతరాయాలను అధిగమించేందుకు అవకాశం లభించనుంది. రెండు మార్గాల్లో ప్రయోగాత్మకం.. ఫ్రాన్స్‌కు చెందిన లుమిప్లాన్, ఇక్సి అనే సంస్థలు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని ప్రజారవాణా వ్యవస్థ మొత్తాన్ని ఈ వీటీపీఐఎస్ వ్యవస్థతో అనుసంధానం చేశారు. పారిస్‌లో తిరిగే రైళ్లు, బస్సులను ఈ పరిజ్ఞానంతో అనుసంధానించారు. ఈ సంస్థల సహకారంతోనే హైదరాబాద్‌లో వీటీపీఐఎస్ అమలు చేస్తారు. లుమి ప్లాన్, ఇక్సి సంస్థల ప్రతినిధులు గత నెలలోనే రెండు రూట్లను ఎంపిక చేశారు. సికింద్రాబాద్ నుంచి వారాసిగూడ మీదుగా కోఠీ వరకు రాకపోకలు సాగించే 86 రూట్లో 17 బస్సులు, సికింద్రాబాద్ నుంచి అశోక్‌నగర్ మీదుగా నడిచే 40వ రూట్లో 22 బస్సులకు వచ్చే నెల నుంచి జీపీఎస్ ఆధారిత వీటీపీఐఎస్‌ను అమలు చేయనున్నారు. ఈ 2 మార్గాల్లోని బస్టాపులను జియోఫెన్సింగ్ చేశారు. రూట్ మ్యాప్‌లను సేకరించారు. టికెట్ ఇష్యూ మిషన్స్(టీమ్స్) సహాయంతో ట్రిప్పులు, సమయపాలన వివరాలు సేకరించారు. త్వరలో కొత్త టెక్నాలజీని అమలు చేయనున్నారు. బస్‌భవన్‌లో కేంద్రీకృత వ్యవస్థ.. ఈ సాంకేతిక పరిజ్ఞానం అమలు కోసం ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లో తాజాగా ఒక కేంద్రీకృత వ్యవస్థను, సోలార్ పవర్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీంతో ఏ బస్సు ఎక్కడ ఉందో బస్‌భవన్ నుంచే పర్యవేక్షించే అవకాశం లభిస్తుంది. ఈ పైలట్ ప్రాజెక్టు దశలో 4 సోలార్ పవర్ డిస్ప్లేలను కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే ఎంపిక చేసిన రెండు రూట్లలోని అన్ని బస్సులకు ఎలక్ట్రానిక్ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేస్తారు. ప్రజారవాణా బలోపేతం: మహేందర్‌రెడ్డి ఫ్రాన్స్ అధికారులతో ఒప్పందంపై మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ నుంచి ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా పూర్తిగా ఫ్రాన్స్ ఆర్థిక, సాంకేతిక సహాయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు వల్ల నగరంలో ప్రజారవాణా వ్యవస్థ బలపడుతుందన్నారు. ఏ బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునే అవకాశం లభించడం వల్ల ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎదురుచూపులు లేకుండా పయనిస్తారన్నారు. టీఎస్ఆర్టీసీ ఇంటలెక్చువల్ ఐటీ సొల్యూషన్స్ కింద ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండర్ మాట్లాడుతూ.. రవాణా రంగంలో సమయం ఎంతో విలువైందని, ఈ విధానం అమలుతో ప్రయాణికులకు సకాలంలో ఆర్టీసీ సేవలు లభిస్తాయని చెప్పారు. ఆర్టీసీ సేవల విస్తరణ, కచ్చితమైన సమాచారం కోసం ఈ ప్రాజెక్టును ఎంపిక చేసినట్లు చైర్మెన్ సత్యనారాయణ తెలిపారు. సోలార్ డిస్ప్లే బోర్డుల వల్ల ప్రయాణికులను ఎప్పటికప్పుడు బస్సుల సమాచారం లభిస్తుందని ఎండీ రమణారావు తెలిపారు. ఈ సందర్భంగా బస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన సోలార్ ఆధారిత ఎలక్ట్రానిక్ డిస్ప్లే పనితీరును అధికారులు పరిశీలించారు. -
అర్ధరాత్రి వరకూ సిటీ బస్సులు
సాక్షి, హైదరాబాద్: కృష్ణ స్నేహితుడు శ్రావణ్ బెంగుళూరు వెళ్తుంటే తోడుగా ఎంజీబీఎస్‌కు వెళ్లాడు. బస్ రాత్రి 11 గంటలకు స్నేహితుడు బస్ ఎక్కి వెళ్లిపోయాడు. ఇంక కొండాపూర్‌లోని తన రూమ్‌కు వెళ్లడానకి బస్సు కోసం చూస్తే సిటీబస్సు లేదు. షేర్ ఆటోలో వెళ్దాం అంటే రాత్రి కావడంతో ఎంత అడిగితే అంత ఇవ్వాలి. లేకపోతే ఇంటికి వెళ్లలేం. ఇలాంటి సన్నివేశాలకు ఇకపై కాలం చెల్లనుంది. భాగ్యనగరంలో దూర ప్రాంతాలలో ఉండే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాత్రి పొద్దు పోయాక కూడా సిటీబస్సులను నడిపించేందుకు గ్రేటర్ హైదరాబాద్ జోన్ నిర్ణయించింది. ప్రతి రోజు రాత్రి 9 గంటల తర్వాత బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు గుర్తించారు. వారికి అండగా ఉండాలని ఆర్టీసీ నిర్ణయించింది. ట్రాఫిక్ సర్వే ఆధారంగా హయత్‌నగర్, ఎన్జీవో కాలనీ, ఈసీఐఎల్ ఎక్స్ రోడ్స్, కుషాయిగూడ, కాళీమందిర్, జీడిమెట్ల, సీబీఎస్, కోఠి, కొండాపూర్, సికింద్రాబాద్, మియాపూర్, లింగంపల్లి, పటాన్చెరు, బోరబండ, సుచిత్ర, మెహిదీపట్నం, తాళ్లగడ్డ, బడంగ్పేట్, ఉప్పల్ ప్రాంతాల ప్రజలకు కోసం పొద్దుపోయాక బస్సులు అవసరమని గుర్తించారు. ఈ ప్రాంతాలకు అర్థరాత్రి వరకు బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
సిటీబస్సులో స్మార్ట్ పాసింజర్
మూగజీవులు ఏంచేసినా భలే వింతగా అనిపిస్తుంది. మాట్లాడినా, ఆటలాడినా వావ్ అనిపిస్తుంది. సెల్ఫీలకు పోజులు, ఫన్నీ ఎక్స్ప్రెషన్స్, వెరైటీ ఎక్సర్సైజ్లు చేస్తూ కొన్ని పెంపుడు జంతువులు, పెంపుడు పక్షులు... మన దృష్టిని ఆకర్షిస్తుంటాయి. సోషల్ మీడియా సాక్షిగా హగ్గులు, హాయ్‌లు చెప్పే జంతువులను కూడా చూసి ముచ్చటపడ్డాం. అయితే ఈ పిల్లి మరింత ప్రత్యేకం!! రద్దీ ప్రాంతమైన ఓ సిటీ బస్సులో ఒంటరిగా ప్రయాణం చేస్తూ.. తోటి ప్రయాణికులను ఆశ్చర్యపరుస్తోంది. దాని తెలివితో ఇట్టే ఆకట్టుకుంటుంది. టోక్యోలోని కిట్టీ అనే ఓ పిల్లి... సిబు ఇక్బుకురో లైన్ ప్రాంతంలో ఎక్కి తరచూ ప్రయాణం చేస్తోంది. ఇంచుమించు 2013 నుంచి ఈ పిల్లి... బస్సులో ప్రయాణిస్తూ.. తోటి ప్రయాణికులను నోటిమీద వేలు వేసుకునేలా చేస్తోంది. నిజానికి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి గూగుల్ మ్యాప్‌లను ఫాలో అయ్యే మనుషుల మధ్య ఒక పిల్లి ఇలా ఎవరి సాయం లేకుండా ప్రయాణం చేస్తుంటే వింతే కదా మరి!! -
ప్రాణ స్నేహితులను చిదిమిన సిటీ బస్సు
పట్నంబజారు (గుంటూరు): నిత్యం సరదా కబుర్లు..తియ్యని పలకరింపులు..భేషజాలు లేని బంధం వారి స్నేహం.. కళాశాలకు వెళ్లి వస్తే..రూమంతా అల్లరే...అల్లరి..అయితే ఒక్క సారిగా..కటిక చేదు మాట..ఆ స్నేహితుల మనస్సులను కలచి వేసింది...ఉదయం 6.30 నిమిషాలు...అరే ఇప్పుడే వస్తానని...చెప్పి వెళ్లిన స్నేహితుడు..కేవలం గంట వ్యవధిలో..రూంలో ఉన్న విద్యార్థులకు మరో స్నేహితుడి ఫోన్...అరే మనవాళ్లకు యాక్సిడెంట్ అయిందని..ఇప్పుడే వస్తానన్న స్నేహితుడు ఇక రాడని తెలిసి..ఆ స్నేహితుల కంటనీరు ఆగలేదు. తల్లితండ్రులు వారి బిడ్డలను చూసేందుకు వచ్చే వరకు...అన్ని పనులు వదిలిపెట్టి..పెద్దల్లా నిలిచారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు..ప్రమాదంలో ఒక్కగానొక్కడు..చనిపోయాడని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపించారు. స్నేహానికి మరో పేరు మేమన్నట్లు కలిసి తిరుగుతున్న ఈ ప్రాణస్నేహితులు ఇద్దరిని చూసి విధికి కన్నుకుట్టింది.. చక్కటి స్నేహాన్ని సిటీ బస్సు చక్రాల కింద నుజ్జునుజ్జు చేసింది..కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డకు చెందిన వడ్ల శ్రీనివాస చక్రవర్తి ఆచారి (చక్రి)(19), శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన బీన ప్రణీత్(19) ఇంటర్మీడియట్ గుంటూరులో చదువుతున్నారు. మొదటి నుంచి మంచి స్నేహితులు. ఏదీ చేసినా..కలిసి చేసేవాళ్లని సాటి స్నేహితులు చెబుతున్నారు. ఇద్దరూ..వారసులే..... మృత్యువాత పడ్డ చక్రి, ప్రణీత్‌లు ఇద్దరూ...ఆ ఇంటికి ఒక్కరే మగబిడ్డలు. వారసులను కోల్పోయని తెలుసుకున్న కన్నపేగు..సొమ్మసిల్లిపోయింది. చక్రి తండ్రి సుబ్రమణ్యఆచారి ఆళ్ళగడ్డలో బొమ్మలు చెక్కే శిల్పి. మధ్య తరగతి కుటుంబం అయినా...బిడ్డను బాగా చదివించాలనుకున్నారు. చేతికి అందివస్తాడనుకున్న కుమారుడు బస్సు చక్రాల కింద పడి మృత్యుఒడిలోకి వెళ్లటాన్ని ఆ కుటుబం జీర్ణించుకోలేకపోతోంది. ఒక్కాగానొక్కడు..మాత్రమే ఆ కుటుంబాలకు కావటంతో భరించలేని బాధతో కన్నీరుమున్నీరు అవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన ప్రణీత్ కూడా ఇంటికి ఒక్కడే మగబిడ్డ. తండ్రి రాంబాబు (రాము) బజాజ్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. తల్లి భారతి ఇంట్లోనే ఉంటారు. రెండు కుటుంబాలు వారు గుండెలవిసేలా రోదిస్తున్నారు. -
రాజమహేంద్రవరంలో సిటీ బస్సులు రయ్ రయ్..
జెండా ఊపిన డిప్యూటీ సీఎం రాజప్ప ప్రారంభమైన 10 సర్వీసులు రాజమహేంద్రవరం రూరల్ : ఎన్నాళ్లుగానో రాజమహేంద్రవరం, పరిసర గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్న సిటీబస్సులను ఆర్టీసీ ఎట్టకేలకు ఆదివారం ప్రారంభించింది. శాటిలైట్ సిటీ గ్రామం నుంచి క్వారీ మార్కెట్‌కు, గోకవరం బస్టాండ్ నుంచి కడియం వరకూ నడపనున్న సిటీబస్సులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ బస్సులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, సురక్షిత ప్రయాణం చేయాలని అన్నారు. ఈ బస్సులను ప్రజలు ఆదరించకపోతే ఆర్టీసీకి నష్టాలు వస్తాయని, అందరూ కలసికట్టుగా సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఎంపీ మాగంటి మురళీమోహ¯ŒS మాట్లాడుతూ, ప్రస్తుతం 10 సిటీబస్సులు నడుపుతున్నారని, నష్టం రాకుండా ఉంటే, డిసెంబర్‌నాటికి వీటిని 50కి పెంచుతామని చెప్పారు. సిటీబస్సు షెల్టర్లు ఏర్పాటు చేసి, బస్సు వేళలను తెలియజేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ, కిక్కిరిసిన ఆటోలవల్ల జరుగుతున్న ప్రమాదాలను గుర్తించి, సిటీబస్సులు ఏర్పాటు చేశామన్నారు. వీటివల్ల ఆటో కార్మికుల ఉపాధికి ఎటువంటి ఇబ్బందీ ఉండదన్నారు. ఆర్టీసీ బస్ షెల్టర్లవద్ద ఆటోలు నిలపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆర్టీసీ ఎండీ డాక్టర్ ఎం.మాలకొండయ్య మాట్లాడుతూ, బస్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా 1600 బస్సులు, మరో 700 అద్దెబస్సులు వస్తున్నాయని తెలిపారు. అనంతరం రూరల్ మండలంలో కొత్తగా మంజూరైన పింఛన్లను రాజప్ప చేతులమీదుగా అందజేశారు. కార్యక్రమంలో నగర మేయర్ పంతం రజనీ శేషసాయి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, సబ్‌కలెక్టర్ విజయ కృష్ణన్, అర్బ¯ŒS జిల్లా ఎస్పీ రాజకుమారి, ఆర్టీసీ ఆర్ఎం సి.రవికుమార్, డిపో మేనేజర్ పెద్దిరాజు, ఎంపీడీవో రమణారెడ్డి, తహసీల్దార్ జి.భీమారావు తదితరులు పాల్గొన్నారు. -
రూటే.. సెపరేటు..
సిటీబస్సుల తీరు ఇష్టారాజ్యం బస్‌బేలను కాదని రోడ్డుపైనే నిలిపేస్తున్న వైనం అమలుకు నోచని క్యూ రెయిలింగ్ సిటీబ్యూరో: నగర ప్రజల ప్రయాణానికి అనువుగా వేలాది సిటీబస్సులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఏ బస్సు ఎక్కడ ఎప్పుడు ఆగుతుందో తెలియదు. ఎప్పుడు కదులుతుందో తెలియదు. ఒకదాని వెనుక ఒకటి ఒకేసారి నాలుగైదు వస్తాయి.. రోడ్డు మధ్యలోనే ఆగుతాయి.. వెనుక వచ్చే వేలాది వాహనాలకు బ్రేకులు వేస్తాయి. నగరంలో ఇలాంటి సంఘటనలు నిత్యం ప్రతి ఒక్కరికీ అనుభవమే. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా నడుస్తున్న సిటీ బస్సుల కారణంగా నగరంలో ట్రాఫిక్ భయానకంగా మారింది. బస్టాపులను, బస్‌బేలను బేఖాతరు చేస్తూ నిర్లక్ష్యంగా నడిరోడ్డుపైనే నిలిపి ప్రయాణికులను ఎక్కించుకోవడం ఆర్టీసీ డ్రైవర్లకు అలవాటుగా మారింది. కొన్ని బస్సుల రాకపోకలు, అడ్డగోలు డ్రైవింగ్ కారణంగా నిత్యం లక్షలాది వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైవర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంలో ఆర్టీసీ ఘోరమైన ఉదాసీనతను ప్రదర్శిస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆర్టీసీ సిటీ బస్సుల విచక్షణా రహితమైన డ్రైవింగ్ కారణంగా గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. సిటీలో 1913 బస్టాపులు, 134 బస్‌బేలు ఉన్నాయి. వీటిలో బస్సులు ఆగకపోవడంతో ఆటోలకు, ప్రైవేటు వాహనాలకు అడ్డాలుగా మారాయి. గుంత.. వదలని చింత.. నిత్యం వందలాది వాహనాలు రద్దీగా తిరిగే రోడ్డు.. గురువారం ఉదయం ఎప్పటిలాగే సాగిపోతున్నాయి. రోడ్డు మధ్యలో ఉన్న గుంతలో ఓ కారు పడిపోయింది. పదిమంది కలిసి బయటకు లాగేందుకు ప్రయత్నించారు.. వీలుకాలేదు.. వెనుక నుంచి మరో పదిమంది నెట్టారు.. కదలిక వచ్చింది. ఇదంతా జరగడానికి అరగంట సమయం పట్టింది. ఇంతలో మరో కారు.. ఇలా వరుసగా పడిపోతున్నాయి. వెనుకా ముందూ.. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. యూసుఫ్‌గూడ పరిధిలోని ఆర్బీఐ క్వార్టర్స్ వద్ద పరిస్థితి ఇది. ఇక్కడ గతంలో కేబుల్ నిర్మాణం కోసం గతంలో రోడ్డును తవ్వి వదిలేశారు. మున్సిపల్ శాఖ మంత్రి ఇక్కడి పరిస్థితిని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులు చేపట్టాలని అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఇది జరిగి నెలరోజులు గడిచింది. బుధవారం రాత్రి మట్టి తెచ్చి రోడ్డు మధ్యలో పోసి వదిలేశారు. గురువారం ఉదయం ఓ పక్క మట్టి కుప్పలు.. మరోపక్క గుంతలో వాహనాలు ఎటూ పోలేని పరిస్థితి. వచ్చిన ప్రతి కారూ రోడ్డు మధ్యలోని గుంతలో పడిపోవడం పరిపాటిగా మారింది. స్థానికులే ఆ కార్లను బయటకు లాగి పంపించారు. పైగా అది మూడు రోడ్ల జంక్షన్ కావడంతో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో వాహనదారులు నరకం చూశారు. స్థానికంగా టైర్లకు పంక్చర్లు వేసే ప్రకాష్ మట్టితో గుంతలు కప్పడంతో వాహనదారులకు ఊరట లభించింది. - జూబ్లీహిల్స్ యమపాశాలు.. శ్రీనగర్‌కాలనీ ప్రధాన రోడ్డుకు ఓ వైపు మరమ్మతు పనులు జరుగుతున్నాయి. అదే మార్గంలో స్తంభాలకు కట్టిన కేబుళ్లను తొలగించి దారిపొడవునా పడేశారు. దీంతో ఆ దారిలో వెళుతున్న వాహనాలకు ఈ తీగలు చిక్కుకుని పడిపోతున్నారు. ఈ కేబుళ్లను దాటుకుని వెళ్లాలంటే ద్విచక్ర వాహనదారులు, పాదచారులు హడలిపోతున్నారు. - సాక్షి, సిటీబ్యూరో ఔరా.. ప్రతిభ..! పుస్తకాలతో కుస్తీ పట్టే చిన్నారులు తమ సృజనాత్మకతకు పదునుపెట్టి వ్యర్థాలకు అర్థం చెబుతున్నారు. కుత్బుల్లాపూర్ మండలం బహదూర్‌పల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన రాజు, జానకి దంపతుల కుమార్తెలు అనూష, అశ్విని దూలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒకరు 10, మరొకరు 9వ తరగతి చదువుతున్నారు. రాజు వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. కాగా అనూష, అశ్విని చదువుల్లో రాణిస్తూ వెస్టేజీతో జుమ్కీలు, చెవి కమ్మలు తయారు చేస్తూ అబ్బుర పరుస్తున్నారు. కాగితం, అట్ట ముక్కలు, కలర్ పేపర్లు, గమ్, పూలు, గాజు పెంకులతో రంగు రంగుల చెవి కమ్మలు, చెవి హ్యాంగింగ్స్‌ను నిమిషాల్లో తయారు చేసి చూపిస్తున్నారు. ఈ అక్కాచెల్లెళ్లు తయారు చేసిన వస్తువులు చూపరులను ఆకట్టుకోవడమే కాదు.. వాటిని ధరించి ఆనందిస్తున్నారు కూడా. - సుభాష్‌నగర్ అటకెక్కిన ‘క్యూ రెయిలింగ్’.. ముంబయి తరహాలో సిటీ బస్సుల రాకపోకలపై నియంత్రణ, ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాన్ని కల్పించే లక్ష్యంతో ‘క్యూ రెయిలింగ్’ ఏర్పాటు కోసం చేసిన అధ్యయనం అటకెక్కింది. కూకట్పల్లి, ఈఎస్ఐ, కేపీహెచ్‌బీ, ఎన్ఎండీసీ, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, నానల్‌నగర్, బాపూనగర్, లక్డీకాపూల్, నాంపల్లి, గృహకల్ప, లోతుకుంట, బోయిన్పల్లి, తదితర చోట్ల బస్‌బేలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. గద్దర్‌కు పురస్కారం ప్రజా గాయకుడు గద్దర్, తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సద్ది వెంకట్‌రెడ్డిలకు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ‘సినారె విశిష్ట పురస్కారాన్ని’ ప్రదానం చేశారు. తేజస్విని కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ సినారె జన్మదిన వేడుకల సందర్భంగా గురువారం రవీంద్రభారతిలో ఈ వేడుక నిర్వహించారు. సమాచార హక్కు చట్టం కమిషనర్ డాక్టర్ పి.విజయబాబు అధ్యక్షతన సభలో గద్దర్ మాట్లాడుతూ అవార్డులు బాధ్యతను పెంచుతాయన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సి.నారాయణ రెడ్డి, ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, అలనాటి నటి జమున రమణారావు, వ్యాఖ్యాత మోహన్ కుమార్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. - సాక్షి,సిటీబ్యూరో -
గమ్యం చేరే దారేది..!
సిటీబస్సుకు ఎంఎంటీఎస్‌కు తెగిన లింకు ప్రయాణికులకు తప్పని పాట్లు దశాబ్దం దాటినా అమలుకు నోచని కనెక్టివిటీ ఏళ్లుగా ఇదే నిర్లక్ష్యం.. గ్రేటర్ హైదరాబాద్‌లోని 26 ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లలో మూడొంతుల స్టేషన్లది ఇదే దుస్థితి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, ఫలక్‌నుమా, ఉప్పుగూడ, హైటెక్‌సిటీ వంటి కొన్ని స్టేషన్లు మినహా.. చాలా వరకు రోడ్డు సదుపాయం కానీ, సిటీ బస్సు కనెక్టివిటీ కానీ లేకుండానే ఉన్నాయి. నగరంలో ప్రజా రవాణా రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో 2003లో ప్రవేశపెట్టిన ఈ ‘మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ’ బస్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల ‘సింగిల్ మోడల్ సిస్టమ్’గానే నడుస్తోంది. ఎంఎంటీఎస్‌తో పాటే అన్ని స్టేషన్లకు రోడ్లు, బస్స్టేషన్లు, ఇతర మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తేవాలని ప్రతిపాదించారు. కానీ 13 ఏళ్లు దాటినా అది ఆచరణకు నోచుకోలేదు. ప్రధాన రహదారులకు ఆనుకొని ఉన్న కొన్ని స్టేషన్లకు మాత్రమే బస్సు సదుపాయం కల్పించారు. మొదట్లో కొద్ది రోజులు ఎంఎంటీఎస్ ట్రైన్ తరహాలోనే నీలి, తెలుపు రంగు బస్సులను నడిపారు. లక్డీకాపూల్, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ వంటి స్టేషన్లకు ఈ బస్సులు నడిచేవి. కానీ ప్రయాణికుల ఆదరణ లేదనే కారణంతో ఏడాది తిరగకుండానే బస్సులను నిలిపివేశారు. దీంతో ఎంఎంటీఎస్-సిటీ బస్సు కనెక్టివిటీ ఆదిలోనే అటకెక్కింది. సిటీబ్యూరో: నగరంలో ప్రతిరోజు ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసుల సంఖ్య 121. వీటిలో ప్రయాణిస్తున్న వారు 1.30 లక్షల మంది. మూడేళ్ల క్రితం 1.60 లక్షల మంది ఎంఎంటీఎస్ రైళ్లను వినియోగించుకునే వారు. ఈ మూడేళ్లలో 30 వేల మంది ఎంఎంటీఎస్‌కు దూరమయ్యారు. రూ. 10తో ట్రైన్లో ప్రయాణించిన వారు రైలు దిగి తమ గమ్యం చేరుకోవాలంటే ఆటోకు కనీసం రూ.30 చెల్లించాల్సిన పరిస్థితి. ఫలక్‌నుమా-లింగంపల్లి, నాంపల్లి-లింగంపలి, సికింద్రాబాద్-నాంపల్లి మార్గంలో ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. రైలు దిగి గమ్యం చేరేందుకు ఇప్పటికీ నగరంలోని ఏ ఎంఎంటీఎస్ స్టేషన్ నుంచి పూర్తిస్థాయిలో సిటీ బస్సు సౌకర్యం లేదు. దీంతో క్రమంగా ప్రయాణికుల సంఖ్య తగ్గుతోంది. ఇదేక్రమంలో గ్రేటర్లో 3850 సిటీ బస్సులు నడుస్తుండగా ఎంఎంటీఎస్ స్టేషన్లతో లింకున్నవి 300 మించి లేవు. సీతాఫల్మండి బస్టాపు నుంచి ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్ మధ్య దూరం 2 కిలోమీటర్లు. ఈ మార్గంలో బస్సులు రైల్వేస్టేషన్ వరకు వెళ్లే అవకాశం లేదు. రైల్వేస్టేషన్లో దిగి ఇటు తార్నాక వైపు లేదా అటు చిలకలగూడ వైపు నడిచి వెళ్లాల్సిందే. లేదంటే ఆటో ప్రయాణం. ఆటోలో రెండు కిలోమీటర్ల దూరానికి కనీసంరూ. 30 చెల్లించాలి. హైటెక్‌సిటీ నుంచి సీతాఫల్మండి వరకు ఎంఎంటీఎస్ ట్రైన్లో రూ.10 టిక్కెట్‌పై వచ్చిన వారు.. మరో రెండు కిలోమీటర్లు రోడ్డు మార్గంలో వెళ్లేందుకు ఆటోకు రూ.30 వెచ్చించాల్సి వస్తోంది. అమీర్‌పేట్ నేచర్ క్యూర్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతి రోజు వందలాది మంది రాకపోకలు సాగిస్తారు. కానీ ఈ రూట్లో బస్సులు అందుబాటులో ఉండవు. బసెక్కాలంటే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ వైపు లేదా అమీర్‌పేట్ వైపు రెండు కిలోమీటర్లు వెళ్లాల్సిందే. ఈ రెండు స్టేషన్లు మాత్రమే కాదు.. చందానగర్, హఫీజ్‌పేట్, బోరబండ, భరత్‌నగర్, నెక్లెస్‌రోడ్డు, బేగంపేట్, జేమ్స్ స్ట్రీట్, మలక్‌పేట్, యాకుత్‌పురా, తదితర స్టేషన్లకు సైతం బస్సు సదుపాయం లేదు. వేలాది మంది రాకపోకలు సాగించే మౌలాలీ, మల్కాజిగిరి వంటి రైల్వేస్టేషన్ల పరిస్థితీ అలాగే ఉంది. ఇంకా కొన్ని రైల్వేస్టేషన్లకు రోడ్డు సదుపాయం కూడా లేదు. దీంతో ప్రయాణికులు తక్కువ చార్జీలతో ఎంఎంటీఎస్ రైళ్లను వినియోగించుకోగలిగినా ట్రైన్ దిగిన తరువాత రోడ్డు రవాణా కోసం ఇబ్బందులకు గురికావలసి వస్తోంది. తగ్గుతున్న ప్రయాణికులు.. పెరుగుతున్న జనాభా, రోడ్లపై వాహనాల రద్దీ, ప్రయాణికుల అవసరాలు, వాహన కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎంఎంటీఎస్‌కు శ్రీకారం చుట్టింది. మొదటి దశలో సుమారు రూ. 69.50 కోట్ల వ్యయంతో ఈ రైళ్లు పట్టాలెక్కాయి. మొదట సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు ఈ రైలును ప్రవేశపెట్టారు. తరువాత సికింద్రాబాద్ నుంచి ఫలక్‌నుమా వరకు విస్తరించారు. 25 వేల మంది ప్రయాణికులు, 30 సర్వీసులతో ప్రారంభమైన ఎంఎంటీఎస్ సేవలు.. ప్రస్తుతం 121 సర్వీసులకు చేరుకున్నాయి. కానీ ఇప్పటికీ సిటీ బస్సుతో లింకు లేకపోవడంతో ఏటా ప్రయాణికుల సంఖ్య తగ్గుతోంది. 2013లో ఎంఎంటీఎస్ రైళ్లలో 1.60 లక్షల మంది పయనిస్తే ఇప్పుడు ఆ సంఖ్య 1.30 లక్షలకు పడిపోయింది. అటు హైటెక్ సిటీ నుంచి ఇటు పాతనగరం వరకు సాఫ్ట్వేర్ నిపుణులు, ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలకు ఎంఎంటీఎస్ ఎంతో అందుబాటులో ఉన్నప్పటికీ క్రమంగా ఆదరణ కొరవడుతోంది. ఇక ఎంఎంటీఎస్ రెండో ద శ ప్రాజెక్టులోనైనా రోడ్డు, సిటీ బస్సు కనెక్టివిటీ కోసం ప్రత్యేక చర్యలు తీసుకొంటే తప్ప నగర ప్రజలకు పెద్దగా ప్రయోజనం ఉండదు. -
ఆర్టీసీకి ‘మెట్రో’ బ్రేక్
గ్రేటర్లో రోజుకు 3000 ట్రిప్పుల రద్దు మెట్రో మార్గాల్లో ట్రాఫిక్ రద్దీయే కారణం రోజుకు 1.5 లక్షల ప్రయాణికులపై ప్రభావం సిటీబ్యూరో: సికింద్రాబాద్ నుంచి సనత్‌నగర్‌కు సిటీ బస్సుకు నిర్ణయించిన రన్నింగ్ టైమ్ 35 నిమిషాలు. కానీ ఇప్పుడు గంట దాటినా గమ్యానికి చేరుకోవడంలేదు. అన్ని చోట్లా అదే పరిస్థితి. కేపీహెచ్‌బీ, హైటెక్‌సిటీ, వేవ్‌రాక్, కొండాపూర్, బోరబండ, మాదాపూర్, లింగంపల్లి, పటాన్చెరు, బీహెచ్ఈఎల్, కోఠి, దిల్సుఖ్నగర్, ఉప్పల్, ఈసీఐఎల్, మెహదీపట్నం, చార్మినార్, తదితర మార్గాల్లో నడిచే సిటీ బస్సులు ట్రాఫిక్ రద్దీ కారణంగా నత్తనడక నడుస్తున్నాయి. బస్సులకు కేటాయించిన రన్నింగ్ టైమ్ ట్రాఫిక్‌లోనే హరించుకు పోతోంది. దీంతో గ్రేటర్‌లోని 28 డిపోల పరిధిలో ప్రతి రోజు 3000కు పైగా ట్రిప్పులు రద్దవుతున్నాయి. 1.5 లక్షల మంది ప్రయాణ సదుపాయాన్ని కోల్పోతున్నారు. బేగంపేట్, జేబీఎస్, సికింద్రాబాద్ ఒలిఫెంటా బ్రిడ్డి, కోఠి, మలక్‌పేట్, తదితర మార్గాల్లో జరుగుతున్న మెట్రో పనులు, ట్రాఫిక్ రద్దీ ట్రిప్పుల రద్దుకు కారణమవుతున్నాయి. ఆర్టీసీకి భారీ నష్టం.. బేగంపేట్‌లో చేపట్టిన మెట్రో పనుల వల్ల సికింద్రాబాద్-అమీర్‌పేట్ మార్గంలో 500 బస్సులను రద్దు చేశారు. తిరుగుతున్నవాటిలో ఏ ఒక్కటీ నిర్ణీత వేళకు గమ్యం చేరడం లేదు. ఈ ఒక్క రూట్లోనే వేలాది మంది ప్రయాణికులు సకాలంలో బస్సులు లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంధనం సైతం భారీగా ృధా అవుతోంది. ఒక లీటర్ డీజిల్ వినియోగానికి కనీసం 5 కిలోమీటర్లు వెళ్లాల్సిన బస్సులు.. మూడు కిలోమీటర్ల కంటే ముందుకు వెళ్లడం లేదు. నగర శివారు ప్రాంతాలు మినహాయించి మిగతా అన్ని రూట్లలోనూ ఇదే పరిస్థితి. ట్రిప్పుల రద్దుతో ప్రయాణికుల ఆక్యుపెన్సీ సైతం పడిపోతుంది. ఇంధన వ్యయం, నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయి. రూ. 354.75 కోట్ల న ష్టాల్లో ఉన్న గ్రేటర్ ఆర్టీసీకి ఇది పెను ముప్పుగా మారింది. ఇబ్బందులు ఇలా.. జూబ్లీ బస్‌స్టేషన్ వద్ద చేపట్టిన మెట్రో పనులతో సికింద్రాబాద్ నుంచి బోయిన్పల్లి, అల్వాల్, తిరుమలగిరి, మేడ్చెల్, సుచిత్ర, తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు నిర్ధారించిన రన్నింగ్ టైమ్‌కు చేరుకోక పోతున్నాయి. సికింద్రాబాద్ నుంచి బోయిన్‌పల్లికి కేవలం 20 నిమిషాల్లో చేరుకోవ్సాలిన బస్సులు 40 నిమిషాలు దాటినా చేరుకోవడం లేదు. సికింద్రాబాద్ ఒలిఫెంటా బ్రిడ్జి వద్ద చేపట్టిన మెట్రో పనుల వల్ల సికింద్రాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్ మీదుగా కోఠి, నాంపల్లి, ఆఫ్జల్‌గంజ్, ఎంజీబీఎస్, తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులకు బ్రేకులు పడుతున్నాయి. మలక్‌పేట్, కోఠిలో జరుగుతున్న పనులతో దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ నుంచి మెహిదీపట్నం, పటాన్ చెరు వైపు బస్సుల రాకపోకల్లో తీవ్ర జాప్యం నెలకొంటుంది. భారీగా ఇంధన వినియోగం.. 3850 బస్సులకు ప్రతి రోజు 1.75 లక్షల ఇంధనం వినియోగమవుతోంది. గంటల తరబడి బస్సులు ట్రాఫిక్‌లో నిలిచిపోవడం వల్ల వేలకొద్దీ లీటర్ల డీజిల్ ృధా అవుతుంది. ఒక లీటర్ డీజిల్‌కు 4 నుంచి 5 కిలోమీటర్లు వెళ్లాల్సిన బస్సులు 2 నుంచి 3 కిలోమీటర్లు దాటడం లేదు. ప్రతి రోజు 5 వేల నుంచి 10 వేల లీటర్ల డీజిల్ దుర్వినియోగవుతున్నట్టు అంచనా. -
సిటీబస్సు ఢీకొని ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి
ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్‌ను సిటీబస్సు ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానెలో జరిగింది. నగరంలోని ఘోడ్‌బందర్ రోడ్డులో రాత్రి 11 గంటల సమయంలో చంద్రకాంత్ వామన్ సాలుంకే అనే కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రమాదవశాత్తు టీఎంటీ బస్సు అతడిని ఢీకొంది. దాంతో అతడు అక్కడికక్కడే మరణించాడని కాసర్వాడావాలి పోలీసు స్టేషన్ పీఎస్ఐ ఆర్కే ధమానే తెలిపారు. మహారాష్ట్రలోని పర్నేర్ ప్రాంతానికి చెందిన సాలుంకే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం థానె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. టీఎంటీ బస్సు డ్రైవర్ గజానన్ షేజ్వాల్ను అరెస్టు చేశారు. -
బస్.. నిబంధనలు తుస్స్...
సిటీబ్యూరో: సిటీ బస్సుల్లో మహిళా భద్రత ఒక వెక్కిరింతగా మారింది. మహిళా ప్రయాణికుల భద్రత కోసం రూ.4 కోట్లతో ఏర్పాటు చేసిన మెటాలిక్ డోర్లు అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. ఈ లోహపు తలుపులను ఏర్పాటు చేయడం వరకే పరిమితమైన ఆర్టీసీ అధికారులు పర్యవేక్షణ బాధ్యతను విస్మరించారు. సిబ్బంది మరో అడుగు ముందుకేశారు. ఏకంగా ఆ డోర్లను తాళ్లతో కట్టేశారు. దీంతో పురుషులు యథేచ్ఛగా మహిళల సీట్ల మధ్యలోకి వచ్చేస్తున్నారు. మహిళల కోసమే కేటాయించిన ముందు భాగంలోని ప్రవేశ ద్వారం నుంచి లోపలికి ప్రవేశిస్తున్నారు. మరోవైపు ఇప్పటికీ కొన్ని బస్సుల్లో మెటాలిక్ డోర్లు ఏర్పాటు చేయనేలేదు. ఎక్కడా ఎలాంటి నియంత్రణ లేకుండా పోయింది. ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సుల్లో ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకొని మహిళలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా గౌరవప్రదంగా ప్రయాణించేందుకు ఏర్పాటు చేసిన ద్వారం ముణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. నగరంలో మహిళల భద్రత కోసం పూనం మాలకొండయ్య నేతృత్వంలోని మహిళా భద్రతా కమిటీ ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసిన సంగతి తెలిసిందే. షీటీమ్స్, షీక్యాబ్స్, సిటీ బస్సుల్లో ప్రత్యేక ఏర్పాట్లు వంటి అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్‌లోని 2,600 ఆర్డినరీ బస్సులకు రూ.4 కోట్లతో ఈ మెటాలిక్ డోర్లను ఏర్పాటు చేశారు. దశలవారీగా మిగతా బస్సులకు సైతం ఈ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు 90 శాతం బస్సుల్లో ఆ మెటాలిక్ డోర్లు బార్లా తెరుచుకుంటున్నాయి. మరోవైపు ఈ డోర్లను ఏకంగా తాళ్లతో కట్టేసి ఉంచడం గమనార్హం. ఆర్టీసీ బాధ్యతారాహిత్యం... ‘మహిళలను గౌరవిద్దాం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం..’ ఆర్టీసీ బస్సుల్లో కనిపించే నినాదం ఇది. కానీ అమలులోనే ఆచరణకు నోచుకోవడం లేదు. బస్సుల నిర్వహణలో అధికారుల నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముందు ప్రవేశద్వారం నుంచి పురుషులు ఎక్కినా.. దిగినా.. మహిళల సీట్లలో కూర్చున్నా గతంలో జరిమానా విధించే పద్ధతి ఉండేది. అలాగే ఫుట్‌బోర్డు ప్రయాణం పట్ల కూడా నిఘా ఉంచేవారు. కానీ కొంతకాలంగా ఆర్టీసీ బస్సుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఎలాంటి నిఘా, పర్యవేక్షణ లేకుండా పోయింది. సీసీ కెమెరాలు కూడా అంతేసంగతులు.. ఆర్డినరీ బస్సులకు ఏర్పాటు చేసిన విధంగానే మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు, మెట్రో డిలక్స్లతో పాటు మొత్తం 3,850 బస్సుల్లోనూ నిఘాను కట్టుదిట్టం చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. ఇందుకోసం జీపీఎస్‌తో అనుసంధానం చేసిన చేసిన బస్సుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కనీసం 48 గంటల పాటు రికార్డయ్యే సామర్థ్యం ఉన్న సీసీ కెమెరాలను బస్సు లోపలి వైపు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. కేవలం 80 సిటీ ఓల్వో బస్సులకే అది పరిమితమైంది. దర్జాగా కూర్చుంటారు ఆడవాళ్ల సీట్లలో కూర్చోవద్దనే కనీస మర్యాద కూడా పాటించడం లేదు. దర్జాగా వచ్చి కూర్చుంటున్నారు. కండక్టర్లు, డ్రైవర్లు వారిని ఏ మాత్రం నియంత్రించడం లేదు. ఇక వెనుక వైపు నుంచి ఎక్కిన వాళ్లు కూడా క్రమంగా ముందుకు చొచ్చుకొని వస్తున్నారు. మెటాలిక్ డోర్లు పూర్తిగా తెరిచే ఉంటాయి. ఇప్పుడు వాటి వల్ల ఎలాంటి భద్రతా లేకుండా పోయింది. -మాలతి, కూకట్పల్లి ఫుట్‌బోర్డు కిక్కిరిసిపోతుంది ఉదయం, సాయంత్రం బాగా రద్దీ ఉండే సమయాల్లో స్టూడెంట్స్ గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నారు. అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ముందు డోర్ నుంచి ఎక్కేసి అక్కడే ఉండిపోతున్నారు. దీంతో మహిళలు బస్సులోకి ఎక్కాలన్నా, దిగాలన్నా కష్టంగా ఉంటుంది. -శిరీష , చందానగర్ డోర్లు ఉండి ఏం లాభం చూడ్డానికి అన్ని బస్సుల్లో ఈ డోర్లు కనిపిస్తున్నాయి. కానీ ఎప్పుడు చూసినా తెరిచే ఉంచుతారు. దీంతో పురుషులు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు యథేచ్ఛగా వస్తారు. నిలబడి ఉండే మహిళా ప్రయాణికులకు ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. - చంద్రకళ, సికింద్రాబాద్ -
బస్సు..జీపీఎస్సు
మనం ప్రయాణిస్తున్న సిటీ బస్సు గంటకు కిలోమీటరు దూరమైనా వెళ్లకపోవడం... ట్రాఫిక్‌లో ఇబ్బందులు పడడం... ఆఫీసుకో... ఇంటికో... ఆలస్యంగా చేరుకోవడం... ట్రాఫిక్ పోలీసులను నిందించడం... నిత్యం నగరంలో ఎదురవుతున్న సమస్యే. ఈ సమస్య నుంచి బయట పడేందుకు అధికారులు యోచిస్తున్నారు. సిటీ బస్సు సాయంతోనే దీన్ని అధిగమించేందుకు యత్నిస్తున్నారు. - ‘సిటీబస్సు’తో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ - కంట్రోల్ రూమ్‌తో ఆర్టీసీ జీపీఎస్ అనుసంధానం - వాహన కదలికల ఆధారంగా గుర్తింపు - ప్రత్యేక కార్యాచరణకు ట్రాఫిక్ పోలీసులు సన్నద్ధం సాక్షి, సిటీబ్యూరో: సిటీ బస్సు ఇక ట్రాఫిక్ పోలీసు అవతారమెత్తనుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో వాహనాల రద్దీ నియంత్రణకు దిక్సూచిగా మారనుంది. బస్సు వేగం, కదలికల ఆధారంగా రోడ్లపై వాహనాల రద్దీ ఏ స్థాయిలో ఉందో తెలుసుకొనేందుకు ట్రాఫిక్ పోలీసులు సన్నద్ధమవుతున్నారు. నగరంలో ప్రస్తుతం మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఓల్వో బస్సులను ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లోని జీపీఎస్‌తో అనుంధానించిన సంగతి తెలిసిందే. వీటిలో ఏర్పాటు చేసిన వెహికల్ మానిటరింగ్ యూనిట్స్ ఆధారంగా బస్సు కదలికలు నమోదవుతాయి. బస్సు ఎంత వేగంతో వెళుతోందో ఇట్టే తెలిసిపోతుంది. ఒకే సారి నగరంలోని అన్ని ప్రధాన మార్గాల్లోనూ జీపీఎస్ ఆధారిత బస్సుల కదలికలను బట్టి ట్రాఫిక్ రద్దీ ఏ స్థాయిలో ఉందో తెలిసిపోతుంది. రద్దీ తీవ్రంగా ఉంటే నివారించేందుకు... అవ సరమైన చోట వాహనాలను దారి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటారు. దీని కోసం ఆర్టీసీ రూపొందించిన జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరలో పోలీస్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం చేయనున్నారు. కొన్ని ప్రైవేట్ క్యాబ్ సంస్థలు, ట్యాక్సీలు జీపీఎస్ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నప్పటికీ వాటి కదలికల ఆధారంగా ట్రాఫిక్ రద్దీని తె లుసుకోవడం సాధ్యం కాదని అధికారులు గుర్తించారు. ఆర్టీసీ జీపీఎస్‌లో మాత్రమే ప్రతి 10 సెకన్లకు బస్సు వేగాన్ని తెలుసుకునే పరిజ్ఞానం అందుబాటులో ఉంది. దీనివల్ల వాహనాల రద్దీ తీవ్రతను కచ్చితంగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులకు మాత్రమే పరిమితమైన జీపీఎస్‌ను దశల వారీగా ఆర్డినరీ సర్వీసులకు విస్తరించేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేపట్టింది. దీంతో పోలీసులు మరింత సమర్ధంగా ట్రాఫిక్ నియత్రణ చర్యలు తీసుకోగలుగుతారని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. రద్దీ రూట్లపై ప్రత్యేక శ్రద్ధ రోజు రోజుకూ వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ప్రస్తుతం గ్రేటర్లో 43 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా రహదారులు విస్తరించకపోవడం... మరోవైపు మెట్రో పనులతో అనేక మార్గాల్లో వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ఇరుకు రోడ్లతో వాహనాల సగటు వేగం దారుణంగా పడిపోయింది. కనీసం గంటకు 30 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో వెళ్లవలసిన వాహనాలు పట్టుమని 10 కిలోమీటర్లు దాటడం లేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణం మరింత నరకప్రాయంగా మారింది. రద్దీ తీవ్రంగా ఉన్న సమయాల్లో సిటీబస్సుల వేగం మరింత పడిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పోలీసులు వీటి వేగాన్ని, కదలికలను ప్రామాణికంగా తీసుకున్నట్లు సమాచారం. ఉప్పల్-తార్నాక-సికింద్రాబాద్, లకిడికాఫూల్-అమీర్‌పేట్-కూకట్పల్లి, ఎల్బీనగర్-దిల్సుఖ్నగర్-కోఠి వంటి మార్గాల్లో ఆర్టీసీ వినియోగిస్తున్న జీపీఎస్ ఆధారంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు. -
కడపలో రోడ్డెక్కనున్న సిటీబస్సులు
-
రివర్స్ గేర్ !
సాక్షి,సిటీబ్యూరో : మీరు ఎక్కాలనుకున్న సిటీ బస్సు ఎక్కడుంది..ఎంతసేపటిలో వస్తుంది.. ఇలా సమస్త సమాచారం సిటీ బస్టాప్‌ల్లో ఉంచుతున్నాం అంటూ ఆర్టీసీ అధికారులు కొద్దికాలంగా చెబుతున్న మాటలు..ప్రస్తుతం దానికి భిన్నంగా సాగుతోంది.. ఉన్నట్టుండి బస్సు రద్దయిపోతోంది. తాము ఎక్కాలనుకున్న బస్సు కోసం నిరీక్షించి వెనుదిరగాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ప్రతి రోజు 2.5 లక్షల మంది నుంచి 3 లక్షల మందికి పైగా నగర ప్రయాణికులు సిటీబస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. సకాలంలో బస్సు లభించక, ప్రయివేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. డ్రైవర్లు, కండకర్లు ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరే ఇందుకు కారణమని అధికారులు సెలవిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 29 డిపోలు, సుమారు 4 వేల బస్సులు, 30 వేలకు పైగా కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్కులు, తదితర సిబ్బంది ఉన్న అతిపెద్ద ప్రజా రవాణా సంస్థ గ్రేటర్ ఆర్టీసీ. ఇప్పటికీ ప్రయాణికుడికి చేరువకాలేకపోతోంది. బస్సులు నడపాల్సిన కండక్టర్లు, డ్రైవర్లు ఆకస్మికంగా విధులకు గైర్హాజరు కావడమే ఇందుకు కారణం. వందలాది మంది ఎడాపెడా సెలవులు వినియోగిస్తున్నారు. దీంతో వేలకొద్దీ ట్రిప్పులు రద్దవుతున్నాయి. సెలవులకు సంబంధించి సిబ్బందికి అవగాహన కల్పించేందుకు ఆర్టీసీ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కేవలం ప్రయాణికులకు సదుపాయం అందజేయలేకపోవడమే కాకుండా,ఆర్జిత సెలవులు కోల్పోవడం వల్ల సిబ్బంది సైతం ఆర్థికంగా నష్టపోతారంటూ ప్రచారం చేపట్టింది. భారీగా రద్దవుతున్న సర్వీసులు... గ్రేటర్‌లోని 29 డిపోల్లో 3850 కి పైగా సిటీ బస్సులు ప్రతి రోజు 42 వేల ట్రిప్పుల్లో ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. 1050 రూట్లలో 34 లక్షల మంది ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే, మరోవైపు ఒక్కో డిపోలో పెద్దసంఖ్యలో ట్రిప్పులు రద్దవుతున్నాయి. సాధారణంగా కండక్టర్లు,డ్రైవర్లకు రేపు చేయాల్సిన విధుల వివ రాలను ఈ రోజే ప్రకటిస్తారు. వారాంతపు సెలవులు, సిక్‌లీవ్‌లు, క్యాజువల్ లీవ్‌లపై వెళ్లిన వాళ్ల వివరాలు సైతం నోటీస్బోర్డులలో ప్రదర్శిస్తారు. కానీ చాలా మంది ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మిక సెలవులు తీసుకోవడంతో రోడ్డెక్కాల్సిన బస్సులు డిపోల్లోనే నిలిచిపోతున్నాయి. ఒక్కొక్క డిపోలో 30 నుంచి 50 మంది ఇలా సెలవులపై వెళ్తున్నట్లు అంచనా. దీంతో ప్రతి డిపోలో రోజుకు సగటున 80 నుంచి 100 సర్వీసుల వరకు రద్దవుతున్నాయి. గ్రేటర్‌లోని 29 డిపోల్లో ప్రతి రోజు సగటున 2500 ట్రిప్పులు రద్దవుతున్నాయి. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. బస్సు నడపండి భవిష్యత్తు బాగుంటుంది... ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యానే కాకుండా సంస్థ అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా అనవసరమైన సెలవులు తీసుకోకుండా బస్సులు నడపాలని కోరుతూ ఆర్టీసీ ప్రచారం చేపట్టింది. సాధారణంగా ప్రతి ఏటా 15 ఆర్జిత సెలవులు ఉంటాయి. సిబ్బంది ఇష్టారాజ్యంగా సెలవులు తీసుకోవడం వల్ల ఈ ఆర్జిత సెలవుల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో ఆర్జిత సెలవులపై వచ్చే లక్షలాది రూపాయాల ఆదాయాన్ని ఉద్యోగులు కోల్పోతున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఉదాహరణకు ప్రతి ఉద్యోగి తన ఖాతాలో కనీసం 300 ఆర్జిత సెలవులను జమ చేసుకొంటే అతనికి పదవీ విరమణ తరువాత రూ.8.66 లక్షల ఆదాయం లభిస్తుంది. ఇలా ఆర్జిత సెలవులు పెరిగిన కొద్దీ ఆదాయం పెరుగుతుందని, అందుకు సెలవులు తగ్గించుకొని బస్సులు నడపడమే ఏకైక పరిష్కారమని అధికారులు సూచిస్తున్నారు. ఈ క్యాంపెయినింగ్ ఉద్యోగుల్లో అవగాహన పెంచగలిగితే వారి ఆదాయంతో పాటు, సిటీ బస్సుల ట్రిప్పులు కూడా పెరుగుతాయని ఆర్టీసీ అంచనా. -
స్మార్ట్ ఫోన్లో.. సిటీబస్సు సమాచారమ్
మహానగరంలో సిటీబస్సు ప్రయాణం అంటే కత్తి మీద సాము లాంటిదే. బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఏ బస్సు ఎక్కడ ఆగుతుందో చెప్పలేం. అసలు పలానా రూట్లో సిటీ బస్సు సౌకర్యం ఉందా? లేదా అన్నదీ చెప్పడం కష్టమే. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణ సంస్థ ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది నగర ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మరి ఈ యాప్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి..? ఎలా వాడు కోవాలి..? తదితర విషయాలు మీకోసం... ఇలా డౌన్లోడ్ చేసుకోండి.. ⇒ మొదట https://play.google.com/store/apps/details?id=com.apsrtc&hl=en&rdid=com.apsrtc లింక్‌ను క్లిక్ చేయండి. ⇒ ఇక్కడ విండోలో ‘హైదరాబాద్ ఆర్టీసీ ఇన్ఫో’ అని కనిపిస్తుంది. దానికింద ఉన్న ‘ఇన్స్టాల్’ ఆఫ్షన్‌ను క్లిక్ చేయండి. ⇒ ఇప్పుడు మిమ్మల్ని ‘సైన్ ఇన్’ అవ్వమని కోరుతుంది. ⇒ మీకున్న జీ మెయిల్ అకౌంట్‌తో సైన్ ఇన్ అవ్వండి. ⇒ తిరిగి ఇన్స్టాల్ ఆఫ్షన్‌ను క్లిక్ చేస్తే మీ మొబైల్లో యాప్ ‘డౌన్లోడ్’ అవుతుంది. యాప్‌ను ఇలా వాడుకోండి.. ⇒ మొబైల్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్న తరువాత మొబైల్ స్క్రీన్‌పై ‘హైదరాబాద్ ఆర్టీసీ’ విండో కనిపిస్తుంది. ⇒ ఇక్కడ మీకు ‘బస్సు డిటైల్స్’, ‘ఫ్రం-టూ’, ‘లొకేషన్’, ‘రియల్ టైం’, ‘మై అకౌంట్’, ‘ఫీడ్‌బ్యాక్’, ‘క్లోజ్’ ఆఫ్షన్స్ కనిపిస్తాయి. ⇒ మొదటి రెండు ఆఫ్షన్లు మనకు ఎక్కువగా ఉపయోగపడతాయి. బస్ వివరాలు ఇలా.. ⇒ ఇక్కడ స్క్రీన్‌పై కనిపిస్తున్న ‘సెలక్ట్’ ఆఫ్షన్లో మనకు కావాల్సిన బస్ నంబరును ఎంచుకోవాలి. ⇒ ఇప్పుడు ఫోన్ స్క్రీన్‌పై సంబంధిత బస్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు సర్వీసు ఉంది, ఏయే రూట్లలో వెళ్తుంది, ముఖ్యమైన బస్ స్టాపుల వివరాలు కనిపిస్తాయి. ఫ్రం-టూ.. ⇒ ఇక్కడ కనిపిస్తున్న ‘ఫ్రం’ ఆఫ్షన్లో మీరు ఎక్కడ నుంచి బస్ ఎక్కదలిచారో ఆ ప్రాంతాన్ని ఎంటర్ చేయాలి. ⇒ ‘టూ’ ఆఫ్షన్లో ఎక్కడికి వెళ్లాలో ఆ ప్రాంతం పేరు ఎంటర్ చేయాలి. ⇒ ఇప్పుడు మీరు కోరుకున్న రూట్లో ఏయే బస్సులు అందుబాటులో ఉన్నాయి, వాటి సర్వీసు నెంబరు, అవి ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తాయి తదితర వివరాలు కనిపిస్తాయి. లొకేషన్.. ‘లొకేషన్’ ఆఫ్షన్లో కనిపిస్తున్న బస్ డిపోను ఎంచుకోవాలి. ఇక ఆ డిపో నుంచి ఏయే బస్ సర్వీసులు ఉన్నాయి, అవి ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తున్నాయి తదితర విషయాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. నోట్: అందుబాటులో ఉన్న సర్వీసులతో పాటుగా వాటి వయా రూట్ వివరాలు, వాటి టికెట్ ధరలు కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే దీన్ని సులువుగా ఉపయోగించుకోవచ్చు. -
త్వరలో సిటీబస్సు సర్వీసులు : డిప్యూటీ సీఎం
కాకినాడ సిటీ: త్వరలో రాజమండ్రి, కాకినాడ నగరాల్లో సిటీ బస్సులను అందుబాటులోకి తెస్తామని ఉపముఖ్యమంత్రి, హోంశాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. జిల్లాలో వివిధ డిపోల నుంచి కొత్తగా ప్రవేశపెట్టిన ఐదు బస్సు సర్వీసులను సోమవారం మంత్రి కాకినాడ డిపోలో జెండా ఊపి ప్రారంభించారు. గిరిజన ఉపప్రణాళిక నిధులతో ప్రవేశపెట్టిన మూడు ఏజెన్సీ ప్రాంత కొత్తసర్వీసులను రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కొబ్బరికాయకొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కాకినాడ, రాజమండ్రి నగరాలకు త్వరలో జవహర్లాల్ నెహ్రూ జాతీయ అర్బన్ రెన్యూవల్ మిషన్ పథకం ద్వారా 35 చొప్పున ఆధునిక సిటీబస్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జి.రమాకాంత్ మాట్లాడుతూ కాకినాడ నుంచి అనంతపురానికి సూపర్‌లగ్జరీ, రాజోలు నుంచి తిరుపతికి డీలక్స్ సర్వీసులను ప్రారంభించామన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద ఏలేశ్వరం నుంచి మోహనాపురానికి, ఏలేశ్వరం నుంచి వంతంగికి, గోకవరం నుంచి కొత్తవీధి కి సర్వీసులు ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో జిల్లాపరిషత్ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంపచోడవరం కో-ఆర్డినేటర్ అనంత ఉదయ్‌భాస్కర్ ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. పుష్కరాలపై ఎనిమిదిన సమావేశం గోదావరి పుష్కరాలపై సమీక్షించేందుకు ఈ నెల 8న రాజమండ్రిలో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్టు చినరాజప్ప వెల్లడించారు. ఉభయగోదావరి జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. నెలాఖరులోగా ఎంసెట్ కౌన్సెలింగ్ పూర్తి పెద్దాపురం : ఈ నెలాఖరులోగా ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తిచేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినట్టు ఉపముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. సోమవారం మండలంలోని కట్టమూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునవ్యవస్టీకరణ చట్టం ప్రకారం కౌన్సెలింగ్ ఉమ్మడిగానే జరగాలని, విద్యా అంశం పదేళ్లు ఉమ్మడి గానే ఉంటుందని తాను, మరో ఉపముఖ్యమంత్రి కె.వి.కృష్ణమూర్తి గవర్నర్‌ను కలిశామని చెప్పారు. కౌన్సెలింగ్వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లగా, ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. సుప్రీం తీర్పుతో కౌన్సెలింగ్‌లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిందన్నారు. యథావిధంగా ఎంసెట్ కౌన్సెలింగ్ జరుగుతుందని చెప్పారు. కోర్టు ఇచ్చిన తీర్పునకు కట్టుబడి తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు. రాజప్పకు సత్కారం స్థానిక సామర్లకోట రోడ్డు మార్గంలో ఉన్న క్రైస్తవ స్వర్ణదేవాలయంలో నిర్వహిస్తున్న తైలాభిషేకం పండగ సోమవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, హోంశాఖా మంత్రి చినరాజప్ప పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ క్రీస్తుబోధనలు అనుసరణీయమని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో క్రైస్తవులు తరలివచ్చి ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైబిల్ మిషన్ ఉపాధ్యక్షుడు సంజీవరావు, స్వర్ణదేవాలయం కన్వీనర్ జి.ఆర్. ఇమ్మానుయేలు ఆధ్వర్యంలో మత పెద్దలు చినరాజప్పను సత్కరించారు. తైలాభిషేకం పండగ సందర్బంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజాసూరిబాబు, మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. -
రాజధానిలో వోల్వో పరుగులు
-
ఎదురు తిరిగింది... స్టీరింగ్ తిప్పింది!
‘ఆడపిల్లలు ఇవి మాత్రమే చేయాలి...’ అంటూ మన సమాజం ఒక జాబితాను తయారు చేసింది. కొన్ని వందల యేళ్లుగా అందరూ వాటినే అనుసరిస్తున్నారు. అలా అనుసరించని వాళ్లని వింతగా చూస్తున్నారు. ఆ సంగతి తెలిసి కూడా ఓ మహిళ ఆ నియమాలను ధిక్కరించింది. నేను ఎందుకు చేయకూడదు అని ఎదురు తిరిగి ప్రశ్నించింది. ఇదే చేస్తాను అంటూ తను కోరుకున్న దిశగా అడుగులు వేసుకుంటూ పోయింది. నేడు వందలాది మందికి ఆదర్శంగా నిలబడింది! అక్టోబర్ 26, 2010. ఆ రోజు ప్రపంచానికి ప్రత్యేకమైన రోజు కాకపోవచ్చు. కానీ ప్రేమా రామప్ప జీవితంలో మాత్రం ఎంతో ప్రత్యేక మైన రోజు. ఓ గొప్ప విజయాన్ని సాధించిన రోజు. తనేమిటో చూపించిన రోజు. ఆ రోజు ఆమె తొలిసారిగా బస్సు స్టీరింగును పట్టుకుంది. బెంగళూరు రోడ్ల మీద సిటీ బస్సును పరుగులు పెట్టించింది. కర్నాటక రాష్ట్రంలో బస్సును నడిపిన తొలి మహిళా డ్రైవర్‌గా రికార్డును నెలకొల్పింది. బతుకు బండిని నడపలేక... ‘‘బస్సు నడుపుతావా, అలాంటి పనులు మగాళ్లకి గానీ నీకెందుకు?’’ ఈ మాట విని ప్రేమకి కోపం రాలేదు. నవ్వొచ్చింది. యుగాలు గడిచినా, తరాలు మారినా ఆడ, మగ తేడాలు మాత్రం మార లేదు కదా అనుకుంది. కానీ వెనకడుగు మాత్రం వేయలేదు. ఎందుకంటే... బతుకు బండిని నడపలేక అవస్థ పడుతున్న తనకు చక్రాల బండి ఆధారమవగలదని ఓ నమ్మకం. అందుకే ఎలాగైనా బస్సు డ్రైవర్ అవ్వాలని నిర్ణయించుకుంది. అది మగాళ్ల ఉద్యోగమని అన్నా వినలేదు. ఈ పట్టుదల ఇవాళ కొత్తగా రాలేదు ప్రేమకి. ఆమె చిన్నప్పట్నుంచీ అంతే. ఏదైనా చేయాలనుకుంటే చేసి తీరుతుంది. ఎందుకో మొదట్నుంచీ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. స్కూల్లో ఉన్నప్పుడే బంధువుల దగ్గర బైకు తీసుకుని నడిపింది. బడికెళ్లి వచ్చేటప్పుడు తమ స్కూలు బస్సు డ్రైవర్ పక్కనే కూర్చునేది. ఆయన ఎలా నడుపుతున్నాడు, గేర్ ఎప్పుడు వేస్తున్నాడు, క్లచ్ ఎప్పుడు తొక్కుతున్నాడు... అన్నీ గమనించేది. మధ్య మధ్యన అతడిని ప్రశ్నలు కూడా అడిగేది. ప్రేమ ఆసక్తి చూసి అతడు ఓపిగ్గా చెప్పేవాడు. దాంతో ఎలాగైనా నాలుగు చక్రాల వాహనాన్ని నడపాలనే కోరిక కలిగింది ప్రేమకి. మెల్లగా అది కూడా నేర్చుకుంది. కానీ నడిపే అవకాశం మాత్రం రాలేదు. ఎట్టకేలకు ఆ అవకాశం వచ్చింది. కానీ వచ్చిన పరిస్థితులు మాత్రం మామూలువి కాదు. చదువు త్వరగానే ముగించి, నర్సు ఉద్యోగం సంపాదించింది ప్రేమ. తండ్రి లేకపోయినా అన్నీ తానై పెంచిన తల్లికి అండగా నిలిచింది. ఆమె చూపించిన వ్యక్తితో తాళి కట్టించుకుంది. ఓ మగబిడ్డకు తల్లి కూడా అయ్యింది. అంతా ఆనందంగా సాగిపోతోందనుకున్న సమయంలో ఓ పెద్ద తుఫాను. ప్రేమ భర్త ఓ ప్రమాదంలో మరణించాడు. ఓ పక్క ఆ బాధ... తనకు జన్మనిచ్చిన తల్లిని, తాను జన్మనిచ్చిన కొడుకుని బాగా చూసుకోవా లన్న తపన మరోపక్క... నలిగిపోయింది ప్రేమ. ఆపైన బాగా ఆలోచించి, తిన్నగా ఆర్టీవో ఆఫీసుకు వెళ్లింది. ఫోర్ వీలర్ లెసైన్సుకు అప్లై చేసింది. లెసైన్సు వచ్చాక బెంగళూరు మెట్రో పాలిటన్ ట్రాన్‌సపోర్‌ట కార్పొరేషన్ నిర్వహించిన పరీక్షకు హాజరయ్యింది. అందులో పాసై బస్సు స్టీరింగును చేత పట్టింది. మొదట్లో డ్రైవింగ్ సీట్లో ఉన్న ప్రేమని అందరూ ఆశ్చర్యంగా చూసేవారు. ఆ తర్వాత అభినందించడం మొదలుపెట్టారు. ఆపైన ఆమె స్ఫూర్తితో కొందరు మహిళలు డ్రైవర్లుగా మారారు. ‘‘బస్సు నడుపుతాను అని నేను అన్నప్పుడు... ఆడవాళ్లు అలాం టివి చేస్తారా ఎక్కడైనా అంటూ కొందరు ఎగతాళిగా మాట్లాడారు. వాళ్లని నేను తప్పు బట్టను. మన సమాజం అలా ఉంది. కానీ నేను అలా లేను కదా. కనీసం నన్ను చూశా కైనా ఆడపిల్లలు ఏదైనా చేయొచ్చు, చేయ గలరు అని అర్థమైతే చాలనుకున్నాను’’ అంటుంది ప్రేమ నవ్వుతూ. ఆమె ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. ఆ నవ్వే ఆమెకు అందం. అది మొక్కవోని ఆమె ఆత్మవిశ్వాసానికి దర్పణం! - సమీర నేలపూడి కర్నాటకలోని ఆర్టీసీ డ్రైవర్లంతా సమ్మె చేస్తుంటే, తన కడుపు నింపుతోన్న సంస్థకు ద్రోహం చేయ నంటూ బస్సును నడిపిన ధీశాలి ప్రేమ. కొందరు తనపై దాడి చేసినా కూడా బెదరలేదు. ఆమె ధైర్యానికి, స్థైర్యానికి, నిబద్దతకి మెచ్చి ప్రభుత్వం ఉత్తమ డ్రైవర్ అవార్డును కూడా ఇచ్చింది. అందుకు ఎవరైనా ప్రశంసిస్తే... ‘నా కొడుకుని గొప్పవాణ్ని చేయాలన్న తపనే నన్నీ స్థాయికి తెచ్చింది తప్ప ఇందులో నా గొప్పదనమేమీ లేదు’ అంటుంది సింపుల్‌గా. -
ఆగి ఉన్న సిటీబస్సులో మంటలు
-
ఆగి ఉన్న సిటీబస్సులో మంటలు
హైదరాబాద్‌లోని మెహిదీపట్నం ప్రాంతంలో ఓ బస్సులో మంటలు చెలరేగాయి. బుధవారం రాత్రి హయత్‌నగర్ నుంచి వచ్చిన ఓ బస్సు మెహిదీపట్నంలో రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఆగి ఉన్న సమయంలో ఆ బస్సులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ బస్సు హయత్‌నగర్ డిపోకు చెందినదిగా గుర్తించారు. సిబ్బంది గుర్తించి అగ్నిమాపక విభాగాన్ని అప్రమత్తం చేసేలోపే మంటలు వ్యాపించాయి. మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు పూర్తిగా తగలబడిపో్యింది. అయితే, ఈ ప్రమాదానికి కారణం ఏంటన్న విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. పదే పదే బస్సు ప్రమాదాలు, బస్సులు తగలబడిపోతున్న సంఘటనలు జరుగుతుండటంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తోంది. -
రియాలిటీ చెక్... ఏక్ అకేలా ఇస్ షెహర్ మే...
రియాలిటీ చెక్: పూడూరి రాజిరెడ్డి తెనాలి ప్రచురణలు హార్డ్‌బౌండ్ ఎడిషన్ వెల: రూ. 250 ప్రతులకు: అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు వివరాలకు: 9550930789 మంచి పుస్తకం: కలం భుజాన వేసుకొని బయల్దేరడం కష్టమే అందరికీ. ఎవరు వెళ్తారు చెప్పండి. ఒకనాడు ఒక శ్మశానానికి, ఒకనాడు ఒక శవాల గదికి, ఒకనాడు పొగలు చిమ్మే కిక్కిరిసిన సిటీబస్సు తొడతొక్కిడిలోకి, ఒకనాడు ఒక వేసవి ఎండ వడగాడ్పులోకి, ఒకనాడు ఒక సెక్స్‌వర్కర్ ఎదుట కూచుని ఆమె చెప్పే ఒకరాత్రి 17 సార్ల మృగరతి అనుభవంలోకి. ధైర్యం కావాలి. ధైర్యమేనా? ప్రేమ కావాలి. చేతులు సాచి కావలించుకునే గుణం. ఎవరూ చూడకుండా కన్నీరు కార్చుకునే కరుణ. అయ్యో... అయ్యో... అని గుండెలు బాదుకునే స్పందన. దానిని వ్యాఖ్యానించగల తాత్త్వికత. పూడూరి రాజిరెడ్డి ఇవన్నీ తాను పడి తన వాక్యం వల్ల, తన కలానికి ఉన్న లెన్సుల వల్ల, ఆ లెన్సు మాత్రమే చిత్రిక పట్టే దృశ్యాల వల్ల మనకు చూపించాడు ‘రియాలిటీ చెక్’లో. సాక్షి ఫన్ డేలో సూపర్ హిట్ కాలమ్ ఇది. వారం వారం వచ్చింది. ప్రతి వారం రాజిరెడ్డి ఏదో ఒక పరిచిత, అపరిచిత ప్రాంతానికి వెళ్లి మనకు పరిచితమైన సంగతిలోని అపరిచితమైన విశేషాన్ని అపరిచితమైన విశేషంలో అతి పరిచితమైన మానవ సహజ స్వభావాలను చూపి అబ్బుర పరుస్తాడు. ఇదంతా పిచ్చిలా ఉంది- పాతరోజుల్లో జర్నలిజమే ఒక వెర్రి అనుకునే జర్నలిస్టులు ఇలా చేశారు- ఇవాళ ఎవరు చేస్తున్నారు అనంటే? అప్పుడూ నదులు పారాయి. రేపూ పారుతాయి. కొత్తతరం వచ్చి కొత్తగా గోపురాలెక్కి అరచి అరచి చూపిస్తుంది లోకాన్ని- ఇటు చూడండి అని. యాభైకి మించిన వారాలు హైదరాబాద్‌లోని యాభైకి మించిన తావుల్లో రాజిరెడ్డి కూలబడి కూచుని ఏం చూశాడో చెప్పాడు ఇందులో. ఇది వర్తమానమా. ఇలాగే గతం లేదూ? ఇలాగే భవిష్యత్తు ఉండదూ? మరి దీనిని ఎందుకు చదవాలి. మనల్ని మనం చూసుకొని మనం మాత్రమే ఇలా కాదు అందరూ ఇలాగే ఉన్నారు అనుకొని ఊరట చెందడానికి. బాధ పడేవాళ్లను చూసి బాధ పడ్డానికి, ధైర్యంగా ఉన్నవారిని చూసి ధైర్యం తెచ్చుకోవాడానికి. ఇది ఒక వైద్యం. లేదా సుఖమయమనుకునే దొంగ గంతలు కట్టుకున్నవారిని ఈడ్చుకెళ్లి తప్పనిసరిగా ఎక్కించాల్సిన రోగం. మన చుట్టూ ఎలా ఉందో తెలుసుకోకపోతే ఎలా? వార్తల చాటున దాగిన కథలు ఇవి. రచయితలకు పట్టని సజీవ చిత్రాలు. మంచి వచనానికి ముఖం వాచినవాళ్లు దీనిని చదివి పాయసం చేసుకొని తిని అమ్మయ్య అనుకోరూ. తెలుగును ఎవరూ కాపాడనక్కర్లేదు. అదే ఎవడిదో ఒకడి కడుపులో దూరి తనను తాను కాపాడుకుంటుంది. అందుకొక సాక్ష్యం కూడా ఈ పుస్తకం. దీనిని చాలా అందంగా ఖర్చుతో తెనాలి ప్రచురణల వాళ్లు పుస్తకంగా తెచ్చారు. మంచితో మిలాఖత్ అయ్యేవాళ్లు ఎక్కడైనా ఉంటారు. వయసొచ్చిన పిల్లలందరి చేత దీనిని చదివిస్తే ఎలా ఉంటుందంటారు? పోనీ పి.జి కుర్రాళ్లందరినీ బెత్తంతో కొట్టి చదివిస్తే? మన సమాజపు రియాలిటీ తెలిసి దారిలో పడరూ? సినిమా పుస్తకం: దాసరి కంఠంలో గజమాల.... పాలకొల్లు నుంచి మద్రాసు ప్రయాణం... పులులు సింహాల మధ్య- పాములు మొసళ్ల మధ్య- ఏ అండా దండా లేకుండా పైకి రావడం- సినిమా ఒక శక్తిమంతమైన మీడియా అనుకుంటే దానితో ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటో తెలుసుకొని కొద్దో గొప్పో సంస్కరణల కోసం దానిని ఉపయోగించడం- ఇవన్నీ చేసి సాధించినవారు దాసరి నారాయణరావు. 150 సినిమాలకు దర్శకత్వం వహించడం అంటే ఇక ఎప్పటికీ ఎవరూ బద్దలు కొట్టలేని రికార్డు అది. పని పట్ల ఒక రకమైన వెర్రి, ఉన్మాదం ఉంటే తప్ప సాధ్యం కాదు. అందుకనే ఆయన అన్ని సినిమాలు తీయగలిగారు. దాసరి తీసిన 150 సినిమాల గురించి వాటి తెర వెనుక కథ గురించి అవి చూపిన ప్రభావం గురించి ఈ పుస్తకం- ‘విశ్వవిజేత విజయగాథ’లో వివరించారు జర్నలిస్టు వినాయకరావు. తాత-మనవడు, స్వర్గం-నరకం, చిల్లరకొట్టు చిట్టెమ్మ, శివరంజని, సర్దార్ పాపారాయుడు, ప్రేమాభిషేకం... వీటి వెనుక కథలు ఆసక్తి రేపుతాయి. దాసరి అన్ని చిత్రాలు ఒకెత్తు... ‘అద్దాల మేడ’ ఒకెత్తు. సినిమా వాళ్ల మీదే తీసిన ఈ సినిమా- ఇండస్ట్రీ ఆత్మను పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. మరొక ఆశ్చర్యం ఏమిటంటే ఇవాళ మనం చాలా పెద్ద పెద్దవి అనుకుంటున్న చాలా సినిమాలని ఆయన కేవలం 20 రోజుల్లో 28 రోజుల్లో తీసి సూపర్ హిట్ చేయడం. నిర్మాత, ఇండస్ట్రీ మేలును ఆకాక్షించే దర్శకుడు చేయాల్సిన పని అదే. కాని ఇవాళ ఏం జరుగుతోంది? ఎన్ని కోట్లు... ఎన్ని వర్కింగ్ డేస్... అలాగని హిట్ కొట్టగలుగుతున్నారా? అందరు దర్శకులకూ దర్శకులు కావాలనుకునేవారికి పాఠం ఈ పుస్తకం. దాసరి ఒక సినిమా లైబ్రరీ. ఆ లైబ్రరీ నుంచి అందిన మరో మంచి పుస్తకం ‘విశ్వవిజేత విజయగాథ’. సినిమా పట్ల ఆసక్తి ఉన్నవారందరూ చదవదగ్గ పుస్తకం ఇది. హార్డ్ బౌండ్ ఎడిషన్: రూ.400; ప్రతులకు - 9985411019 సాహిత్య డైరీ: రన్నింగ్ కామెంటరీ.... తెలుగు పత్రికా రంగంలో వినూత్న ప్రయోగంగా వాసికెక్కిన దేవిప్రియ - రన్నింగ్ కామెంటరీ- మూడు సంపుటాల ఆవిష్కరణ సభ జనవరి 29, బుధవారం సాయంత్రం. వేదిక: ఫ్యాప్సీ భవన్, రెడ్‌హిల్స్. దాసరి నారాయణరావు, వేదకుమార్, హరగోపాల్, కె.రామచంద్రమూర్తి, గోరటి వెంకన్న తదితరులు పాల్గొంటారు. తెలుగు కథ- ప్రాంతీయ అస్తిత్వం కర్నూలు సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో జనవరి 28 నుంచి 29 వరకు తెలుగు కథ- ప్రాంతీయ అస్తిత్వం అనే అంశంపై రెండు రోజుల పాటు సదస్సు జరుగుతుంది. డా.ఎస్.అబ్దుల్ ఖాదర్, డా.సంగిశెట్టి శ్రీనివాస్, డా.నందిని సిధారెడ్డి, డా.వి,త్రివేణి, డా.సంగెనేని రవీంధ్ర, డా. పసునూరి రవీందర్, డా. సామాన్య, డా.మాడభూషి సంపత్ కుమార్ తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 98669 77741 కొత్త పుస్తకాలు ఊహాచిత్రం... దారి ఏర్పడనంత వరకూ నడిచే నడక కూడా వృథా పోదు. ఎక్కడికి పోవాలి... ఎందుకుపోవాలి తెలియకుండా కొంత దూరం నడవడం ఏం వృథా? కాలు సాగి... సుదూర లక్ష్యం ఏర్పరుచుకోవడానికి వీలవుతుంది. అరిపిరాల సత్యప్రసాద్ ఏ విధమైన రచయిత? ఏ భావజాలపు రచయిత? ఎందుకు రాస్తున్న రచయిత? ప్రస్తుతానికి జవాబులు లేవు. కాని అతడి కథాసంపుటి ‘ఊహాచిత్రం’ చదివితే అతనొక మంచి రచయిత కాదగ్గ రచయిత అనిపిస్తుంది. కథ కట్టడం తెలుసు. కథకు అవసరమైన భాష తెలుసు. లాలిత్యమైన కథనం, సుతిమెత్తనైన వరుస, చెప్పాల్సింది ముఖం మీద బాదినట్టుగా కాకుండా మెల్లగానే అలాగని స్పష్టంగా చెప్పే గుణం.... ఇవన్నీ ఊహాచిత్రంలో కనపడతాయి. మధ్యతరగతిలో ఉండే దొంతరల మధ్య ఊపిరాడక చిక్కుబడిన గాలిని విడుదల చేయజూసిన కథలు ఇవి. తప్పించుకోవాల్సినవి తెలియజేయడం, సర్దుకుపోవాల్సినవాటితో సర్దుకుపోవడం నేర్పిస్తాయివి. చిన్న సెంటిమెంట్‌ను తట్టి లేపడం కూడా ఒక సుగుణమే. ‘స్వప్న శేషం’, ‘ఊహాచిత్రం’, ‘ఐదు వందల రూపాయల నోటు’, ‘చినుకులా రాలి’... రచయిత సామర్థ్యాన్ని చూపుతాయి. అనవసర కపటత్వాలను వదిలి మనిషి తన నిజమైన ఆనందాన్ని వెతుక్కోవడానికి దోవ చూపే కథలు ఇవి. చదవతగ్గవి. వెల: రూ.120/- ప్రతులకు: 9966907771 ఉత్తమ లాటిన్ అమెరికన్ కథలు.... లాటిన్ అమెరికా చుట్టూ ఉండే మార్మిక ఆకర్షణ మరో భూభాగానికి లేదు. అక్కడి వీరులు ప్రపంచాన్ని అలాగే ఆకర్షించారు. అక్కడ భాష, భావజాలం, ఉద్యమాల ఊపు కూడా. సాహిత్యం ఏం తక్కువని. మార్కెజ్ (మార్క్వెజ్ అనకూడదట) తన కలంతో మేజిక్ రియలిజాన్ని సృష్టించి ప్రపంచానికి ఎక్కించాడు. బోర్హెస్ ఇక్కడి నుంచే తన కథలతో ప్రపంచమంతా వ్యాపించాడు. గద్దలకు ఏమీ తోచకపోతే వాలే ఈ నేల మీద నిలబడి అక్కడి ప్రజలు నిత్యం పహారా కాస్తూ గద్దల రాకను హెచ్చరించే కథలెన్నింటినో రాస్తూనే ఉన్నారు. అలాంటి 20 కథలను నిజాయితీగా అనువాదం చేసి అందించారు ‘ఎలనాగ’. సాధారణంగా భారతీయ కథలో కనిపించని ఎక్స్ప్రెషన్, దృశ్యాలని కత్తిరించి తిరగేసి చెప్పడం ఇక్కడి రచయితలు చేశారు. అసలు ఈ కథల్లోకి సంచరించడమే పూర్తిగా కొత్త. కథాభిమానులకు ఇది మంచి కానుక. వెల: రూ.150 ప్రతులకు: 9866945424 -
బ్రేక్ ఫెయిలై సిటీబస్సు బీభత్సం
= కానూరు వద్ద మూడు కార్లు ధ్వంసం = వాహనాల తనిఖీ సమయంలో ఘటన = మహిళకు గాయాలు = ఘటనాస్థలి నుంచి బ్రేక్ ఇన్స్పెక్టర్, సిబ్బంది అదృశ్యం పెనమలూరు, న్యూస్‌లైన్ : కానూరు గ్రామ పరిధి బందరురోడ్డుపై బుధవారం ఉయ్యూరు బ్రేక్ ఇన్స్పెక్టర్ వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో జరిగిన తొందరపాటు కారణంగా సిటీ బస్సు అదుపుతప్పి మూడు కార్లను ఢీకొట్టింది. ఈ ఘటన జరగటానికి రవాణా శాఖ అధికారులే కారణమని స్థానికులు తిరగబడటంతో బ్రేక్ ఇన్స్పెక్టర్ అక్కడినుంచి పరారయ్యారు. పెనమలూరు పోలీసుల కథనం ప్రకారం.. కానూరు కేసీపీ కాలనీ వద్ద కొద్ది రోజులుగా రవాణాశాఖ అధికారులు వాహనాల రికార్డులు తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగా కంకిపాడు నుంచి విజయవాడ వెళుతున్న వాహనాన్ని రవాణా శాఖ సిబ్బంది ఆకస్మికంగా ఆపారు. దీంతో దాని వెనుక ఉన్న రెండు కార్లు కూడా షడన్ బ్రేక్‌వేసి ఆగాయి. వాటి వెనుక కంకిపాడు నుంచి వస్తున్న 150 సిటీ బస్సు బ్రేక్‌లు పడక ఎదురుగా ఆగిన రెండు కార్లను ఢీకొట్టింది. అనంతరం బస్సు అదుపుతప్పి విజయవాడ నుంచి ఎదురుగా వస్తున్న బసవ సతీష్‌రెడ్డికి చెందిన కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బసవ సతీష్‌రెడ్డి కొత్త మారుతీ కారు ధ్వంసమైంది. ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవటంతో అందులో ఉన్న వారికి పెద్ద ప్రమాదం తప్పింది. అయితే కారులో ఉన్న కె.వాణి అనే వృద్ధురాలి తలకు గాయమైంది. ఈ ప్రమాదంతో బందరు రోడ్డుపై మూడు కార్లు అడ్డంగా తిరిగిపోయి బీభత్స వాతావరణాన్ని తలపించింది. దీంతో ఆ మార్గంలో దాదాపు రెండు గంటలపాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి. రవాణాశాఖ అధికారులపై ప్రజల ఆగ్రహం కాగా ఈ ప్రమాదం జరగటానికి రవాణాశాఖ అధికారులే కారణమని పేర్కొంటూ అక్కడే ఉన్న ఉయ్యూరు బ్రేక్ ఇన్స్పెక్టర్ శివకామేశ్వరరావుపై తిరగబడ్డారు. గత కొద్ది రోజులుగా వాహనాల తనిఖీల పేరుతో సొమ్ము దండుకుంటూ వాహన యజమానులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని విరుచుకుపడ్డారు. దీంతో ఆయన తన కారును వదిలి చాకచక్యంగా తప్పించుకుని జనాల్లో కలసి మాయమయ్యారు. రవాణాశాఖ సిబ్బంది కూడా అదే పని చేశారు. ఘటనాస్థలి వద్దకు వెళ్లిన ‘న్యూస్‌లైన్’తో అక్కడ ఉన్నవారు మాట్లాడుతూ రవాణాశాఖ అధికారుల కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. కాగా ఈ ఘటనపై కార్ల యజమానులు నగరంలోని మొగల్రాజపురానికి చెందిన బసవ సతీష్‌రెడ్డి, పమిడిముక్కలకు చెందిన కొండవీటి నాని, గుడివాడకు చెందిన గడ్డం మాణిక్యాలరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నెరవేరుతున్న కల
పాతసిటీ బస్సులతో విసిగిపోయిన పుణేవాసుల సుదీర్ఘ స్వప్నం నెరవేరబోతోంది. పుణేలో మెట్రోరైలు మార్గాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. మొదటి విడతలో స్వార్గేట్-పింప్రి-చించ్వాడ్ మధ్య 16.59 కిలోమీటర్ల కారిడార్ నిర్మిస్తారు. 2021 వరకు మొదటి ప్రాజెక్టు పనులు పూర్తవుతాయి. ఈ పనులను పర్యవేక్షించేందుకు ‘పుణే రైలు మెట్రో కార్పొరేషన్ కంపెనీ’ అనే ప్రత్యేక సంస్థను (స్పెషల్ పర్పస్ వెహికిల్) కూడా స్థాపించనున్నారు. సాక్షి, ముంబై/, పింప్రి, న్యూస్‌లైన్: పుణేవాసులకు శుభవార్త. మెట్రోరైలు మొదటివిడత ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రాజెక్టు పనులకు ఆమోదం లభించిందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దీంతో పుణేకర్లకు ముంబై, నాగపూర్ మాదిరిగానే మెట్రోరైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో మొదటి విడతలో స్వార్గేట్-పింప్రి-చించ్వాడ్ మధ్య 16.59 కిలోమీటర్ల కారిడార్ నిర్మిస్తారు. ఇందులో కొంతభాగం భూగర్భం నుంచి, మిగతాది ఉపరితలంపై నిర్మిస్తారు. రెండో విడత ప్రాజెక్టులో వనాజ్-రామ్వాడి మధ్య 14.92 కిలోమీటర్ల పొడవైన మార్గం నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు తొలివిడత పనులు 2021 వరకు పూర్తికానున్నాయి. ఇందుకు రూ.6,960 కోట్లు ఖర్చవుతాయి. రెండో విడత పనులకు 2021 వరకు రూ.3,223 కోట్లు ఖర్చవుతాయి. (2021 తరువాత వ్యయం పెరిగే అవకాశాలుంటాయి). ఇలా ఈ ప్రాజెక్టులకు రూ.10,183 కోట్లు ఖర్చవుతాయని అంచనావేశారు. ఈ వ్యయాన్ని పుణే, పింప్రి-చించ్వాడ్ కార్పొరేషన్లు 10 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం, కేంద్ర ప్రభుత్వం 20 శాతం భరిస్తాయి. మిగతా 50 శాతం నిధులను రుణాల రూపంలో సేకరించనున్నారు. ఇదిలా ఉండగా మెట్రో నిర్మాణ పనులకు మూడు సంవత్సరాల కిందట పుణే కార్పొరేషన్ సర్వసాధారణ సభలో మంజూరు లభించింది. మెట్రోమార్గాలను భూగర్భంలో నిర్మించాలా లేక ఉపరితలంపై నిర్మించాలా అనే విషయమై వాగ్వాదం మొదలయింది. స్వచ్ఛంద సంస్థలు భూగర్భమార్గాల కోసం పట్టుబట్టాయి. భూగర్భ ప్రాజెక్టులు చాలా ఖర్చుతో కూడుకున్నవి కావడంతో ఉపరితల మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందులో వనాజ్-రామ్వాడి రెండో విడత పనులకు ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా మొదటి విడత పనులకు మంజూరు లభించడంతో రెండో విడతకు కూడా మార్గం సుగమమయింది. ఈ పనులను పర్యవేక్షించేందుకు ‘పుణే రైలు మెట్రో కార్పొరేషన్ కంపెనీ’ అనే ప్రత్యేక సంస్థను (స్పెషల్ పర్పస్ వెహికిల్) కూడా స్థాపించనున్నారు. ఈ సంస్థ డెరైక్టర్‌ను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నియమిస్తాయి. ముంబై మాదిరిగానే పుణేలోనూ రోజురోజుకూ ట్రాఫిక్ గణనీయంగా పెరుగుతోంది. పాతసిటీ బస్సులతో పుణేకర్లు విసిగెత్తిపోయారు. దీంతో మెట్రో రైళ్లు ప్రవేశపెట్టాలని సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్ర కేబినెట్లో తీసుకున్న నిర్ణయంతో వారి కలలు త్వరలో నెరవేరనున్నాయి. -
ప్రతి బుధవారం ప్రజలతోనే ప్రయాణం
న్యూఢిల్లీ: ప్రతి బుధవారం తాను కార్లకు సెలవు ఇచ్చి మెట్రో రైలు లేదా సిటీ బస్సులో ప్రయాణించడం ద్వారా ఇంధన పొదుపుపై దేశ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ సంకల్పించారు. అక్టోబర్ 9 నుంచి ప్రతి బుధవారం తాను కార్యాలయానికి కారులో వెళ్లబోనని, మెట్రో రైలు లేదా సిటీ బస్సులో వెళతానని మొయిలీ శుక్రవారం ప్రకటించారు. ప్రతి బుధవారం ప్రత్యేక వాహనాలను వినియోగించకుండా ప్రజా రవాణా వ్యవస్థ ద్వారానే కార్యాలయాలకు వచ్చి ఇంధనం పొదుపు చేయాలని తన మంత్రిత్వ శాఖ పరిధిలోని 14 ప్రభుత్వ రంగ సంస్థల్లోని అధికారులు, సిబ్బంది అందరికీ మొయిలీ సూచించారు. ఇందులో నిర్బంధం ఏమీ లేదని, స్వచ్ఛందంగా ఇంధనం పొదుపు ఉద్యమంలో పాల్గొనమని కోరుతున్నానని, ఈ మేరకు సర్క్యులర్ జారీ అవుతుందన్నారు. వాస్తవానికి.. ఇంధన పొదుపుపై ప్రజల్లో చైతన్యాన్ని రగిలించే లక్ష్యంతో అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు ప్రచారోద్యమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. రూ. 52 కోట్ల ఖర్చుతో ఆరు వారాలపాటు సాగే ఈ ప్రచారోద్యమం ప్రారంభానికి ముందే తాను వారానికోరోజు ఇంధనం పొదుపు పాటిస్తానని మొయిలీ ప్రకటించడం విశేషం. వారానికో రోజు వ్యక్తిగత వాహనాలకు సెల విచ్చి బస్సు ద్వారా ప్రయాణించాలని కోరారు. ఇంధన పొదుపు పాటించడం ద్వారా ఏటా 500 కోట్ల డాలర్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయాలని దేశ ప్రజలకు మొయిలీ పిలుపునిచ్చారు. గత ఆర్థిక సంవత్సరంలో చమురు దిగుమతికి 14వేల కోట్ల డాలర్ల విదేశీ మారద్రవ్యాన్ని వెచ్చించింది. మరే ఇతర అంశంపైనా ఇంత పెద్దమొత్తంలో విదేశీ మారకద్రవ్యం ఖర్చవడం లేదు. ట్రాఫిక్ రద్దీతో ఇబ్బంది లేకుండా ఉండేలా ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేయాల్సిందిగా కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు మొయిలీ విజ్ఞప్తి చేశారు. నగరాల్లో ఉచిత సైకిల్ పథకాలను ప్రవేశపెట్టి ఇంధన పొదుపునకు దోహదపడాలని పట్టణాభివృద్ధి శాఖకు సూచించారు. ఢిల్లీలోని మొయిలీ నివాసానికి దగ్గర్లోనే మెట్రో రైలు స్టేషన్ ఉంది. అక్కడి నుంచి సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్‌కు మెట్రో రైలులో వెళితే.. కూతవేటు దూరంలోనే ఆయన కార్యాలయం ఉన్న శాస్త్రి భవన్ ఉంటుంది. సిటీ బస్సులో కూడా కార్యాలయానికి వెళ్లడానికి వీలుంది. -
గుంటురు జిల్లా నారాకోడూరులో బైక్‌ను ఢీకొట్టిన సిటీ బస్సు
చేబ్రోలు, తెనాలి రూరల్, న్యూస్‌లైన్: ఉదయాన్నే కళాశాలకు బయలుదేరిన ఇంజినీరింగ్ విద్యార్థుల పాలిట సిటీ బస్సు మృత్యుశకటమైంది. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారిని ఢీకొట్టింది. గుంటురు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు శివారులోని సీఎంఎస్ హాస్టల్ ఎదురుగా తెనాలి రోడ్డులో గురువారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. ఈ విషాద ఘటన తోటి విద్యార్థులు, మృతుల కుటుంబ సభ్యులను కలచివేసింది. పోలీసుల కథనం ప్రకారం..రణస్థలానికి చెందిన వి.భార్గవ్‌నాయుడు (18) గుంటూరు కొత్తపేటకు చెందిన ఎన్.గోపీకృష్ణ(18), శీలం శెట్టి శివరామకృష్ణ(18), అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన తేజ్బాషా(18) వడ్లమూడి విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో బి.టెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేపధ్యంలో కొద్ది రోజులుగా కళాశాలలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. వీటికి హాజరుకావడానికి గోపీకృష్ణ, శివరామకృష్ణ, భార్గవ్, బాషా కలిసి ఒకే ద్విచక్రవాహనంపై కళాశాలకు బయలుదేరారు. నారాకోడూరు తెనాలి రోడ్డులోని సీఎంఎస్ హాస్టల్ వద్ద ఎదురుగా వస్తున్న సిటీ బస్సు వీరిని ఢీ కొట్టింది. ఇద్దరు విద్యార్థులు అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరిని తెనాలి వైద్యశాలకు తరలిస్తుండగా మరణించారు. మృతదేహాలకు తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం చేపట్టి బంధువులకు అప్పగించారు. ప్రమాద విషయం తెలుసుకున్న విజ్ఞాన్ విద్యార్థులు తెనాలి రోడ్డులో గురువారం మధ్యాహ్నం కొద్ది సేపు రాస్తారోకో నిర్వహించారు. ప్రమాదంలో మరణించిన జిల్లాకు చెందిన భార్గవ్ తండ్రి రెవెన్యూ శాఖలో తహశీల్దార్ స్థాయిలో విజయనగరంలో పని చేస్తున్నారు.