ఏదీ చార్జీల పట్టిక? | No Ticket Prices in TS RTC City Busses | Sakshi
Sakshi News home page

ఏదీ చార్జీల పట్టిక?

Published Fri, Oct 11 2019 12:26 PM | Last Updated on Fri, Oct 11 2019 1:03 PM

No Ticket Prices in TS RTC City Busses - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: సిటీ బస్సుల్లో చార్జీల పట్టిక ప్రదర్శించాలని సాక్షాత్తు రవాణాశాఖ మంత్రి ఆదేశాలు బేఖాతరయ్యాయి. గురువారం నగరంలోని ఏ బస్సులోనూ పట్టిక కనిపించకపోగా.. తాత్కాలిక సబ్బంది యథావిధిగా తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. ఇష్టారాజ్యంగా చార్జీల దోపిడీకి తెగబడ్డారు. బస్‌పాస్‌లను అనుమతించడం లేదు. ఆర్టీసీ నిర్వహణ తీరు అస్తవ్యస్తంగా మారింది. అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రవాణా మంత్రి ప్రకటించారు. ప్రతి బస్సులోనూ స్టేజీ నుంచి స్టేజీ వరకు చార్జీల పట్టికను ప్రదర్శించాలని చెప్పారు. కానీ ఇలాంటి చార్జీల పట్టికలు అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రయాణికులు తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లు అడిగినంత చెల్లించక తప్పడం లేదు. ఇటు సిటీ బస్సుల్లోనూ, అటు దూరప్రాంతాల నుంచి వచ్చే బస్సుల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. గత ఆరు రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. స్కూల్‌ బస్సులు, టూరిస్టు, కాంట్రాక్ట్‌ బస్సులకు తాత్కాలిక పర్మిట్లను ఇచ్చారు. మ్యాక్సీ క్యాబ్‌లు, మినీ బస్సులను  ప్రజారవాణా వాహనాలుగా వినియోగిస్తున్నారు. వీటితో ఆర్టీసీలోని అద్దె బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి.

అలాగే తాత్కాలిక ప్రాతిపదికపైన నియమితులైన కండక్టర్లు, డ్రైవర్ల సహాయంతో ఆర్టీసీ బస్సులను అందుబాటులోకి  తెచ్చారు. ఇలా ఆర్టీసీ గ్రేటర్‌ జోన్‌లో ప్రతిరోజు సగటున 1000 నుంచి 1100 బస్సులు తిరుగుతున్నాయి. 2000 మంది ప్రైవేట్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌కు అనుగుణంగా బస్సులను నడుపుతున్నారు. కండక్టర్‌కు రోజుకు రూ.1000, డ్రైవర్‌కు రూ.1500 చొప్పున చెల్లిస్తున్నారు. అయినప్పటికీ  తాత్కాలిక సిబ్బంది టికెట్ల రూపంలో వసూలు చేసిన నగదును జేబులో వేసుకుంటున్నారు. పైగా తక్కువ దూరానికే అదనపు చార్జీ వసూలు చేస్తూ చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. చార్జీల దోపిడీపై ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల ప్రయాణికులు నేరుగా పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. మరి కొన్నిచోట్ల ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. అధిక చార్జీలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రతి బస్సులో చార్జీల పట్టికను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే అన్ని రకాల బస్‌పాస్‌లను అనుమతించాలని ప్రకటించారు. కానీ ఈ ఆదేశాలు ఎక్కడా అమలుకు నోచుకోలేదు. 

కనిపించని నియంత్రణ వ్యవస్థ
గ్రేటర్‌ హైదరాబాద్‌లో మొత్తం 29 డిపోల్లో 19,903 మంది  ఉద్యోగులు ఉన్నారు. వీరంతా డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, శ్రామిక్‌లు, సూపర్‌వైజర్లు, చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌లు, అసిస్టెంట్‌ డిపోమేనేజర్‌ తదితర కేటగిరీల్లో పనిచేస్తున్నారు. కానీ సమ్మె నేపథ్యంలో ప్రస్తుతం 58 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. వీరిలో డిపో మేనేజర్‌లు, డివిజనల్‌ మేనేజర్‌లు, రీజనల్‌ మేనేజర్‌లు, షెడ్యూలింగ్‌ అధికారులు, డిప్యూటీ చీఫ్‌ పర్సనల్‌ మేనేజర్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వంటి ఉన్నత, మధ్య శ్రేణి అధికారులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. సాధారణంగా బస్సుల నిర్వహణలో సూపర్‌వైజర్లు, చీఫ్‌ ఇన్‌స్పెక్టర్లు, కంట్రోలర్‌ వంటి  ఉద్యోగులు నిర్వహించే విధులు కీలకమైనవి. అలాగే బస్సుల్లో టిమ్స్‌ యంత్రాల ద్వారా టిక్కెట్‌లు ఇవ్వడం వల్ల  బస్సులో ప్రయాణం చేసిన వారు, టిక్కెట్‌పై లభించిన ఆదాయం వంటి వివరాలు లభిస్తాయి. కానీ ప్రస్తుతం ఈ యంత్రాంగం ఏదీ లేదు. కేవలం బస్సులను డిపోల్లోంచి బయటకు తీసి రోడ్డెక్కించడమే లక్ష్యంగా అధికారులు పని చేస్తున్నారు. దీంతో ప్రైవేట్‌ సిబ్బంది దోపిడీని నియంత్రించే వ్యవస్థ కొరవడింది. అలాగే క్షేత్రస్థాయిలో బస్సుల నిర్వహణను పర్యవేక్షించే యంత్రాంగం, నిఘా కూడా లేకపోవడంతో ఏ బస్సులో ఎంత చార్జీ వసూలు చేస్తున్నారనే లెక్కలు లేకుండా పోయాయి.

మొదలైన తిరుగు ప్రయాణాలు
మరోవైపు దసరా సందర్భంగా సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లలో రద్దీ నెలకొంటోంది. అలాగే వివిధ జిల్లాల నుంచి నగరానికి వస్తున్న ప్రైవేట్, ఆర్టీసీ  బస్సుల్లోనూ రద్దీ భారీగానే ఉంటోంది. రైలు దిగిన ప్రయాణికులు సకాలంలో బస్సులు లభించక ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. సిటీ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లుగానే ప్రైవేట్‌ వాహనాల్లోనూ  దోపిడీ కొనసాగుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటు ఆర్టీసీ బస్సులు, అటు ప్రైవేట్‌ వాహనాలు ప్రయాణికులను ఎడాపెడా దోచుకోండం గమనార్హం.  

ఆర్టీసీకి భారీ నష్టమే..
ప్రైవేట్‌ సిబ్బంది తీరు వల్ల ప్రయాణికులపైన భారం పడడమే కాకుండా ఆర్టీసీకి సైతం తీవ్ర నష్టం వాటిల్లుతోంది. బస్సులను నడుపుతున్నప్పటికీ రోజుకు రూ.20 లక్షలకు మించి ఆదాయం రావడం లేదు. అందులోనూ చాలా వరకు ప్రైవేట్‌ సిబ్బంది దినసరి వేతనాల చెల్లింపులకే సరిపోతుంది. ‘కొన్ని రూట్‌లలో బస్సులకు వినియోగించిన డీజిల్‌ ఖర్చు కూడా లభించడం లేద’ని ఓ డిపో మేనేజర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement