సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల సమయాల్లో మార్పులు చేసింది. హైదరాబాద్‌లో సిటీ బస్సులు తిరిగే సమయాన్ని కుదించింది. తెల్లవారుజామున 4 గంటలకే మొదలయ్యే సర్వీసుల సమయాన్ని 6 గంటలకు మార్చింది. తిరిగి రాత్రి 7 గంటలకల్లా చివరి ట్రిప్పు పూర్తయ్యేలా షెడ్యూల్ రూపొందించింది.
మొత్తంగా రాత్రి 9 కల్లా బస్సులు డిపోలకు చేరనున్నాయి. కొన్ని సిటీ సర్వీసులు నైట్ హాల్ట్ సర్వీసులుగా నడుస్తుండగా ఇకపై అవి రాత్రి 9 గంటలకల్లా చివరి ట్రిప్పు ముగించేలా సమయాన్ని మారుస్తారు. మరోవైపు జిల్లా, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు యథావిధిగా నడవనున్నాయి. రాత్రి కర్ఫ్యూ మొదలవక ముందే బయలుదేరి.. కర్ఫ్యూ సమయంలో గమ్యం చేరే బస్సులు బస్టాండ్లలో ప్రయాణికులను దింపాక వారు ఇళ్లకు వెళ్లేందుకు ఆటోలు, క్యాబ్‌లు వినియోగించుకోవచ్చు. అయితే ప్రయాణ టికెట్‌ను చూపాల్సి ఉంటుంది.
రిజర్వేషన్ ఉంటేనే..
హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఎక్కువగా రాత్రిపూటనే బయలుదేరుతాయి. ఈ సర్వీసులు యథావిధిగా నడుస్తాయి. కర్ఫ్యూ ఉన్నా బస్సుల్లో ప్రయాణించాల్సిన వారు ప్రయాణ టికెట్‌ను చూపించి బస్టాండ్లకు చేరుకోవచ్చు. తగినంత మంది ప్రయాణికులు ఉంటేనే బస్సులు రాత్రి వేళ నడుస్తాయని, లేకుంటే రద్దవుతాయని అధికారులు తెలిపారు. దీనిపై ముందుగా సమాచారం ఇస్తామని, టికెట్ డబ్బులను వాపస్ చేస్తామని పేర్కొన్నారు.
యథావిధిగా రైళ్లు: రాత్రి కర్ఫ్యూతో ప్రమేయం లేకుండా రైళ్లు యథావిధిగా నడవనున్నాయి. కర్ఫ్యూ వేళల్లో స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు చెక్‌పోస్టుల వద్ద పోలీసులకు టికెట్లు చూపాలి. స్టేషన్ల వద్ద ప్రీపెయిడ్ ఆటోలు, ట్యాక్సీలకు అనుమతి ఇవ్వాలని రైల్వే అధికారులు పోలీసులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment