City bus service
-
ఇక్కడ బస్టాప్ ఎక్కడుందబ్బా.. కనిపించట్లేదు!
సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సులే కాదు.. బస్టాపులు కూడా ఉన్నపళంగా మాయమవుతున్నాయి. ఇప్పుడు ఏ బస్సు ఎక్కడ ఆగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మెట్రో రైలు, ఫ్లైవర్ నిర్మాణ పనుల కారణంగా నగరంలో ప్రజారవాణా స్వరూపం పూర్తిగా మారిపోయింది. గ్రేటర్లో సుమారు 1,050 రూట్లలో బస్సులను నిలిపి ప్రయాణికులను తీసుకెళ్లేందుకు గతంలో 2,550కుపైగా బస్టాపులు ఉండేవి. విస్తరిస్తున్న మహానగర అవసరాలను దృష్టిలో ఉంచుకొంటే వీటి సంఖ్య చాలా తక్కువ అనే చెప్పాలి. రోజురోజుకూ కొత్త కాలనీలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో సిటీ బస్సులు, బస్టాపులు పెరగాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా వాటి సంఖ్య పెద్ద మొత్తంలో తగ్గిపోవడం గమనార్హం. గత రెండేళ్లలో సుమారు 850కిపైగా బస్టాపులను తొలగించినట్లు అంచనా. మరోవైపు కొన్ని రూట్లలో షెల్టర్లు ఉన్న చోట డ్రైవర్లు బస్సులు నిలపడంలేదు. అభివృద్ధి పనుల దృష్ట్యా మార్పులు అనివార్యమే. కానీ.. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టకుండానే బస్టాపులను తొలగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బస్సులు నిలిపే స్థలాలు తెలియకపోవడంతో గందరగోళం నెలకొంటోంది. మచ్చుకు కొన్ని ప్రాంతాలు.. ► వీఎస్టీ నుంచి ఇందిరా పార్కు వరకు సిటీ బస్సులు నిలిపేందుకు ఆరు చోట్ల బస్టాపులు ఉన్నాయి. ఉప్పల్ నుంచి మెహిదీపట్నం, జియాగూడ, దిల్సుఖ్నగర్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే బస్సులు, సికింద్రాబాద్ నుంచి కోఠీకి ఈ రూట్లో బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఈ మార్గంలో కొంతకాలంగా జరుగుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనులతో బస్టాపులు ఉనికిని కోల్పోయాయి. ఏ బస్సు ఎక్కడ ఆగుతుందో తెలియదు, ఒకప్పుడు వీఎస్టీ బస్టాపులో పదుల సంఖ్యలో ప్రయాణికులు బస్సు కోసం ఎదురు చూసేవారు. ఇప్పుడు అక్కడ ప్రయాణికులు కనిపించడం లేదు. ►లక్డీకాపూల్ ఒకప్పుడు అతిపెద్ద బస్టాపు. నగరం నలువైపుల నుంచి బస్సులు, ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండేది. మెట్రో రైలు కోసం బస్టాపులను తొలగించారు. ఒక్క లక్డీకాఫూల్ మాత్రమే కాదు. మాసాబ్‌ట్యాంక్, విజయ్‌నగర్ కాలనీ, ఎన్ఎండీసీ బస్టాపులు కూడా మాయమయ్యాయి. ►హబ్సిగూడ స్ట్రీట్ నంబర్– 8 వద్ద ఒక బస్టాపు ఉండేది. ఇప్పుడు అక్కడ మెట్రో స్టేషన్ వచి్చంది. దీంతో ఆ ఇరుకు రోడ్డుపైనే బస్సులు నిలపడం వల్ల ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ► ఫ్లై ఓవర్ రాకతో ఎల్బీనగర్ స్వరూపం మారింది, చాలా చోట్ల బస్టాపుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. జూపార్కు వద్ద ప్రస్తుతం ఫ్లై ఓవర్ పనులను చేపట్టారు. దీంతో ఆ రూట్ లో బస్సులకు బ్రేక్ పడింది. కానీ అదేసమయంలో ప్రైవేట్ వాహనాలకు ఇప్పుడు బహదూర్‌పురా చౌరస్తా ఒక ప్రధాన అడ్డాగా మారింది. ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండానే చేపడుతున్న అభివృద్ధి పనుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సర్వీసుల్లోనూ కోత... బస్టాపుల తీరు ఇలా ఉంటే.. సిటీ బస్సుల సేవలు కూడా అందుకు తగినవిధంగానే ఉన్నాయి. వందలకొద్దీ రూట్లలో ట్రిప్పుల సంఖ్య గణనీయంగా తగ్గింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న శివారు ప్రాంతాలకు, గ్రామాలకు రాకపోకలు సాగించే సుమారు 5 వేలకుపైగా ట్రిప్పులను రద్దు చేశారు. ►షాద్‌నగర్, మేడ్చల్, ఘట్కేసర్, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, చేవెళ్ల తదితర ప్రాంతాల వైపు ఉన్న సుమారు 100కు పైగా గ్రామాలకు 70 శాతం సరీ్వసులు రద్దయ్యాయి. ►గతంలో గ్రేటర్లో 3,850 బస్సులు, ప్రతి రోజు 42 వేల ట్రిప్పులు తిరిగితే ఇప్పుడు వాటి సంఖ్య 2,700 పరిమితమైంది. వివిధ కారణాలతో కనీసం 10 వేలకు పైగా ట్రిప్పులు రద్దయ్యాయి. -
సిటీ బస్సులు తిరిగేది ఇక ఈ సమయంలోనే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల సమయాల్లో మార్పులు చేసింది. హైదరాబాద్‌లో సిటీ బస్సులు తిరిగే సమయాన్ని కుదించింది. తెల్లవారుజామున 4 గంటలకే మొదలయ్యే సర్వీసుల సమయాన్ని 6 గంటలకు మార్చింది. తిరిగి రాత్రి 7 గంటలకల్లా చివరి ట్రిప్పు పూర్తయ్యేలా షెడ్యూల్ రూపొందించింది. మొత్తంగా రాత్రి 9 కల్లా బస్సులు డిపోలకు చేరనున్నాయి. కొన్ని సిటీ సర్వీసులు నైట్ హాల్ట్ సర్వీసులుగా నడుస్తుండగా ఇకపై అవి రాత్రి 9 గంటలకల్లా చివరి ట్రిప్పు ముగించేలా సమయాన్ని మారుస్తారు. మరోవైపు జిల్లా, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు యథావిధిగా నడవనున్నాయి. రాత్రి కర్ఫ్యూ మొదలవక ముందే బయలుదేరి.. కర్ఫ్యూ సమయంలో గమ్యం చేరే బస్సులు బస్టాండ్లలో ప్రయాణికులను దింపాక వారు ఇళ్లకు వెళ్లేందుకు ఆటోలు, క్యాబ్‌లు వినియోగించుకోవచ్చు. అయితే ప్రయాణ టికెట్‌ను చూపాల్సి ఉంటుంది. రిజర్వేషన్ ఉంటేనే.. హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఎక్కువగా రాత్రిపూటనే బయలుదేరుతాయి. ఈ సర్వీసులు యథావిధిగా నడుస్తాయి. కర్ఫ్యూ ఉన్నా బస్సుల్లో ప్రయాణించాల్సిన వారు ప్రయాణ టికెట్‌ను చూపించి బస్టాండ్లకు చేరుకోవచ్చు. తగినంత మంది ప్రయాణికులు ఉంటేనే బస్సులు రాత్రి వేళ నడుస్తాయని, లేకుంటే రద్దవుతాయని అధికారులు తెలిపారు. దీనిపై ముందుగా సమాచారం ఇస్తామని, టికెట్ డబ్బులను వాపస్ చేస్తామని పేర్కొన్నారు. యథావిధిగా రైళ్లు: రాత్రి కర్ఫ్యూతో ప్రమేయం లేకుండా రైళ్లు యథావిధిగా నడవనున్నాయి. కర్ఫ్యూ వేళల్లో స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు చెక్‌పోస్టుల వద్ద పోలీసులకు టికెట్లు చూపాలి. స్టేషన్ల వద్ద ప్రీపెయిడ్ ఆటోలు, ట్యాక్సీలకు అనుమతి ఇవ్వాలని రైల్వే అధికారులు పోలీసులను కోరారు. చదవండి: ఈ బస్సు ఎక్కడికీ వెళ్లదు.. ఎందుకంటే పక్కాగా తెలంగాణ అంతటా కర్ఫ్యూ -
బస్సేది.. ఎలా వెళ్లేది..?
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో ప్రజారవాణా మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కోవిడ్ కారణంగా నిలిచిపోయిన సిటీ బస్సులు 8 నెలల తర్వాత కూడా పూర్తిస్థాయిలో రోడ్డెక్కలేదు. నగరంలోని వివిధ ప్రాంతాలను కలిపే ఎంఎంటీఎస్ రైళ్లూ పట్టాలెక్కలేదు. మెట్రో రైళ్లు తప్ప ప్రయాణికులకు మరో ప్రత్యామ్నాయం లేదు. శివారు కాలనీలు, గ్రామాలను నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు అనుసంధానం చేసే సిటీ బస్సులు రద్దయ్యాయి. దీంతో రాత్రి 8 గంటలు దాటితే సిటీలో చిక్కుకున్న ప్రయాణికులు ఇళ్లకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు ఆటోలు, క్యాబ్ నిర్వాహకులు రెట్టింపు చార్జీలతో ప్రయాణికులకు చుక్కలు చూపుతున్నారు. ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నారు. ప్రధాన మార్గాల్లోని మెట్రోస్టేషన్లకు అనుసంధానంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ కార్యాచరణకు నోచుకోలేదు. ‘చక్ర బంధం’లో సిటీ బస్సు.. ⇔ కోటికి పైగా జనాభా, 625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న గ్రేటర్ అవసరాల మేరకు కనీసం 7,500 బస్సులు అవసరం. రోజురోజుకూ వందల కొద్దీ కొత్త కాలనీలు నగరంలో విలీనమవుతున్నాయి. కానీ ఇందుకు అనుగుణంగా ప్రజారవాణా సదుపాయాల విస్తరణ మాత్రం జరగడం లేదు. ⇔ ఐటీ హబ్ విస్తరణతో పాటు ఫార్మాసిటీ వంటి కొత్త ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. దీంతో ఇటు పటాన్చెరు నుంచి సదాశివపేట వరకు, అటు ఘట్కేసర్ నుంచి బీబీనగర్ చుట్టుపక్కల ఉన్న పల్లెలకు హైదరాబాద్‌తో కనెక్టివిటీ తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం సిటీ బస్సులు లేకపోవడం వల్ల ప్రజలు సెవెన్ సీటర్ ఆటోలు, టాటా ఏస్‌లు వంటి వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. మనుగడ ప్రశ్నార్థకం.. ⇔ గతేడాది ఆర్టీసీ కార్మికులు సుదీర్ఘమైన సమ్మె చేపట్టారు. అప్పటి వరకు నగరంలో ప్రతిరోజూ 3,550 బస్సులు 33 లక్షల మందికి రవాణా సదుపాయాన్ని కలి్పంచేవి. 44 వేలకు పైగా ట్రిప్పులు తిరిగేవి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రయాణికులకు సిటీ బస్సులు అందుబాటులో ఉండేవి. ⇔ ఏ రాత్రయినా సరే ఇల్లు చేరుకుంటామనే భరోసా ప్రయాణికులకు ఉండేది. ముఖ్యంగా మహిళలు, సీనియర్ సిటిజన్లు ఎలాంటి భయం లేకుండా సిటీ బస్సుల్లో రాకపోకలు సాగించారు. ⇔ సుదీర్ఘ కార్మికుల సమ్మె తర్వాత సిటీ బస్సుల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. 800 బస్సులను పూర్తిగా విస్మరించారు. నగర శివార్లలోని పల్లెలకు రాకపోకలు సాగించే సుమారు 250 ⇔ దీంతో ఇబ్రహీంపట్నం, శంకరపల్లి, చేవెళ్ల, కీసర, పటాన్చెరు, ఘట్కేసర్ తదితర ప్రాంతాల చుట్టూ ఉన్న పల్లెలకు 80 శాతానికి పైగా సిటీ బస్సులు వెళ్లడం లేదు. పిడుగుపాటుగా ‘కోవిడ్’.. ⇔ రవాణా నిపుణుల అంచనా మేరకు గ్రేటర్ అవసరాల మేరకు 7,500 బస్సులు అవసరం. కానీ ఇప్పుడు ఉన్నవి 2,750 మాత్రమే. పైగా కోవిడ్ దృష్ట్యా దశలవారీగా బస్సులను పునరుద్ధరిస్తున్నారు. ఇప్పటి వరకు 50 శాతం బస్సులే రోడ్డెక్కాయి. ⇔ గతంలో రోజుకు 33 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తే ఇప్పుడు కనీసం 15 లక్షల మందికి కూడా సిటీ బస్సు సౌకర్యం లేకుండా పోయింది. ⇔ సాధారణంగానే ప్రతిరోజూ రూ.కోటి నష్టంతో నడుస్తున్న సిటీ బస్సులకు ఆర్టీసీ కారి్మకుల సమ్మె, కోవిడ్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ మరిన్ని నష్టాలను తెచి్చపెట్టింది. ప్రస్తుతం గ్రేటర్ ఆర్టీసీ రూ.550 కోట్లకు పైగా నష్టాల్లో ఉంది. ⇔ బస్సుల సంఖ్య తగ్గించడంతో పాటు సుమారు 2 వేల మందికి పైగా కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లను కూడా విధుల నుంచి తప్పించి డిపో అటెండర్లుగా, బంకుల నిర్వాహకులుగా, కార్గో బస్సు సిబ్బందిగా మార్చారు. ఎంఎంటీఎస్ ఎక్కడ? ⇔ ప్రతిరోజూ 1.5 లక్షల మందికి రవాణా సదుపాయంఅందజేసే 121 ఎంఎంటీఎస్ సర్వీసులు కూడా ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విస్తరణకు నోచుకోని ఎంఎంటీఎస్.. కోవిడ్ కారణంగా ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేశారు. గతంలో రోజుకు 121 సరీ్వసులు, 1.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఫలక్‌నుమా-లింగంపల్లి, నాంపల్లి-లింగంపల్లి, సికింద్రాబాద్-లింగంపల్లి మార్గాల్లో సర్వీసులు ఉన్నాయి. నగర శివారు ప్రాంతాలకు కనెక్టివిటీ కల్పించే రెండో దశ ఎంఎంటీఎస్ విస్తరణ ఇప్పటికీ నోచుకోలేదు. ఘట్కేసర్–సికింద్రాబాద్, పటాన్చెరు-తెల్లాపూర్, సికింద్రాబాద్-బొల్లారం వంటి మార్గాల్లో లైన్లు పూర్తయినా రైళ్లు మాత్రం పట్టాలెక్కలేదు. నిధుల కొరత ఈ ప్రాజెక్టును వెంటాడుతోంది. ఆర్టీసీపై మెట్రో ప్రభావం గ్రేటర్ ఆర్టీసీపై మెట్రో ప్రభావం కూడా పడింది. ప్రస్తుతం నాగోల్– రాయదుర్గం, జేబీఎస్–ఎంజీబీఎస్, ఎల్బీనగర్–మియాపూర్ రూట్లలో ప్రతిరోజూ 57 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం సుమారు 1200 ట్రిప్పుల్లో ప్రయాణికులకు రవాణా సదుపాయం ఉంది. ప్రస్తుతం కోవిడ్ వల్ల ప్రయాణికుల రద్దీ తగ్గినప్పటికీ సాధారణ రోజుల్లో 3.5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. గతంలో హైటెక్‌సిటీ, కొండాపూర్, మాదాపూర్, జేఎన్టీయూ తదితర రూట్లలో ఏసీ బస్సుల్లో ప్రయాణం చేసిన వాళ్లు క్రమంగా మెట్రోవైపు మళ్లారు. దీంతో ఆ రూట్లలో తిరిగిన సుమారు 35 ఏసీ బస్సులను ఆర్టీసీ విరమించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఈ బస్సులు నడుస్తున్నాయి. ఉపాధి కోసం నగరానికి వెళ్లేవారు గతంలో మా ఊరిలో ఆర్టీసీ బస్సు రాత్రి బస చేసేది. ఉదయమే చాలామంది నగరానికి ఉపాధి కోసం వెళ్లేవారు. గ్రామం నుంచి మెహిదీపట్నం వరకు బస్సు నడిపించేవారు. ఆ బస్సును నిలిపివేయడంతో గ్రామస్తులు ఆటోల్లో ప్రయాణిస్తున్నారు. చార్జీలు అధికంగా ఉండటంతో ఇబ్బంది పడుతున్నారు. పలుమార్లు ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు. రాత్రివేళలో ఆటోలు లేక తిప్పలు తప్పడం లేదు. పాత సరీ్వసులను పునరుద్ధరించాలి. – పులకంటి భాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీ చౌదరిగూడ, ఘట్కేసర్ మా ఊరికి ఆటోలు రావు మాది మజీద్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అనుబంధంగా ఉండే పీర్లగూడెం. మండల కేంద్రానికి 8 కిలోమీటర్లు. గ్రామ పంచాయతీకి 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మాములు రోజుల్లో మా గ్రామానికి రోజుకు రెండుసార్లు మాత్రమే బస్సు వచ్చేది. కరోనా కాలం నుంచి రావడం లేదు. కనీసం ఆటో సదుపాయాలు కూడా లేవు. ఆస్పత్రికి వెళ్లాలన్నా కష్టమే.. – లక్ష్మమ్మ, పీర్లగూడెం, అబ్దుల్లాపూర్‌మెట్ -
సిటీ బస్సులపై తొలగని ప్రతిష్టంభన
సాక్షి, సిటీబ్యూరో: రకరకాల వ్యూహాలు.. ప్రణాళికలు.. చివరకు ఎటూ తేలని సందిగ్ధం. ఇదీ సిటీ బస్సుల నిర్వహణపై నెలకొన్న పరిస్థితి. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా రాష్ట్రమంతటా బస్సులు నడుస్తున్నాయి. కోవిడ్ నిబంధనల మేరకు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ నగరంలో కరోనా వైరస్ ఉద్ధృతి తీవ్రత తగ్గకపోవడంతో సిటీ బస్సుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం అనుమతిస్తే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కొన్ని ప్రధానమైన రూట్లలో బస్సులు నడిపేందుకు అధికారులు ఇప్పటికే ప్రణాళికలను రూపొందించారు. మరోవైపు ఈ నెల 8 నుంచి సిటీ బస్సులు రోడ్డెక్కుతాయన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇటీవల రవాణా శాఖ మంత్రితో జరిగిన సమావేశంలోనూ సిటీ బస్సుల ప్రస్తావన రాలేదని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో వారం, పది రోజుల్లో నగరంలో ప్రజారవాణా సదుపాయం అందుబాటులోకి రానుందన్న అంశంపై ప్రతిష్టంభన నెలకొంది. బస్సులు నడిపేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు ఆ అధికారి పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు బస్సులను శానిటైజ్ చేయడంతో పాటు, భౌతిక దూరం నిబంధన మేరకు సీట్ల సామర్థ్యం వరకు ప్రయాణికులను పరిమితంగా అనుమతించడం, వీలైతే డోర్లను ఏర్పాటు చేయడం, కండక్టర్లను గ్రౌండ్ డ్యూటీలకు పరిమితం చేయడం వంటి అంశాలను పరిశీలించారు. బ్రాంచి రూట్లలో కాకుండా ప్రధాన రూట్లలో ఉదయం, సాయంత్రం బస్సులను నడపాలనే ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. కానీ సిటీ బస్సులపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవడం గమనార్హం. (హైదరాబాద్: రోడ్డెక్కనున్న సిటీ బస్సులు!) 29 డిపోలు.. 3 వేల బస్సులు.. పీకల్లోతు నష్టాల్లో ఉన్న గ్రేటర్ ఆర్టీసీని కరోనా మరింత దారుణంగా కాటేసింది. అప్పటికే కార్మికుల సమ్మె కారణంగా 50 రోజుల పాటు బస్సులు నడవలేదు. ఆదాయం పడిపోయింది. సమ్మె ముగిసి ఊపిరి తీసుకుంటున్న కొద్ది రోజుల్లోనే కరోనా తరుముకొచ్చింది. లాక్డౌన్ కారణంగా 29 డిపోల్లో సుమారు 3 వేల బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సాధారణంగా గ్రేటర్ ఆర్టీసీ జోన్‌కు ప్రతిరోజూ వచ్చే రూ.3.5 కోట్ల ఆదాయానికి గండి పడింది. గత 70 రోజులకు పైగా కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా సుమారు రూ.250 కోట్ల మేరకు ఆదాయాన్ని కోల్పోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో తీవ్ర నష్టాల్లో ఉన్న గ్రేటర్ ఆర్టీసీ మనుగడ మరింత ప్రశ్నార్థకంగా మారింది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా బస్సుల సంఖ్యను, పర్మిట్లను కుదించడం వంటి చర్యలు చేపట్టారు. కొన్నింటికి కార్గోలుగా మార్చారు. నగర శివార్లకు సిటీ బస్సులను చాలా వరకు తగ్గించారు. ఆ తర్వాత చార్జీల పెంపుతో కొంతమేరకు ఊరట లభించింది. కానీ ఆకస్మాత్తుగా లాక్డౌన్ వచ్చిపడింది. ఆర్టీసీ పాలిట పిడుగుపాటుగా పరిణమించింది. ఎయిర్‌పోర్టు బస్సులపైనా.. మరోవైపు గత నెల 25 నుంచి దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభం కావడంతో హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టు వరకు 53 ఏసీ బస్సులను నడిపేందుకు కూడా ఆర్టీసీ సన్నద్ధమైంది. ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండే ఈ రూట్లో బస్సుల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నారు. బస్సులను శానిటైజ్ చేయడంతో పాటు, డిపోల వారీగా రూట్లను ఎంపిక చేశారు. గతంలో తిరుగుతున్న రూట్లలో స్వల్పంగా మార్పులు చేశారు. కానీ ఈ బస్సులపై కూడా ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ‘ప్రజా రవాణాలో సిటీ బస్సు చాలా కీలకం. ఒక్కసారిగా జనం బస్సుల్లోకి ప్రవేశిస్తే వాళ్ల మధ్య భౌతిక దూరం సాధ్యం కాదు. సీట్ల సామర్థ్యం మేరకు ఎలా నడపగలమనే అంశాన్ని సీరియస్‌గానే పరిశీలిస్తున్నాం. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది’ అని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత మాత్రమే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అందుకు మరికొంత సమయం పట్టవచ్చని పేర్కొన్నారు. -
గ్రేటర్ ఆర్టీసీ.. కండక్టర్ లెస్ సర్వీసులు!
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ బస్సు.. సామాన్యుడికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రజారవాణాకు పెట్టింది పేరు. హైదరాబాద్ నగరంలో ఏ మూలన ఉన్నా సరే ఏంచక్కా సిటీ బస్సు ఎక్కేసి గమ్యం చేరుకోవచ్చనే సగటు ప్రయాణికుడి భరోసాకు బలం చేకూర్చే ప్రయాణ సాధనం. ఇది కరోనాకు ముందు సంగతి. ప్రస్తుతం ఆ పరిస్థితి సమీప భవిష్యత్తులో కనిపించే అవకాశం ఉండకపోవచ్చు. కోవిడ్ నేపథ్యంలో భాగంగా కొన్ని ఎంపిక చేసిన రూట్లకే సిటీబస్సులు పరిమితం కానున్నాయి. లాక్డౌన్ ఆంక్షలను మరింత సడలించి బస్సులు నడిపేందుకు ప్రభుత్వం అనుమతినిస్తే 40 నుంచి 50 కి.మీ వరకు ఉండే ప్రధాన రూట్లలోనే బస్సులను తిప్పాలని సిటీ ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు. హయత్‌నగర్ నుంచి బీహెచ్ఈఎల్, సికింద్రాబాద్ నుంచి పటాన్చెరు, సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట్, మేడ్చల్, ఫరూఖ్‌నగర్ నుంచి పటాన్చెరు వంటి అతి పెద్ద రూట్లలో మాత్రమే బస్సులు నడుస్తాయి. కోవిడ్ ఉద్ధృతి దృష్ట్యా బస్సుల నిర్వహణపై అధికారులు భవిష్యత్ కార్యాచరణపై సీరియస్‌గా దృష్టి సారించారు. ప్రయాణికుల రాకపోకలను నియంత్రించేందుకు ప్రవేశ ద్వారాలకు తలుపులు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనతో పాటు వివిధ ప్రత్యామ్నాయ అంశాలను పరిశీలిస్తున్నారు. అందులో భాగంగానే మొదటి దశలో ‘లిమిటెడ్ రూట్లు– లిమిటెడ్ బస్సులు’ అనే ప్రతిపాదనను ఆచరణలోకి తెచ్చేందుకు గ్రేటర్ ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. ఒకవైపు మెట్రో రైలు రాకతో, మరోవైపు కార్మికుల సుదీర్ఘమైన సమ్మె కారణంగా సిటీ బస్సులు పెద్దఎత్తున ప్రజాదరణను కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనికితోడు పిడుగుపాటులా వచ్చి పడిన కరోనా మహమ్మారి, దానిని కట్టడి చేసేందుకు విధించిన లాక్డౌన్ వల్ల గ్రేటర్ ఆర్టీసీ పూర్తిగా కుదేలైంది. ఈ క్రమంలోనే సిటీ బస్సులను తిరిగి గాడిన పెట్టేందు కు అధికారులు మొదట కొన్ని ఎంపిక చేసిన రూట్లలో మాత్రమే బస్సులను నడపాలని నిర్ణయించారు. కండక్టర్ లెస్ సర్వీసులు.. సరికొత్త మార్పులకు అనుగుణంగా కండక్టర్‌లెస్ సర్వీసులను నడిపేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. దీంతో వారు బస్సుల్లో కాకుండా బస్టాపుల్లో ఉండి టికెట్లు ఇస్తారు. ప్రతి బస్టాపునకు ఇద్దరు చొప్పున రెండు విడతలుగా విధులు నిర్వహించనున్నారు. ఉదాహరణకు సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు రెండు వైపులా 60 బస్టాపులు ఉన్నాయి. రెండు షిఫ్టుల్లో విధులు నిర్వహించేందుకు 120 మంది కండక్టర్లు అవసరం. ఇలా ఎంపిక చేసిన ప్రతి రూట్లో ఉన్న బస్టాపుల సంఖ్యకు అనుగుణంగా కండక్టర్లను ఏర్పాటు చేసి టికెట్ల జారీ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ‘దీనివల్ల ప్రయాణికుల మధ్య, సిబ్బంది మధ్య భౌతిక దూరం పాటించేందుకు వీలుకలుగుతుంది. పైగా మాస్కులు ఉన్న వారికే కండక్టర్లు టికెట్లు ఇస్తారు. వారు మాత్రమే బస్సెక్కుతారు. మరోవైపు ఏ బస్టాపులో ఎంతమంది ప్రయాణికులు ఎక్కారనే దానిపై కూడా ఒక నిర్దిష్టమైన అంచనా ఉంటుంది’ అని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు ‘సాక్షి’తో చెప్పారు. డిపోల్లోంచి బయలుదేరే ప్రతి బçస్సునూ పూర్తిగా శానిటైజ్ చేసి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా రోడ్డెక్కించనున్నట్లు పేర్కొన్నారు. బస్సులు నడపడంతో పాటు ప్రయాణికులు, సిబ్బంది రక్షణ కూడా తమకు ఎంతో ముఖ్యమని, అందుకనుగుణంగానే బస్సులను నడిపేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. మొదట 50 రూట్లలోనే.. సాధారణంగా గ్రేటర్ హైదరాబాద్‌లో 1,150 రూట్లలో సిటీ బస్సులు తిరుగుతున్నాయి. రోజుకు సుమారు 35 వేలకుపైగా ట్రిప్పులు తిరుగుతున్నట్లు అంచనా. కరోనా కారణంగా కేవలం 50 ప్రధాన రూట్లకే మొదట బస్సులను పరిమితం చేయనున్నారు. లాంగ్ రూట్లలోనే తిరుగుతాయి. తక్కువ దూరం ఉన్న మార్గాల్లో ఎలాంటి సర్వీసులు ఉండవు. ఈ మేరకు మొదటి విడతలో మేడ్చల్– సికింద్రాబాద్, హయత్‌నగర్– బీహెచ్ఈఎల్, ఫరూఖ్‌నగర్– పటాన్చెరు వంటి రూట్లను ఎంపిక చేయనున్నారు. -
నేటి నుంచి సిటీ బస్సుల తగ్గింపు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో సిటీ బస్సుల సంఖ్యను అధికారులు మూడు రోజుల్లో తగ్గించనున్నారు. గురువారం నుంచే కొద్దికొద్దిగా తగ్గిస్తూ శనివారం నాటికి వెయ్యి బస్సులు తొలగించాలని డిపోలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వెయ్యి బస్సులు తొలగించాలని అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. డిపోల వారీగా తగ్గించే బస్సుల సంఖ్య తో జాబితా కూడా సిద్ధం చేశారు. హైదరాబాద్ రీజియన్‌లో 550, సికింద్రాబాద్ రీజియన్‌లో 450 బస్సులను ఈ జాబితాలో చేర్చారు. కానీ దీనిపై అన్ని డిపోల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చార్జీలు పెంపుతో ఆదాయం పెరుగుతున్నందున, అన్ని బస్సులు సరిగ్గా నడిపితే నష్టాలు చాలా వరకు తగ్గించొచ్చని, ఇప్పుడు ఒకేసారి వెయ్యి బస్సులను ఆపేస్తే ఆదాయం పడిపోతుందని, ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతాయని డిపో మేనేజర్లు అంటున్నారు. బస్సులను తగ్గించినా సిబ్బందిని తొలగించే పరిస్థితి లేనందున వారి వేతనాల రూపంలో ఖర్చు అలాగే ఉంటుందని, అందుకే ఈ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సరుకు రవాణాకు మళ్లింపు.. రద్దు చేయబోయే బస్సులను త్వరలో ప్రారంభించబోయే సరుకు రవాణా విభాగానికి బదిలీ చేయనున్నట్లు సమాచారం. ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయమే అయినా.. దాన్ని కొనసాగించాలనే అధికారులు నిర్ణయానికి వచ్చారు. సీఎం సమావేశంలో తీసుకున్న నిర్ణయం కాబట్టి.. అమలు విషయంలో చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, బస్సుల రద్దుతో ఆర్టీసీలో కొత్త గందరగోళం నెలకొననుంది. వెయ్యి బస్సు లు రద్దుచేస్తే దాదాపు 4 వేల మంది సిబ్బంది అదనంగా ఉంటారు. ప్రస్తుతం ఆర్టీసీలో సగటు వేతనం 40 వేలు మించి ఉంది. ఈ 4 వేల మందికి పనిలేకపోగా వారికి ఊరికే వేతనం చెల్లించాల్సి వస్తుంది. ఇదో పెద్ద సమస్యగా పరిణమించనుంది. ఈ నేపథ్యంలో అదనంగా మారే సిబ్బందిని ఇతర విభాగాలకు తరలించేందుకు ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం పోలీసు శాఖలో డ్రైవర్లకు కొరత ఉంది. దీంతో బస్సుల రద్దుతో అదనంగా మారే 2 వేల మందికి పైగా డ్రైవర్లను పోలీసు విభాగం, అగ్నిమాపక విభాగం.. ఇలా కొరత ఉన్న విభాగాలకు బదిలీ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఇక కండక్టర్లను ఏం చేయాలన్న విషయంలో స్పష్టత రాలేదు. అయితే ఆర్టీసీ ఆధ్వర్యంలో కొత్తగా ప్రారంభించే సరుకు రవాణా విభాగంలో కొందరిని, ఆర్టీసీ పెట్రోల్ బంకుల్లో కొంత మందిని వినియోగించుకోవాలని చూస్తున్నారు. సీఎం పర్యవేక్షణలో ఆర్టీసీ.. సమ్మె నేపథ్యంలో గందరగోళంలో పడి చివరకు మనుగడ దిశగా అడుగులేస్తున్న ఆర్టీసీ ఇక స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలోనే ముందుకు సాగబోతోంది. ఇకపై క్ర మం తప్పకుండా సీఎం ఆర్టీసీని సమీక్షించబోతున్నారు. అ లాగే, ఇటీవల ప్రగతి భవన్లో కార్మికులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకో వడంతోపాటు ఆర్టీసీపై వరాల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. ఈ హామీల అమలు ప్రధానంగా మారింది. ఇందులో భాగంగా డిపోకు ఇద్దరు చొప్పున ఉద్యోగులతో(కార్మికులు) సంక్షేమ మండళ్లను ఏర్పాటు చేయాలని సీఎం ఆత్మీ య సమావేశంలో ఆదేశించిన నేపథ్యంలో వాటిని అధికారు లు సిద్ధం చేశారు. ఐదారు రోజుల క్రితమే డిపోల వారీగా సభ్యుల వివరాలను డీఎంలు అందజేశారు. అన్ని డిపోలు, వర్క్‌షాపులు కలిపి దాదాపు 200 మంది పేర్లను అధికారులకు పంపారు. కండక్టర్ల ఉద్యోగ భద్రతకు కూడా కొత్తగా చర్యల అమలును ప్రారంభించారు. చెర్రీ రంగు కాకుండా.. మహిళా కండక్టర్ల యూనిఫామ్‌పై త్వరలో తుది నిర్ణయం తీ సుకోబోతున్నారు. ఇప్పటికే తమకు చెర్రీ పండు ఎరుపు రంగులో ఆప్రాన్ కావాలని కండక్టర్లు కోరారు. ఆ రంగు బెదురు గా ఉండటంతో పాటు, వస్త్రం విస్తృతంగా లభించదన్న ఉద్దేశంతో ప్రత్యామ్నాయ రంగును అధికారులు సూచిస్తున్నారు. -
చినుకు పడితే ట్రిప్పు రద్దు
సాక్షి,సిటీబ్యూరో: సిటీ బస్సులో ప్రయాణిస్తున్నారా..! తస్మాత్ జాగ్రత్త. మీరు చేరుకోవాల్సిన గమ్యం వరకు వెళ్లకుండానే ఆ బస్సు రూట్ మధ్యలోనే వెనుదిరగవచ్చు. తర్వాత మీరు ఏ ఆటోనో, మరో వాహనమో ఆశ్రయిచాల్సిందే. ప్రయాణికులకు నాణ్యమైన, నమ్మకమైన రవాణా సదుపాయాన్ని అందిస్తున్నట్టు చెబుతున్న గ్రేటర్ ఆర్టీసీలో ప్రతిరోజు వేలకొద్దీ ట్రిప్పులు రద్దవుతున్నాయి. చినుకు పడితే చాలు ఠకీమని ఆగిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నగరంలోని అన్ని రూట్లలో ఇదే పరిస్థితి నెలకొంది. ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, కోఠి తదితర ప్రాంతాల నుంచి లింగంపల్లి, బీహెచ్ఈఎల్, పటాన్చెరు వరకు వెళ్లాల్సిన బస్సులను మాసాబ్‌ట్యాంక్, జూబ్లీ చెక్‌పోస్టు తదితర ప్రాంతాల నుంచి వెనక్కి మళ్లిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ, వర్షం కారణంగా సకాలంలో బస్సులు నడుపలేకపోతున్నట్లు ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. దీంతో చివరి షెడ్యూల్లో వెళ్లవలసిన ట్రిప్పులు పెద్ద ఎత్తున రద్దవుతున్నాయి. బస్సుల నిర్వహణలో ఉన్నతాధికారులకు, డిపో స్థాయి అధికారులు, సిబ్బందికి మధ్య కొరవడిన సమన్వయం కూడా ప్రయాణికుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. ప్రతి ట్రిప్పులోనూ గమ్యం వరకు వెళ్లి రావాలని నిబంధన ఉన్నప్పటికీ వివిధ కారణాలతో అర్ధాంతరంగా రద్దు చేసి డిపోలకు చేరుకుంటున్నారు. ఉప్పల్ నుంచి కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు, వేవ్‌రాక్, మెహదీపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లవలసిన బస్సులు వీఎస్టీ, ఇందిరాపార్కు, లిబర్టీ, లక్డీకాపూల్ నుంచి వెనక్కి వచ్చేస్తున్నాయి. ఇందుకనుగుణంగా డ్రైవర్లు, కండక్టర్లు బోర్డులు తిప్పేస్తున్నారు. సిటీ బస్సు ఎక్కితే నేరుగా చివరి వరకు వెళ్లవచ్చు.. సకాలంలో ఇంటికి చేరుకోవచ్చునని భావించే వారు ట్రిప్పుల రద్దుతో ఉస్సూరముంటూ బస్టాపుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్– లింగంపల్లి, పటాన్చెరు, ఉప్పల్–మెహదీపట్నం వంటి రూట్లలోనే కాకుండా నగరంలోని అన్ని లాంగ్ రూట్లలో చివరి ట్రిప్పులు రద్దవుతున్నాయి. గత వారం రోజులుగా సుమారు 10 వేలకు పైగా ట్రిప్పులు రద్దయినట్లు అంచనా. దీంతో మహిళలు, పిల్లలు, సీనియర్ సిటిజన్స్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సాయంత్రమైతే ఎదురు చూపులే.. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే సాయంత్రం వేళల్లోనే ట్రిప్పుల రద్దీ పెద్ద సమస్యగా మారుతోంది. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు సిటీ బస్సులు అందుబాటులో ఉండడం లేదు. రోజుకు 3500కు పైగా బస్సులు తిప్పుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. 32 లక్షల మంది ఈ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా. కానీ కొద్దిపాటి వర్షం పడినా, ఏ మాత్రం ట్రాఫిక్ రద్దీ కనిపించినా బస్సులను వెంటనే వెనక్కి మళ్లిస్తున్నట్లు ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సికింద్రాబాద్ నుంచి జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, అల్వాల్, మేడ్చల్ తదితర రూట్లలో అన్ని వేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రయాణికులు ఎదురు చూసే సమయానికి బస్సులు అందుబాటులో ఉండవు. నిర్థారించిన సమయానికి గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా వస్తాయి. ఇలా వచ్చిన బస్సులను ఆలస్యం కారణంగా సగం రూట్ వరకే నడుపుతున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ‘బీహెచ్ఈఎల్ నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తాం. కానీ ఆ బస్సు జూబ్లీ చెక్‌పోస్టు డెస్టినేషన్ బోర్డుతో బస్సు వస్తుంది. అందులో వెళ్లడమెందుకనుకొంటే చివరి వరకు వెళ్లే బస్సు మరెప్పటికి వస్తుందో తెలియదు. అసలు వస్తుందో, రాదో కూడా తెలియదు’ అని బీహెచ్ఈఎల్కు చెందిన శ్రీనివాస్ అనే ప్రయాణికుడు విస్మయం వ్యక్తం చేశారు. రన్నింగ్ టైమ్ కొరత కూడా.. మరోవైపు పలు రూట్లలో రన్నింగ్ టైమ్ కొరత కూడా ఉంది. ఆర్టీసీ నిర్థారించిన సమయానికి చేరుకోలేకపోతున్నారు. ట్రాఫిక్ రద్దీ కారణంగా బస్సులు రోడ్లపై నిలిచిపోతున్నాయి. 50 నిమిషాల్లో చేరుకోవాల్సిన గమ్యం గంటన్నర దాటినా చేరుకోలేకపోతున్నారు. 8 గంటల షెడ్యూల్ సమయంలో 4 ట్రిప్పులు తిరగాల్సి ఉంటే మూడింటికే పరిమితమవుతున్నారు. అన్ని రూట్లలో ఇలాంటి పరిస్థితే ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌లో 1,050కి పైగా రూట్లలో సిటీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి రోజు 42 వేల ట్రిప్పులు తిరుగుతున్నట్లు అంచనా. 10 కిలోమీటర్ల కనిష్ట దూరం నుంచి 45 కిలోమీటర్లకు పైగా ఉన్న రూట్లు ఉన్నాయి. దూరం ఎక్కువగా ఉన్న మార్గాల్లోనే రన్నింగ్ టైమ్ కొరత తీవ్రంగా ఉన్నట్లు కార్మిక వర్గాలు చెబుతున్నాయి. -
విద్యార్థీ.. నీకు బస్సేదీ?
ఉప్పల్ నుంచి ఘట్కేసర్, భోగారం వైపు బస్సు సర్వీసులను పెంచాలని ఇటీవల కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆపకుండా వెళ్తున్న ఓ బస్సు వెనక అద్దాలను పగులగొట్టారు. కనీసం ఫుట్‌బోర్డుపై నిల్చుని వెళ్లేందుకు కూడా అవకాశం లేకపోవడంతో.. బస్సు వెనకున్న అంచుపై నిల్చొని ప్రయాణం చేశారు. అత్యంతప్రమాదకరమైన ఈ ప్రయాణ వీడియో నగర శివార్లలోని కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఎదుర్కొంటున్నఇబ్బందులకు అద్దం పట్టింది. క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్క సికింద్రాబాద్ – ఉప్పల్ – ఘట్కేసర్ మార్గంలోనే కాదు... నగరానికి నలువైపులా ఉన్న అన్ని మార్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.సరిపడా బస్సులు అందుబాటులో లేకపోవడంతోనే ఈ దుస్థితి తలెత్తింది. బస్సులు కిక్కిరిసిపోవడంతో విద్యార్థులు ఫుట్‌బోర్డు ప్రయాణం చేయడం... ప్రైవేట్ వాహనాలు, బైకులపై కాలేజీలకు వెళ్తుండడంతోతరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. సిటీ శివార్లలోని కళాశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం సరిపోని సర్వీస్‌లు.. నగర శివారులోని వివిధ ప్రాంతాల్లో వందలాదిగా ఇంజినీరింగ్, ఒకేషనల్, ఐటీఐ తదితర కళాశాలలు ఉన్నాయి. వేలాది మంది విద్యార్థులు వీటిలో చదువుకుంటున్నారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న బస్సులు సుమారు 1,500 వరకు ఉన్నాయి. సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులు సైతం ఈ బస్సుల్లో వెళ్లాల్సి ఉంటుంది. దీంతో అప్పటికే కిక్కిరిసిపోయిన బస్సుల్లో విద్యార్థులు ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజూ 80 బస్సులు అదనంగా నడుపుతున్నట్లు ఆర్టీసీ చెబుతోంది. కానీ విద్యార్థుల డిమాండ్, రద్దీకి అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. దీంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. బైక్‌లపై వేగంగా వెళుతూ అదుపు తప్పి పడిపోతున్నారు. ఇలా ఏటా అనేక మంది ప్రమాదాలకు గురై గాయాలపాలవుతున్నారు. మృత్యువాత పడుతున్న సంఘటనలు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ రూట్లో నిత్యం 40వేల మంది విద్యార్థులు.. ప్రతి నిత్యం ఆల్వీన్ క్రాస్ రోడ్డు నుంచి మాదాపూర్, కొండాపూర్ వైపు, బాచుపల్లి, బొల్లారం, గండిపేట వైపు వెళ్లే బస్సుల సంఖ్య చాలా తక్కువ ఉండడంతో ఆ రూట్లో వెళ్లే విద్యార్థులు బస్సులకు వేలాడుతూ ఫుట్ బోర్డు ప్రయాణం చేయాల్సి వస్తోంది. ప్రతిరోజు 40 వేల మంది వరకు విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారు. పటాన్చెరు నుంచి కూకట్పల్లి వైపు వెళ్లే బస్సులు కూడా రద్దీగా వెళ్తున్నాయి. డ్రైవర్లు స్టాప్‌లలో బస్సులు ఆపకపోవడంతో విద్యార్థులు రన్నింగ్‌లో బస్సెక్కి ప్రమాదాలకు గురవుతున్నారు. మియాపూర్ డిపో–1 నుంచి 70 బస్సులు, మియాపూర్ డిపో –2 నుంచి 107 బస్సులు ఆయా రూట్లలో ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. పాతబస్తీ చాంద్రాయణగుట్టలోని ఇంజినీరింగ్ కళాశాలల రూట్లో సరైన ఆర్టీసీ బస్సులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరోరా, మహవీర్, ఇస్లామియా ఇంజినీరింగ్ కళాశాలలకు నగరం నుంచి నిత్యం వేల సంఖ్యలో విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రధానమైన ‘300’ రూట్లో ఉన్న ఈ కళాశాలలకు సరైన సమయంలో బస్సులు పూర్తి స్థాయిలో తిరగడం లేదు. వెరసీ.. విద్యార్థులు ప్రమాదకరంగా ఫుట్‌బోర్డింగ్ ప్రయాణం చేయాల్సివస్తోంది. ఉరికితేనే బస్సు దొరికేది: పరుగులు తీస్తున్న విద్యార్థులు ఇదీ పరిస్థితి ♦ నగర శివార్లలోని వివిధ ప్రాంతాలకు ప్రతిరోజు 1500 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. రద్దీ దృష్ట్యా మరో 80 బస్సులు అదనంగా నడుపుతున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ... అవి విద్యార్థులకు సరిపోవడం లేదు. ♦ మేడ్చల్‌లోని కండ్లకోయ, మేడ్చల్, మైసమ్మగూడ, కీసర, ఘట్కేసర్ తదితర ప్రాంతాల్లో 50కి పైగా కాలేజీలు ఉన్నాయి. వీటిలో 10వేల మందిపైగా విద్యార్థులు ఉన్నారు. కానీ విద్యార్థుల రద్దీకి సరిపడా బస్సులు లేవు. ♦ మేడ్చల్ – సికింద్రాబాద్, ఘట్కేసర్ – భోగారం, ఘట్కేసర్ – అవుషాపూర్ రూట్లలో మరో 40–50 బస్సులు నడిపించాలని విద్యార్థులు కోరుతున్నారు. ♦ ఎల్బీనగర్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై హయత్‌నగర్ మొదలుకొని 12 ఇంజినీరింగ్ కళాశాలలు, నాగార్జునసాగర్ రహదారిపై దాదాపు 12 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ మార్గాల్లో ప్రయాణానికి విద్యార్థులు నరకం అనుభవిస్తున్నారు. ప్రమాదకరం.. ఫుట్‌బోర్డు ప్రయాణం .. కుత్బుల్లాపూర్ వైపు.. నియోజకవర్గ పరిధి శివారు ప్రాంతాల్లో ఉన్న 12 ఇంజినీరింగ్ కళాశాలలు, పలు జూనియర్ కళాశాలల్లో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. వీరి కొందరు కాలేజీ బస్సుల్లో వస్తున్నప్పటికి చాలా మంది విద్యార్థులు ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడుతున్నారు. ఒక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోనే కాకుండా మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లాలన్నా ఇటునుంచే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలి. ప్రతి విద్యా సంవత్సరానికి విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికి తదనుగుణంగా ఈ రూట్లల్లో ఆర్టీసీ బస్సులు పెరగడం లేదు. దీంతో ఫుట్‌బోర్డులపై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. సుచిత్ర నుంచి కొంపల్లి వరకు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల సమయంలో దాదాపు 50 సర్వీసు ఆటోలు ఉన్నప్పటికి వీటిల్లో కూడా విద్యార్థులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. బాచుపల్లి– గండిమైసమ్మ, బాలానగర్ నుంచి గండిమైసమ్మ, సుచిత్ర – కొంపల్లి, దూలపల్లి క్రాస్ రోడ్డు నుంచి బహదూర్‌పల్లి క్రాస్ రోడ్లలో వేలాది మంది విద్యార్థులు నిత్యం ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. సమయానుకూలంగా బస్సులు నడపాలి.. మియాపూర్ నుంచి బాచుపల్లి బొల్లారం వెళ్లే రూట్లో నాలుగు బస్సులే ఉన్నాయి. అవి కూడా పాత డొక్కు పడిన బస్సులు ఉండడంతో మధ్యలోనే ఆగిపోతున్నాయి. సరైన సమయానికి కళాశాలకు వెళ్లడంలేదు. బస్సుల సంఖ్య పెంచాలని గతంలో ఎన్నోసార్లు ట్విట్టర్, ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. – రాహుల్ ప్రీతమ్ , విద్యార్థి ఫుట్బోర్డే దిక్కు.. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సుల సంఖ్య తక్కువ ఉండడంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో ఫుట్‌బోర్డు ప్రయాణం చేయాల్సివస్తోంది. మాదాపూర్, హైటెస్ సిటీ వైపు వెళ్లేందుకు బస్సులు అతి తక్కువగా ఉన్నాయి. దీంతో బస్సులు సమయానికి రాక ఉన్న బస్సుల్లోనే ఇరుకు ఇరుకుగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. బస్టాప్‌లలో కొంతమంది డ్రైవర్లు నిలబడకుండా వెళ్తుండడంతోరన్నింగ్లోబస్సు ఎక్కాల్సివస్తోంది. – కౌశిక్, విద్యార్థి ఆగకుండానే వెళ్తున్నాయి.. నేను ప్రతిరోజూ ఒవైసీ ఆస్పత్రి మీదుగా అరోరా ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్తుంటాను. ఉదయం 8.30 గంటల అనంతరం బస్సులు పూర్తి స్థాయిలో నడవడం లేదు. పూర్తిగా రద్దీగా ఉంటోంది. 8.30 గంటల కంటే ముందు ఐదారు బస్సులు ఒకేసారి వెళ్తుంటాయి. దీంతో పాటు స్టాప్‌లలో కొన్నిసార్లు బస్సులను ఆపడం లేదు. ఆటోలో వెళ్లాల్సి వస్తోంది.– వినయ్, మహవీర్ కళాశాల సాయంత్రం ఎదురుచూపులే.. సాయంత్రం వేళ ఎల్బీనగర్ వైపు బస్సులు చాలా తక్కువ సంఖ్యలో నడుస్తున్నాయి. సాయంత్రం 4.30 గంటలకు కళాశాల ముగిశాక బస్సుల కోసం గంటన్నర సేపు ఎదురు చూడాల్సి వస్తోంది. ఆరు గంటల అనంతరమే పూర్తి స్థాయిలో బస్సులను నడుపుతున్నారు. ఉదయం పూట కూడా కాలేజీకి వచ్చే సమయంలోనే బస్సులు తక్కువగా వస్తున్నాయి. – సాయితేజ, మహవీర్ కళాశాల ఇది చాలా దారుణం.. ట్రాఫిక్ పోలీసులు,ఆర్టీసీ అధికారులు ఫుట్‌బోర్డు ప్రయాణం మంచిది కాదని నీతులు చెబుతున్నారు. కాని సరిపడాబస్సులున్నాయా లేదా అనేది ఆలోచించకపోవడం దారుణం. బస్సులుంటేఫుట్ బోర్డు ప్రయాణం ఎందుకు చేస్తాం.– శ్రీలేఖ, బీటెక్ ప్రిన్సిటన్ కళాశాల,ఘట్కేసర్ -
చల్లని బండి.. ఉక్కపోతండి!
సాక్షి, సిటీబ్యూరో: సిటీ బస్సుల్లో ఏసీలు పని చేయడం లేదు. దీంతో బయటి ఉష్ణోగ్రతలకు ఏమాత్రం తీసిపోని విధంగా బస్సుల్లో వేడి ఉంటోంది. సకాలంలో మరమ్మతులు చేయకపోవడం, నిర్వహణ లోపం కారణంగా ఏసీ యంత్రాలు అలంకారప్రాయంగా మారాయి. దీంతో ప్రయాణికులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏసీ బస్సులు ఆర్డినరీ కంటే అధ్వానంగా ఉన్నాయని ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని అన్ని మార్గాల్లోనూ ఏసీ బస్సుల పరిస్థితి ఇలాగే ఉంది. గతంలో ప్రవేశపెట్టిన టాటా కంపెనీకి చెందిన సుమారు 60 మార్కోపోలో టైప్ ఏసీ బస్సులను మొదటహైటెక్ సిటీతో పాటు వివిధ ప్రాంతాల్లో ‘సిటీ శీతల్’గా నడిపారు. ఆ తర్వాత శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ‘పుష్పక్’ బస్సులుగా నడిపారు. వీటి స్థానంలో మెట్రో లగ్జరీ ఓల్వో బస్సులు ప్రవేశపెట్టి.. ఆ తర్వాత ఆ బస్సులనే వివిధ ప్రాంతాల నుంచి ‘పుష్పక్’లుగా ఎయిర్‌పోర్టుకు నడిపారు. ఉప్పల్ నుంచి మెహిదీపట్నం వరకు నడిచే 300 రూట్లో ఈ సిటీ శీతల్ బస్సులు నడుస్తున్నాయి. కానీ ఏ ఒక్క బస్సులోనూ ఏసీ సరిగ్గా పని చేయడం లేదు. ‘బయటి గాలి లోపలికి వచ్చేందుకు అవకాశం లేకుండా అన్ని వైపులా గ్లాస్విండోస్ ఉంటాయి. అలాగని ఏసీ ఉండదు. దీంతో ఈ రూట్లో ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామ’ని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఏసీ చార్జీలు చెల్లించి ఆర్డినరీ బస్సుల్లో పయనించినట్లుగా ఉంటోంద’ని బండ్లగూడ ప్రాంతానికి చెందిన ప్రయాణికుడు ఒకరు పేర్కొన్నారు. మరోవైపు సామర్థ్యం (ఫిట్నెస్) దృష్ట్యా బస్సులు బాగానే ఉన్నప్పటికీ సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో, ప్రత్యేకించి ఏసీలు రిపేర్ చేసే టెక్నీషియన్లు లేకపోవడంతో ఏసీలు పని చేయడం లేదని’ మెహిదీపట్నం డిపోకు చెందిన డ్రైవర్ ఒకరు చెప్పారు. ఒక్క 300 రూట్ బస్సులే కాకుండా ఒకప్పటి సిటీ శీతల్ బస్సులన్నీ ఇప్పుడు చాలా వరకు డొక్కు బస్సుల జాబితాలో చేరిపోయాయి. నిర్వహణ లోపం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని ఆర్టీసీ అధికారి ఒకరు పేర్కొన్నారు. ‘మెట్రో లగ్జరీ’లోనూ... ఇక 2014లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మెట్రో లగ్జరీ ఓల్వో బస్సుల్లోనూ ఏసీ అరకొరగానే ఉంటోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ‘బస్సులో వాతావరణం చల్లగా ఉండాలంటే కనీసం 25 డిగ్రీల లోపు టెంపరేచర్ ఉండాలి. కానీ 35 డిగ్రీలపైనే ఉంటోంది. ఏసీలు పని చేస్తున్నాయో లేదో తెలియదు. ఏసీల నుంచి చాలా తక్కువగా గాలి వస్తోంది. ఉక్కపోత తప్పడం లేదు’ అని ఎల్బీనగర్ నుంచి బీహెచ్ఈఎల్ మధ్య నడిచే 222 రూట్ బస్సు ప్రయాణికుడు సిద్ధేశ్వర్ తెలిపారు. ‘బీహెచ్ఈఎల్ నుంచి ఎల్బీనగర్ వరకు రూ.100 చార్జీ ఉంటుంది. కానీ ఏసీ మాత్రం ఉండదు’ అని విస్మయం వ్యక్తం చేశారు. మధ్యాహ్న సమయంలో ఏసీ బస్సుల్లో ప్రయాణించడం దుస్సాహసమేనని పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితం 80 మెట్రో లగ్జరీ బస్సులను ప్రవేశపెట్టారు. వివిధ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీకి, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వీటిని నడిపారు. ఇటీవల విమానాశ్రయానికి ఎలక్ట్రిక్ ఓల్వో బస్సులు వచ్చిన తరువాత ఇతర రూట్లలోకి వీటిని మళ్లించారు. కానీ బస్సుల నిర్వహణ మాత్రం కొరవడినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు మెట్రో రైల్ రాకతో నిరాదరణకు గురవుతున్న ఏసీ బస్సులు నిర్వహణ లోపం కారణంగా మరింత ఘోరంగా తయారవుతున్నాయి. మెట్రో రైల్ దృష్ట్యా ఇప్పటికే పలు రూట్లలో ఏసీ బస్సులను ఉపసంహరించుకున్నారు. ప్రయాణికుల నిరాదరణ వల్ల మరిన్ని నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. -
రూట్ క్లోజ్
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ ఆర్టీసీపై మరో పిడుగు పడింది. ఇప్పటి దాకా ప్రజారవాణాలో అగ్రగామిగా వెలుగొందిన సిటీబస్సుపై ‘మెట్రో’ నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి మెట్రో రైళ్ల రాకతో ఆ నష్టాలు మరింత పెరిగాయి. మెట్రో రైలు సేవలు విస్తృతమవుతున్నకొద్దీ వివిధ రూట్ల నుంచి సిటీ బస్సులు వైదొలగాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎల్బీనగర్–మియాపూర్ మెట్రో రైలు రాకతో మొదలైన ప్రతికూల పరిస్థితులు తాజాగా అమీర్‌పేట్–హైటెక్‌సిటీ మెట్రో రైలు ప్రారంభంతో తారస్థాయికి చేరుకున్నాయి. నగరంలోని 15 ప్రధాన మార్గాల్లో ప్రతిరోజు హైటెక్‌సిటీకి రాకపోకలు సాగించే సుమారు 300 బస్సులపై మెట్రో ప్రభావంపడే అవకాశం ఉదని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే వివిధ మార్గాల్లో హైటెక్‌సిటీకి తిరిగే మరో 28 ఏసీ బస్సులను సైతం ఆ మార్గంలో రద్దు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 2.5 లక్షల మందికి పైగా ప్రయాణికులు ఆర్టీసీ నుంచి మెట్రో వైపు మళ్లనున్నట్లు అంచనా. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై గ్రేటర్ ఆర్టీసీ దృష్టి సారించింది. మరోవైపు ప్రయాణికుల అవసరాలపైనా సర్వే చేపట్టింది. ఆదాయ మార్గాల్లోనే మెట్రో పరుగులు ఆర్టీసీకి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గాల్లోనే మెట్రో రైళ్లు కూతపెడుతున్నాయి. ఎల్బీనగర్ నుంచి దిల్సుఖ్నగర్, కోఠి, అమీర్‌పేట్, కూకట్పల్లి, మియాపూర్ మీదుగా లింగంపల్లి, పటాన్చెరు, బీహెచ్ఈఎల్కు ప్రతి రోజు వందలకొద్దీ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఈ రూట్లో ఏసీ బస్సులకు క్రమంగా ఆదరణ పెరుగుతున్న సమయంలోనే ఎల్బీనగర్–మియాపూర్ రూట్లో మెట్రో రైలు ప్రారంభమైంది. దీంతో ఆ మార్గంలో తిరిగే ఏసీ బస్సులను ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వైపు, బీఎన్‌రెడ్డి నగర్, తదితర మార్గాలవైపు మళ్లించారు. ప్రస్తుతంఎల్బీనగర్ నుంచి హైటెక్‌సిటీ మీదుగా పటాన్చెరు వరకు 18 ఏసీ బస్సులు నడుస్తున్నాయి.అలాగే ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్ మీదుగా వేవ్‌రాక్ వరకు మరో నాలుగు బస్సులు, ఉప్పల్ నుంచి వేవ్‌రాక్ వరకు మరో 6 ఏసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ బస్సులన్నింటిలోనూ 60 నుంచి 65 శాతం వరకు ఆక్యుపెన్సీ ఉంది. నగర శివార్లలో స్థిరపడిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇప్పటి వరకు ఏసీ బస్సుల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం నాగోల్ నుంచి హైటెక్‌సిటీ వరకు నేరుగా మెట్రో రైలు అందుబాటులోకి రావడంతో ఈ రూట్లో తిరిగే 28 ఏసీ బస్సులను ఇప్పటికిప్పుడు ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ బస్సుల్లో కొన్నింటిని హైటెక్‌సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు, మరికొన్ని బస్సులను నగర శివార్ల వైపు మళ్లించేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రయాణికుల అవసరాలపైన సర్వే చేపట్టారు. ప్రయాణికుల ఆదరణ లభించే మార్గాల్లోనే బస్సులను నడుపనున్నట్టు ఆర్టీసీ గ్రేటర్ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. బస్సు బతికేదెట్టా! రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సుమారు రూ.650 కోట్ల మేర నష్టాల్లో ఉండగా, ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే రూ.400 కోట్లకు పైగా నష్టాల్లో నడుస్తున్నట్లు లెక్క తేల్చారు. ఆదాయానికి మించిన నిర్వహణ వ్యయం, ఇంధన వ్యయం, ఇతరత్రా ఖర్చులు ఆర్టీసీని తీవ్ర కష్టాల్లోకి నెట్టేశాయి. రోజుకు రూ.3.5 కోట్ల ఆదాయంవస్తే బస్సుల నిర్వహణ, ఇతర ఖర్చుల కోసం రూ.4.50 కోట్ల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి. దీంతో రోజుకు రూ.కోటి చొప్పున నష్టాలను భరిస్తూ 3,550 బస్సులను తిప్పుతున్నారు. కానీ ప్రయాణికుల ఆదరణ ఉన్న మార్గాల్లోనే మెట్రో రైళ్లు పరుగులు తీయడంతో సిటీ బస్సుకు గడ్డుకాలంగా మారింది. సగానికి పైగా బస్సులను నగర శివార్ల వైపు మళ్లించడం మినహా మరో గత్యంతరం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కో మెట్రో రూట్ ప్రారంభమవుతున్న కొద్దీ ఆ రూట్లో సిటీ బస్సులను క్రమంగా తగ్గించుకోవాల్సి వస్తోంది. సంస్థకు వస్తున్న నష్టాలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై ఆర్టీసీ దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా సొంత స్థలాలను కమర్షియల్ కాంప్లెక్స్‌ల కోసం లీజుకిచ్చే చర్యలు చేపట్టి.. పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ఆహ్వానం పలికారు. -
‘పిటీ’ బస్సులు!
సాక్షి, సిటీబ్యూరో: సిటీ బస్సులు ప్రయాణికులకు పట్టపగలు చుక్కలు చూపిస్తున్నాయి. బస్టాపుల్లో గంటల తరబడి పడిగాపులు కాచేలా చేస్తున్నాయి. ఏ బస్సు ఎప్పుడొస్తుందో తెలియని అనిశ్చితి. గ్రేటర్ ఆర్టీసీలో సమయపాలన కొండెక్కి కూర్చుంది. ఒక రూట్ బస్సులు ఒకేసారి అన్నీ ఒకదానికి వెనుక ఒకటి వరుసగా (బంచ్)గా వచ్చేస్తాయి. ఒక్కోసారి గంటలు గడిచినా కనుచూపు మేరలో బస్సు కనిపించదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని ప్రధానమైన రూట్లు మినహాయిస్తే నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇదే దుస్థితి నెలకొంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు అందుబాటులో ఉండకపోవడం, బస్సుల నిర్వహణలోని వైఫల్యాలు, అమలుకు నోచని సమయపాలన ప్రయాణికుల పాలిట శాపంగా మారాయి. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు తదితర వర్గాలకు చెందిన ప్రయాణికులు బస్సులు లభించకపోవడంతో సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. ఒకవైపు అన్ని రూట్లలోకి మెట్రో రైలు దూసుకొస్తోంది. మరోవైపు ఏటేటా ఆర్టీసీ నష్టాలు రూ.వందల కోట్లలో పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన రవాణా సదుపాయాన్ని కల్పించలేకపోవడం ఆర్టీసీ వైఫల్యంగా కనిపిస్తోంది. సమయపాలన హుష్ కాకి...... సికింద్రాబాద్–పటాన్చెరు, కోఠి– కొండాపూర్, ఉప్పల్–మెహదీపట్నం, కొండాపూర్–ఉప్పల్ వంటి సుమారు వందకు పైగా మార్గాల్లో మాత్రమే బస్సులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తిరుగుతున్నాయి. ఈ రూట్లలోనూ ఒకేసారి బంచ్‌గా రావడం వల్ల సమయపాలన లోపిస్తోంది. ఉదాహరణకు సికింద్రాబాద్ నుంచి మెహదీపట్నం వెళ్లే బస్సు ఉదయం 8 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, ముప్పావుగంట ఆలస్యంగా కదులుతుంది. కానీ ఆ ముప్పావు గంట సమయంలో బయలుదేరాల్సిన మరో రెండు బస్సులు కూడా అదే సమయానికి బయలుదేరుతాయి. దీంతో ఉదయం 9 గంటల బస్సు కోసం ఎదురు చూసేవాళ్లకు ఆ బస్సు లభించదు. మరో గంట గడిస్తే తప్ప ఆ రూట్లో వెళ్లే బస్సులు రావు. ఏదో ఒక్క రూట్లో మాత్రమే కాదు. నగరంలోని అనేక మార్గాల్లో ఇదే పరిస్థితి. నగరంలోని వివిధ డిపోల నుంచి బయలుదేరే బస్సుల సమయపాలనపై సమన్వయం లేకపోవడం వల్ల, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంటున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్‌లోని 29 డిపోల పరిధిలో ప్రతి రోజు 3550 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. 1050 మార్గాల్లో ఈ బస్సులను నడుపుతున్నారు. కానీ డిపోల వారీగా రూట్లు, ఆ రూట్లలో నడిచే బస్సుల నిర్వహణపై సమన్వయం లేకపోవడమే సమయపాలన పాటించకపోవడం వల్లనే సమస్యలు తలెత్తుతున్నట్లు పలువురు డిపోమేనేజర్లు అభిప్రాయపడ్డారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. ఆ తరువాత రద్దీ కొద్దిగా తగ్గినా డిమాండ్ మాత్రం బాగానే ఉంటుంది. కానీ ఈ డిమాండ్‌కు తగిన బస్సులు మాత్రం అందుబాటులో ఉండవు. రాత్రి 9 దాటితే కొన్ని రూట్లలో బస్సుల జాడ కనిపించదు. అలాగే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బస్సుల కోసం ప్రయాణికులకు పడిగాపులు తప్పవు. ఫిర్యాదుల వెల్లువ... గ్రేటర్ ఆర్టీసీ ప్రతి నెలా డిపో స్థాయి నుంచి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ స్థాయి అధికారి వరకు నిర్వహిస్తోన్న ‘ డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్’ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 50 శాతానికి పైగా బస్సులు సకాలంలో రావడం లేదని, రాత్రి పూట బస్సులు అందుబాటులో లేవని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగతా ఫిర్యాదుల్లో తమ కాలనీలకు బస్సులు రాకపోవడం పై కాలనీ సంఘాలు, పౌరసంఘాలు, వ్యక్తులు ఫిర్యాదులు చేస్తున్నారు.ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తన, ర్యాష్ డ్రైవింగ్, బస్సులు రోడ్డు మధ్యలో నిలపడం, బస్సుల డెస్టినేషన్ బోర్డులు సరిగ్గా కనిపించకపోవడం వంటి అంశాలపైనా ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువుత్తుతున్నాయి. ప్రతి నెలా చివరి సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించే ఈ డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్ కార్యక్రమంలో ఒక్కో డిపో పరిధిలో సగటున 25 ఫిర్యాదులు వస్తే వాటిలో సగానికి పైగా బస్సులు సకాలంలో రావడం లేదనే అంశానికి సంబంధించినవే కావడం గమనార్హం.సంస్థాగతమైన లోపాలతో పాటు, ట్రాఫిక్ రద్దీ, మెట్రో రూట్లలో అధ్వాన్నంగా మారిన రోడ్ల వల్ల కూడా బస్సుల రాకపోకల్లో జాప్యం చోటుచేసుకుంటుంది. సాయంత్రం 5 గంటలకు విధుల్లో చేరిన సిబ్బంది ట్రాఫిక్ రద్దీ కారణంగా బస్సులు ఆలస్యంగా నడుస్తున్నాయనే కారణంతో రాత్రి 9 తరువాత వెళ్లాల్సిన ట్రిప్పులను ఏకపక్షంగా రద్దు చేస్తున్నారు. దీంతో రాత్రి పూట బస్సుల కోసం ఎదురు చూసే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదీ గ్రేటర్ ఆర్టీసీ.. మొత్తం డిపోలు : 29 బస్సుల సంఖ్య : 3850 ఈ బస్సులు తిరిగే రూట్లు : 1050, మొత్తం ట్రిప్పులు : 42 వేలు. ప్రతి రోజు రాకపోకలు సాగించేప్రయాణికుల సంఖ్య : 33 లక్షలు. -
మెట్రో బస్సు దూకుడు
కృష్ణాజిల్లా, ఉయ్యూరు (పెనమలూరు) : చెరకు లోడు బండిని మెట్రో సర్వీస్ బస్ ఢీకొన్న ఘటనలో రెండు ఎద్దులకు గాయాలయ్యాయి. పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో చోటు చేసుకున్న ఈ ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. రైతులు ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వివరాల్లోకి వెళితే, తోట్లవల్లూరు మండలం కనకవల్లి గ్రామానికి చెందిన రైతులు ఎడ్ల బళ్లపై చెరకును కేసీపీ కర్మాగారానికి తీసుకువస్తున్నారు. బస్టాండ్ లోపలికి వెళ్లే క్రమంలో విజయవాడ నుంచి వస్తున్న 333 సర్వీస్ మెట్రో బస్సు ప్రమాదవశాత్తూ ఢీకొంది. చెరకు బండి వెనుకగా ఢీకొట్టడంతో రెండు ఎద్దులకు గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన రైతులు బస్సు డ్రైవర్‌పై దురుసుగా ప్రవర్తించారు. ఆందోళనకు దిగిన రైతులు.. ప్రమాద ఘటనపై ఆగ్రహించిన రైతులు చెరకు బళ్లను బస్టాండ్ సెంటర్లో నిలిపివేసి ఆందోళనకు దిగారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో న్యాయం చేయించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నాకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్‌కు, రైతులకు మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఒక దశలో ఒకరిపై ఒకరు చేతులతో దాడి చేసుకునే పరిస్థితి తలెత్తడంతో సమాచారం అందుకున్న పట్టణ ఎస్ఐ సత్యశ్రీనివాస్ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి ఇరువర్గాలతో చర్చించి ఆందోళన విరమింపచేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. -
మృత్యుశకటాలు..!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సిటీ బస్సులు మృత్యుశకటాల్లా దూసుకొస్తూ నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. ఎప్పుడు, ఎక్కడ ఎటువైపు నుంచి సిటీ బస్సు రూపంలో మృత్యువు కబళిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. కాలం చెల్లిన డొక్కు బస్సులు, డ్రైవర్ల నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. ట్రాఫిక్ నిబంధనలను గాలికొదిలేసి దూసుకొస్తున్న బస్సులు యమదూతలను తలపిస్తున్నాయి. మూడు రోజుల క్రితం సికింద్రాబాద్ క్లాక్‌టవర్ ప్రాంతంలో బీభత్సం సృష్టించిన ఆర్టీసీ బస్సు ఓ యాచకుడిని కబళించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. బస్సు ఢీకొనడంతో నాలుగు వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో బ్రేకులు ఫెయిల్ కావడమే కారణమని డ్రైవర్ చెబుతుండగా, బస్సు కండీషన్లోనే ఉందని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. కారణం ఏదైనప్పటికీ ఆర్టీసీ బస్సుల వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలస్తున్నాయి. గత సంవత్సరం హైటెక్‌సిటీ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని బెంగళూర్‌కు చెందిన ఒక సాఫ్ట్వేర్ నిపుణుడు, ఇద్దరు ఆటో డ్రైవర్లు బలైన సంగతి తెలిసిందే. ఇలా నిత్యం ఎక్కడో ఒక చోట ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు పాల్పడుతూనే ఉన్నాయి. ఆర్టీసీ ప్రమాదాలు 38 శాతం ... గ్రేటర్లో మొత్తం వాహనాల సంఖ్య 52 లక్షలు. 35 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు ఉండగా, మరో 12 లక్షల వరకు కార్లు, లక్షా 40 వేల ఆటో రిక్షాలు ఉన్నాయి. మిగతా వాటిలో లారీలు, డీసీఎం వ్యాన్లు, ప్రైవేట్ బస్సులు,టాటాఏస్‌లు, తదితర వాహనాలు ఉన్నాయి. గ్రేటర్‌లోని 29 డిపోల పరిధిలో తిరుగుతున్న ఆర్టీసీ బస్సులు కేవలం 3850 మాత్రమే. కానీ ఈ బస్సుల వల్ల జరిగిన ప్రమాదాలు 38 శాతం. ఇతర అన్ని రకాల వాహనాల కంటే సిటీ బస్సుల ప్రమాదాల శాతమే ఎక్కువగా ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. అంతకు రెట్టింపు సంఖ్యలో క్షతగాత్రులవుతున్నారు. ఆర్టీసీ బస్సుల ప్రమాదాల నియంత్రణకు చేపట్టే చర్యలు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల నిర్వీర్యమవుతున్నాయి. వేల సంఖ్యలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. గతేడాది సిటీ బస్సులు సుమారు 7 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు పోలీసు అధికారుల అంచనా. కొరవడిన శిక్షణ... గ్రేటర్లో ప్రతి రోజు 3850 బస్సులు 42 వేల ట్రిప్పులు తిరుగుతున్నాయి. సుమారు 33 లక్షల మంది ప్రయాణికులు సిటీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నట్లు అంచనా. ప్రజా రవాణా రంగంలో ఇప్పటి వరకు ఆర్టీసీదే సింహభాగం. 12 వేల మంది డ్రైవర్లు. మరో 10 వేల మంది కండక్టర్లు పని చేస్తున్నారు. ఇలాంటి అతి పెద్ద వ్యవస్థలో రోడ్డు భద్రతా నిబంధనలు ఒక ప్రహసనంగా మారాయి. ఒక లీటర్ ఇంధనానికి ఎన్ని కిలోమీటర్లు తిప్పాలనే అంశంపైన శిక్షణనిచ్చినట్లుగా డ్రైవింగ్‌లో మెళకువలు పెంచుకొనేందుకు ఎలాంటి శిక్షణ, పునఃశరణ తరగతులు నిర్వహించకపోవడం గమనార్హం. గతంలో లారీ డ్రైవర్లుగా పని చేసిన వేలాది మంది అప్పట్లో ఆర్టీసీలో కాంట్రాక్ట్ డ్రైవర్లుగా చేరారు. హై వేలపై లారీలు నడిన ఈ డ్రైవర్లంతా ఆర్టీసీ బస్సులను సైతం అలాగే నడుపుతూ ప్రమాదాలకు ఒడిగడుతున్నట్లు అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా కొత్తగా విధుల్లో చేరిన వారి నైపుణ్యాన్ని పరీక్షంచడంతో పాటు, నగరంలోని రోడ్లు, ట్రాఫిక్, ప్రయాణికుల భద్రత, వాహనదారుల భద్రతకు అనుగుణమైన డ్రైవింగ్ నైపుణ్యంపైన 3 నెలల పాటు శిక్షణనిచ్చేవారు. అలాగే తప్పిదాలకు పాల్పడిన వారికి పునఃశ్చరణ తరగతులు ఉండేవి. ఇప్పటికీ అలాంటి శిక్షణ ఉన్నప్పటికీ కేవలం మొక్కుబడిగా మారిందని డ్రైవర్లు చెబుతున్నారు. 1000 డొక్కు బస్సులు... సుమారు 8 సంవత్సరాలుగా కొత్త బస్సుల కొనుగోళ్లు నిలిచిపోయాయి. 150 ఏసీ బస్సులు మినహా ఇతర కేటగిరిల్లో కొత్త బస్సులు లేవు. ఏళ్లకు ఏళ్లుగా పాత బస్సులనే నడుపుతున్నారు. సుమారు 1000 డొక్కు బస్సులు కాలం చెల్లిపోయి ఉన్నట్లు అంచనా. దీంతో సిటీ బస్సుల బ్రేక్డౌన్లు నిత్యకృత్యంగా మారాయి. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట బస్సులు రోడ్లపై నిలిచిపోతున్నాయి. ప్రమాదాలు జరిగిన ప్రతి సారీ బస్సులకు బ్రేక్‌లు ఫెయిల్ కావడమే కారణమని డ్రైవర్లు, ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. బ్రేకులు, బస్సుల కండీషన్ బాగానే ఉందని అధికారులు వాదిస్తున్నారు.కానీ కాలం చెల్లిన బస్సుల స్థానంలొ కొత్త వాటి కొనుగోళ్లు మాత్రం ఆచరణకు నోచుకోవడం లేదు. సిటీలో ఏ వాహనాల వల్ల ఎన్ని ప్రమాదాలు వాహనాలు ప్రమాద శాతం ఆర్టీసీ బస్సులు 38 కార్లు,క్యాబ్‌లు 34 డీసీఎంలు 2 ప్రైవేట్ బస్సులు 7 లారీలు 2 గుర్తు తెలియని వాహనాలు 4 టెంపోట్రాలీలు 2 ఇతర వాహనాలు 7 -
ఆ రెండు గంటలు
నగరంలో ప్రయాణం నరకంగా మారింది. అరకొర బస్సులతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. ప్రతి మార్గంలో సరిపడా బస్సులు లేకపోవడం... ఉన్నా కొన్ని సమయానికి రాకపోవడంతో నానా కష్టాలు పడుతున్నారు. ఒకట్రెండు బస్సులు వస్తే కళాశాలకు సకాలంలో వెళ్లాలనే ఆత్రుతతో ప్రమాదకరంగా ఫుట్‌బోర్డుపై వేలాడుతూ వెళ్తున్నారు. ఫుట్‌బోర్డు, బస్ టాప్‌పై ప్రయాణిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక బస్సులపై ఆశలు వదులుకొని ఆటోలు, బైకులపై వెళ్తూ విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీకి అనుగుణంగా బస్సులు నడపలేకపోతున్న గ్రేటర్ ఆర్టీసీ నిర్లక్ష్యానికి నిదర్శనమిది. నగరంలో విద్యార్థుల బస్సు బాధలపై ‘సాక్షి’ సోమవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల నిర్వహించిన విజిట్‌లో అనేక అంశాలు వెలుగుచూశాయి. విద్యార్థులు 3 లక్షలు.. బస్సులు 750 నగరవ్యాప్తంగా విస్తరించిన స్కూళ్లు, కళాశాలల్లో సుమారు 3లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ఇంతమంది విద్యార్థులకు ఆర్టీసీ నడుపుతున్న బస్సులు కేవలం 750 మాత్రమే. సిటీలో మొత్తం 3,500 ఆర్టీసీ బస్సులుండగా... వీటిలో 900 బస్సులను విద్యార్థుల కోసం నడుపుతున్నామని గ్రేటర్ ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. నిజానికి విద్యార్థుల కోసం నడుపుతున్న బస్సులు 750 మాత్రమే. పోనీ 900 బస్సులు అయినా.. 3లక్షల మంది విద్యార్థులకు ఏమాత్రం సరిపోతాయి? శివార్లలోని మైసమ్మగూడ, దుండిగల్, దూలపల్లి, బాచుపల్లి, పేట్‌బషీరాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, వికారాబాద్, ఇబ్రహీంపట్నం, గండిపేట్, చిల్కూరు, ఫిర్జాదీగూడ, ఘట్కేసర్, కాసివాని సింగారం, బాటసింగారాం, అబ్దుల్లాపూర్‌మెట్, మజీద్‌పూర్, కొత్తగూడెం, హయత్‌నగర్, తట్టి అన్నారం తదితర ప్రాంతాల్లో వృత్తివిద్యా కళాశాలలు ఉన్నాయి. ఒక్క పేట్‌బషీరాబాద్, దూలపల్లి ప్రాంతాల్లోనే 50కి పైగా విద్యాసంస్థలున్నాయి. ప్రతిరోజు వేలాది మంది విద్యార్థులు ఈ మార్గంలో ప్రయాణిస్తారు. సరిపడా బస్సులు లేకపోవడంతో చాలా మంది బైకులపై వెళ్తున్నారు. మెహదీపట్నం మరో ప్రమాదకరమైన జోన్. రన్నింగ్‌లో బస్సు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు నెలకు సగటున 4–5 నమోదవుతున్నాయి. ఉదయం 7–9 గంటలు, సాయంత్రం 3–5 గంటల ప్రాంతంలో విద్యార్థుల రద్దీ తీవ్రంగా ఉంటుంది. కానీ ఈ వేళల్లోనే బస్సుల కొరత ఉంటోంది. హయత్‌నగర్ మార్గంలో అబ్దుల్లాపూర్‌మెట్ వరకే సిటీ బస్సులు పరిమితమవుతున్నాయి. కానీ అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలోని కొత్తగూడెంలో పదుల సంఖ్యలో కళాశాలలున్నాయి. దీంతో విద్యార్థులు రెండు, మూడు బస్సులు మారాల్సి వస్తోంది. ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. బస్సుల బాధ భరించలేక బైక్‌లపై ముగ్గురు, నలుగురు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. బస్సెక్కిన ఎమ్మెల్యే ‘బస్సు’ బాధలు వర్ణనాతీతం ఉప్పల్‌లో బస్ టెర్మినల్ ఏర్పాటు చేయడంలో సంబంధిత శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అలసత్వాన్ని నిరసిస్తూ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అసెంబ్లీకి సోమవారం ఆర్టీసీ బస్‌లో వెళ్లారు. ఆయన మాట్లాడుతూ... బస్ టెర్మినల్ ఏర్పాటుపై చాలాసార్లు మంత్రికి విన్నవించినా పెడచెవిన పెట్టారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లా మంత్రి చొరవ చూపడం లేదన్నారు. ఉదయం 8:30 గంటలకు ఉప్పల్ బస్టాండ్‌లో 113/ఎం నెంబర్ ఆర్టీసీ మెట్రో బస్సెక్కి అసెంబ్లీకి బయలుదేరిన ఎమ్మెల్యే తన గంట ప్రయాణ అనుభవాన్ని ‘సాక్షి’కి వివరించారు. ‘బస్సు’ బాధలు వర్ణణనాతీతమన్నారు. కొన్ని ప్రాంతాల్లో బస్ షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు రోడ్లపైనే నిలబడడం కనిపించింది. చాలాచోట్ల రద్దీ విపరీతంగా ఉంది. సరిపడా బస్సులు లేవు. ఎంతోమంది ఫుట్‌బోర్డులో ప్రయాణిస్తూ కనిపించారు. అదీగాక చాలా వరకు డొక్కు బస్సులే ఉన్నాయి. ఆర్టీసీ బస్‌లో ఆలస్యమవుతుందనే ఉద్దేశంతోనే గంటన్నర ముందుగా ప్రయాణానికి సిద్ధమయ్యాను. – ఉప్పల్ కాలుపెట్టే స్థలం లేదు.. ముషీరాబాద్ నుంచి సికింద్రాబాద్ వచ్చాక మైసమ్మగూడకు వెళ్లేందుకు రెండున్నర గంటల సమయం పడుతోంది. ఏ బస్సు ఎక్కుదామన్నా కాలుపెట్టే స్థలం ఉండడం లేదు. ఉదయం 6 గంటలకు కళాశాలకు బయలుదేరితే తిరిగి ఇంటికి చేరుకునేసరికి రాత్రి 9 గంటలు అవుతోంది. – ఉదయ్‌కిరణ్, విద్యార్థి ప్రయాణానికే సరి.. బస్సుల్లో స్థలం ఉండడం లేదు. బోయిన్పల్లి నుంచి సికింద్రాబాద్, అక్కడి నుంచి బోయిన్పల్లి మీదుగా బహదూర్‌పల్లి వెళ్తున్నాం. ప్రయాణం కోసమే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది. – శ్రీలత, ఇంజినీరింగ్ విద్యార్థిని ఆటోల్లోనే.. బస్ పాస్‌కు డబ్బులు వృథా అవుతున్నాయి. నెలలో చాలాసార్లు ఆటోల్లోనే కళాశాలకు వెళ్లాల్సి వస్తోంది. బహదూర్‌పల్లి వెళ్లేందుకు బోయిన్పల్లి బస్ స్టాప్ వద్ద రెండు గంటలు వేచి చూడాల్సి వస్తోంది. పాస్ ఉన్నప్పటికీ రోజుకు రూ.50 ఖర్చు చేసుకొని ఆటోల్లో వెళ్తున్నాం. – చంద్ర, విద్యార్థిని ఫుట్‌బోర్డు ప్రయాణమే దిక్కు ⇔ పాతబస్తీలో సంతోష్‌నగర్–చాంద్రాయణగుట్ట ప్రధాన రహదారి, నయాపూల్–బహదూర్‌పురా ప్రధాన రహదారులలో సకాలంలో బస్సులు లేవు. ⇔ బండ్లగూడలోని అరోరా, మహవీర్, ఇస్లామియా ఇంజినీరింగ్ కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ⇔ ఎల్బీనగర్, వనస్థలిపురం, సాగర్‌రింగ్‌రోడ్డు, కర్మన్‌ఘాట్, బీఎన్‌రెడ్డినగర్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో వేలాది మంది విద్యార్థులు నరకం చవి చూస్తున్నారు. ⇔ దూలపల్లి, మైసమ్మగూడ, దుండిగల్, కండ్లకోయ ప్రాంతాల్లో ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణం సాగిస్తున్నారు. ⇔ సికింద్రాబాద్–బహదూర్‌పల్లికి బస్సులు ఏ మాత్రం చాలడం లేదు. ⇔ లేడీస్ స్పెషల్ బస్సులూ సరిపోకపోవడంతో విద్యార్థినిలు సైతం ఫుట్‌బోర్డు ప్రయాణం చేయాల్సి వస్తోంది. ⇔ చందానగర్, మియాపూర్–మేడ్చల్, ఉప్పల్, సికింద్రాబాద్ వైపు వెళ్లే విద్యార్థులు నిత్యం అవస్థలు పడుతున్నారు. ⇔ మలక్‌పేట్, మహేశ్వరం, యాకుత్‌పురా నియోజకవర్గాల్లో విద్యార్థులకు కష్టాలు నిత్యకృత్యమయ్యాయి. ⇔ దిల్సుఖ్నగర్, మీర్పేట్, గుర్రంగూడ, ఆర్కేపురం, సరూర్‌గర్, సైదాబాద్, మలక్‌పేట్ తదితర ప్రాంతాల్లోనిæ చౌరస్తాల్లో విద్యార్థులు బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. సమయానికి బస్సులు రాక కళాశాలలకు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోంది. ⇔ యాప్రాల్ వైపు వెళ్లే విద్యార్థులు ఈసీఐఎల్, నేరేడ్మెట్, మల్కాజిగిరి తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిందే. యాప్రాల్ నుంచి ఈసీఐఎల్‌కు బస్ సౌకర్యం లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ⇔ ఆల్విన్ కాలనీ నుంచి అతి తక్కువ బస్సులు ఉండడంతో విద్యార్థులు నిత్యం ఫుట్‌బోర్డు ప్రయాణమే చేయాల్సి వస్తోంది. ⇔ సికింద్రాబాద్ స్టేషన్–మేడ్చల్, సికింద్రాబాద్–బహదూర్‌పల్లి, మైసమ్మగూడ, దూలపల్లి రూట్లలో 15వేల మంది విద్యార్థులు రా>కపోకలు సాగిస్తుండగా, 94 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. ⇔ మేడ్చల్ మార్గంలో 9 వేల మంది విద్యార్థులు ఉండగా, 89 బస్సులు నడుస్తున్నాయి. బహదూర్‌పల్లి మీదుగా 6వేల మంది విద్యార్థులు ప్రయాణం చేస్తుండగా, ఈ రూట్లో కేవలం 5 బస్సులు మాత్రమే ఉన్నాయి. -
బండి కాదు.. మొండి ఇదీ...
సిటీ బస్సులు హడలెత్తిస్తున్నాయి. బ్రేక్డౌన్ల కారణంగా ఎక్కడపడితే అక్కడ రోడ్లపై మొరాయిస్తున్నాయి. సకాలంలో మరమ్మతులు చేయకపోవడం, విడిభాగాలు అమర్చకపోవడం వంటి కారణాలతో బ్రేకులు ఫెయిలై మృత్యుదూతల్లా దూసుకొస్తున్నాయి. ఏ బస్సు ఎక్కడ ఆగిపోతుందో..ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అధ్వాన్నపు రహదారులు ఒకవైపు జనాల్ని ఇబ్బంది పెడుతుండగా..మరోవైపు డొక్కు సిటీ బస్సులు సైతం నగరవాసులకు నరకం చూపిస్తున్నాయి. తరచూ బ్రేక్డౌన్ల కారణంగా రోడ్లపై మొరాయిస్తున్నాయి. ఉన్నపళంగా రోడ్లపై నిలిచిపోవడం, దుకాణాల్లోకి దూసుకొనిపోయి ప్రమాదాలు చోటుచేసుకోవడం, రోడ్డు డివైడర్లు ఎక్కేయడం వంటి దుర్ఘటనలు ప్రయాణికులనే కాకుండా నగరవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. శనివారం విజయవాడలో ఓ సిటీ బస్సుకు బ్రేకులు ఫెయిల్ కావడంతో చోటుచేసుకున్న ప్రమాదం తరహాలో నగరంలోనూ తరచుగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సకాలంలో బస్సులకు మరమ్మతులు చేయకపోవడం, సరైన విడిభాగాలు అందుబాటులో లేకపోవడం, వందల సంఖ్యలో కాలం చెల్లిన బస్సులే రోడ్లపైన తిరగడంతో బ్రేకులు ఫెయిల్ అవుతున్నాయి. దీంతో రోడ్డు ప్రమాదాలతో పాటు, బస్సులు రోడ్లపైన నిలిచిపోవడం వల్ల కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోతుంది. ఒకవైపు మెట్రో కారణంగా, మరోవైపు వర్షాలకు దారుణంగా దెబ్బతిన్న రోడ్ల వల్ల నగరమంతటా ప్రజలు ట్రాఫిక్ నరకాన్ని చవి చూస్తుండగా సిటీ బస్సుల బ్రేక్ డౌన్స్ అందుకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో 3550 బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయం అందజేస్తుండగా వాటిలో వెయ్యికి పైగా డొక్కు బస్సులే ఉన్నాయి. ఈ డొక్కు బస్సుల్లోనూ 11 లక్షల కిలోమీటర్లు దాటిన కాలం చెల్లిపోయిన బస్సులు సగం మేరకు ఉండవచ్చునని అంచనా. మృత్యుశకటాలు.... బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్లు బస్సులను అదుపు చేయలేక ప్రమాదాలకు పాల్పడుతున్నారు. సిటీ బస్సులు నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. గతంలో కవాడిగూడలో జరిగిన ప్రమాద ఘటనలో చెంగిచెర్ల డిపోకు చెందిన ఓ బస్సు అదుపు తప్పి స్కూటీ పై వెళుతున్న ఇద్దరు అమ్మాయిలను ఢీకొట్టింది. దాంతో ఆ ఇద్దరు తీవ్ర గాయాలతో దర్మరణం పాలయ్యారు. ఆ ప్రమాదం మొత్తం నగరాన్నే తీవ్ర ఆందోళనకు గురి చేసింది. రెండేళ్ల క్రితం బండ్లగూడ డిపోకు చెందిన బస్సు ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఓ యువకున్ని బలితీసుకుంది. డొక్కు బస్సుల కారణంగా ప్రతి సంవత్సరం వందలాది ప్రమాదాలకు కారణమవుతున్నప్పటికీ ఆర్టీసీలో ఎలాంటి దిద్దుబాటు చర్యలు లేకపోవడం గమనార్హం. అప్పట్లో సికింద్రాబాద్ ప్యాట్నీ వద్ద ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ మృత్యువాత పడింది. అదే ఏడాది ఓ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల బంజారాహిల్స్‌లోని ఐస్‌క్రీమ్ పార్లర్‌లోకి దూసుకెళ్లింది. గత మూడేళ్లలో సుమారు 350కి పైగా బస్సు ప్రమాదాలు జరగ్గా...170 మంది వరకు మృత్యువాత పడ్డట్లు అంచనా. అంతకు రెట్టింపు సంఖ్యలో గాయాలకు గురయ్యారు. డ్రైవర్ల నిర్లక్ష్యం ఒక కారణం అయితే కాలం చెల్లిన, డొక్కు బస్సులు మరో కారణం. నగరంలో ఆర్టీసీ బస్సుల వల్లనే 11 శాతం రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు పోలీసు అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సిగ్నల్ జంపింగ్‌లు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకైతే లెక్కే ఉండడం లేదు. ఏటా 7000 నుంచి 10,000 వరకు ఇలాంటి ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయి. రోజుకు 10 నుంచి 15 బస్సులు బ్రేక్‌డౌన్.... * గ్రేటర్లో 29 డిపోల నుంచి ప్రతి రోజు 3550 బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. వీటిలో కాలం చెల్లినవి, సామర్ధ్యం లేనివి, నాణ్యతలేని విడిభాగాల కారణంగా చెడిపోయేవి రోజూ 10 నుంచి 15 బస్సులు ఉంటాయి. ఒక బస్సు ఆగిపోతే ఆ రోజు 250 కిలోమీటర్ల వరకు రవాణా సదుపాయం నిలిచిపోయినట్లే. ఈ లెక్కన 2500 కిలోమీటర్ల నుంచి 3750 కిలోమీటర్ల వరకు సర్వీసులు రద్దవుతాయి. ప్రతి నెలా 350 నుంచి 450 వరకు బస్సులు బ్రేక్‌డౌన్ అవుతున్నాయి. నగరంలో సిటీ బస్సులు ♦ మొత్తం డిపోలు : 29 ♦ మొత్తం బస్సులు : 3550 ♦ ఆర్డినరీ బస్సులు : 2299 ♦ మెట్రో ఎక్స్‌ప్రెస్ : 886 ♦ మెట్రో డీలక్స్ : 161 ♦ లోఫ్లోర్ ఏసీ : 58 ♦ సూపర్‌లగ్జరీ : 46 ♦ మెట్రో లగ్జరీ : 80 ♦ వజ్ర : 14, గరుడ : 6, రాజధాని : 17 ♦ ప్రస్తుతం మెట్రో ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో సుమారు వెయ్యి డొక్కువే. ♦ గతంలో జెఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద కొనుగోలు చేసిన బస్సులన్నీ ఇప్పుడు చాలా వరకు చెడిపోయాయి. ♦ కొత్త బస్సుల కొనుగోళ్లకు నిధుల కొరత, వరుస నష్టాల కారణంగా డొక్కు బస్సులనే నడుపుతున్నారు. ♦ సిటీ ఆర్టీసీని మెరుగుపర్చేందుకు ఇప్పటికిప్పుడు 1000 కొత్త బస్సులు అవసరం. ♦ ఒక బస్సు జీవితం కాలం కనీసం 15 సంవత్సరాలు లేదా 10.5 లక్షల కిలోమీటర్లు. కానీ చాలా బస్సులు జీవితకాలం ముగిసినవే ఉన్నాయి. బస్సులు నడపలేకపోతున్నాం స్పేర్‌పార్ట్స్ సరిగ్గా ఉండవు. రేర్ మిర్రర్ పని చేయదు. వైపర్స్ ఉండవు. ఒక్కోసారి ఎక్సలేటర్లు, గేర్లు, ఇబ్బంది పెడుతాయి. బ్రేక్‌లు ఫెయిల్ అవుతాయని ఉహించలేం కదా. బస్సు కండీషన్‌గా ఉంచాల్సిన బాధ్యత మెకానిక్ విభాగానిది. విడిభాగాలు సకాలంలో అందకపోతే కూడా ఇబ్బందే. ఒక్కోసారి సర్దుబాటు చేసి పంపిస్తారు. కానీ తీరా రోడ్డెక్కిన తరువాత బస్సు సడెన్‌గా ఆగిపోతుంది. – మహేష్, ఆర్టీసీ యూనియన్ నాయకుడు రోడ్లు కూడా కారణమే... బస్సులకు ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా గుంతల రోడ్ల వల్ల తరచుగా చెడిపోతున్నాయి. బస్సులు నడపడమే కష్టమవుతోంది. నడుములు విరుగుతున్నాయి. ఆరోగ్యం దెబ్బతింటోంది. రోడ్లే పెద్ద సమస్య. అడుగడుగునా గుంతలే. చాలా ఇబ్బందిగా ఉంది. – యాదగిరి, డ్రైవర్, కంటోన్మెంట్ -
త్వరలో బస్సు చార్జీలు పెంపు
ఆదాయం జీతభత్యాలకే సరిపోతోంది మంత్రి రామలింగారెడ్డి సాక్షి, బెంగళూరు : ఒకటి రెండు రోజుల్లో కేఎస్ఆర్టీసీ (కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ) తోపాటు ఈశాన్య, వాయువ్య విభాగాల బస్సు టికెట్టు ధరలను పెంచబోతున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి వెల్లడించారు. ఇంధన, నిర్వహణ వ్యయం పెరుగుతుండటం వల్ల ప్రయాణికులపై భారం వేయక తప్పడం లేదని అన్నారు. బెంగళూరులోని బీఎంటీసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు రవాణా సంస్థకు వస్తున్న మొత్తం ఆదాయంలో ఎక్కువ భాగం సిబ్బంది జీతభత్యాలకు, డీజిల్ కొనుగోలుకు వెచ్చిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చాల్సి ఉందన్నారు. ఈ పరిస్థితులన్నీ పరిగణలోకి తీసుకుంటే టికెట్టు ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. టికెట్టు ధరల పెంపు 7 నుంచి 8 శాతం మధ్య ఉండవచ్చునని ఆయన తెలిపారు. ఇటీవల పెరిగిన బీఎంటీసీ ధరలతో పోలిస్తే త్వరలో పెంచనున్న కేఎస్ఆర్టీసీ టికెట్టు ధరల పెంపు తక్కువని మంత్రి రామలింగారెడ్డి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. చెన్నై, ఢిల్లీ తదితర నగర సిటీ బస్ సర్వీసులతో పోలిస్తే బీఎంటీసీలో మొదటి, రెండు, మూడో స్టేజీ టికెట్టు ధరలు ఎక్కువగా ఉన్న మాట వాస్తవమని ఆయన అంగీకరించారు. ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడానికి ముందుకు వస్తే పెంచిన ధరలను తప్పకుండా తగ్గిస్తామన్నారు. అత్యవసర ద్వారం లేని వోల్వో బస్సులను సీజ్ చేసి నిర్వాహకుల నుంచి డాక్యుమెంట్లను అధికారులు స్వాధీన పరుచుకుంటున్నారన్నారు. ఈ బస్సులను అధికారులే గ్యారేజీలకు తరలిస్తున్నారన్నారు. అక్కడ బస్సులకు అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేసిన తర్వాతనే తిరగడానికి అనుమతిస్తామన్నారు. ఈ నిబంధనలు ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటకకు రాకపోకలు సాగించే వోల్వో బస్సులకూ వర్తిస్తాయన్నారు. బీఎంటీసీ, కేఎస్ఆర్టీసీకి సంబంధించిన స్థలా లు, భవనాలు లీజుకు ఇవ్వడంలో అక్రమాల విషయంపై ఇప్పుడే తాను సమాధానం చెప్పలేనని మంత్రి రామలింగారెడ్డి పేర్కొన్నారు.