సిటీ బస్సులు హడలెత్తిస్తున్నాయి. బ్రేక్‌డౌన్‌ల కారణంగా ఎక్కడపడితే అక్కడ రోడ్లపై మొరాయిస్తున్నాయి. సకాలంలో మరమ్మతులు చేయకపోవడం, విడిభాగాలు అమర్చకపోవడం వంటి కారణాలతో బ్రేకులు ఫెయిలై మృత్యుదూతల్లా దూసుకొస్తున్నాయి. ఏ బస్సు ఎక్కడ ఆగిపోతుందో..ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి.
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అధ్వాన్నపు రహదారులు ఒకవైపు జనాల్ని ఇబ్బంది పెడుతుండగా..మరోవైపు డొక్కు సిటీ బస్సులు సైతం నగరవాసులకు నరకం చూపిస్తున్నాయి. తరచూ బ్రేక్‌డౌన్‌ల కారణంగా రోడ్లపై మొరాయిస్తున్నాయి. ఉన్నపళంగా రోడ్లపై నిలిచిపోవడం, దుకాణాల్లోకి దూసుకొనిపోయి ప్రమాదాలు చోటుచేసుకోవడం, రోడ్డు డివైడర్లు ఎక్కేయడం వంటి దుర్ఘటనలు ప్రయాణికులనే కాకుండా నగరవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. శనివారం విజయవాడలో ఓ సిటీ బస్సుకు బ్రేకులు ఫెయిల్ కావడంతో చోటుచేసుకున్న ప్రమాదం తరహాలో నగరంలోనూ తరచుగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సకాలంలో బస్సులకు మరమ్మతులు చేయకపోవడం, సరైన విడిభాగాలు అందుబాటులో లేకపోవడం, వందల సంఖ్యలో కాలం చెల్లిన బస్సులే రోడ్లపైన తిరగడంతో బ్రేకులు ఫెయిల్ అవుతున్నాయి.
దీంతో రోడ్డు ప్రమాదాలతో పాటు, బస్సులు రోడ్లపైన నిలిచిపోవడం వల్ల కిలోమీటర్‌ల కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోతుంది. ఒకవైపు మెట్రో కారణంగా, మరోవైపు వర్షాలకు దారుణంగా దెబ్బతిన్న రోడ్ల వల్ల నగరమంతటా ప్రజలు ట్రాఫిక్ నరకాన్ని చవి చూస్తుండగా సిటీ బస్సుల బ్రేక్ డౌన్స్ అందుకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో 3550 బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయం అందజేస్తుండగా వాటిలో వెయ్యికి పైగా డొక్కు బస్సులే ఉన్నాయి. ఈ డొక్కు బస్సుల్లోనూ 11 లక్షల కిలోమీటర్లు దాటిన కాలం చెల్లిపోయిన బస్సులు సగం మేరకు ఉండవచ్చునని అంచనా.
మృత్యుశకటాలు....
బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్లు బస్సులను అదుపు చేయలేక ప్రమాదాలకు పాల్పడుతున్నారు. సిటీ బస్సులు నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. గతంలో కవాడిగూడలో జరిగిన ప్రమాద ఘటనలో చెంగిచెర్ల డిపోకు చెందిన ఓ బస్సు అదుపు తప్పి స్కూటీ పై వెళుతున్న ఇద్దరు అమ్మాయిలను ఢీకొట్టింది. దాంతో ఆ ఇద్దరు తీవ్ర గాయాలతో దర్మరణం పాలయ్యారు. ఆ ప్రమాదం మొత్తం నగరాన్నే తీవ్ర ఆందోళనకు గురి చేసింది. రెండేళ్ల క్రితం బండ్లగూడ డిపోకు చెందిన బస్సు ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఓ యువకున్ని బలితీసుకుంది. డొక్కు బస్సుల కారణంగా ప్రతి సంవత్సరం వందలాది ప్రమాదాలకు కారణమవుతున్నప్పటికీ ఆర్టీసీలో ఎలాంటి దిద్దుబాటు చర్యలు లేకపోవడం గమనార్హం. అప్పట్లో సికింద్రాబాద్ ప్యాట్నీ వద్ద ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ మృత్యువాత పడింది.
అదే ఏడాది ఓ బస్సు బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల బంజారాహిల్స్‌లోని ఐస్‌క్రీమ్ పార్లర్‌లోకి దూసుకెళ్లింది. గత మూడేళ్లలో సుమారు 350కి పైగా బస్సు ప్రమాదాలు జరగ్గా...170 మంది వరకు మృత్యువాత పడ్డట్లు అంచనా. అంతకు రెట్టింపు సంఖ్యలో గాయాలకు గురయ్యారు. డ్రైవర్ల నిర్లక్ష్యం ఒక కారణం అయితే కాలం చెల్లిన, డొక్కు బస్సులు మరో కారణం. నగరంలో ఆర్టీసీ బస్సుల వల్లనే 11 శాతం రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు పోలీసు అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సిగ్నల్ జంపింగ్‌లు, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకైతే లెక్కే ఉండడం లేదు. ఏటా 7000 నుంచి 10,000 వరకు ఇలాంటి ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయి.
రోజుకు 10 నుంచి 15 బస్సులు బ్రేక్‌డౌన్....
* గ్రేటర్‌లో 29 డిపోల నుంచి ప్రతి రోజు 3550 బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. వీటిలో కాలం చెల్లినవి, సామర్ధ్యం లేనివి, నాణ్యతలేని విడిభాగాల కారణంగా చెడిపోయేవి రోజూ 10 నుంచి 15 బస్సులు ఉంటాయి. ఒక బస్సు ఆగిపోతే ఆ రోజు 250 కిలోమీటర్ల వరకు రవాణా సదుపాయం నిలిచిపోయినట్లే. ఈ లెక్కన 2500 కిలోమీటర్ల నుంచి 3750 కిలోమీటర్ల వరకు సర్వీసులు రద్దవుతాయి. ప్రతి నెలా 350 నుంచి 450 వరకు బస్సులు బ్రేక్‌డౌన్ అవుతున్నాయి.
నగరంలో సిటీ బస్సులు
♦ మొత్తం డిపోలు : 29
♦ మొత్తం బస్సులు : 3550
♦ ఆర్డినరీ బస్సులు : 2299
♦ మెట్రో ఎక్స్‌ప్రెస్ : 886
♦ మెట్రో డీలక్స్ : 161
♦ లోఫ్లోర్ ఏసీ : 58
♦ సూపర్‌లగ్జరీ : 46
♦ మెట్రో లగ్జరీ : 80
♦ వజ్ర : 14, గరుడ : 6, రాజధాని : 17
♦ ప్రస్తుతం మెట్రో ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో సుమారు వెయ్యి డొక్కువే.
♦ గతంలో జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద కొనుగోలు చేసిన బస్సులన్నీ ఇప్పుడు చాలా వరకు చెడిపోయాయి.
♦ కొత్త బస్సుల కొనుగోళ్లకు నిధుల కొరత, వరుస నష్టాల కారణంగా డొక్కు బస్సులనే నడుపుతున్నారు.
♦ సిటీ ఆర్టీసీని మెరుగుపర్చేందుకు ఇప్పటికిప్పుడు 1000 కొత్త బస్సులు అవసరం.
♦ ఒక బస్సు జీవితం కాలం కనీసం 15 సంవత్సరాలు లేదా 10.5 లక్షల కిలోమీటర్లు. కానీ చాలా బస్సులు జీవితకాలం ముగిసినవే ఉన్నాయి.
బస్సులు నడపలేకపోతున్నాం
స్పేర్‌పార్ట్స్ సరిగ్గా ఉండవు. రేర్ మిర్రర్ పని చేయదు. వైపర్స్ ఉండవు. ఒక్కోసారి ఎక్సలేటర్‌లు, గేర్లు, ఇబ్బంది పెడుతాయి. బ్రేక్‌లు ఫెయిల్ అవుతాయని ఉహించలేం కదా. బస్సు కండీషన్‌గా ఉంచాల్సిన బాధ్యత మెకానిక్ విభాగానిది. విడిభాగాలు సకాలంలో అందకపోతే కూడా ఇబ్బందే. ఒక్కోసారి సర్దుబాటు చేసి పంపిస్తారు. కానీ తీరా రోడ్డెక్కిన తరువాత బస్సు సడెన్‌గా ఆగిపోతుంది. – మహేష్, ఆర్టీసీ యూనియన్ నాయకుడు
రోడ్లు కూడా కారణమే...
బస్సులకు ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా గుంతల రోడ్ల వల్ల తరచుగా చెడిపోతున్నాయి. బస్సులు నడపడమే కష్టమవుతోంది. నడుములు విరుగుతున్నాయి. ఆరోగ్యం దెబ్బతింటోంది. రోడ్లే పెద్ద సమస్య. అడుగడుగునా గుంతలే. చాలా ఇబ్బందిగా ఉంది. – యాదగిరి, డ్రైవర్, కంటోన్మెంట్
Comments
Please login to add a commentAdd a comment