ప్యాట్నీ బస్టాప్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికులు
సాక్షి, సిటీబ్యూరో: సిటీ బస్సులు ప్రయాణికులకు పట్టపగలు చుక్కలు చూపిస్తున్నాయి. బస్టాపుల్లో గంటల తరబడి పడిగాపులు కాచేలా చేస్తున్నాయి. ఏ బస్సు ఎప్పుడొస్తుందో తెలియని అనిశ్చితి. గ్రేటర్ ఆర్టీసీలో సమయపాలన కొండెక్కి కూర్చుంది. ఒక రూట్ బస్సులు ఒకేసారి అన్నీ ఒకదానికి వెనుక ఒకటి వరుసగా (బంచ్)గా వచ్చేస్తాయి. ఒక్కోసారి గంటలు గడిచినా కనుచూపు మేరలో బస్సు కనిపించదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని ప్రధానమైన రూట్లు మినహాయిస్తే నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇదే దుస్థితి నెలకొంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు అందుబాటులో ఉండకపోవడం, బస్సుల నిర్వహణలోని వైఫల్యాలు, అమలుకు నోచని సమయపాలన ప్రయాణికుల పాలిట శాపంగా మారాయి. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు తదితర వర్గాలకు చెందిన ప్రయాణికులు బస్సులు లభించకపోవడంతో సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. ఒకవైపు అన్ని రూట్లలోకి మెట్రో రైలు దూసుకొస్తోంది. మరోవైపు ఏటేటా ఆర్టీసీ నష్టాలు రూ.వందల కోట్లలో పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన రవాణా సదుపాయాన్ని కల్పించలేకపోవడం ఆర్టీసీ వైఫల్యంగా కనిపిస్తోంది.
సమయపాలన హుష్ కాకి......
సికింద్రాబాద్–పటాన్‌చెరు, కోఠి– కొండాపూర్, ఉప్పల్–మెహదీపట్నం, కొండాపూర్–ఉప్పల్ వంటి సుమారు వందకు పైగా మార్గాల్లో మాత్రమే బస్సులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తిరుగుతున్నాయి. ఈ రూట్లలోనూ ఒకేసారి బంచ్‌గా రావడం వల్ల సమయపాలన లోపిస్తోంది. ఉదాహరణకు సికింద్రాబాద్ నుంచి మెహదీపట్నం వెళ్లే బస్సు ఉదయం 8 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, ముప్పావుగంట ఆలస్యంగా కదులుతుంది. కానీ ఆ ముప్పావు గంట సమయంలో బయలుదేరాల్సిన మరో రెండు బస్సులు కూడా అదే సమయానికి బయలుదేరుతాయి. దీంతో ఉదయం 9 గంటల బస్సు కోసం ఎదురు చూసేవాళ్లకు ఆ బస్సు లభించదు. మరో గంట గడిస్తే తప్ప ఆ రూట్‌లో వెళ్లే బస్సులు రావు.
ఏదో ఒక్క రూట్‌లో మాత్రమే కాదు. నగరంలోని అనేక మార్గాల్లో ఇదే పరిస్థితి. నగరంలోని వివిధ డిపోల నుంచి బయలుదేరే బస్సుల సమయపాలనపై సమన్వయం లేకపోవడం వల్ల, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంటున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గ్రేటర్‌లోని 29 డిపోల పరిధిలో ప్రతి రోజు 3550 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. 1050 మార్గాల్లో ఈ బస్సులను నడుపుతున్నారు. కానీ డిపోల వారీగా రూట్లు, ఆ రూట్లలో నడిచే బస్సుల నిర్వహణపై సమన్వయం లేకపోవడమే సమయపాలన పాటించకపోవడం వల్లనే సమస్యలు తలెత్తుతున్నట్లు పలువురు డిపోమేనేజర్లు అభిప్రాయపడ్డారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. ఆ తరువాత రద్దీ కొద్దిగా తగ్గినా డిమాండ్ మాత్రం బాగానే ఉంటుంది. కానీ ఈ డిమాండ్‌కు తగిన బస్సులు మాత్రం అందుబాటులో ఉండవు. రాత్రి 9 దాటితే కొన్ని రూట్లలో బస్సుల జాడ కనిపించదు. అలాగే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బస్సుల కోసం ప్రయాణికులకు పడిగాపులు తప్పవు.
ఫిర్యాదుల వెల్లువ...
గ్రేటర్ ఆర్టీసీ ప్రతి నెలా డిపో స్థాయి నుంచి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ స్థాయి అధికారి వరకు నిర్వహిస్తోన్న ‘ డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్’ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 50 శాతానికి పైగా బస్సులు సకాలంలో రావడం లేదని, రాత్రి పూట బస్సులు అందుబాటులో లేవని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగతా ఫిర్యాదుల్లో తమ కాలనీలకు బస్సులు రాకపోవడం పై కాలనీ సంఘాలు, పౌరసంఘాలు, వ్యక్తులు ఫిర్యాదులు చేస్తున్నారు.ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తన, ర్యాష్ డ్రైవింగ్, బస్సులు రోడ్డు మధ్యలో నిలపడం, బస్సుల డెస్టినేషన్ బోర్డులు సరిగ్గా కనిపించకపోవడం వంటి అంశాలపైనా ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువుత్తుతున్నాయి. ప్రతి నెలా చివరి సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించే ఈ డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్ కార్యక్రమంలో ఒక్కో డిపో పరిధిలో సగటున 25 ఫిర్యాదులు వస్తే వాటిలో సగానికి పైగా బస్సులు సకాలంలో రావడం లేదనే అంశానికి సంబంధించినవే కావడం గమనార్హం.సంస్థాగతమైన లోపాలతో పాటు, ట్రాఫిక్ రద్దీ, మెట్రో రూట్లలో అధ్వాన్నంగా మారిన రోడ్ల వల్ల కూడా బస్సుల రాకపోకల్లో జాప్యం చోటుచేసుకుంటుంది. సాయంత్రం 5 గంటలకు విధుల్లో చేరిన సిబ్బంది ట్రాఫిక్ రద్దీ కారణంగా బస్సులు ఆలస్యంగా నడుస్తున్నాయనే కారణంతో రాత్రి 9 తరువాత వెళ్లాల్సిన ట్రిప్పులను ఏకపక్షంగా రద్దు చేస్తున్నారు. దీంతో రాత్రి పూట బస్సుల కోసం ఎదురు చూసే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇదీ గ్రేటర్ ఆర్టీసీ..
మొత్తం డిపోలు : 29
బస్సుల సంఖ్య : 3850
ఈ బస్సులు తిరిగే రూట్లు : 1050, మొత్తం ట్రిప్పులు : 42 వేలు.
ప్రతి రోజు రాకపోకలు సాగించేప్రయాణికుల సంఖ్య : 33 లక్షలు.
Comments
Please login to add a commentAdd a comment