హైదరాబాద్: ఆర్టీసీ టి–24 టికెట్లపై మరో రాయితీని ప్రకటించింది. గ్రేటర్‌లో రాకపోకలు సాగించేందుకు ఇప్పటి వరకు రూ.100 ఉన్న టి–24 టికెట్ ధరలను రూ.90కు తగ్గించింది. 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు టికెట్లు రూ.80కే లభిస్తాయి. వారికి 20 శాతం రాయితీ వర్తించనుంది. వయసు ధ్రువీకరణ కోసం సీనియర్ సిటిజన్లు తమ ఆధార్ కార్డును బస్ కండక్టర్లకు విధిగా చూపించాల్సి ఉంటుంది.
గురువారం నుంచే ఈ రాయితీలు అమల్లోకి రానున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. టి–24 టికెట్లపై సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 24 గంటల పాటు ఎక్కడి నుంచి ఎక్కడికై నా ప్రయాణించవచ్చు. మొదట్లో ఆ టికెట్ ధర రూ.120 వరకు ఉండేది. ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గించేందుకు రూ. 100కి తగ్గించారు. తాజాగా సాధారణ ప్రయాణికులకు టి–24 టికెట్ ధరను రూ.90కి, సీనియర్ సిటిజన్లకు రూ.80కి తగ్గిస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.
ఎండాకాలంలో ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు ఈ రాయితీని కల్పిస్తున్నట్లు ఎండీ తెలిపారు. ఈ టికెట్లకు ప్రయాణికుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోందని, ప్రతి రోజు సగటున 25 వేల వరకు అమ్ముడవుతున్నాయని పేర్కొన్నారు. మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం రూ.50కే లభించే టి–6 (ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు) టికెట్లకు కూడా మంచి ఆదరణ ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment