విద్యార్థీ.. నీకు బస్సేదీ? | College Students Suffering Bus Shortage in Hyderabad Outcuts | Sakshi
Sakshi News home page

సర్కస్‌ ట్రావెల్‌!

Published Fri, Sep 20 2019 8:02 AM | Last Updated on Fri, Sep 27 2019 1:42 PM

College Students Suffering Bus Shortage in Hyderabad Outcuts - Sakshi

పాట్లు.. సర్కస్‌ ఫీట్‌లు: ఘట్‌కేసర్‌– అవుషాపూర్‌ రూట్‌లో..

ఉప్పల్‌ నుంచి ఘట్‌కేసర్, భోగారం వైపు బస్సు సర్వీసులను పెంచాలని ఇటీవల కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆపకుండా వెళ్తున్న ఓ బస్సు వెనక అద్దాలను పగులగొట్టారు. కనీసం ఫుట్‌బోర్డుపై నిల్చుని వెళ్లేందుకు కూడా అవకాశం లేకపోవడంతో.. బస్సు వెనకున్న అంచుపై నిల్చొని ప్రయాణం చేశారు. అత్యంతప్రమాదకరమైన ఈ ప్రయాణ వీడియో నగర శివార్లలోని కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఎదుర్కొంటున్నఇబ్బందులకు అద్దం పట్టింది. క్షణాల్లో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్క సికింద్రాబాద్‌ – ఉప్పల్‌ – ఘట్‌కేసర్‌ మార్గంలోనే కాదు... నగరానికి నలువైపులా ఉన్న అన్ని మార్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.సరిపడా బస్సులు అందుబాటులో లేకపోవడంతోనే ఈ దుస్థితి తలెత్తింది. బస్సులు కిక్కిరిసిపోవడంతో విద్యార్థులు ఫుట్‌బోర్డు ప్రయాణం చేయడం... ప్రైవేట్‌ వాహనాలు, బైకులపై కాలేజీలకు వెళ్తుండడంతోతరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. సిటీ శివార్లలోని కళాశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం

సరిపోని సర్వీస్‌లు..
నగర శివారులోని వివిధ ప్రాంతాల్లో వందలాదిగా ఇంజినీరింగ్, ఒకేషనల్, ఐటీఐ తదితర కళాశాలలు ఉన్నాయి. వేలాది మంది విద్యార్థులు వీటిలో చదువుకుంటున్నారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న బస్సులు సుమారు 1,500 వరకు ఉన్నాయి. సాధారణ ప్రయాణికులతో పాటు  విద్యార్థులు సైతం ఈ బస్సుల్లో వెళ్లాల్సి ఉంటుంది. దీంతో అప్పటికే కిక్కిరిసిపోయిన బస్సుల్లో విద్యార్థులు ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజూ 80 బస్సులు అదనంగా నడుపుతున్నట్లు ఆర్టీసీ చెబుతోంది. కానీ విద్యార్థుల డిమాండ్, రద్దీకి అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. దీంతో ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. బైక్‌లపై వేగంగా వెళుతూ అదుపు  తప్పి పడిపోతున్నారు. ఇలా ఏటా అనేక మంది ప్రమాదాలకు గురై గాయాలపాలవుతున్నారు. మృత్యువాత పడుతున్న సంఘటనలు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. 

ఈ రూట్‌లో నిత్యం 40వేల మంది విద్యార్థులు..  
ప్రతి నిత్యం ఆల్వీన్‌ క్రాస్‌ రోడ్డు నుంచి మాదాపూర్, కొండాపూర్‌ వైపు, బాచుపల్లి, బొల్లారం, గండిపేట వైపు వెళ్లే బస్సుల సంఖ్య చాలా తక్కువ ఉండడంతో ఆ రూట్‌లో వెళ్లే విద్యార్థులు బస్సులకు వేలాడుతూ ఫుట్‌ బోర్డు ప్రయాణం చేయాల్సి వస్తోంది. ప్రతిరోజు 40 వేల మంది వరకు విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారు. పటాన్‌చెరు నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్లే బస్సులు కూడా రద్దీగా వెళ్తున్నాయి. డ్రైవర్లు స్టాప్‌లలో బస్సులు ఆపకపోవడంతో విద్యార్థులు రన్నింగ్‌లో బస్సెక్కి ప్రమాదాలకు గురవుతున్నారు. మియాపూర్‌ డిపో–1 నుంచి 70 బస్సులు, మియాపూర్‌ డిపో –2 నుంచి 107 బస్సులు ఆయా రూట్‌లలో ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. పాతబస్తీ చాంద్రాయణగుట్టలోని ఇంజినీరింగ్‌ కళాశాలల రూట్‌లో సరైన ఆర్టీసీ బస్సులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరోరా, మహవీర్, ఇస్లామియా ఇంజినీరింగ్‌ కళాశాలలకు నగరం నుంచి నిత్యం వేల సంఖ్యలో విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రధానమైన ‘300’ రూట్‌లో ఉన్న ఈ కళాశాలలకు సరైన సమయంలో బస్సులు పూర్తి స్థాయిలో తిరగడం లేదు. వెరసీ.. విద్యార్థులు ప్రమాదకరంగా ఫుట్‌బోర్డింగ్‌ ప్రయాణం చేయాల్సివస్తోంది.  

ఉరికితేనే బస్సు దొరికేది: పరుగులు తీస్తున్న విద్యార్థులు
ఇదీ పరిస్థితి  
నగర శివార్లలోని వివిధ ప్రాంతాలకు ప్రతిరోజు 1500 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. రద్దీ దృష్ట్యా మరో 80 బస్సులు అదనంగా నడుపుతున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ... అవి విద్యార్థులకు సరిపోవడం లేదు.  
మేడ్చల్‌లోని కండ్లకోయ, మేడ్చల్, మైసమ్మగూడ, కీసర, ఘట్‌కేసర్‌ తదితర ప్రాంతాల్లో 50కి పైగా కాలేజీలు ఉన్నాయి. వీటిలో 10వేల మందిపైగా విద్యార్థులు ఉన్నారు. కానీ విద్యార్థుల రద్దీకి సరిపడా బస్సులు లేవు.  
మేడ్చల్‌ – సికింద్రాబాద్, ఘట్‌కేసర్‌ – భోగారం, ఘట్‌కేసర్‌ – అవుషాపూర్‌ రూట్లలో మరో 40–50 బస్సులు నడిపించాలని విద్యార్థులు కోరుతున్నారు.  
ఎల్‌బీనగర్‌ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై హయత్‌నగర్‌ మొదలుకొని 12 ఇంజినీరింగ్‌ కళాశాలలు, నాగార్జునసాగర్‌ రహదారిపై దాదాపు 12 ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. ఈ మార్గాల్లో ప్రయాణానికి విద్యార్థులు నరకం అనుభవిస్తున్నారు. 

ప్రమాదకరం.. ఫుట్‌బోర్డు ప్రయాణం ..
కుత్బుల్లాపూర్‌ వైపు..
నియోజకవర్గ పరిధి శివారు ప్రాంతాల్లో ఉన్న 12 ఇంజినీరింగ్‌ కళాశాలలు, పలు జూనియర్‌ కళాశాలల్లో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. వీరి కొందరు కాలేజీ బస్సుల్లో వస్తున్నప్పటికి చాలా మంది విద్యార్థులు ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడుతున్నారు. ఒక్క కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోనే కాకుండా మేడ్చల్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాలకు వెళ్లాలన్నా ఇటునుంచే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలి. ప్రతి విద్యా సంవత్సరానికి విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికి తదనుగుణంగా ఈ రూట్లల్లో ఆర్టీసీ బస్సులు పెరగడం లేదు. దీంతో ఫుట్‌బోర్డులపై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. సుచిత్ర నుంచి కొంపల్లి వరకు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల సమయంలో దాదాపు 50 సర్వీసు ఆటోలు ఉన్నప్పటికి వీటిల్లో కూడా విద్యార్థులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. బాచుపల్లి– గండిమైసమ్మ, బాలానగర్‌ నుంచి గండిమైసమ్మ, సుచిత్ర – కొంపల్లి, దూలపల్లి క్రాస్‌ రోడ్డు నుంచి బహదూర్‌పల్లి క్రాస్‌ రోడ్లలో వేలాది మంది విద్యార్థులు నిత్యం ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు.

సమయానుకూలంగా బస్సులు నడపాలి..
మియాపూర్‌ నుంచి బాచుపల్లి బొల్లారం వెళ్లే రూట్‌లో నాలుగు బస్సులే ఉన్నాయి. అవి కూడా పాత డొక్కు పడిన బస్సులు ఉండడంతో మధ్యలోనే ఆగిపోతున్నాయి. సరైన సమయానికి కళాశాలకు వెళ్లడంలేదు. బస్సుల సంఖ్య పెంచాలని గతంలో ఎన్నోసార్లు ట్విట్టర్, ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసినా
పట్టించుకోవడం లేదు.    – రాహుల్‌ ప్రీతమ్‌ , విద్యార్థి

ఫుట్‌బోర్డే దిక్కు..
ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సుల సంఖ్య తక్కువ ఉండడంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో ఫుట్‌బోర్డు ప్రయాణం చేయాల్సివస్తోంది. మాదాపూర్, హైటెస్‌ సిటీ వైపు వెళ్లేందుకు బస్సులు అతి తక్కువగా ఉన్నాయి. దీంతో బస్సులు సమయానికి రాక ఉన్న బస్సుల్లోనే ఇరుకు ఇరుకుగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. బస్టాప్‌లలో కొంతమంది డ్రైవర్లు నిలబడకుండా వెళ్తుండడంతోరన్నింగ్‌లోబస్సు ఎక్కాల్సివస్తోంది.   – కౌశిక్, విద్యార్థి 

ఆగకుండానే వెళ్తున్నాయి..   
నేను ప్రతిరోజూ ఒవైసీ ఆస్పత్రి మీదుగా అరోరా ఇంజినీరింగ్‌ కళాశాలకు వెళ్తుంటాను. ఉదయం 8.30 గంటల అనంతరం బస్సులు పూర్తి స్థాయిలో నడవడం లేదు. పూర్తిగా రద్దీగా ఉంటోంది. 8.30 గంటల కంటే ముందు ఐదారు బస్సులు ఒకేసారి వెళ్తుంటాయి. దీంతో పాటు స్టాప్‌లలో కొన్నిసార్లు బస్సులను ఆపడం లేదు. ఆటోలో వెళ్లాల్సి వస్తోంది.– వినయ్, మహవీర్‌ కళాశాల   

సాయంత్రం ఎదురుచూపులే..  
సాయంత్రం వేళ ఎల్‌బీనగర్‌ వైపు బస్సులు చాలా తక్కువ సంఖ్యలో నడుస్తున్నాయి. సాయంత్రం 4.30 గంటలకు కళాశాల ముగిశాక బస్సుల కోసం గంటన్నర సేపు ఎదురు చూడాల్సి వస్తోంది. ఆరు గంటల అనంతరమే పూర్తి స్థాయిలో బస్సులను నడుపుతున్నారు. ఉదయం పూట కూడా కాలేజీకి వచ్చే సమయంలోనే బస్సులు తక్కువగా వస్తున్నాయి.  – సాయితేజ, మహవీర్‌ కళాశాల  

ఇది చాలా దారుణం.. 
ట్రాఫిక్‌ పోలీసులు,ఆర్టీసీ అధికారులు ఫుట్‌బోర్డు ప్రయాణం మంచిది కాదని నీతులు చెబుతున్నారు. కాని సరిపడాబస్సులున్నాయా లేదా అనేది ఆలోచించకపోవడం దారుణం. బస్సులుంటేఫుట్‌ బోర్డు ప్రయాణం ఎందుకు చేస్తాం.– శ్రీలేఖ, బీటెక్‌ ప్రిన్సిటన్‌ కళాశాల,ఘట్‌కేసర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement