footboard
-
అద్దం కనిపిస్తలేదు.. స్టీరింగ్ తిరుగుతలేదు...
హుజూరాబాద్: ‘ఫుట్‌బోర్డుపై మీరు నిలబడితే నాకు సైడ్ మిర్రర్ కనిపిస్త లేదు. అద్దం చూడకుండా బస్సు నడపలేను. ఇంతమందితో బస్సు ముందుకు పోవాలంటే కష్టమే.. కనీసం స్టీరింగ్ తిరుగుతలేదు. కొందరు దిగాల్సిందే..’అంటూ ఓ ఆర్టీసీ డ్రైవర్ బస్సును నడిరోడ్డుపై నిలిపివేశాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సిరిసిల్ల డిపోకు చెందిన బస్సు వరంగల్‌కు వెళ్తోంది. దారిలో హుజూరాబాద్ బస్టాండ్‌లో ఆగింది. అప్పటికే బస్సునిండా ప్రయాణికులు ఉన్నారు. నిల్చునేందుకు కూడా స్థలం లేదు. అయినప్పటికీ బస్టాండులో వరంగల్ వెళ్లేవారు మరికొంతమంది ఎక్కారు. డ్రైవర్ ఓవర్ లోడ్ అవుతోందని, బస్సు నడిపే పరిస్థితి ఉండదని ప్రయాణికులను వారించినా వినిపించుకోలేదు. బస్సు బస్టాండ్ నుంచి బయటకు వచ్చిన తరువాత డ్రైవర్‌కు సైడ్ మిర్రర్ కనిపించడం లేదు. దీంతో అద్దం కనిపించడం లేదని, వెనకనుంచి వచ్చే వాహనాలను గమనించకుండా బస్సుని నడపలేనని డ్రైవర్ బస్సును రోడ్డుపై నిలిపివేశాడు. ఇంతమంది ఎక్కితే కనీసం బస్సు స్టీరింగ్ తిరగడం లేదని చెప్పాడు. ప్రయాణికులు సహకరించి కొందరు దిగిపోవాలని అభ్యరి్థంచాడు. దీంతో కొంతమంది దిగిపోవడంతో బస్సు వరంగల్ బయల్దేరింది. -
యాదాద్రి: ఫోన్‌ను రక్షించుకోబోయి టెక్కీ దుర్మరణం
సాక్షి, హన్మకొండ: విధి ఎంత విచిత్రమైందో.. సంతోషాన్ని క్షణాల్లోనే ఆవిరి చేసేస్తోంది. శ్రీకాంత్(25) అనే యువకుడిని జీవితం అలా అర్థాంతరంగా ముగిసిపోయింది. సెల్‌ఫోన్‌ను రక్షించుకోవాలనే తాపత్రయంతో రన్నింగ్ ట్రైన్ నుంచి పడి ప్రాణం కోల్పోయాడా యువకుడు. శాతావాహన్ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం బీబీనగర్(యాదాద్రి భువనగిరి) సమీపంలో ఈ విషాదం జరిగింది. కమలాపూర్ మండలం నేరెళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన ముప్పు శ్రీకాంత్ అనే యువకుడు బీబీనగర్ సమీపంలో శాతావాహన్ ఎక్స్‌ప్రెస్ నుంచి జారిపడి మృతి చెందాడు. శ్రీకాంత్ హైదరాబాద్‌లో ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. తొలిఏకాదశి, బక్రీద్ సెలవు దినం సందర్భంగా.. ఇంటికి వెళ్లేందుకు బుధవారం సాయంత్రం శాతవాహన ఎక్స్ ప్రెస్‌లో వరంగల్ బయల్దేరాడు. అయితే.. జనం రద్దీ ఎక్కువగా ఉండడంతో రైలులో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్నాడు శ్రీకాంత్. మార్గం మధ్యలో బీబీ నగర్ వద్ద కర్రతో కొట్టి సెల్ ఫోన్ చోరీ చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే సెల్‌ఫోన్‌ను కాపాడుకునే తాపత్రంలో శ్రీకాంత్ పట్టుజారి రైలు నుండి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పండుగకు ఇంటికి కొడుకు వస్తాడని సంతోషంగా ఎదురు చూసిన ఆ తల్లిదండ్రులకు.. కొడుకు శవం ఎదురు రావడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇదీ చదవండి: తండ్రి చేతిలో హతం.. ప్రియురాలు లేని జీవితం ఎందుకనుకుని.. -
Hyderabad: ప్రమాదం అంచున ప్రయాణం.. ఏమాత్రం పట్టుతప్పినా!
సాక్షి, హైదరాబాద్: అదో బస్టాపు.. స్కూలుకు, కాలేజీకి బయలుదేరిన విద్యార్థులు.. ఆఫీసుకు వెళుతున్న ఉద్యోగులు.. ఏవో పనుల మీద ఇతర ప్రాంతాలకు వెళ్తున్న మరికొందరు ప్రయాణికులు.. 40–50 మందిదాకా వేచి ఉన్నారు. అంతలో బస్సు వచ్చింది. అప్పటికే దాదాపు సీట్లన్నీ నిండిపోయి ఉన్నాయి. మరో బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు. సమయం మించిపోతోందంటూ అంతా ఎక్కేశారు. లోపల స్థలం లేక ఫుట్బోర్డుపైనా నిలబడ్డారు. అక్కడక్కడా గుంతలు, మలుపులు, పక్కపక్కనే దూసుకెళ్లే వాహనాలు.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, పట్టుతప్పినా ప్రమాదం బారినపడే పరిస్థితి. హైదరాబాద్ నగరం చుట్టూరా శివార్లలో సిటీ బస్సుల్లో పరిస్థితి ఇది. ఆర్టీసీ బస్సులు తగ్గిపోవడం, ప్రైవేటు రవాణా చార్జీలు పెరిగిపోవడంతో ప్రయాణికులు ఫుట్‌బోర్డులపై నిలబడి ప్రయాణాలు చేస్తున్నారు. పలుమార్లు ప్రమాదాల బారినపడుతున్నారు. ప్రమాదకరం, నేరం అయినా.. మోటారు వాహన చట్టం ప్రకారం ఫుట్‌బోర్డు ప్రయాణం నేరం. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు గతంలో మొబైల్ కోర్టులు ఉండేవి. ఫుట్‌బోర్డు ప్రయాణికులపై జరిమానాలు విధించేవారు. ఇప్పుడు మొబైల్ కోర్టులు లేవుగానీ.. ఫుట్‌బోర్డు జర్నీ మాత్రం ఆగలేదు. ఎంతోమంది మంది ప్రయాణికులు పట్టుతప్పి పడిపోతున్నారు. గాయాలపాలవుతున్నారు. పలుమార్లు బాధితులు చనిపోయిన ఘటనలూ ఉన్నాయి. ఇది రహదారి భద్రతకు సవాల్‌గా మారింది. వందలాది రూట్లకు బస్సుల్లేవు.. ప్రపంచ నగరాలకు దీటుగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరం ప్రజారవాణాలో మాత్రం వెనుకబడిపోతోంది. యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (హుమ్టా) అధ్యయనం ప్రకారం హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (హెచ్ఎంఏ) 7,228 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించింది. నగరంలో అందుబాటులో ఉన్న ప్రజారవాణా సదుపాయం 31 శాతమే. బస్సుల కొరత కారణంగా వందలాది రూట్లను ఆర్టీసీ వదిలేసుకుంది. హైదరాబాద్‌లో గతంలో 1,150 రూట్లలో ప్రతిరోజూ 42 వేల ట్రిప్పులు నడిచిన సిటీ బస్సులు.. ఇప్పుడు 795 రూట్లలో కనీసం 25 వేల ట్రిప్పులు కూడా తిరగడం లేదు. ఏమూల చూసినా అంతే.. ►ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నం, చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే సిటీబస్సుల్లో విద్యార్ధులు, సాధారణ ప్రయాణికులు ప్రతిరోజూ ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రయాణం చేస్తుంటారు. ఉదయం, సాయంత్రం రద్దీవేళల్లో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ►ఉప్పల్ నుంచి ఘట్కేసర్ మీదుగా ఏదులాబాద్ వైపు వెళ్లే విద్యార్ధులు, ఉద్యోగులు ఉదయం 8 గంటలకల్లా బస్సు అందుకోగలిగితేనే సకాలంలో విధులకు హాజరవుతారు. ఆ రూట్లో వెళ్లే ఒకేఒక్క బస్సులో వేలాడుతూ ప్రయాణం చేయాల్సిందే. ఏ కొంచెం ఆలస్యమైనా సెవెన్ సీటర్ ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించాల్సిందే. ఇందుకోసం అయ్యే ఖర్చు అదనపు భారం. ►ఘట్కేసర్, ఇబ్రహీంపట్నం, కీసర, నాగారం, షామీర్పేట్ వంటి రూట్లలోనే కాదు. హైదరాబాద్ చుట్టూ ఉన్న వందలాది కాలనీలకు ఉదయం, సాయంత్రం రెండు, మూడు ట్రిప్పులు మాత్రమే బస్సులు తిరుగుతున్నాయి. ►సికింద్రాబాద్–కోఠీ, ఉప్పల్–కోఠీ వంటి సుమారు 150 రూట్లలో ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు ఉంటే.. పలు మార్గాల్లో అరగంట నుంచి గంటకు ఒకటి చొప్పున మాత్రమే నడుస్తున్నాయి. ►మేడ్చల్ నుంచి పటాన్చెరు మీదుగా గండి మైసమ్మ వరకు ప్రతిరోజు కనీసం 25 బస్సులు నిరంతరం రాకపోకలు సాగించే స్థాయిలో ప్రయాణికుల డిమాండ్ ఉంది. కానీ నడుపుతున్నది 5 బస్సులే. సికింద్రాబాద్–బహదూర్‌పల్లి, సికింద్రాబాద్–మణికొండ తదితర రూట్లలోనూ అదే పరిస్థితి. అక్కడ పెంచుతుంటే.. ఇక్కడ తగ్గాయి.. ►గ్రేటర్ హైదరాబాద్‌లో బస్సుల సంఖ్య మూడేళ్లలో 3,850 నుంచి 2,550కి తగ్గింది. ►ఢిల్లీ నగరంలో బస్సుల సంఖ్య 6 వేలు ఉండగా.. 7 వేలకు పెంచారు. ►బెంగళూరు సిటీలో ప్రస్తుతం 7,000 బస్సులు తిరుగుతున్నాయి. వాటిని 13 వేలకు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రజారవాణాలో హైదరాబాద్.. ►హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా విస్తీర్ణం 7,228 చదరపు కిలోమీటర్లు ►రోడ్ నెట్వర్క్ 5,400కి.మీ. ►జనాభా: సుమారు కోటీ 8 లక్షలు (రాష్ట్ర జనాభాలో 29.6%) సరిగా బస్సులు రాక సమస్య బస్సులు సరిగా అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బందిపడుతున్నాం. కిక్కిరిసి ప్రయాణించాలి. లేదా ఆటోలు, క్యాబ్‌లలో వెళ్లాల్సి వస్తోంది. ఆర్ధికంగా ఎంతో భారం అవుతోంది. – ఎస్.అనిత, టీచర్ రహదారి భద్రతకు విఘాతం బస్సులే కాదు ఆటోలు, క్యాబ్‌లు వంటి ఏ వాహనాల్లోనైనా సామర్థ్యానికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రధాన రహదారుల్లో జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువ శాతం ఇలాంటి ఓవర్‌లోడ్ జర్నీయే. అలాంటి ప్రతి ప్రయాణికుడిపై జరిమానా విధించే అవకాశం ఉంది. – డాక్టర్ పుప్పాల శ్రీనివాస్, ఉప రవాణా కమిషనర్ ప్రమాదం అనిపించినా తప్పడం లేదు ఫుట్‌బోర్డు మీద నిలబడి ప్రయాణం చేయాలని ఎవరూ కోరుకోరు కదా. బస్సులు లేకపోవడం వల్లే చాలా మంది పిల్లలు ఫుట్‌బోర్డ్ జర్నీ చేయాల్సి వస్తోంది. – యాదగిరి, ప్రయాణికుడు -
రైళ్లలో సాహసాలు చేస్తే ఇకపై అంతే సంగతులు
చెన్నై: చెన్నైలోని ఎలక్ట్రిక్, ఎంఆర్టీఎస్ రైళ్లలో వీరంగం సృష్టించినా, సాహసాలు ప్రదర్శించినా కటకటాల్లోకి నెడుతామని విద్యార్థులకు పోలీసులు హెచ్చరించారు. రైళ్లలో కొందరు విద్యార్థుల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. రైలు బయలుదేరే సమయంలో పరుగులు తీయడం, ఫుట్ బోర్డుపై వేలాడుతూ ప్రయాణించడం, రైలు కిటికీలను పట్టుకుని వేలాడటం వంటి సాహసాలు చేసే వాళ్లు ఎక్కువే. అలాగే గ్రూపు తగాదాలకు నెలవుగా కూడా రైల్వే స్టేషన్లు మారాయి. ఈ క్రమంలో విద్యార్థులకు హెచ్చరికలు చేస్తూ రైల్వే, పోలీసు యంత్రాంగం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఎలక్ట్రిక్, ఎంఆర్టీఎస్ రైళ్లల్లో, స్టేషన్లలో అకతాయి తనంతో వ్యవహరించినా, ఇష్టారాజ్యంగా వీరంగం సృష్టించినా, సహసాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైల్వే స్టేషన్లు, మార్గాల్లో నిఘా ఉంచుతామని తెలిపారు. పట్టుబడితే 3 నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. చదవండి: (అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష) -
విద్యార్థీ.. నీకు బస్సేదీ?
ఉప్పల్ నుంచి ఘట్కేసర్, భోగారం వైపు బస్సు సర్వీసులను పెంచాలని ఇటీవల కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆపకుండా వెళ్తున్న ఓ బస్సు వెనక అద్దాలను పగులగొట్టారు. కనీసం ఫుట్‌బోర్డుపై నిల్చుని వెళ్లేందుకు కూడా అవకాశం లేకపోవడంతో.. బస్సు వెనకున్న అంచుపై నిల్చొని ప్రయాణం చేశారు. అత్యంతప్రమాదకరమైన ఈ ప్రయాణ వీడియో నగర శివార్లలోని కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఎదుర్కొంటున్నఇబ్బందులకు అద్దం పట్టింది. క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్క సికింద్రాబాద్ – ఉప్పల్ – ఘట్కేసర్ మార్గంలోనే కాదు... నగరానికి నలువైపులా ఉన్న అన్ని మార్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.సరిపడా బస్సులు అందుబాటులో లేకపోవడంతోనే ఈ దుస్థితి తలెత్తింది. బస్సులు కిక్కిరిసిపోవడంతో విద్యార్థులు ఫుట్‌బోర్డు ప్రయాణం చేయడం... ప్రైవేట్ వాహనాలు, బైకులపై కాలేజీలకు వెళ్తుండడంతోతరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. సిటీ శివార్లలోని కళాశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం సరిపోని సర్వీస్‌లు.. నగర శివారులోని వివిధ ప్రాంతాల్లో వందలాదిగా ఇంజినీరింగ్, ఒకేషనల్, ఐటీఐ తదితర కళాశాలలు ఉన్నాయి. వేలాది మంది విద్యార్థులు వీటిలో చదువుకుంటున్నారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న బస్సులు సుమారు 1,500 వరకు ఉన్నాయి. సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులు సైతం ఈ బస్సుల్లో వెళ్లాల్సి ఉంటుంది. దీంతో అప్పటికే కిక్కిరిసిపోయిన బస్సుల్లో విద్యార్థులు ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజూ 80 బస్సులు అదనంగా నడుపుతున్నట్లు ఆర్టీసీ చెబుతోంది. కానీ విద్యార్థుల డిమాండ్, రద్దీకి అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. దీంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. బైక్‌లపై వేగంగా వెళుతూ అదుపు తప్పి పడిపోతున్నారు. ఇలా ఏటా అనేక మంది ప్రమాదాలకు గురై గాయాలపాలవుతున్నారు. మృత్యువాత పడుతున్న సంఘటనలు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ రూట్లో నిత్యం 40వేల మంది విద్యార్థులు.. ప్రతి నిత్యం ఆల్వీన్ క్రాస్ రోడ్డు నుంచి మాదాపూర్, కొండాపూర్ వైపు, బాచుపల్లి, బొల్లారం, గండిపేట వైపు వెళ్లే బస్సుల సంఖ్య చాలా తక్కువ ఉండడంతో ఆ రూట్లో వెళ్లే విద్యార్థులు బస్సులకు వేలాడుతూ ఫుట్ బోర్డు ప్రయాణం చేయాల్సి వస్తోంది. ప్రతిరోజు 40 వేల మంది వరకు విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారు. పటాన్చెరు నుంచి కూకట్పల్లి వైపు వెళ్లే బస్సులు కూడా రద్దీగా వెళ్తున్నాయి. డ్రైవర్లు స్టాప్‌లలో బస్సులు ఆపకపోవడంతో విద్యార్థులు రన్నింగ్‌లో బస్సెక్కి ప్రమాదాలకు గురవుతున్నారు. మియాపూర్ డిపో–1 నుంచి 70 బస్సులు, మియాపూర్ డిపో –2 నుంచి 107 బస్సులు ఆయా రూట్లలో ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. పాతబస్తీ చాంద్రాయణగుట్టలోని ఇంజినీరింగ్ కళాశాలల రూట్లో సరైన ఆర్టీసీ బస్సులు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరోరా, మహవీర్, ఇస్లామియా ఇంజినీరింగ్ కళాశాలలకు నగరం నుంచి నిత్యం వేల సంఖ్యలో విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రధానమైన ‘300’ రూట్లో ఉన్న ఈ కళాశాలలకు సరైన సమయంలో బస్సులు పూర్తి స్థాయిలో తిరగడం లేదు. వెరసీ.. విద్యార్థులు ప్రమాదకరంగా ఫుట్‌బోర్డింగ్ ప్రయాణం చేయాల్సివస్తోంది. ఉరికితేనే బస్సు దొరికేది: పరుగులు తీస్తున్న విద్యార్థులు ఇదీ పరిస్థితి ♦ నగర శివార్లలోని వివిధ ప్రాంతాలకు ప్రతిరోజు 1500 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. రద్దీ దృష్ట్యా మరో 80 బస్సులు అదనంగా నడుపుతున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ... అవి విద్యార్థులకు సరిపోవడం లేదు. ♦ మేడ్చల్‌లోని కండ్లకోయ, మేడ్చల్, మైసమ్మగూడ, కీసర, ఘట్కేసర్ తదితర ప్రాంతాల్లో 50కి పైగా కాలేజీలు ఉన్నాయి. వీటిలో 10వేల మందిపైగా విద్యార్థులు ఉన్నారు. కానీ విద్యార్థుల రద్దీకి సరిపడా బస్సులు లేవు. ♦ మేడ్చల్ – సికింద్రాబాద్, ఘట్కేసర్ – భోగారం, ఘట్కేసర్ – అవుషాపూర్ రూట్లలో మరో 40–50 బస్సులు నడిపించాలని విద్యార్థులు కోరుతున్నారు. ♦ ఎల్బీనగర్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై హయత్‌నగర్ మొదలుకొని 12 ఇంజినీరింగ్ కళాశాలలు, నాగార్జునసాగర్ రహదారిపై దాదాపు 12 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ మార్గాల్లో ప్రయాణానికి విద్యార్థులు నరకం అనుభవిస్తున్నారు. ప్రమాదకరం.. ఫుట్‌బోర్డు ప్రయాణం .. కుత్బుల్లాపూర్ వైపు.. నియోజకవర్గ పరిధి శివారు ప్రాంతాల్లో ఉన్న 12 ఇంజినీరింగ్ కళాశాలలు, పలు జూనియర్ కళాశాలల్లో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. వీరి కొందరు కాలేజీ బస్సుల్లో వస్తున్నప్పటికి చాలా మంది విద్యార్థులు ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడుతున్నారు. ఒక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోనే కాకుండా మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లాలన్నా ఇటునుంచే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలి. ప్రతి విద్యా సంవత్సరానికి విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికి తదనుగుణంగా ఈ రూట్లల్లో ఆర్టీసీ బస్సులు పెరగడం లేదు. దీంతో ఫుట్‌బోర్డులపై ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. సుచిత్ర నుంచి కొంపల్లి వరకు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల సమయంలో దాదాపు 50 సర్వీసు ఆటోలు ఉన్నప్పటికి వీటిల్లో కూడా విద్యార్థులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. బాచుపల్లి– గండిమైసమ్మ, బాలానగర్ నుంచి గండిమైసమ్మ, సుచిత్ర – కొంపల్లి, దూలపల్లి క్రాస్ రోడ్డు నుంచి బహదూర్‌పల్లి క్రాస్ రోడ్లలో వేలాది మంది విద్యార్థులు నిత్యం ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. సమయానుకూలంగా బస్సులు నడపాలి.. మియాపూర్ నుంచి బాచుపల్లి బొల్లారం వెళ్లే రూట్లో నాలుగు బస్సులే ఉన్నాయి. అవి కూడా పాత డొక్కు పడిన బస్సులు ఉండడంతో మధ్యలోనే ఆగిపోతున్నాయి. సరైన సమయానికి కళాశాలకు వెళ్లడంలేదు. బస్సుల సంఖ్య పెంచాలని గతంలో ఎన్నోసార్లు ట్విట్టర్, ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. – రాహుల్ ప్రీతమ్ , విద్యార్థి ఫుట్బోర్డే దిక్కు.. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సుల సంఖ్య తక్కువ ఉండడంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో ఫుట్‌బోర్డు ప్రయాణం చేయాల్సివస్తోంది. మాదాపూర్, హైటెస్ సిటీ వైపు వెళ్లేందుకు బస్సులు అతి తక్కువగా ఉన్నాయి. దీంతో బస్సులు సమయానికి రాక ఉన్న బస్సుల్లోనే ఇరుకు ఇరుకుగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. బస్టాప్‌లలో కొంతమంది డ్రైవర్లు నిలబడకుండా వెళ్తుండడంతోరన్నింగ్లోబస్సు ఎక్కాల్సివస్తోంది. – కౌశిక్, విద్యార్థి ఆగకుండానే వెళ్తున్నాయి.. నేను ప్రతిరోజూ ఒవైసీ ఆస్పత్రి మీదుగా అరోరా ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్తుంటాను. ఉదయం 8.30 గంటల అనంతరం బస్సులు పూర్తి స్థాయిలో నడవడం లేదు. పూర్తిగా రద్దీగా ఉంటోంది. 8.30 గంటల కంటే ముందు ఐదారు బస్సులు ఒకేసారి వెళ్తుంటాయి. దీంతో పాటు స్టాప్‌లలో కొన్నిసార్లు బస్సులను ఆపడం లేదు. ఆటోలో వెళ్లాల్సి వస్తోంది.– వినయ్, మహవీర్ కళాశాల సాయంత్రం ఎదురుచూపులే.. సాయంత్రం వేళ ఎల్బీనగర్ వైపు బస్సులు చాలా తక్కువ సంఖ్యలో నడుస్తున్నాయి. సాయంత్రం 4.30 గంటలకు కళాశాల ముగిశాక బస్సుల కోసం గంటన్నర సేపు ఎదురు చూడాల్సి వస్తోంది. ఆరు గంటల అనంతరమే పూర్తి స్థాయిలో బస్సులను నడుపుతున్నారు. ఉదయం పూట కూడా కాలేజీకి వచ్చే సమయంలోనే బస్సులు తక్కువగా వస్తున్నాయి. – సాయితేజ, మహవీర్ కళాశాల ఇది చాలా దారుణం.. ట్రాఫిక్ పోలీసులు,ఆర్టీసీ అధికారులు ఫుట్‌బోర్డు ప్రయాణం మంచిది కాదని నీతులు చెబుతున్నారు. కాని సరిపడాబస్సులున్నాయా లేదా అనేది ఆలోచించకపోవడం దారుణం. బస్సులుంటేఫుట్ బోర్డు ప్రయాణం ఎందుకు చేస్తాం.– శ్రీలేఖ, బీటెక్ ప్రిన్సిటన్ కళాశాల,ఘట్కేసర్ -
పట్టుతప్పితే..
చాంద్రాయణగుట్ట :ఉదయం కాలేజీకి వెళ్లే విద్యార్థులు బస్సు ఫుట్‌బోర్డులపై సర్కస్ ఫీట్లు చేస్తూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. పలువురు వద్దని వారిస్తుంటే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. పొరపాటున కిటికీ రాడ్డు ఊడిపోతే ప్రాణానికే ప్రమాదం.. మంగళవారం ఉదయం చాంద్రాయణగుట్ట వద్ద కనిపించిందీ ఈ దృశ్యం. -
ఫుట్‌బోర్డు..సెల్‌ఫోన్
నాంపల్లి: ఎంఎంటీఎస్ రైలులో ఫుట్‌బోర్డు ప్రయాణం చేయడమే కాకుండా...సెల్‌ఫోన్ మాట్లాడుతూ..కింద పడిన ఫోన్‌ను అందుకునే ప్రయత్నం చేస్తూ ఓ యువతి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన నాంపల్లి రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలోని బేగంపేట రైల్వే స్టేషన్‌కు సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... సీతాఫల్మండి వీరలబస్తీకి చెందిన రామచందర్ కుమార్తె మాధవి అశ్విని(22) ప్రైవేట్ ఉద్యోగిని. ఈమె రోజూ ఎంఎంటీఎస్ రైలులోప్రయాణం చేస్తూ విధులకు వెళ్తుంటుంది. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లికి ప్రయాణించే రైలులో సీతాఫల్మండి రైల్వే స్టేషన్ వద్ద ఎక్కి...ప్రకృతి చికిత్సాలయం రైల్వే స్టేషన్ వద్ద దిగుతుంటుంది. బుధవారం రోజు మాదిరిగా విధులకు బయలుదేరింది. రైలులో రద్దీ ఎక్కువగా ఉండటం చేత ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తోంది. ఇదే క్రమంలో మాధవి అశ్విని సెల్‌ఫోన్ మాట్లాడుతోంది. సెల్‌ఫోన్ మాట్లాడుతున్న సమయంలో ఫోన్ కిందపడింది. అప్పుడే ఎంఎంటీఎస్ రైలు ఒక పట్టా నుంచి మరో పట్టాకు క్రాసింగ్ జరుగుతోంది. సెల్‌ఫోన్‌ను అందుకోవడానికి కిందకు వంగడం, రైలు క్రాసింగ్ జరగడం ఒకే సమయంలో జరగడంతో ప్రమాదవశాత్తు జారి కిందపడింది. కిందపడ్డ యువతి రైలు చక్రాల కిందకు చేరుకుంది. దీంతో ఆమె దేహం రెండు ముక్కలుగా తెగిపోయింది. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవపంచనామా నిర్వహించి ఉస్మానియా మార్చురీకి తరలించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. కాగా మాధవి అశ్వినికి వివాహం కాలేదు. ఫుట్‌బోర్డు ప్రయాణమే ఆమె మరణానికి కారణమైనట్లు పోలీసులు తెలియజేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థులు ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణిస్తే...
విద్యాశాఖ ఆదేశాలు చెన్నై: ఎలాగోలా విద్యాసంస్థలకు చేరుకుందామని విపరీతాలకు పోయే విద్యార్దులకు విద్యాశాఖ కళ్లెం వేయనుంది. అలా బస్సుల్లో ఫుట్‌బోర్డుపై ప్రయాణించే విద్యార్థుల ఉచిత బస్‌పాస్‌లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ హెచ్చరికలతో కూడిన ఆదేశాలను సోమవారం జారీచేసింది. చెన్నైలో జనాభా సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా సిటీ బస్సుల సంఖ్య పెరగడం లేదు. బస్సు సర్వీసుల వేళల్లో సరైన విధానం కొరవడింది. ఇలాంటి అనేక కారణాలతో ఆఫీసులు, విద్యాసంస్థల కీలక వేళల్లో బస్సుల్లో రద్దీ భరించలేని విధంగా పెరిగింది. సరైన సమయానికి గమ్యం చేరాలన్న ఆతృతలో విద్యార్థులు రద్దీగా ఉండే బస్సులను సైతం వదలకుండా ఫుట్‌బోర్డులపై నిలబడి ప్రయాణించడం అలవాటు చేసుకున్నారు. ఆ క్రమంలో బస్సు కిటికీలు పట్టుకుని వేలాడుతూ ప్రయాణిస్తూ జారిపడి ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. గత ఏడాది జూలై 3వ తేదీన కున్రత్తూరుకు చెందిన విద్యార్థి జగదీష్ ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తుండగా డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో జారికింద పడ్డాడు. క్షణాల్లో బస్సు మళ్లీ బయల్దేరడంతో చక్రాల కింద నలిగి చనిపోయాడు. అలాగే గత ఏడాది డిసెంబరు 1వ తేదీన చెన్నై తాంబరానికి చెందిన ప్లస్‌టూ విద్యార్థి సురేష్ ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తుండగా పట్టుతప్పి రోడ్డుపై పడిపోయాడు. తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఫుట్‌బోర్డు ప్రయాణంలో ఇలా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నా విద్యార్దులు మాత్రం ప్రాణాంతకమైన ఈ విధానాన్ని మానడం లేదు. దీంతో గత ఏడాది ట్రాఫిక్ పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారు. ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తే రూ.500 జరిమానా, తల్లిదండ్రులకు, విద్యాసంస్థలకు ఫిర్యాదు చేస్తామని, పదే పదే పట్టుబడితే టీసీ ఇచ్చి పంపేయాల్సిందిగా యాజమాన్యాలకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు. కొన్నాళ్ల పాటూ పోలీసులకు భయపడి క్రమశిక్షణగా మెలిగిన విద్యార్థులు మళ్లీ పాత పద్ధతిని కొనసాగించడం ప్రారంభించారు. విద్యాశాఖ సంచాలకుల సర్య్కులర్ వేసవి సెలవులు ముగించుకుని ఈ నెల 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థు ఫుట్‌బోర్డు ప్రయాణాలు మళ్లీ మొదలైనాయి. ఈ సారి విద్యార్థుల ఆగడాలని అరికట్టే బాధ్యతను విద్యాశాఖే చేపట్టింది. విద్యార్థులందరికీ ఉచిత బస్సు పాసులను జారీచేసే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకే కాక, ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు సైతం ఉచిత బస్‌పాస్‌కు అర్హులు. బస్సు ఫుట్‌బోర్డుపై ప్రయాణించే విద్యార్థుల ఉచిత బస్సు పాస్‌లను రద్దు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ ఎస్ కన్నప్పన్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సర్క్యులర్ పంపారు. ఫుట్‌బోర్డులో ప్రయాణించడం ఎంతటి ప్రమాదకరమో తెలియజెప్పేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశాల్లో పోలీస్, రవాణా శాఖ అధికారులు కూడా పాల్గొనాలని కోరారు. ఈ సమావేశాలు నిర్వహించిన తరువాత కూడా విద్యార్దులు ఫుట్‌బోర్డు ప్రయాణం కొనసాగించినపుడు మాత్రమే బస్‌పాస్‌ల రద్దు ఆదేశాలను అమలు చేయాలని సూచించారు.