విద్యార్థులు ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణిస్తే...
విద్యాశాఖ ఆదేశాలు
చెన్నై: ఎలాగోలా విద్యాసంస్థలకు చేరుకుందామని విపరీతాలకు పోయే విద్యార్దులకు విద్యాశాఖ కళ్లెం వేయనుంది. అలా బస్సుల్లో ఫుట్‌బోర్డుపై ప్రయాణించే విద్యార్థుల ఉచిత బస్‌పాస్‌లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ హెచ్చరికలతో కూడిన ఆదేశాలను సోమవారం జారీచేసింది.
చెన్నైలో జనాభా సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా సిటీ బస్సుల సంఖ్య పెరగడం లేదు. బస్సు సర్వీసుల వేళల్లో సరైన విధానం కొరవడింది. ఇలాంటి అనేక కారణాలతో ఆఫీసులు, విద్యాసంస్థల కీలక వేళల్లో బస్సుల్లో రద్దీ భరించలేని విధంగా పెరిగింది. సరైన సమయానికి గమ్యం చేరాలన్న ఆతృతలో విద్యార్థులు రద్దీగా ఉండే బస్సులను సైతం వదలకుండా ఫుట్‌బోర్డులపై నిలబడి ప్రయాణించడం అలవాటు చేసుకున్నారు. ఆ క్రమంలో బస్సు కిటికీలు పట్టుకుని వేలాడుతూ ప్రయాణిస్తూ జారిపడి ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు.
గత ఏడాది జూలై 3వ తేదీన కున్రత్తూరుకు చెందిన విద్యార్థి జగదీష్ ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తుండగా డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో జారికింద పడ్డాడు. క్షణాల్లో బస్సు మళ్లీ బయల్దేరడంతో చక్రాల కింద నలిగి చనిపోయాడు. అలాగే గత ఏడాది డిసెంబరు 1వ తేదీన చెన్నై తాంబరానికి చెందిన ప్లస్‌టూ విద్యార్థి సురేష్ ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తుండగా పట్టుతప్పి రోడ్డుపై పడిపోయాడు.
తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఫుట్‌బోర్డు ప్రయాణంలో ఇలా ఎందరో ప్రాణాలు కోల్పోతున్నా విద్యార్దులు మాత్రం ప్రాణాంతకమైన ఈ విధానాన్ని మానడం లేదు. దీంతో గత ఏడాది ట్రాఫిక్ పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారు. ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తే రూ.500 జరిమానా, తల్లిదండ్రులకు, విద్యాసంస్థలకు ఫిర్యాదు చేస్తామని, పదే పదే పట్టుబడితే టీసీ ఇచ్చి పంపేయాల్సిందిగా యాజమాన్యాలకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు. కొన్నాళ్ల పాటూ పోలీసులకు భయపడి క్రమశిక్షణగా మెలిగిన విద్యార్థులు మళ్లీ పాత పద్ధతిని కొనసాగించడం ప్రారంభించారు.
విద్యాశాఖ సంచాలకుల సర్య్కులర్
వేసవి సెలవులు ముగించుకుని ఈ నెల 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థు ఫుట్‌బోర్డు ప్రయాణాలు మళ్లీ మొదలైనాయి. ఈ సారి విద్యార్థుల ఆగడాలని అరికట్టే బాధ్యతను విద్యాశాఖే చేపట్టింది. విద్యార్థులందరికీ ఉచిత బస్సు పాసులను జారీచేసే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా అమలు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకే కాక, ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు సైతం ఉచిత బస్‌పాస్‌కు అర్హులు.
బస్సు ఫుట్‌బోర్డుపై ప్రయాణించే విద్యార్థుల ఉచిత బస్సు పాస్‌లను రద్దు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ ఎస్ కన్నప్పన్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సర్క్యులర్ పంపారు. ఫుట్‌బోర్డులో ప్రయాణించడం ఎంతటి ప్రమాదకరమో తెలియజెప్పేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశాల్లో పోలీస్, రవాణా శాఖ అధికారులు కూడా పాల్గొనాలని కోరారు. ఈ సమావేశాలు నిర్వహించిన తరువాత కూడా విద్యార్దులు ఫుట్‌బోర్డు ప్రయాణం కొనసాగించినపుడు మాత్రమే బస్‌పాస్‌ల రద్దు ఆదేశాలను అమలు చేయాలని సూచించారు.