నగర శివారు ప్రాంతాల్లో పరిస్థితి ఇదీ...
సాక్షి, హైదరాబాద్: అదో బస్టాపు.. స్కూలుకు, కాలేజీకి బయలుదేరిన విద్యార్థులు.. ఆఫీసుకు వెళుతున్న ఉద్యోగులు.. ఏవో పనుల మీద ఇతర ప్రాంతాలకు వెళ్తున్న మరికొందరు ప్రయాణికులు.. 40–50 మందిదాకా వేచి ఉన్నారు. అంతలో బస్సు వచ్చింది. అప్పటికే దాదాపు సీట్లన్నీ నిండిపోయి ఉన్నాయి. మరో బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు. సమయం మించిపోతోందంటూ అంతా ఎక్కేశారు. లోపల స్థలం లేక ఫుట్‌బోర్డుపైనా నిలబడ్డారు.
అక్కడక్కడా గుంతలు, మలుపులు, పక్కపక్కనే దూసుకెళ్లే వాహనాలు.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, పట్టుతప్పినా ప్రమాదం బారినపడే పరిస్థితి. హైదరాబాద్ నగరం చుట్టూరా శివార్లలో సిటీ బస్సుల్లో పరిస్థితి ఇది. ఆర్టీసీ బస్సులు తగ్గిపోవడం, ప్రైవేటు రవాణా చార్జీలు పెరిగిపోవడంతో ప్రయాణికులు ఫుట్‌బోర్డులపై నిలబడి ప్రయాణాలు చేస్తున్నారు. పలుమార్లు ప్రమాదాల బారినపడుతున్నారు.
ప్రమాదకరం, నేరం అయినా..
మోటారు వాహన చట్టం ప్రకారం ఫుట్‌బోర్డు ప్రయాణం నేరం. ఈ చట్టాన్ని అమలు చేసేందుకు గతంలో మొబైల్ కోర్టులు ఉండేవి. ఫుట్‌బోర్డు ప్రయాణికులపై జరిమానాలు విధించేవారు. ఇప్పుడు మొబైల్ కోర్టులు లేవుగానీ.. ఫుట్‌బోర్డు జర్నీ మాత్రం ఆగలేదు. ఎంతోమంది మంది ప్రయాణికులు పట్టుతప్పి పడిపోతున్నారు. గాయాలపాలవుతున్నారు. పలుమార్లు బాధితులు చనిపోయిన ఘటనలూ ఉన్నాయి. ఇది రహదారి భద్రతకు సవాల్‌గా మారింది.
వందలాది రూట్లకు బస్సుల్లేవు..
ప్రపంచ నగరాలకు దీటుగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరం ప్రజారవాణాలో మాత్రం వెనుకబడిపోతోంది. యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (హుమ్టా) అధ్యయనం ప్రకారం హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (హెచ్‌ఎంఏ) 7,228 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించింది. నగరంలో అందుబాటులో ఉన్న ప్రజారవాణా సదుపాయం 31 శాతమే. బస్సుల కొరత కారణంగా వందలాది రూట్లను ఆర్టీసీ వదిలేసుకుంది. హైదరాబాద్‌లో గతంలో 1,150 రూట్లలో ప్రతిరోజూ 42 వేల ట్రిప్పులు నడిచిన సిటీ బస్సులు.. ఇప్పుడు 795 రూట్లలో కనీసం 25 వేల ట్రిప్పులు కూడా తిరగడం లేదు.
ఏమూల చూసినా అంతే..
►ఎల్‌బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నం, చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే సిటీబస్సుల్లో విద్యార్ధులు, సాధారణ ప్రయాణికులు ప్రతిరోజూ ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రయాణం చేస్తుంటారు. ఉదయం, సాయంత్రం రద్దీవేళల్లో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది.
►ఉప్పల్ నుంచి ఘట్‌కేసర్ మీదుగా ఏదులాబాద్ వైపు వెళ్లే విద్యార్ధులు, ఉద్యోగులు ఉదయం 8 గంటలకల్లా బస్సు అందుకోగలిగితేనే సకాలంలో విధులకు హాజరవుతారు. ఆ రూట్‌లో వెళ్లే ఒకేఒక్క బస్సులో వేలాడుతూ ప్రయాణం చేయాల్సిందే. ఏ కొంచెం ఆలస్యమైనా సెవెన్ సీటర్ ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించాల్సిందే. ఇందుకోసం అయ్యే ఖర్చు అదనపు భారం.
►ఘట్‌కేసర్, ఇబ్రహీంపట్నం, కీసర, నాగారం, షామీర్‌పేట్ వంటి రూట్లలోనే కాదు. హైదరాబాద్ చుట్టూ ఉన్న వందలాది కాలనీలకు ఉదయం, సాయంత్రం రెండు, మూడు ట్రిప్పులు మాత్రమే బస్సులు తిరుగుతున్నాయి.
►సికింద్రాబాద్–కోఠీ, ఉప్పల్–కోఠీ వంటి సుమారు 150 రూట్లలో ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు ఉంటే.. పలు మార్గాల్లో అరగంట నుంచి గంటకు ఒకటి చొప్పున మాత్రమే నడుస్తున్నాయి.
►మేడ్చల్ నుంచి పటాన్‌చెరు మీదుగా గండి మైసమ్మ వరకు ప్రతిరోజు కనీసం 25 బస్సులు నిరంతరం రాకపోకలు సాగించే స్థాయిలో ప్రయాణికుల డిమాండ్ ఉంది. కానీ నడుపుతున్నది 5 బస్సులే. సికింద్రాబాద్–బహదూర్‌పల్లి, సికింద్రాబాద్–మణికొండ తదితర రూట్లలోనూ అదే పరిస్థితి.
అక్కడ పెంచుతుంటే.. ఇక్కడ తగ్గాయి..
►గ్రేటర్ హైదరాబాద్‌లో బస్సుల సంఖ్య మూడేళ్లలో 3,850 నుంచి 2,550కి తగ్గింది.
►ఢిల్లీ నగరంలో బస్సుల సంఖ్య 6 వేలు ఉండగా.. 7 వేలకు పెంచారు.
►బెంగళూరు సిటీలో ప్రస్తుతం 7,000 బస్సులు తిరుగుతున్నాయి. వాటిని 13 వేలకు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ప్రజారవాణాలో హైదరాబాద్..
►హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా విస్తీర్ణం 7,228 చదరపు కిలోమీటర్లు
►రోడ్ నెట్‌వర్క్ 5,400కి.మీ.
►జనాభా: సుమారు కోటీ 8 లక్షలు (రాష్ట్ర జనాభాలో 29.6%)
సరిగా బస్సులు రాక సమస్య
బస్సులు సరిగా అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బందిపడుతున్నాం. కిక్కిరిసి ప్రయాణించాలి. లేదా ఆటోలు, క్యాబ్‌లలో వెళ్లాల్సి వస్తోంది. ఆర్ధికంగా ఎంతో భారం అవుతోంది.
– ఎస్.అనిత, టీచర్
రహదారి భద్రతకు విఘాతం
బస్సులే కాదు ఆటోలు, క్యాబ్‌లు వంటి ఏ వాహనాల్లోనైనా సామర్థ్యానికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రధాన రహదారుల్లో జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువ శాతం ఇలాంటి ఓవర్‌లోడ్ జర్నీయే. అలాంటి ప్రతి ప్రయాణికుడిపై జరిమానా విధించే అవకాశం ఉంది.
– డాక్టర్ పుప్పాల శ్రీనివాస్, ఉప రవాణా కమిషనర్
ప్రమాదం అనిపించినా తప్పడం లేదు
ఫుట్‌బోర్డు మీద నిలబడి ప్రయాణం చేయాలని ఎవరూ కోరుకోరు కదా. బస్సులు లేకపోవడం వల్లే చాలా మంది పిల్లలు ఫుట్‌బోర్డ్ జర్నీ చేయాల్సి వస్తోంది.
– యాదగిరి, ప్రయాణికుడు
Comments
Please login to add a commentAdd a comment