గ్రేటర్‌కు కొత్త రూపు
- మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు
- రవాణా పన్ను మినహాయింపుతో 1.20 లక్షల మంది ఆటోడ్రైవర్లకు లబ్ధి
- ఉద్యమ కేసుల ఎత్తివేతపై స్పందన
- మంత్రి వర్గం నిర్ణయాలపై హర్షం
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న పలు నిర్ణయాలపై వివిధ వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌కు కొత్త హంగులు, భద్రత, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో విద్యార్థులు, ఇతరులపై నమోదైన కేసుల ఎత్తివేత వంటి నిర్ణయాలపై స్పందన వ్యక్తమైంది. ముఖ్యంగా ఆటోలపై రవాణా పన్ను మినహాయింపు నిర్ణయం ఆటో డ్రైవర్లలో ఆనందోత్సాహాలు నింపింది. పలుచోట్ల బుధవారం రాత్రి సంబరాలు నిర్వహిం చారు.
మంత్రివర్గం నిర్ణయంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 1.20 లక్షల ఆటో కార్మికులకు లబ్ధి చేకూరనుంది. గ్రేటర్ పరిధిలో ఆటో కార్మికులు ఏటా ఈ పన్ను రూపేణా రూ.5.28 కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. మంత్రివర్గ నిర్ణయంతో తాజాగా ఈ మొత్తం మేరకు మినహాయింపు లభించినట్లయింది. అలాగే నగరంలోని 10 వేల ట్రాలీ ఆటోలు నడుపుతున్న కార్మికులకు కూడా రూ.54 లక్షల మేర లబ్ది చేకూరనుంది.
అయితే, రవాణా పన్ను మినహాయింపు కంటే ఆటో కార్మికులకు ఇన్సూరెన్స్ చెల్లింపు నుంచి మినహాయింపునిచ్చి ఉంటే మరింత లబ్ధి చేకూరి ఉండేదని కొన్ని ఆటో సంఘాల నేతలు వ్యాఖ్యానించారు. మంత్రివర్గంలో తీసుకున్న వివిధ నిర్ణయాల దరిమిలా అవి నగరంపై చూపే ప్రభావం వివరాలిలా..
హైదరాబాద్ ‘గ్లోబల్ సిటీ’గా రూపుదిద్దుకోనుంది. అంతర్జాతీయ స్థాయి అధునాతన రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన
మెరుగైన పారిశుధ్య వ్యవస్థ..
మాస్టర్‌ప్లాన్‌కు కొత్తరూపు.. మార్పుచేర్పులతో నగరం రూపురేఖల్ని మార్చేలా విధాన నిర్ణయాలు
పట్టణాభివృద్ధి అంశాల్లో నైపుణ్యం కలిగిన జాతీయ స్థాయి సంస్థల లేదా అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్ల సేవల వినియోగం
జంట పోలీసు కమిషనరేట్లలో కొత్త వాహనాల కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్.. పోలీసింగ్‌కు ఆధునిక రూపు
మంత్రివర్గం నిర్ణయంతో గ్రేటర్ హైదరాబాద్‌లో 103 కల్లు దుకాణాలు తెరుచుకోనున్నాయి. వీటిపై ఆధారపడిన పలువురికి ఉపాధి లభించనుంది
గ్రేటర్ లోని ఘన వ్యర్థాల నిర్వహణకు రెండు వేల ఎకరాలు అవసరమని గుర్తింపు.. దీనిపై త్వరలోనే నిర్ణయం
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం
అక్రమాలు, ఆక్రమణల తొలగింపులో అధికారులకు పూర్తి స్థాయి సహకారం
దేవాదాయ భూముల పరిరక్షణ..
జిల్లా స్థాయిలో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు నిర్ణయం. అన్యాక్రాంతమైన భూముల రక్షణకు, వక్ఫ్ భూముల వివాదాల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు