మనకిక ఏకీకృత మాస్టర్‌ప్లాన్!
కొత్త ప్రణాళికకు ప్రభుత్వం తాజా నిర్ణయం
రూపకల్పన బాధ్యత హెచ్‌ఎండీఏకు అప్పగింత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరాన్ని విశ్వనగరంగా ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలోని 5 మాస్టర్‌ప్లాన్లను కలుపుతూ కొత్తగా ‘ఏకీకృత బృహత్ ప్రణాళిక’ (యూనిఫైడ్ మాస్టర్‌ప్లాన్)ను రూపొందించడం ద్వారా భవిష్యత్ అభివృద్ధికి బాటలు వేయాలని భావిస్తోంది. హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో ఇప్పటికే హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ మాస్టర్‌ప్లాన్-2031 అమల్లో ఉంది. ఇందులో పాత ఎంసీహెచ్ (కోర్ ఏరియా) మాస్టర్‌ప్లాన్, పాత ‘హుడా’ మాస్టర్‌ప్లాన్, హైదరాబాద్ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్ అథారిటీ (హడా), సైబరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీడీఏ), ఓఆర్‌ఆర్ గ్రోత్ కారిడార్ మాస్టర్‌ప్లాన్‌లు కూడా ఉన్నాయి. ఒక్కో ఏరియాకు ఒక్కో మాస్టర్‌ప్లాన్ ఉండటం వల్ల వాటి నియమ నిబంధనలు కూడా వేర్వేరుగా ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి ఏకీకృత బృహత్ ప్రణాళికగా రూపొందించడం వల్ల నియమ నిబంధనలన్నీ ఒకేలా ఉండనున్నాయి. ఫలితంగా కొత్త ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో జాప్యాన్ని నివారించడంతోపాటు మహానగర అభివృద్ధిని పరిగెత్తించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే 2001లో అమల్లోకి వచ్చిన సీడీఏ మాస్టర్‌ప్లాన్‌లోని లోపాలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.హెచ్‌ఎండీఏ పరిధిలో ప్రస్తుతమున్న 5 మాస్టర్ ప్లాన్లలో పలు తేడాల వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రధానంగా ‘హుడా’ మాస్టర్‌ప్లాన్, ‘హడా’ మాస్టర్‌ప్లాన్‌లు కలిసే చోట (అంటే సరిహద్దుల్లో) అనేక రోడ్లకు అనుసంధానం లేదు. ప్రణాళికలో పొందుపర్చింది ఒకలా ఉంటే... క్షేత్రస్థాయిలో మరోలా ఉంటోంది. ఓ రోడ్డు క్షేత్రస్థాయిలో సర్వే నం.20లో ఉంటే... అదే రోడ్డు మాస్టర్‌ప్లాన్‌లో నేరుగా మరో సర్వే నంబర్‌లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి సీడీఏ ప్రణాళికను సవరించడం ద్వారా క్షేత్రస్థాయికి అనుగుణంగా మార్పుచేర్పులు చేయడంతోపాటు గ్రామాల మ్యాపుల ప్రకారం సర్వే నంబర్లను సరిచేయనున్నారు. సమగ్ర రవాణా అధ్యయన (కాంప్రహెన్సివ్ ట్రాన్స్‌పోర్టేషన్ స్టడీ) నివేదిక ఆధారంగా యూనిఫైడ్ మాస్టర్‌ప్లాన్‌లో రోడ్లు, రై ల్వే టెర్మినల్స్, మెట్రో, బీఆర్‌టీఎస్ వంటివి తాజాగా పొందుపరచనున్నారు.
జోనింగ్ రెగ్యులేషన్స్ ఒకేలా...
ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలోని 5 మాస్టర్‌ప్లాన్లలో వేర్వేరుగా ఉన్న జోనింగ్ రెగ్యులేషన్స్ యూనిఫైడ్ మాస్టర్‌ప్లాన్‌లో ఒకేలా ఉండనున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ మాస్టర్ ప్లాన్-2031 ప్రకారం రెసిడెన్షియల్ జోన్‌లో పరిశ్రమలకు అనుమతి లేదు. మిగతా మాస్టర్‌ప్లాన్లలో ప్రింటింగ్ ప్రెస్ వంటి వాటికి అనుమతి ఉంది. అయితే ఇకపై ఇలాంటి తేడాలు లేకుండా జోనింగ్ రెగ్యులేషన్స్ ఒకేలా ఉండనున్నాయి. వీటివల్ల ఇండస్ట్రియల్ జోన్‌లో పరిశ్రమలు, రెసిడెన్షియల్ జోన్‌లో నివాసాలు, కమర్షియల్ జోన్‌లో వాణిజ్య సముదాయాలు, ట్రాన్స్‌పోర్టేషన్ జోన్‌లో రవాణా సదుపాయాలు ఇలా దేనికది విడివిడిగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందుతాయి. కొత్త ప్రణాళిక వల్ల రెండు మాస్టర్‌ప్లాన్లు కలిసే చోట్ల రోడ్ల అనుసంధానం ఇకపై పక్కాగా ఉండనుంది. అన్ని మాస్టర్‌ప్లాన్లు ఇకపై జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) కిందకు వస్తాయి.
19న టెండర్లకు ఆహ్వానం
కొత్తగా తలపెట్టిన యూనిఫైడ్ మాస్టర్‌ప్లాన్ రూపకల్పన బాధ్యతను ప్రభుత్వం ఇటీవల హెచ్‌ఎండీఏకు అప్పగించింది. ఈ మేరకు రంగంలోకి దిగిన హెచ్‌ఎండీఏ తాజాగా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్‌ఎఫ్‌పీ) తయారీకి కన్సల్టెన్సీని నియమించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 19న టెండర్లు ఆహ్వానించేందుకు సిద్ధమైంది. బిడ్స్ దాఖలుకు ఫిబ్రవరి 16ను చివరి తేదీగా ఖరారు చేసింది. యూనిఫైడ్ మాస్టర్‌ప్లాన్ రూపకల్పన టెండర్‌పై కన్సల్టెన్సీల సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ నెల 31న ప్రీ బిడ్ మీటింగ్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. వేగంగా జరుగుతున్న ఈ పరిణామాలను బట్టి చూస్తే విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే దిశగా అడుగులు వడివడిగా పడుతున్నట్లు స్పష్టమవుతోంది.