సెప్టెంబర్ కంటే అక్టోబర్‌లో 20 శాతం వృద్ధి
రూ.3,617 కోట్ల విలువైన ప్రాపర్టీల అమ్మకం
14 శాతం వాటా రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉన్నవే...
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ పుంజుకుంది. వరుస ఎన్నికలు, కొత్త ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ఆర్థిక ఒడిదుడుకుల నేపథ్యంలో ఏడాదిన్నర కాలంగా నగర స్థిరాస్తి రంగంలో కొంతకాలంగా ప్రతిష్టంభన నెలకొంది. అయితే, ఇటీవల ప్రభుత్వం కుదురుకోవటం, ఆర్థిక స్థిరత్వం చేకూరడం, అనుకూలమైన వడ్డీ రేట్లు ఉండటంతో కొనుగోలుదారుల్లో విశ్వాసం పెరిగింది.
దీంతో గృహ విక్రయాలు ప్రతి నెలా పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెప్టెంబర్‌లో రూ.2,820 కోట్ల విలువైన 4,903 అపార్ట్‌మెంట్లు రిజిస్ట్రేషన్ కాగా.. అక్టోబర్ నాటికి రూ.3,617 కోట్ల విలువైన 5,894 యూనిట్లు అమ్ముడుపోయాయి. నెలరోజుల్లో ప్రాపర్టీ వ్యాల్యూలో 28 శాతం, విక్రయాల్లో 20 శాతం వృద్ధి నమోదైందని నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది.
14 శాతం వాటా లగ్జరీదే..
గ్రేటర్‌లో గతేడాది జనవరి–అక్టోబర్ మధ్య కాలంలో రూ.30,464 కోట్ల విలువైన 58,390 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది అదే 10 నెలకాలంలో 65,280 అపార్ట్‌మెంట్లను విక్రయించారు. వీటి విలువ రూ.40,078 కోట్లు. గత నెలలో అమ్ముడైన వాటిల్లో రూ.కోటి విలువైన, 2 వేల చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న లగ్జరీ గృహాలదే 14 శాతం వాటా. గత నెలలో రూ.497 కోట్ల విలువైన 811 లగ్జరీ యూనిట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. రూ.50 లక్షల నుంచి రూ.కోటి ధర ఉన్న 1,601 ప్రాపరీ్టలు, రూ.50 లక్షల లోపు ధర ఉన్న 3,482 యూనిట్లు అమ్ముడుపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment