
బ్లాక్‌స్టోన్ చేతికి కోల్టేపాటిల్
దేశీ రియల్టీ కంపెనీ కోల్టే పాటిల్‌ను కొనుగోలు చేస్తున్న గ్లోబల్ పెట్టుబడుల దిగ్గజం బ్లాక్‌స్టోన్ తాజాగా సాధారణ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఇందుకు షేరుకి రూ.329 ధరలో దాదాపు రూ.759 కోట్లు వెచ్చించనుంది. తొలుత ప్రమోటర్ల నుంచి 25.7 శాతం వాటా(2.28 కోట్ల షేర్లు) సొంతం చేసుకోనున్నట్లు గత వారం ప్రకటించిన విషయం విదితమే. ఇందుకు రూ.750 కోట్లు కేటాయించనుంది. మరోవైపు ప్రిఫరెన్షియల్ పద్ధతిలో దాదాపు 1.27 కోట్ల ఈక్విటీ షేర్ల కోసం రూ. 417 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. దీంతో మరో 14.3 శాతం వాటా చేజిక్కించుకోనుంది. వెరసి 40 శాతం వాటాకు రూ. 1,157 కోట్లు వెచ్చించనుంది. ఈ బాటలో సాధారణ వాటాదారుల నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకి తాజాగా ఓపెన్ ఆఫర్ ప్రకటించింది.
బ్లాక్‌స్టోన్ గ్రూప్ సంస్థలు పబ్లిక్ వాటాదారుల నుంచి 2.3 కోట్ల షేర్లు(26 శాతం వాటా) కొనుగోలు చేసేందుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించినట్లు కోల్టే పాటిల్ తాజాగా స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. షేరుకి రూ.329 ధరలో ఆఫర్ ఇచ్చినట్లు తెలియజేసింది. దీంతో కంపెనీలో బ్లాక్‌స్టోన్ మొత్తం 66 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు పేర్కొంది. ఇందుకు రూ. 1,800 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. గత రెండు దశాబ్దాలలో దేశీయంగా 50 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసిన బ్లాక్‌స్టోన్.. పెట్టుబడులను 100 బిలియన్ డాలర్లకు పెంచనున్నట్లు ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో తాజా కొనుగోలుకి ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. కోల్టే పాటిల్‌లో ప్రస్తుతం ప్రమోటర్లకు 69.45 శాతం వాటా ఉంది.
ఇదీ చదవండి: త్వరలో బంగారం ధర లకారం! తులం ఎంతంటే..
ఆక్జో నోబెల్ రేసులో..
దేశీ పెయింట్ల బిజినెస్‌ను విక్రయించే ప్రణాళికల్లో ఉన్న డచ్ దిగ్గజం ఆక్జో నోబెల్‌కు తాజాగా బ్లాక్‌స్టోన్ నాన్‌బైండింగ్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆక్జో నోబెల్ ఇండియా కొనుగోలుకి 1.2 బిలియన్ డాలర్ల(రూ. 10,400 కోట్లు) విలువైన బిడ్ దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి రేసులో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్, పిడిలైట్ ఇండస్ట్రీస్ తదితర దేశీ దిగ్గజాలతో పోటీకి తెరతీసినట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం దేశీ పెయింట్ల సంస్థలో మాతృ సంస్థ ఆక్జో నోబెల్ ఎన్‌వీకు 74.76 శాతం వాటా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment