Blackstone
-
కేర్ హాస్పిటల్స్, ఆస్టర్ డీఎం విలీనం
న్యూఢిల్లీ: వైద్య సేవల దిగ్గజాలు ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్, క్వాలిటీ కేర్ ఇండియా (కేర్ హాస్పిటల్స్) విలీనం కానున్నాయి. తద్వారా ఆదాయం, పడకల సంఖ్యపరంగా దేశీయంగా మూడో అతి పెద్ద హాస్పిటల్ చైన్ ఆవిర్భవించనుంది. ఇందుకు సంబంధించిన విలీన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. డీల్ ప్రకారం క్వాలిటీ కేర్ ఇండియాలో (క్యూసీఐఎల్) పెట్టుబడులున్న బ్లాక్‌స్టోన్, టీపీజీల నుంచి ఆస్టర్ 5% వాటాలను కొనుగోలు చేస్తుంది. ప్రతిగా తమ సంస్థలో 3.6% వాటాకు సమానమైన షేర్లను జారీ చేస్తుంది. తదుపరి ఆస్టర్‌లో క్యూసీఐఎల్ని విలీనం చేస్తారు. లిస్టెడ్ విలీన సంస్థ పేరు ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్‌గా మారుతుంది. రిజిస్టర్డ్ కార్యాలయాన్ని కర్ణాటక నుంచి తెలంగాణకు మారుస్తారు. ‘ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలు అందించేందుకు, కొత్త ఆవిష్కరణలు చేసేందుకు ఈ ఒప్పందం దోహదపడగలదు’ అని ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ఆజాద్ మూపెన్ ఈ సందర్భంగా తెలిపారు. ‘విలీన సంస్థ భారత హెల్త్‌కేర్ రంగంలో అగ్రగామిగా, ప్రపంచ స్థాయి సంస్థగా ఎదిగేందుకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తాం’ అని బ్లాక్‌స్టోన్ ప్రైవేట్ ఈక్విటీ ఆసియా హెడ్ అమిత్ దీక్షిత్ వివరించారు. చైర్మన్‌గా ఆజాద్ మూపెన్.. విలీన కంపెనీలో ఆస్టర్ ప్రమోటర్లకు 24 శాతం, బ్లాక్‌స్టోన్‌కు 30.7 శాతం వాటాలుంటాయి. షేర్ల మారి్పడి నిష్పత్తి ప్రకారం విలీన కంపెనీలో ప్రమోటర్లతో కలిపి ఆస్టర్ షేర్హోల్డర్లకు 57.3%, క్యూసీఐఎల్ షేర్హోల్డర్లకు 42.7% వాటా ఉంటుంది. క్యూసీఐఎల్ షేర్హోల్డర్లకు ప్రతి 1,000 షేర్లకు గాను 977 ఆస్టర్ షేర్లు లభిస్తాయి. ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ ఫౌండర్, చైర్మన్ ఆజాద్ మూపెన్ .. మూడేళ్ల ఆరు నెలల పాటు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉంటారు. ఆ తర్వాత నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారు. మరోవైపు, క్యూసీఐఎల్ గ్రూప్ ఎండీ వరుణ్ ఖన్నా.. ఎండీ, గ్రూప్ సీఈవోగా ఉంటారు. 38 ఆస్పత్రులు.. 10 వేల పైగా బెడ్స్.. విలీన సంస్థ 27 నగరాల్లో 38 ఆస్పత్రులు, 10,150 పడకలతో దేశీయంగా మూడో అతి పెద్ద హాస్పిటల్ చెయిన్‌గా ఉంటుంది. స్టాక్ ఎక్సే్చంజీలకు ఆస్టర్ డీఎం ఇచి్చన సమాచారం ప్రకారం 2027 ఆర్థిక సంవత్సరం నాటికి సుమారుగా మరో 3,500 పడకలను పెంచుకునే ప్రణాళికలు ఉన్నాయి. ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ కింద నాలుగు బ్రాండ్లు (ఆస్టర్ డీఎం, కేర్ హాస్పిటల్స్, కిమ్స్‌హెల్త్, ఎవర్‌కేర్) ఉంటాయి. ప్రస్తుతం అపోలో గ్రూప్, మణిపాల్ హాస్పిటల్స్ టాప్ 3లో ఉన్నాయి. శుక్రవారం బీఎస్ఈలో ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్ షేరు సుమారు 2 శాతం పెరిగి రూ. 499.95 వద్ద క్లోజయ్యింది. -
బ్లాక్‌స్టోన్ చేతికి హల్దీరామ్స్!
న్యూఢిల్లీ: స్నాక్స్ తయారీ దిగ్గజం హల్దీరామ్స్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకి ప్రయివేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఇప్పటికే ప్రారంభించిన చర్చలు తుది దశకు చేరినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, సింగపూర్ సంస్థ జీఐసీతో జత కట్టిన బ్లాక్‌స్టోన్ కొద్ది నెలలుగా హల్దీరామ్స్ ప్రమోటర్లు అగర్వాల్ కుటుంబంతో చర్చలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే బిజినెస్ విలువ విషయంలో అంగీకారం కుదరకపోవడంతో చర్చలు నిలిచిపోయాయి. కాగా.. స్నాక్స్ విభాగంలో దేశీయంగా ప్రధాన కంపెనీగా నిలుస్తున్న హల్దీరామ్స్‌లో నియంత్రిత వాటాను సొంతం చేసుకునేందుకు బ్లాక్‌స్టోన్ ఇంక్ ప్రస్తుతం చర్చల్లో ఇటీవల పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఒక అంచనా ప్రకారం రూ. 70,000 కోట్ల విలువలో హల్దీరామ్స్ కొనుగోలుకి డీల్ కుదిరే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. 76%పై కన్ను హల్దీరామ్స్‌లో 76 శాతం వాటా కొనుగోలుపై బ్లాక్‌స్టోన్ కన్సార్షియం కన్నేసినట్లు తెలుస్తోంది. అయితే అగర్వాల్ కుటుంబం భారీ వాటా విక్రయానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కంపెనీ విలువ నిర్ధారణలోనూ అంగీకారం కుదరనట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రమోటర్లలో కొంతమంది 51 శాతం వాటా విక్రయానికి మాత్రమే ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశాయి. ఒకవేళ బ్లాక్‌స్టోన్‌తో ఒప్పందం కుదిరితే దేశీయంగా అతిపెద్ద పీఈ డీల్‌గా చరిత్ర సృష్టించే వీలున్నట్లు పేర్కొన్నాయి. చర్చలు ఏక్షణమైనా విఫలమైతే ఇతర ప్రత్యామ్నాయాలను సైతం అగర్వాల్ కుటుంబం సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే పబ్లిక్ ఇష్యూకి సైతం తెరతీసే యోచనలో ఉన్నట్లు తెలియజేశాయి. అగర్వాల్ కుటుంబం ఢిల్లీ, నాగ్‌పూర్ బ్రాంచీల ఎఫ్ఎంసీజీ బిజినెస్‌ను విలీనం చేసే ప్రణాళికల్లో ఉంది. హల్దీరామ్ స్నాక్స్ పీవీటీ లిమిటెడ్, హల్దీరామ్ ఫుడ్స్ ఇంటర్నేషనల్ పీవీటీ లిమిటెడ్ విలీనం ద్వారా హల్దీరామ్ స్నాక్ ఫుడ్స్ పీవీటీ లిమిటెడ్‌గా ఏర్పాటు చేయనుంది. ఈ కంపెనీలో ఢిల్లీ బ్రాంచ్ 56 శాతం, నాగ్‌పూర్ బ్రాంచ్ 44 శాతం చొప్పున వాటాను తీసుకోనున్నాయి. -
మైండ్ బ్లోయింగ్ శాలరీ.. ఏడాదిలో రూ.7,400 కోట్లు!
Blackstone CEO Payout : సీఈవోల వేతనాల గురించి మనం తరచూ వింటుంటాం. అయితే అమెరికాకు చెందిన ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ బ్లాక్‌స్టోన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) స్టీవ్ స్క్వార్జ్మాన్ (Steve Schwarzman) ఏడాదిలో తీసుకున్న వేతనం గురించి తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. బ్లాక్‌స్టోన్ సీఈవో స్టీవ్ స్క్వార్జ్మాన్ గత సంవత్సరం రూ.896.7 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.7,400 కోట్లు) వేతనం అందుకున్నారు. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 30 శాతం తగ్గినప్పటికీ ఫైనాన్ రంగంలో అతిపెద్ద వార్షిక చెల్లింపులలో ఒకటి. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. 77 ఏళ్ల స్క్వార్జ్మాన్ కంపెనీలో తన సుమారు 20 శాతం వాటా నుంచి డివిడెండ్ల రూపంలోనే 777 మిలియన్ డాలర్లు (రూ.6,400 కోట్లు) అందుకున్నారు. అదనంగా 120 మిలియన్ డాలర్లు (రూ.990 కోట్లు)ప్రోత్సాహక రుసుములు, క్యారీడ్ వడ్డీగా అని పిలిచే ఫండ్ లాభాల వాటా ద్వారా సంపాదించారు. కాగా స్క్వార్జ్మాన్ 2022లో రికార్డు స్థాయిలో 1.27 బిలియన్ డాలర్లు అందుకున్నారు. స్క్వార్జ్మాన్ వాటాలు, డివిడెండ్లు ఇప్పటికీ ఆయనను ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకడిగా స్థిరపరుస్తున్నాయి. ఆయన అదృష్టం తాను సహ స్థాపించిన సంస్థతో ముడిపడి ఉంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం స్క్వార్జ్మాన్ నెట్‌వర్త్ 41.8 బిలియన్ డాలర్లు (రూ.3.4 లక్షల కోట్లు). -
ఎంబసీ రీట్ నుంచి బ్లాక్‌స్టోన్ ఔట్
న్యూఢిల్లీ: లిస్టెడ్ సంస్థ ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్) నుంచి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం బ్లాక్‌స్టోన్ వైదొలగినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్‌లో తమకుగల మొత్తం 23.5 శాతం వాటాను విక్రయించినట్లు వెల్లడించాయి. ఒక్కో షేరుకి రూ. 316 సగటు ధరలో వాటా విక్రయాన్ని చేపట్టినట్లు తెలిపాయి. బుధవారం ముగింపు ధర రూ. 331తో పోలిస్తే ఇది 5 శాతం డిస్కౌంట్‌కాగా.. తద్వారా బ్లాక్‌స్టోన్ రూ. 7,100 కోట్లు సమకూర్చుకున్నట్లు అంచనా. ఈ బ్లాక్‌డీల్స్‌లో ఏడీఐఏసహా ప్రస్తుత యూనిట్ హోల్డర్లు, ఎస్బీఐ ఎంఎఫ్ తదితర కొత్త ఇన్వెస్టర్లు షేర్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. బ్లాక్‌స్టోన్, ఎంబసీ గ్రూప్ సంయుక్తంగా ప్రమోట్ చేసిన ఎంబసీ ఆఫీస్ పార్క్స్ దేశీయంగా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన తొలి రీట్‌గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. 2019లో చేపట్టిన ఐపీవోలో భాగంగా రూ. 5,000 కోట్ల సమీకరణ ద్వారా లిస్టయ్యింది. సంస్థలో దేశీ ఎంబసీ గ్రూప్‌నకు సుమారు 8 శాతం వాటా ఉంది. -
బ్లాక్‌స్టోన్ చేతికి కేర్ హాస్పిటల్స్ - వివరాలు
న్యూఢిల్లీ: ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్ తాజాగా హైదరాబాద్‌కు చెందిన కేర్ హాస్పిటల్స్‌లో మెజారిటీ వాటాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. టీపీజీ రైజ్ఫండ్స్లో భాగమైన ఎవర్‌కేర్ హెల్త్ ఫండ్ నుంచి 72.5 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు మొత్తం మీద 700 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 5,827 కోట్లు) వెచ్చిస్తున్నట్లు వివరించింది. ఈ లావాదేవీ కోసం కేర్ హాస్పిటల్స్ సంస్థ విలువను రూ. 6,600 కోట్లుగా లెక్కగట్టారు. మరోవైపు, కేరళకు చెందిన కిమ్స్‌హెల్త్ సంస్థలో కేర్ హాస్పిటల్స్, టీపీజీ 80 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్ కింద బ్లాక్‌స్టోన్ 300 మిలియన్ డాలర్లు, టీపీజీ 100 మిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు వివరించాయి. దీంతో బ్లాక్‌స్టోన్ దేశీయంగా ఆరోగ్య సేవల విభాగంలోకి ప్రవేశించినట్లవుతుంది. ఈ రెండు డీల్స్ ద్వారా మొత్తం 1 బిలియన్ డాలర్ల పైచిలుకు ఇన్వెస్ట్ చేసినట్లవుతుంది. సంయుక్త నెట్‌వర్క్‌లో టీపీజీ చెప్పుకోతగ్గ స్థాయిలో వాటాలున్న మైనారిటీ షేర్‌హోల్డరుగా ఉంటుంది. భారత హెల్త్‌కేర్ సర్వీసుల రంగంలో తొలిసారిగా పెట్టుబడులు పెట్టడం, దేశీయంగా అతి పెద్ద హెల్త్‌కేర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు టీపీజీతో జట్టు కట్టడం తమకు సంతోషకరమైన అంశాలని బ్లాక్‌స్టోన్ ఎండీ గణేష్ మణి తెలిపారు. భారీ హాస్పిటల్స్ నెట్‌వర్క్‌లో ఒకటిగా.. కేర్ హాస్పిటల్స్‌కు హైదరాబాద్, వైజాగ్‌తో పాటు ఔరంగాబాద్, నాగ్‌పూర్ తదితర నగరాల్లో ఆస్పత్రులు ఉన్నాయి. కిమ్స్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ సంస్థ .. కేరళలోనే అతి పెద్ద ప్రైవేట్ హెల్త్‌కేర్ ప్రొవైడర్‌గా ఉంది. కిమ్స్‌హెల్త్ చేరికతో దేశీయంగా భారీ హాస్పిటల్స్ చెయిన్‌లో ఒకటిగా కేర్ హాస్పిటల్స్ నెట్వర్క్ ఆవిర్భవించనుంది. ఈ సంయుక్త నెట్‌వర్క్‌కు 11 నగరాల్లో 23 ఆస్పత్రులు, 4,000 పైచిలుకు పడకలు ఉంటాయి. ప్రస్తుతం కిమ్స్హెల్త్కు నేతృత్వం వహిస్తున్న ఎంఐ సహాదుల్లా ఇకపైనా దాని సారథ్య బాధ్యతల్లో కొనసాగుతారు. -
Disney: డిస్నీ కొనుగోలుకు బ్లాక్‌స్టోన్‌తో చర్చలు!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్.. భారతదేశంలోని వాల్ట్‌డిస్నీ స్ట్రీమింగ్, టెలివిజన్ కార్యకలాపాలను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతుందని రాయిటర్స్ నివేదిక తెలిపింది. వాల్ట్ డిస్నీ ఇండియాలోని తన కార్యకలాపాలను విక్రయించేందుకు గతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్అంబానీతోపాటు ఇతర సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపింది. అయితే భారత మార్కెట్‌పై ఆసక్తి ఉన్న బ్లాక్‌స్టోన్.. డిస్నీ కొనుగోలుకు సిద్ధం అవుతుదని నివేదిక తెలుపుతుంది. ఒకవేళ బ్లాక్‌స్టోన్‌తో ఈ ఒప్పందం కుదరకపోయినా డిస్నీ భారతదేశంలో తన డిజిటల్, టీవీ వ్యాపారాన్ని విక్రయించడానికి ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఇంకా బ్లాక్‌స్టోన్, డిస్నీ ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. డిస్నీ సబ్‌స్క్రైబర్ అట్రిషన్‌ను ప్రభావం చేసేలా ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లో ఉచిత క్రికెట్ కంటెంట్‌ను అందించడంతో ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలని యోచిస్తుంది. -
బ్లాక్‌స్టోన్ చేతికి ఐజీఐ.. బెల్జియం డైమెండ్స్ సర్టిఫికేషన్ సంస్థ
ముంబై: అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్ తాజాగా ఇంటర్నేషనల్ జెమాలాజికల్ ఇనిస్టిట్యూట్ (ఐజీఐ)ని కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 525 మిలియన్ డాలర్లని సంస్థ తెలిపింది. 80 శాతం వాటాను షాంఘై యుయువాన్ టూరిస్ట్ మార్ట్ (గ్రూప్) నుంచి, మిగతా మొత్తాన్ని ఐజీఐ వ్యవస్థాపక కుటుంబానికి చెందిన రోలాండ్ లోరీ నుంచి కొనుగోలు చేసినట్లు వివరించింది. ఐజీఐ ప్రధాన కార్యాలయం బెల్జియంలోని యాంట్వెర్ప్లో ఉన్నప్పటికీ సంస్థ ఆదాయం, లాభాల్లో సింహ భాగం భారత్ నుంచే ఉంటోంది. ప్రపంచంలోనే అత్యధికంగా డైమండ్ పాలిషింగ్ భారత్‌లోనే జరుగుతుండటం ఇందుకు కారణం. వజ్రాలు, రత్నాలు, ఆభరణాలకు సర్టిఫికేషన్ సేవలను ఐజీఐ అందిస్తోంది. వివిధ దేశాల్లో 29 ల్యాబరేటరీలు (భారత్‌లో 18), 18 జెమాలజీ స్కూల్స్ నిర్వహిస్తోంది. కంపెనీ కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై దృష్టి పెట్టనున్నట్లు ఐజీఐ సీనియర్ ఎండీ ముకేష్ మెహతా తెలిపారు. ఇదీ చదవండి: ట్రావెలింగ్ చేసేవారికి అలర్ట్! పెరుగుతున్న ఆన్లైన్ ట్రావెల్ స్కామ్‌లు -
నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ ఐపీవోకు రెడీ
న్యూఢిల్లీ: గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌కు పెట్టుబడులున్న నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ పబ్లిక్ ఇష్యూ ప్రణాళికల్లో ఉంది. గతేడాది నవంబర్‌లో ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసిన కంపెనీ మే నెలలో ఐపీవో చేపట్టే యోచనలో ఉంది. తద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. వెరసి దేశీయంగా తొలి రిటైల్ రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్)గా నిలవనుంది. నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ రిటైల్ రీట్.. 17 నిర్వహణలోగల షాపింగ్ మాల్స్ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. ఇవి 14 పట్టణాలలో 9.8 మిలియన్ చదరపు అడుగులలో విస్తరించి ఉన్నాయి. వీటి విలువ రూ. 23,000 కోట్లు. బ్లాక్‌స్టోన్ స్పాన్సర్ చేసిన మూడో రీట్‌గా ఇది నిలవనుంది. ఇప్పటికే దేశీయంగా సంస్థకు పెట్టుబడులున్న రీట్ ఎంబసీ ఆఫీస్ పార్క్స్, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ లిస్టయ్యాయి. మరో కంపెనీ బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్టీ ట్రస్ట్ సైతం స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కాగా.. ఇవన్నీ ఆఫీస్ ఆస్తులపైనే ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ మాత్రం రిటైల్ రియల్టీ ఆస్తులపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా అద్దె ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఐపీవో నిధులను కొంతమేర రుణ చెల్లింపులకు వినియోగించే వీలుంది. 2022 జూన్‌కల్లా రూ. 4,500 కోట్ల రుణ భారాన్ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. -
ఐపీవోకు నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్
న్యూఢిల్లీ: గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బ్లాక్‌స్టోన్ పెట్టుబడులున్న నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక పత్రాలు దాఖలు చేసింది. తద్వారా 50 కోట్ల డాలర్లు(సుమారు రూ. 4,000 కోట్లు) సమీకరించే ప్రణాళికలు ప్రకటించింది. వెరసి దేశీయంగా పబ్లిక్ ఇష్యూకి వస్తున్న తొలి రిటైల్ రంగ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్)గా నిలవనుంది. కంపెనీకి 14 నగరాలలో నిర్వహణలోగల 17 షాపింగ్ మాల్స్ ఉన్నాయి. వీటిలో 3,000 స్టోర్స్ ఉన్నాయి. కోటి చదరపు అడుగుల ప్రాంతాన్ని కవర్ చేస్తున్న ఈ పోర్ట్‌ఫోలియో విలువ 300 కోట్ల డాలర్లుగా అంచనా. 2023 క్యాలండర్ ఏడాది తొలి అర్ధభాగంలో ఐపీవో చేపట్టే వీలున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మూడో రీట్.. నెక్సస్ సెలెక్ట్ బ్లాక్‌స్టోన్ పెట్టుబడులు గల మూడో రీట్కాగా.. తొలుత ఎంబసీ ఆఫీస్ పార్క్స్, తదుపరి మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్లను వెలువరించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా ప్రజాదరణ పొందిన రీట్‌ను దేశీయంగా కొద్దికాలంక్రితమే అనుమతించారు. వీటి ద్వారా రియల్టీ ఆస్తుల విలువను అన్‌లాక్ చేయడంతోపాటు.. రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులకూ వీలు కలుగుతుంది. ప్రస్తుతం దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో మూడు రీట్లు ఎంబసీ ఆఫీస్ పార్క్స్, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా లిస్టయ్యాయి. అయితే ఇవి లీజ్డ్ ఆఫీస్ ఆస్తులుకాగా.. నెక్సస్ సెలెక్ట్ రిటైల్ రియల్టీ ఆస్తులతో కూడిన తొలి అద్దె ఆదాయ కంపెనీ కావడం గమనార్హం! -
బ్లాక్‌స్టోన్ చేతికి ఆర్ సిస్టమ్స్
ముంబై: డిజిటల్ ఐటీ సర్వీసుల కంపెనీ ఆర్ సిస్టమ్స్‌ను కొనుగోలు చేసినట్లు యూఎస్ పీఈ దిగ్గజం బ్లాక్‌స్టోన్ తాజాగా పేర్కొంది. ఇందుకు 35.9 కోట్ల డాలర్లు(రూ. 2,904 కోట్లు) చెల్లించనున్నట్లు వెల్లడించింది. కంపెనీలో మెజారిటీ వాటాను సొంతం చేసుకునేందుకు ప్రమోటర్లు సతీందర్ సింగ్ రేఖీ తదితరులతో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. 1993లో రేఖి ప్రమోట్ చేసిన కంపెనీ డిజిటల్ ఐటీ సర్వీసులతోపాటు, ప్రొడక్ట్ ఇంజనీరింగ్‌లో ప్రత్యేకతను కలిగి ఉంది. నోయిడాకు చెందిన ఈ కంపెనీ టెక్నాలజీ, మీడియా, టెలికం, ఫైనాన్షియల్ సర్వీసుల రంగాలలో 250 కస్టమర్లకు సేవలందిస్తోంది. 4,400 మంది సిబ్బంది ఆర్ సిస్టమ్స్ 4,400 మంది ఉద్యోగులను కలిగి ఉంది. దేశ, విదేశాలలో 18 డెలివరీ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఈ సెప్టెంబర్‌తో ముగిసిన 12 నెలల కాలంలో కంపెనీ రూ. 1,445 కోట్ల ఆదాయం సాధించింది. ఇది 36 శాతం వృద్ధికాగా.. రేఖి తదితర ప్రమోటర్లు ప్రస్తుతం కంపెనీలో 52 శాతం వాటాను కలిగి ఉన్నారు. బ్లాక్‌స్టోన్ షేరుకి రూ. 245 చొప్పున వాటాను కొనుగోలు చేయనుంది. మిగిలిన వాటా కోసం షేరుకి రూ. 246 ధరలో డీలిస్టింగ్ ఆఫర్‌ను ప్రకటించనుంది. తదుపరి రేఖి నాన్‌ఎగ్జిక్యూటివ్ సలహాదారుగా సేవలను కొనసాగించనున్నారు. కాగా.. బ్లాక్‌స్టోన్ ఐటీ, ఐటీ ఆధారిత సేవల దేశీ కంపెనీలలో భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. ఇప్పటివరకూ 7 బిలియన్ డాలర్లు పంప్ చేసింది. ఎంఫసిస్, వీఎఫ్ఎస్, టాస్క్యూఎస్, ఐబీఎస్ సాఫ్ట్వేర్, ఇంటెలినెట్, సింప్లిలెర్న్ తదితర కంపెనీలలో పెట్టుబడులు పెట్టింది. బ్లాక్‌స్టోన్ సొంతం చేసుకోనున్న వార్తల ప్రభావంతో ఆర్ సిస్టమ్స్ కౌంటర్లో భారీ డిమాండ్ నెలకొంది. వెరసి బీఎస్ఈలో షేరు తొలుత 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 281ను దాటింది. చివరికి 16 శాతం జంప్‌చేసి రూ. 271 వద్ద ముగిసింది. -
గ్రాన్యూల్స్‌లో మెజారిటీ వాటా అమ్మకం!
హైదరాబాద్: ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ గ్రాన్యూల్స్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకు కేకేఆర్, బెయిన్ క్యాపిటల్, బ్లాక్‌స్టోన్ రేసులో ఉన్నట్టు సమాచారం. కంపెనీ నుంచి నిష్క్రమించాలన్న ప్రణాళికను ప్రమోటర్లు పునరుద్ధరించారని, మెజారిటీ వాటాను ప్రీమియం వాల్యుయేషన్‌తో విక్రయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. గ్రాన్యూల్స్ ఇండియాలో ఈ ఏడాది జూన్ నాటికి ప్రమోటర్లకు 42.13 శాతం వాటా ఉంది. కాగా, ప్రతిపాదిత వాటా కొనుగోలుకై నాన్ బైండింగ్ బిడ్లను మూడు సంస్థలు దాఖలు చేసినట్టు సమాచారం. కొనుగోలుదార్ల వేటకై ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అయిన కొటక్ మహీంద్రా క్యాపిటల్‌ను కంపెనీ ప్రమోటర్లు నియమించారు. వాటాల విక్రయంపై మీడియాలో వస్తున్న ఊహాగానాలపై స్పందిం^è లేమని గ్రాన్యూల్స్ ఫార్మాస్యూటికల్స్ ఈడీ ప్రియాంక చిగురుపాటి స్పష్టం చేశారు. అయితే ఫార్మా రంగంలో ఈ స్థాయి డీల్స్ సహజమని, దీంతో ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్ ఆసక్తి చూపుతున్నాయని ఒక కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఈ డీల్‌ను వేదికగా చేసుకుని మరింత విస్తరణకు ఆస్కారం ఉంటుందనేది ఆలోచన అని ఆయన అన్నారు. మూడు సంస్థలూ పోటీపడితే బిడ్డింగ్ వార్‌కు అవకాశం ఉంది. ప్రమోటర్లు తమ వాటా విక్రయానికి ఫార్మా రంగంలో వాల్యుయేషన్స్, వారసత్వ ప్రణాళిక సమస్యలు కారణంగా తెలుస్తోంది. 2019 నవంబరులోనూ ప్రమోటర్లు తమ వాటాను అమ్మాలని భావించారు. తాజా వార్తల నేపథ్యంలో గ్రాన్యూల్స్ షేరు ధర శుక్రవారం 4.20 శాతం అధికమై రూ.375.75 వద్ద స్థిరపడింది. -
భారత్ భవిష్యత్తు భేష్
ముంబై: ఇతర దేశాలతో పోల్చితే భారత్ తమకు మంచి ఫలితాలనందించిందని అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం, బ్లాక్‌స్టోన్ వెల్లడించింది. భవిష్యత్తులో కూడా ఇదే జోరు కొనసాగగలదన్న ఆశాభావాన్ని ఆ సంస్థ చైర్మన్, సీఈఓగా కూడా వ్యవహరిస్తున్న స్టీఫెన్ ఏ ష్వార్జ్‌మాన్ వ్యక్తం చేంశారు. భవిష్యత్తులో భారత్ దూసుకుపోతుందని వ్యాఖ్యానించారు. ఎంపిక చేసిన మీడియా వర్గాలతో ఆయన ఇక్కడ ముచ్చటించారు. 2006లో భారత్‌కు వచ్చానని, అప్పటి భారత్‌కు, ఇప్పటి భారత్‌కు చాలా తేడా ఉందని వివరించారు. బ్యాంకింగ్ రంగ సమస్యలు ఉన్నప్పటికీ, మంచి జోరు చూపిస్తోందని పేర్కొన్నారు. భారత విద్యారంగం పనితీరు బాగా ఉందని స్టీఫెన్ కితాబిచ్చారు. ప్రతి ఏడాది అమెరికాలో కంటే ఏడు రెట్లు అధికంగా ఇంజినీర్లు తయారవుతున్నారని, విస్తారమైన వృద్ధికి అవకాశాలున్నాయని వివరించారు. 2005 నుంచి భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థ 15 ఏళ్లలో 40 కంపెనీల్లో 1,550 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది. ఒక్క గత ఏడాదిలోనే 600 కోట్ల డాలర్ల మేర ఇన్వెస్ట్ చేసింది. కాగా 30 ఏళ్ల క్రితం 4 లక్షల డాలర్లతో ఆరంభమైన బ్లాక్‌స్టోన్ సంస్థ ఇప్పుడు 57,200 కోట్ల డాలర్ల దిగ్గజంగా ఎదిగింది. -
కాఫీడే టెక్ పార్క్ విక్రయానికి యస్ బ్యాంకు బ్రేక్!
బెంగళూరు: కాఫీడే ఎంటర్ప్రైజెస్ బెంగళూరులో తనకున్న టెక్నాలజీ పార్క్‌ను బ్లాక్‌స్టోన్ గ్రూపునకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకోగా, దీనికి యస్ బ్యాంకు ఆమోదం చెప్పకపోవడంతో నిలిచిపోయినట్టు సమాచారం. కాఫీ డే గ్రూపునకు రుణాలిచ్చిన సంస్థల్లో యస్ బ్యాంకు కూడా ఒకటి. ఈ ఒప్పందానికి యస్ బ్యాంకు ఇప్పటి వరకు నిరభ్యంతర సర్టిఫికెట్ ఇవ్వలేదని ఈ వ్యవహారం గురించి తెలిసిన వర్గాలు చెప్పాయి. కాఫీ డే తీసుకున్న ఇతర రుణాల తాలూకు చెల్లింపులపై హామీ ఇవ్వాలని యస్ బ్యాంకు కోరినట్లు తెలిసింది. ఇతర రుణదాతలంతా ఇప్పటికే కాఫీడే టెక్ పార్క్– బ్లాక్‌స్టోన్ ఒప్పందానికి ఆమోదం తెలిపారని, యస్ బ్యాంకు మాత్రమే ఆమోదం తెలపాల్సి ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి. కాఫీ డేకు చెందిన ట్యాంగ్లిన్ డెవలప్మెంట్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బెంగళూరులో గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్ నడుస్తోంది. ఈ కంపెనీ యస్ బ్యాంకుకు రూ.100 కోట్లు బకాయి పడింది. కాఫీ డే కూడా యస్ బ్యాంకుకు రూ.1,400 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆకస్మిక ఆత్మహత్య తర్వాత కంపెనీ యాజమాన్యం ఆస్తుల విక్రయం ద్వారా అప్పులు చెల్లించే ప్రయత్నాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌ను బ్లాక్‌స్టోన్‌కు రూ.2,600– 3,000 కోట్ల విలువకు విక్రయించేందుకు నాన్ బైండింగ్ ఒప్పందం చేసుకుంది. తాజా పరిణామాలతో బీఎస్ఈలో కాఫీడే షేరు సోమవారం 9 శాతం నష్టంతో రూ.43.85 వద్ద క్లోజయింది. -
ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్‌లో బ్లాక్‌స్టోన్ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ కంపెనీ, ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ (ఎఫ్ఎల్ఎఫ్ఎల్)లో అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ బ్లాక్‌స్టోన్ రూ.1,750 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఎఫ్ఎల్ఎఫ్ఎల్ హోల్డింగ్కంపెనీ రైకా కమర్షియల్ వెంచర్స్‌లో బ్లాక్‌స్టోన్ నిర్వహణలోని ఫండ్స్ ఈ మేరకు ఇన్వెస్ట్ చేశాయి. ఈ లావాదేవీలో భాగంగా ఎఫ్ఎల్ఎఫ్ఎల్లో 6 శాతం వాటా బ్లాక్‌స్టోన్ పరమైంది. కాగా ఈ ఇన్వెస్ట్మెంట్స్ కారణంగా రైకాలో ఉన్న ఏకైక ఆర్థిక భాగస్వామిగా బ్లాక్‌స్టోన్ నిలిచింది. ఈ నిధులను రైకా సంస్థకున్న రుణ భారాన్ని తగ్గించుకోవడానికి వినియోగిస్తారు. బ్లాక్‌స్టోన్‌కు తొలి ‘ఫ్యాషన్’ పెట్టుబడి.... ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన సెంట్రల్, బ్రాండ్ ఫ్యాక్టరీ, ప్లానెట్ స్పోర్ట్స్ రిటైల్ చెయిన్స్‌ను ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ నిర్వహిస్తోంది. కాగా ఈ రంగంలో తమకు ఇది తొలి ఇన్వెస్ట్మెంట్ అని బ్లాక్‌స్టోన్ ఎమ్డీ లవ్ పారిఖ్ పేర్కొన్నారు. మరోవైపు తమ ఫ్యాషన్ వ్యాపారం నిలకడగా వృద్ధి సాధిస్తోందని ఫ్యూచర్ గ్రూప్ సీఈఓ కిశోర్ బియానీ చెప్పారు. ఎఫ్ఎల్ఎఫ్ఎల్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి బ్లాక్‌స్టోన్ ఇన్వెస్ట్మెంట్స్ తోడ్పాటునందిస్తాయని వివరించారు. ఈ ఏడాది సెపె్టంబర్ నాటికి ఎఫ్ఎల్ఎఫ్ఎల్ కంపెనీ 48 సెంట్రల్ స్టోర్స్‌ను, 100 బ్రాండ్ ఫ్యాక్టరీ అవుట్లెట్లను, 201 ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ అవుట్‌లెట్స్‌ను నిర్వహిస్తోంది. లీ కూపర్, ఇండిగో నేషన్, జెలస్ 21 వంటి 30కు పైగా ఫ్యాషన్ బ్రాండ్స్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ.5,377 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. బీఎస్ఈలో ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ కంపెనీ షేరు స్వల్ప లాభంతో రూ.395 వద్ద ముగిసింది. -
అమ్మకానికి కాఫీ డే ’గ్లోబల్ పార్క్’
న్యూఢిల్లీ: వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమన్న వార్తల నేపథ్యంలో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ (సీడీఈ) తాజాగా రుణాల భారం తగ్గించుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌ను అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్‌కు విక్రయించాలని నిర్ణయించుకుంది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 3,000 కోట్ల దాకా ఉంటుంది. అలాగే, అనుబంధ సంస్థ అల్ఫాగ్రెప్ సెక్యూరిటీస్‌లో కూడా వాటాలను ఇల్యూమినాటి సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించే ప్రతిపాదనకు కూడా సీడీఈ బోర్డు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ‘రుణభారం తగ్గించుకునే మార్గాలపై డైరెక్టర్ల బోర్డు చర్చించింది. ఈ సందర్భంగా అనుబంధ సంస్థ టాంగ్లిన్ డెవలప్‌మెంట్స్‌లో భాగమైన గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌ను బ్లాక్‌స్టోన్‌కి విక్రయించే ప్రతిపాదనను ఆమోదించింది. ఈ డీల్ విలువ సుమారు రూ. 2,600 కోట్ల నుంచి రూ. 3,000 కోట్ల దాకా ఉంటుంది. మదింపు ప్రక్రియ, నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభించడం మొదలైనవన్నీ పూర్తయ్యాకా వచ్చే 30–45 రోజుల్లో ఈ డీల్ పూర్తి కావచ్చు‘ అని స్టాక్ ఎక్సే్ఛంజీలకు సీడీఈ తెలియజేసింది. ఈ రెండు ఒప్పందాలతో కాఫీ డే గ్రూప్ రుణభారం గణనీయంగా తగ్గగలదని పేర్కొంది. ఇన్వెస్టర్లు, రుణదాతలు, ఉద్యోగులు, కస్టమర్లు మొదలైన సంబంధిత వాటాదారులందరికీ ఈ డీల్స్ ప్రయోజనకరంగా ఉండగలవని వివరించింది. ఆతిథ్య, రియల్టీ తదితర రంగాల్లోని అన్‌లిస్టెడ్ వెంచర్స్ కారణంగా వీజీ సిద్ధార్థ నెలకొల్పిన సీడీఈ రుణభారం రెట్టింపై రూ. 5,200 కోట్లకు చేరింది. ఈ పరిణామాల నేపథ్యంలో గత నెల సిద్ధార్థ అదృశ్యం కావడం, ఆ తర్వాత నేత్రావతి నదిలో శవమై తేలడం ఆయన మరణంపై సందేహాలు రేకెత్తించాయి. సిద్ధార్థ అకాల మరణంతో జూలై 31న స్వతంత్ర డైరెక్టర్ ఎస్వీ రంగనాథ్ సీడీఈ తాత్కాలిక చైర్మన్‌గా నియమితులయ్యారు. రంగనాథ్‌తో పాటు సీవోవో నితిన్ బాగ్మానె, సీఎఫ్‌వో ఆర్ రామ్మోహన్‌లతో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటైంది. కాఫీ డే గ్రూప్ రుణభారాన్ని తగ్గించుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను ఈ కమిటీ పరిశీలిస్తోంది. -
బ్లాక్‌స్టోన్ చేతికి ఎస్సెల్ ప్రోప్యాక్
ముంబై: అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్ తాజాగా స్పెషాలిటీ ప్యాకేజింగ్ కంపెనీ ఎస్సెల్ ప్రోప్యాక్‌లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం సుమారు రూ.3,211 కోట్లు (462 మిలియన్ డాలర్లు) వెచ్చించనుంది. ఎఫ్ఎంసీజీ, ఫార్మా కంపెనీల్లో ఉపయోగించే లామినేటెడ్ ట్యూబ్స్‌ను ఎస్సెల్ ప్రోప్యాక్ తయారుచేస్తోంది. ఈ డీల్ రెండంచెల్లో ఉండనుంది. తొలి దశలో ప్రమోటరు అశోక్ గోయల్ ట్రస్ట్ నుంచి బ్లాక్‌స్టోన్ 51% వాటా కొనుగోలు చేస్తుంది. షేరు ఒక్కింటికి రూ.134 రేటుతో ఈ డీల్ విలువ సుమారు రూ.2,157 కోట్లుగా ఉంటుంది. రెండో దశలో మరో 26% వాటాలను కొనుగోలు చేసేందుకు బ్లాక్‌స్టోన్ ఓపెన్ ఆఫర్ ప్రకటిస్తుంది. ఒక్కో షేరుకి రూ.139.19 చొప్పున ఓపెన్ ఆఫర్ విలువ రూ.1,054 కోట్లుగా ఉంటుందని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. 37 ఏళ్ల క్రితం నెలకొల్పిన ఎస్సెల్ ప్రోప్యాక్‌కు 10 దేశాల్లో 20 పైగా ప్లాంట్లు, 3,150 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. ఏటా 700 కోట్ల ల్యామినేటెడ్ ట్యూబ్స్‌ను తయారు చేస్తోంది. ఓపెన్ ఆఫర్ సబ్స్క్రిప్షన్ ఆధారంగా ఎస్సెల్ ప్రోప్యాక్ కొనుగోలు విలువ రూ.2,157 కోట్ల నుంచి రూ. 3,211 కోట్ల దాకా ఉండవచ్చని బ్లాక్‌స్టోన్ సీనియర్ ఎండీ అమిత్ దీక్షిత్ చెప్పారు. ఎస్సెల్ గ్రూప్‌తో సంబంధం లేదు: అశోక్ గోయల్ దాదాపు రూ.17,174 కోట్ల రుణాల భారంతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎస్సెల్ గ్రూప్ ప్రమోటరు సుభాశ్ చంద్ర సోదరుడు అశోక్ గోయల్‌కు చెందినదే ఈ ఎస్సెల్ ప్రోప్యాక్. అశోక్ గోయల్ ట్రస్టుకు ఇందులో 57 శాతం వాటాలుండగా.. అందులో 51 శాతం వాటాలను బ్లాక్‌స్టోన్ కొనుగోలు చేస్తోంది. డీల్ ద్వారా వచ్చిన నిధులను ముంబైలో తాము నిర్వహిస్తున్న అమ్యూజ్మెంట్ పార్క్ ఎస్సెల్ వరల్డ్‌ను, వాటర్ కింగ్డమ్ను అభివృద్ధి చేసేందుకు వెచ్చిస్తామని, మరికొన్ని నిధులను దాతృత్వ కార్యకలాపాలకు ఉపయోగిస్తామని గోయల్ చెప్పారు. సోదరుడు సుభాశ్‌చంద్రకు చెందిన ఎస్సెల్ గ్రూప్ రుణభారం తగ్గించేందుకు ఈ నిధులేమైనా ఉపయోగిస్తారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. తమ సంస్థ ఎస్సెల్ గ్రూప్‌లో భాగం కాదని.. గోయల్ ట్రస్టుకు గానీ ఎస్సెల్ ప్రోప్యాక్‌కు గానీ దానితో ఎలాంటి వాణిజ్యపరమైన సంబంధాలు లేవని ఆయన తెలిపారు. ‘మాదంతా ఒకే కుటుంబం. ఒకరి బాగోగులు మరొకరు చూసుకుంటూ ఉంటాం. అయితే రెండు గ్రూపుల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలు గానీ క్రాస్ హోల్డింగ్స్ గానీ లేవు‘ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఎండీగా ఉన్న అశోక్ గోయల్ ఒప్పందం పూర్తయ్యాక 6 శాతం వాటాలతో కంపెనీలో సలహాదారుగా కొనసాగుతారు. ఇందుకు గాను అయిదేళ్ల పాటు ఏటా రూ.16 కోట్లు అందుకుంటారు. డీల్ నేపథ్యంలో బీఎస్ఈలో సోమవారం ఎస్సెల్ ప్రోప్యాక్ షేరు 0.91 శాతం పెరిగి రూ. 132.65 వద్ద క్లోజయ్యింది. -
‘జెట్ ప్రివిలేజ్’పై బ్లాక్‌స్టోన్ కన్ను
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్.. రుణభారాలను తగ్గించుకునేందుకు మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా తమ లాయల్టీ ప్రోగ్రాం ’జెట్ ప్రివిలేజ్ ప్రైవేట్ లిమిటెడ్’లో వాటాల విక్రయ అంశం కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వాటాల కొనుగోలుకు అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్ గ్రూప్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ డీల్ గానీ కుదిరితే జెట్ ప్రివిలేజ్ సంస్థ వ్యాల్యు యేషన్ రూ. 3,000 కోట్లు– రూ. 4,000 కోట్ల దాకా ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. విదేశీ రుణభారం తగ్గించుకునే యత్నాల్లో భాగంగా జెట్ ఎయిర్వేస్ సుమారు రూ. 5,000 కోట్ల సమీకరణకు ఇప్పటికే ఎస్బీఐ కన్సార్షియంను సంప్రదించినట్లు సమా చారం. తరచూ జెట్ ఎయిర్వేస్లో ప్రయా ణించే వారికి లాయల్టీ, రివార్డ్ పాయింట్లు మొదలైన ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు జెట్ ప్రివిలేజ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. -
వెస్ట్‌ల్యాండ్ మాల్లో 50% వాటా
బ్లాక్‌స్టోన్ చేతికి ముంబై: ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్... పుణేలోని వెస్ట్‌ల్యాండ్ మాల్లో 50 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ వాటాను ఎంతకు కొనుగోలు చేసిందీ మాత్రం వెల్లడించలేదు. ఇది బ్లాక్‌స్టోన్ సంస్థ వాటాకొనుగోలు చేసిన నాలుగో మాల్ అని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ జోన్స్ లాంగ్ లాసల్లె తెలియజేసింది. డీల్ సాకారం కావడానికి ఈ సంస్థే సహకరించింది. పశ్చిమ పుణేలో ఇదే అతిపెద్ద రిటైల్మాల్ అని జేఎల్ఎల్ ఇండియా ఎండీ (పుణే) సంజయ్ బజాజ్ చెప్పారు. ఇప్పటికే బ్లాక్‌స్టోన్ సంస్థ అహ్మదాబాద్, అమృత్సర్, నవీ ముంబైల్లోని రిటైల్ మాల్స్ల్లో వాటాలను కొనుగోలు చేసింది. బ్లాక్‌స్టోన్‌ను ప్రపంచంలోనే అతి పెద్ద రియల్ఎస్టేట్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థగా పేర్కొన్నారాయన. రియల్టీ రంగంలో వివిధ సమస్యలున్నప్పటికీ, సంస్థాగత రియల్టీ ఇన్వెస్టర్లు భారీ స్థాయి అవకాశాలను వదులుకోరనే విషయాన్ని ఈ డీల్ నిరూపిస్తోందని బజాజ్తెలియజేశారు. -
బ్లాక్ స్టోన్ చేతికి ఎంఫసిస్
♦ మెజారిటీ వాటా కొనుగోలుకు ఒప్పందం.. ♦ 26 శాతం వాటా కోసం ఓపెన్ ఆఫర్ కూడా... ♦ డీల్ మొత్తం విలువ రూ.7,071 కోట్ల వరకూ ఉండే అవకాశం ♦ దేశంలో అతిపెద్ద ప్రైవేటు ఈక్విటీ డీల్‌గా రికార్డు ముంబై: దేశీ ఐటీ కంపెనీ ఎంఫసిస్‌ను అమెరికాకు చెందిన అసెట్ మేనేజ్మెంట్ దిగ్గజం బ్లాక్‌స్టోన్ చేజిక్కించుకోనుంది. ప్రస్తుతం ఎంఫసిస్‌లో మెజారిటీ వాటాదారుగా ఉన్న హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజ్(హెచ్‌పీఈ) నుంచి 60.5 శాతం పూర్తి వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సోమవారం బ్లాక్‌స్టోన్ ప్రకటించింది. ఇందుకోసం ఒక్కోషేరుకి రూ. 430 చొప్పున వెచ్చించనున్నట్లు తెలిపింది. నిబంధనల ప్రకారం మరో 26 శాతం వాటాను ఇతర ఇన్వెస్టర్ల నుంచి కొనడానికి వీలుగా ఓపెన్ ఆఫర్‌ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి షేరు ధర రూ.457.5గా ఉంటుందని బ్లాక్‌స్టోన్ పేర్కొంది. ఓపెన్ ఆఫర్‌ను సబ్స్క్రయిబ్ అయ్యేదాన్నిబట్టి చూస్తే.. బ్లాక్ స్టోన్ ఈ కొనుగోలు కోసం రూ.5,466 కోట్ల నుంచి రూ.7,071 కోట్ల వరకూ వెచ్చించనుంది. దేశీయంగా చూస్తే అతిపెద్ద ప్రైవేటు ఈక్విటీ(పీఈ) డీల్‌గా ఇది రికార్డుకెక్కనుంది. హెచ్‌పీ నుంచి భారీ కాంట్రాక్టు... ఒప్పందంలో భాగంగా ఎంఫసిస్... హెచ్‌పీ నుంచి 11 ఏళ్ల కాంట్రాక్టును చేజిక్కించుకున్నట్లు బ్లాక్‌స్టోన్ ఇండియా సీనియర్ మేనేజింగ్ డెరైక్టర్ అమిత్ దీక్షిత్ కాన్ఫరెన్స్ కాల్లో విలేకరులకు తెలిపారు. వచ్చే ఐదేళ్లపాటు ఎంఫసిస్ నుంచి 90 కోట్ల డాలర్ల విలువైన (దాదాపు రూ.6,000 కోట్లు) ఐటీ సేవలను హెచ్‌పీ పొందనుందని వెల్లడించారు. విలువ రూ. 82.5 కోట్ల డాలర్లు డీల్ ప్రకారం తమ వాటా విలువ 82.5 కోట్ల డాలర్లుగా ఉంటుందని హెచ్‌పీఈ ఒక ప్రకటనలో పేర్కొంది. కంపెనీతో తమ వాణిజ్య బంధంపై ఈ ఒప్పందం ఎలాంటి ప్రభావం చూపబోదని కూడా తెలిపింది. టాప్ మేనేజ్మెంట్లో మార్పులుండవు... బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మధ్యస్థాయి ఐటీ కంపెనీ ఎంఫసిస్‌ను దక్కించుకోవడం కోసం దేశీ ఐటీ సేవల దిగ్గజం టెక్మహీంద్రాతో పాటు ప్రైవేటు ఈక్విటీ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ కూడా రేసులో పోటీపడ్డాయి. చివరకు బ్లాక్‌స్టోన్ చేతికి చిక్కింది. గడిచిన దశాబ్ద కాలంలో బ్లాక్‌స్టోన్ భారత్‌లోని పీఈ డీల్స్, రియల్టీ లావాదేవీల్లో 6 బిలియన్ డాలర్లకుపైగా వెచ్చించింది. ఐటీ పరిశ్రమ వృద్ధి అవకాశాలు చాలా బాగున్నాయని దీక్షిత్ అంటూ అందుకే ఇప్పుడు ఎంఫసిస్‌తో కలిపి మూడు కంపెనీల్లో(మిగతా రెండూ బీపీఓ సంస్థ ఇంటెలినెట్, ఐబీఎస్ సాఫ్ట్వేర్) మొత్తం 1.4 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టామని చెప్పారు. ఎంఫసిస్కు ఇప్పుడున్న నాయకత్వ బృందమే అతిపెద్ద బలమని.. టాప్ మేనేజ్మెంట్ను యథాతథంగా కొనసాగించనున్నట్లు దీక్షిత్ వెల్లడించారు. ఎంఫసిస్ సంగతిదీ... ♦ ఐటీ కన్సల్టింగ్ కంపెనీ ఎంఫసిస్ కార్పొరేషన్‌ను తొలుత అమెరికాలో శాంటా మోనికా, జెర్రీ రావు, జెరోన్ టాస్ అనే ముగ్గురు కలసి 1998లో స్థాపించారు. ♦ 1992లో ఏర్పాటైన భారతీయ ఐటీ సేవల కంపెనీ బీఎఫ్ఎల్ సాఫ్ట్‌వేర్‌ను 2000 సంవత్సరంలో విలీనం చేసుకోవడం ద్వారా ఇప్పుడున్న ఎంఫసిస్ ఆవిర్భవించింది. ♦ 2006లో ఎలక్ట్రానిక్ డేటా సిస్టమ్స్ 42 శాతం మెజారిటీ వాటాను కొనుగోలు చేసి అనుబంధ సంస్థగా మార్చింది. ♦ 2008లో హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజ్ ఈడీఎస్ నుంచి ఎంఫసిస్‌ను చేజిక్కించుకుంది. ♦ దేశంలో ఏడో పెద్ద ఐటీ కంపెనీగా ఎంఫసిస్ నిలుస్తోంది. ♦ ఎంఫసిస్ షేరు ధర సోమవారం బీఎస్ఈలో దాదాపు 3 శాతం క్షీణించి రూ. 454 వద్ద ముగిసింది. ఉద్యోగులు, మా మొత్తం మేనేజ్మెంట్ టీమ్‌కు ఈ డీల్ చాలా ఉత్సాహాన్నిచ్చింది. సంస్థ భవిష్యత్తు వృద్ధి జోరు, స్థిరత్వానికి ఇది ఒక మంచి ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఇక హెచ్‌పీలో నేను 20 ఏళ్లకుపైగానే పనిచేశా. ఇప్పుడు ఎంఫసిస్తోనూ ఏడున్నరేళ్ల అనుబంధం ఉంది. - గణేశ్ అయ్యర్, ఎంఫసిస్ సీఈఓ -
ఎంఫసిస్, బ్లాక్ స్టోన్ ల మధ్య భారీ ఒప్పందం
ముంబై : దేశంలో అగ్రగామి ఐటీ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతున్న ఎంఫసిస్.. ప్రముఖ గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ బ్లాక్ స్టోన్ తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎంఫసిస్ కంపెనీ మెజార్టి 60.5 శాతం షేరును బ్లాక్ స్టోన్ కొనుగోలు చేసింది. దీని విలువ రూ. 5,466 కోట్ల నుంచి రూ. 7,071 కోట్ల(1బిలియన్ డాలర్ల)గా ఉంది. భారత టేక్ ఓవర్ కోడ్ ప్రకారం ఎంఫసిస్ కంపెనీ 26 శాతం అదనపు షేర్లను ఓపెన్ ఆఫర్లో ఉంచినట్టు బ్లాక్ స్టోన్ సంస్థ సోమవారం స్టాక్ ఎక్సేంజ్ లకు తెలిపింది. ఒక్కో షేరుకు రూ.430ను చెల్లిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్, బీఎస్ఈలో నమోదైన కంపెనీలో ఎంఫసిస్ ఒకటి కాబట్టి బీఎస్ఈలో ఆ షేరు ధర 1.48 శాతం తగ్గి, రూ.460.50 వద్ద నమోదైంది. బ్యాంకింగ్, ఫైనాన్సియల్, ఇన్సూరెన్స్, డిజిటల్ సర్వీసులు అందిస్తున్న కంపెనీల్లో ఎంఫసిస్ ఎక్కువ లాభాలు ఆర్జిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వినియోగదారులను కలిగిఉన్న ఎంఫసిస్ 16 దేశాల్లో సేవలను అందిస్తోంది. ఆ కంపెనీలో 24 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.