కేర్‌ హాస్పిటల్స్, ఆస్టర్‌ డీఎం విలీనం | Aster DM Healthcare announces merger with Quality Care | Sakshi
Sakshi News home page

కేర్‌ హాస్పిటల్స్, ఆస్టర్‌ డీఎం విలీనం

Published Sat, Nov 30 2024 4:15 AM | Last Updated on Sat, Nov 30 2024 7:56 AM

Aster DM Healthcare announces merger with Quality Care

దేశంలో మూడో పెద్ద హాస్పిటల్‌ చైన్‌గా ఆవిర్భావం 

తెలంగాణకు రిజిస్టర్డ్‌ కార్యాలయం తరలింపు 

విలీన సంస్థలో ఆస్టర్‌ ప్రమోటర్ల వాటా 24 శాతం  

బ్లాక్‌స్టోన్‌ వాటా 30.7 శాతం వాటా

న్యూఢిల్లీ: వైద్య సేవల దిగ్గజాలు ఆస్టర్‌ డీఎం హెల్త్‌కేర్, క్వాలిటీ కేర్‌ ఇండియా (కేర్‌ హాస్పిటల్స్‌) విలీనం కానున్నాయి. తద్వారా ఆదాయం, పడకల సంఖ్యపరంగా దేశీయంగా మూడో అతి పెద్ద హాస్పిటల్‌ చైన్‌ ఆవిర్భవించనుంది. ఇందుకు సంబంధించిన విలీన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. డీల్‌ ప్రకారం క్వాలిటీ కేర్‌ ఇండియాలో  (క్యూసీఐఎల్‌) పెట్టుబడులున్న బ్లాక్‌స్టోన్, టీపీజీల నుంచి ఆస్టర్‌ 5% వాటాలను కొనుగోలు చేస్తుంది. ప్రతిగా తమ సంస్థలో 3.6% వాటాకు సమానమైన షేర్లను జారీ చేస్తుంది. తదుపరి ఆస్టర్‌లో క్యూసీఐఎల్‌ని విలీనం చేస్తారు.

 లిస్టెడ్‌ విలీన సంస్థ పేరు ఆస్టర్‌ డీఎం క్వాలిటీ కేర్‌గా మారుతుంది. రిజిస్టర్డ్‌ కార్యాలయాన్ని కర్ణాటక నుంచి తెలంగాణకు మారుస్తారు. ‘ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలు అందించేందుకు, కొత్త ఆవిష్కరణలు చేసేందుకు ఈ ఒప్పందం దోహదపడగలదు’ అని ఆస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ ఆజాద్‌ మూపెన్‌ ఈ సందర్భంగా తెలిపారు. ‘విలీన సంస్థ భారత హెల్త్‌కేర్‌ రంగంలో అగ్రగామిగా, ప్రపంచ స్థాయి సంస్థగా ఎదిగేందుకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తాం’ అని బ్లాక్‌స్టోన్‌ ప్రైవేట్‌ ఈక్విటీ ఆసియా హెడ్‌ అమిత్‌ దీక్షిత్‌ వివరించారు.   

చైర్మన్‌గా ఆజాద్‌ మూపెన్‌.. 
విలీన కంపెనీలో ఆస్టర్‌ ప్రమోటర్లకు 24 శాతం, బ్లాక్‌స్టోన్‌కు 30.7 శాతం వాటాలుంటాయి. షేర్ల మారి్పడి నిష్పత్తి ప్రకారం విలీన కంపెనీలో ప్రమోటర్లతో కలిపి ఆస్టర్‌ షేర్‌హోల్డర్లకు 57.3%, క్యూసీఐఎల్‌ షేర్‌హోల్డర్లకు 42.7% వాటా ఉంటుంది. క్యూసీఐఎల్‌ షేర్‌హోల్డర్లకు ప్రతి 1,000 షేర్లకు గాను 977 ఆస్టర్‌ షేర్లు లభిస్తాయి. ఆస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ ఫౌండర్, చైర్మన్‌ ఆజాద్‌ మూపెన్‌ .. మూడేళ్ల ఆరు నెలల పాటు ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా ఉంటారు. ఆ తర్వాత నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కొనసాగుతారు.  మరోవైపు, క్యూసీఐఎల్‌ గ్రూప్‌ ఎండీ వరుణ్‌ ఖన్నా.. ఎండీ, గ్రూప్‌ సీఈవోగా ఉంటారు.  

38 ఆస్పత్రులు.. 10 వేల పైగా బెడ్స్‌.. 
విలీన సంస్థ 27 నగరాల్లో 38 ఆస్పత్రులు, 10,150 పడకలతో దేశీయంగా మూడో అతి పెద్ద హాస్పిటల్‌ చెయిన్‌గా ఉంటుంది. స్టాక్‌ ఎక్సే్చంజీలకు ఆస్టర్‌ డీఎం ఇచి్చన సమాచారం ప్రకారం 2027 ఆర్థిక సంవత్సరం నాటికి సుమారుగా మరో 3,500 పడకలను పెంచుకునే ప్రణాళికలు ఉన్నాయి. ఆస్టర్‌ డీఎం క్వాలిటీ కేర్‌ కింద నాలుగు బ్రాండ్లు (ఆస్టర్‌ డీఎం, కేర్‌ హాస్పిటల్స్, కిమ్స్‌హెల్త్, ఎవర్‌కేర్‌) ఉంటాయి. ప్రస్తుతం అపోలో గ్రూప్, మణిపాల్‌ హాస్పిటల్స్‌ టాప్‌ 3లో ఉన్నాయి. శుక్రవారం బీఎస్‌ఈలో ఆస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ షేరు సుమారు 2 శాతం పెరిగి రూ. 499.95 వద్ద క్లోజయ్యింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement