మెజారిటీ వాటా కొనుగోలుకు రెడీ
కంపెనీ విలువ రూ. 70,000 కోట్లుగా అంచనా
న్యూఢిల్లీ: స్నాక్స్ తయారీ దిగ్గజం హల్దీరామ్స్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకి ప్రయివేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఇప్పటికే ప్రారంభించిన చర్చలు తుది దశకు చేరినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, సింగపూర్ సంస్థ జీఐసీతో జత కట్టిన బ్లాక్‌స్టోన్ కొద్ది నెలలుగా హల్దీరామ్స్ ప్రమోటర్లు అగర్వాల్ కుటుంబంతో చర్చలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.
అయితే బిజినెస్ విలువ విషయంలో అంగీకారం కుదరకపోవడంతో చర్చలు నిలిచిపోయాయి. కాగా.. స్నాక్స్ విభాగంలో దేశీయంగా ప్రధాన కంపెనీగా నిలుస్తున్న హల్దీరామ్స్‌లో నియంత్రిత వాటాను సొంతం చేసుకునేందుకు బ్లాక్‌స్టోన్ ఇంక్ ప్రస్తుతం చర్చల్లో ఇటీవల పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఒక అంచనా ప్రకారం రూ. 70,000 కోట్ల విలువలో హల్దీరామ్స్ కొనుగోలుకి డీల్ కుదిరే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
76%పై కన్ను
హల్దీరామ్స్‌లో 76 శాతం వాటా కొనుగోలుపై బ్లాక్‌స్టోన్ కన్సార్షియం కన్నేసినట్లు తెలుస్తోంది. అయితే అగర్వాల్ కుటుంబం భారీ వాటా విక్రయానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కంపెనీ విలువ నిర్ధారణలోనూ అంగీకారం కుదరనట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రమోటర్లలో కొంతమంది 51 శాతం వాటా విక్రయానికి మాత్రమే ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశాయి. ఒకవేళ బ్లాక్‌స్టోన్‌తో ఒప్పందం కుదిరితే దేశీయంగా అతిపెద్ద పీఈ డీల్‌గా చరిత్ర సృష్టించే వీలున్నట్లు పేర్కొన్నాయి.
చర్చలు ఏక్షణమైనా విఫలమైతే ఇతర ప్రత్యామ్నాయాలను సైతం అగర్వాల్ కుటుంబం సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే పబ్లిక్ ఇష్యూకి సైతం తెరతీసే యోచనలో ఉన్నట్లు తెలియజేశాయి. అగర్వాల్ కుటుంబం ఢిల్లీ, నాగ్‌పూర్ బ్రాంచీల ఎఫ్‌ఎంసీజీ బిజినెస్‌ను విలీనం చేసే ప్రణాళికల్లో ఉంది. హల్దీరామ్ స్నాక్స్ పీవీటీ లిమిటెడ్, హల్దీరామ్ ఫుడ్స్ ఇంటర్నేషనల్ పీవీటీ లిమిటెడ్ విలీనం ద్వారా హల్దీరామ్ స్నాక్ ఫుడ్స్ పీవీటీ లిమిటెడ్‌గా ఏర్పాటు చేయనుంది. ఈ కంపెనీలో ఢిల్లీ బ్రాంచ్ 56 శాతం, నాగ్‌పూర్ బ్రాంచ్ 44 శాతం చొప్పున వాటాను తీసుకోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment