న్యూఢిల్లీ: వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమన్న వార్తల నేపథ్యంలో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ (సీడీఈ) తాజాగా రుణాల భారం తగ్గించుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌ను అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్‌కు విక్రయించాలని నిర్ణయించుకుంది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 3,000 కోట్ల దాకా ఉంటుంది. అలాగే, అనుబంధ సంస్థ అల్ఫాగ్రెప్ సెక్యూరిటీస్‌లో కూడా వాటాలను ఇల్యూమినాటి సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించే ప్రతిపాదనకు కూడా సీడీఈ బోర్డు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.
‘రుణభారం తగ్గించుకునే మార్గాలపై డైరెక్టర్ల బోర్డు చర్చించింది. ఈ సందర్భంగా అనుబంధ సంస్థ టాంగ్లిన్ డెవలప్‌మెంట్స్‌లో భాగమైన గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌ను బ్లాక్‌స్టోన్‌కి విక్రయించే ప్రతిపాదనను ఆమోదించింది. ఈ డీల్ విలువ సుమారు రూ. 2,600 కోట్ల నుంచి రూ. 3,000 కోట్ల దాకా ఉంటుంది. మదింపు ప్రక్రియ, నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభించడం మొదలైనవన్నీ పూర్తయ్యాకా వచ్చే 30–45 రోజుల్లో ఈ డీల్ పూర్తి కావచ్చు‘ అని స్టాక్ ఎక్సే్ఛంజీలకు సీడీఈ తెలియజేసింది. ఈ రెండు ఒప్పందాలతో కాఫీ డే గ్రూప్ రుణభారం గణనీయంగా తగ్గగలదని పేర్కొంది. ఇన్వెస్టర్లు, రుణదాతలు, ఉద్యోగులు, కస్టమర్లు మొదలైన సంబంధిత వాటాదారులందరికీ ఈ డీల్స్ ప్రయోజనకరంగా ఉండగలవని వివరించింది.
ఆతిథ్య, రియల్టీ తదితర రంగాల్లోని అన్‌లిస్టెడ్ వెంచర్స్ కారణంగా వీజీ సిద్ధార్థ నెలకొల్పిన సీడీఈ రుణభారం రెట్టింపై రూ. 5,200 కోట్లకు చేరింది. ఈ పరిణామాల నేపథ్యంలో గత నెల సిద్ధార్థ అదృశ్యం కావడం, ఆ తర్వాత నేత్రావతి నదిలో శవమై తేలడం ఆయన మరణంపై సందేహాలు రేకెత్తించాయి. సిద్ధార్థ అకాల మరణంతో జూలై 31న స్వతంత్ర డైరెక్టర్ ఎస్‌వీ రంగనాథ్ సీడీఈ తాత్కాలిక చైర్మన్‌గా నియమితులయ్యారు. రంగనాథ్‌తో పాటు సీవోవో నితిన్ బాగ్మానె, సీఎఫ్‌వో ఆర్ రామ్‌మోహన్‌లతో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటైంది. కాఫీ డే గ్రూప్ రుణభారాన్ని తగ్గించుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను ఈ కమిటీ పరిశీలిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment