Debt burdens
-
ప్రపంచానికి ప్రమాదం: రఘురామ్ రాజన్
ప్రపంచంలో ప్రభుత్వ రుణాలు పెరుగుతున్నాయని, అవి చాలా ప్రమాదకరమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ముఖ్యంగా దానివల్ల అమెరికాకు చాలా నష్టం కలుగుతుందన్నారు. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు అమెరికా ఆర్థిక విధానాలపై ఆధారపడి ఉన్నాయని గుర్తు చేశారు.రోమ్‌లోని బ్యాంకోర్ ప్రైజ్ అవార్డు సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘ప్రభుత్వ రుణాలు పెంచుకునే దేశాలకు భవిష్యత్తులో సంక్షోభాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం, అంటువ్యాధులు పెరుగుతున్నాయి. దానివల్ల అప్పులు పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఇటీవలి ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం ప్రపంచ దేశాల ప్రభుత్వ రుణాలు అధికమవుతున్నాయి. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు ఇదో హెచ్చరిక. వచ్చే ఏడాది వైట్‌హైజ్ బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండేందుకు రుణాలు తగ్గించుకోవాలి’ అన్నారు.ఇదీ చదవండి: గోల్డ్ లోన్ చెల్లింపు విధానంలో మార్పులుప్రపంచ ప్రభుత్వ రుణం ఈ ఏడాది చివరి నాటికి 100 ట్రిలియన్ డాలర్లు లేదా ప్రపంచ జీడీపీలో 93% చేరుకుంటుందని కొన్ని సర్వేలు అంచనా వేస్తున్నాయి. యూఎస్ అప్పు దాదాపు 31 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ద్రవ్యోల్బణం మందగించడం, వడ్డీ రేట్లు తగ్గడం వంటి అంశాలు ప్రభుత్వాలు రుణాలు క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం ఇస్తాయని రాజన్ అన్నారు. దేశాల అప్పులు పెరగడంవల్ల ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఇతర దేశాల నుంచి రుణం పొందే అవకాశం ఉండదని చెప్పారు. -
రిస్క్ అని తెలిసినా అవే అప్పులు చేస్తున్నారు..! ఆందోళనలో ఆర్బీఐ
దేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగం అంతకంతకూ పెరిగిపోతోంది. జనవరిలో క్రెడిట్‌కార్డ్ రుణాలు ఏకంగా 31.3 శాతం పెరగడమే దీనికి నిదర్శనం. అన్సెక్యూర్డ్ రుణాలపై రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రిస్క్ వెయిటేజీ పెంచినప్పటికీ, బ్యాంక్‌ల క్రెడిట్ కార్డ్ రుణాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. 2024 జనవరి నెలలో బ్యాంక్‌లు క్రెడిట్ కార్డులపై ఇచ్చిన రుణాలు 31.3 శాతం పెరిగి రూ.2.6 లక్షల కోట్లకు చేరాయి. 2023 డిసెంబర్లో ఇవి రూ.2.5 లక్షల కోట్లు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ క్రెడిట్ కార్డ్ వార్షిక వినియోగం 26.3 శాతం వృద్ధి చెందింది. బ్యాంకింగ్ వ్యవస్థలో రిటైల్ అన్సెక్యూర్డ్ లోన్స్ (వ్యక్తిగత రుణాలు) శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వీటి ద్వారా ఆర్థిక స్థిరత్వం రిస్క్‌లో పడుతుందని ఆర్బీఐ గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు ఇచ్చే తనఖాలేని వినియోగ రుణాలపై గత ఏడాది నవంబర్‌లో రిస్క్ వెయిట్‌ను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. అంటే వాటిపై ఆర్థిక సంస్థలు అధిక కేటాయింపులు జరపాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: అత్తకు తగ్గ కోడలు.. నాట్యంలో దిట్ట.. రాధిక గురించి ఆసక్తికర విషయాలు.. దీంతో వ్యక్తిగత రుణాల వృద్ధి డిసెంబర్లో 26.6 శాతం ఉండగా, జనవరిలో 23.3 శాతానికి తగ్గింది. కానీ క్రెడిట్ కార్డు రుణాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. -
అప్పు ప్రమాదఘంటికలివే..
డబ్బు.. మనిషిని ఆర్థికంగా ఎదిగేలా చేస్తుంది.. పతాలానికి తోసేస్తుంది. డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే అప్పుల మూటలు కూడగట్టుకునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జీతం వస్తున్న వారు నిత్యం ఏదో రూపంలో అప్పులు తీసుకుంటారు. అప్పుల్లో కొన్ని మంచివి, మరికొన్ని చెడ్డవి ఉంటాయి. అప్పుచేసి ఆ సొమ్మును మరింత పెంచేలా ఎక్కడైనా పెట్టుబడిపెడితే అది మంచి అప్పు. అదే అప్పు విలాసాలకు వాడితే దాన్ని చెడు అప్పు అంటారు. తీసుకునే అప్పుపై సరైన అవగాహన లేకపోతే తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. చాలా మందికి వారు తీసుకున్న అప్పుతో మరింతో లోతుల్లోకి వెళుతున్నామని తెలియకపోవచ్చు. కానీ కొన్ని సంకేతాలను గుర్తించడం ద్వారా ఈ ప్రమాదాన్ని కొంత తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా వస్తువలు కొనాలంటే సరిపడా డబ్బు లేకుండా ఈజీ ఈఎంఐల బాట పడుతుంటారు. వ్యక్తిగత ఈఎంఐలు సులువే అనిపించినప్పటికీ, వీటివల్ల ఇతర ఖర్చులకు డబ్బు సరిపోదు. కిస్తీల విలువ నెలవారీ ఆదాయంలో 50శాతం కంటే తక్కువగా ఉండాలి. అనేక బ్యాంకులు వ్యక్తులు ఈ 50శాతం పరిమితి మించకుండా నిరోధించడానికి పరిమితులను కూడా విధించాయి. అయితే చాలా మంది ఈజీ ఈఎంఐలు, తగ్గింపులు, సేల్స్ ఆఫర్స్ ఆకర్షణకు లోనవుతారు. అనవసర ఖర్చులో మునిగిపోవడం వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. కనీస అవసరాలను తీర్చుకోవడానికి తరచు అప్పు తీసుకుంటే మాత్రం ఆర్థిక పరిస్థితి గురించి మరోసారి ఆలోచించుకోవాలి. అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు వంటి సాధారణ ఖర్చులను కవర్ చేయడానికి అప్పులు తీసుకోవడం వల్ల రుణఊబిలోకి కూరుకుపోయే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో దాదాపు అన్ని బ్యాంకులతోపాటు ఆన్లైన్ పేమెంట్ యాప్‌లు సైతం క్రెడిట్ కార్డ్‌లను ఆఫర్ చేస్తున్నాయి. అయితే చాలా మంది తమకున్న అప్పులు తీర్చడానికి క్రెడిట్‌కార్డులను తీసుకుంటుంటారు. కానీ అప్పులు తీర్చడానికి తిరిగి క్రెడిట్ కార్డ్ రూపంతో అధిక వడ్డీలకు అప్పుచేయడం దారుణం. దాంతో ఆ క్రెడిట్ కార్డ్ బకాయిలను సైతం తీర్చలేని పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. పరిస్థితి శ్రుతిమించితే తీసుకున్న అప్పులను రోల్ఓవర్ చేయాడానికి సైతం వెనుకాడరు. కానీ అలా చేస్తే భవిష్యత్తులో తిరిగి అప్పు పుట్టాలంటే చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం అని గ్రహించాలి. ఇదీ చదవండి: ఆగిపోతున్న సరకు రవాణా..! అప్పు తీసుకోడదా..? అంటే తీసుకోవాలి. కానీ అది మన ఆర్థిక పరిధిలో ఉండాలి. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. ప్రస్తుత జీతం ఆధారంగా అప్పు తీసుకోవడం మంచిదే కానీ, ఈఎంఐలను లెక్కించేటప్పుడు అన్ని కనీస అవసరాలుపోను జీతం సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. అంతకుమించి దాదాపు ఆరు నెలలకు సరిపడే అత్యవసర నిధిను ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
KPMG report: 2050 నాటికి ‘నెట్ జీరో’ లక్ష్యం కష్టమే!
న్యూఢిల్లీ: సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని 2050 నాటికి సాధించేందుకు ప్రపంచ దేశాలు తీసుకుంటున్న చర్యలు చాలవని కేపీఎంజీ సంస్థ పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వాలు, పరిశ్రమలు గుణాత్మక మార్పు దిశగా కృషి చేయాల్సి ఉందని తెలిపింది. అయితే, ఎన్నో అడ్డంకులు, గణనీయ స్థాయిలో ప్రభుత్వాల రుణ భారం, అంతర్గత ఉద్రిక్తతలు, కర్బన ఉద్గారాల తగ్గింపు ప్రణాళికలపై పెరుగుతున్న వ్యతిరేకత, ఇంధన సరఫరా విషయంలో భరోసా కలి్పంచాల్సిన అవసరం కర్బన ఉద్గారాల విషయంలో అవరోధంగా మారుతున్నట్టు వివరించింది. ఈ మేరకు కేపీఎంజీ ఓ నివేదికను విడుదల చేసింది. కాలుష్యాన్ని అధికంగా విడుదల చేసే యూఎస్, చైనా, బ్రెజిల్, కెనడా, యూఈ దేశాల్లో తక్కువ కర్బన ఆధారిత ఇంధనాల ఉత్పత్తి విషయంలో కొంత పురోగతి సాధించినప్పటికీ.. ఈ విషయంలో భారీగా అవుతున్న ఖర్చు, దేశీయ పరిశ్రమపై పడే ప్రభావం దృష్ట్యా వస్తున్న వ్యతిరేకత అవరోధంగా మారినట్టు తెలిపింది. విడిగా దేశాల వారీగా చూస్తే.. ప్రజల జీవనోపాధికి గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయన్నవ్యతిరేకతతో అర్థవంతమైన పురోగతికి ఆటంకం కలుగుతున్నట్టు వెల్లడించింది. వివిధ రంగాల్లో కర్బన ఉద్గారాల తగ్గింపు విషయంలో పురోగతి వేర్వేరుగా ఉందని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో పెద్ద ఎత్తున వృద్ధి.. కొన్ని రంగాల్లో వేగంగా కర్బన ఉద్గారాలను ఎలా తగ్గించవచ్చన్న దానికి విజయవంతమైన నమూనాగా పేర్కొంది. విమానయానం, షిప్పింగ్ పరిశ్రమల్లో దీనికి సంబంధించి పురోగతి చాలా నిదానంగా ఉన్నట్టు వివరించింది. 2050 నాటికి సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడం అన్నది సుస్థిర విమానయాన ఇంధనాలను అభివృద్ధి చేయడంపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది. భారత్‌లో పురోగతి.. భారత్ పునరుత్పాదక ఇంధనాల విషయంలో వేగవంతమైన పురోగతి సాధిస్తున్నట్టు కేపీఎంజీ నివేదిక వెల్లడించింది. 2047 నాటికి ఇంధనాల విషయంలో స్వతంత్ర దేశంగా అవతరించాలన్న ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా అడుగులు పడుతున్నట్టు తెలిపింది. ఫేమ్ పథకం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుండడాన్ని పస్త్రావించింది. కాకపోతే వ్యవసాయ రంగం నుంచి వెలువడుతున్న వ్యర్థాల తగ్గింపు భారత్‌కు సవాలేనని పేర్కొంది. సబ్సిడీతో అందిస్తున్న ఎరువులను అధికంగా వాడుతుండడంతో, పశుగ్రాసం నుంచి మీథేన్ విడుదల తగ్గించడం కష్టమని అభిప్రాయపడింది. ‘‘భారత్ సోలార్, విండ్, హైడ్రోజన్ నుంచి మరింత విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోంది. అయితే, భారత్ ఏటా 6 శాతానికి పైగా వృద్ధి చెందే క్రమంలో ఏర్పడే ఇంధన అవసరాల దృష్ట్యా.. శిలాజ ఇంధనాలపై ఆధారపడడం ఇక ముందూ కొనసాగుతుంది. కాకపోతే కొంత కాలానికి సంప్రదాయ ఇంధనాల వినియోగం మొత్తం ఇంధన వినియోగంలో తగ్గుతుంది’’అని కేపీఎంజీ ఇంటర్నేషనల్ ఎనర్జీ హెడ్ అనిష్ అన్నారు. -
పడుతున్న పొదుపులు.. పెరుగుతున్న అప్పులు
ముంబై: భారత్‌లో వ్యక్తులుసహా చిన్న స్థాయి కుటుంబ సంస్థల (హౌస్‌హోల్డ్ సెక్టార్) ఆర్థిక పరిస్థితులపై ఎస్బీఐ రీసెర్చ్ కీలక అంశాలను ఆవిష్కరించింది. దీని ప్రకారం కరోనా తర్వాత వీటి పొదుపురేట్లు ఒకవైపు పడిపోతుండగా మరోవైపు అప్పులు పెరిగిపోతున్నాయి. వీటి నికర ఆర్థిక (ఫైనాన్షియల్) పొదుపు రేటు 2022 ఏప్రిల్– 2023 మార్చి ఆర్థిక సంవత్సరంలో దాదాపు 55 శాతం క్షీణించి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 5.15 శాతానికి పడిపోయింది. గడచిన 50 సంవత్సరాల్లో ఇంత తక్కువ స్థాయి ఆర్థిక పొదుపురేటు నమోదు ఇదే తొలిసారి. 2020–21లో ఈ రేటు 11.5 శాతంగా ఉంది. మహమ్మారికి ముందు ఆర్థిక సంవత్సరంలో (2019–20) ఈ రేటు 7.6 శాతం. అటు ప్రభుత్వం, ఇటు నాన్ ఫైనాన్షియల్ సంస్థలకు (ఈపీఎఫ్ఓ వంటివి) పొదుపు నిధులే ప్రధాన ఆర్థిక వనరు కావడం గమనార్హం. ఇక 2022–23 ఆర్థిక సంవత్సరంలో హౌస్‌హోల్డ్ సెక్టార్ రుణభారం రూ. 8.2 లక్షల కోట్లు పెరిగి రూ.15.6 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రాథమికంగా బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నట్లు తాజా అధికారిక విశ్లేషణ వెల్లడించింది. అయితే ఇందుకు సంబంధించి కొన్ని వర్గాల నుంచి వ్యక్తమైన ఆందోళనలను కేంద్ర ఆర్థికశాఖ తోసిపుచ్చడం గమనార్హం. ఫైనాన్షియల్ రంగంలో పొదుపు రేటు తగ్గడంపై ఆందోళన పడాల్సింది ఏమీ లేదని, వివిధ ఇతర భౌతిక పొదుపు ప్రొడక్టుల్లో ప్రజలు పెట్టుబడులు పెడుతున్నారని వివరణ ఇచ్చింది. ఎస్బీఐ రీసెర్చ్ చెబుతున్న అంశాలు క్లుప్తంగా... ► 2022–23లో పెరిగిన హౌస్‌హోల్డ్ సెక్టార్ రుణం రూ.8.2 లక్షల కోట్లలో బ్యాంక్ రుణాలు రూ.7.1 లక్షల కోట్లు. ఇందులో దాదాపు 55 శాతం భాగం గృహాలు, విద్య, వాహనాల కొనుగోళ్లకు వెళ్లింది. ► ఈ కాలంలో బీమా, ప్రావిడెంట్ ఫండ్లు, పెన్షన్ ఫండ్ పథకాల్లో రూ. 4.1 లక్షల కోట్ల పెరుగుదల ఉంది. ► హౌస్‌హోల్డ్ రంగం రుణం జీడీపీ నిష్పత్తిలో చూస్తే, 2020 మార్చిలో 40.7 శాతం. 2023 జూన్‌లో ఇది 36.5 శాతానికి పడింది. ► ఫైనాన్షియల్ పొదుపు నుండి తగ్గిన మొత్తంలో ప్రధాన భాగం భౌతిక (పొదుపు) ఆస్తులవైపు మళ్లింది. తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థ దీనికి కారణం. ► సంవత్సరాలుగా హౌస్‌హోల్డ్ సెక్టార్లో 80–90 శాతం భౌతిక పొదుపులు (ఫైనాన్షియల్ రంగంలో కాకుండా) నివాసాలు, ఇతర భవనాలు, నిర్మాణాలు, యంత్ర పరికరాల విభాగంలో ఉన్నాయి. ► వాస్తవానికి, 2011–2012లో హౌస్‌హోల్డ్ పొదుపులో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ భౌతిక ఆస్తుల వాటా ఉంది. అయితే ఇది 2020–21లో 48 శాతానికి తగ్గింది. 2022–23లో ఈ తరహా పొదుపులు మళ్లీ దాదాపు 70 శాతానికి చేరే అవకాశం కనబడుతోంది. రియల్టీ రంగం పురోగతికి ఇది సంకేతం. నివేదిక పరిధి ఇదీ... పొదుపులు, అప్పులకు సంబంధించి ఈ నివేదికలో ఎస్బీఐ రీసెర్చ్ ‘హౌస్‌హోల్డ్ సెక్టార్’ అని పేర్కొంది. అంటే జాతీయ ఖాతా (నేషనల్ అకౌంట్స్)కు సంబంధించి వ్యక్తులతోపాటు, వ్యవసాయ, వ్యవసాయేతర వ్యాపారాలు, ప్రభుత్వేతర, కార్పొరేటేతర చిన్న వ్యాపార సంస్థలు, ఏకైక (ప్రొప్రైటరీ) యాజమాన్యాలు, భాగస్వామ్యాలు, లాభాపేక్షలేని సంస్థలు వంటి అన్ఇన్కార్పొరేటెడ్ సంస్థలు ఈ పరిధిలో ఉంటాయి. -
కేంద్రానికి రూ. 2,400 కోట్లు చెల్లించనున్న వొడా ఐడియా
న్యూఢిల్లీ: రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా .. లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రమ్ వినియోగ చార్జీల కింద సెప్టెంబర్ కల్లా కేంద్రానికి రూ. 2,400 కోట్ల మొత్తాన్ని చెల్లించే యోచనలో ఉంది. గతేడాది వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌నకు సంబంధించి కంపెనీ .. జూలై నాటికి లైసెన్సు ఫీజు కింద రూ. 770 కోట్లు, స్పెక్ట్రమ్ వినియోగ చార్జీల కింద రూ. 1,680 కోట్లు కట్టాల్సి ఉంది. అయితే, ఆ మొత్తాన్ని చెల్లించేందుకు వొడాఫోన్ ఐడియా 30 రోజుల వ్యవధి కోరింది. ఈ నేపథ్యంలో సకాలంలో కట్టకపోవడం వల్ల 15 శాతం వడ్డీ రేటుతో బాకీ మొత్తాన్ని కంపెనీ చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
హిందుజా కంపెనీకి రిలయన్స్ క్యాపిటల్!
న్యూఢిల్లీ: రుణ భారంతో ఉన్న రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలు రేసులో రూ.9,650 కోట్ల ఆఫర్‌తో హిందుజా గ్రూప్ కంపెనీ అయిన ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) హైయెస్ట్ బిడ్డర్‌గా నిలిచింది. 2022 డిసెంబర్లో తొలిసారిగా జరిగిన వేలంలో టోరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ రూ.8,640 కోట్లు ఆఫర్ చేసింది. రెండవ రౌండ్ వేలంలో టోరెంట్తోపాటు ఓక్ట్రీ పాల్గొనలేదు. రుణదాతల కమిటీ (సీవోసీ) కనీస బిడ్ మొత్తాన్ని తొలి రౌండ్‌కు రూ.9,500 కోట్లు, రెండవ రౌండ్‌కు రూ.10,000 కోట్లుగా నిర్ణయించారు. అన్ని బిడ్స్‌కు కనీసం రూ.8,000 కోట్ల ముందస్తు నగదు చెల్లింపు ఉండాలని కూడా సీవోసీ షరతు విధించింది. సుప్రీం తీర్పునకు లోబడి.. రిలయన్స్ క్యాపిటల్ ఆస్తుల విక్రయం ద్వారా గరిష్టంగా రికవరీని పొందడానికి రుణదాతలకు గడువు పొడిగిస్తూ సుప్రీంకోర్టు అనుమతించడంతో బుధవారం రెండవ రౌండ్ వేలం జరిగింది. రిలయన్స్ క్యాపిటల్ పరిష్కారం విషయంలో సీవోసీ ద్వారా ఏదైనా నిర్ణయం టోరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ దాఖలు చేసిన అప్పీల్లో సుప్రీం కోర్టు తీర్పు ఫలితానికి లోబడి ఉంటుంది. రిలయన్స్ క్యాపిటల్ పరిష్కార ప్రక్రియ మొదటి రౌండ్ వేలం తర్వాత వ్యాజ్యంలో చిక్కుకుంది. మొదటి రౌండ్ వేలం ముగిసిన తరువాత హిందూజా గ్రూప్ సంస్థ బిడ్‌ను సమర్పించింది. 2022 డిసెంబరులో దాఖలు చేసిన రూ.8,110 కోట్ల ఆఫర్‌ను సవరిస్తూ ఐఐహెచ్ఎల్ రూ.9,000 కోట్లతో మరో బిడ్‌ను అందించింది. రుణదాతలు రెండో రౌండ్ వేలం నిర్వహించాలని తమ ఉద్దేశాన్ని వ్యక్తం చేసినప్పటికీ ఇది జరిగింది. -
సంక్షోభంలో పాక్
ఇస్లామాబాద్: చుక్కలనంటుతున్న నిత్యావసరాల ధరలు. తీర్చలేని రుణ భారం. నానాటికీ పతనమవుతున్న కరెన్సీ విలువ. తీవ్ర రూపు దాలుస్తున్న కరెంటు కొరత. పులి మీద పుట్రలా పడ్డ ప్రకృతి విలయాలు... ఇలా ఎటు చూసినా సమస్యలతో పొరుగు దేశం పాకిస్తాన్ నానాటికీ పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. మరో శ్రీలంకలా మారకముందే ఏదోలా సమస్య నుంచి బయట పడే మార్గాల వెదుకులాటలో పడింది. ఆపద నుంచి గట్టెక్కించకపోతారా అని అంతర్జాతీయ ద్రవ్య నిధి తదితరాల వైపు ఆశగా చూస్తోంది... పాకిస్తాన్లో నానాటికీ తీవ్ర రూపు దాలుస్తున్న ఆర్థిక సంక్షోభానికి అడ్డుకట్ట వేసేందుకు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. దేశ మొత్తం దిగుమతుల్లో ఇంధన బిల్లుదే పెద్ద వాటా. ప్రస్తుతం విదేశీమారక నిల్వలు 11.7 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దేశ మొత్తం దిగుమతి అవసరాలను తీర్చడానికి ఇవి మరో నెల రోజులు మాత్రమే సరిపోతాయి. ఈ నేపథ్యంలో ఇంధన పొదుపు కోసం ప్రభుత్వం తక్షణం రంగంలోకి దిగి పలు చర్యలు చేపట్టింది. మార్కెట్లన్నీ రాత్రి 8.30కల్లా మూసేయాలంటూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఫంక్షన్ హాళ్లు, రెస్టారెంట్లు కూడా పదింటికల్లా మూతబడాల్సిందేనని తేల్చి చెప్పింది. షాపింగ్ మాల్స్ కూడా ముందుగానే మూతపడుతున్నాయి. ‘ఇంధన పొదుపు’ లక్ష్యంతో మంగళవారం కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలన్నీ తక్షణం అమల్లోకి వస్తాయని పాక్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ అసిఫ్ వెల్లడించారు. రూ.6,200 కోట్ల ఆదాయే లక్ష్యం... పాక్‌లో విద్యుదుత్పాదన చాలావరకు చమురు ఆధారితమే. చమురు దిగుమతులపై ఏటా 300 కోట్ల డాలర్ల దాకా ఖర్చు పెడుతోంది. తాజా చర్యల ఉద్దేశం ఈ వ్యయాన్ని వీలైనంత తగ్గించడమే. అంతేగాక ప్రభుత్వ శాఖల్లో కూడా విద్యుత్ వాడకాన్ని కనీసం 30 శాతం తగ్గించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని అధికారులు వెల్లడించారు. దీనివల్ల మొత్తమ్మీద 6,200 కోట్ల రూపాయలు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. వీటితో పాటు ఉద్యోగులు వీలైనంత వరకూ ఇంటి నుంచి పని చేసేలా చూడాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. నాసిరకపు విద్యుత్ బల్బుల తయారీ తదితరాలపై త్వరలో నిషేధం కూడా విధించనున్నారు. అయితే, ప్రభుత్వ తాజా నిర్ణయంపై దుకాణదారులు, ఫంక్షన్ హాల్స్, మాల్స్ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. కరోనాతో రెండేళ్లకు పైగా సతమతమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమ పాటిల ఇది పిడుగుపాటు నిర్ణయమేనని, దీన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాత్రి పొద్దుపోయేదాకా షాపింగులు, రెస్టారెంట్లలో డిన్నర్లు పాకిస్తానీలకు రివాజు. ప్రభుత్వ నిర్ణయంపై వారినుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. 600 కోట్ల డాలర్ల రుణం! మరోవైపు ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు ఐఎంఎఫ్ నుంచి కనీసం 600 కోట్ల డాలర్ల తక్షణ రుణం సాధించేందుకు పాక్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గత ఆగస్టులో ఐఎంఎఫ్ నుంచి పాక్ 110 కోట్ల డలర్ల రుణం తీసుకుంది. గత వేసవిలో విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలు దేశాన్ని అతలాకుతలం చేసి వదిలాయి. వాటివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా 4,000 కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా. -
కేంద్ర ప్రభుత్వంపై చెల్లింపుల భారం రూ.133.22 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: ప్రభుత్వంపై చెల్లింపుల భారం గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.1,33,22,727 కోట్లుగా నమోదయ్యింది. 2021 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంతో పోల్చితే ఈ విలువ 3.74 శాతం పెరిగింది. విలువలో ఇది రూ.1,28,41,996 కోట్లుగా ఉంది. ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన రుణ నిర్వహణా నివేదిక ఈ గణాంకాలను విడుదల చేసింది. మొత్తం రుణాల్లో 92.28 శాతం పబ్లిక్ డెట్ (ఈ రుణ చెల్లింపులను కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి జరపాలి). 2021 డిసెంబర్ నాటికి ఇది 91.60 శాతం. డేటెడ్ సెక్యూరిటీలకు సంబంధించి చెల్లింపులు 6.33 శాతం నుంచి 6.66 శాతానికి చేరింది. క్రూడ్ ఆయిల్ ధరలు త్రైమాసికంగా బ్యారల్‌కు 104.40 నుంచి 129.26 డాలర్లకు చేరిందని నివేదిక పేర్కొంది. -
బాంబు పేల్చిన ఎలన్ మస్క్!
ఎలన్ మస్క్ కాదు కాదు.. సైక్లోన్ మస్క్(ట్విటర్ యూజర్లు ముద్దుగా పెట్టిన పేరు) ట్విట్టర్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఎలన్ మస్క్ ట్విటర్‌ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో తన వద్ద ప్లాన్ బి ఉందంటూ బాంబు పేల్చారు. ప్రస్తుతం ఈ బిజినెస్ టైకూన్ ట్విటర్ కొనుగోలు అంశం హాట్ టాపిగ్గా మారింది. ఈ నేపథ్యంలో ట్విటర్ యూజర్లు శ్రీలంకను అప్పుల్లో నుంచి గట్టెక్కించాలని సైక్లోన్ మస్క్‌ను విజ్ఞప్తి చేస్తున్నారు. ట్విటర్లో ఎలన్ మస్క్ అతిపెద్ద వాటాదారుడు. లాభపేక్షతో సంబంధం లేకుండా ట్విటర్‌కు చెందిన ఒక్కో షేర్‌ను 54.20 డాలర్లకు కొనుగోలు చేస్తానని బంపరాఫర్ ప్రకటించారు. తద్వారా 43 బిలియన్ డాలర్లు (రూ.3.22లక్షల కోట్లు) చెల్లిస్తామని ఆఫర్ చేశారు. కానీ మస్క్ ఆఫర్‌ను ట్వీటర్ యాజమాన్యం తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఎలాగైనా ట్వీటర్‌ను దక్కించుకునేందుకు 'ప్లాన్-బి'ని అమలు చేస్తానని కెనడాలోని వాంకోవా నగరంలో జరిగిన టెడ్-2020 సమావేశంలో ఎలన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'హోస్టైల్ టేకోవర్'తో ట్వీటర్‌ను సొంతం చేసుకోవచ్చు. అంటే ఆ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరక్టెర్తో సంబంధం లేకుండా షేర్ హోల్డర్స్‌ను ఒప్పించి ట్వీటర్‌ను చేజిక్కించుకోవచ్చు. ఇదే ఎలన్ ప్లాన్-బి' అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఎలన్ మస్క్ ట్విటర్‌కు ఇచ్చిన ఆఫర్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. కానీ ఓ వర్గానికి చెందిన యూజర్లు మాత్రం పీకల్లోతు అప్పుల్లో (53 బిలియన్ డాలర్లు) ఉన్న శ్రీలంకను గట్టెక్కించాలని కోరుతున్నారు. Elon Musk's Twitter bid - $43 billion Sri Lanka's debt - $45 billion He can buy it and call himself Ceylon Musk 😀 H/t Whatsapp — Kunal Bahl (@1kunalbahl) April 14, 2022 స్నాప్ డీల్ సీఈఓ కునాల్ బాల్..ఎలన్ మస్క్ ట్వీటర్కు 43 బిలియన్ డాలర్లను ఆఫర్ చేశారు. అదేదో 45 బిలయన్ డాలర్లతో శ్రీలంకను కొనుగోలు చేసి తనని తాను సైక్లోన్ మస్క్‌గా పిలిపించుకోవచ్చు కదా అంటూ ఓ స్మైల్ మీమ్‌ను యాడ్ చేశారు. Elon Musk has launched a $43 bln hostile takeover for Twitter. If he adds another $8 bln he could discharge the national debt of Sri Lanka and rename it Ceylon Musk 🤣 From WA.. — Shreyasi Goenka (@anvivud) April 15, 2022 మరో ట్వీటర్ యూజర్ శ్రేయాసీ గోయెంకా..43 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. మరో 8 బిలియన్ యాడ్ చేసి శ్రీలంకను అప్పుల్లో నుంచి బయపడేసి సైక్లోన్ మస్క్‌గా పేరు మార్చుకోవచ్చు కదా అని ట్వీట్లో పేర్కొంది. ప్రస్తుతం ఆ ట్వీట్లో వైరల్ అవుతున్నాయి. మీకోసం ఆ ట్వీట్లు. చదవండి: ట్విటర్‌పై ఎలన్‌మస్క్ దండయాత్ర.. ఈసారి ఆ రూట్లో.. -
అమెరికా ‘రు(ర)ణ’ రాజకీయం!
అమెరికా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. దేశం అప్పులు.. వాటి చెల్లింపులను అడ్డుపెట్టుకుని ఆడుతున్న రాజకీయ నాటకం ఇంకొన్ని వారాలపాటు సాగనుంది. ఆర్థిక శాఖ మంత్రి జానెట్ ఎల్లెన్ తాజా ప్రకటనను బట్టి పరిమితిని సకాలంలో పెంచకపోతే డిసెంబరు 15వ తేదీ తరువాత అగ్రరాజ్యం అమెరికా చరిత్రలోనే తొలిసారి రుణ వాయిదాలను చెల్లించలేని పరిస్థితి ఎదుర్కోనుంది. అమెరికాకు అప్పులేంటి? చెల్లించ లేకపోవడం ఏమిటని ఆశ్చర్యపోనవసరం లేదు. ఎంత చెట్టుకు అంత గాలి అంటారు కదా.. అలాగే ఇదీనూ. కాకపోతే ఇక్కడ సమస్య డబ్బుల్లేకపోవడం కాదు. అప్పులపై ఉన్న పరిమితిని పెంచితేగానీ ప్రభుత్వం తన మాట నిలబెట్టుకునే పరిస్థితి లేకపోవడం!! పెంచకపోతే ఏమవుతుంది? రుణ పరిమితిని పెంచకపోతే అమెరికా తొలిసారి తాను చెల్లించాల్సిన రుణ వాయిదాలను చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అక్టోబరులో ఈ మొత్తం దాదాపు 28 లక్షల కోట్ల డాలర్ల వరకూ ఉంది. సకాలంలో రుణ వాయిదా చెల్లించకపోవడం ప్రతి ప్రభుత్వ కార్యక్రమంపై ప్రభావం చూపుతుంది. రాష్ట్రాలకు అందే నిధులు తగ్గుతాయి. గోల్డ్‌మ్యాన్ శాక్స్ సంస్థ అంచనా ప్రకారం సకాలంలో రుణ పరిమితి పెంచని పక్షంలో అమెరికన్ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందే ఆర్థికసాయంలో నలభైశాతం కోత పడే అవకాశం ఉంది. రక్షణ దళాల సిబ్బందికి పూర్తిస్థాయిలో, సకాలంలో వేతనాలు, ఫింఛన్ల వంటివి చెల్లించలేమని పెంటగాన్ అక్టోబరులోనే ఒక ప్రకటన జారీ చేసింది. వాయిదా చెల్లింపులో విఫలమైతే అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా విశ్వసనీయత దెబ్బతింటుంది. వడ్డీ రేట్లు పెరిగే అవకాశమూ ఉంది. ఇవన్నీ కలగలిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ నష్టపోతుందన్నమాట. తాత్కాలిక ఉపశమనంగా 480 బిలియన్ డాలర్ల అదనపు రుణం తెచ్చుకోవడానికి అక్టోబరులో సెనేట్ ఒకే చెప్పింది.రుణపరిమితిని పెంచుకోవడానికి, రిపబ్లికన్లను ఒప్పించడానికి బైడెన్ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రతిపక్ష రిపబ్లికన్లు ఏమంటున్నారు? వివాదానికి బాధ్యత డెమొక్రాట్లదేనన్నది రిపబ్లికన్ల వాదన. తమ మద్దతు లేకుండా కొత్త అంశాలపై డబ్బులు ఖర్చు పెట్టేందుకు డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారని.. దాన్ని అడ్డుకుంటూండటం వల్లనే వారు నిస్పృహకు గురవుతున్నారని ఆరోపిస్తున్నారు. డెమోక్రాట్లు ఇంకోసారి ఏకపక్షంగా పన్నులు విధించడం, ఖర్చు పెట్టడాన్ని తాము అనుమతించేది లేదని మైనార్టీ నేత మిచ్ మెక్కానెల్ స్పష్టం చేశారు. తమ ఆర్థిక విధానాలను అమలు చేసేందుకు డెమొక్రాట్లు బడ్జెట్ సమీక్షను అడ్డుగా పెట్టుకుంటున్నారని, ఇంత చేయగలిగిన వాళ్లు రుణ పరిమితి పెంపుపై కూడా ఏదో ఒక చర్య తీసుకోవాలని అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ డెమొక్రాట్ల వాదనలేమిటి? రుణ పరిమితి పెంపును రిపబ్లికన్లు అడ్డుకోవడాన్ని అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలవి ద్వంద్వ ప్రమాణాలని, ప్రమాదకరమైనవని, అమర్యాదకరమైనవి కూడా అని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థతో ఆటలాడుకుంటున్నాయన్నారు. అమెరికన్ సెనేట్‌లో దాదాపు 50 మంది డెమొక్రాట్లు (100 సభ్యులుండే అమెరికా ఎగువసభ సెనేట్‌లో 48 మంది డెమొక్రాట్లకు ఇద్దరు స్వంత్రుల మద్దతు ఉంది. మిగతా 50 మంది రిపబ్లికన్ పార్టీ సభ్యులు) ఉండగా... రుణ పరిమితిని పెంచేందుకు కనీసం మరో పది రిపబ్లికన్ ఓట్లూ అవసరమవుతున్నాయి. మొత్తం రుణాల్లో బైడెన్ హయాంలోనివి మూడు శాతం మాత్రమేనని, మిగిలినవన్నీ గత ప్రభుత్వాలవేనని డెమొక్రాట్లు అంటున్నారు. ట్రంప్ హయాంలో తాము మూడుసార్లు రుణ పరిమితి పెంపునకు సహకరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏమిటీ రుణ పరిమితి కథ? అమెరికా ప్రభుత్వం వివిధ రూపాల్లో సేకరించే పన్నుల మొత్తం కంటే ఎక్కువ ఖర్చు పెడుతుంది. ఇందుకోసం అన్ని ప్రభుత్వాల మాదిరిగానే అప్పులు చేస్తుంది. ఈ వ్యవహారమంతా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా నడుస్తుంది. అప్పుల కోసం అగ్రరాజ్యం విడుదల చేసే బాండ్లు ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన పెట్టుబడులుగా భావిస్తారు. 1939లో అమెరికన్ పార్లమెంటు ప్రభుత్వం చేయగలిగే అప్పులపై ఒక పరిమితిని విధిస్తూ చట్టం చేసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ కనీసం వందసార్లు ఈ పరిమితిని పెంచుకున్నారు. అంటే.. అవసరాన్ని బట్టి మరిన్ని అప్పులు చేసేందుకు ఎప్పటికప్పుడు అవకాశం కల్పించుకున్నారన్నమాట. అయితే ఇలా పరిమితి పెంచుకోవాలన్న ప్రతిసారి కూడా దానిపై కాంగ్రెస్‌లోని ఇరు పక్షాల మధ్య చర్చోపచర్చలు జరుగుతాయి. చివరకు ఇరుపక్షాలు కొన్ని పట్టువిడుపులతో ఏకాభిప్రాయానికి రావడం పరిమితిని పెంచుకోవడం కద్దు. అయితే ఇటీవలి కాలంలో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది. 2013లోనూ రుణ పరిమితిని దాటేసే పరిస్థితి ఏర్పడింది. అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యయ ప్రణాళికను రిపబ్లికన్లు పూర్తిగా అడ్డుకున్నారు. అదేమాదిరిగా ఈ సారి కూడా రిపబ్లికన్లు రుణ పరిమితి అంశాన్ని అడ్డుపెట్టుకుని ఒక వివాదాన్ని సృష్టించారు. అయితే... ఇలాంటి విషయాలు చివరి నిమిషం వరకూ సాగడం.. చివరకు రాజీమార్గాలపై తెరవెనుక మంతనాలు, పట్టువిడుపులు, కొన్ని సవరణల తరువాత ఓకే కావడం చరిత్రలో ఇప్పటివరకూ జరిగిన తంతు! -
కరోనాతో కేంద్రంపై మరింత రుణ భారం!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రుణాలపైనా కోవిడ్–19 భారం పడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020 ఏప్రిల్– 2021 ఏప్రిల్) మధ్య తన స్థూల మార్కెట్ రుణ సమీకరణ అంచనాలను కేంద్రం శుక్రవారం గణనీయంగా రూ.12 లక్షల కోట్లకు పెంచేసింది. నిజానికి తొలి అంచనా రూ.7.8 లక్షల కోట్లు. అంటే రుణ సమీకరణ అంచనా 4.2 లక్షల కోట్లు పెరిగిందన్నమాట. ఆర్థిక వ్యవస్థపై కోవిడ్–19 ప్రభావం నేపథ్యంలో తగ్గుతుందని భావిస్తున్న తన ఆదాయాన్ని పూడ్చుకునే క్రమంలో రుణ సమీకరణ అంచనాలను పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వారం వారీ రుణ సమీకరణ లక్ష్యాన్ని కూడా రూ.21,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్లకు కేంద్రం పెం చింది. తన ఆదాయం–వ్యయాలకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించుకోడానికి ప్రభుత్వం మార్కెట్ రుణాలను ఒక సాధనంగా ఎంచుకునే సంగతి తెలిసిందే. 2019–20లో మార్కెట్ సమీకరణల మొత్తం రూ.7.1 లక్షల కోట్లు. తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు లక్ష్యాన్ని (ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తిలో 3.5%)కూడా ఆర్థికశాఖ పెంచే అవకాశం ఉంది. -
7,614 కోట్లు సమీకరించిన జీవీకే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగంలో ఉన్న జీవీకే గ్రూప్ రుణ భారం తగ్గించుకునే పనిలో ఉంది. ఇందులో భాగంగా జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్‌లో 79.1 శాతం వాటాను విక్రయించింది. తద్వారా రూ.7,614 కోట్లు సమీకరించింది. అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ), పబ్లిక్ సెక్టార్ పెన్షన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ (పీఎస్పీ ఇన్వెస్ట్మెంట్స్), నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌తో (ఎన్ఐఐఎఫ్) ఈ మేరకు జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ కంపెనీలైన జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్, జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ మధ్య ఆదివారం ఒక ఒప్పందం కుదిరింది. డీల్ తదనంతరం జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్‌లో జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్, ఏడీఐఏ, పీఎస్పీ ఇన్వెస్ట్మెంట్స్, ఎన్ఐఐఎఫ్ వాటాదారులుగా ఉంటాయి. జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్‌లో జీవీకే గ్రూప్ వాటా 20.9 శాతానికి పరిమితం అవుతుంది. డీల్‌లో భాగంగా ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్, నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను రూ.9,608 కోట్లుగా విలువ కట్టారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో.. డీల్ ద్వారా వచ్చిన నిధులను ప్రాథమికంగా హోల్డింగ్ కంపెనీల్లో సుమారు రూ.5,500 కోట్ల రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగించనున్నారు. అలాగే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్‌లో (ఎంఐఏఎల్) జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ తన వాటాను పెంచుకోనుంది. ఇందుకోసం ఎంఐఏఎల్‌లో దక్షిణాఫ్రికా సంస్థలు అయిన బిడ్వెస్ట్, ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ సౌత్ ఆఫ్రికాలకు (ఏసీఎస్ఏ) ఉన్న వాటాను కొనుగోలు చేయనుంది. ఎంఐఏఎల్‌లో బిడ్‌వెస్ట్‌కు 13.5 శాతం, ఏసీఎస్ఏకు 10 శాతం వాటా ఉంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీవీకే గ్రూప్ కంపెనీ అయిన ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఇక కొత్తగా నిర్మితమవుతున్న నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి ప్రాజెక్టును ఎంఐఏఎల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో (ఎన్ఎంఐఏ) ఎంఐఏఎల్‌కు 74 శాతం వాటా ఉంది. నిష్క్రమణ కోసం.. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్‌లో (ఎంఐఏఎల్) వాటాదారులైన బిడ్వెస్ట్, ఏసీఎస్ఏ ఎప్పటి నుంచో తప్పుకోవాలని చూస్తున్నాయి. ఈ రెండు సంస్థలకు ఉన్న 23.5 శాతం వాటాను అదానీ కొనుగోలు చేయాలని భావించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో అదానీ ప్రయత్నానికి అడ్డుకట్ట పడ్డట్టే. ఎంఐఏఎల్‌లో జీవీకే గ్రూప్‌నకు 50.5 శాతం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 26 శాతం వాటా ఉంది. బిడ్వెస్ట్, ఏసీఎస్ఏల నుంచి 23.5 శాతం వాటా దక్కించుకోవడం ద్వారా.. జీవీకే గ్రూప్ వాటా 74 శాతానికి చేరనుంది. అయితే రైట్ ఆఫ్ ఫస్ట్ రెఫ్యూజల్ కింద ఈ ఏడాది ప్రారంభంలో బిడ్వెస్ట్ తన 13.5 శాతం వాటాను విక్రయించనున్నట్టు జీవీకేకు తెలిపింది. అందుకు జీవీకే అంగీకరించింది. వాటా కింద ఇవ్వాల్సిన రూ.1,248 కోట్ల చెల్లింపు ఆలస్యం కావడంతో ఢిల్లీ హైకోర్టును బిడ్వెస్ట్ ఆశ్రయించింది. హైకోర్టు సూచన మేరకు వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌ను బిడ్వెస్ట్ ఆశ్రయించింది. అక్టోబరు 31లోగా ఈ చెల్లింపు పూర్తి చేయాలని జీవీకేను ట్రిబ్యునల్ ఆదేశించింది. జీవీకే నిర్వహణలోనే.. వాటా విక్రయం తర్వాత ఎయిర్పోర్ట్ వ్యాపార నిర్వహణ, బ్రాండింగ్ అంతా జీవీకే గ్రూప్ కిందనే ఉంటాయని సంస్థ తెలిపింది. గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టర్లు వెనుక ఉండడం ఎంఐఏఎల్, ఎన్ఎంఐఏ విస్తరణకు కలిసి వస్తుందని వివరించింది. ఎయిర్‌పోర్టుల వ్యాపారం మరింత బలంగా ఎదిగేందుకు దోహద పడుతుందని తెలిపింది. ఎంఐఏఎల్, నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా జీవీకే రెడ్డి, ఎండీగా జీవీ సంజయ్ రెడ్డి కొనసాగనున్నారు. వాస్తవానికి ఎయిర్పోర్ట్ వ్యాపారంలో 49 శాతం వాటాను ఏడీఐఏ, ఎన్ఐఐఎఫ్లకు విక్రయించాలన్న ప్రతిపాదనపై ఏప్రిల్‌లో సంతకాలు జరిగాయి. -
చంద్రశేఖర్‌ది ఆత్మహత్య
సాక్షి, చెన్నై: భారత మాజీ క్రికెటర్ వీబీ చంద్రశేఖర్ (58) గుండెపోటుతో మరణించలేదని, ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు ధ్రువీకరించారు. ఆయన బలవన్మరణానికి అప్పులే కారణమని తేల్చారు. ఆర్థిక సమస్యల వల్లే చెన్నైలోని తన నివాసంలో చంద్రశేఖర్ గురువారం ఉరేసుకొని మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఆయన మరణవార్తతో తమిళనాడు క్రికెట్ సంఘం వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కాంచీ వీరన్స్ జట్టును ఆయన కొనుగోలు చేశారు. దీని నిర్వహణతో పాటు తన అకాడమీ కోసం బ్యాంకులు, సన్నిహితుల వద్ద రూ. 3 కోట్ల మేర అప్పు చేశారు. చివరకు చెల్లించలేని పరిస్థితి తలెత్తడంతో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. చెన్నై రాయపేట ఆసుపత్రిలో శుక్రవారం చంద్రశేఖర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్, క్రికెటర్లు దినేష్ కార్తీక్, మురళీ విజయ్, విజయ్ శంకర్‌లతో పాటు తమిళనాడు క్రికెట్ సంఘం సభ్యులు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. -
అమ్మకానికి కాఫీ డే ’గ్లోబల్ పార్క్’
న్యూఢిల్లీ: వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమన్న వార్తల నేపథ్యంలో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ (సీడీఈ) తాజాగా రుణాల భారం తగ్గించుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌ను అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్‌కు విక్రయించాలని నిర్ణయించుకుంది. ఈ డీల్ విలువ దాదాపు రూ. 3,000 కోట్ల దాకా ఉంటుంది. అలాగే, అనుబంధ సంస్థ అల్ఫాగ్రెప్ సెక్యూరిటీస్‌లో కూడా వాటాలను ఇల్యూమినాటి సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించే ప్రతిపాదనకు కూడా సీడీఈ బోర్డు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ‘రుణభారం తగ్గించుకునే మార్గాలపై డైరెక్టర్ల బోర్డు చర్చించింది. ఈ సందర్భంగా అనుబంధ సంస్థ టాంగ్లిన్ డెవలప్‌మెంట్స్‌లో భాగమైన గ్లోబల్ విలేజ్ టెక్ పార్క్‌ను బ్లాక్‌స్టోన్‌కి విక్రయించే ప్రతిపాదనను ఆమోదించింది. ఈ డీల్ విలువ సుమారు రూ. 2,600 కోట్ల నుంచి రూ. 3,000 కోట్ల దాకా ఉంటుంది. మదింపు ప్రక్రియ, నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభించడం మొదలైనవన్నీ పూర్తయ్యాకా వచ్చే 30–45 రోజుల్లో ఈ డీల్ పూర్తి కావచ్చు‘ అని స్టాక్ ఎక్సే్ఛంజీలకు సీడీఈ తెలియజేసింది. ఈ రెండు ఒప్పందాలతో కాఫీ డే గ్రూప్ రుణభారం గణనీయంగా తగ్గగలదని పేర్కొంది. ఇన్వెస్టర్లు, రుణదాతలు, ఉద్యోగులు, కస్టమర్లు మొదలైన సంబంధిత వాటాదారులందరికీ ఈ డీల్స్ ప్రయోజనకరంగా ఉండగలవని వివరించింది. ఆతిథ్య, రియల్టీ తదితర రంగాల్లోని అన్‌లిస్టెడ్ వెంచర్స్ కారణంగా వీజీ సిద్ధార్థ నెలకొల్పిన సీడీఈ రుణభారం రెట్టింపై రూ. 5,200 కోట్లకు చేరింది. ఈ పరిణామాల నేపథ్యంలో గత నెల సిద్ధార్థ అదృశ్యం కావడం, ఆ తర్వాత నేత్రావతి నదిలో శవమై తేలడం ఆయన మరణంపై సందేహాలు రేకెత్తించాయి. సిద్ధార్థ అకాల మరణంతో జూలై 31న స్వతంత్ర డైరెక్టర్ ఎస్వీ రంగనాథ్ సీడీఈ తాత్కాలిక చైర్మన్‌గా నియమితులయ్యారు. రంగనాథ్‌తో పాటు సీవోవో నితిన్ బాగ్మానె, సీఎఫ్‌వో ఆర్ రామ్మోహన్‌లతో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటైంది. కాఫీ డే గ్రూప్ రుణభారాన్ని తగ్గించుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను ఈ కమిటీ పరిశీలిస్తోంది. -
కాఫీ డే అప్పులు రూ. 5,200 కోట్లు!!
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లతో కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ అకాల మరణం నేపథ్యంలో ఆయన గ్రూప్ సంస్థల రుణ భారం చర్చనీయాంశంగా మారింది. సిద్ధార్థతో పాటు ఆయనకు చెందిన పలు సంస్థలు .. వివిధ ఆర్థిక సంస్థలు మొదలుకుని బ్యాంకుల దాకా చాలా చోట్ల నుంచి ఎంత దొరికితే అంత అన్నట్లుగా రుణాలు సమీకరించాయి. అత్యంత తక్కువగా రూ. 1 లక్ష నుంచి అనేక కోట్ల దాకా తీసుకున్నాయి. స్టాక్ ఎక్సే్చంజీలు, కార్పొరేట్ వ్యవహారాల శాఖకు ఆయా సంస్థలు దాఖలు చేసిన ఫైలింగ్స్ ద్వారా ఈ వివరాలు ఒక్కొక్కటిగా బైటికొస్తున్నాయి. బీఎస్ఈలో లిస్టయిన కాఫీ డే ఎంటర్ప్రైజెస్ (సీడీఈఎల్) రుణభారం 2019 మార్చి 31 నాటికి రూ. 5,251 కోట్లుగా ఉంది. ఇది గతేడాది మార్చి ఆఖరున ఉన్న రూ. 2,457 కోట్లతో పోలిస్తే ఏకంగా రెట్టింపు కావడం గమనార్హం. ఇక సీడీఈఎల్ ప్రమోటర్ కంపెనీలు దేవదర్శిని ఇన్ఫో టెక్నాలజీస్, కాఫీ డే కన్సాలిడేషన్స్, గొనిబేడు కాఫీ ఎస్టేట్స్, సివన్ సెక్యూరిటీస్ మొదలైనవి కూడా పలు దఫాలుగా పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నాయి. సోమవారం అదృశ్యమైన సిద్ధార్థ.. బుధవారం నేత్రావతి నదిలో శవంగా తేలిన సంగతి తెలిసిందే. తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోలేకపోతున్నానంటూ అదృశ్యం కావడానికి ముందు ఆయన రాసినట్లుగా భావిస్తున్న ఒక లేఖలోని అంశాలు సిద్ధార్థ ఆర్థిక సమస్యల వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ)కు ఆయన సంస్థలు దాఖలు చేసిన ఫైలింగ్స్‌లోని విషయాలు బైటికి వస్తున్నాయి. వీటిని బట్టి చూస్తే.. ► టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీస్, క్లిక్స్ క్యాపిటల్ సర్వీసెస్ (గతంలో జీఈ మనీ ఫైనాన్స్ సర్వీసెస్), షాపూర్జీ పల్లోంజీ ఫైనాన్స్ (ఎస్పీఎఫ్) వంటి సంస్థల నుంచి కూడా సిద్ధార్థ రుణాలు తీసుకున్నారు. ఇందులో టాంగ్లిన్ డెవలప్మెంట్స్ అనే అనుబంధ సంస్థకు ఎస్పీఎఫ్ రూ. 12 కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకరించినట్లు 2018 ఏప్రిల్‌లో ఎంసీఏకు సమర్పించిన ఫైలింగ్‌లో ఉంది. ► ఇక మరో ఫైలింగ్‌లో కాఫీ డే హోటల్స్ అండ్ రిసార్ట్స్‌కు ‘రూ. లక్ష దాకా టర్మ్ రుణ సదుపాయం కల్పించేందుకు‘ క్లిక్స్ క్యాపిటల్ అంగీకరించిన డీల్ గురించిన ప్రస్తావన ఉంది. ► సిద్ధార్థకు చెందిన అన్‌లిస్టెడ్ కంపెనీలు (ఆతిథ్య, రియల్టీ రంగాలవి) ఎంత మేర రుణాలు తీసుకున్నాయన్నది ఇంకా ఇథమిథ్థంగా తెలియనప్పటికీ.. వీటి అప్పుల భారం కూడా సీడీఈఎల్ స్థాయిలోనే ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ► 2017 తర్వాత సిద్ధార్థ రుణాల పరిమాణం గణనీయంగా పెరిగింది. అయితే, గడువులోగా వీటిలో ఎన్ని రుణాలను చెల్లించారు, ఇంకా ఎన్ని ఉన్నాయి, ఎన్ని మొండిబాకీలుగా మారా యన్నది ఇంకా పూర్తిగా తెలియాల్సి వుంది. ► ఎంసీఏ డేటా ప్రకారం 2018 మార్చి ఆఖరు నాటికి కాఫీ డే కన్సాలిడేషన్స్ స్వల్పకాలిక రుణాలు, తక్షణం జరపాల్సిన చెల్లింపుల పరిమాణం రూ. 36.53 కోట్లుగా ఉన్నాయి. ► వీజీ సిద్ధార్థ, సీడీఈఎల్ ప్రమోటర్ గ్రూప్ సంస్థలు తమ వద్ద ఉన్న షేర్లలో మూడొంతుల షేర్లను తనఖా పెట్టాయి. ఇటీవలే రెణ్నెల్ల క్రితం జూన్‌లో కూడా సిద్ధార్థ కొన్ని షేర్లను అదనంగా తనఖా పెట్టారు. జూన్ ఆఖరు నాటికి సీడీఈఎల్‌లో సిద్ధార్థకు 32.7 శాతం, ఆయన భార్య మాళవిక హెగ్డేకు 4.05 శాతం, నాలుగు ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు 17 శాతం మేర వాటాలు ఉండేవి. ► ప్రమోటింగ్ సంస్థలు తమ మొత్తం హోల్డింగ్‌లో 75.7 శాతం (సుమారు 8.62 కోట్ల షేర్లు) తనఖాలో ఉంచాయి. జూన్ ఆఖర్లో కూడా సిద్ధార్థ కొత్తగా మరో 1.39 శాతం (29.2 లక్షల షేర్లు) తనఖా పెట్టారు. గ్రూప్ కంపెనీలు కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్మెంట్స్ నుంచి తీసుకున్న రుణాలకు పూచీకత్తుగా వీటిని కోటక్ మహీంద్రా బ్యాంక్ పేరిట తనఖా పెట్టారు. ► ఇక సీడీఈఎల్‌లో సివన్ సెక్యూరిటీస్‌కి ఉన్న మొత్తం వాటాలు (0.21 శాతం) వాటాలు తనఖాలోనే ఉన్నాయి. అటు సీడీఈఎల్‌లో కాఫీ డే కన్సాలిడేషన్స్‌కు ఉన్న 5.81 శాతం వాటాల్లో 95.96 శాతం షేర్లు తనఖాలో ఉన్నాయి. ► దేవదర్శిని ఇన్ఫో టెక్నాలజీస్ వాటాల్లో 83.07 శాతం, గొనిబేడు కాఫీ ఎస్టేట్స్ వాటాల్లో 78.9 శాతం వాటాలు తనఖాలో ఉన్నాయి. పార్లమెంటులోనూ సిద్ధార్థ విషాదాంతం ప్రస్తావన.. దివాలా స్మృతి (ఐబీసీ)పై చర్చ సందర్భంగా పార్లమెంటులో కూడా సిద్ధార్థ విషాదాంతం ప్రస్తావన వచ్చింది. వ్యాపార వైఫల్యాలనేవి జరగరానివేమీ కాదని, వ్యాపారవేత్త విఫలమైనంత మాత్రాన చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వ్యాపారం సజావుగా సాగని పక్షంలో వ్యాపారవేత్తలు గౌరవప్రదంగా తప్పుకునేందుకు తగు పరిష్కారమార్గం చూపడమే ఐబీసీ ఉద్దేశమని వివరించారు. అటు.. కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ విషాదాంతాన్ని ప్రస్తావిస్తూ వ్యాపారపరమైన వైఫల్యాల కారణంగా పరిశ్రమలు మూతబడుతున్నాయని వైసీపీ ఎంపీ ఎం శ్రీనివాసులు రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారాన్ని సులభతరం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే.. వ్యాపారాలు నడపడంలో కష్టాలు మరింతగా పెరుగుతున్నాయన్నారు. వ్యాపారసంస్థల్లో భయాందోళనలు నెలకొన్నాయని, వీటిని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. నిజాయితీగా పనిచేసే సంస్థలను, తప్పుడు విధానాలు పాటించే సంస్థలను ప్రభుత్వం ఒకే రీతిగా చూస్తోందంటూ ‘గుర్రాలు, గాడిదలను ఒకే గాటన కట్టేయడం సరికాదు’ అని శ్రీనివాసులు రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యక్తిగత పూచీకత్తు కారణంగా ఒక పారిశ్రామికవేత్త ఆత్మహత్య చేసుకోవాల్సిన తీవ్ర పరిస్థితులు తలెత్తడం సరికాదని టీడీపీ ఎంపీ జయదేవ్ గల్లా తెలిపారు. -
‘కాఫీ డే’ సిద్ధార్థ మృతి
మంగళూరు/సాక్షి, బెంగళూరు: నాటకీయ పరిణామాల మధ్య సోమవారం రాత్రి అదృశ్యమైన కెఫే కాఫీ డే వ్యవస్థాపక యజమాని, ఇండియన్ కాఫీ కింగ్ వీజీ.సిద్ధార్థ (59) బుధవారం శవమై కనిపించారు. ప్రాథమికంగా చూస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లుగానే నిర్ధారణ అవుతోందనీ, అయితే కేసును పూర్తిగా విచారించిన తర్వాతనే నిజానిజాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. సిద్ధార్థ మృతదేహాన్ని కర్ణాటకలోని మంగళూరు సమీపాన, నేత్రావతి నది ఒడ్డున జాలరులు, పెట్రోలింగ్ పోలీసులు బుధవారం కనుగొన్నారు. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం.కృష్ణకు అల్లుడైన సిద్ధార్థకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. జాలరులు కనుగొన్న మృతదేహం సిద్ధార్థదేనని ఆయన స్నేహితులు నిర్ధారించినట్లు దక్షిణ కన్నడ జిల్లా డెప్యూటీ కమిషనర్ శశికాంత సెంథిల్ చెప్పారు. మంగళూరులోని వెన్లాక్ వైద్యశాలలో సిద్ధార్థ మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. సిద్ధార్థ స్వస్థలమైన చిక్కమగళూరు జిల్లా చేతనహళ్ళి గ్రామంలో అంత్యక్రియలను బుధవారం నిర్వహించారు. కర్ణాటక సీఎం యడియూరప్ప, మాజీ సీఎం కుమారస్వామి, ఇతర రాజకీయ నాయకులు, కెఫే కాఫీ డే ఉద్యోగులు, గ్రామస్థులు తదితర వందలాది మంది సిద్ధార్థ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం అధికారులు, అప్పు ఇచ్చిన వాళ్లు తనను వేధిస్తున్నారనీ, ఆ ఒత్తిడిని తాను తట్టుకోలేకపోతున్నానంటూ అదృశ్యానికి ముందు సిద్ధార్థ రాసినట్లుగా ఓ లేఖ బయటకు రావడం తెలిసిందే. మంగళూరు సమీపంలో నేత్రావతి నదిపై ఉన్న వంతెన వద్ద సిద్ధార్థ అదృశ్యమైనట్లు ఆయన డ్రైవర్ చెప్పడంతో, ఆ ప్రాంతంలో సిబ్బంది తీవ్రంగా గాలించారు. హైదరాబాద్‌కు చెందిన ఇన్కాయిస్ అనే ప్రభుత్వ సంస్థ అభివృద్ధి చేసిన సాంకేతికత ఆధారంగా సిద్ధార్థ మృతదేహం ఉన్న అంచనా ప్రదేశాన్ని గాలింపు సిబ్బంది తొలుత గుర్తించారు. అనంతరం ఆ ప్రాంతంలో తీవ్రంగా గాలించడంతో మృతదేహం లభించింది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మాట్లాడుతూ ‘మృతదేహం లభించింది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపేందుకు నా దగ్గర పదాలు కూడా లేవు. వారు అంతటి బాధలో ఉన్నారు. సిద్ధార్థకు అప్పుల కన్నా ఆస్తులు ఎక్కువగానే ఉన్నాయి’ అని చెప్పారు. మృతి దురదృష్టకరం: మమతా బెనర్జీ సిద్ధార్థ మృతి దురదృష్టకర సంఘటన అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నా రు. ప్రభుత్వ సంస్థల వేధింపుల కారణంగా ఆయన మానసికంగా కుంగిపోయారన్నారు. ప్రభుత్వ ఒత్తిడి, విధానాల కారణంగా ఇప్పటికే కొందరు వ్యాపారవేత్తలు దేశం విడిచి వెళ్లిపోయారనీ, మరికొందరు కూడా వెళ్లిపోయేందుకు ఆలోచిస్తున్నారని మమత పేర్కొన్నారు. అదృశ్య హస్తాలెవరివో తేల్చండి: కాంగ్రెస్ సిద్ధార్థ మృతి వెనుక ఉన్న అదృశ్య హస్తాలెవరివో తేల్చాలని కాంగ్రెస్ బుధవారం డిమాండ్ చేసింది. ‘ఆదాయపు పన్ను అధికారుల వేధింపులు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. వ్యాపారంలో భారత స్థాయి కూడా పడిపోతోంది. దీనంతటికీ కారణం పన్ను ఉగ్రవాదం, ఆర్థిక వ్యవస్థ కూలుతుండటమే. యూపీఏ హయాంలో ఎంతో వృద్ధి చెందిన వ్యాపారాలు, కంపెనీలు నేడు మూతపడుతున్నాయి. అనేక మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు’ అని ట్విట్టర్లో కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య మాట్లాడుతూ ‘నిష్పాక్షిక, పారదర్శక విచారణ జరగాలి. ఇలా విషాదకర రీతిలో సిద్ధార్థ చనిపోవడానికి కారణమైన అదృశ్య హస్తాలెవరివో, ఇందుకు కారణాలేంటో తేల్చాలి. ఆదాయపు పన్ను అధికారులు వేధించారని ఆయన ఆరోపించారు. పన్ను ఉగ్రవాదం, రాజకీయ దురుద్దేశాల కోసం ప్రభుత్వ సంస్థలను వాడుకుంటుండటంపై సిద్ధార్థ తన లేఖలో ప్రస్తావించారు. దీని ద్వారా యువపారిశ్రామికవేత్తలకు మనం ఏం సందేశం ఇస్తున్నాం? సంస్కరణల కోసం కనీసం ప్రయత్నం కూడా చేయడం లేదు’ అని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. -
జీవీకే ఎయిర్‌పోర్టులో 49% వాటా విక్రయం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను నిర్వహిస్తున్న జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్‌లో 49 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు దిగ్గజ కంపెనీలు ముందుకొచ్చినట్టు సమాచారం. ఇందుకోసం అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ), నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్(ఎన్ఐఐఎఫ్) కన్సార్షియంతో కెనడాకు చెందిన పబ్లిక్ సెక్టార్ పెన్షన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ (పీఎస్పీ ఇన్వెస్ట్మెంట్స్) చేతులు కలుపుతోంది. కన్సా ర్షియంలో ఈ కంపెనీలన్నిటికీ సమాన వాటా ఉండ నుంది. డీల్ విలువ సుమారు రూ.6,000 కోట్లుగా తెలుస్తోంది. ఎన్ఐఐఎఫ్, ఏడీఐఏలు ఈక్విటీ, డెట్ రూపంలో నిధులు సమకూర్చనున్నాయి. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను (ఎంఐఏఎల్) రూ.12,000 కోట్లుగా విలువ కట్టినట్టు సమాచారం. కొత్త ఇన్వెస్టర్లు జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ బోర్డులో చేరనున్నారు. సంస్థ కార్యకలాపాల్లోనూ పాలుపంచుకోనున్నారు. రుణ భారం తగ్గించుకోవడానికే..: ముంబైలోని చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎంఐఏఎల్ నిర్వహిస్తోంది. ఎంఐఏఎల్‌లో జీవీకే వాటా 50.5% కాగా, బిడ్ సర్వీసెస్ డివిజన్‌కు (మారిషస్) 13.5%, ఏసీఎస్ఏ గ్లోబల్‌కు 10%, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి 26% వాటా ఉంది. ముంబై విమానాశ్రయాన్ని 2006 నుంచి నిర్వహిస్తున్న జీవీకే.. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును రూ.16,704 కోట్లతో నిర్మిస్తోంది. డెవలప్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఎంఐఏఎల్‌కు 74%, సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు(సిడ్కో) మిగిలిన వాటా ఉంది. 2020 మధ్యలో ఈ కొత్త విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఇటీవల ప్రకటించారు. కాగా, జీవీకే రూ.5,750 కోట్ల వరకు రుణ భారాన్ని తగ్గించుకోవడానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్ఐఐఎఫ్, ఏడీఐఏతో నాన్ బైండింగ్ ఒప్పందాన్ని చేసుకుంది. తాజా డీల్‌తో వచ్చిన నిధులతో ఎంఐఏఎల్‌లో బిడ్వెస్ట్, ఏసీఎస్‌ఏలకు ఉన్న వాటాలను జీవీకే కొనుగోలు చేయనుంది. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యెస్ బ్యాంకుల్లో సంస్థకున్న రుణ భారాన్ని తగ్గించుకోనుంది. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్స్ బిజినెస్‌కు రూ.8,000 కోట్ల అప్పు ఉంది. -
లీజుకు రిలయన్స్ ఇన్ఫ్రా కార్యాలయం
న్యూఢిల్లీ: రుణభారం తగ్గించుకునే దిశగా రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్ఇన్ఫ్రా) మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ముంబైలోని శాంటాక్రూజ్ ఈస్ట్‌లో ఉన్న రిలయన్స్ సెంటర్ ఆఫీస్ కార్యాలయాన్ని దీర్ఘకాలిక లీజుకు ఇవ్వనున్నట్లు సోమవారం వెల్లడించింది. ఈ డీల్ ద్వారా వచ్చే నిధులను పూర్తిగా రుణాల చెల్లింపునకు మాత్రమే వినియోగించనున్నట్లు పేర్కొంది. ‘కార్యాలయాన్ని దీర్ఘకాలిక లీజుకివ్వడం ద్వారా నిధులు సమకూర్చుకుంటాం. సదరు ఆవరణ మాత్రం రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజమాన్యంలోనే ఉంటుంది‘ అని స్టాక్ ఎక్సే్ఛంజీలకు కంపెనీ తెలియజేసింది. 2020 నాటికి రుణ రహిత సంస్థగా మారాలని నిర్దేశించుకున్నట్లు వివరించింది. ప్రస్తుతం రిలయన్స్ సెంటర్లో పనిచేస్తున్న ఉద్యోగులను గ్రూప్ కంపెనీలకు ముంబైలో ఉన్న వివిధ కార్యాలయాలకు బదిలీ చేయనున్నట్లు తెలిపింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్‌లో భాగమైన రిలయన్స్ ఇన్ఫ్రాకు సుమారు రూ. 6,000 కోట్ల రుణభారం ఉంది. మరో గ్రూప్ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్)కు రూ, 57,500 కోట్ల అప్పులు ఉన్నాయి. వీటిలో రూ. 7,000 కోట్ల మొత్తాన్ని సొంత గ్రూప్ కంపెనీలకే ఆర్‌కామ్ చెల్లించాల్సి ఉంది. బ్లాక్‌స్టోన్‌తో చర్చలు.. అధికారికంగా రిలయన్స్ ఇన్ఫ్రా వెల్లడించనప్పటికీ.. లీజు ప్రతిపాదనలకు సంబంధించి బ్లాక్‌స్టోన్ సహా పేరొందిన పలు అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, అమెరికాకు చెందిన ఒక ఫండ్ సంస్థతో కం పెనీ చర్చలు జరుపుతోందని సమాచారం. 15,514 చ.మీ. ప్లాట్‌లో నిర్మించిన రిలయన్స్ సెంటర్ ఆఫీస్ భవంతి విస్తీర్ణం సుమారు 6.95 లక్షల చ.అ.లు ఉంటుంది. 425 కార్లకు పార్కింగ్ స్పేస్ ఉంది. సోమవారం బీఎస్ఈలో ఆర్ఇన్ఫ్రా షేరు 4.4 శాతం క్షీణించి రూ. 53.05 వద్ద క్లోజయ్యింది. -
జెట్ దివాలాపై నేటి నుంచి విచారణ
ముంబై: రుణ సంక్షోభంతో కుప్పకూలిన ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ దివాలాకు సంబంధించిన పిటిషన్‌పై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) గురువారం నుంచి విచారణ జరపనుంది. తాజాగా ఇందులో తమను కూడా పార్టీలుగా చేర్చాలని జెట్ ఎయిర్వేస్ పైలట్లు, ఇంజినీర్ల యూనియన్లతో పాటు నెదర్లాండ్స్‌కి చెందిన రెండు లాజిస్టిక్స్ వెండింగ్ సంస్థలు కూడా ఎన్సీఎల్టీని ఆశ్రయించాయి. తాము ఇంటర్వెన్షన్ పిటిషన్ వేసేందుకు అనుమతించాలని వెండార్లు కోరారు. జెట్ భారీగా బాకీ పడటంతో దానికి లీజుకిచ్చిన విమానాలను ఈ ఏడాది మార్చిలో అమ్‌స్టర్‌డామ్ ఎయిర్‌పోర్టులో ఈ రెండు సంస్థలు స్వా«ధీనం చేసుకున్నాయి. అయితే, ఈ సంస్థల పేర్లు ఇంకా వెల్లడి కాలేదు. ఏప్రిల్ 17 నుంచి జెట్ కార్యకలాపాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 8,500 కోట్ల రుణాలు రాబట్టుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సారథ్యంలోని 26 బ్యాంకుల కన్సార్షియం.. జెట్ ఎయిర్వేస్పై ఎన్సీఎల్టీని ఆశ్రయించాయి. జెట్ ఎయిర్వేస్ దాదాపు 23,000 ఉద్యోగులకు రూ. 3,000 కోట్లు జీతాలు, ఇతరత్రా విమానాల వెండార్లు, లెస్సర్లకు (లీజుకిచ్చిన సంస్థలు) రూ. 10,000 కోట్ల దాకా బాకీపడింది. మోసర్ బేయర్ ఆస్తుల విక్రయానికి ఆదేశం నిర్దిష్ట గడువులోగా రుణ పరిష్కార ప్రణాళికకు రుణ దాతల నుంచి ఆమోదం పొందడంలో విఫలమైనందున మోసర్ బేయర్ సోలార్ ఆస్తులు విక్రయించాలంటూ ఎన్సీఎల్టీ మరో కేసులో ఆదేశించింది. ఇందులో భాగంగా కంపెనీకి లిక్విడేటర్‌గా అరవింద్ గర్గ్ వ్యవహరిస్తారని సూచించింది. లిక్విడేషన్ ప్రక్రియ జరిగే సమయంలో కంపెనీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగేలా గర్గ్ చూస్తారని పేర్కొంది. లిక్విడేషన్ ప్రకటన తేదీ నుంచి 75 రోజుల్లోగా ప్రాథమిక నివేదిక సమర్పించాలని లిక్విడేటర్‌కు ఎన్సీఎల్టీ సూచించింది. 2017 నవంబర్ 14న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిటిషన్‌ను స్వీకరించడంతో మోసర్ బేయర్ సోలార్‌పై దివాలా చట్టం కింద చర్యల ప్రక్రియ ప్రారంభమైంది. సంస్థ లిక్విడేషన్ విలువ రూ. 72.42 కోట్లుగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. మోసర్ బేయర్ సోలార్ మాతృ సంస్థ మోసర్ బేయర్ ఇండియా కూడా లిక్విడేషన్ ప్రక్రియ ఎదుర్కొంటోంది. -
మరింతగా అప్పుల ‘చమురు’!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీలు) రుణాలపై ఆధారపడడం రానురాను మరింత పెరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్నే (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) ఉమ్మడి రుణాలను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మూడింటి రుణాలూ ఈ ఏడాది మార్చి నాటికి ఐదేళ్ల గరిష్ట స్థాయి 1.62 లక్షల కోట్లకు పెరిగిపోయాయి. ఏడాది క్రితం ఉన్న రూ.1.25 లక్షల కోట్ల రుణాలతో పోలిస్తే ఇవి ఏకంగా 30 శాతం పెరిగిపోయాయి. ముఖ్యంగా వీటిల్లో ఒక్క ఐవోసీ రుణాలే 2019 మార్చి నాటికి రూ.92,712 కోట్లు కావడం గమనార్హం. ఆ తర్వాత బీపీసీఎల్ రుణాలు రూ.42,915 కోట్లు, హెచ్‌పీసీఎల్ రుణ భారం రూ.26,036 కోట్లు చొప్పున ఉన్నాయి. ఈ మూడు కంపెనీలూ కలసి కొత్తగా రూ.36,402 కోట్ల మేర రుణాలను సమీకరించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా మూలధన విస్తరణ కార్యక్రమాలకు తోడు ప్రభుత్వం నుంచి సబ్సిడీలు సకాలంలో రాకపోవడమే రుణ భారం పెరిగేందుకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ), కిరోసిన్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి రూ.33,900 కోట్ల మేర సబ్సిడీ ఓఎంసీలకు రావాల్సి ఉంది. ద్రవ్యలోటు సర్దుబాటు కోసమని ఓఎంసీల సబ్సిడీల చెల్లింపులను ప్రభుత్వం వాయిదా వేయడంగమనార్హం. భారీ విస్తరణ కార్యక్రమాలు అయితే 2018–19 ఆర్థిక సంవత్సరం నాటికి ఓఎంసీల ఉమ్మడి రుణ భారం రూ.1.62 లక్షల కోట్లుగా ఉన్నప్పటికీ... 2014 ఆర్థిక సంవత్సరం కంటే తక్కువే ఉందని చెప్పాలి. అప్పట్లో చమురు ధరలు చారిత్రక గరిష్టాలకు చేరిన సమయం కావడంతో ఓఎంసీల ఉమ్మడి రుణ భారం రూ.1.76 లక్షల కోట్ల స్థాయికి పెరిగిపోయింది. ‘‘బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీలతో పోలిస్తే ఐవోసీ భారీగా మూలధన వ్యయ ప్రణాళికలను అమలు చేస్తోంది. హెచ్‌పీసీఎల్‌కు ఎక్కువ శాతం మార్కెటింగ్ కార్యకలాపాలు కావడంతో నగదు ప్రవాహాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే, మోస్తరు విస్తరణ ప్రణాళికలను అమల్లో పెట్టింది. బీపీసీఎల్‌కు మాత్రం చమురు వెలికితీత, ఉత్పత్తితో పాటు పట్టణ గ్యాస్ పంపిణీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి’’ అని ఆయిల్ అండ్ గ్యాస్ రంగ విశ్లేషకుడు ఒకరు పేర్కొన్నారు. రావాల్సిన బకాయిలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ చెల్లింపుల్లో జాప్యం చేయడం కారణంగానే ఓఎంసీలకు ఒక్కోదానికి మార్చి నెలలో రూ.5,000– 10,000 కోట్ల వరకు రుణం పెరిగినట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక పేర్కొంది. ‘‘మా రుణభారం ఇప్పటి వరకైతే రూ.81,000 కోట్లకు పెరిగింది. ప్రధానంగా ప్రభుత్వం నుంచి రూ.19,000 కోట్ల మేర బకాయిలు రాకపోవడం వల్లే. ఇందులో ఎల్పీజీకి సంబంధించి ప్రత్యక్ష నగదు బదిలీ రూ.13,883 కోట్లుగా ఉంటే, కిరోసిన్ సబ్సిడీ రూ.3,395 కోట్ల మేర ఉంది. మిగిలిన రూ.2,000 కోట్లు పీఎంయూవై డిపాజిట్’’ అని ఈ నెల 17న ఇండియన్ ఆయిల్ డైరెక్టర్ ఏకే శర్మ పేర్కొనడం గమనార్హం. ఇక కేంద్ర ప్రభుత్వానికి అధిక డివిడెండ్ చెల్లించాల్సి రావడం, మధుర రిఫైనరీకి సంబంధించి ఎంట్రీ ట్యాక్స్ సైతం ఇండియన్ ఆయిల్ రుణ భారం పెరిగిపోవడానికి కారణాలుగా ఉన్నాయి. -
భార్య, పిల్లలను చంపిన సాఫ్ట్వేర్ ఇంజినీర్
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన భార్య, ముగ్గురు పిల్లలను హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. శనివారం అర్ధరాత్రి నిందితుడు సుమీత్ కుమార్ తన భార్య అన్సు బాల (32), కొడుకు ప్రతిమేశ్ (5)తోపాటు కవల పిల్లలైన కూతురు ఆకృతి (4), కొడుకు ఆరవ్ (4)లకు మత్తు కలిపిన పానీయాలు తాగించి, గొంతు కోసి చంపాడు. ఆదివారం తాము మృతదేహాలను కనుగొన్నామని వెల్లడించారు. కుమార్ అన్షును 2011లో వివాహమాడాడు. గతేడాది డిసెంబర్లో ఉద్యోగం పోగొట్టుకుని, అప్పుల్లో కూరుకుపోయి డిప్రెషన్లో ఉన్నాడు. బాలా టీచర్‌గా పనిచేస్తోంది. కుమార్ మామ వారి కుటుంబ ఖర్చులకు సాయం చేసేవాడు. ఆదివారం కుమార్ వాళ్ల కుటుంబ వాట్సాప్ గ్రూప్‌లో ఓ వీడియో పోస్ట్ చేస్తూ తన పిల్లలను, భార్యను ఎలా చంపాడో చెప్పాడని సిటీ సూపరింటెండెంట్ శ్లోక్ కుమార్ వెల్లడించారు. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటాననీ, అందుకోసం విషం కొనుక్కున్నానని కూడా ఆ పోస్ట్‌లో తెలిపాడని అన్నారు. -
అడియాశలైన ఆశలు..
వర్షాభావం.. గిట్టుబాటు ధరల లేమి.. పేరుకుపోయిన అప్పులు ముప్పేట దాడితో రైతుకుటుంబాన్ని పూర్తిగా కుంగదీశాయి. అప్పులు తీర్చే మార్గం కానరాక రైతు గత ఏడాది ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వంలో స్పందన లోపించింది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం చిన్నభూంపల్లి గ్రామానికి చెందిన బడాయి దేవేంద్ర (28) పురుగుల మందు తాగి 2018 ఆగస్టు 29న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు ఒకటిన్నర ఎకరా భూమి ఉంది. అదనంగా ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశాడు. వర్షాల్లేక పత్తి పైరు గిడసబారిపోయింది. సేద్యం కోసం ఏటా అప్పులు చేస్తూ వచ్చాడు. పైవాడు కరుణిస్తాడని పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. పంటలకోసం దాదాపు రూ.5 లక్షలు అప్పులు చేశాడు. పంట చేతికి రాదన్న దిగులుతో రైల్వే గేటు సమీపంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న దేవేంద్రను కర్నూలు తీసుకెళ్లి వైద్యచికిత్సలు చేయించగా రెండు రోజుల తర్వాత కన్నుమూశాడు. భార్య నాగవేణి, తల్లి లక్ష్మమ్మ, ఇద్దరు కుమారులు నారాయణ, నరసింహులు ఉన్నారు. నారాయణ 2వ తరగతి చదువుతుండగా, నరసింహులు అంగన్వాడీకి వెళ్తున్నాడు. దేవేంద్ర భార్య, తల్లి కాయకష్టం చేసి బతుకు సాగిస్తున్నారు. కష్టంలో కొంత అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ కడు దయనీయ స్థితిలో పూరి గుడిసెలో కాలం వెళ్లదీస్తున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సాయం అందలేదు. – కె. పరశురాం, సాక్షి, మంత్రాలయం, కర్నూలు జిల్లా -
అనిల్ అంబానీ పని అయిపోయిందా..?
అన్నదమ్ములిద్దరూ దాదాపు ఒకే దగ్గర జర్నీ ప్రారంభించారు. కానీ ఒకరు ఆకాశామే హద్దుగా ఎదుగుతుంటే.. మరొకరు అధఃపాతాళం లోతుల్లోకి జారిపోతున్నారు. దేశంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో నువ్వా, నేనా అన్నట్లుగా ఒకప్పుడు అన్న ముకేశ్ అంబానీతో పోటీపడిన అనిల్ అంబానీ ప్రస్తుతం ఆ లిస్టులో ఎక్కడో కిందికి పడిపోయారు. అన్న ముకేశ్ అంబానీ 47 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా రాజ్యమేలుతుండగా.. 2 బిలియన్ డాలర్లకు పడిపోయిన సంపదతో తమ్ముడు అనిల్ అంబానీ కనీసం దేశీ కుబేరుల లిస్టులోనూ చోటు కోసం తంటాలు పడే పరిస్థితికి తగ్గిపోయారు. దశాబ్ద కాలంలో అన్న ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.లక్ష కోట్ల నుంచి రూ. 8 లక్షల కోట్లకు ఎగిసినప్పటికీ... అడ్డదిడ్డంగా ఎడాపెడా కంపెనీలు ఏర్పాటు చేస్తూ, సంబంధంలేని రంగాల్లోకి దూరేస్తూ.. అప్పులు పెంచుకుంటూ పోయిన అనిల్ అంబానీ సారథ్యంలోని అడాగ్ గ్రూప్ విలువ వేల కోట్ల స్థాయికి పడిపోయింది. పదేళ్ల క్రితం రూ. 1.7 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో అగ్రశ్రేణి సంస్థగా వెలుగొందిన ఫ్లాగ్ షిప్ కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) ప్రస్తుతం దాదాపు రూ. 50,000 కోట్ల పైచిలుకు రుణాల భారంతో కుదేలై.. దివాలా తీసింది. గ్రూప్‌లోని మిగతా కంపెనీలు నానా తంటాలు పడుతున్నాయి. ఆర్‌కామ్ దివాలా ప్రకటనతో సోమవారం అడాగ్ గ్రూప్ సంస్థల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. గ్రూప్‌లో కీలకమైన అయిదు సంస్థల మార్కెట్ విలువ ఒక్క రోజే ఏకంగా రూ.5,831 కోట్ల మేర పడిపోయింది. ఈ నేపథ్యంలో సంక్షోభంలో చిక్కుకున్న అనిల్, అడాగ్ గ్రూప్ కంపెనీలు, కారణాలపై ‘సాక్షి’ బిజినెస్ విభాగం అందిస్తున్న ప్రత్యేక కథనమిది... సరి సమానంగా విభజన... వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ మరణానంతరం సోదరులిద్దరి మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోవటంతో 2005లో దాదాపు రూ.90,000 కోట్ల రిలయన్స్ సామ్రాజ్యం రెండుగా చీలిపోయింది. ఇందులో ముడిచమురు కంపెనీ అన్న ముకేశ్‌కు రాగా.. టెలికం, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫ్రా, పవర్ వంటి కీలక సంస్థలు అనిల్ చేతికి దక్కాయి. అవిభాజ్య గ్రూప్‌లో అనిల్ అంబానీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా (సీఎఫ్ఓ) వ్యవహరించేవారు. వ్యాపార భారాన్ని భుజాలపై మోయడం కన్నా.. డీల్స్ కుదర్చడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. కాకపోతే విభజన తరవాత భారీ సామ్రాజ్యాన్ని నిర్వహించాల్సిన బాధ్యత మీద పడటంతో.. ఆయన సామర్థ్యాలకు పరీక్ష మొదలైంది. సవాళ్లూ ఒక్కొక్కటిగా ఎదురవటం మొదలెట్టాయి. వ్యాపార విస్తరణ కాంక్షతో సంబంధం లేని రంగాల్లోకి కూడా చొచ్చుకుపోయారు అనిల్. చివరకు అప్పుల భారం పేరుకుపోయిన ఆర్‌కామ్ రూపంలో సంక్షోభం బయటపడింది. వచ్చే ఆదాయాలు వడ్డీలు కట్టడానికి కూడా సరిపోని పరిస్థితుల్లోకి గ్రూప్ దిగజారిపోయింది. ముంబైలో తొలి మెట్రో లైన్ నిర్మించిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ... గతేడాది ఆగస్టులో బాండ్లను చెల్లించలేక చేతులెత్తేసింది. 2008లో రికార్డ్ ఐపీవోకి వచ్చిన రిలయన్స్ పవర్ షేరు.. అప్పట్నుంచీ పడుతూనే ఉంది. కాస్త లాభసాటిగా ఉండే ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగం రిలయన్స్ క్యాపిటల్‌కి కూడా కష్టాలు తప్పలేదు. మొత్తానికి సంక్షోభంలోకి పడిపోయిన కొన్ని గ్రూప్ కంపెనీలను చూస్తే.. ఆర్‌కామ్: కాల్ డిస్కనెక్ట్.. 2010లో 17% మార్కెట్ వాటాతో దేశీ టెలికంలో ఆర్‌కామ్ రెండో స్థానంలో ఉండేది. 2016లో అన్న ముకేశ్ ఎంట్రీ తర్వాత ఇది పదవ స్థానానికి పడిపోయి.. టాప్ కంపెనీల లిస్టు నుంచి తప్పుకుంది. ఒకప్పుడు రూ.1.7 లక్షల కోట్ల మార్కెట్ విలువతో అగ్రస్థానంలో వెలుగొందిన ఆర్‌కామ్ ఇప్పుడు రూ.45 వేల కోట్ల పైచిలుకు రుణ భారంలో ఉంది. చివరికి ప్రధానమైన మొబైల్ వ్యాపారాన్ని అన్న కంపెనీకే అమ్మేసినా.. స్పెక్ట్రం బాకీల వివాదంతో డీల్ ముందుకు సాగడం లేదు. బాకీలు ఎగ్గొట్టినందుకు కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలంటూ ఎరిక్సన్ వంటి కంపెనీలు కోర్టులను ఆశ్రయించాయి. 1.8 బిలియన్ డాలర్ల విదేశీ రుణాన్ని వసూలు చేసుకునేం దుకు చైనా డెవలప్మెంట్ బ్యాంక్ కూడా దివాలా పిటిషన్ వేసింది. సినిమా... అట్టర్ ఫ్లాప్ ఒకప్పటి సినీతార టీనా మునీమ్‌ను వివాహం చేసుకున్న అనిల్ అంబానీ .. తన అడాగ్ గ్రూప్ ద్వారా గ్లామర్ ప్రపంచ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టారు. ఫిలిమ్ ప్రాసెసింగ్, ప్రొడక్షన్, పంపిణీ రంగాల్లోని యాడ్ ల్యాబ్స్ సంస్థ కొనుగోలుతో ఆరంభంలో భారీగానే విస్తరించారు. 2008 నాటికి దాదాపు 700 స్క్రీన్స్‌తో దేశంలోనే అతి పెద్ద మల్టీప్లెక్స్ ఆపరేటర్‌గా అనిల్ ఎదిగారు. కానీ 2014 నాటికి ఈ మీడియా వైభవం తగ్గిపోయింది. రుణాల భారం తగ్గించుకోవడానికి వందల కొద్దీ స్క్రీన్స్‌ను తెగనమ్ముకోవాల్సి వచ్చింది. సంబంధం లేని గ్లామర్ బిజినెస్‌లోకి దూకి అనిల్ దానిపై దృష్టి పెట్టడం వల్ల ప్రధాన గ్రూప్ కంపెనీల పనితీరు దెబ్బతిన్నదనే విమర్శలూ ఉన్నాయి. అసెట్స్ అమ్మకాలకు ఆటంకాలు.. మరోపక్క, అప్పుల భారాలను తగ్గించుకోవడానికి అనిల్ అంబానీ పెద్ద ఎత్తున అసెట్స్‌ను విక్రయిస్తున్నారు. ఇప్పటికే సిమెంట్, టెలికం టవర్స్ మొదలైన వాటిని అమ్మేశారు. కానీ.. ఒక్కో వ్యాపార విభాగంలో ఒక్కో సమస్య కారణంగా అసెట్స్ విక్రయం పూర్తి స్థాయిలో ముందుకు జరగడం లేదు. రూ. 1,00,000 కోట్లు.. 2018 మార్చి ఆఖరు నాటికి అడాగ్ రుణభారం ఇది. ఏటా వడ్డీల కిందే రూ. 10,000 కోట్లు. రూ. 4,00,000 కోట్లు.. గరిష్ట స్థాయిలో అడాగ్ గ్రూప్‌లోని 5 ప్రధాన సంస్థల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్. ప్రస్తుతం రూ. 50 వేల కోట్ల కన్నా తక్కువకి పడిపోయింది. రక్షణ... బ్యాక్ ఫైర్! ఉన్న సమస్యలు సరిపోవన్నట్లు.. అనిల్ అంబానీ 2016లో పిపావవ్ మెరైన్ అండ్ ఆఫ్‌షోర్ (రిలయన్స్ నేవల్గా పేరు మారింది) యాజమాన్య వాటాలను కొనుక్కున్నారు. ఇది భారతీయ నేవీ కోసం యుద్ధనౌకల నిర్మాణం, మరమ్మతుల సర్వీసులు అందిస్తుంది. సమస్యల్లో ఉన్న ఇన్ఫ్రా నుంచి పుష్కలమైన అవకాశాలున్న డిఫెన్స్ వైపుగా వెడితే అడాగ్‌ను కాపాడుకోవచ్చని అనిల్ భావించారు. కానీ, ఈ ప్రయోగమూ దెబ్బతింది. అయినా.. అసలు భారీ నష్టాలు, అప్పులతో కుదేలైన ఈ సంస్థను ఎందుకు కొన్నారనేది ఎవరికీ అర్థం కాలేదు. రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి ఫ్రాన్స్ కంపెనీ డస్సాల్ట్‌తో ఈ కంపెనీ జట్టు కట్టడంపై ప్రస్తుతం వివాదం నడుస్తోంది. అనిల్ అంబానీకి మేలు చేసేందుకు ప్రభుత్వమే ఈ రెండింటి మధ్య డీల్ కుదిర్చిందంటూ విపక్షాలు విమర్శల దాడి చేస్తున్నాయి. 45 బిలియన్ డాలర్ల వ్యత్యాసం.. ఫోర్బ్స్ మ్యాగజైన్ గణాంకాల ప్రకారం 2007లో అనిల్ సంపద 45 బిలియన్ డాలర్లు. అన్న ముకేశ్ సంపద 49 బిలియన్ డాలర్లు. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి 2018కి వస్తే ఫోర్బ్స్ ఇండియా కుబేరుల లిస్టులో ముకేశ్ 47.3 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా.. 2.44 బిలియన్ డాలర్ల సంపదతో అనిల్ 66వ స్థానానికి పడిపోయారు. అసలెక్కడ తేడా కొట్టింది..? కేవలం దశాబ్దం కాలంలో అనిల్ సామ్రాజ్యం కుప్పకూలడానికి దారి తీసిన కారణాలేంటి. డీల్ మేకర్‌గా, వ్యాపార నిర్వహణలో ఇన్వెస్టర్ల నమ్మకం చూరగొన్న అనిల్ అంబానీ గ్రాఫ్ ఎందుకిలా పడిపోయింది? 2008లో రికార్డు స్థాయిలో రిలయన్స్ పవర్ రూ.11,500 కోట్ల నిధుల కోసం ఐపీఓకు వచ్చినపుడు... అది రికార్డు స్థాయిలో 70 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయింది. మరలాంటప్పుడు.. ఎక్కడ తేడా కొట్టింది? నిర్వహణ లోపమా? సమర్థమంతమైన టీమ్ లేకపోవడం వల్లా? లేదా ఒకదానితో మరొక దానికి సంబంధం లేకుండా కుప్పతెప్పలుగా కంపెనీలు పెట్టేయడం వల్లా? లేదా ఎకాయెకిన ఆకాశానికి నిచ్చెనలేసేయాలన్న అత్యుత్సాహంతో దొరికిన చోటల్లా అడ్డగోలుగా అప్పులు చేసేసి.. రుణభారం పెంచేసుకోవడం వల్లా? వ్యాపార పరిస్థితులు పూర్తిగా దెబ్బతినడం వల్లా? తరచి చూస్తే సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ప్రధాన కారణాల గురించి వెతుక్కుంటూ పోతే అంతు ఉండదన్నది పరిశీలకుల అభిప్రాయం. అయితే, అన్నింటికీ వ్యాపార పరిస్థితులు బాగా లేకపోవడం, దురదృష్టం అనుకోవడానికి ఉండదని.. ఆయన ప్రారంభించిన అనేక కంపెనీలే ఒకదాన్ని మరొకటి దెబ్బతీశాయని.. వాటాదారుల ప్రయోజనాలను ఘోరంగా దెబ్బతీశాయని విమర్శలు వస్తున్నాయి. కాస్తంత ఇబ్బందికరమైనదే అయినా.. సోషల్ మీడియా యాప్స్‌లో అన్నదమ్ములపై ఒక సెటైర్ కూడా ప్రచారంలోకి వచ్చింది. అన్న ముకేశ్ అంటే ’ము–క్యాష్’ (డబ్బుల మూట) అని, తమ్ముడు అనిల్ అంటే ’అ–నిల్’ (సున్నా) అంటూ వ్యంగ్యోక్తులు కూడా నడిచాయి. -
రుణం ఎలా తీర్చాలో తెలియటం లేదు..
వ్యవసాయాన్ని నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న యువ రైతు అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నా అతని కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికెర మండల కేంద్రానికి చెందిన ఉప్పర వీరేష్ ఆత్మహత్య చేసుకొని 11 నెలల క్రితం చనిపోయినా అతని కుటుంబానికి ఇప్పటివరకు ఎలాంటి సాయం అందలేదు. దీంతో ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. 2018 ఫిబ్రవరి 2న ఉప్పర వీరేష్ (35) అప్పుల బాధ తాళలేక పొలంలోనే పురుగుల మందును తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి పేరున 4.71 ఎకరాల భూమి ఉంది. సిండికేట్ బ్యాంకులో రూ.5 లక్షలు రుణం తీసుకొని పప్పుశనగ సాగు చేశాడు. పైరు ఎదుగుదల సమయంలో వర్షాలు లేక ఎండిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పు తీర్చాలని బ్యాంకు అధికారులు ఒత్తిడి తెచ్చారు. దిక్కు తెలియని పరిస్థితుల్లో ఆత్మస్థయిర్యం కోల్పోయి పురుగుల మందు తాగి తనువు చాలించాడు. మృతుడికి భార్య విజయలక్ష్మి, కూతురు శ్రావణి (3వ తరగతి), తేజశ్వణి(2వ తరగతి) వంశీకృష్ణ (నర్సరీ) ఉన్నారు. పిల్లలను పోషించుకోవడానికి విజయలక్ష్మి ఇక్కట్లు పడుతున్నారు. ‘రుణాలు తీర్చలేక, పిల్లలను పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. రాత్రి పూట పిల్లలు నాయన ఎప్పుడు వస్తాడని అడుగుతుంటే ఎమి చెప్పాలో, ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. మాకు పెద్దగా ఆస్తులు లేవు. ఉన్నది తాకట్టు పెట్టినా లేదా విక్రయించినా రూ.5 లక్షల బ్యాంకు రుణం తీరేటట్లు లేదు. రుణాలను ఎలా తీర్చాలో తెలియడంలేదు. ఆర్డీఓ వచ్చి విచారణ చేసి వెళ్లారు, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. మా కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వం నుంచి సాయం అందుతుందన్న ఆశలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి..’ అని విజయలక్ష్మి గుడ్లనీరు కుక్కుకుంటున్నారు. – పి. గోపాల్, సాక్షి, పత్తికొండ, కర్నూలు జిల్లా