చిక్కమగళూర్‌లో సిద్దార్థ మృతదేహానికి నివాళులర్పిస్తున్న కర్ణాటక సీఎం యడియూరప్ప
మంగళూరు/సాక్షి, బెంగళూరు: నాటకీయ పరిణామాల మధ్య సోమవారం రాత్రి అదృశ్యమైన కెఫే కాఫీ డే వ్యవస్థాపక యజమాని, ఇండియన్ కాఫీ కింగ్ వీజీ.సిద్ధార్థ (59) బుధవారం శవమై కనిపించారు. ప్రాథమికంగా చూస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లుగానే నిర్ధారణ అవుతోందనీ, అయితే కేసును పూర్తిగా విచారించిన తర్వాతనే నిజానిజాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. సిద్ధార్థ మృతదేహాన్ని కర్ణాటకలోని మంగళూరు సమీపాన, నేత్రావతి నది ఒడ్డున జాలరులు, పెట్రోలింగ్ పోలీసులు బుధవారం కనుగొన్నారు.
కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం.కృష్ణకు అల్లుడైన సిద్ధార్థకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. జాలరులు కనుగొన్న మృతదేహం సిద్ధార్థదేనని ఆయన స్నేహితులు నిర్ధారించినట్లు దక్షిణ కన్నడ జిల్లా డెప్యూటీ కమిషనర్ శశికాంత సెంథిల్ చెప్పారు. మంగళూరులోని వెన్‌లాక్ వైద్యశాలలో సిద్ధార్థ మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. సిద్ధార్థ స్వస్థలమైన చిక్కమగళూరు జిల్లా చేతనహళ్ళి గ్రామంలో అంత్యక్రియలను బుధవారం నిర్వహించారు.
కర్ణాటక సీఎం యడియూరప్ప, మాజీ సీఎం కుమారస్వామి, ఇతర రాజకీయ నాయకులు, కెఫే కాఫీ డే ఉద్యోగులు, గ్రామస్థులు తదితర వందలాది మంది సిద్ధార్థ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం అధికారులు, అప్పు ఇచ్చిన వాళ్లు తనను వేధిస్తున్నారనీ, ఆ ఒత్తిడిని తాను తట్టుకోలేకపోతున్నానంటూ అదృశ్యానికి ముందు సిద్ధార్థ రాసినట్లుగా ఓ లేఖ బయటకు రావడం తెలిసిందే. మంగళూరు సమీపంలో నేత్రావతి నదిపై ఉన్న వంతెన వద్ద సిద్ధార్థ అదృశ్యమైనట్లు ఆయన డ్రైవర్ చెప్పడంతో, ఆ ప్రాంతంలో సిబ్బంది తీవ్రంగా గాలించారు.
హైదరాబాద్‌కు చెందిన ఇన్‌కాయిస్ అనే ప్రభుత్వ సంస్థ అభివృద్ధి చేసిన సాంకేతికత ఆధారంగా సిద్ధార్థ మృతదేహం ఉన్న అంచనా ప్రదేశాన్ని గాలింపు సిబ్బంది తొలుత గుర్తించారు. అనంతరం ఆ ప్రాంతంలో తీవ్రంగా గాలించడంతో మృతదేహం లభించింది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మాట్లాడుతూ ‘మృతదేహం లభించింది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపేందుకు నా దగ్గర పదాలు కూడా లేవు. వారు అంతటి బాధలో ఉన్నారు. సిద్ధార్థకు అప్పుల కన్నా ఆస్తులు ఎక్కువగానే ఉన్నాయి’ అని చెప్పారు.
మృతి దురదృష్టకరం: మమతా బెనర్జీ
సిద్ధార్థ మృతి దురదృష్టకర సంఘటన అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నా రు. ప్రభుత్వ సంస్థల వేధింపుల కారణంగా ఆయన మానసికంగా కుంగిపోయారన్నారు. ప్రభుత్వ ఒత్తిడి, విధానాల కారణంగా ఇప్పటికే కొందరు వ్యాపారవేత్తలు దేశం విడిచి వెళ్లిపోయారనీ, మరికొందరు కూడా వెళ్లిపోయేందుకు ఆలోచిస్తున్నారని మమత పేర్కొన్నారు.
అదృశ్య హస్తాలెవరివో తేల్చండి: కాంగ్రెస్
సిద్ధార్థ మృతి వెనుక ఉన్న అదృశ్య హస్తాలెవరివో తేల్చాలని కాంగ్రెస్ బుధవారం డిమాండ్ చేసింది. ‘ఆదాయపు పన్ను అధికారుల వేధింపులు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. వ్యాపారంలో భారత స్థాయి కూడా పడిపోతోంది. దీనంతటికీ కారణం పన్ను ఉగ్రవాదం, ఆర్థిక వ్యవస్థ కూలుతుండటమే. యూపీఏ హయాంలో ఎంతో వృద్ధి చెందిన వ్యాపారాలు, కంపెనీలు నేడు మూతపడుతున్నాయి. అనేక మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు’ అని ట్విట్టర్‌లో కాంగ్రెస్ ఆరోపణలు చేసింది.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య మాట్లాడుతూ ‘నిష్పాక్షిక, పారదర్శక విచారణ జరగాలి. ఇలా విషాదకర రీతిలో సిద్ధార్థ చనిపోవడానికి కారణమైన అదృశ్య హస్తాలెవరివో, ఇందుకు కారణాలేంటో తేల్చాలి. ఆదాయపు పన్ను అధికారులు వేధించారని ఆయన ఆరోపించారు. పన్ను ఉగ్రవాదం, రాజకీయ దురుద్దేశాల కోసం ప్రభుత్వ సంస్థలను వాడుకుంటుండటంపై సిద్ధార్థ తన లేఖలో ప్రస్తావించారు. దీని ద్వారా యువపారిశ్రామికవేత్తలకు మనం ఏం సందేశం ఇస్తున్నాం? సంస్కరణల కోసం కనీసం ప్రయత్నం కూడా చేయడం లేదు’ అని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment