cafe Coffee Day
-
దశ తిరిగిన కాఫీడే! ఎట్టకేలకు లాభాల్లోకి..
ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడిన కాఫీడే (కేఫ్ కాఫీ డే గ్లోబల్ లిమిటెడ్- సీడీజీఎల్) దశ తిరిగిట్టు కనిపిస్తోంది. నష్టాల ఊబి నుంచి బయటపడి ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.24.57 కోట్ల నికర లాభం వచ్చినట్లు ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.11.73 కోట్ల నష్టాన్ని కాఫీడే చవిచూసింది. మొత్తంగా ఏడాది క్రితం తొలి త్రైమాసికంలో రూ.189.63 కోట్లుగా ఉన్న కంపెనీ ఆపరేషన్స్ ఆదాయం ఈ ఏడాది రూ.223.20 కోట్లకు చేరుకున్నట్లు క్యూ1 ఫలితాల వెల్లడి సందర్భంగా కాఫీ డే పేర్కొంది. సీడీజీఎల్ అన్‌లిస్టెడ్ కంపెనీ కావడంతో దాని మాతృ సంస్థ కాఫీడే ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ (సీడీఈఎల్) ప్రతి త్రైమాసికం ఫలితాలను వెల్లడిస్తుంది. కాగా ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 250 కోట్లు. మరోవైపు ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో కాఫీ డే దేశవ్యాప్తంగా ఉన్న తమ అవుట్లెట్ల సంఖ్యను సీక్వెన్షియల్ ప్రాతిపదికన 467కి తగ్గించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 493 అవుట్లెట్లు ఉండేవి. కానీ, వెండింగ్ యంత్రాలను మాత్రం 46,603 నుంచి 50,870కి పెంచుకుంది. ఒక్కో అవుట్‌లెట్‌లో సరాసరి రోజువారీ ఆదాయం రూ.19,537 నుంచి రూ.20,824కి పెరిగినట్లు కాఫీడే కంపెనీ వెల్లడించింది. క్యూ1 ఫలితాల నేపథ్యంలో కాఫీడే షేర్లు ఆగస్ట్ 16న లాభాల బాటలో పయనించాయి. ఇదీ చదవండి: Vietnam Richest man: అదృష్టం కాదిది.. అంతకు మించి! ఒక్క రోజులో రూ. 3.2 లక్షల కోట్ల సంపద.. -
కాఫీ డే గ్లోబల్‌పై దివాలా పిటిషన్!
న్యూఢిల్లీ: ప్రముఖ కేఫ్ కాఫీ డే చైన్‌ను నిర్వహిస్తున్న కాఫీ డే గ్లోబల్ లిమిటెడ్ (సీడీజీఎల్)పై దాఖలైన దివాలా పిటిషన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ బెంగళూరు బెంచ్ అడ్మిట్ చేసింది. రూ.94 కోట్లు చెల్లించాలని పేర్కొంటూ, బకాయిలను రాబట్టుకునేందుకుగాను కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియను (సీఐఆర్‌పీ) ప్రారంభించాలని కంపెనీ ఫైనాన్షియల్ క్రెడిటార్ దాఖలు చేసిన పిటిషన్‌ను బెంచ్ స్వీకరించింది. సీడీజీఎల్ మాతృ సంస్థ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఎన్సీఎల్టీ లిఖితపూర్వక ఆదేశాల కోసం సీడీజీఎల్ ఎదురుచూస్తున్నట్లు కూడా వెల్లడించింది. ఈ పిటిషన్‌కు సంబంధించి తన అనుబంధ సంస్థ చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు కూడా పేర్కొంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో సీడీజీఎల్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సీడీజీఎల్ ఆదాయం రూ. 920.41 కోట్లు. నష్టం రూ.67.77 కోట్లు. -
ఊహించని ఎదురు దెబ్బ..చిక్కుల్లో వీజీ సిద్ధార్థ సతీమణి మాళవిక హెగ్డే!
మాళవిక హెగ్డే! పరిచయం అక్కర్లేని పేరు. కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(సీసీడీ) వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ సతీమణే మాళవిక హెగ్డే. రుణాల ఎగవేతతో మాళవిక హెగ్దే మరోసారి తెరపైకి వచ్చారు. మంగళూరు కాఫీ ఘమ ఘుమల్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన వీజీ సిద్ధార్ధ మరణంతో సీసీడీ సీఈవోగా మాళవిక హెగ్డే బాధ్యతల్ని చేపట్టారు. రూ.7వేల కోట్ల అప్పు! ఎలా తీర్చాలో దిక్కు తోచని స్థితులో సిద్ధార్థ తనువు చాలించారు. భర్త మరణం. అంతులేని బాధ. అప్పుల నడిసంద్రంలో మాళవిక కెఫే కాఫీ డే సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఎప్పుడు? ఎక్కడ? ఎలా? మొదలు పెట్టాలో తెలియని అగమ్య గోచర స్థితిలో అప్పుడే మాళవిక ఒక్కొక్క ఇటుకను పేరుస్తూ.. కాఫీ సామ్రాజ్యాన్ని నిర్మించే పనిలో పడ్డారు. సిద్ధార్థ మరణం తర్వాత తొలిసారి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో భర్త సిద్ధార్ధ కలల్ని నిజం చేస్తానని, కెఫే కాఫీ డేను లాభాల బాట పట్టించి ఉద్యోగలందరిని కాపాడుకుంటానని చెప్పారు. ఆమె కృషి ఫలించి కెఫే కాఫీ డే సగర్వంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. బ్యాంకులు నమ్మాయి. ఉద్యోగులు ఆమె వెంటే నడిచారు. కెఫే కాఫీ డేలో వాటాలు కొనుగోలు చేసేందుకు టాటాలాంటి దిగ్గజ కంపెనీలతో పాటు పెట్టుబడి దారులు ముందుకు వచ్చారు. ఇలా ఒకటిన్నర సంవత్సరం తిరగకుండానే రూ.7,200 కోట్ల రుణాల్ని రూ.3,100 కోట్లుకు తగ్గించగలిగారు. ఇలా ఒకటి రెండేళ్లలో కెఫే కాఫీ డే అప్పుల్ని తీర్చే సామర్ధ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మాళవిక హెగ్డే చిక్కుల్లో పడ్డారు.కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ మార్చి 31 నాటికి మొత్తం రూ.436 కోట్ల రుణాలను చెల్లించడంలో విఫలమైనట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. స్వల్పకాల, దీర్ఘకాల రుణాలు ఇందులో ఉన్నట్టు తెలిపింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.220 కోట్ల రుణ సదుపాయాల్లో అసలు రూ.190 కోట్లు, వడ్డీ రూ.6 కోట్ల వరకు చెల్లించలేకపోయినట్టు తెలిపింది. మరో రూ.200 కోట్లు, దీనిపై రూ.40 కోట్ల వడ్డీ మేర ఎన్సీడీలు, ఎన్‌సీఆర్‌పీఎస్‌ల రూపంలో తీసుకున్నవి చెల్లించలేదని సమాచారం ఇచ్చింది. కంపెనీ తన ఆస్తులను విక్రయించడం ద్వారా క్రమంగా రుణ భారాన్ని తగ్గించుకుంటూ వస్తుండడం గమనార్హం. చదవండి👉 ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం.. ఆ రంగానికి చెందిన ఉద్యోగాలకు భారీ డిమాండ్! -
తెరపైకి ‘కెఫె కాఫీ డే’ ఫౌండర్ వీజీ సిద్ధార్థ బయోపిక్
‘కెఫె కాఫీ డే’ ఫౌండర్ వీజీ సిద్ధార్థ్ జీవితం త్వరలోనే తెరపైకి రానుంది. ఆయన బయోపిక్‌ను రూపొందించనున్నట్టు ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్, ఆల్మైటీ మోషన్ పిక్చర్, కర్మ మీడియా ఎంటర్టైన్మెంట్లు శుక్రవారం ప్రకటించాయి. ఇన్వేస్టిగేటివ్ జర్నలిస్టులు రుక్మిణీ బీఆర్, ప్రోసెంజీత్ దత్తా రాసిన కాఫీ కింగ్ పుస్తకంగా ఆధారం ఆయన బయోపిక్ తెరకెక్కించబోతున్నట్లు స్పస్టం చేశారు. చదవండి: ఇంటింటికి సబ్బులు అమ్ముకుంటున్న స్టార్ నటి ఐశ్వర్య కాగా నిన్న సదరు నిర్మాణ సంస్థలు మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని తెలిపాయి. ఈ సందర్భంగా ‘కాఫీ మనందరి జీవితంలో భాగం చేసి వీజీ సిద్ధార్థ్ వ్యాపారవేత్తగా ఎన్నో విజయాలు సాధించారు. అలాంటి ఆయన ఆత్మహత్య చేసుకోవడం షాకింగ్ ఘటన. సక్సెస్ఫుల్ బిజినెస్మెన్ అయిన వీజీ సిద్ధార్థ్ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలు, ఒడిదుడుకులకు సంబంధించి లోతైన పరిశీలనతో రాసిన పుస్తకమే ‘కాఫీ కింగ్: ది స్వీఫ్ట్ రైజ్ అండ్ సడెన్ డేత్ ఆఫ్ కెఫె కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థ్’. ఇది వెండితెరపై ఆవిష్కరించాల్సిన కథ. చదవండి: Sai Pallavi: ఆ వీడియో బయటకు రావడంతో దారుణంగా ట్రోల్ చేశారు, ఇక అప్పడే.. అందుకే ఆయన బయోపిక్ హక్కులను తీసుకున్నాం. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటిస్తాం’ అని టీ-సీరిస్ చైర్మన్ భూషన్ కూమార్ తెలిపాడు. కెఫె కాఫీ డే ఫౌండర్‌గా వీజీ సిద్ధార్థ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఆనతి కాలంగో గొప్ప వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. అలాంటి వీజీ సిద్ధార్థ్ 2019 జూలైలో ఆకస్మాత్తుగా కర్ణాటకలోనే ఓ నది శవమై తేలారు. అప్పటికి ఆయనకు 59 ఏళ్లు. అయితే ఆయన ఆత్మహత్యకు కారణాలేంటో ఇప్పటికి తెలియదు. సిద్ధార్థ మరణాంతరం ఆయన భార్య మళవిక హెగ్డే కెఫె కాఫీ డే బాధ్యతలు చేపట్టారు. చదవండి: భర్త సిద్దార్థ్ కలలను నిజం చేస్తున్న కేఫ్ కాఫీ డే మాళవిక హెగ్డే..! -
భర్త సిద్దార్థ్ కలలను నిజం చేస్తున్న కేఫ్ కాఫీ డే మాళవిక హెగ్డే..!
మాళవిక హెగ్డే అనే పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ సతీమణిగా, కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ఎం కృష్ణ కూతురిగా మాత్రమే మాళవిక హెగ్డే సుపరిచితం. ఇది అంత గతం. ఇప్పుడు తన గురించి తెలిసిన వాళ్లు మాత్రం ఇక నుంచి ఆమెను ఎప్పటికీ మరిచిపోరు. ఇంకా చెప్పాలంటే.. ఇక నుంచి ఆమెను అందరూ ఒక ఆదర్శంగా తీసుకుంటారని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు ఆమె ఎవరో?.. ఆమె ఎందుకు ప్రత్యేకమో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2019 జులైలో కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆయన మరణం తర్వాత ఆయన భార్య మాళవిక హెగ్డే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. భర్త ఆత్మహత్య! దారి తెన్నూ లేని వ్యాపారాలు, వేల కోట్ల అప్పు.. ఇలాంటి సందర్భంలో మనకు ఏమనిపిస్తోంది? భయంతో ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ! ఈ రెండు కోణాలు మాళవికకు ఎదురయ్యాయి. కేఫ్ కాఫీ డే సీఈఓ మాళవిక హెగ్దే.. ఎన్ని కష్టాలు ఎదురైనా.. తను నిలబడి, ఉద్యోగులకు అండగా ఉంటూ సంస్థనూ ముందుకు నడుపుతున్నారు. కేఫ్ కాఫీ డే సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో అప్పుల్లో ఉన్న కంపెనీని మళ్లీ తిరిగి నిలబెట్టేందుకు, అప్పులను తగ్గించుకునేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు ఆమె చెప్పారు. కేవలం మాటలు మాత్రమే చెప్పలేదు చేసి చూపించారు. కాలం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు అనే దానికి ఈ విషయం ఒక ఉదాహరణ. కేఫ్ కాఫీ డే సీఈవో పదవి చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడంతో కంపెనీ అప్పులను సగానికి(రూ.7,200 కోట్ల నుంచి రూ.3,100 కోట్లుకు) తగ్గించేశారు. అలాగే, తన ఉద్యోగుల్లో విశ్వాసాన్ని నింపారు. పెట్టుబడుదారులకు భరోసా ఇచ్చారు. ఇప్పుడు కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే, తన భర్త సిద్ధార్థ్ విధికి తల వంచితే.. మాళవిక హెగ్డే మాత్రం విధిని ఎదిరించి బలంగా నిలబడ్డారు. భవిష్యత్ వ్యాపార ప్రణాళికల మీద మాళవిక ద ఎకనమిక్ టైమ్స్‌కు తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చారు. దీన్ని చదివితే ఆమె ఎంత స్పష్టతతో ఉన్నారో.. ఎంత నమ్మకంగా ఉన్నారో.. ఎంత పట్టుదలతో ఉన్నారో అర్థం అవుతుంది. కష్ట కాలంలో ఉద్యోగులు అండగా ఉన్నారని, బ్యాంకులు ఓపికతో వేచి చూశాయని తెలిపారు. కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని, భర్త కలల సాకారానికి పాటుపడతానని ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. (చదవండి: బంపర్ ఆఫర్..! సాఫ్ట్ వేర్ జాబ్‌కు రిజైన్ చేస్తే రూ.4లక్షలిస్తాం!!) -
కాఫీ డే సీఈఓగా మాళవిక హెగ్డే
బెంగళూరు: కెఫే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ సతీమణి మాళవిక హెగ్డే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు కాఫీ డే సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గతేడాది సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. ఆయన మరణం తర్వాత గతేడాది జూలైలో స్వతంత్ర బోర్డు సభ్యుడు ఎస్.వి. రంగనాథ్‌ని తాత్కలిక చైర్మన్‌గా నియమించారు. ఈ నేపథ్యంలో నిన్న ఆయన భార్య మాళవిక హెగ్డేని సీఈఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మాళవిక కర్నాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కుమార్తె. అప్పుల్లో ఉన్న కంపెనీని మళ్లీ తిరిగి నిలబెట్టేందుకు, అప్పులను తగ్గించుకునేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు ఆమె గతంలోనే చెప్పారు. కాగా కంపెనీ అదనపు డైరెక్టర్లుగా సీహెచ్ వసుంధరా దేవి, గిరి దేవనూర్, మోహన్ రాఘవేంద్ర కొండిలను నియమిస్తూ బోర్డు డైరెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ ముగ్గురూ 2025 డిసెంబర్ 31 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ల హోదాలో కొనసాగుతారు. 2019 జూలైలో వీజీ సిద్ధార్థ మృతి చెందగా.. ఆత్మహత్యే ఆయన మరణానికి కారణమని అంతా భావిస్తున్నారు. సిద్ధార్థ మరణించే సమయానికే కంపెనీకి అప్పుల భారం మొదలుకాగా... ఆయన చనిపోయిన నాటి నుంచి గత ఏడాదిగా అప్పులు తీర్చే ప్రయత్నాల్లో సీడీఈఎల్ తలమునకలవుతూ వస్తోంది. (చదవండి: కాఫీ డే వెండింగ్ వ్యాపారంపై టాటా కన్ను) బెంగళూరుకు చెందిన కెఫే కాఫీ డే భారతదేశం అంతటా వందలాది కాఫీ షాపులను నిర్వహిస్తోంది. ఇవి భారతదేశంలో వృద్ధి చెందుతున్న మనీడ్ క్లాస్ జనాల కోసం కాపుచీనో, లాట్స్‌ని అందుబాటులోకి తెచ్చాయి. కాఫీ డే.. స్టార్‌బక్స్ కార్ప్, బారిస్టా, కోకాకోలా కో యాజమాన్యంలోని కోస్టా కాఫీ వంటి వాటితో పోటీపడతుంది. ఈ క్రమంలో సిద్ధార్థ మరణం సంస్థ భవిష్యత్తును అనిశ్చితిలో పడేసింది. అతని మరణం గురించి వార్తలు వెలువడడంతో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ షేర్లు క్రాష్ అయ్యాయి. చివరికి ఫిబ్రవరి 3 నుంచి వాటి ట్రేడింగ్ నిలిపివేయబడింది. -
ఐశ్వర్య, అమర్త్య ఎంగేజ్మెంట్
సాక్షి, బెంగళూరు దివంగత కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ కుమారుడు, బీజేపీ నాయకుడు ఎస్.ఎం.కృష్ణ మనవడు అమర్త్య హెగ్డేతో కర్ణాటక మాజీ మంత్రి, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య (22) నిశ్చితార్థ వేడుక గురువారం పూర్తయింది. బెంగళూరులో జరిగిన ఈ కార్యక్రమంలో ఇరు కుటుంబాల సన్నిహితులు పాల్గొన్నారు. కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఈ కార్యక్రమానికి హాజరై కాబోయే జంటను ఆశీర్వదించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరలో వీరి వివాహం చేసేందుకు నిశ్చయించారు. చిన్ననాటి స్నేహితులైన సిద్ధార్థ, శివకుమార్ వియ్యమందాలని గతంలోనే భావించారు. అయితే అనూహ్యంగా సిద్దార్థ ఆత్మహత్య చేసుకోవడంతో ఇరు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. దీంతో వివాహాన్ని అనివార్యంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత కరోనా మహమ్మారి, లాక్డౌన్ ఆంక్షలు అడ్డొచ్చాయి. తాజాగా అన్ని అడ్డంకులను అధిగమించి అమర్త్య హెగ్డే - ఐశ్వర్య వివాహాన్ని ఖాయం చేసుకున్నారు. బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన సిద్ధార్థ కుమారుడు తల్లి మాళవికతో కలిసి తన తండ్రి వ్యాపారాలను చూసుకుంటున్నారు. అటు ఐశ్వర్య డీకే శివకుమార్ స్థాపించిన ఇంజనీరింగ్ కళాశాల గ్లోబల్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీని నిర్వహిస్తున్నారు. కాగా వీజీ సిద్దార్థ గత ఏడాది జూలై 2019 లో అదృశ్యమయ్యారు. తర్వాత కొద్ది రోజులకు నేత్రావతి నదిలో ఆయన మృతదేహం లభ్యమైంది. ఆర్థిక సమస్యలతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తేల్చిన సంగతి తెలిసిందే. .@CMofKarnataka @BSYBJP attended @INCIndia @KPCCPresident @DKShivakumar's daughter's engagement ceremony. pic.twitter.com/T0vrMfWcsa — Imran Khan (@keypadguerilla) November 19, 2020 -
కాఫీడే వెండింగ్ వ్యాపారంపై టాటా కన్ను
సాక్షి, ముంబై : కెఫే కాఫీ డే యజమాని సిద్ధార్థ సంచలన ఆత్మహత్య సంక్షోభంలో పడిన సంస్థ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.కాఫీడే కంపెనీకి చెందిన కాఫీ వెండింగ్ మెషిన్ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ యోచిస్తోంది. దీనికి సంబందించిన చర్చల అనంతరం, ఈ ప్రతిపాదనకు టాటా బోర్డు అనుమతినిచ్చినట్టు విశ్వసీనయ వర్గాల సమాచారం. కాఫీడే వెండింగ్ వ్యాపారం రూ. 2 వేల కోట్లు (271 మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా. భారతదేశపు అతిపెద్ద కాఫీ తయారీ సంస్థ కాఫీ డే, వ్యవస్థాపకుడు సిద్ధార్థ అనూహ్య మరణం తరువాత అప్పులు చెల్లించేందుకు కంపెనీతీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా సంస్థ ఆస్తులను విక్రయించడానికి సిద్ధపడుతోంది. అలాగే గతంలో కార్పొరేట్ బిజినెస్ పార్కును బ్లాక్‌స్టోన్ గ్రూప్ ఇంక్‌కు విక్రయించడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఇరు సంస్థలు అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
అమర్త్య హెగ్డేతో డీకేశీ కుమార్తె నిశ్చితార్థం
బెంగళూరు: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య.. కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు, దివంగత వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్య హెగ్డేను వివాహమాడనున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో సోమవారం వీరి నిశ్చితార్థం జరిగింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, వరుడి తాతయ్య ఎస్ఎం కృష్ణ నివాసంలో ఈ వేడకను నిర్వహించారు. కాగా డీకేశీ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్య (22) బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తండ్రి వ్యాపారాలను చూసుకుంటున్నారు. ఇక అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించిన అమర్త్య సైతం వ్యాపార రంగంలో కొనసాగుతున్నారు. కాగా 2019 జూలైలో అదృశ్యమైన కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ.. ఆ తర్వాత కొద్ది రోజులకు నేత్రావతి నదిలో శవమై కనిపించారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు.. ఆర్థిక ఇబ్బందులతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తేల్చారు. ఇక ప్రస్తుతం వారి వ్యాపారాలను సిద్ధార్థ భార్య మళవిక నిర్వహిస్తున్నారు. కాగా సిద్ధార్థ, శివకుమార్ కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉందని వారి సన్నిహితులు తెలిపారు. (వీజీ సిద్ధార్థ కుమారుడితో డీకే ఐశ్వర్య వివాహం!) -
కాఫీ డే సిద్ధార్థ కోడలిగా డీకేశి కుమార్తె!
సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్యను కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్య హెగ్డేకు ఇచ్చే వివాహం జరిపించాలని వారి కుటుంబ పెద్దలు నిర్ణయించారు. శివకుమార్ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్య (22) బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి తన తండ్రి వ్యాపారాలను చూసుకుంటున్నారు. ఇక అమెరికాలో ఉన్నత చదువులు అభ్యసించిన అమర్త్య సైతం వ్యాపారంలో కొనసాగుతున్నారు. కాగా వీరిద్దరి పెళ్లిపై చర్చించేందుకు గత ఆదివారం సిద్ధార్థ ఇంటికి డీకేశి కుటుంబ సభ్యులు వెళ్లినట్టు అయన సన్నిహితుల ద్వారా తెలిసింది. (‘కాఫీ కింగ్’ విషాదాంతం) ఇక ఐశ్యర్య-అమర్త్య వివాహంపై శివకుమార్ మాట్లాడుతూ.. సిద్ధార్థ ఉన్నప్పుడు వీరి వివాహానికి సంబంధించి ఓ సారి ప్రస్తావన వచ్చిందని చెప్పారు. జూలై 31 నాటికి ఆయన మృతి చెందిన ఏడాది పూర్తి అవుతుందని.. ఆ తరువాత పెళ్లి తేదీల నిర్ణయంపై స్పష్టత వస్తుందని తెలిపారు. సిద్ధార్థకు శివకుమార్ మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉన్నట్లు వారి సన్నిహితుల ద్వారా తెలిసింది. కాగా కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ 2019 జులైలో అదృశ్యమయ్యారు. తర్వాత కొద్ది రోజులకు నేత్రావతి నదిలో ఆయన మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. ఆర్థికసమస్యలతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తేల్చారు. ఆ తరువాత ఆయన వ్యాపారాలను సిద్ధార్థ బార్య మళవికా చూసుకుంటున్నారు. (ఐశ్వర్యను 7 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ) -
కాఫీ డే కేసు: వెలుగులోకి షాకింగ్ విషయాలు
బెంగళూరు: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ఏడాది జూలైలో ఆయన అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంతో కాఫీడే బోర్డు దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేఫ్ కాఫీ డే బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే దాదాపు రూ.2000 కోట్లకు సంబంధించి లెక్కలు తేలలేదని తెలుస్తోంది. దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని త్వరలోనే ఈ నివేదికను బయటపెట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా సిద్దార్థ ఆత్మహత్య తర్వాత ఆయన రాసినట్లు ఒక లేఖ బయటపడిన విషయం తెలిసిందే. చదవండి: సిద్ధార్థ అదృశ్యం : కొత్త ట్విస్ట్ 'అందులో ఓ పారిశ్రామిక వేత్తగా తాను విఫలమయ్యానని, కంపెనీ ప్రతి ఆర్థిక లావాదేవీకి తనదే బాధ్యత అని తెలిపారు. తాను నిర్వహించిన లావాదేవీల వివరాలు కాపీ డే బోర్డు, ఆడిటర్లు , సీనియర్ మేనేజ్మెంట్కు కూడా తెలియదని' అందులో పేర్కొన్నారు.తాజాగా కాఫీ డే బోర్డు జరిపిన దర్యాప్తులో వందల కొద్ది లావాదేవీలను కొన్ని నెలలపాటు దర్యాప్తు చేసిన అధికారులు పెద్ద మొత్తంలో తేడాలున్నట్లు గుర్తించారు. డజన్ల కొద్ది కంపెనీలపై విచారణ జరిపారు. కేఫ్ కాఫీ డే, వీజీ సిద్ధార్థకు చెందిన పర్సనల్ బిజినెస్ కంపెనీలకు మధ్య వందల కొద్ది ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు గుర్తించారు. వీటికి సంబంధించిన డ్రాఫ్ట్‌ను ఫైనలైజ్ చేస్తున్నారు. కాగా.. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ 2019 జులైలో అదృశ్యమయ్యారు. తర్వాత కొద్ది రోజులకు నేత్రావతి నదిలో ఆయన మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. చదవండి: సిద్ధార్థ ఆత్మహత్యకు కారణాలు ఏమిటీ? కాఫీ డే అప్పులు రూ. 5,200 కోట్లు!! -
ఆస్తుల విక్రయంతో రుణ భారం తగ్గింపు
న్యూఢిల్లీ: ఆస్తులను విక్రయించి రుణాలను తీర్చడం (డీలివరేజింగ్) ద్వారా లిక్విడిటీ మెరుగునకు కాఫీ డే ఎంటర్ ప్రైజెస్ చర్యలు చేపట్టింది. ఇటీవలే కాఫీ డే ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (సీడీఈఎల్) దీర్ఘకాలిక రేటింగ్‌ను ‘డి’ (ప్రతికూల దృక్పథానికి) ఇక్రా సంస్థ డౌన్ గ్రేడ్ చేసింది. అంతకుముందు వరకు బీబీ ప్లస్ నెగెటివ్ రేటింగ్ ఉండేది. రూ.315 కోట్ల దీర్ఘకాలిక రుణాలకు సంబంధించి ఈ రేటింగ్‌ను ఇచ్చింది. సీడీఈఎల్ ఫ్లాగ్షిప్ సబ్సిడరీ అయిన కాఫీ డే గ్లోబల్ లిమిటెడ్, సికాల్ గ్రూపు కంపెనీలకు సంబంధించి రుణ చెల్లింపులు ఆలస్యం అవడంతో రేటింగ్‌ను తగ్గించినట్టు స్వయంగా సీడీఈఎల్ స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ఆస్తులను విక్రయించి రుణాలను తీర్చడంతోపాటు, నిధుల లభ్యత పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్టు సికాల్ లాజిస్టిక్స్ శుక్రవారం ప్రకటించింది. ఈ కంపెనీకి రూ.1,488 కోట్ల రుణభారం ఉంది. దీనికి కాఫీ డే గ్రూపు ప్రమోటర్, ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న వీజీ సిద్ధార్థ వ్యక్తిగత హామీదారుగా ఉన్నారు. సికాల్ లాజిస్టిక్స్ పోర్ట్ టెర్మినళ్లు, ఫ్రైట్ స్టేషన్లలను నిర్వహిస్తోంది. సిద్ధార్థ ఆత్మహత్య తర్వాత... సీడీఈఎల్ తన రుణ భారాన్ని తగ్గించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించడాన్ని గమనించొచ్చు. ఇందులో భాగంగానే బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ టెక్నాలజీ పార్క్‌ను సుమారు రూ.3,000 కోట్లకు బ్లాక్‌స్టోన్ గ్రూపునకు విక్రయించేందుకు ఒప్పందం కూడా చేసుకుంది. -
కాపీ డే వీజీ సిద్దార్థ తండ్రి మృతి
సాక్షి, మైసూరు: కెఫే కాపీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్దార్థ తండ్రి గంగయ్య హెగ్డే ఆదివారం మృతి చెందారు. మైసూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లతో వీజీ సిద్ధార్థ ఈ ఏడాది ఆగస్ట్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మంగళూరుకి సమీపంలో ఉన్న నేత్రవతి బ్రిడ్జి వద్ద కారు దిగి ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్లిన ఆయన ఆ తర్వాత కనిపించలేదు. ఎంతకీ రాకపోవడంతో ఆందోళన చెందిన కారు డ్రైవర్.. కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయన కోసం తీవ్రంగా గాలించారు. చివరకు ఓ జాలరి ఇచ్చిన సమాచారంతో నేత్రానది వద్ద సిద్ధార్థ మృతదేహాన్ని కనుగొన్నారు. వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు ముందు ఆయన తన తండ్రి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి కొద్దిసేపు గడిపారు. మరోవైపు అనారోగ్య కారణాల నేపథ్యంలో గంగయ్య హెగ్డేకు కుమారుడు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని చెప్పకుండా కుటుంబసభ్యులు గోప్యంగా ఉంచారు. చదవండి: కాఫీ మొఘల్కు ఏమైంది? షేర్లు డీలా -
‘సాగు’ బాగుంటేనే ప్రగతి సాధ్యం
దేశంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సన్నకారు రైతులు గరిష్టంగా చేసిన రెండు లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తున్నందుకే మన ఆర్థికవేత్తలు, ఆర్థికరంగ సమర్థకులు ద్రవ్యలోటు చుక్కలంటుతుందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. కానీ మన బ్యాంకులు లక్షల కోట్ల మేరకు కార్పొరేట్ రుణాలను అలవోకగా మాఫీ చేసినప్పుడు వీరికి ద్రవ్యలోటు ప్రమాదం గుర్తుకురావడం లేదు. వ్యవసాయరంగ దుస్థితిని పట్టించుకోని మన విధాన నిర్ణేతలు ఒకటి, రెండు నెలలు కార్లు, ఆటోమైబైల్స్ అమ్మకాలు పడిపోయి, పరిశ్రమలు కొన్ని వేల ఉద్యోగాలకు కోతపెట్టగానే కొంపలంటుకుపోయినట్లు గావుకేకలు పెడుతున్నారు. వ్యవసాయరంగం నిత్య సంక్షోభంలో కూరుకుపోయినంతకాలం మన ఆర్థిక వ్యవస్థ కూడా నిత్య అనిశ్చిత పరిస్థితుల్లోనే కొనసాగుతుంది. దేశీయ డిమాండ్ పెరగాలంటే వ్యవసాయరంగంలో భారీ పెట్టుబడులు పెట్టాలి. కెఫే కాఫీ డే వ్యవస్థాపకుడు వీఎమ్ సిద్ధార్థ తన జీవితాన్ని ముగించుకుంటున్నట్లు ప్రకటించి ఆత్మహత్య చేసుకున్న కొద్ది రోజుల తర్వాత అయిదు మంది రైతులు మహారాష్ట్రలోని అకోలా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పురుగుమందు సేవించి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తమ భూమికి సత్వరం పరిహారం అందించాలన్నది వారి డిమాండు. సరిగ్గా అదేసమయంలో, హరియాణాలో నాలుగు నెలలుగా ధర్నా చేస్తున్న మరొక రైతు మరణించాడు. ఆ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తన భూమికి అధిక పరిహారం ఇవ్వాలని ఆ రైతు నిరసన తెలుపుతూ చనిపోయాడు. ఈ రైతుల మరణం, లేదా ఆత్మహత్యా ప్రయత్నం ప్రపంచం దృష్టికి రాలేదు కానీ కాఫీ కింగ్ విషాదమరణానికి దారితీసిన పరిస్థితుల గురించి పరిశ్రమవర్గాలు పెట్టిన గగ్గోలుకు మీడియా విపరీత ప్రచారం కల్పించింది. మన పారిశ్రామిక అధిపతుల్లో చాలామంది సిద్ధార్థ మృతిని పన్నుల రూపంలోని ఉగ్రవాదంతో ముడిపెట్టారు. తమకు మరిన్ని పెట్టుబడులు, పన్నురాయితీలు ఇవ్వాలని, పన్నుల బారి నుంచి స్వాతంత్య్రం కల్పించాలని పరిశ్రమవర్గాలు డిమాండు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కెఫే కాఫీ డే యజమాని దాదాపు రూ.11,000 కోట్ల భారీ రుణ ఊబిలో చిక్కుకుపోయారన్న విషయాన్ని విస్మరించి, పరిశ్రమ వర్గాల మనోభావాలను ప్రతిధ్వనింపచేయడంలో బిజినెస్ జర్నలిస్టులు మునిగిపోయారు. ఆర్థిక మందగమనంలో తాము నిలదొక్కుకోవడానికి ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీతోపాటు మరిన్ని రాయితీలను కల్పించాలని పరిశ్రమ వర్గాలు సహేతుకమైన ఆర్థిక కారణాలను చూపించవచ్చు. కానీ వ్యవసాయరంగంలో మృత్యుదేవత ప్రళయతాండవం గురించి ఎవరికీ పట్టింపు లేదు. రైతుల ఆత్మహత్యలపై మీడియా కనీసంగా ప్రస్తావించటం లేదు. ఒక వ్యాపారవేత్తగా సిద్ధార్థకు కష్టకాలంలో తగిన మద్దతు అవసరం కావచ్చు. అయితే రైతులు కూడా తమరంగంలో పారిశ్రామికులుగానే కార్యకలాపాలు సాగిస్తున్న వాస్తవాన్ని ఎవరూ గుర్తించడం లేదు. అందుకే మన దేశ రైతులు తమ కష్టాలను వ్యక్తిగతంగానే ఎదుర్కొంటూ నష్టపోతున్నారు. తమ నష్టాలకు తగిన పరిహారం లభించే హక్కును సకాలంలో పొందగలిగినట్లయితే, దేశీయరైతులు కూడా తమ వ్యవసాయ రంగ వ్యాపార సామర్థ్యాన్ని నిరూపించుకోగలరు. కానీ అలాంటి అవకాశాన్నే తోసిపుచ్చడం అంటే ఆ అవకాశాన్ని రైతులు కోల్పోవడమనే అర్థం. ప్రతి ఏటా మన పరిశ్రమ వర్గాలు రూ.1.8 లక్షల కోట్ల మేరకు ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని పొందుతూనే ఉన్నాయి. 2008–09లో ప్రపంచ ఆర్థికరంగం కుప్పగూలినప్పటినుంచి జాతీయ బ్యాంకులు పరిశ్రమకు 17 లక్షల కోట్ల రూపాయల భారీ రుణాలను అందించాయి. దీనిలో రూ.10 లక్షల కోట్లు నిరర్థక ఆస్తులుగా మిగిలిపోయాయి. మన పారిశ్రామిక రంగం గత 10 సంవత్సరాల్లో ఆర్థిక ప్యాకేజీ కింద రు. 18 లక్షల కోట్లను అందుకుంది. కానీ ఇప్పటికీ పారిశ్రామిక రంగం తీవ్రమైన సంక్షోభంలో కొనసాగుతోంది. పైగా, 2007 నుంచి 2019 వరకు గత 12 ఏళ్లలో బ్యాంకులు దాదాపు రూ. 8.36 లక్షల కోట్ల మొండిబకాయిలను రద్దు చేసినట్లు ఆర్బీఐ నివేదికను మీడియా ప్రస్తావిస్తుంది. పరిశ్రమ, వస్తూత్పత్తి రంగం, ఎగుమతుల రంగం పనితీరు దిగజారిపోవడానికి ఆర్థిక మందగమనమే కారణమా లేక బ్యాంకులు భారీస్థాయిలో దివాలా ఎత్తడమే అసలు కారణమా అని తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. దేశీయబ్యాంకులు 2007–2016 మధ్యకాలంలో మొత్తం రూ. 2.88 లక్షల కోట్ల మేరకు మొండిబకాయిలను రద్దు చేశాయి. అయితే 2016–17లో 1.33 లక్షల కోట్లను, 2017–18లో 1.61 లక్షల కోట్లను మాఫీ చేసిన బ్యాంకులు 2018–19 సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 2.54 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశాయి. బ్యాంకులు పూర్తిగా ఒట్టిపోవడానికి ప్రధాన కారణం.. ఇంత భారీ మొత్తాన్ని మూడేళ్లకాలంలోనే మాఫీ చేయడమే. కారణాలు ఏవైనా కావచ్చు.. దేశంలో ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టిన 9 వేలమంది డిఫాల్టర్ల పేర్లను బహిరంగపర్చాలని ఆర్బీఐ పట్టుపడుతోంది. మొండి బకాయిలు ఇంకా అధికంగా ఉన్నాయనడానికి ఇది నికార్సైన సంకేతం. కేంద్రప్రభుత్వం ఇప్పటికే బ్యాంకుల ప్రక్షాళన ప్రక్రియను ప్రారంభించడంపై పట్టుదలతో ఉంటున్నప్పటికీ, రుణం చెల్లింపు అశక్తత, దివాలా కోడ్ (ఐబీసీ)ని 2016లో ప్రవేశపెట్టింది. మొండిబకాయిల ఉపద్రవాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ప్రదర్శిస్తున్న బలమైన వైఖరికి ఇది నిదర్శనం. ప్రతిసంవత్సరం పరిశ్రమవర్గాలు భారీ పన్ను రాయితీలను అందుకుంటున్న సమయంలో పన్నుల అధికారులు తమ తలుపు తడితే మాత్రం పరిశ్రమవర్గాలు విలపించడం సమర్థనీయం కాదు. మన వ్యవస్థ రైతుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నదో ఇప్పుడు మనం పరిశ్రమల రంగంతో పోల్చి చూద్దాం. బ్యాంకులకు రుణాలను చెల్లించలేకపోయారన్న కారణంతో పలు సంవత్సరాలుగా దేశంలో వందలాది మంది రైతులను బహిరంగంగా అవమానాల పాలు చేశారు. జైళ్లలో పెట్టారు. పరిశ్రమల రంగానికి లక్షలాది కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తుండగా, ఒక్కటంటే ఒక్క నెల బకాయిని చెల్లించలేకపోయిన రైతులను జైళ్లలోకి నెడుతున్నారు. అలాంటి రైతుల స్థిరాస్తి, చరాస్తిని బ్యాంకు తక్షణం స్వాధీనం చేసుకోవడమే కాదు.. రైతులు తాము చెల్లించాల్సిన అసలు మొత్తాన్ని చెల్లించలేని సందర్భాల్లో, వారికి రుణాన్ని మంజూరు చేసే సమయంలో రైతులనుంచి తీసుకున్న సంతకం చేసిన ఖాళీ చెక్కును బ్యాంకు తానే డిపాజిట్ చేసి, అవి చెల్లనప్పుడు ఈ సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చి వేధిస్తున్నాయి. తర్వాత అలాంటి రైతులను జైలుకు పంపుతున్నారు. తాము తీసుకున్న రుణాన్ని అసలు, వడ్డీతో సహా తీర్చివేయాలని కోర్టులు రైతులను ఆదేశిస్తున్నాయి కూడా. వాస్తవానికి ఈ దేశంలో క్రమం తప్పకుండా నెలవారీ రుణ చెల్లింపులను చేయగలుగుతున్నది రైతులు మాత్రమే కాగా, ఇలాంటి వారిపైనా డిఫాల్టర్లుగా ఎందుకు ముద్ర వేస్తున్నారో నాకు అసలు అర్థంకాదు. దేశంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సన్నకారు రైతులు గరిష్టంగా చేసిన రెండు లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తున్నందుకే మన ఆర్థికవేత్తలు, ఆర్థికరంగ సమర్థకులు ఈ రుణమాఫీతో ద్రవ్యలోటు ఆకాశానికి అంటుతుందంటూ గావుకేకలు పెడుతున్నారు. కానీ ఇదే బ్యాంకులు లక్షల కోట్ల మేరకు కార్పొరేట్ రుణాలను అలవోకగా మాఫీ చేసినప్పుడు ఇదే ఆర్థికవేత్తలకు ద్రవ్యలోటు ప్రమాదం అసలు గుర్తుకురావడం లేదు. అనేక సంవత్సరాలుగా భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంతో ఉందని పలు ప్రగతి సూచికలు తెలుపుతూనే ఉన్నాయి. వ్యవసాయరంగ రాబడులు గత 15 ఏళ్లలో అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. చివరకు గ్రామీణ రంగ ఉపాధి కూడా ఘోరంగా దెబ్బతిందని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. వీటి ప్రకారం 2011–2018 మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతంలో 3.2 కోట్లమంది రోజుకూలీలు పని కోల్పోయారు. వీరిలో 3 కోట్లమంది వ్యవసాయరంగ కార్మికులున్నారు. కానీ అతిపెద్ద విషాదమేమిటంటే, ముంచుకొస్తున్న వ్యవసాయరంగ దుస్థితి గురించిన తీవ్ర హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని మన విధాన నిర్ణేతలు ఒకటి, రెండు నెలలు కార్లు, ఆటోమొబైల్స్ అమ్మకాలు పడిపోయి పారిశ్రామికరంగంలో కొన్ని వేల ఉద్యోగాలకు కోతపెట్టగానే గావుకేకలు పెడుతున్నారు. వ్యవసాయరంగం నిరంతర సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నంతవరకు మన ఆర్థిక వ్యవస్థ కూడా అనిశ్చిత పరిస్థితుల్లోనే కొనసాగుతుంది. వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ వినియోగం పెరుగుదలపైనే ఆధారపడుతుంది. వినియోగం అనేది ఎంత డిమాండును సృష్టిస్తాం అన్న అంశంపై ఆధారపడుతుంది. దేశీయ డిమాండును పెంచడంలో గ్రామీణ రంగమే అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తోందన్నది అందరూ అర్థం చేసుకోవాలి. దీనికి రాబోయే సంవత్సరాల్లో వ్యవసాయరంగంలో మరిన్ని పెట్టుబడులు అవసరం అవుతాయి. అంటే పరిశ్రమలను మరింతగా ప్రైవేటీకరించడం, మరిన్ని ఉద్దీపన ప్యాకేజీలను ఇవ్వడం నుంచి ప్రభుత్వం తన దృష్టిని వ్యవసాయరంగం వైపు మళ్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.దేశీయ శ్రామికశక్తిలో దాదాపు 50 శాతాన్ని కలిగి ఉన్న వ్యవసాయరంగానికి ప్రభుత్వ మదుపులకు సంబంధించి జీడీపీలో అర్ధ శాతం కంటే తక్కువ కేటాయించడమే మన రైతుల దుస్థితికి అసలు కారణం. కోట్లాది మందికి బతుకునివ్వగల వ్యవసాయ రంగానికి మరింతగా పెట్టుబడులను కేటాయించడం, ఈ క్రమంలో మరింత దేశీయ డిమాండును సృష్టించడమే దీనికి పరిష్కారం. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
కాఫీ డేకు భారీ ఊరట
సాక్షి, ముంబై : కెఫే కాఫీడే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య అనంతరం భారీగా నష్టపోయిన కాఫీ డే షేర్లు సోమవారం భారీగా పుంజుకున్నాయి. ఒకవైపు రుణ భారాన్ని తగ్గించుకోనే చర్యలు, మరోపక్క పానీయాల గ్లోబల్ కంపెనీ కోక కోలా వాటాను కొనుగోలు చేయవచ్చన్న అంచనాల నేపథ్యంలో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ కౌంటర్లో జోష్ నెలకొంది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో 5 శాతానికిపైగా లాభపడి రూ. 65.80 వద్ద అప్పర్ సర్క్యూట్ అయింది. సిద్ధార్థ అదృశ్యం, మరణానంతరం షేరు ధర మూడువారాల్లో (జులై 26 నుంచి) 68 శాతం పతనమైంది. పానీయాల రిటైల్ స్టోర్ల కంపెనీ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ రూ. 2,400 కోట్ల రుణాలను తిరిగి చెల్లించనున్నట్లు తాజాగా వెల్లడించింది. దీంతో గ్రూప్ రుణ భారం ఆమేర తగ్గనునందని వివరించింది. జులై చివరికల్లా గ్రూప్ రుణభారం రూ.4970 కోట్లుగా నమోదైనట్లు తెలియజేసింది. దీనిలో కాఫీడే రుణభారాన్ని రూ.3472 కోట్లుగా పేర్కొంది. ప్రధానంగా బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ పార్క్‌ను పీఈదిగ్గజం బ్లాక్‌స్టోన్‌కు విక్రయించడం ద్వారా ఈ రుణభారాన్ని తగ్గించుకోనున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోపక్క కంపెనీలో వాటాను విక్రయించేందుకు గ్లోబల్ దిగ్గజం కోక కోలాతో కాఫీ డేలో తిరిగి చర్చలు ప్రారంభించినట్లు మీడియా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ అంశంపై రెండు కంపెనీలూ అధికారికంగా స్పందించాల్సి వుంది. -
సిద్దార్థ శవ పరీక్ష నివేదిక మరింత ఆలస్యం
సాక్షి, బెంగళూరు : కన్నడ ప్రముఖ వ్యాపార వేత్త, కెఫె కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు సంబంధించిన శవ పరీక్షల నివేదిక రావడానికి మరింత ఆలస్యమవుతుందని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి నివేదిక రావడానికి రెండు నెలలకు పైగా సమయం పడుతుందని, ల్యాబ్ నివేదిక వచ్చిన తరువాత అది హత్య లేక ఆత్మహత్య తేలుతుందన్నారు. అయితే సిద్ధార్థ నీటిలో పడి ఊపిరి ఆడక మృతి చెందాడని ప్రాథమిక నివేదిక వచ్చిందని తెలిపారు. కాగా గత సోమవారం నేత్రావతి నది వద్ద అదృశ్యమైన వీజీ సిద్ధార్థ్ మృతదేహం బుధవారం ఉదయం సమీపంలోని నదీ జలాల్లో లభ్యమైన విషయం తెలిసిందే. మరోవైపు సిద్ధార్థ అనుమానస్పద మృతిపై మంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐటీ వేధింపులే కారణం ‘కెఫె కాఫీ డే యజమాని సిద్ధార్థ ఆత్మహత్యకు ముఖ్య కారణం ఐటీ అధికారుల వేధింపులే. ఐటీ శాఖ రిటైర్డు ఉన్నతాధికారి బాలకృష్ణను తక్షణమే అరెస్ట్ చేసి ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేయాలి’ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకాశ్ రాథోడ్ డిమాండ్ చేశారు. సిద్ధార్థ తన ఇబ్బందులపై లేఖలో రాశారని, ఇబ్బందులకు కారణమైన ఐటీ శాఖ అధికారులను తక్షణమే అరెస్ట్ చేసి వారిని చట్టపరంగా శిక్షించాలని ఆయన అన్నారు. -
సిద్ధార్థ ఆ సమయంలో ఎవరితో మాట్లాడారు?
కర్ణాటక ,బొమ్మనహళ్లి : కాఫీ కింగ్, కేఫ్ కాఫీడే అధినేత, మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్యపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇప్పటికే పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దేశ విదేశాల్లో సైతం వ్యాపారం చేస్తున్న సిద్ధార్థ తన వ్యాపారం కోసం పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నట్లు పోలీసులకు తెలిసింది. దీంతో అప్పలు తీర్చడం కోసం అనేక ఇబ్బందులు పడ్డారని, అప్పులు తీర్చే మార్గం కానరాక ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నారా అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. గత కొంతకాలంగా ఓ అధికారి సిద్ధార్థను తీవ్రంగా వేధించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన వేధింపులు తాళలేకనే సిద్ధార్థ ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృదు స్వభావిగా పేరున్న సిద్ధార్థ షేర్ మార్కెట్లో రోజు రోజుకు తన కంపెనీ షేర్లు పడిపోవడంతో ఆయన కొంతమేర ఆందోళన పడ్డారని, అప్పులు పెరిగిపోవడం, మరొవైపు వేధింపులు ఆయనను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయని సిబ్బంది భావిస్తున్నారు. గత సోమవారం ఉదయం బెంగళూరు నుంచి మంగళూరు వైపు వెళ్లిన సిద్ధార్థ ఆ సమయంలో ఎవరితో మాట్లాడారు, ఆ మొబైల్ నెంబర్ల ఆధారంగా విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సిద్ధార్థ పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత అది హత్య, లేక ఆత్మహత్య అనే విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. చేతనహళ్లిలో కమ్ముకున్న విషాద ఛాయలు కాఫీ కింగ్ వీజీ సిద్ధార్థ మరణించి మూడు రోజులు గడచినా కూడా ఆయన స్వగ్రామం అయిన చేతనహళ్లిలో స్థానికులు ఆయనను మరిచిపోలేకున్నారు. సిద్ధార్థ తిథి కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ భార్య మాళవిక, కుమారులు అమర్థ్య, ఇషాన్ ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మరో పక్క సిద్ధార్థకు చెందిన ఎస్టేట్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, కార్మికులు సైతం తిథి కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ యజమానిని తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు. -
‘కాఫీ డే’ల్లో మధురస్మృతులు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా దాదాపు 200 అవుట్లెట్లు కలిగిన ‘కేఫ్ కాఫీ డే ’ వ్యవస్థాపకులు సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న విషాదాంత నేపథ్యంలో ‘కేఫ్ కాఫీ డే’లతో ప్రత్యక్ష అనుబంధం కలిగిన పలు వర్గాల భారతీయులు వాటితో పెనవేసుకున్న తమ మధురానుభూతులను సోషల్ మీడియా సాక్షిగా నెమరేసుకుంటున్నారు. వ్యాపార వర్గాలతోపాటు కాలేజీ యువతీ యువకులకు ఈ కాఫీ డేలతో ఎంతో అనుబంధం మిగిలి ఉంది. వ్యాపార రంగానికి చెందిన పలువురు పారిశ్రామిక వేత్తలు వీటిల్లో కూర్చుని కాఫీలు సేవిస్తూ వ్యాపార లావాదేవీలు నిర్వహించడంతోపాటు పలు భారీ ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ముఖ్యంగా ఐటీ రంగానికి చెందిన యువతీ యువకుల మధ్య ఎక్కువ డేటింగ్లు మొదలయిందీ ఈ కాఫీ డేల నుంచే. చల్లటి సమయాల్లో వేడి వేడిగా దొరికే ఎక్స్‌ప్రెస్సో, కప్పూసినో, లట్టే, రోజ్ కారమెల్లర్, చకోలేట్ మొచే కాఫీలు సేవిస్తూ, అదే హాట్ హాట్ వెదర్లో చల్లటి ట్రాపికల్ ఐస్‌బెర్గ్, కూల్ ఎస్కినో, చోకో ఫ్రెప్పీ, కాపీ నిర్వహణ లాంటి రకాల కాఫీల రుచులను ఆస్వాదిస్తూ ఊసులాడుకున్న కబుర్లను వారు నేడు షేర్ చేసుకుంటున్నారు. మానస వెంకటేష్ లాంటి వాళ్లు నాటి డేటింగ్ రోజులను గుర్తు చేస్తూ అందుకు అవకాశం కల్పించి నేడు మధ్య లేకుండా పోయిన సిద్ధార్థకు నివాళులు కూడా అర్పిస్తున్నారు. హైదరాబాద్ పట్టణానికి వచ్చి పారిశుద్ధ్యం సరిగ్గాలేని టాయ్లెట్లకు వెళ్లలేక సతమతమవుతున్న తన లాంటి మహిళలకు ఈ కాఫీ డేలు ఎంతగానో ఉపయోగపడ్డాయని సుభా జే రావు లాంటి వాళ్లు ట్వీట్లు చేస్తున్నారు. దేశంలో సరికొత్త కాఫీ విప్లవాన్ని తీసుకొచ్చిన కాఫీ డేలకు తాము పది, పన్నెండేళ్ల క్రితం తరచుగా వెళ్లే వాళ్లమని, అప్పుడు ఏ కాఫీ అయినా 40 రూపాయలు ఉండేదని, ఇప్పుడు సమోసా కూడా 55 రూపాయలకు తక్కువకు దొరకడం లేదని ఐటీ రంగాన్ని కవర్ చేస్తూ వచ్చిన ఓ రిపోర్టర్ చెప్పారు. బెంగళూరులోని ఓ కాఫీ డేలో తన సమక్షంలోనే ఓ భారతీయ టాక్సీల కంపెనీ, మరో క్యాబ్ కంపెనీలో విలీనమయ్యే ఒప్పందాన్ని చేసుకుందని ఆయన తెలిపారు. ఇలా చెప్పుకుంటూ పోతే ‘కాఫీ డే’లతో అనుబంధాలు ఎన్నో ఉన్నాయి. -
‘కేఫ్ కాఫీ డే’లో మరో కొత్త కోణం
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ కాఫీ సంస్కృతిలో కొత్త విప్లవానికి వాకిటి తెరచిన ‘కేఫ్ కాఫీ డే’ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఆయన కాఫీ డేలకు సంబంధించి రోజుకొక సామాజిక కోణం వెలుగులోకి వస్తోంది. కాఫీ డే ప్రతి స్టోర్‌లో రకరకాల కాఫీలు కలిపే నిపుణుల్లో ఎక్కువ మంది మూగ, చెవుడు వాళ్లేనట. వాళ్లకే రకరకాల కాఫీల సువాసనలు సులభంగా పసిగట్టే సామర్థ్యం ఉంటుందట. అంతేకాకుండా వారు రుచులను కూడా సరిగ్గా గుర్తించగలరట. ఇలాంటి వాళ్లను కార్పొరేట్ రంగం సాధారంగా పనిలోకి తీసుకోదు. ఒక్క కాఫీ కేఫ్‌ల రంగంలోనే అలాంటి వారికి ఎక్కువ ప్రాధాన్యత లభించింది. సమాజంలో అంతగా ఆదరణలేని మూగ, చెవిటి వాళ్లను తీసుకోవడం ద్వారా కొంత సామాజిక బాధ్యతను నిర్వర్తించినట్లు ఉండడమే కాకుండా సువాసనలను సులభంగా పసిగట్టే వారి నైపుణ్యం కేఫ్‌లకు ఉపయోగపడుతుందని, ఆ ఉద్దేశంతోనే అలా ఎక్కువ మందిని తీసుకున్నట్లు మార్కెటింగ్ ప్రెసిడెంట్ రామకృష్ణన్ తెలిపారు. ఇలా మూగ, చెవిటి వాళ్లను తీసుకోవడం ఒక్క ‘కేఫ్ కాఫీ డే’లకే పరిమితం కాలేదు. కేఎఫ్సీలోని ‘కాఫీ కోస్టా’ అవుట్లెట్లకు కూడా విస్తరించింది. వాటిల్లో ఒక్క కాఫీలను తయారు చేసే నిపుణులే కాకుండా కాఫీలను, స్నాక్స్‌ను సరఫరా చేసే వాళ్లలో కూడా ఎక్కువ మంది మూగ, చెవిటి వాళ్లేనట. వాళ్లంతా సైగలతోనే మాట్లాడుకుంటారట. వారు పరస్పరం నోరు విప్పు మాట్లాడుకోవడానికి అవకాశం లేకపోవడం వల్ల కాఫీ హౌజ్‌లు నిశ్శబ్దంగా ఉంటాయట, అలాంటి నిశ్శబ్ద ప్రశాంత వాతావరణాన్ని కోరుకునే ఎక్కువ మంది వినియోగదారులు వస్తారని, ఒక్క బెంగళూరులోని తమ ‘కాఫీ కోస్టా’ అవుట్ లెట్లలో దాదాపు 200 మంది మూగ, చెవిటి వాళ్లు పనిచేస్తున్నారని ఓ అవుట్లెట్ మేనేజర్ వివరించారు. చెవిటి సిబ్బంది వినియోగదారుల నుంచి ఆర్డర్లు కాగితంపై రాయించి తీసుకుంటారని ఆయన తెలిపారు. అయితే మేనేజర్ మాత్రం మూగ, చెవుడు కాకపోవడమే కాకుండా మూగ భాష కూడా రావాలని ఆయన చెప్పారు. స్టార్‌బక్ కాఫీ హౌజుల్లో కూడా ఎక్కువ మంది చెవిటి వాళ్లే పనిచేస్తున్నారని తెల్సింది. ఆ కంపెనీ వ్యవస్థాపకుడు డీసీ స్టార్‌బక్స్ అమెరికా రాజధాని వాషింగ్టన్లో తన తొలి స్టోర్‌ను ప్రారంభించినప్పుడు కూడా చెవిటి వాళ్లనే ఎక్కువగా తీసుకున్నారట. మూగ, చెవిటి వాళ్లను తీసుకోవడానికి ఈ కార్పొరెట్ కాఫీ సంస్థలు రెండు కారణాలే చెబుతున్నాయిగానీ మూడో కారణం కూడా ఉందని మనం ఊహించవచ్చు. చెవిటి వాళ్లు కాస్త తక్కువ వేతనాలకు దొరకుతారన్న విషయం తెల్సిందే. -
సిద్ధార్థ మరణంపై దర్యాప్తు వేగిరం, పోలీస్ కమిషనర్ బదిలీ
సాక్షి, బెంగళూరు: కాఫీ డే కింగ్ వీజీ సిద్ధార్థ మరణంపై దర్యాప్తు చేసేందుకు పోలీసు బృందం రంగంలోకి దిగింది. మిస్టరీగా మారిన సిద్ధార్థ మృతిపై దర్యాప్తును కోదండరాం నేతృత్వంలోని దర్యాప్తు బృందం ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన అధికారులు తాజాగా కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్( సీఎఫ్ఓ)తో పాటు మరికొంతమందిని విచారించినున్నారు. జపాన్‌లోని టోక్యోలో ఉన్న సీఎఫ్ఓ, ఇతర అధికారులకు పోలీసులు ఇప్పటికే ఈ మెయిల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో కీలక మైన పోస్ట్‌మార్టం నివేదిక ఈ రోజు వెల్లడయ్యే అవకాశం ఉంది. కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ మరణంపై దర్యాప్తునకు పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు మంగళూరు పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ గురువారం వెల్లడించారు. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (మంగళూరు సౌత్ సబ్ డివిజన్) టీ కోదండరాం ఈ బృందానికి నాయకత్వం వహించనున్నారు. అలాగే మరణం ఎలా జరిగిందో స్పష్టం చేసే కీలకమైన పోస్ట్‌మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఇప్పటికే బృందం సంస్థ ఎగ్జిక్యూటివ్‌లను, ఉద్యోగులను ప్రశ్నించి చాలా సమాచారం సేకరించిందని తెలిపారు. రాబోయే రోజుల్లో మరికొంత మందిని కూడా ప్రశ్నిస్తామని ఆయన చెప్పారు. సిద్ధార్థకు చెందిన రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామనీ, వీటిని పోలీసులు విశ్లేషిస్తున్నారని పాటిల్ చెప్పారు. ఇది ఇలా ఉంటే పోలీస్ కమీషనర్ (క్రైమ్)సందీప్ పాటిల్‌ను బెంగళూరుకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం ఆదేశాలు జారి చేసింది. ఈయన స్థానంలో మైసూరు ఇంటిలిజెన్స్ డిఐజీగా ఉన్న డా. సుబ్రహ్మణ్యేశ్వర రావును కొత్త పోలీసు కమిషనర్‌గా నియమించింది. అలాగే మంగళూరు నగర డిప్యూటీ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) హనుమంతరాయను కూడా దావణగెరే పోలీసు సూపరింటెండెంట్‌గా బదిలీ చేసింది. 2004 బ్యాచ్‌కు చెందిన సందీప్ పాటిల్‌ను పాటిల్ ఫిబ్రవరి 21న మంగళూరు కమిషనర్‌గా నియమించింది. ఐదు నెలలు ఇక్కడ పనిచేసిన పాటిల్ ను బెంగళూరు జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైమ్) గా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. 2002 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సుబ్రహ్మణ్యేశ్వరావు బెంగళూరులోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో ఐదేళ్లపాటు పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేశారు. కాగా సిద్ధార్ధ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో అన్నికోణాల్లో సమగ్ర దర్యాప్తు సాగించాలని పోలీసులు భావిస్తున్నారు. ఐటీ అధికారుల వేధింపులతో విసిగిపోయాననీ, తన తప్పులకు తానే బాధ్యుడనని, క్షమించాలని పేర్కొంటూ లేఖరాసి సిద్ధార్ధ కనిపించకుండా పోవడం, 36 గంటల తరువాత నేత్రావతి నదిలో ఆయన మృతదేహం లభించడం తదితర పరిణామాలు తెలిసినవే. Karnataka: Mangaluru Commissioner of Police Sandeep Patil has been transferred. Dr. Subramanyeshara Rao to be the new Commissioner — ANI (@ANI) August 2, 2019 -
కాఫీ డే అప్పులు రూ. 5,200 కోట్లు!!
న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లతో కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ అకాల మరణం నేపథ్యంలో ఆయన గ్రూప్ సంస్థల రుణ భారం చర్చనీయాంశంగా మారింది. సిద్ధార్థతో పాటు ఆయనకు చెందిన పలు సంస్థలు .. వివిధ ఆర్థిక సంస్థలు మొదలుకుని బ్యాంకుల దాకా చాలా చోట్ల నుంచి ఎంత దొరికితే అంత అన్నట్లుగా రుణాలు సమీకరించాయి. అత్యంత తక్కువగా రూ. 1 లక్ష నుంచి అనేక కోట్ల దాకా తీసుకున్నాయి. స్టాక్ ఎక్సే్చంజీలు, కార్పొరేట్ వ్యవహారాల శాఖకు ఆయా సంస్థలు దాఖలు చేసిన ఫైలింగ్స్ ద్వారా ఈ వివరాలు ఒక్కొక్కటిగా బైటికొస్తున్నాయి. బీఎస్ఈలో లిస్టయిన కాఫీ డే ఎంటర్ప్రైజెస్ (సీడీఈఎల్) రుణభారం 2019 మార్చి 31 నాటికి రూ. 5,251 కోట్లుగా ఉంది. ఇది గతేడాది మార్చి ఆఖరున ఉన్న రూ. 2,457 కోట్లతో పోలిస్తే ఏకంగా రెట్టింపు కావడం గమనార్హం. ఇక సీడీఈఎల్ ప్రమోటర్ కంపెనీలు దేవదర్శిని ఇన్ఫో టెక్నాలజీస్, కాఫీ డే కన్సాలిడేషన్స్, గొనిబేడు కాఫీ ఎస్టేట్స్, సివన్ సెక్యూరిటీస్ మొదలైనవి కూడా పలు దఫాలుగా పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నాయి. సోమవారం అదృశ్యమైన సిద్ధార్థ.. బుధవారం నేత్రావతి నదిలో శవంగా తేలిన సంగతి తెలిసిందే. తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోలేకపోతున్నానంటూ అదృశ్యం కావడానికి ముందు ఆయన రాసినట్లుగా భావిస్తున్న ఒక లేఖలోని అంశాలు సిద్ధార్థ ఆర్థిక సమస్యల వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ)కు ఆయన సంస్థలు దాఖలు చేసిన ఫైలింగ్స్‌లోని విషయాలు బైటికి వస్తున్నాయి. వీటిని బట్టి చూస్తే.. ► టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీస్, క్లిక్స్ క్యాపిటల్ సర్వీసెస్ (గతంలో జీఈ మనీ ఫైనాన్స్ సర్వీసెస్), షాపూర్జీ పల్లోంజీ ఫైనాన్స్ (ఎస్పీఎఫ్) వంటి సంస్థల నుంచి కూడా సిద్ధార్థ రుణాలు తీసుకున్నారు. ఇందులో టాంగ్లిన్ డెవలప్మెంట్స్ అనే అనుబంధ సంస్థకు ఎస్పీఎఫ్ రూ. 12 కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకరించినట్లు 2018 ఏప్రిల్‌లో ఎంసీఏకు సమర్పించిన ఫైలింగ్‌లో ఉంది. ► ఇక మరో ఫైలింగ్‌లో కాఫీ డే హోటల్స్ అండ్ రిసార్ట్స్‌కు ‘రూ. లక్ష దాకా టర్మ్ రుణ సదుపాయం కల్పించేందుకు‘ క్లిక్స్ క్యాపిటల్ అంగీకరించిన డీల్ గురించిన ప్రస్తావన ఉంది. ► సిద్ధార్థకు చెందిన అన్‌లిస్టెడ్ కంపెనీలు (ఆతిథ్య, రియల్టీ రంగాలవి) ఎంత మేర రుణాలు తీసుకున్నాయన్నది ఇంకా ఇథమిథ్థంగా తెలియనప్పటికీ.. వీటి అప్పుల భారం కూడా సీడీఈఎల్ స్థాయిలోనే ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ► 2017 తర్వాత సిద్ధార్థ రుణాల పరిమాణం గణనీయంగా పెరిగింది. అయితే, గడువులోగా వీటిలో ఎన్ని రుణాలను చెల్లించారు, ఇంకా ఎన్ని ఉన్నాయి, ఎన్ని మొండిబాకీలుగా మారా యన్నది ఇంకా పూర్తిగా తెలియాల్సి వుంది. ► ఎంసీఏ డేటా ప్రకారం 2018 మార్చి ఆఖరు నాటికి కాఫీ డే కన్సాలిడేషన్స్ స్వల్పకాలిక రుణాలు, తక్షణం జరపాల్సిన చెల్లింపుల పరిమాణం రూ. 36.53 కోట్లుగా ఉన్నాయి. ► వీజీ సిద్ధార్థ, సీడీఈఎల్ ప్రమోటర్ గ్రూప్ సంస్థలు తమ వద్ద ఉన్న షేర్లలో మూడొంతుల షేర్లను తనఖా పెట్టాయి. ఇటీవలే రెణ్నెల్ల క్రితం జూన్‌లో కూడా సిద్ధార్థ కొన్ని షేర్లను అదనంగా తనఖా పెట్టారు. జూన్ ఆఖరు నాటికి సీడీఈఎల్‌లో సిద్ధార్థకు 32.7 శాతం, ఆయన భార్య మాళవిక హెగ్డేకు 4.05 శాతం, నాలుగు ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు 17 శాతం మేర వాటాలు ఉండేవి. ► ప్రమోటింగ్ సంస్థలు తమ మొత్తం హోల్డింగ్‌లో 75.7 శాతం (సుమారు 8.62 కోట్ల షేర్లు) తనఖాలో ఉంచాయి. జూన్ ఆఖర్లో కూడా సిద్ధార్థ కొత్తగా మరో 1.39 శాతం (29.2 లక్షల షేర్లు) తనఖా పెట్టారు. గ్రూప్ కంపెనీలు కోటక్ మహీంద్రా ఇన్వెస్ట్మెంట్స్ నుంచి తీసుకున్న రుణాలకు పూచీకత్తుగా వీటిని కోటక్ మహీంద్రా బ్యాంక్ పేరిట తనఖా పెట్టారు. ► ఇక సీడీఈఎల్‌లో సివన్ సెక్యూరిటీస్‌కి ఉన్న మొత్తం వాటాలు (0.21 శాతం) వాటాలు తనఖాలోనే ఉన్నాయి. అటు సీడీఈఎల్‌లో కాఫీ డే కన్సాలిడేషన్స్‌కు ఉన్న 5.81 శాతం వాటాల్లో 95.96 శాతం షేర్లు తనఖాలో ఉన్నాయి. ► దేవదర్శిని ఇన్ఫో టెక్నాలజీస్ వాటాల్లో 83.07 శాతం, గొనిబేడు కాఫీ ఎస్టేట్స్ వాటాల్లో 78.9 శాతం వాటాలు తనఖాలో ఉన్నాయి. పార్లమెంటులోనూ సిద్ధార్థ విషాదాంతం ప్రస్తావన.. దివాలా స్మృతి (ఐబీసీ)పై చర్చ సందర్భంగా పార్లమెంటులో కూడా సిద్ధార్థ విషాదాంతం ప్రస్తావన వచ్చింది. వ్యాపార వైఫల్యాలనేవి జరగరానివేమీ కాదని, వ్యాపారవేత్త విఫలమైనంత మాత్రాన చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వ్యాపారం సజావుగా సాగని పక్షంలో వ్యాపారవేత్తలు గౌరవప్రదంగా తప్పుకునేందుకు తగు పరిష్కారమార్గం చూపడమే ఐబీసీ ఉద్దేశమని వివరించారు. అటు.. కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ విషాదాంతాన్ని ప్రస్తావిస్తూ వ్యాపారపరమైన వైఫల్యాల కారణంగా పరిశ్రమలు మూతబడుతున్నాయని వైసీపీ ఎంపీ ఎం శ్రీనివాసులు రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారాన్ని సులభతరం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే.. వ్యాపారాలు నడపడంలో కష్టాలు మరింతగా పెరుగుతున్నాయన్నారు. వ్యాపారసంస్థల్లో భయాందోళనలు నెలకొన్నాయని, వీటిని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. నిజాయితీగా పనిచేసే సంస్థలను, తప్పుడు విధానాలు పాటించే సంస్థలను ప్రభుత్వం ఒకే రీతిగా చూస్తోందంటూ ‘గుర్రాలు, గాడిదలను ఒకే గాటన కట్టేయడం సరికాదు’ అని శ్రీనివాసులు రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యక్తిగత పూచీకత్తు కారణంగా ఒక పారిశ్రామికవేత్త ఆత్మహత్య చేసుకోవాల్సిన తీవ్ర పరిస్థితులు తలెత్తడం సరికాదని టీడీపీ ఎంపీ జయదేవ్ గల్లా తెలిపారు. -
‘కాఫీ కింగ్’ విషాదాంతం
దాదాపు నాలుగు దశాబ్దాలుగా భిన్న తరాలకు చెందిన లక్షలాదిమందికి మధురమైన క్షణాలను పంచుతూ, వారి జీవితాల్లో ఒక తీయని జ్ఞాపకంగా చెరగని ముద్ర వేసుకున్న సంస్థ ‘కెఫే కాఫీ డే’. అందుకే ఆ సంస్థ వ్యవస్థాపకుడు వీజీ సిద్దార్థ ఆచూకీ లేకుండా పోయారన్న వార్త ఎందరినో దిగ్భ్రాంతికి గురిచేసింది. చివరకు వారంతా భయపడినట్టే 36 గంటల తర్వాత సిద్దార్థ విగతజీవుడై కనబడ్డారు. సంస్థ ఉద్యోగులనూ, బోర్డు సభ్యులనూ ఉద్దేశించి ఆయన రాసినట్టు చెబుతున్న ఒక లేఖ ఆయనదేనని ఇంకా ధ్రువీకరించకపోయినా, అందులో ప్రస్తావించిన అంశాలు ఆందోళన కలిగిస్తాయి. ఆయన సన్నిహిత మిత్రులు, బంధువులు మాత్రమే కాదు... వ్యాపారరంగంలో ఆయన్ను చాలా దగ్గర నుంచి చూసినవారు సైతం సిద్దార్థ సమర్థత గురించి, ఆ రంగంలో ఆయన దీక్ష, పట్టుదల గురించి ప్రశంసాపూర్వకంగా మాట్లాడతారు. ఆయన ఆధ్వర్యంలోని సంస్థల ఉద్యోగులకు కూడా ఎప్పుడూ ఆయన ఇన్ని కష్టాల్లో ఉన్నారని తెలియలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన తెలియనివ్వలేదు. కానీ ఆ లేఖ గమనిస్తే ఆయన ఎదుర్కొన్న ఒత్తిళ్లు ఎలాంటివో, ఆయన ఎంత నిస్సహాయంగా మిగిలిపోయారో అర్థమవుతుంది. విఫల వ్యాపారవేత్తగా మిగిలిపోయానన్న ఆవేదన అందులో కనిపిస్తుంది. సంస్థ నిలదొక్కుకోవడానికి, అది లాభాల బాట పట్టడానికి ఆయన చేసిన కృషి పెద్దగా ఫలించకపోవడం, అందుకోసం చేసిన అప్పులు అపరిమితంగా పెరిగిపోవడం, ఈలోగా ప్రైవేటు ఈక్విటీ(పీఈ) సంస్థల నుంచి, రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరగడం, ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారుల వేధింపులు వంటివి ఆయన తనువు చాలించాలని నిర్ణయించు కోవడానికి దారితీసి ఉండొచ్చునని లేఖలోని అంశాలు చెబుతున్నాయి. సహజంగానే ఐటీ శాఖ తమపై వచ్చిన ఆరోపణల్ని ఖండించింది. పైపెచ్చు ఆయన దగ్గర నల్లధనం పట్టుబడిందని ఆరోపించింది. ఈ ఆరోపణలపై తన వైఖరేమిటో చెప్పేందుకు సిద్దార్థ లేరు. కానీ ఆయనకున్న అప్పుల కన్నా ఆస్తుల విలువ చాలా ఎక్కువ గనుక బకాయిల గురించి ఆయన బెంబేలెత్తే సమస్యే లేదన్నది సన్నిహితుల వాదన. ఏ రంగంలోనైనా నిపుణత సాధించి, ఉన్నత శిఖరాలు అందుకునేవారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. విజేతలను అందరూ ఆరాధనా భావంతో చూస్తారు. కానీ ఆ విజేతల ఆంతరంగిక పరిస్థితి వేరు. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి వారు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి. ఎక్కడ వెనక్కి తగ్గినా వైఫల్యం తలుపుతట్టడానికి సిద్ధంగా ఉంటుంది. అది చదువా, ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, క్రీడలా, రాజకీయాలా అన్న అంశాలతో నిమిత్తం లేదు. ఏ రంగం వారికైనా ఇది తప్పదు. జయాపజయాలను సమంగా స్వీకరించే స్థితప్రజ్ఞత, నిత్యం సవాళ్లను ఎదుర్కొనే సాహసం సహజంగా అలవడేవి కాదు. చుట్టూ ఉన్న పరిస్థితులతో, వ్యక్తులతో పోరాడుతూనే...తనపై తాను పోరాటం చేసుకుంటే తప్ప ఇవి సాధ్యపడవు. తామున్న రంగంలో చిత్తశుద్ధితో, నిజాయితీతో పనిచేస్తూ సమున్నతంగా ఎదగడానికి శ్రమించేవారందరికీ ఇది వర్తిస్తుంది. సిద్దార్థ అటువంటివారు. ఆయన నిజాయితీపరుడు గనుకే, విలువలను నమ్ము కున్నవాడు గనుకే, సున్నితమనస్కుడు గనుకే ఒక్కుమ్మడిగా చుట్టుముట్టిన సమస్యలతో ఒత్తిళ్లకు లోనై ఉసురు తీసుకోవడానికి సిద్ధపడి ఉంటారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటివారికి ఈ బెడద ఉండదు. వారు విజేతలుగా తమను తాము చిత్రించుకోవడానికి శ్రమిస్తారు. అందుకోసం అన్ని రకాల చీకటి పనులకూ పాల్పడతారు. పాపం బద్దలైందని తెలిశాక దూరతీరాలకు పారి పోతారు. సిద్దార్థ రాసినట్టు చెబుతున్న లేఖలో ప్రస్తావనకొచ్చిన వేధింపుల అంశాన్ని ఐటీ శాఖ ఖండిస్తున్నది. కానీ దాంతో ఏకీభవించేవారు తక్కువ. ఇప్పుడే కాదు... ఎన్నాళ్లుగానో ఒక్క ఐటీ శాఖపైన మాత్రమే కాదు, నియంత్రణ వ్యవస్థలన్నిటి వ్యవహారశైలిపైనా ఆరోపణలున్నాయి. దేశంలో కార్పొ రేట్ తిమింగలాలుగా పేరుబడ్డ పది పదిహేను శాతంమంది రాజకీయ ప్రాపకంతో కులాసాగా ఉంటారు. వారి జోలికెవరూ పోరు. మధ్య, కింది స్థాయిలవారికి మాత్రం నిత్యం ఒత్తిళ్లు, వేధింపులు తప్పవు. ఇవన్నీ పైవారికి తెలిసే జరుగుతున్నాయని అనలేం. ఈ మధ్యే ఐటీ శాఖలో పలు ఆరోపణలున్నాయన్న కారణంతో 20మంది ఉన్నతాధికారులను కేంద్రం రిటైర్ చేసింది. ‘కెఫే కాఫీ డే’కు ఎదురైన వైఫల్యాలకు గల కారణాలను కేవలం సిద్దార్థలోనే చూడటం కూడా సరికాదు. మన దేశంలో ఇంకా అంతగా వేళ్లూనుకోని ఖరీదైన కాఫీ క్లబ్‌ల సంస్కృతిని ఆధారంగా చేసుకుని రూపొందించుకున్న వ్యాపార నమూనా ఆయన అనుకున్నట్టుగా విస్తరించి ఉండకపోవచ్చు. కానీ ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరుమోసిన సంస్థలకంటే మెరుగ్గా ఆయన నిలదొక్కుకోగలిగారు. ఆ సంస్కృతిని పెంచగలిగారు. ‘కెఫే కాఫీ డే’తో పోలిస్తే ఇతర సంస్థలు మన దేశంలో నామ మాత్రంగా మిగిలిపోయాయి. అయినా మూడు నాలుగేళ్లుగా ఆ సంస్థకు నష్టాలు తప్పడం లేదు. ఇది కేవలం ఆ సంస్థకు మాత్రమే పరిమితమైన స్థితి కాదు. మన ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు సకల రంగాల్లోనూ ప్రతిఫలిస్తున్నాయి. ఆటోమొబైల్ రంగంతో సహా అన్నీ ఒడి దుడుకులు ఎదుర్కొంటున్నాయి. జీఎస్టీ బకాయిలు భారీయెత్తున పోగడుతున్నాయి. ఉపాధి అవకాశాల లేమి, వేతనాల్లో కోతలు, అనిశ్చితి వగైరాల వల్ల వినిమయం బాగా తగ్గింది. వెనకా ముందూ చూసి ఖర్చు పెట్టే స్థితి వచ్చింది. ఒకప్పుడు ‘కెఫే కాఫీ డే’లవంటి ఖరీదైన దుకాణాలకు వెళ్లడం తమ హోదాకు చిహ్నంగా భావించినవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించకతప్పడం లేదు. నియంత్రణ వ్యవస్థలు ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలి. బకాయిలున్నవారందరినీ ఒకే గాటన కట్టి, అందరినీ నేరగాళ్లుగా చూసే వైఖరిని విడనాడాలి. అప్పుడు సిద్దార్థవంటి వ్యాపార వేత్తలు, పారిశ్రామికవేత్తలు నిబ్బరంతో ముందడుగు వేయడానికి వీలవుతుంది. -
సిద్ధార్థ ఆత్మహత్యకు కారణాలు ఏమిటీ?
సాక్షి, న్యూఢిల్లీ : బరిస్టా బ్రాండ్‌తోపాటు దేశంలో భిన్న రుచుల కాఫీలను తాగే సంస్కతిని ప్రోత్సహిస్తూ రెండు దశాబ్దాల పాటు ఫ్రాంచైజ్‌లను విస్తరిస్తూ పోయిన ‘కేఫ్ కాఫీ డే’ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ? వ్యాపారంలో పరాజయం కారణంగా తలెత్తిన ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజంగానే ఆయన ఆర్థిక పరిస్థితి అంతకు దిగజారిందా? దేశంలోనే అతిపెద్ద కాఫీ బ్రాండ్‌గా విస్తరించినప్పటికీ ‘కేఫ్ కాఫీ డే’ ఎందుకు లాభాలను గడించలేకపోయింది? దేశంలో 200 స్టోర్లను కలిగిన బరిస్టా కంటే కాస్త మెరుగ్గా, కాస్త చౌకగా కాఫీలను అందించడం ద్వారా కేఫ్ కాఫీ డే దేశంలో వేగంగా విస్తరించగలిగింది. కోస్టా కాఫీ, కాఫీ బీన్, టీ లీఫ్ లాంటి కొత్త బ్రాండులు మార్కెట్లోకి ప్రవేశించినప్పటికీ కాఫీ డేకు అవి పోటీకాలేక పోయాయి. కాఫీ డేకు 2015లో 155 కోట్ల రూపాయలు, ఆ మరుసటి ఏడాది, 2016లో 80 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. 2017లో మూడేవేల కోట్ల రూపాయల అమ్మకాల ద్వారా కేవలం 8 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. 2018లో 49 కోట్లు, 2019లో 60 కోట్ల లాభాలను ఆర్జించింది. కాకపోతే కాఫీ డే అనుబంధ సంస్థ ‘గ్లోబల్ ఎడ్జ్ సాఫ్ట్వేర్’ అమ్మకాల ద్వారానే 98 కోట్ల రూపాయలు వచ్చాయి. ప్రస్తుతం కాఫీ డే ఏటా సరాసరి 4,200 కోట్ల రూపాయల అమ్మకాలు నిర్వహిస్తున్న పెద్దగా లాభాలు ఎందుకు రాలేదు ? ఈ రంగంలో ఇతర సంస్థలకు కూడా లాభాలేమీ లేవు. బరిస్టా దేశవ్యాప్తంగా ఉన్న తన కాఫీ చైన్లను తగ్గించుకుంటూ వస్తోంది. కోస్టా కాఫీ అయితే ఒక్క విమానాశ్రయాల్లో మినహా అంతటా కనుమరుగైంది. ‘స్టార్‌బక్స్’ ఓ మోస్తారుగా నడుస్తోంది. దేశవ్యాప్తంగా వెయ్యి స్టోర్ల ఫ్రాంచైజ్ కలిగిన ‘కేఫ్ కాఫీ డే’నే మార్కెట్లో నిలబడగలుగుతుందని నిపుణులు భావించారు. వినూత్నమైన కాఫీ సంస్కతికి ప్రసిద్ధి చెంది యునెస్కో జాబితాలో చోటు చేసుకున్న ఒక్క ‘వియన్నా’ నగరంలో స్టోర్‌ను ఏర్పాటు చేయడం మినహా వీజీ సిద్ధార్థ వ్యాపార పరంగా ఏ పొరపాటు చేయలేదు. క్యాపిటల్ మార్కెట్లో రాణించడం ద్వారా వ్యాపారస్థుడైన సిద్ధార్థ ఇన్ఫోసిస్‌లాంటి అనేక సాంకేతిక టెక్నాలజీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా బడా వ్యాపారిగా ఎదిగారు. ఇప్పటికీ అలాంటి సంస్థలే తన కాఫీ డేను బతికిస్తున్నప్పటికీ ఎందుకు ఆయన బతకాలని అనుకోలేదు ? సహజంగా పెద్ద రైతు బిడ్డ సిద్ధార్థ. తన పొలాల్లోనే తన కాఫీ బ్రాండ్‌ను పండిస్తున్నారు. అందుకనే ఈ బ్రాండ్‌పైనే ఆయన కు ప్రత్యేక మమకారం ఏర్పడి ఉంటుంది. పలు ఇంటర్వ్యూలో కూడా ఆయన ఈ విషయాన్ని చెప్పారు. 20 ఏళ్లు అయినప్పటికీ ఈ రంగంలో నిలదొక్కుకోలేక పోతున్నాననే బాధ ఆయన్ని కుంగదీసి ఉంటుంది. కాఫీ తాగే సంస్కతి భారత్‌లో బలంగా ఉన్నప్పటికీ ‘కాఫీ డే సంస్కతి’ ఇంకా అంతగా ఎదగలేదు. పాశ్చాత్యుల్లాగా ఖరీదైన భవనాల్లోని అందమైన లాంజీల్లో గంటల తరబడి కూర్చొని కాఫీలు తాగుతూ డాలర్లలో డబ్బులు చెల్లించడం భారతీయులకు సాధ్యమయ్యే పనికాదు. విదేశాల్లో ఇలాంటి కాఫీ కేఫుల్లోనే గంటల తరబడి కూర్చునే ఆఫీసు పనులు కూడా చేసుకుంటారు. ఇంకా ఆ సంస్కతి సంపూర్ణంగా మనకు రాకపోవడం ఈ రంగంలో వైఫల్యాలకు మరో కారణం. ఇప్పటికీ కార్మికులు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న భారత్‌లో అందుబాటులో ఉండే చిన్న చిన్న కేఫ్‌లకే ఆదరణ ఎక్కువ. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోక పోవడం కూడా పొరపాటే. -
కార్పొరేట్ భారతంలో భారీ కుదుపు
బెంగళూర్ : కాఫీ కింగ్ వీజీ సిద్ధార్థ విషాదాంతం కార్పొరేట్ భారతం ఎదుర్కొంటున్న సంక్షోభం, లిక్విడిటీ క్షీణతలను ప్రతిబింబిస్తోంది. సిద్ధార్ధ బలవన్మరణానికి పాల్పడే ముందు కంపెనీ బోర్డు సభ్యులు, ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్న అంశాలు భారత పారిశ్రామికవర్గాల్లో భారీ కుదుపునే రేపాయి. రుణదాతలు, ఈక్విటీ ఇన్వెస్టర్ల నుంచి ఎదురైన ఒత్తిళ్లు అప్పుల ఊబిలో మూసుకుపోయిన దారులు సిద్ధార్థను ఉక్కిరిబిక్కిరి చేసిన తీరు కార్పొరేట్ భారతానికి పెను ప్రమాద సంకేతాలు పంపాయి. రెండున్నర దశాబ్ధాల సుదీర్ఘ వ్యాపార పయనంలో కేఫ్ కాఫీ డే(సీసీడే)ను ఆయన శాఖోపశాఖలుగా విస్తరించిన తీరు, కాఫీ తోటల నుంచి కస్టమర్‌కు పొగలు కక్కే కాఫీని కాఫీ టేబుల్‌పైకి అందించే వరకూ అన్ని దశల్లో ఆయన ఒడుపు అనితరసాధ్యమే. తేనీరును ఆస్వాదించే భారత్‌లో ఏకంగా 1700 స్టోర్లు, 54,000 వెండింగ్ మెషీన్లతో ఒంటి చేత్తో కాఫీని దశదిశలా చేర్చిన సిద్ధార్థ రుణభారంతో తనువు చాలించడం విషాదకరం. అప్పులు గుదిబండగా మారడంతో పాటు కంపెనీలో తనఖాలో ఉన్న తన షేర్లను రుణదాతలు తమకు మళ్లించాలని కోరడం, మరోవైపు హామీలున్నా అత్యధికంగా 14 శాతం వడ్డీతో కొత్త రుణాలను సమీకరించాల్సి రావడం రుణభారాన్ని ఇబ్బడిముబ్బడి చేసింది. ఇదే సమయంలో ఓ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ షేర్లను బైబ్యాక్ చేయాలని ఒత్తిడి చేయడం, మైండ్‌ట్రీ విక్రయం ద్వారా సమకూరిన నిధులపై తమకు రావాల్సిన మొత్తం కోసం ఆదాయ పన్ను అధికారుల నుంచి ఒత్తిళ్లతో సిద్ధార్థ తీవ్ర నిర్ణయం దిశగా కదిలారు. తన ముందున్న సంక్లిష్ట పరిస్ధితుల్లో తనువు చాలించడం మినహా మరోమార్గం లేదనే రీతిలో తను రాసిన లేఖలో సిద్ధార్ధ స్వయంగా వెల్లడించారు. ‘వీజీ సిద్ధార్ధ ఒక్కరే కాదు దేశంలో ఇలాంటి వారు మరో 100 మంది ఇతర పారిశ్రామికవేత్తలూ ఉన్నారు. కంపెనీల వద్ద ద్రవ్య లభ్యత లేకపోవడం, రీఫైనాన్సింగ్ లభించకపోవడంతో వారు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నార’ని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్స్‌కు చెందిన చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవిస్ చెప్పడం కార్పొరేట్ భారతంలో సంక్లిష్టతలకు అద్దం పడుతోంది. -
‘క్యాప్చినో’ పరిచయం చేసింది సిద్దార్థే..
కాఫీలో దిగ్గజం కేఫ్ కాఫీ డే. కేఫ్ కాఫీడేలో ఒక్క కాఫీ తాగితే చాలు ఆ కిక్కే వేరు. తెలుగు రాష్ట్రాల్లో 100కిపైగా అవుట్‌లెట్స్‌ని కలిగిఉన్న కేఫ్ కాఫీడేకు నగరంలో 70 వరకు అవుట్‌లెట్స్ ఉన్నాయి. అత్యంత రద్దీ ప్రదేశాల్లో, షాపింగ్ మాల్స్, ఐటీ కారిడర్‌కు సమీపంలో టెక్కీలను దృష్టిలో పెట్టుకుని అవుట్‌లెట్స్‌ని ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో నెలకు సుమారు రూ. 4.5 కోట్ల ఆదాయం వస్తుండగా.. ఒక్క హైదరాబాద్‌లోనే దీని టర్నోవర్ రూ.3.15 కోట్లకుపైగా ఉండటం గమనార్హం. భారతదేశంలో ‘క్యాప్చినో’ (కాఫీ)ని పరిచయం చేసిన కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకోవడంతో కాఫీ లవర్స్ ఒకింత ఆవేదనకు గురయ్యారు. హైదరాబాద్ సిటీలో కేఫ్ కాఫీడేకు 70 అవుట్‌లెట్స్ ఉండగా, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు వంటి నగరాల్లో సుమారు 30కిపైగా అవుట్‌లెట్స్ ఉన్నాయి. 37 ఏళ్ల క్రితం ‘కేఫ్ కాఫీడే’ పేరుతో వీజీ సిద్ధార్థ దేశానికి ‘క్యాప్చినో’ (కాఫీ)ని పరిచయం చేశారు. దీని ధర రూ.135. కాఫీతో పాటు ప్రతి రోజూ కాఫీ, పిజ్జా, బర్గర్, స్నాక్స్, కూల్కాఫీ, మిల్క్‌షేక్స్ వంటి వాటితో రోజుకు ఒక్కో షాప్‌పై సుమారు రూ.15వేల ఆదాయం వస్తోంది. ఇలా హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఉన్న 70 అవుట్‌లెట్స్ నుంచి నిత్యం సుమారు రూ.10 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. నెలకు రెండు రాష్ట్రాల నుంచి సుమారు రూ.4.5కోట్లు వస్తుండగా.. ఒక్క హైదరాబాద్ సిటీ నుంచే సుమారు రూ.3.15 కోట్లకుపైగా ఆదాయం రావడం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 400 మందికి ఉపాధి.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కేఫ్ కాఫీ డే అవుట్‌లెట్స్‌లో సుమారు 400 మందికిపైగా ఉద్యోగులు జీవనోపాధి పొందుతున్నారు. ఒక్కో బ్రాంచ్‌లో నలుగురు లేదా ఐదుగురు చొప్పున విధులు నిర్వర్తిసున్నారు. వీరికి కనీస వేతనం రూ.8వేలు నుంచి రూ.60, 70వేలు సంపాదించే వాళ్లూ ఉన్నారు. నెలసరి జీతం, ఇతర అలవెన్స్ వంటివి ఏవీ కూడా ఇంత వరకు నిలిపివేసిన ఘటనలు లేవని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రతి నెలా మొదటి రోజునే తమకు వేతనాలు ఆన్లైన్ ద్వారా వచ్చేస్తాయని వివరించారు. తమ యజమాని సిద్ధార్థకు కోట్లాది రూపాయలు అప్పు ఉందనే విషయం తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యామంటున్నారు. నాగార్జున సర్కిల్లో మొదటిసారిగా.. బంజారాహిల్స్: అది 2004 ఆగస్ట్ 16. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–1/3 చౌరస్తాలోని నాగార్జున సర్కిల్లో కొత్తగా తెరుచుకుంది కేఫ్ కాఫీ డే. అప్పటికి నగరవాసులకు కాఫీ రుచులు ఇన్ని ఉన్నాయన్న విషయం తెలియదు. కాఫీ కెఫె పేరుతో ఓ హోటల్ తెరచుకోవడమే అప్పట్లో సంచలనం. ఇక్కడ కాఫీ అంటే వేడివేడిగా గ్లాసులో పొగలు కక్కడమే తెలుసు. దీని యజమాని సిద్ధార్ధ మాత్రం మొదటిసారిగా కోల్డ్ కాఫీని రుచి చూపించారు. యువత కోల్డ్ కాఫీకి ఫిదా అయిపోయారనే చెప్పాలి. మొట్టమొదటి కేఫ్ కాఫీ డే నగరంలో నాగార్జున సర్కిల్లోనే తెరుచుకుంది. ఆ తర్వాత ఏడాదికి ఒకటి, రెండు చొప్పున పాష్ లొకాలిటీలలో వీటిని విస్తరించారు. కాఫీకి కొత్త రుచులను పరిచయం చేసిన కేఫ్కాఫీ డేలోకి వెళ్లి వివిధ రకాల కాఫీ రుచులను ఆస్వాదించేందుకు నగరవాసులు అలవాటు పడ్డారు. దీంతో ఈ 15 సంవత్సరాల్లో మొత్తం 21 ఫ్రాంచైజీలు నగరవ్యాప్తంగా ఏర్పాటయ్యాయి. నాగార్జున సర్కిల్లో ప్రారంభమైన మొదటి కాఫీ డే ఆ తర్వాత రెండోది జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్– 36లో ఏర్పాటైంది. ప్రస్తుతం నెక్లెస్ రోడ్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్–14, రాజ్‌భవన్ రోడ్డు, కుందన్‌బాగ్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్–10, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–36, 47, ఉస్మానియా యూనివర్సిటీ, లక్డీకాపూల్, ఎల్బీనగర్, ఎస్ఆర్నగర్, వారాసిగూడ, బేగంపేట, సింధీకాలనీ, శ్రీనగర్‌కాలనీ, సోమాజిగూడ, ప్రసాద్ ఐమాక్స్, జీవీకే వన్ మాల్, హైదరాబాద్ సెంట్రల్, అపోలో ఆస్పత్రి తదితర ప్రాంతాల్లో విస్తరించుకుంది. దాదాపు అన్ని కాఫీ షాపులు నగరవాసుల ఆదరణను చూరగొన్నాయి. ఒకేసారి 76 మంది కూర్చునేలా.. ప్రస్తుతం 21 ఫ్రాంచైజీల్లో కొనసాగుతున్న కాఫీ రుచులకు నగరవాసులు బాగానే అలవాటు పడ్డారని చెప్పొచ్చు. యువతీయువకుల కలయికకు ఈ కేఫ్ కాఫీ డేలు వేదికలుగా మారాయి. ఒక్కో కాఫీ షాపులో 42 రకాల రుచులతో కాఫీలను విక్రయిస్తున్నారు. ఎక్కువగా సంపన్న వర్గాలు నివసించే ప్రాంతాల్లోనే వీటిని ఏర్పాటు చేశారు. కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేఫ్ కాఫీ డే యజమాని సిద్ధార్థ హైదరాబాద్‌లో మొదటి ఫ్రాంచైజీని ఏర్పాటు చేసినప్పుడు ప్రారంభోత్సవానికి విచ్చేశారు. గత ఏప్రిల్ 6న జూబ్లీహిల్స్‌లో కాఫీ డే స్క్వేర్ పేరుతో గ్లోబల్ రుచులను అందించేందుకు సరికొత్త రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఒకేసారి 76 మంది అతిథులు కూర్చొనేందుకు వీలుగా దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దారు. ఎంతోమంది అభిమానాన్ని చూరగొని.. దేశానికి క్యాప్చినోని పరిచయం చేసి ప్రపంచవ్యాప్తంగా అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ. కస్టమర్లను గంటలతరబడి కేఫ్ కాఫీ డేలో కూర్చోబెట్టేలా చేశారు ఆయన. టైంపాస్ కోసమైనా,సరదాగా ఫ్రెండ్స్‌తో చిట్‌చాట్‌కైనా కేఫ్ కాఫీ డే కేరాఫ్ అనే చెప్పాలి. మొదట్లో సంపన్న వర్గాల వారికే పరిమితమైన కాఫీ డే క్రమేణా ఐదేళల్లో మధ్యతరగతి ప్రజానీకానికి కూడా చేరువయ్యింది. 42కిపైగా రుచులను కాఫీడే అందించడం విశేషం. వేడి వేడి క్యాప్చినోని సిప్ వేస్తే మైండ్ రిఫ్రెష్ అవుతుందనేది కాఫీలవర్స్ అభిప్రాయం. తమకు ఇంతటి చక్కటి కాఫీని అందించిన సిద్ధార్థ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవడం జీర్ణించుకోలేకపోతున్నామని నగరానికి చెందిన కాఫీ లవర్ మహిమ పేర్కొన్నారు. గచ్చిబౌలిలో యథావిధిగా.. గచ్చిబౌలి: కేఫ్ కాఫీ డే అధినేత సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. కాగా బుధవారం గచ్చిబౌలిలోని కేఫ్ కాఫీ డే అవుట్లెట్ యథావిధిగా కొనసాగింది. తమకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో కేఫ్ కాఫీ డేను యథావిధిగా తెరిచినట్లు ఇక్కడి ఉద్యోగులు తెలిపారు. కేఫ్‌కు రోజు మాదిరిగానే వినియోగదారులు వచ్చి వెళ్లారు. కేఫ్ కాఫీ డే అధినేత సిద్ధార్థ మృతిపై మాట్లాడేందుకు సిబ్బంది నిరాకరించారు. సిద్ధార్థ మృతి బాధాకరం.. వివిధ పనులతో అలసిపోయిన నేను, నా స్నేహితులు ప్రతిరోజూ బంజారాహిల్స్ సిటీ సెంటర్ సమీపంలోని కేఫ్ కాఫీ డేకి వస్తాం. మా డెయిలీ బాతాఖానీ ఇక్కడే. క్యాప్చినోని ఆరగిస్తూ.. నచ్చిన చిప్స్, బిస్కెట్స్ తింటూ ఎంజాయ్ చేస్తాం. క్యాప్చినోను దేశానికి పరిచయం చేసిన వీజీ సిద్ధార్థ మృతి ఎంతో బాధాకరం. – భరత్, కాఫీ లవర్ డెయిలీకస్టమర్లం.. కాఫీ డే అప్పుల్లో ఉన్న విషయం అసలు తెలీనే తెలీదు. కాఫీడేలోకి అడుగుపెట్టగానే మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది. 2009 నుంచి కాఫీడేకి నేనూ, నా స్నేహితులం డెయిలీ కస్టమర్లం. వీజీ సిద్ధార్థ చనిపోయాడని మేనేజ్మెంట్ను చేంజ్ చేస్తే కాఫీ డే కుప్పకూలిపోవచ్చు.– కృష్ణయాదవ్, కాఫీ లవర్ -
ఏం కష్టం వచ్చిందో?
-
కాఫీ కింగ్‌కు కన్నీటి వీడ్కోలు
ఏ కాఫీ తోటలతో ఆయన వ్యాపారఅధినేతగా ఎదిగారో చివరకు అవే కాఫీ తోటల్లో చితిమంటల్లో పంచభూతాల్లో కలిసిపోయారు. కోట్లాది మందికి కాఫీ రుచుల్ని చేరువ చేసిన కాఫీ డే స్థాపకుడు వీజీ సిద్ధార్థ్ చివరి ప్రయాణం అనూహ్యంగా ముగిసింది. కుటుంబం,వేలాది మంది ఉద్యోగులు, మిత్రులనుంచి బాధాకరమైన రీతిలో వీడ్కోలు తీసుకున్నారు. సాక్షి, బెంగళూరు: ప్రముఖ కార్పొరే ట్ దిగ్గజం, కెఫే కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ్ విజయగాథ మధ్యలో విషాదంతో ముగిసింది. నేత్రావతి నది వద్ద అదృశ్యమైన ఆయన అక్క డే విగతజీవిగా కనిపించారు. సోమ వారం రాత్రి మంగళూరు సమీపంలో ఉళ్లాల వద్ద నేత్రావతి నది వంతెనపై కనిపించకుండా పోయిన ఆయన మృతదేహం బుధవారం ఉదయం సమీపంలోని నదీ జలాల్లో లభ్యమైంది. పోస్ట్‌మార్టం తదితరాలను మంగళూరులో నిర్వహించి చిక్కమగళూరులో స్వస్థలంలో దహన సంస్కారాలు జరిపారు. వేలాదిగా తరలివచ్చిన రాజకీయ సినీ ప్రముఖులు, కెఫే కాఫీడే సిబ్బంది, చిక్కమగళూరు వాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. సీఎం యడియూరప్పతో పాటు మాజీ సీఎం కుమారస్వామి, మంత్రులు, పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. కుటుంబం కన్నీటి సంద్రం మృతదేహం కనిపించిందనే విష యం తెలిసిన తర్వాత బెంగళూరు సదాశివనగర్‌లోని ఆయన మామ, మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ నివాసంలో కుటుంబ సభ్యుల్లో కన్నీటి పర్యంతమయ్యారు. ఇంట్లో విషాద వాతా వరణం తాండవించింది. హెఏఎల్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం ద్వారా కుటుంబ సభ్యులు చిక్కమగళూరుకు చేరుకున్నారు. అక్కడ సిద్ధార్థ్ పార్థివ దేహాన్ని చూసిన ఎస్ఎం కృష్ణ కుటుంబ సభ్యులు విలపించారు. ఎస్ఎం కృష్ణ సతీమణి ప్రేమ, సిద్ధార్థ్ సతీమణి మాళవిక, తల్లి వాసంతి, పిల్లలు అమర్థ్య, ఇషాన్‌లను ఓదార్చడం అక్కడ ఎవరివల్ల కాలేదు. ఎస్టేట్‌లో అంత్యక్రియలు భౌతికకాయాన్ని బెంగళూరుకు తరలించాలని భావించినప్పటికీ కుటుంబ సభ్యుల సూచన మేరకు సొంతూరు చిక్కమగళూరు జిల్లా చేతనహళ్లికి తీసుకెళ్లారు. చిక్కమగళూరు నగరంలోని ఏబీసీ కాఫీ ఫ్యాక్టరీలో చివరిసారిగా వేలాదిమంది సిద్ధార్థ్ భౌతికకాయాన్ని సందర్శించారు. చేతనహళ్లి ఎస్టేట్‌కు తరలించి సాయంత్రం 6.55 నిమిషాలకు చితికి నిప్పంటించారు. సిద్ధార్థ్ అనుమానస్పద మరణంపై మంగళూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
సిద్ధార్థ.. వినయశీలి, మృదుభాషి
న్యూఢిల్లీ: కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ మృతిపై పారిశ్రామిక వర్గాలు సంతాపం వ్యక్తం చేశారు. ‘‘సిద్ధార్థ వినయశీలి, మృదుభాషి’’ అని బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా, ఆటోమొబైల్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తదితరులు నివాళులర్పించారు. ‘సిద్ధార్థ భార్య మాళవిక, ఆయన కుమారులు, ఎస్ఎం కృష్ణ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాలు తెలియజేస్తున్నాను‘ అని కిరణ్ షా మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో పేర్కొన్నారు. మరోవైపు, వ్యాపార వైఫల్యాలతో ఔత్సాహిక వ్యాపారవేత్తలు కుంగిపోరాదని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ‘సిద్ధార్థ స్ఫూర్తిదాయకమైన ఎంట్రప్రెన్యూర్, ఇన్వెస్టరు‘ అని ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ పేర్కొన్నారు. ప్రభుత్వ వేధింపులకి నిదర్శనం: మాల్యా సిద్ధార్థ మరణంపై దివాలా తీసిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటరు విజయ్ మాల్యా స్పందించారు. ప్రభుత్వ యంత్రాంగం వేధింపులకు ఇదో నిదర్శనమని వ్యాఖ్యానించారు. రుణాలన్నీ తిరిగి పూర్తిగా కట్టేస్తానంటున్నా తనను కూడా అలాగే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 9,000 కోట్లకు పైగా బ్యాంకులకు ఎగవేసిన ఆర్థిక నేరస్థుడన్న ఆరోపణలతో మాల్యా ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. ‘నాకు వీజీ సిద్ధార్థతో పరోక్షంగా సంబంధాలు ఉన్నాయి. ఆయన మంచి వ్యక్తి. చురుకైన వ్యాపారవేత్త. ఆయన లేఖలోని అంశాలు ఎంతో కలిచివేసేవిగా ఉన్నాయి. ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకులు ఎలాంటివారినైనా దయనీయ స్థితిలోకి నెట్టేయగలవు. నేను పూర్తిగా డబ్బు కట్టేస్తానంటున్నా ఎలా వేధిస్తున్నారో కనిపిస్తూనే ఉంది. మిగతా దేశాల్లో రుణగ్రహీతలు ఏదో రకంగా రుణాలు కట్టేసేలా ప్రభుత్వం, బ్యాంకులు సహాయం అందిస్తాయి. కానీ నా కేసు విషయంలో నేను కట్టేసేందుకు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్నీ అడ్డుకుంటున్నారు‘ అని మాల్యా వ్యాఖ్యానించారు. ఫండ్స్ పెట్టుబడులు రూ. 193 కోట్లు.. సిద్ధార్థకు చెందిన కాఫీ డే నేచురల్ రిసోర్సెస్, టాంగ్లిన్ డెవలప్‌మెంట్స్‌లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు రూ. 193 కోట్ల పైగా ఉన్నట్లు తెలుస్తోంది. కాఫీ డే నేచురల్ రిసోర్సెస్‌లో ఫండ్స్ పెట్టుబడులు రూ. 149 కోట్లు, టాంగ్లిన్‌లో రూ. 44 కోట్ల మేర ఉన్నట్లు మార్నింగ్‌స్టార్ సంస్థ రూపొందించిన నివేదికలో వెల్లడైంది. డీఎస్పీ క్రెడిట్ రిస్క్ ఫండ్ అత్యధికంగా కాఫీ డే నేచురల్ రిసోర్సెస్‌లో రూ. 132 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. మరో 20 శాతం పడిన షేరు.. తాజా పరిణామాలతో బుధవారం కూడా కాఫీ డే షేరు మరో 20 శాతం పతనమైంది. ఇంట్రాడేలో లోయర్ సర్క్యూట్‌ను తాకింది. బీఎస్ఈలో రూ. 123.25కి క్షీణించింది. ఇది 52 వారాల కనిష్ట స్థాయి కూడా. అటు ఎన్ఎస్ఈలో కూడా 20% పతనమై రూ. 122.75కి పడింది. రెండు రోజుల్లో సంస్థ మార్కెట్ విలువ రూ. 1,463 కోట్లు ఆవిరైపోయి.. రూ.2,604 కోట్లకు తగ్గింది. సిద్ధార్థ అదృశ్యమయ్యారన్న వార్తలతో మంగళవారం కూడా కాఫీ డే షేరు 20% పతనమైన సంగతి తెలిసిందే. -
‘కాఫీ డే’ సిద్ధార్థ మృతి
మంగళూరు/సాక్షి, బెంగళూరు: నాటకీయ పరిణామాల మధ్య సోమవారం రాత్రి అదృశ్యమైన కెఫే కాఫీ డే వ్యవస్థాపక యజమాని, ఇండియన్ కాఫీ కింగ్ వీజీ.సిద్ధార్థ (59) బుధవారం శవమై కనిపించారు. ప్రాథమికంగా చూస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లుగానే నిర్ధారణ అవుతోందనీ, అయితే కేసును పూర్తిగా విచారించిన తర్వాతనే నిజానిజాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. సిద్ధార్థ మృతదేహాన్ని కర్ణాటకలోని మంగళూరు సమీపాన, నేత్రావతి నది ఒడ్డున జాలరులు, పెట్రోలింగ్ పోలీసులు బుధవారం కనుగొన్నారు. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం.కృష్ణకు అల్లుడైన సిద్ధార్థకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. జాలరులు కనుగొన్న మృతదేహం సిద్ధార్థదేనని ఆయన స్నేహితులు నిర్ధారించినట్లు దక్షిణ కన్నడ జిల్లా డెప్యూటీ కమిషనర్ శశికాంత సెంథిల్ చెప్పారు. మంగళూరులోని వెన్లాక్ వైద్యశాలలో సిద్ధార్థ మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. సిద్ధార్థ స్వస్థలమైన చిక్కమగళూరు జిల్లా చేతనహళ్ళి గ్రామంలో అంత్యక్రియలను బుధవారం నిర్వహించారు. కర్ణాటక సీఎం యడియూరప్ప, మాజీ సీఎం కుమారస్వామి, ఇతర రాజకీయ నాయకులు, కెఫే కాఫీ డే ఉద్యోగులు, గ్రామస్థులు తదితర వందలాది మంది సిద్ధార్థ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం అధికారులు, అప్పు ఇచ్చిన వాళ్లు తనను వేధిస్తున్నారనీ, ఆ ఒత్తిడిని తాను తట్టుకోలేకపోతున్నానంటూ అదృశ్యానికి ముందు సిద్ధార్థ రాసినట్లుగా ఓ లేఖ బయటకు రావడం తెలిసిందే. మంగళూరు సమీపంలో నేత్రావతి నదిపై ఉన్న వంతెన వద్ద సిద్ధార్థ అదృశ్యమైనట్లు ఆయన డ్రైవర్ చెప్పడంతో, ఆ ప్రాంతంలో సిబ్బంది తీవ్రంగా గాలించారు. హైదరాబాద్‌కు చెందిన ఇన్కాయిస్ అనే ప్రభుత్వ సంస్థ అభివృద్ధి చేసిన సాంకేతికత ఆధారంగా సిద్ధార్థ మృతదేహం ఉన్న అంచనా ప్రదేశాన్ని గాలింపు సిబ్బంది తొలుత గుర్తించారు. అనంతరం ఆ ప్రాంతంలో తీవ్రంగా గాలించడంతో మృతదేహం లభించింది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మాట్లాడుతూ ‘మృతదేహం లభించింది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపేందుకు నా దగ్గర పదాలు కూడా లేవు. వారు అంతటి బాధలో ఉన్నారు. సిద్ధార్థకు అప్పుల కన్నా ఆస్తులు ఎక్కువగానే ఉన్నాయి’ అని చెప్పారు. మృతి దురదృష్టకరం: మమతా బెనర్జీ సిద్ధార్థ మృతి దురదృష్టకర సంఘటన అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నా రు. ప్రభుత్వ సంస్థల వేధింపుల కారణంగా ఆయన మానసికంగా కుంగిపోయారన్నారు. ప్రభుత్వ ఒత్తిడి, విధానాల కారణంగా ఇప్పటికే కొందరు వ్యాపారవేత్తలు దేశం విడిచి వెళ్లిపోయారనీ, మరికొందరు కూడా వెళ్లిపోయేందుకు ఆలోచిస్తున్నారని మమత పేర్కొన్నారు. అదృశ్య హస్తాలెవరివో తేల్చండి: కాంగ్రెస్ సిద్ధార్థ మృతి వెనుక ఉన్న అదృశ్య హస్తాలెవరివో తేల్చాలని కాంగ్రెస్ బుధవారం డిమాండ్ చేసింది. ‘ఆదాయపు పన్ను అధికారుల వేధింపులు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. వ్యాపారంలో భారత స్థాయి కూడా పడిపోతోంది. దీనంతటికీ కారణం పన్ను ఉగ్రవాదం, ఆర్థిక వ్యవస్థ కూలుతుండటమే. యూపీఏ హయాంలో ఎంతో వృద్ధి చెందిన వ్యాపారాలు, కంపెనీలు నేడు మూతపడుతున్నాయి. అనేక మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు’ అని ట్విట్టర్లో కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య మాట్లాడుతూ ‘నిష్పాక్షిక, పారదర్శక విచారణ జరగాలి. ఇలా విషాదకర రీతిలో సిద్ధార్థ చనిపోవడానికి కారణమైన అదృశ్య హస్తాలెవరివో, ఇందుకు కారణాలేంటో తేల్చాలి. ఆదాయపు పన్ను అధికారులు వేధించారని ఆయన ఆరోపించారు. పన్ను ఉగ్రవాదం, రాజకీయ దురుద్దేశాల కోసం ప్రభుత్వ సంస్థలను వాడుకుంటుండటంపై సిద్ధార్థ తన లేఖలో ప్రస్తావించారు. దీని ద్వారా యువపారిశ్రామికవేత్తలకు మనం ఏం సందేశం ఇస్తున్నాం? సంస్కరణల కోసం కనీసం ప్రయత్నం కూడా చేయడం లేదు’ అని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. -
కాఫీ డే కింగ్ అరుదైన ఫోటో
సాక్షి, బెంగళూరు : కేఫే కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్దార్థ హెగ్డే అకాలమృతి అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. మాజీ కేంద్ర మంత్రి, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణకు స్వయానా అల్లుడు సిద్ధార్థ. మాజీ సీఎం కుమార్తె , ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన మాళవికను ఆయన వివాహమాడారు. తాజాగా సిద్ధార్థ, మాళవిక పెళ్లికి సంబంధించిన ఫోటో ఒకటి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో సిద్ధార్థ మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తమవుతోంది. ట్విటర్లో ‘ఆర్ఐపి సిద్దార్థ’ హ్యాహ్టాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. ఏ బలహీనత ఆయనను ఆవరించిందింతో తెలియదు కానీ.. సిద్ధార్థలో అపారమైన శక్తిని నింపిన ‘బలమే జీవితం, బలహీనతే మరణం’ అన్న వివేకానంద సూక్తి ఆయనను కాపాడలేకపోయింది. చివరికి ఆయన ఎంతో అభిమానించి, గురువుగా భావించిన మహేష్ కంపాని (బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ ప్రెసిడెంట్, జేఎంక్యాపిటల్ అధినేత, కారు యాక్సిడెంట్లో అనుమానాస్పదంగా మరణించారు) మాదిరిగానే సిద్ధార్థ జీవితం కూడా విషాదాంతమైంది. ‘ఎలాట్ కెన్ హ్యాపెన్ ఓవర్ ఎ కాఫీ’ అంటూ కాఫీ తాగుతూ ఒత్తిడిని దూరం చేసుకోమని ప్రపంచానికి మార్గం చూపించిన సిద్ధార్థను చివరికి ఆ ఒత్తిడే మింగేయడం అత్యంత విషాదం. వేలమందికి ఉద్యోగావకాశాలు కల్పించిన సిద్ధార్థ ప్రధానంగా వికలాంగులకు ప్రాధాన్యం ఇచ్చేవారట. కాఫీ డే కంపెనీలో ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యోగం వచ్చినట్టే అన్నంత సంబరం ఉద్యోగుల్లో. కాగా కాఫీడే ఎంటర్ప్రైజెస్ బోర్డు తాత్కాలిక ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్ అధికారి ఎస్వీ రంగనాథ్‌ను నియమించారు. సిద్ధార్థ రాసినట్టుగా చెబుతున్న లేఖ పై కాఫీ డే ఎంటర్ ప్రైజెస్ దర్యాప్తునకు ఆదేశించనుందని తెలుస్తోంది. ఆగస్టు 8న తదుపరి బోర్డు సమావేశంలో దీనిపై చర్చిచనున్నారని సమాచారం. పలువురు రాజకీయవేత్తల, వ్యాపార వర్గాలు, కార్పొరేట్ వర్గాలు ఆయనకు తుది నివాళులు అర్పించేందుకు వేలాదిగా కర్ణాటకలోని చిక్మంగళూరుకు తరలివచ్చారు. మరికొద్ది క్షణాల్లో సిద్ధార్థ అంత్యక్రియలు ముగియనున్నాయి. -
సిద్ధార్థ చివరి మజిలీ ఆ కాఫీ తోటకే
సాక్షి, ముంబై : కాఫీ తోటల్ని ప్రేమించి, మంచి కాఫీని ప్రపంచానికి పరిచయం చేసిన కాఫీ కింగ్ వీజీ సిద్ధార్థ చివరి ప్రస్థానం కూడా ఆ కాఫీ తోటల మధ్యే ముగియనుంది. 12వేల ఎకరాల కాఫీ తోటలకు వారసుడు సిద్ధార్థ అంత్యక్రియలను కర్ణాటకలోని చిక్మంగళూరు జిల్లాలోని చట్టనహళ్లి గ్రామంలోని కాఫీ ఎస్టేట్‌లో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు అంత్యక్రియలు పూర్తికానున్నాయని భావిస్తున్నారు. మంగళూరు నుండి 150 కిలోమీటర్లు, బెంగళూరుకు వాయువ్యంగా 250 కిలోమీటర్ల దూరంలో ఈ కాఫీ ఎస్టేట్ ఉంది. సోమవారం నుంచి కనిపించకుండా పోయిన సిద్ధార్థ మృతదేహాన్ని నేత్రావతి నది వెనుక నీటిలో తేలుతుండగా బుధవారం ఉదయం ఇద్దరు మత్స్యకారులు గుర్తించారు. బంధువులకు సమాచారం అందించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మంగళూరులోని వెన్లాక్ ఆసుపత్రికి తరలించారు. శవపరీక్ష తర్వాత సిద్ధార్థ మృతదేహాన్ని అతని కుటుంబానికి అప్పగించారు. ఆయన మృతిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో పోస్ట్‌మార్టం నివేదిక కీలకంగా మారింది. అయితే పోలీసులు ఈ నివేదికను ఇంకా బహిర్గతం చేయలేదు. మరోవైపు వ్యవస్థాపక చైర్మన్ అకాల మరణం నేపథ్యంలో కెఫే కాఫీ డే ఔట్లెట్లకు సెలవు ప్రకటించారు. మృతదేహాన్ని గ్రామానికి తరలించే మార్గంలో చిక్మంగళూరు పట్టణంలోని కాఫీ డే గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ కార్యాలయానికి తరలించారు. దీంతో తమ అభిమాన నేత, లెజెండ్, కాఫీ డే కింగ్ మృతికి ఉద్యోగులు కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం ఆయన స్వగ్రామానికి తరలించగా ఆయన మృతదేహాన్ని సందర్శించుకునేందుకు చుట్టు పక్కల గ్రామాలు, పట్టణాల నుంచి చిన్నా, పెద్దా, మహిళలు వేలాదిగా తరలివచ్చారు. తప్పులన్నింటికి నాదే బాధ్యత అంటూ నిశ్శబ్దంగా నిష్క్రమించిన సిద్ధార్థ ..కార్పొరేట్ ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపారని చెప్పక తప్పదు. ప్రధానంగా ఆయన రాసినట్టుగా చెబుతున్న లేఖలో ప్రస్తావించిన ఐటీ శాఖ అధికారుల వేధింపులు వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. Today we remember the legend that inspired us all. Thank you Chairman VG Siddhartha for your vision, leadership and the great legacy. pic.twitter.com/tYMiglgofe — Cafe Coffee Day (@CafeCoffeeDay) July 31, 2019 -
కాఫీ డే తాత్కాలిక చైర్మన్ నియామకం
సాక్షి, ముంబై : కాఫీ డే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) ఎస్వీ రంగనాథ్ తాత్కాలిక చైర్మన్ నియమితులయ్యారు. వ్యవస్థాపక చైర్మన్ వీజీ సిద్ధార్థ అదృశ్యం, 36 గంటల తీవ్ర గాలింపు అనంతరం పోలీసులు ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడం విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం అత్యవసరంగా సమావేశమైన కాఫీ డే ఎంటర్ప్రైజెస్ బోర్డు పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. తాత్కాలిక చైర్మన్‌గా రంగనాథ్ నియామకంతోపాటు, నితిన్ బాగమనేను తాత్కాలిక సీఓఓగా, రామ మోహన్‌ను సీఎఫ్‌వోగా నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. మరోవైపు సిద్ధార్థ మృతిపై పలువురు వ్యాపార దిగ్గజాలతోపాటు, రాజకీయ వేత్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కేఫ్ కాఫీడే వ్యవస్థాపకుడు సిద్ధార్థ ఎంతో కలిచివేసిందని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన సేవలు చిరస్మరణీయమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. వీజీ సిద్ధార్థ మృతిపై స్పందించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆయన మరణం తనను షాక్‌కు గురిచేసిందని, ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని ట్వీట్ చేశారు. వ్యక్తిగతంగా తనకు సిద్ధార్థ గురించి, ఆయన ఆర్థిక పరిస్థితిపై పెద్దగా తెలియదని పేర్కొన్న ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎం అండ్ ఎం ఛైర్మన్ ఆనంద్ మహింద్రా ఏదేమైనా వ్యాపార వైఫల్యాల కారణంగా జీవితాలను, ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోకూడదన్నారు. అది ఒక వ్యవస్థ మరణానికి కారణమవుతుందంటూ ట్వీట్ చేశారు. -
కాఫీ కింగ్ విషాదాంతం వెనుక..
సాక్షి, న్యూఢిల్లీ : కాఫీకి కార్పొరేట్ హంగులద్ది కోట్లకు పడగలెత్తిన కేఫ్ కాఫీ డే (సీసీడీ) వ్యవస్దాపకుడు వీజీ సిద్ధార్ధ విషాదాంతం కార్పొరేట్ భారతాన్ని కలవరపరుస్తోంది. వేల కోట్ల టర్నోవర్‌తో పాటు కాఫీ తోటలు, భూములు, ఇతర వ్యాపారాలతో విస్తరించిన సీసీడీ సామ్రాజ్యాధినేత సిద్ధార్థ తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది అందరి మదినీ తొలిచేస్తోంది. అప్పులకు మించిన ఆస్తులున్నాయని యాజమాన్యం చెబుతుంటే డేరింగ్ ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగిన సిద్ధార్థ బలవన్మరణానికి పాల్పడటం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2019 మార్చి నాటికి సీసీడీ రుణభారం ఏకంగా రూ 6,547 కోట్లకు ఎగబాకిందని 2018-19 ఆర్ధిక సంవత్సరానికి సంస్థ వెల్లడించిన అన్‌ఆడిటెడ్ ఆర్థిక ఫలితాలు వెల్లడించాయి. రుణభారం తగ్గించుకునేందుకు ఐటీ సంస్థ మైండ్‌ట్రీలో తనకున్న వాటాలను రూ 3269 కోట్లకు విక్రయించి ఆ నిధులన్నింటినీ పూర్తిగా రుణాలు తీర్చేందుకు వెచ్చించారు. ఈ ఒప్పందానికి సంబంధించి తమకు రూ 300 కోట్లకు పైగా పన్ను చెల్లించాల్సి ఉండగా తమకు కేవలం రూ 46 కోట్లే చెల్లించారని ఆదాయ పన్ను శాఖ సీసీడీపై దాడులు చేపట్టింది. ఇక సిద్ధార్థ కుటుంబానికి సీసీడీ పేరెంట్ కంపెనీ కాఫీడే ఎంటర్ప్రైజెస్(సీడీఈ)లో 53.43శాతం వాటా ఉంది. దీనిలో 75శాతం వాటాలు తనఖా కింద ఉన్నాయి. వ్యక్తిగతంగా సిద్ధార్థకు సీడీఈలో ఉన్న 32.75 శాతం వాటాలో దాదాపు 70శాతం షేర్లు తనఖాలోనే ఉన్నాయి. అప్పులు పెరిగి.. వాటా కరిగి.. రుణభారంతో సతమతం కావడం, ముసురుతున్న సవాళ్లతో సీడీఈ మార్కెట్ షేర్ పతనం సిద్ధార్థ ధీమా సడలిపోయేందుకు సంకేతమైంది. మార్చిలో రూ.3,500 కోట్లుగా ఉన్న సీడీఈ ప్రమోటర్ల వాటా విలువ మైండ్‌ట్రీ విక్రయ ప్రక్రియ ముగిసిన తర్వాత రూ.2,600 కోట్లకు పతనమైంది. కంపెనీ షేర్లు క్రమంగా నేలచూపులు చూడటంతో తనఖాలో ఉన్న సింహభాగం షేర్ల విలువ సైతం దిగజారింది. దీంతో ఉన్న అప్పులకు తోడు తనఖాలో ఉన్న షేర్లకు భద్రతగా మరికొన్ని నిధులు, ఆస్తులను హామీగా చూపాల్సిన పరిస్థితి నెలకొంది. మైండ్‌ట్రీలో వాటాలు విక్రయించినా అప్పులు కొలిక్కిరావడం, తనఖాలో ఉన్న షేర్ల విలువ తగ్గడంతో మరికొన్ని ఆస్తులను కుదువపెట్టాల్సిన పరిస్థతి సిద్ధార్ధపై ఒత్తిడి పెంచింది. కళ్లముందు లాభాలున్నా.. సీడీఈ ఏటా వెల్లడిస్తున్న ఆర్థిక ఫలితాల్లో నికర లాభం, మొత్తం రాబడి ఆకర్షణీయంగానే ఉన్నా పెరుగుతున్న అప్పులు, మార్కెట్లో ఎదురవుతున్న పోటీ సిద్ధార్ధను ఉక్కిరిబిక్కిరి చేసింది. కంపెనీ బోర్డు, ఉద్యోగులకు సిద్ధార్ధ రాసినట్టు చెబుతున్న లేఖలో తనను షేర్ల బైబ్యాక్‌పై ఓ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఒత్తిడి చేస్తోందని ప్రస్తావించారు. సిద్ధార్ధపై ఒత్తిడి తీసుకువచ్చిన పీఈ సంస్ధ ఎవరనేది ఇంకా వెల్లడికాలేదు. -
‘కాఫీ డేలో ఎన్నెన్నో ప్రేమకథలు, మరెన్నో ఙ్ఞాపకాలు’
సౌమ్యుడు, నిరాడంబరుడిగా పేరొందిన కాఫీ మొఘల్ వీజీ సిద్ధార్థ జీవితం అర్ధాంతరంగా ముగియడం పట్ల బిజినెస్ వర్గాలే కాకుండా సామాన్యులు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం అదృశ్యమైన కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్థ మృతదేహం నేటి ఉదయం లభ్యమైన విషయం తెలిసిందే. ఆర్థిక సమస్యలతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ మృతి పట్ల వ్యాపారవేత్తలు, పలువురు రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సిద్ధార్థ ‘కాఫీ డే’ తమకు మిగిల్చిన తీపి గుర్తులను తలచుకుంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ‘ఎన్నో పెళ్లిళ్లు, మరెన్నెన్నో ప్రేమకథలు, స్నేహితుల డేటింగ్లు, బిజినెస్ మీటింగులు, కెరీర్ ప్రణాళికల చర్చలు.. ఇలా ఎన్నెన్నో ముఖ్యమైన కార్యక్రమాలకు వేదికగా నిలిచిన కాఫీ డేలు 90ల్లో పుట్టిన వారికి ఎన్నో మధురానుభూతులను మిగిల్చాయి. కొత్త తరానికి కూడా చెరగని ఙ్ఞాపకాలు అందిస్తున్నాయి. వాటికి కారణమైన సిద్ధార్థ కథ ఇలా విషాదాంతంగా ముగుస్తుందనుకోలేదు. ఆయన ఇక లేరంటే నమ్మలేకపోతున్నాం. దేశ వ్యాపార సామ్రాజ్యానికి నేడు ఒక దుర్దినం’ అంటూ నెటిజన్లు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కాగా కెఫె కాఫీ డేను మొదట బెంగళూరు నగరంలో ప్రారంభించిన సిద్ధార్థ... తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ప్రస్తుతం దేశ, విదేశాల్లో 1800 పైగా కాఫీడేలు ఉన్నాయి. అనేక వ్యాపార రంగాల్లో వేలకోట్ల లావాదేవీలు చేసే స్థాయికి ఎదిగిన సిద్థార్థ కథ విషాదాంతమవడం పలువురిని కలచివేస్తోంది. -
నేత్రావతి నదిలో సిద్ధార్థ మృతదేహం లభ్యం
-
సిద్ధార్థ అదృశ్యం : కొత్త ట్విస్ట్
కెఫే కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థ అదృశ్యం కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సిద్ధార్థ రాసినట్టుగా చెబుతున్న లేఖపై ఆదాయ పన్ను శాఖ అనుమానాలను వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా కెఫే కాఫీ డే వార్షిక నివేదికలో ఉన్న సిద్ధార్థ సంతకంతో, తాజా లేఖలోని సంతకం సరిపోలడం లేదని ఐటీ శాఖ అధికారులు భావిస్తున్నారని తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. మరోవైపు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ కూడా సిద్ధార్థ అదృశ్యం, లేఖపై అనుమానం వ్యక్తం చేశారు. జూలై 28న తనకు కాల్ చేసి, ఒకసారి కలవగలరా తనను అడిగారని శివ కుమార్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలో జూలై 27న సిద్ధార్థ రాశారని చెబుతున్న లేఖ మర్మాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా సిద్ధార్థ కుటుంబంతో తనకు సాన్నిహిత్యం వుందనీ, ఎంతో ధైర్యవంతుడైన సిద్దార్థ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడంటే నమ్మలేకపోతున్నానంటూ శివకుమార్ ట్వీట్ చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. ఇది ఇలా వుంటే ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ ఈ సందర్భంగా ఐటీ అధికారుల వ్యవహార శైలిపై కొన్ని అభ్యంతరాలను లేవనెత్తారు. సిద్ధార్థ అదృశ్యంపై మీడియాతో మాట్లాడుతూ ఐటీ దాడుల సందర్భంగా ఆయా వ్యక్తులపై దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయన్నారు. ఆదాయ పన్నుఎగవేత కేసులను, ఆరోపణలను చట్టపరంగా విచారించాలి తప్ప అవమానకరంగా వ్యవహరించడం తగదని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని కోరారు. దీనిపై తక్షణమే విచారణకు ఆదేశించాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. పన్ను చెల్లింపు దారులకు గౌరవం దక్కాలని మోహన్‌దాస్ అభిప్రాయపడ్డారు. మరోవైపు సిద్దార్థ ఆచూకీకోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు ఇంకా ఒక కొలిక్కిరాలేదు. The letter purportedly written by Shri VG Siddhartha which is circulating is dated July 27th. I received a call from him on the 28th asking if we could meet up. It’s unbelievable that a courageous man like him would resort to this. pic.twitter.com/bXcJhHz0QS — DK Shivakumar (@DKShivakumar) July 30, 2019 -
వీజీ సిద్ధార్థ అదృశ్యం : నదిలో దూకింది ఎవరు?
కెఫే కాపీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్దార్థ హెగ్డే అదృశ్యంపై అనేక అనుమానాలు కొనసాగుతుండగా, స్థానిక మత్స్యకారుడు అందించిన సమాచారం కీలకంగా మారింది. సోమవారం రాత్రి ఒకవ్యక్తి నదిలోకి దూకుతుండగానే చూశాననీ, అతణ్ని రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ, భారీ వర్షం కారణంగా సాధ్యం కాలేదని సైమండ్ డిసౌజా (65) మీడియాకు తెలిపారని న్యూస్ మినిట్ రిపోర్ట్ చేసింది. ‘‘నా ఇల్లు రైల్వే వంతెన సమీపంలోనే ఉంది. చిన్నప్పటించీ చేపల వేటలో ఉన్నాను. నా ఫిషింగ్ నెట్ తీసుకొని ఇంటికి తిరిగి వస్తున్నా. ఇంతలో ఒక వ్యక్తి (ఆ వ్యక్తి ఎవరో తెలియదు) దూకతూ వుండటాన్ని చూశా.. అతని వైపు పరుగెత్తాను. అప్పటికే ఆయన దూకేశాడు. నా చిన్న బోటుసాయంతో రక్షించాలని చూశా. నా వల్ల కాలేదు. వెంటనే మా వాళ్లను పిలిచాను. కానీ, అప్పటికే ఆలస్యమైపోయిందం’’టూ సైమండ్ డిసౌజా తెలిపారు. వీజీ సిద్ధార్థ డ్రైవర్ బసవరాజు పాటిల్ అందించిన సమాచారం ప్రకారం సోమవారం సాయంత్రం మంగళూరులోని నేత్రావతి నదికి అడ్డంగా ఉన్న వంతెన సమీపంలో తన కారులోంచి దిగిపోయారు సిద్ధార్థ. ఒక గంటలో తిరిగి రాకపోవడంతో డ్రైవర్ భయపడి కాల్ చేశాడు. మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో ఆందోళన చెందిన పాటిల్ కుటుంబ సభ్యులకు, అనతరం పోలీసులకు సమాచారం అందించారు మరోవైపు సిద్ధార్థకోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు తనిఖీల్లో డాగ్ స్క్వాడ్ వంతెన మధ్యలో ఆగి పోయింది. ఈ సమాచారం ఆధారంగా బ్రిడ్జిపై ఉన్న పిల్లర్ 8 వద్ద తనిఖీని ముమ్మరం చేశారు. పోలీసులు, డైవర్లు, ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది సహా 150 మందికి పైగా ఈ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. తాను చాలాకాలంగా పోరాడుతూ అలసిపోయాననీ, వాటాలను తిరిగి కొనుగోలు చేయమని బలవంతం చేస్తున్న ప్రైవేట్ ఈక్విటీ భాగస్వాములు, ఇతర రుణదాతల నుండి ఎదుర్కొంటున్న "విపరీతమైన ఒత్తిడి" తనను ఈ పరిస్థితికి లొంగదీసిందని బోర్డుకి రాసిన చివరి లేఖలో సిద్ధార్థ పేర్కొన్నారు. బోర్డు అత్యవసర సమావేశం సోమవారం సాయంత్రం నుంచి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీజీ సిద్ధార్థ తప్పిపోయినట్లు మంగళవారం కంపెనీ ధృవీకరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కెఫే కాఫీ డే బోర్డు అత్యవసరంగా సమావేశమైంది. కాఫీ డే ఎంటర్ప్రైజెస్ కంపెనీ వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహించే టీం నేతృత్వం వహిస్తోందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. సిద్ధార్థ భార్య, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కుమార్తె, మాలవికా హెగ్డే 2008 నుంచి కంపెనీ నిర్వహణా, హాస్పిటాలిటీ బాధ్యతలను చూస్తున్నారు. అలాగే ఎస్ వి. రంగనాథ్, డాక్టర్ ఆల్బర్ట్ హిరోనిమస్, సులక్షణా రాఘవన్, సంజయ్ ఓంప్రకాష్ నాయర్ బోర్డు సభ్యులుగా ఉన్నారు. చదవండి: కాఫీ మొఘల్కు ఏమైంది? షేర్లు డీలా -
వ్యాపారవేత్తగా విఫలమయ్యాను.. క్షమించండి
-
ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నా : సిద్దార్థ
బెంగళూరు : కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్దార్థ అదృశ్యం సంచలనంగా మరింది. సోమవారం రాత్రి దక్షిణ కన్నడ జిల్లాలోని ఉల్లాల్ బ్రిడ్జిపై ఫోన్లో మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్లిన సిద్దార్థ కనిపించకుండా పోయారు. దీంతో ఆయన నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతని ఆచూకీ కోసం నదిలో అధికారులు ముమ్మర గాలింపు చేపడుతున్నారు. అయితే తను ఇంట్లో నుంచి వెళ్లే ముందు కాఫీ డే ఉద్యోగులకు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లకు ఓ లేఖను రాసినట్టుగా తెలుస్తోంది. అందులో తాను పారిశ్రామికవేత్తగా విఫలమైనట్టుగా ఆయన పేర్కొన్నారు. గతంలో ఇన్కమ్ ట్యాక్స్ డీజీగా పనిచేసిన వ్యక్తి నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నట్టు తెలిపారు. ‘37 ఏళ్లుగా ఎంతో కష్టపడి నిబద్ధతతో పనిచేశాను. మన కంపెనీల్లో ప్రత్యక్షంగా 30 వేల మందికి, బయట మరో 20 వేల మందికి ఉపాధి కల్పించాను. కానీ ప్రస్తుతం ఎంత ప్రయత్నించినా వ్యాపారాన్ని లాభాల బాట పట్టించలేకపోతున్నాను. ఓ ప్రయివేటు ఈక్విటీలోని షేర్లను బైబ్యాక్ చేయమని వాటాదారుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేకపోతున్నాను. ఇంతకు ముందు ఇన్కమ్ ట్యాక్స్ డీజీగా పనిచేసిన వ్యక్తి నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నాను. మీ అందరు నాపై ఉంచిన నమ్మకాన్ని కాదని వెళ్తున్నందుకు క్షమించండి. ఎవరిని మోసం చేయాలనేది, తప్పుదోవ పట్టించాలనేది నా ఉద్దేశం కాదు. తప్పులన్నింటికీ నా ఒక్కడిదే బాధ్యత. నేను జరిపిన ఆర్థిక లావాదేవీల గురించి నా టీమ్‌కు, ఆడిటర్లకు, మేనేజ్మెంట్కు తెలియదు. మీరంతా కొత్త యాజమాన్యంతో కలిసి ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఓ వ్యాపారవేత్తగా నేను విఫలమయ్యాను. ఏదో ఒక రోజు మీరంతా నన్ను అర్థం చేసుకుని క్షమిస్తారని అనుకుంటున్నాన’ని సిద్దార్థ లేఖలో పేర్కొన్నారు. కాగా, సిద్దార్థ చిక్‌మంగళూర్‌లో జిల్లాలో జన్మించారు. అతని తల్లిదండ్రులు కాఫీ తోటలను పెంచేవారు. దీంతో సిద్దార్థ కూడా ఆ రంగంలోకి ప్రవేశించారు. 1996లో తొలి కేఫ్ కాఫీ డేను ప్రారంభించారు. ఆ తర్వాత దాన్ని చాలా అభివృద్ధి చేశారు. కేఫ్ కాఫీ డేను అంతర్జాతీయ బ్రాండ్‌గా మార్చారు. దేశంలో ‘కాఫీ కింగ్’గా పేరొందారు. సిద్దార్థ ఇటీవల మైండ్ ట్రీ కంపెనీలో తనకున్న వాటాలను రూ. 3 వేల కోట్లకు అమ్మేశారు. కేఫ్ కాఫీ డేను కోకా కోలా కంపెనీకి అమ్మేందుకు సిద్దార్థ చర్చలు జరిపినట్టుగా వార్తలు వచ్చాయి. సిద్దార్థ బీజేపీ నాయకుడు ఎస్ఎం కృష్ణ పెద్ద కుమార్తె మాళవికను వివాహం చేసుకున్నారు. చదవండి : మాజీ సీఎం అల్లుడు అదృశ్యం -
కాఫీ డే ఐపీవో 14న
ధరల శ్రేణి రూ. 316-328 రూ. 1,150 కోట్ల సమీకరణ దాదాపు మూడేళ్లలోనే అతి పెద్ద ఐపీవో ముంబై: కెఫె కాఫీ డే (సీసీడీ)ని నిర్వహించే కాఫీ డే ఎంటర్ప్రైజెస్ ఈ నెల 14న ఐపీవోకి రానుంది. ఇందుకోసం షేర్ల ధరల శ్రేణిని రూ. 316-328గా నిర్ణయించింది. తద్వారా రూ. 1,150 కోట్లు సమీకరించనుంది. దీంతో దాదాపు 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 6,500 కోట్లు) వాల్యుయేషన్‌ని దక్కించుకునే అవకాశముంది. ఈ నెల 16న ఐపీవో ముగుస్తుంది. గడిచిన మూడేళ్లలో ఇదే భారీ ఐపీవో కానుండటం గమనార్హం. కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఐపీవో మార్కెట్ .. కాఫీ డే రాకతో మళ్లీ కళకళ్లాడగలదని అంచనాలు నెలకొన్నాయి. దీన్ని బట్టే ఇన్ఫీబీమ్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ తదితర సంస్థలు కూడా ఐపీవోకి రానున్నాయి. ఇన్ఫీబీమ్.. భారత్‌లో ఐపీవోకి వస్తున్న తొలి ఈ-కామర్స్ సంస్థ కాగా, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్.. ఇండిగో బ్రాండ్ పేరిట విమానయాన సర్వీసులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో వచ్చిన ఐపీవోలన్నీ చిన్న మొత్తాలకు సంబంధించినవే. 2014లో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ఆరు సంస్థలు కలిసి కేవలం రూ. 1,528 కోట్లే సమీకరించగలిగాయి. విస్తరణకు నిధులు: ఐపీవోలో దాదాపు రూ. 15 కోట్ల విలువ చేసే షేర్లను తమ కంపెనీలో పనిచేసే అర్హులైన ఉద్యోగుల కోసం కాఫీ డే కేటాయిస్తోంది. కనీసం 45 షేర్ల చొప్పున బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. సమీకరించిన నిధుల్లో రూ. 635 కోట్లు.. హోల్డింగ్ కంపెనీ రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగించనుంది. మరో రూ. 290 కోట్లు వచ్చే 18 నెలల్లో కార్యకలాపాల విస్తరణ కోసం వెచ్చించనున్నట్లు, మిగతా రూ. 125 కోట్లను కాఫీ వ్యాపారాభివృద్ధికి ఉపయోగించనున్నట్లు సంస్థ చైర్మన్ వీజీ సిద్ధార్థ తెలిపారు. ప్రతి సంవత్సరం 135 కొత్త స్టోర్స్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. సిద్ధార్థ సహా ప్రమోటర్లకు కంపెనీలో 92.74 శాతం వాటాలు ఉన్నాయి.