సాక్షి, న్యూఢిల్లీ : కాఫీకి కార్పొరేట్ హంగులద్ది కోట్లకు పడగలెత్తిన కేఫ్ కాఫీ డే (సీసీడీ) వ్యవస్దాపకుడు వీజీ సిద్ధార్ధ విషాదాంతం కార్పొరేట్ భారతాన్ని కలవరపరుస్తోంది. వేల కోట్ల టర్నోవర్‌తో పాటు కాఫీ తోటలు, భూములు, ఇతర వ్యాపారాలతో విస్తరించిన సీసీడీ సామ్రాజ్యాధినేత సిద్ధార్థ తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది అందరి మదినీ తొలిచేస్తోంది. అప్పులకు మించిన ఆస్తులున్నాయని యాజమాన్యం చెబుతుంటే డేరింగ్ ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగిన సిద్ధార్థ బలవన్మరణానికి పాల్పడటం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
2019 మార్చి నాటికి సీసీడీ రుణభారం ఏకంగా రూ 6,547 కోట్లకు ఎగబాకిందని 2018-19 ఆర్ధిక సంవత్సరానికి సంస్థ వెల్లడించిన అన్‌ఆడిటెడ్ ఆర్థిక ఫలితాలు వెల్లడించాయి. రుణభారం తగ్గించుకునేందుకు ఐటీ సంస్థ మైండ్‌ట్రీలో తనకున్న వాటాలను రూ 3269 కోట్లకు విక్రయించి ఆ నిధులన్నింటినీ పూర్తిగా రుణాలు తీర్చేందుకు వెచ్చించారు. ఈ ఒప్పందానికి సంబంధించి తమకు రూ 300 కోట్లకు పైగా పన్ను చెల్లించాల్సి ఉండగా తమకు కేవలం రూ 46 కోట్లే చెల్లించారని ఆదాయ పన్ను శాఖ సీసీడీపై దాడులు చేపట్టింది.
ఇక సిద్ధార్థ కుటుంబానికి సీసీడీ పేరెంట్ కంపెనీ కాఫీడే ఎంటర్‌ప్రైజెస్(సీడీఈ)లో 53.43శాతం వాటా ఉంది. దీనిలో 75శాతం వాటాలు తనఖా కింద ఉన్నాయి. వ్యక్తిగతంగా సిద్ధార్థకు సీడీఈలో ఉన్న 32.75 శాతం వాటాలో దాదాపు 70శాతం షేర్లు తనఖాలోనే ఉన్నాయి.
అప్పులు పెరిగి.. వాటా కరిగి..
రుణభారంతో సతమతం కావడం, ముసురుతున్న సవాళ్లతో సీడీఈ మార్కెట్ షేర్ పతనం సిద్ధార్థ ధీమా సడలిపోయేందుకు సంకేతమైంది. మార్చిలో రూ.3,500 కోట్లుగా ఉన్న సీడీఈ ప్రమోటర్ల వాటా విలువ మైండ్‌ట్రీ విక్రయ ప్రక్రియ ముగిసిన తర్వాత రూ.2,600 కోట్లకు పతనమైంది. కంపెనీ షేర్లు క్రమంగా నేలచూపులు చూడటంతో తనఖాలో ఉన్న సింహభాగం షేర్ల విలువ సైతం దిగజారింది. దీంతో ఉన్న అప్పులకు తోడు తనఖాలో ఉన్న షేర్లకు భద్రతగా మరికొన్ని నిధులు, ఆస్తులను హామీగా చూపాల్సిన పరిస్థితి నెలకొంది. మైండ్‌ట్రీలో వాటాలు విక్రయించినా అప్పులు కొలిక్కిరావడం, తనఖాలో ఉన్న షేర్ల విలువ తగ్గడంతో మరికొన్ని ఆస్తులను కుదువపెట్టాల్సిన పరిస్థతి సిద్ధార్ధపై ఒత్తిడి పెంచింది.
కళ్లముందు లాభాలున్నా..
సీడీఈ ఏటా వెల్లడిస్తున్న ఆర్థిక ఫలితాల్లో నికర లాభం, మొత్తం రాబడి ఆకర్షణీయంగానే ఉన్నా పెరుగుతున్న అప్పులు, మార్కెట్‌లో ఎదురవుతున్న పోటీ సిద్ధార్ధను ఉక్కిరిబిక్కిరి చేసింది. కంపెనీ బోర్డు, ఉద్యోగులకు సిద్ధార్ధ రాసినట్టు చెబుతున్న లేఖలో తనను షేర్ల బైబ్యాక్‌పై ఓ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఒత్తిడి చేస్తోందని ప్రస్తావించారు. సిద్ధార్ధపై ఒత్తిడి తీసుకువచ్చిన పీఈ సంస్ధ ఎవరనేది ఇంకా వెల్లడికాలేదు.
Comments
Please login to add a commentAdd a comment