దేశంలోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా పేరున్న ముంబై నగరంలో కోట్లాది రూపాయలు పెట్టి భవంతులు, ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఓ వజ్రాల వ్యాపారి సుమారు రూ.97 కోట్లు పెట్టి ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు.
రియల్‌ఎస్టేట్ సమాచార సంస్థ జాప్‌కీకి లభించిన పత్రాల ప్రకారం.. డైమండ్ కంపెనీ కిరణ్ జెమ్స్ ప్రమోటర్ మావ్‌జీభాయ్ షామ్‌జీభాయ్ పటేల్ ముంబైలోని పోష్ ఒబెరాయ్ 360 వెస్ట్‌లో రూ. 97.4 కోట్లతో అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు.
వర్లీలో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ భవనాన్ని ముంబైలోని అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్‌లో ఒకటిగా పరిగణిస్తారు.
అపార్ట్‌మెంట్ భవనంలోని 47వ అంతస్తులో మావ్‌జీభాయ్ కొన్న ఫ్లాట్ 14,911 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ విస్తీర్ణాన్ని మరో 884 చదరపు అడుగులు విస్తరించుకునేందుకు అవకాశం ఉంటుంది. పత్రాల ప్రకారం.. దీని విక్రేత ఒయాసిస్ రియాల్టీ భాగస్వామి అయిన స్కైలార్క్ బిల్డ్‌కాన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ అపార్ట్‌మెంట్ తొమ్మిది కార్ పార్కింగ్ స్లాట్‌లతో వస్తుంది. సేల్ డీడ్ ఏప్రిల్ 29న జరిగినట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీపై పటేల్ రూ.5.8 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు.
ముంబైలోని 360 వెస్ట్ ప్రాజెక్ట్ 4 బీహెచ్‌కే, 5 బీహెచ్‌కే యూనిట్‌లను కలిగి ఉంటుంది. రెండు టవర్లుగా ఉండే ఈ భవనంలో ఒక దాంట్లో రిట్జ్-కార్ల్‌టన్ హోటల్ ఉండగా మరో టవర్‌లో విలాసవంతమైన నివాసాలు ఉన్నాయి. వీటిని గ్లోబల్ హాస్పిటాలిటీ చైన్ నిర్వహిస్తోంది. సముద్ర వీక్షణ ప్రాజెక్ట్ అయిన దీని ఎత్తు 360 మీటర్లు ఉండటం, అన్ని అపార్ట్‌మెంట్‌లు పడమర వైపు ఉన్నందున దీనికి ఈ పేరు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment