
ముంబైలోని అత్యంత చరిత్రాత్మకమైన ప్రాపర్టీలలో ఒకటైన లక్ష్మీ నివాస్ బంగ్లా రికార్డు స్థాయి రియల్ ఎస్టేట్ వ్యవహారంలో చేతులు మారింది. నెపియాన్ సీ రోడ్డులో ఉన్న ఈ చారిత్రక భవనాన్ని రూ.276 కోట్లకు విక్రయించారు. ఇది నగరంలో అత్యంత ఖరీదైన నివాస లావాదేవీలలో ఒకటిగా నిలిచింది. భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన లక్ష్మీ నివాస్ దాని నిర్మాణ వైభవానికి మించి చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది.
చరిత్రలో నిలిచిపోయిన భవనం
1904లో పార్శీ కుటుంబం నిర్మించిన లక్ష్మీ నివాస్ తరువాత 1917లో కపాడియా కుటుంబం యాజమాన్యంలోకి వచ్చింది. అప్పట్లో కేవలం రూ.1.20 లక్షలకు దీన్ని కొనుగోలు చేశారు. భారత స్వాతంత్య్రోద్యమ కీలక దశలో (1942-1945) లక్ష్మీ నివాస్ దేశంలోని ప్రముఖ విప్లవకారులకు సురక్షిత స్థావరంగా ఆశ్రయం కల్పించింది. రామ్ మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్, అచ్యుత్ పట్వర్ధన్, అరుణా అసఫ్ అలీ వంటి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఇక్కడ ఆశ్రయం పొందారు.
అంతేకాదు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ రేడియోకు కీలక ప్రసార కేంద్రంగా ఈ బంగ్లా పనిచేసింది. భారత స్వాతంత్ర్య పోరాట గళాన్ని పెంచింది. బంగ్లా ఉన్న నెపియాన్ సీ రోడ్ ఒకప్పుడు బికనీర్ ప్యాలెస్, కచ్ కోట, వాకనర్ హౌస్ వంటి రాయల్ ఎస్టేట్లతో పాటు ఉన్నత స్థాయి బ్రిటిష్ అధికారుల నివాసాలకు నిలయంగా ఉండేది. అందువల్ల లక్ష్మీ నివాస్ వలసవాద చరిత్రకు, భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రతీకగా నిలుస్తుంది.
రికార్డు స్థాయి డీల్
జాప్కీకి లభించిన రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్లు, ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం లక్ష్మీ నివాస్ అమ్మకం గత ఫిబ్రవరి 28న ఖరారైంది. ఈ లావాదేవీలో రూ.16.56 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు తెలుస్తోంది. 19,891 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లా అమ్మకం ధర చదరపు అడుగుకు సుమారు రూ.1.38 లక్షలుగా ఉండటం ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్ కు నిదర్శనం. ఈ ప్రాపర్టీలో గ్రౌండ్ ఫ్లోర్, రెండు పై అంతస్తులు, వెనుక భాగంలో అదనపు నిర్మాణం ఉన్నాయి. ఇది దక్షిణ ముంబై నడిబొడ్డున విశాలమైన ఎస్టేట్‌గా ఉంది.
కొత్త ఓనర్లకు అంబానీతో లింక్
ఈ ప్రతిష్టాత్మక లక్ష్మీ నివాస్ బంగ్లాను ఇప్పుడు అంబానీ కుటుంబానికి చెందిన వాగేశ్వరి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ తన కీలక వాటాదారుల ద్వారా సొంతం చేసుకుంది. ఈ కంపెనీకి చెందిన ఎలీనా నిఖిల్ మేస్వానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అంబానీ వ్యాపార సామ్రాజ్యంలో కీలక వ్యక్తి అయిన నిఖిల్ మేస్వానీ సతీమణి. ఇక ఈ నిఖిల్ మేస్వానీ ఎవరో కాదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరైన రసిక్‌లాల్ మేస్వానీ కుమారుడు. ఈయన ధీరూభాయ్ అంబానీ అక్క త్రిలోచన మేనల్లుడు.
Comments
Please login to add a commentAdd a comment