సాధారణంగా వ్యాపార ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు ఖరీదైన ఇళ్లు కొంటూ వార్తల్లో నిలుస్తుంటారు. కానీ ముంబైలోని ఒక పెంట్‌హౌస్ వార్తల్లో నిలిచింది. రూ.120 కోట్లకు అమ్మకానికి పెట్టిన ఈ ఇంటికి ‘అర్హులైన’ కొనుగోలుదారు దొరకడం లేదు. చాలా మంది సెలబ్రిటీలు రూ.కోట్లు పెట్టి కొనడానికి ముందుకు వచ్చినా ఓనర్ వారికి అమ్మడం లేదు.
వన్ అవిఘ్నా పార్క్ 60వ అంతస్తులో ఉన్న విశాలమైన 16,000 చదరపు అడుగుల ఈ పెంట్ హౌస్ గ్లాస్-వాల్డ్ ఎలివేటర్, రూఫ్‌టాప్ పూల్, జిమ్, ఆరు బెడ్‌రూమ్‌లు, ఎనిమిది వాహనాల వరకు పార్కింగ్ వంటి అనేక విలాసవంతమైన ఫీచర్లను అందిస్తుంది. అద్భుతమైన ఆఫర్‌లు ఉన్నప్పటికీ, యజమాని కఠినమైన ఎంపిక ప్రమాణాల కారణంగా కొనుగోలుదారు దొరకడం లేదు.
డబ్బుకు మించి..
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఈ ఇంటి అమ్మకం లక్ష్యం కేవలం డబ్బు మాత్రమే కాదని పెంట్ హౌస్ యజమాని, భవనాన్ని అభివృద్ధి చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీకి అధిపతి కూడా అయిన నిశాంత్ అగర్వాల్ చెబుతున్నారు. “ఈ ఇంటిని కేవలం డబ్బుతో కొనలేరు. కొనుగోలుదారు సరైన వ్యక్తి అని మేము నిర్ధారించుకోవాలి" అని అగర్వాల్ వివరించారు.
సేల్‌ను పర్యవేక్షించేందుకు, ప్రముఖ రియల్ ఎస్టేట్ బ్రోకర్ రవి కేవల్‌రమణితో సహా ఉన్నత స్థాయి బృందం ఏర్పాటు చేశారు. కొనుగోలుదారుల ఆర్థిక స్థితి, సమాజంలో ప్రతిష్టతోపాటు వారి నేపథ్యాన్ని సమగ్రంగా తనిఖీ చేస్తారు. ఇందు కోసం కొనుగోలుదారుల ఆఫీస్‌లను సైతం సందర్శించాలని ఏజెంట్లకు సూచనలు ఉండటం గమనార్హం.
స్క్రీనింగ్‌లో ఫెయిల్
బాలీవుడ్ సెలబ్రిటీలు సహా డజన్ల కొద్దీ ప్రముఖులు పెంట్ హౌస్ కొనుగోలుపై ఆసక్తి చూపినప్పటికీ, యజమాని నిర్ణయించిన కఠినమైన అర్హతలను ఎవరూ అందుకోలేకపోతున్నారు. పరిశ్రమలోని కొన్ని పెద్ద స్టార్స్ కూడా స్క్రీనింగ్ ప్రక్రియలో
అర్హత సాధించలేదని కేవల్‌రమణి తెలిపారు. "మేము పొరుగువారితో బాగా కలిసిపోయే కుటుంబాన్ని కోరుకుంటున్నాము. వినయంతోపాటు తమ సంపదను చాటుకోని గుణం ఉన్నవారు కావాలి" అని ఆయన చెప్పారు.
ఒకవేళ తాము కోరుకుంటున్న సరైన కొనుగోలుదారు రాకపోతే నెలకు రూ.40 లక్షలకు ఈ పెంట్‌హౌస్‌ను అద్దెకు ఇవ్వాలని యాజమాన్యం యోచిస్తోంది. అయితే అద్దెకు వచ్చేవారికి కూడా అదే కఠినమైన పరిశీలన ప్రక్రియ వర్తిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment