దేశంలోనే అత్యంత ఖరీదైన నగరమేది అంటే ముంబై అని టక్కున చెప్పేస్తారు. దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ఈ నగరంలో భూమి కొరత ఎక్కువగా ఉండటమే ధరలు ఆ స్థాయిలో ఉండటానికి కారణమని చెబుతారు. ఇంత ఖరీదైన నగరంలో స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ (SRA) నిర్వహించిన ఒక సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
మహారాష్ట్రలోని మురికివాడల పునరాభివృద్ధి ప్రాజెక్టులను నియంత్రించే స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ 2015 సర్వే ప్రకారం.. ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్ లక్ష ఎకరాలకుపైగా విస్తీర్ణంలో విస్తరించింది. ఇందులో నివాసయోగ్యమైన భూమి భాగం సుమారు 34 వేల ఎకరాలు.ఇందులో దాదాపు 20 శాతం భూమి తొమ్మిది మంది ల్యాండ్‌లార్డ్‌ల చేతిలోనే ఉంది. వీరిలో ప్రయివేటు సంస్థలు, వ్యాపార కుటుంబాలు, ట్రస్టులు ఉన్నాయి.
అతిపెద్ద ల్యాండ్‌లార్డ్ గోద్రెజ్
స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ సర్వే ప్రకారం.. ముంబైలోని విఖ్రోలి ప్రాంతంలో గోద్రెజ్ కుటుంబానికి 3,400 ఎకరాలకు పైగా భూమి ఉంది. విఖ్రోలిలోని ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే పక్కనే ఈ భూమి ఉంది. అయితే ఈ భూమిపై కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులతో కూడిన భూమి విలువను పరిగణనలోకి తీసుకుంటే, అది దాదాపు రూ.30,000 కోట్లు ఉండవచ్చు. పరిమితులను లేకుండా అయితే రూ.50,000 కోట్లకు పైగా ఉంటుందని రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు.
గ్రోద్రెజ్ తర్వాత ఎఫ్‌ఈ దిన్షా ట్రస్ట్ రెండవ స్థానంలో ఉంది. మలాడ్, పరిసర ప్రాంతాల్లో ఇది దాదాపు 683 ఎకరాల భూమిని కలిగి ఉంది. ఎఫ్‌ఈ దిన్షా ఒక పార్సీ న్యాయవాది, ఫైనాన్సర్. 1936లో మరణించారు. ఈ భూమిని క్రమంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ వస్తోంది. ఇక మూడవ స్థానంలో ప్రతాప్‌సింగ్ వల్లభదాస్ సూర్జీ కుటుంబం ఉంది. ఈ కుటుంబానికి ముంబైలోని భాండూప్, దాని పరిసరాల్లో సుమారు 647 ఎకరాల భూమి ఉంది.
నాల్గవ స్థానంలో ఉన్న జీజీబోయ్ అర్దేషిర్ ట్రస్ట్‌కు ముంబైలోని చెంబూర్‌లో 508 ఎకరాల భూమి ఉంది. ఆ తర్వాత ఏహెచ్ వాడియా ట్రస్ట్‌కు కుర్లాలో 361 ఎకరాలు ఉంది. ఇందులో చాలామటుకు ఆక్రమణకు గురైంది. సర్వే ప్రకారం ముంబైలోని వివిధ ప్రాంతాల్లో బైరామ్జీ జీజీబోయ్ ట్రస్ట్ 269 ఎకరాల భూమిని కలిగి ఉంది. ఇవే కాకుండా, సర్ ముహమ్మద్ యూసుఫ్ ఖోట్ ట్రస్ట్, వీకే లాల్ కుటుంబం వంటి ఇతర ప్రైవేట్ భూస్వాములకు కూడా ముంబైలోని కంజుర్‌మార్గ్, కండివాలి ప్రాంతంలో భారీగా భూములు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment