సంపద సృష్టి లేదు.. ఆరు నెలలుగా బాబు పన్నుల బాదుడే
బడ్జెట్‌లో రూ.65,590 కోట్లు అప్పు
బడ్జెటేతర అప్పు రూ.9,000 కోట్లు
రాజధాని పేరుతో రూ.31 వేల కోట్లు రుణం.. అమరావతికే మరో రూ.21 వేల కోట్లు కూడా సమీకరించేందుకు సన్నద్ధం
అమ్మకం పన్ను, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం ఢమాల్
కేంద్రం నుంచి గ్రాంట్లు రూ.12,510 కోట్లు తగ్గుదల
రెవెన్యూ లోటు రూ.9,742 కోట్లు పెరుగుదల
నవంబర్ వరకు బడ్జెట్ గణాంకాలను వెల్లడించిన కాగ్
సాక్షి, అమరావతి: సంపద సృష్టించి సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తానంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు తిలోదకాలిచ్చిన సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని రుణ భారంతో ముంచెత్తుతున్నారు. బడ్జెట్‌లోనూ, బడ్జెటేతర అప్పుల్లోనూ దూసుకుపోతున్నారు. ఆర్నెల్లలోనే రూ.లక్ష కోట్లకుపైగా అప్పుల దిశగా రాష్ట్రం పరుగులు తీస్తోంది. మరోవైపు గత ఏడాదితో పోల్చితే అమ్మకాల పన్ను ఆదాయంతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సిన నిధుల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. రెవెన్యూ లోటు భారీగా పెరిగిపోయింది. ఈ ఆర్థిక ఏడాదిలో నవంబర్ వరకు రాబడులు, వ్యయాలకు సంబంధించి కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) వెల్లడించిన గణాంకాలే ఇందుకు నిదర్శనం.
రాజధానికి రూ.52 వేల కోట్లు!
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడ్జెట్, బడ్జెటేతర అప్పులు ఏకంగా రూ.74,590 కోట్లకు చేరాయి. బడ్జెట్ అప్పులే నవంబర్ వరకు రూ.65,590 కోట్లకు చేరినట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోపక్క ప్రభుత్వ గ్యారెంటీతో బడ్జెటేతర అప్పులు మరో రూ.9,000 కోట్లకు ఎగబాకాయి. ఇక రాజధాని పేరుతో ప్రపంచ బ్యాంకు, హడ్కో, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ నుంచి ఏకంగా రూ.31 వేల కోట్లు అప్పు చేసేందుకు కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ఈ మేరకు సీఆర్‌డీఏకు అనుమతిస్తూ మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
అంటే సీఎం చంద్రబాబు ఆర్నెల్ల పాలనలో ఇప్పటికే చేసిన అప్పులు, చేయనున్న అప్పులు కలిపి మొత్తం రూ.1.05 లక్షల కోట్లకు చేరుకోనున్నాయి. అంతేకాకుండా ప్రాథమిక అంచనా మేరకు రాజధానికి రూ.52 వేల కోట్ల మేర నిధులు అవసరమని, ఇప్పటికే రూ.31 వేల కోట్లు సమీకరించినందున మిగతా నిధులు రూ.21 వేల కోట్లు కూడా సమీకరించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఆర్‌డీఏకి ప్రభుత్వం నిర్దేశించింది. సంపద సృష్టి అంటే అప్పులు చేయడమే అనే రీతిలో చంద్రబాబు పాలన కొనసాగుతోందనేందుకు ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉండదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
పథకాలు లేవు.. పన్నుల మోతలే
సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకపోగా అధికారంలోకి రాగానే విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై పెనుభారం మోపారు. ఏ ఒక్క పథకం అమలు కాకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. అమ్మకం పన్ను ఆదాయం భారీగా తగ్గిపోవడమే దీనికి నిదర్శనం. కాగ్ గణాంకాల మేరకు గతేడాది నవంబర్‌తో పోల్చితే ఈ ఏడాది నవంబర్ నాటికి అమ్మకం పన్ను ఆదాయం రూ.1,043 కోట్లు తగ్గిపోయింది. స్టాంపులు, రిజి్రస్టేషన్ల ఆదాయం రూ.868 కోట్లు క్షీణించింది. మరోపక్క కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు రూ.12,510 కోట్లు తగ్గిపోయాయి. విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు సంబంధించి సామాజిక వ్యయం కూడా గత నవంబర్‌తో పోల్చితే తగ్గిపోయిందని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. మరోవైపు రెవెన్యూ లోటు రూ.9,742 కోట్లు అదనంగా పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment