సిద్ధార్థ ఆత్మహత్యకు కారణాలు ఏమిటీ? | Why Cafe Coffee Day Siddharth Is A Failed Entrepreneur | Sakshi
Sakshi News home page

‘కేఫ్‌ కాఫీ డే’కు ఎందుకు నష్టాలు ?

Published Thu, Aug 1 2019 3:30 PM | Last Updated on Thu, Aug 1 2019 3:30 PM

Why Cafe Coffee Day Siddharth Is A Failed Entrepreneur - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బరిస్టా బ్రాండ్‌తోపాటు దేశంలో భిన్న రుచుల కాఫీలను తాగే సంస్కతిని ప్రోత్సహిస్తూ రెండు దశాబ్దాల పాటు ఫ్రాంచైజ్‌లను విస్తరిస్తూ పోయిన ‘కేఫ్‌ కాఫీ డే’ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ? వ్యాపారంలో పరాజయం కారణంగా తలెత్తిన ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజంగానే ఆయన ఆర్థిక పరిస్థితి అంతకు దిగజారిందా? దేశంలోనే అతిపెద్ద కాఫీ బ్రాండ్‌గా విస్తరించినప్పటికీ ‘కేఫ్‌ కాఫీ డే’ ఎందుకు లాభాలను గడించలేకపోయింది? దేశంలో 200 స్టోర్లను కలిగిన బరిస్టా కంటే కాస్త మెరుగ్గా, కాస్త చౌకగా కాఫీలను అందించడం ద్వారా కేఫ్‌ కాఫీ డే దేశంలో వేగంగా విస్తరించగలిగింది.

కోస్టా కాఫీ, కాఫీ బీన్, టీ లీఫ్‌ లాంటి కొత్త బ్రాండులు మార్కెట్‌లోకి ప్రవేశించినప్పటికీ కాఫీ డేకు అవి పోటీకాలేక పోయాయి. కాఫీ డేకు 2015లో 155 కోట్ల రూపాయలు, ఆ మరుసటి ఏడాది, 2016లో 80 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. 2017లో మూడేవేల కోట్ల రూపాయల అమ్మకాల ద్వారా కేవలం 8 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. 2018లో 49 కోట్లు, 2019లో 60 కోట్ల లాభాలను ఆర్జించింది. కాకపోతే కాఫీ డే అనుబంధ సంస్థ ‘గ్లోబల్‌ ఎడ్జ్‌ సాఫ్ట్‌వేర్‌’ అమ్మకాల ద్వారానే 98 కోట్ల రూపాయలు వచ్చాయి. ప్రస్తుతం కాఫీ డే ఏటా సరాసరి 4,200 కోట్ల రూపాయల అమ్మకాలు నిర్వహిస్తున్న పెద్దగా లాభాలు ఎందుకు రాలేదు ? ఈ రంగంలో ఇతర సంస్థలకు కూడా లాభాలేమీ లేవు. బరిస్టా దేశవ్యాప్తంగా ఉన్న తన కాఫీ చైన్లను తగ్గించుకుంటూ వస్తోంది. కోస్టా కాఫీ అయితే ఒక్క విమానాశ్రయాల్లో మినహా అంతటా కనుమరుగైంది. ‘స్టార్‌బక్స్‌’ ఓ మోస్తారుగా నడుస్తోంది.

దేశవ్యాప్తంగా వెయ్యి స్టోర్ల ఫ్రాంచైజ్‌ కలిగిన ‘కేఫ్‌ కాఫీ డే’నే మార్కెట్‌లో నిలబడగలుగుతుందని నిపుణులు భావించారు. వినూత్నమైన కాఫీ సంస్కతికి ప్రసిద్ధి చెంది యునెస్కో జాబితాలో చోటు చేసుకున్న ఒక్క ‘వియన్నా’ నగరంలో స్టోర్‌ను ఏర్పాటు చేయడం మినహా వీజీ సిద్ధార్థ వ్యాపార పరంగా ఏ పొరపాటు చేయలేదు. క్యాపిటల్‌ మార్కెట్లో రాణించడం ద్వారా వ్యాపారస్థుడైన సిద్ధార్థ ఇన్ఫోసిస్‌లాంటి అనేక సాంకేతిక టెక్నాలజీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా బడా వ్యాపారిగా ఎదిగారు. ఇప్పటికీ అలాంటి సంస్థలే తన కాఫీ డేను బతికిస్తున్నప్పటికీ ఎందుకు ఆయన బతకాలని అనుకోలేదు ? సహజంగా పెద్ద రైతు బిడ్డ సిద్ధార్థ. తన పొలాల్లోనే తన కాఫీ బ్రాండ్‌ను పండిస్తున్నారు. అందుకనే ఈ బ్రాండ్‌పైనే ఆయన కు ప్రత్యేక మమకారం ఏర్పడి ఉంటుంది.

పలు ఇంటర్వ్యూలో కూడా ఆయన ఈ విషయాన్ని చెప్పారు. 20 ఏళ్లు అయినప్పటికీ ఈ రంగంలో నిలదొక్కుకోలేక పోతున్నాననే బాధ ఆయన్ని కుంగదీసి ఉంటుంది. కాఫీ తాగే సంస్కతి భారత్‌లో బలంగా ఉన్నప్పటికీ ‘కాఫీ డే సంస్కతి’ ఇంకా అంతగా ఎదగలేదు. పాశ్చాత్యుల్లాగా ఖరీదైన భవనాల్లోని అందమైన లాంజీల్లో గంటల తరబడి కూర్చొని కాఫీలు తాగుతూ డాలర్లలో డబ్బులు చెల్లించడం భారతీయులకు సాధ్యమయ్యే పనికాదు. విదేశాల్లో ఇలాంటి కాఫీ కేఫుల్లోనే గంటల తరబడి కూర్చునే ఆఫీసు పనులు కూడా చేసుకుంటారు. ఇంకా ఆ సంస్కతి సంపూర్ణంగా మనకు రాకపోవడం ఈ రంగంలో వైఫల్యాలకు మరో కారణం. ఇప్పటికీ కార్మికులు, సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న భారత్‌లో అందుబాటులో ఉండే చిన్న చిన్న కేఫ్‌లకే ఆదరణ ఎక్కువ. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోక పోవడం కూడా పొరపాటే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement