సాక్షి, ముంబై : కెఫే కాఫీడే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య అనంతరం భారీగా నష్టపోయిన కాఫీ డే షేర్లు సోమవారం భారీగా పుంజుకున్నాయి. ఒకవైపు రుణ భారాన్ని తగ్గించుకోనే చర్యలు, మరోపక్క పానీయాల గ్లోబల్ కంపెనీ కోక కోలా వాటాను కొనుగోలు చేయవచ్చన్న అంచనాల నేపథ్యంలో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ కౌంటర్లో జోష్ నెలకొంది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో 5 శాతానికిపైగా లాభపడి రూ. 65.80 వద్ద అప్పర్ సర్క్యూట్ అయింది. సిద్ధార్థ అదృశ్యం, మరణానంతరం షేరు ధర మూడువారాల్లో (జులై 26 నుంచి) 68 శాతం పతనమైంది.
పానీయాల రిటైల్ స్టోర్ల కంపెనీ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ రూ. 2,400 కోట్ల రుణాలను తిరిగి చెల్లించనున్నట్లు తాజాగా వెల్లడించింది. దీంతో గ్రూప్ రుణ భారం ఆమేర తగ్గనునందని వివరించింది. జులై చివరికల్లా గ్రూప్ రుణభారం రూ.4970 కోట్లుగా నమోదైనట్లు తెలియజేసింది. దీనిలో కాఫీడే రుణభారాన్ని రూ.3472 కోట్లుగా పేర్కొంది. ప్రధానంగా బెంగళూరులోని గ్లోబల్ విలేజ్ పార్క్‌ను పీఈదిగ్గజం బ్లాక్‌స్టోన్‌కు విక్రయించడం ద్వారా ఈ రుణభారాన్ని తగ్గించుకోనున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోపక్క కంపెనీలో వాటాను విక్రయించేందుకు గ్లోబల్ దిగ్గజం కోక కోలాతో కాఫీ డేలో తిరిగి చర్చలు ప్రారంభించినట్లు మీడియా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ అంశంపై రెండు కంపెనీలూ అధికారికంగా స్పందించాల్సి వుంది.
Comments
Please login to add a commentAdd a comment