భారతీయ సాంకేతిక రంగంలోని కంపెనీలు 2024 జులై–సెప్టెంబర్ కాలంలో 635 మిలియన్ డాలర్ల (రూ.5,330 కోట్లు) విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఒప్పందాల విలువ 31 శాతం పెరుగుదలను నమోదు చేసినట్లు కన్సల్టింగ్ కంపెనీ ‘గ్రాంట్ థ్రాంటన్ భారత్’ వెల్లడించింది. అందుకుగల కారణాలు విశ్లేషిస్తూ సంస్థ నివేదిక విడుదల చేసింది.
నివేదికలోని వివరాల ప్రకారం..యూఎస్ ఫెడ్ ఇటీవల కీలక వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అది టెక్ కంపెనీలకు సానుకూలాంశంగా మారింది. లోన్లు అధికంగా జారీ చేస్తూ టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేసుకునేందుకు ఫైనాన్స్ సంస్థలు ఆసక్తి చూపుతాయి. భారత్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత అనిశ్చితులు తొలగి స్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది. దాంతో సెప్టెంబర్ త్రైమాసికంలో 79 ఒప్పందాలు జరిగాయి. గతంలో కంటే ఈ ఒప్పందాల విలువ 31 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 20 మిలియన్ డాలర్ల(రూ.168 కోట్లు)కు పైగా విలువ కలిగిన డీల్స్ 12 నమోదయ్యాయి. విలీనాలు, కొనుగోళ్లు జూన్ త్రైమాసికంతో పోలిస్తే 44 శాతం పెరిగాయి. ఇవి గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 53 శాతం అధికమై 26 డీల్స్‌కు చేరుకున్నాయి. ఈ ఒప్పందాల విలువ 205 శాతం దూసుకెళ్లి 116 మిలియన్ డాలర్లు(రూ.975 కోట్లు)గా నమోదైంది.
ఇదీ చదవండి: గరిష్ఠాలను చేరిన బంగారం ధర!
భారత్‌పట్ల బుల్లిష్‌గా..
‘పెట్టుబడిదారులు భారతీయ మార్కెట్‌పై చాలా బుల్లిష్‌గా ఉన్నారు. మార్కెట్లలోకి ప్రవహించే మూలధనం ప్రధాన లబ్ధిదారుల్లో భారత్ ఒకటి. వరుసలో పెద్ద సంఖ్యలో ఐపీవోలు ఉండటంతో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది పెట్టుబడిదారులు ఈ ఐపీవోల నుంచి మెరుగైన లాభాలు సంపాదించాలని భావిస్తున్నారు. ఏడాది కాలంలో స్టార్టప్ వ్యవస్థలో భారీగా నిధులు చేరాయి’ అని నివేదిక వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment