కాఫీ డే ఐపీవో 14న
ధరల శ్రేణి రూ. 316-328
రూ. 1,150 కోట్ల సమీకరణ
దాదాపు మూడేళ్లలోనే అతి పెద్ద ఐపీవో
ముంబై: కెఫె కాఫీ డే (సీసీడీ)ని నిర్వహించే కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ ఈ నెల 14న ఐపీవోకి రానుంది. ఇందుకోసం షేర్ల ధరల శ్రేణిని రూ. 316-328గా నిర్ణయించింది. తద్వారా రూ. 1,150 కోట్లు సమీకరించనుంది. దీంతో దాదాపు 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 6,500 కోట్లు) వాల్యుయేషన్‌ని దక్కించుకునే అవకాశముంది. ఈ నెల 16న ఐపీవో ముగుస్తుంది. గడిచిన మూడేళ్లలో ఇదే భారీ ఐపీవో కానుండటం గమనార్హం. కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఐపీవో మార్కెట్ .. కాఫీ డే రాకతో మళ్లీ కళకళ్లాడగలదని అంచనాలు నెలకొన్నాయి. దీన్ని బట్టే ఇన్ఫీబీమ్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ తదితర సంస్థలు కూడా ఐపీవోకి రానున్నాయి. ఇన్ఫీబీమ్.. భారత్‌లో ఐపీవోకి వస్తున్న తొలి ఈ-కామర్స్ సంస్థ కాగా, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్.. ఇండిగో బ్రాండ్ పేరిట విమానయాన సర్వీసులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో వచ్చిన ఐపీవోలన్నీ చిన్న మొత్తాలకు సంబంధించినవే. 2014లో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ఆరు సంస్థలు కలిసి కేవలం రూ. 1,528 కోట్లే సమీకరించగలిగాయి.
విస్తరణకు నిధులు: ఐపీవోలో దాదాపు రూ. 15 కోట్ల విలువ చేసే షేర్లను తమ కంపెనీలో పనిచేసే అర్హులైన ఉద్యోగుల కోసం కాఫీ డే కేటాయిస్తోంది. కనీసం 45 షేర్ల చొప్పున బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. సమీకరించిన నిధుల్లో రూ. 635 కోట్లు.. హోల్డింగ్ కంపెనీ రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ఉపయోగించనుంది. మరో రూ. 290 కోట్లు వచ్చే 18 నెలల్లో కార్యకలాపాల విస్తరణ కోసం వెచ్చించనున్నట్లు, మిగతా రూ. 125 కోట్లను కాఫీ వ్యాపారాభివృద్ధికి ఉపయోగించనున్నట్లు సంస్థ చైర్మన్ వీజీ సిద్ధార్థ తెలిపారు. ప్రతి సంవత్సరం 135 కొత్త స్టోర్స్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. సిద్ధార్థ సహా ప్రమోటర్లకు కంపెనీలో 92.74 శాతం వాటాలు ఉన్నాయి.