మాళవిక హెగ్డే అనే పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కెఫే కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ సతీమణిగా, కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ఎం కృష్ణ కూతురిగా మాత్రమే మాళవిక హెగ్డే సుపరిచితం. ఇది అంత గతం. ఇప్పుడు తన గురించి తెలిసిన వాళ్లు మాత్రం ఇక నుంచి ఆమెను ఎప్పటికీ మరిచిపోరు. ఇంకా చెప్పాలంటే.. ఇక నుంచి ఆమెను అందరూ ఒక ఆదర్శంగా తీసుకుంటారని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అసలు ఆమె ఎవరో?.. ఆమె ఎందుకు ప్రత్యేకమో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2019 జులైలో కెఫే కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ హఠాన్మరణం ప్రపంచ వ్యాపార వర్గాల్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మంగళూరులోని ఓ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే సిద్ధార్థ ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆయన మరణం తర్వాత ఆయన భార్య మాళవిక హెగ్డే ఆ కంపెనీ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. భర్త ఆత్మహత్య! దారి తెన్నూ లేని వ్యాపారాలు, వేల కోట్ల అప్పు.. ఇలాంటి సందర్భంలో మనకు ఏమనిపిస్తోంది? భయంతో ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ! ఈ రెండు కోణాలు మాళవికకు ఎదురయ్యాయి. కేఫ్ కాఫీ డే సీఈఓ మాళవిక హెగ్దే.. ఎన్ని కష్టాలు ఎదురైనా.. తను నిలబడి, ఉద్యోగులకు అండగా ఉంటూ సంస్థనూ ముందుకు నడుపుతున్నారు.
కేఫ్ కాఫీ డే సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో అప్పుల్లో ఉన్న కంపెనీని మళ్లీ తిరిగి నిలబెట్టేందుకు, అప్పులను తగ్గించుకునేందుకు తాను కట్టుబడి ఉన్నట్టు ఆమె చెప్పారు. కేవలం మాటలు మాత్రమే చెప్పలేదు చేసి చూపించారు. కాలం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు అనే దానికి ఈ విషయం ఒక ఉదాహరణ. కేఫ్ కాఫీ డే సీఈవో పదవి చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడంతో కంపెనీ అప్పులను సగానికి(రూ.7,200 కోట్ల నుంచి రూ.3,100 కోట్లుకు) తగ్గించేశారు. అలాగే, తన ఉద్యోగుల్లో విశ్వాసాన్ని నింపారు. పెట్టుబడుదారులకు భరోసా ఇచ్చారు. ఇప్పుడు కెఫే కాఫీ డే సామ్రాజ్యాన్ని పునర్ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు.
అయితే, తన భర్త సిద్ధార్థ్ విధికి తల వంచితే.. మాళవిక హెగ్డే మాత్రం విధిని ఎదిరించి బలంగా నిలబడ్డారు. భవిష్యత్ వ్యాపార ప్రణాళికల మీద మాళవిక ద ఎకనమిక్ టైమ్స్‌కు తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చారు. దీన్ని చదివితే ఆమె ఎంత స్పష్టతతో ఉన్నారో.. ఎంత నమ్మకంగా ఉన్నారో.. ఎంత పట్టుదలతో ఉన్నారో అర్థం అవుతుంది. కష్ట కాలంలో ఉద్యోగులు అండగా ఉన్నారని, బ్యాంకులు ఓపికతో వేచి చూశాయని తెలిపారు. కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని, భర్త కలల సాకారానికి పాటుపడతానని ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
(చదవండి: బంపర్ ఆఫర్..! సాఫ్ట్ వేర్ జాబ్‌కు రిజైన్ చేస్తే రూ.4లక్షలిస్తాం!!)
Comments
Please login to add a commentAdd a comment