
సాక్షి, ముంబై : కాఫీ డే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) ఎస్‌వీ రంగనాథ్ తాత్కాలిక చైర్మన్ నియమితులయ్యారు. వ్యవస్థాపక చైర్మన్ వీజీ సిద్ధార్థ అదృశ్యం, 36 గంటల తీవ్ర గాలింపు అనంతరం పోలీసులు ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడం విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం అత్యవసరంగా సమావేశమైన కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ బోర్డు పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. తాత్కాలిక చైర్మన్‌గా రంగనాథ్ నియామకంతోపాటు, నితిన్ బాగమనేను తాత్కాలిక సీఓఓగా, రామ మోహన్‌ను సీఎఫ్‌వోగా నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది.
మరోవైపు సిద్ధార్థ మృతిపై పలువురు వ్యాపార దిగ్గజాలతోపాటు, రాజకీయ వేత్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కేఫ్ కాఫీడే వ్యవస్థాపకుడు సిద్ధార్థ ఎంతో కలిచివేసిందని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన సేవలు చిరస్మరణీయమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. వీజీ సిద్ధార్థ మృతిపై స్పందించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆయన మరణం తనను షాక్‌కు గురిచేసిందని, ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని ట్వీట్ చేశారు.
వ్యక్తిగతంగా తనకు సిద్ధార్థ గురించి, ఆయన ఆర్థిక పరిస్థితిపై పెద్దగా తెలియదని పేర్కొన్న ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎం అండ్ ఎం ఛైర్మన్ ఆనంద్ మహింద్రా ఏదేమైనా వ్యాపార వైఫల్యాల కారణంగా జీవితాలను, ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోకూడదన్నారు. అది ఒక వ్యవస్థ మరణానికి కారణమవుతుందంటూ ట్వీట్ చేశారు.