వీజీ సిద్ధార్థ అదృశ్యం : నదిలో దూకింది ఎవరు? | VG Siddhartha missing: Fisherman says he saw someone jumping off the bridge | Sakshi
Sakshi News home page

వీజీ సిద్ధార్థ అదృశ్యం : నదిలో దూకింది ఎవరు?

Published Tue, Jul 30 2019 5:47 PM | Last Updated on Tue, Jul 30 2019 6:40 PM

VG Siddhartha missing: Fisherman says he saw someone jumping off the bridge - Sakshi

కెఫే కాపీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్దార్థ హెగ్డే అదృశ్యంపై అనేక అనుమానాలు కొనసాగుతుండగా, స్థానిక మత్స్యకారుడు అందించిన సమాచారం కీలకంగా మారింది.  సోమవారం రాత్రి ఒకవ్యక్తి నదిలోకి దూకుతుండగానే  చూశాననీ, అతణ్ని రక్షించడానికి ప్రయత్నించినప్పటికీ, భారీ వర్షం కారణంగా సాధ్యం కాలేదని సైమండ్ డిసౌజా  (65) మీడియాకు తెలిపారని న్యూస్‌ మినిట్‌  రిపోర్ట్‌ చేసింది. 

‘‘నా ఇల్లు రైల్వే వంతెన సమీపంలోనే ఉంది. చిన్నప్పటించీ చేపల వేటలో ఉన్నాను. నా ఫిషింగ్ నెట్ తీసుకొని ఇంటికి తిరిగి వస్తున్నా. ఇంతలో ఒక వ్యక్తి (ఆ వ్యక్తి ఎవరో తెలియదు) దూకతూ వుండటాన్ని చూశా.. అతని వైపు పరుగెత్తాను. అప్పటికే ఆయన దూకేశాడు. నా చిన్న బోటుసాయంతో రక్షించాలని చూశా. నా వల్ల కాలేదు. వెంటనే మా వాళ్లను పిలిచాను. కానీ, అప్పటికే ఆలస్యమైపోయిందం’’టూ సైమండ్ డిసౌజా   తెలిపారు.

వీజీ సిద్ధార్థ డ్రైవర్‌ బసవరాజు పాటిల్‌ అందించిన సమాచారం ప్రకారం సోమవారం సాయంత్రం మంగళూరులోని నేత్రావతి నదికి అడ్డంగా ఉన్న వంతెన సమీపంలో తన కారులోంచి దిగిపోయారు సిద్ధార్థ.  ఒక గంటలో తిరిగి రాకపోవడంతో డ్రైవర్ భయపడి కాల్‌ చేశాడు. మొబైల్‌ స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. దీంతో ఆందోళన చెందిన పాటిల్‌ కుటుంబ సభ్యులకు, అనతరం పోలీసులకు సమాచారం అందించారు 

మరోవైపు సిద్ధార్థకోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు తనిఖీల్లో డాగ్ స్క్వాడ్ వంతెన మధ్యలో ఆగి పోయింది. ఈ సమాచారం ఆధారంగా బ్రిడ్జిపై ఉన్న పిల్లర్‌ 8 వద్ద తనిఖీని ముమ్మరం చేశారు. పోలీసులు, డైవర్లు, ఫైర్ అండ్ రెస్క్యూ  సిబ్బంది  సహా 150 మందికి పైగా ఈ  కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.

తాను చాలాకాలంగా పోరాడుతూ అలసిపోయాననీ, వాటాలను తిరిగి కొనుగోలు చేయమని బలవంతం చేస్తున్న ప్రైవేట్ ఈక్విటీ భాగస్వాములు, ఇతర రుణదాతల నుండి ఎదుర్కొంటున్న "విపరీతమైన ఒత్తిడి" తనను ఈ పరిస్థితికి లొంగదీసిందని బోర్డుకి రాసిన చివరి లేఖలో సిద్ధార్థ  పేర్కొన్నారు.

బోర్డు అత్యవసర సమావేశం
సోమవారం సాయంత్రం నుంచి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీజీ సిద్ధార్థ తప్పిపోయినట్లు మంగళవారం  కంపెనీ ధృవీకరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కెఫే కాఫీ డే బోర్డు అత్యవసరంగా సమావేశమైంది. కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ వ్యవహారాలను సమర్ధవంతంగా నిర‍్వహించే టీం  నేతృత్వం వహిస్తోందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. సిద్ధార్థ భార్య, కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కుమార్తె,  మాలవికా హెగ్డే 2008 నుంచి కంపెనీ నిర్వహణా, హాస్పిటాలిటీ బాధ్యతలను చూస్తున్నారు. అలాగే ఎస్ వి. రంగనాథ్, డాక్టర్ ఆల్బర్ట్ హిరోనిమస్, సులక్షణా రాఘవన్, సంజయ్ ఓంప్రకాష్ నాయర్ బోర్డు సభ్యులుగా ఉన్నారు.

చదవండి: కాఫీ మొఘల్‌కు ఏమైం‍ది? షేర్లు డీలా 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement