సిద్ధార్థ.. వినయశీలి, మృదుభాషి | Business failure not destroy self-esteem | Sakshi
Sakshi News home page

సిద్ధార్థ.. వినయశీలి, మృదుభాషి

Published Thu, Aug 1 2019 4:46 AM | Last Updated on Thu, Aug 1 2019 4:46 AM

Business failure not destroy self-esteem - Sakshi

న్యూఢిల్లీ: కాఫీ డే అధినేత వీజీ సిద్ధార్థ మృతిపై  పారిశ్రామిక వర్గాలు సంతాపం వ్యక్తం చేశారు. ‘‘సిద్ధార్థ వినయశీలి, మృదుభాషి’’ అని బయోకాన్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా, ఆటోమొబైల్‌ దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ తదితరులు నివాళులర్పించారు. ‘సిద్ధార్థ భార్య మాళవిక, ఆయన కుమారులు, ఎస్‌ఎం కృష్ణ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాలు తెలియజేస్తున్నాను‘ అని కిరణ్‌ షా మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరోవైపు, వ్యాపార వైఫల్యాలతో ఔత్సాహిక వ్యాపారవేత్తలు కుంగిపోరాదని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా పేర్కొన్నారు. ‘సిద్ధార్థ స్ఫూర్తిదాయకమైన ఎంట్రప్రెన్యూర్, ఇన్వెస్టరు‘ అని ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు సచిన్‌ బన్సల్‌ పేర్కొన్నారు.

ప్రభుత్వ వేధింపులకి నిదర్శనం: మాల్యా
సిద్ధార్థ మరణంపై దివాలా తీసిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రమోటరు విజయ్‌ మాల్యా స్పందించారు. ప్రభుత్వ యంత్రాంగం వేధింపులకు ఇదో నిదర్శనమని వ్యాఖ్యానించారు. రుణాలన్నీ తిరిగి పూర్తిగా కట్టేస్తానంటున్నా తనను కూడా అలాగే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 9,000 కోట్లకు పైగా బ్యాంకులకు ఎగవేసిన ఆర్థిక నేరస్థుడన్న ఆరోపణలతో మాల్యా ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. ‘నాకు వీజీ సిద్ధార్థతో పరోక్షంగా సంబంధాలు ఉన్నాయి. ఆయన మంచి వ్యక్తి. చురుకైన వ్యాపారవేత్త. ఆయన లేఖలోని అంశాలు ఎంతో కలిచివేసేవిగా ఉన్నాయి. ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకులు ఎలాంటివారినైనా దయనీయ స్థితిలోకి నెట్టేయగలవు. నేను పూర్తిగా డబ్బు కట్టేస్తానంటున్నా ఎలా వేధిస్తున్నారో కనిపిస్తూనే ఉంది. మిగతా దేశాల్లో రుణగ్రహీతలు ఏదో రకంగా రుణాలు కట్టేసేలా ప్రభుత్వం, బ్యాంకులు సహాయం అందిస్తాయి. కానీ నా కేసు విషయంలో నేను కట్టేసేందుకు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్నీ అడ్డుకుంటున్నారు‘ అని మాల్యా వ్యాఖ్యానించారు.

ఫండ్స్‌ పెట్టుబడులు రూ. 193 కోట్లు..
సిద్ధార్థకు చెందిన కాఫీ డే నేచురల్‌ రిసోర్సెస్, టాంగ్లిన్‌ డెవలప్‌మెంట్స్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు రూ. 193 కోట్ల పైగా ఉన్నట్లు తెలుస్తోంది. కాఫీ డే నేచురల్‌ రిసోర్సెస్‌లో ఫండ్స్‌ పెట్టుబడులు రూ. 149 కోట్లు, టాంగ్లిన్‌లో రూ. 44 కోట్ల మేర ఉన్నట్లు మార్నింగ్‌స్టార్‌ సంస్థ రూపొందించిన నివేదికలో వెల్లడైంది.  డీఎస్‌పీ క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్‌ అత్యధికంగా కాఫీ డే నేచురల్‌ రిసోర్సెస్‌లో రూ. 132 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది.  

మరో 20 శాతం పడిన షేరు..
తాజా పరిణామాలతో బుధవారం కూడా కాఫీ డే   షేరు మరో 20 శాతం పతనమైంది. ఇంట్రాడేలో లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. బీఎస్‌ఈలో రూ. 123.25కి క్షీణించింది. ఇది 52 వారాల కనిష్ట స్థాయి కూడా. అటు ఎన్‌ఎస్‌ఈలో కూడా 20% పతనమై రూ. 122.75కి పడింది. రెండు  రోజుల్లో సంస్థ మార్కెట్‌ విలువ రూ. 1,463 కోట్లు ఆవిరైపోయి.. రూ.2,604 కోట్లకు తగ్గింది. సిద్ధార్థ అదృశ్యమయ్యారన్న వార్తలతో మంగళవారం కూడా కాఫీ డే షేరు 20% పతనమైన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement