దాదాపు నాలుగు దశాబ్దాలుగా భిన్న తరాలకు చెందిన లక్షలాదిమందికి మధురమైన క్షణాలను పంచుతూ, వారి జీవితాల్లో ఒక తీయని జ్ఞాపకంగా చెరగని ముద్ర వేసుకున్న సంస్థ ‘కెఫే కాఫీ డే’. అందుకే ఆ సంస్థ వ్యవస్థాపకుడు వీజీ సిద్దార్థ ఆచూకీ లేకుండా పోయారన్న వార్త ఎందరినో దిగ్భ్రాంతికి గురిచేసింది. చివరకు వారంతా భయపడినట్టే 36 గంటల తర్వాత సిద్దార్థ విగతజీవుడై కనబడ్డారు. సంస్థ ఉద్యోగులనూ, బోర్డు సభ్యులనూ ఉద్దేశించి ఆయన రాసినట్టు చెబుతున్న ఒక లేఖ ఆయనదేనని ఇంకా ధ్రువీకరించకపోయినా, అందులో ప్రస్తావించిన అంశాలు ఆందోళన కలిగిస్తాయి. ఆయన సన్నిహిత మిత్రులు, బంధువులు మాత్రమే కాదు... వ్యాపారరంగంలో ఆయన్ను చాలా దగ్గర నుంచి చూసినవారు సైతం సిద్దార్థ సమర్థత గురించి, ఆ రంగంలో ఆయన దీక్ష, పట్టుదల గురించి ప్రశంసాపూర్వకంగా మాట్లాడతారు. ఆయన ఆధ్వర్యంలోని సంస్థల ఉద్యోగులకు కూడా ఎప్పుడూ ఆయన ఇన్ని కష్టాల్లో ఉన్నారని తెలియలేదు.
ఇంకా చెప్పాలంటే ఆయన తెలియనివ్వలేదు. కానీ ఆ లేఖ గమనిస్తే ఆయన ఎదుర్కొన్న ఒత్తిళ్లు ఎలాంటివో, ఆయన ఎంత నిస్సహాయంగా మిగిలిపోయారో అర్థమవుతుంది. విఫల వ్యాపారవేత్తగా మిగిలిపోయానన్న ఆవేదన అందులో కనిపిస్తుంది. సంస్థ నిలదొక్కుకోవడానికి, అది లాభాల బాట పట్టడానికి ఆయన చేసిన కృషి పెద్దగా ఫలించకపోవడం, అందుకోసం చేసిన అప్పులు అపరిమితంగా పెరిగిపోవడం, ఈలోగా ప్రైవేటు ఈక్విటీ(పీఈ) సంస్థల నుంచి, రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరగడం, ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారుల వేధింపులు వంటివి ఆయన తనువు చాలించాలని నిర్ణయించు కోవడానికి దారితీసి ఉండొచ్చునని లేఖలోని అంశాలు చెబుతున్నాయి. సహజంగానే ఐటీ శాఖ తమపై వచ్చిన ఆరోపణల్ని ఖండించింది. పైపెచ్చు ఆయన దగ్గర నల్లధనం పట్టుబడిందని ఆరోపించింది. ఈ ఆరోపణలపై తన వైఖరేమిటో చెప్పేందుకు సిద్దార్థ లేరు. కానీ ఆయనకున్న అప్పుల కన్నా ఆస్తుల విలువ చాలా ఎక్కువ గనుక బకాయిల గురించి ఆయన బెంబేలెత్తే సమస్యే లేదన్నది సన్నిహితుల వాదన.
ఏ రంగంలోనైనా నిపుణత సాధించి, ఉన్నత శిఖరాలు అందుకునేవారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. విజేతలను అందరూ ఆరాధనా భావంతో చూస్తారు. కానీ ఆ విజేతల ఆంతరంగిక పరిస్థితి వేరు. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి వారు నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి. ఎక్కడ వెనక్కి తగ్గినా వైఫల్యం తలుపుతట్టడానికి సిద్ధంగా ఉంటుంది. అది చదువా, ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, క్రీడలా, రాజకీయాలా అన్న అంశాలతో నిమిత్తం లేదు. ఏ రంగం వారికైనా ఇది తప్పదు. జయాపజయాలను సమంగా స్వీకరించే స్థితప్రజ్ఞత, నిత్యం సవాళ్లను ఎదుర్కొనే సాహసం సహజంగా అలవడేవి కాదు. చుట్టూ ఉన్న పరిస్థితులతో, వ్యక్తులతో పోరాడుతూనే...తనపై తాను పోరాటం చేసుకుంటే తప్ప ఇవి సాధ్యపడవు.
తామున్న రంగంలో చిత్తశుద్ధితో, నిజాయితీతో పనిచేస్తూ సమున్నతంగా ఎదగడానికి శ్రమించేవారందరికీ ఇది వర్తిస్తుంది. సిద్దార్థ అటువంటివారు. ఆయన నిజాయితీపరుడు గనుకే, విలువలను నమ్ము కున్నవాడు గనుకే, సున్నితమనస్కుడు గనుకే ఒక్కుమ్మడిగా చుట్టుముట్టిన సమస్యలతో ఒత్తిళ్లకు లోనై ఉసురు తీసుకోవడానికి సిద్ధపడి ఉంటారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటివారికి ఈ బెడద ఉండదు. వారు విజేతలుగా తమను తాము చిత్రించుకోవడానికి శ్రమిస్తారు. అందుకోసం అన్ని రకాల చీకటి పనులకూ పాల్పడతారు. పాపం బద్దలైందని తెలిశాక దూరతీరాలకు పారి పోతారు.
సిద్దార్థ రాసినట్టు చెబుతున్న లేఖలో ప్రస్తావనకొచ్చిన వేధింపుల అంశాన్ని ఐటీ శాఖ ఖండిస్తున్నది. కానీ దాంతో ఏకీభవించేవారు తక్కువ. ఇప్పుడే కాదు... ఎన్నాళ్లుగానో ఒక్క ఐటీ శాఖపైన మాత్రమే కాదు, నియంత్రణ వ్యవస్థలన్నిటి వ్యవహారశైలిపైనా ఆరోపణలున్నాయి. దేశంలో కార్పొ రేట్ తిమింగలాలుగా పేరుబడ్డ పది పదిహేను శాతంమంది రాజకీయ ప్రాపకంతో కులాసాగా ఉంటారు. వారి జోలికెవరూ పోరు. మధ్య, కింది స్థాయిలవారికి మాత్రం నిత్యం ఒత్తిళ్లు, వేధింపులు తప్పవు. ఇవన్నీ పైవారికి తెలిసే జరుగుతున్నాయని అనలేం. ఈ మధ్యే ఐటీ శాఖలో పలు ఆరోపణలున్నాయన్న కారణంతో 20మంది ఉన్నతాధికారులను కేంద్రం రిటైర్ చేసింది. ‘కెఫే కాఫీ డే’కు ఎదురైన వైఫల్యాలకు గల కారణాలను కేవలం సిద్దార్థలోనే చూడటం కూడా సరికాదు. మన దేశంలో ఇంకా అంతగా వేళ్లూనుకోని ఖరీదైన కాఫీ క్లబ్‌ల సంస్కృతిని ఆధారంగా చేసుకుని రూపొందించుకున్న వ్యాపార నమూనా ఆయన అనుకున్నట్టుగా విస్తరించి ఉండకపోవచ్చు. కానీ ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరుమోసిన సంస్థలకంటే మెరుగ్గా ఆయన నిలదొక్కుకోగలిగారు.
ఆ సంస్కృతిని పెంచగలిగారు. ‘కెఫే కాఫీ డే’తో పోలిస్తే ఇతర సంస్థలు మన దేశంలో నామ మాత్రంగా మిగిలిపోయాయి. అయినా మూడు నాలుగేళ్లుగా ఆ సంస్థకు నష్టాలు తప్పడం లేదు. ఇది కేవలం ఆ సంస్థకు మాత్రమే పరిమితమైన స్థితి కాదు. మన ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు సకల రంగాల్లోనూ ప్రతిఫలిస్తున్నాయి. ఆటోమొబైల్ రంగంతో సహా అన్నీ ఒడి దుడుకులు ఎదుర్కొంటున్నాయి. జీఎస్‌టీ బకాయిలు భారీయెత్తున పోగడుతున్నాయి. ఉపాధి అవకాశాల లేమి, వేతనాల్లో కోతలు, అనిశ్చితి వగైరాల వల్ల వినిమయం బాగా తగ్గింది. వెనకా ముందూ చూసి ఖర్చు పెట్టే స్థితి వచ్చింది. ఒకప్పుడు ‘కెఫే కాఫీ డే’లవంటి ఖరీదైన దుకాణాలకు వెళ్లడం తమ హోదాకు చిహ్నంగా భావించినవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించకతప్పడం లేదు. నియంత్రణ వ్యవస్థలు ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలి. బకాయిలున్నవారందరినీ ఒకే గాటన కట్టి, అందరినీ నేరగాళ్లుగా చూసే వైఖరిని విడనాడాలి. అప్పుడు సిద్దార్థవంటి వ్యాపార వేత్తలు, పారిశ్రామికవేత్తలు నిబ్బరంతో ముందడుగు వేయడానికి వీలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment