డబ్బు.. మనిషిని ఆర్థికంగా ఎదిగేలా చేస్తుంది.. పతాలానికి తోసేస్తుంది. డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే అప్పుల మూటలు కూడగట్టుకునే ప్రమాదం ఉంది. ముఖ్యంగా జీతం వస్తున్న వారు నిత్యం ఏదో రూపంలో అప్పులు తీసుకుంటారు. అప్పుల్లో కొన్ని మంచివి, మరికొన్ని చెడ్డవి ఉంటాయి.
అప్పుచేసి ఆ సొమ్మును మరింత పెంచేలా ఎక్కడైనా పెట్టుబడిపెడితే అది మంచి అప్పు. అదే అప్పు విలాసాలకు వాడితే దాన్ని చెడు అప్పు అంటారు. తీసుకునే అప్పుపై సరైన అవగాహన లేకపోతే తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. చాలా మందికి వారు తీసుకున్న అప్పుతో మరింతో లోతుల్లోకి వెళుతున్నామని తెలియకపోవచ్చు. కానీ కొన్ని సంకేతాలను గుర్తించడం ద్వారా ఈ ప్రమాదాన్ని కొంత తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఏదైనా వస్తువలు కొనాలంటే సరిపడా డబ్బు లేకుండా ఈజీ ఈఎంఐల బాట పడుతుంటారు. వ్యక్తిగత ఈఎంఐలు సులువే అనిపించినప్పటికీ, వీటివల్ల ఇతర ఖర్చులకు డబ్బు సరిపోదు. కిస్తీల విలువ నెలవారీ ఆదాయంలో 50శాతం కంటే తక్కువగా ఉండాలి. అనేక బ్యాంకులు వ్యక్తులు ఈ 50శాతం పరిమితి మించకుండా నిరోధించడానికి పరిమితులను కూడా విధించాయి. అయితే చాలా మంది ఈజీ ఈఎంఐలు, తగ్గింపులు, సేల్స్ ఆఫర్స్ ఆకర్షణకు లోనవుతారు. అనవసర ఖర్చులో మునిగిపోవడం వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది.
కనీస అవసరాలను తీర్చుకోవడానికి తరచు అప్పు తీసుకుంటే మాత్రం ఆర్థిక పరిస్థితి గురించి మరోసారి ఆలోచించుకోవాలి. అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు వంటి సాధారణ ఖర్చులను కవర్ చేయడానికి అప్పులు తీసుకోవడం వల్ల రుణఊబిలోకి కూరుకుపోయే అవకాశాలు ఉంటాయి.
ప్రస్తుత రోజుల్లో దాదాపు అన్ని బ్యాంకులతోపాటు ఆన్‌లైన్ పేమెంట్ యాప్‌లు సైతం క్రెడిట్ కార్డ్‌లను ఆఫర్ చేస్తున్నాయి. అయితే చాలా మంది తమకున్న అప్పులు తీర్చడానికి క్రెడిట్‌కార్డులను తీసుకుంటుంటారు. కానీ అప్పులు తీర్చడానికి తిరిగి క్రెడిట్ కార్డ్ రూపంతో అధిక వడ్డీలకు అప్పుచేయడం దారుణం. దాంతో ఆ క్రెడిట్ కార్డ్ బకాయిలను సైతం తీర్చలేని పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. పరిస్థితి శ్రుతిమించితే తీసుకున్న అప్పులను రోల్‌ఓవర్ చేయాడానికి సైతం వెనుకాడరు. కానీ అలా చేస్తే భవిష్యత్తులో తిరిగి అప్పు పుట్టాలంటే చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం అని గ్రహించాలి.
ఇదీ చదవండి: ఆగిపోతున్న సరకు రవాణా..!
అప్పు తీసుకోడదా..? అంటే తీసుకోవాలి. కానీ అది మన ఆర్థిక పరిధిలో ఉండాలి. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. ప్రస్తుత జీతం ఆధారంగా అప్పు తీసుకోవడం మంచిదే కానీ, ఈఎంఐలను లెక్కించేటప్పుడు అన్ని కనీస అవసరాలుపోను జీతం సరిపోతుందో లేదో చెక్ చేసుకోవాలి. అంతకుమించి దాదాపు ఆరు నెలలకు సరిపడే అత్యవసర నిధిను ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment