
న్యూఢిల్లీ: రుణ భారంతో ఉన్న రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలు రేసులో రూ.9,650 కోట్ల ఆఫర్‌తో హిందుజా గ్రూప్ కంపెనీ అయిన ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్‌ఎల్) హైయెస్ట్ బిడ్డర్‌గా నిలిచింది. 2022 డిసెంబర్‌లో తొలిసారిగా జరిగిన వేలంలో టోరెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ రూ.8,640 కోట్లు ఆఫర్ చేసింది. రెండవ రౌండ్ వేలంలో టోరెంట్‌తోపాటు ఓక్‌ట్రీ పాల్గొనలేదు. రుణదాతల కమిటీ (సీవోసీ) కనీస బిడ్ మొత్తాన్ని తొలి రౌండ్‌కు రూ.9,500 కోట్లు, రెండవ రౌండ్‌కు రూ.10,000 కోట్లుగా నిర్ణయించారు. అన్ని బిడ్స్‌కు కనీసం రూ.8,000 కోట్ల ముందస్తు నగదు చెల్లింపు ఉండాలని కూడా సీవోసీ షరతు విధించింది.
సుప్రీం తీర్పునకు లోబడి..
రిలయన్స్ క్యాపిటల్ ఆస్తుల విక్రయం ద్వారా గరిష్టంగా రికవరీని పొందడానికి రుణదాతలకు గడువు పొడిగిస్తూ సుప్రీంకోర్టు అనుమతించడంతో బుధవారం రెండవ రౌండ్ వేలం జరిగింది. రిలయన్స్ క్యాపిటల్ పరిష్కారం విషయంలో సీవోసీ ద్వారా ఏదైనా నిర్ణయం టోరెంట్ ఇన్వెస్ట్‌మెంట్స్ దాఖలు చేసిన అప్పీల్‌లో సుప్రీం కోర్టు తీర్పు ఫలితానికి లోబడి ఉంటుంది. రిలయన్స్ క్యాపిటల్ పరిష్కార ప్రక్రియ మొదటి రౌండ్ వేలం తర్వాత వ్యాజ్యంలో చిక్కుకుంది. మొదటి రౌండ్ వేలం ముగిసిన తరువాత హిందూజా గ్రూప్ సంస్థ బిడ్‌ను సమర్పించింది. 2022 డిసెంబరులో దాఖలు చేసిన రూ.8,110 కోట్ల ఆఫర్‌ను సవరిస్తూ ఐఐహెచ్‌ఎల్ రూ.9,000 కోట్లతో మరో బిడ్‌ను అందించింది. రుణదాతలు రెండో రౌండ్ వేలం నిర్వహించాలని తమ ఉద్దేశాన్ని వ్యక్తం చేసినప్పటికీ ఇది జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment