
అప్పుల ఊబిలో కూరుకుపోయిన రిలయన్స్ క్యాపిటల్ (ఆర్‌సీఏపీ)ను ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఐఐహెచ్ఎల్) తన ఆధీనంలోకి తీసుకుంది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్, దాని అనుబంధ సంస్థల బోర్డును ఐఐహెచ్ఎల్ తన ఆధీనంలోకి తీసుకుందని, కొత్త బోర్డు తొలి సమావేశం బుధవారం జరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదం మేరకు కొత్త బోర్డు సభ్యులుగా మోసెస్ హార్డింగ్ జాన్, అరుణ్ తివారీలు ఉన్నారు.
అంతకుముందు రిలయన్స్ క్యాపిటల్ (ఆర్‌క్యాప్) కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్‌ఎల్) చైర్మన్ అశోక్ హిందుజా వెల్లడించారు. బిడ్ మొత్తాన్ని రుణదాతల ఖాతాలోకి బదిలీ చేసినట్లు తెలిపారు. ఈ డీల్‌పై దాదాపు మూడేళ్లుగా కసరత్తు చేస్తున్నట్లు హిందుజా పేర్కొన్నారు.
ఆర్‌క్యాప్ వ్యాపారాన్ని సమీక్షించి, అవసరమైతే నిధులను సమకూర్చడంపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. చిన్నా చితకా అనుబంధ సంస్థలు 39–40 వరకు ఉన్నాయని, వాటిల్లో చాలా మటుకు సంస్థలను కొత్త మేనేజ్‌మెంట్ విక్రయించవచ్చని హిందుజా చెప్పారు. బ్రోకింగ్, అసెట్ రీకన్‌స్ట్రక్షన్ వ్యాపారాన్ని మాత్రం అట్టే పెట్టుకుంటుందని వివరించారు.
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఆదేశాల ప్రకారం మూడేళ్ల పాటు అదే పేరుతో వ్యాపారాలను కొనసాగించవచ్చని, కానీ తమ సొంత ఇండస్‌ఇండ్ బ్రాండ్‌తో అనుసంధానించడంపై కసరత్తు చేస్తున్నామని హిందుజా చెప్పారు. అనుసంధానానికి 6–9 నెలల సమయం పట్టొచ్చని వివరించారు.
చెల్లింపుల విషయంలో డిఫాల్ట్ కావడం, గవర్నెన్స్‌లో లోపాలు తదితర అంశాల కారణంగా రిలయన్స్ క్యాపిటల్‌ను 2021లో రిజర్వ్ బ్యాంక్ నియమించిన అడ్మినిస్ట్రేటర్ తన ఆధీనంలోకి తీసుకున్నారు. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) కింద 2023 ఏప్రిల్‌లో రూ. 9,650 కోట్లు ఆఫర్ చేసి ఐఐహెచ్‌ఎల్ విజయవంతమైన బిడ్డరుగా నిల్చింది.
Comments
Please login to add a commentAdd a comment