
ముంబై: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్‌కి భారీ ఊరట లభించింది. రుణభారంతో కుంగిన రిలయన్స్ క్యాపిటల్‌కి సంబంధించి హిందుజా–ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ ప్రతిపాదించిన రూ. 9,650 కోట్ల పరిష్కార ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదముద్ర వేసింది.
దీని ప్రకారం కంపెనీ రుణదాతలు భారీగా 63 శాతం రుణాలను వదులుకోవాల్సి వస్తుంది. అలాగే, ప్రణాళిక అమల్లో భాగంగా ఆర్‌క్యాప్ షేర్లను ఇండస్‌ఇండ్‌కు బదలాయించాక, దాన్ని స్టాక్ ఎక్స్చేంజీల నుంచి తొలగిస్తారు. మొత్తం రూ. 38,526 కోట్ల రుణాల క్లెయిమ్‌లకు గాను ఎన్‌సీఎల్‌టీ రూ. 26,086 కోట్ల క్లెయిమ్‌లనే అనుమతించింది.
కానీ, 2023 జూన్‌లో బిడ్ వేసిన ఇండస్‌ఇండ్ అందులో రూ. 9,661 కోట్లు (37%) కడతానని ప్రతిపాదించింది. రిలయన్స్ క్యాపిటల్ కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణకు మార్గాన్ని అందించడంలో ఎన్‌సీఎల్‌టీ ఆమోదం కీలకమని గమనించవచ్చు.