
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ముంబై విమానాశ్రయం ద్వారా ప్రయాణాలు మరింత భారం కానున్నాయి. యూజర్ డెవలప్‌మెంట్ ఫీజును (యూడీఎఫ్) భారీగా పెంచేలా ఎయిర్‌పోర్ట్ ఆపరేటరు ఎంఐఏఎల్ ప్రతిపాదనలు చేయడమే ఇందుకు కారణం. వీటి ప్రకారం ఇంటర్నేషనల్ ప్యాసింజర్లకు యూడీఎఫ్ రూ.187 నుంచి ఏకంగా రూ.650కి పెరగనుంది. ప్రస్తుతం దేశీ ప్యాసింజర్లకు యూడీఎఫ్ లేకపోయినప్పటికీ ఇకపై వారిపై కూడా రూ.325 మేర యూడీఎఫ్ వడ్డించనున్నారు.
ప్రతిపాదిత టారిఫ్ కార్డును ఎయిర్‌పోర్ట్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్‌ఏ) అనుమతుల కోసం సంస్థ సమర్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నియంత్రణ సంస్థ నిబంధనలకు అనుగుణంగానే ఈ ప్రతిపాదనలు ఉన్నట్లు వివరించాయి. వీటిపై తుది నిర్ణయానికి ముందు ఎయిర్‌పోర్ట్ సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకునేందుకు ఏఈఆర్‌ఏ మార్చి 25న సమావేశం కానుంది.
మరోవైపు, ఎయిర్‌లైన్స్‌కి భారీగా ఊరటనిచ్చే దిశగా ఏఈఆర్‌ఏ వెబ్‌సైట్ ప్రకారం 2024–2029 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలానికి ల్యాండింగ్, పార్కింగ్ చార్జీలను 35 శాతం తగ్గించేలా ఎంఐఏఎల్ ప్రతిపాదనలు సమర్పించింది. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల జాబితాలో రెండో స్థానంలో ఉండే ముంబై విమానాశ్రయాన్ని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (ఎంఐఏఎల్) నిర్వహిస్తోంది. ఇందులో అదానీ గ్రూప్‌నకు 74 శాతం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 26 శాతం వాటాలు ఉన్నాయి. ముంబై ఎయిర్‌పోర్టులో ఏటా 5.5 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యంతో రెండు టెర్మినల్స్ ఉన్నాయి.
ఇదీ చదవండి: బెంజ్, కియా కార్ల ధరలు పెంపు
విమానాశ్రయ మౌలిక సదుపాయాలను, సాంకేతికతను మెరుగుపర్చుకునేందుకు ప్రతిపాదిత ఫీజులు ఉపయోగపడతాయని ఎంఐఏఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఒక్కో ప్రయాణికుడిపై రాబడి రూ.285గా ఉండగా సుమారు రూ.332కి (18 శాతం) పెరగనుంది. వచ్చే అయిదేళ్లలో విమానాశ్రయంపై ఎంఐఏఎల్ రూ.10,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.