
అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ
న్యూఢిల్లీ: స్థానిక ఆర్థిక అభివృద్ధికి విమానాశ్రయాలు శక్తిమంతమైన చోదకాలుగా పనిచేస్తాయని అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను పెద్ద నగరాలకు అనుసంధానం చేయడంలో కీలకపాత్ర పోషించగలవని ఆయన చెప్పారు. ముంబై విమానాశ్రయంలో మెజారిటీ వాటాల కొనుగోలు అనంతరం తమ ఎయిర్‌పోర్ట్‌ల వ్యాపార విభాగం మరింతగా విస్తరిస్తుందని అదానీ తెలిపారు. గ్రూప్‌లోని ఇతర వ్యాపారాలకు కూడా ఇది వ్యూహాత్మక అవకాశాలు సృష్టించగలదని ఆయన వివరించారు.
ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (ఎంఐఏఎల్)లో జీవీకే ఎయిర్‌పోర్ట్ డెవలపర్స్‌కు చెందిన 50.50 శాతం వాటాలతో పాటు మైనారిటీ షేర్‌హోల్డర్ల వాటాలను కూడా కొనుగోలు చేస్తున్నట్లు అదానీ ఎయిర్‌పోర్ట్స్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నిస్సందేహంగా అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌పోర్టు. దీనితో పాటు నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కూడా మా ఆరు విమానాశ్రయాల పోర్ట్‌ఫోలియోకు తోడవుతుంది. ఈ పరిణామం మా ఇతర వ్యాపారాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకునేందుకు కూడా ఉపయోగపడగలదు‘ అని అదానీ ఒక ప్రకటనలో వివరించారు.
21 శతాబ్దంలోని టాప్ 5 అంతర్జాతీయ మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటిగా ముంబై మారనున్న నేపథ్యంలో దేశీయంగా ఇది ప్రధాన ఎయిర్‌పోర్ట్‌గా మార్చగలదని ఆయన పేర్కొన్నారు. విమాన ప్రయాణికుల సంఖ్య అయిదు రెట్లు పెరుగుతుందన్న అంచనాలతో దేశీయంగా 200 పైచిలుకు ఎయిర్‌పోర్టులు అదనంగా నిర్మించే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. టాప్ 30లోని ఒక్కో నగరానికి రెండు విమానాశ్రయాలు అవసరమవుతాయని అదానీ తెలిపారు. ఇందుకు అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేసేందుకు అదానీ ఎయిర్‌పోర్ట్స్ సర్వసన్నద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.