Mumbai International Airport
-
Mumbai Airport: వీల్ చైర్ లేక గుండెపోటుతో వృద్ధుడి మృతి
ముంబై : నగరంలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రద్దీ కారణంగా చోటు చేసుకున్న అత్యంత హృదయ విదారక ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ముంబై వచ్చిన ఓ వృద్ధుడు ఎయిర్‌లైన్స్ సిబ్బందిని ఓ వీల్‌చైర్ అడిగాడు. వీల్చైర్లకు భారీ డిమాండ్ ఉన్న కారణంగా ఆ వృద్ధుడిని కొద్దిసేపు వేచి ఉండాలని ఎయిర్‌లైన్స్ సిబ్బంది కోరారు. దీంతో ఆలస్యమవుతుందని భావించిన ఆ వృద్ధుడు నడుస్తూ వెళ్లి ఇమిగ్రేషన్ చెక్ వద్ద గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఫిబ్రవరి 12న జరిగిన ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది. ‘వీల్ చైర్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నందున అవి అందుబాటులో లేవు. ఇందుకే 80 ఏళ్ల వృద్ధుడిని కొద్దిసేపే వేచి ఉండాలని మేం కోరాం. అయినా అతడు ఆయన భార్యతో కలిసి నడిచి వెళ్లాడు. దురదృష్టవశాత్తూ అతడు ఇమిగ్రేషన్ చెక్ వద్ద గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించాం. అప్పటికే అతడు మరణించినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే వీల్ చైర్ ఇవ్వాలని మా సంస్థకు ఒక పాలసీ ఉంది’ అని ఎయిర్‌లైన్స్ కంపెనీ ఎయిర్ ఇండియా తెలిపింది. ఇదీ చదవండి.. 11 మంది సజీవ దహనం -
‘ప్లీజ్ నా చెవిరింగు వెతికివ్వండి’
బాలీవుడ్ నటి జూహీ చావ్లా ట్విట్టర్ వేదికగా చేసిన ఓ రిక్వెస్ట్ ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకు దేనికి సంబంధించి ఆ రిక్వెస్ట్ అంటే జూహీ చావ్లా డైమండ్ ఇయర్ రింగ్ పొగొట్టుకున్నారు. దయచేసి తనకు సాయం చేయమని.. మంచి రివార్డు కూడా ఇస్తానంటూ ట్వీట్ చేశారు జూహీ చావ్లా. ఆదివారం సాయంత్రం చేసిన ఆ ట్వీట్లో ఇలా ఉంది ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం టర్మినల్ 2లోని గేట్ నంబర్ 8వైపు ప్రణామ్ బగ్గీలో నడుచుకుంటూ వెళ్లాను. ఎమిరెట్స్ కౌంటర్లో చెక్ చేశారు. సెక్యూరిటీ చెక్ ఇమ్మిగ్రేషన్ కూడా పూర్తయ్యింది. ఈ క్రమంలో నా డైమండ్ ఇయర్ రింగ్ ఒకటి ఎక్కడో జారి కింద పడిపోయింది. దాన్ని వెతకడంలో నాకు ఎవరైనా సాయం చేస్తే.. ఎంతో ఆనందిస్తాను. నా చెవి రింగు ఎవరికైనా కనిపిస్తే.. పోలీసులకు అందించండి. మీకు రివార్డు కూడా ఇస్తాను అన్నారు. అంతేకాక పోయిన దాని జత ఇయర్ రింగ్ ఫోటోని షేర్ చేశారు జూహీ చావ్లా. ఇక దానితో పాటు గత పదిహేనేళ్లుగా ప్రతి రోజు నేను ఈ చెవి దుద్దులను ధరిస్తూ ఉన్నాను. దయచేసి దీన్ని వెతకడంలో నాకు సాయం చేయండి’ అంటూ ట్వీట్ చేశారు జూహీ చావ్లా. ప్రస్తుతం ఈ ట్వీట్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (చదవండి: మీ టూ వల్ల తప్పించుకున్నాను!) Kindly help 🙏 pic.twitter.com/bNTNYIBaZ2 — Juhi Chawla (@iam_juhi) December 13, 2020 ఇక సినిమాల విషయానికి వస్తే.. జూహీ చివరి సారిగా 2019లో వచ్చిన ‘ఏక్ లడ్కి కో దేఖా తో ఐసా లగా’ చిత్రంలో కనిపించారు. ఈ సినిమాలో సోనమ్ కపూర్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
ఆరు గంటల పాటు కృనాల్ విచారణ
ముంబై: ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యాను సుదీర్ఘ విచారణ అనంతరం కస్టమ్స్ అధికారులు విడిచిపెట్టారు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్ దుబాయ్ నుంచి గురువారం ముంబై చేరుకున్నాడు. అతని వద్ద విలువైన వస్తువులు (ధ్రువపత్రాలు లేని), బంగా రం ఉండటంతో ఎయిర్పోర్ట్ అధికారులు అడ్డగించారు. పరిమితికి మించి బంగారం, అత్యంత విలువైన నాలుగు లగ్జరీ వాచ్‌లు (ఒమెగా, అంబులర్ పిగెట్ బ్రాండ్లు) దుబాయ్‌లో కొనుగోలు చేసినట్లు తెలిసింది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ. కోటి. ఈ విచారణ అర్ధరాత్రి దాకా సాగింది. నిబంధనలు తెలియకే ఇంతగా కొనుగోలు చేశానని, పన్నులతో పాటు జరిమానా కూడా కడతానని విచారణ సందర్భంగా అతను క్షమాపణలు చెప్పడంతో అధికారులు అతన్ని విడిచిపెట్టారు. అయితే అతను తెచ్చిన వస్తువుల్ని తిరిగివ్వలేదు. విలువైన బ్రాండ్లకు చెందిన వాచీలను కొనుగోలు చేసిన కృనాల్ దీనికి సంబంధించి కస్టమ్స్ డ్యూటీ చెల్లించలేదు. ఇప్పుడు వీటిపై 38 శాతం డ్యూటీ, అదనంగా జరిమానా చెల్లించాక... దర్యాప్తు మొత్తం పూర్తయ్యాకే వీటిని అతనికి అప్పగిస్తారు. -
కృనాల్ పాండ్యా నిర్బంధం
ముంబై: క్రికెటర్ కృనాల్ పాండ్యాను ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు నిర్బంధించారు. ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ పాండ్యా సరైన ధ్రువ పత్రాలు లేని బంగారం, ఇతర విలువైన వస్తువులు కలి గి వుండటంతో అతన్ని విమానాశ్రయంలోనే ఆపివేశారు. ఐపీఎల్–13 చాంపియన్ ముంబై జట్టు సభ్యుడైన అతను గురువారం యూఏఈ నుంచి వచ్చాడు. పరిమితికి మించి బంగారం ఉండటంతో పాటు ఇన్వాయిస్ లేని వస్తువులు కొనుగోలు చేయడంతో నిర్బంధించినట్లు డీఆర్ఐ వర్గాలు తెలిపాయి. -
ఆర్థిక వృద్ధికి ఎయిర్‌పోర్టుల ఊతం
న్యూఢిల్లీ: స్థానిక ఆర్థిక అభివృద్ధికి విమానాశ్రయాలు శక్తిమంతమైన చోదకాలుగా పనిచేస్తాయని అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ పేర్కొన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను పెద్ద నగరాలకు అనుసంధానం చేయడంలో కీలకపాత్ర పోషించగలవని ఆయన చెప్పారు. ముంబై విమానాశ్రయంలో మెజారిటీ వాటాల కొనుగోలు అనంతరం తమ ఎయిర్‌పోర్ట్‌ల వ్యాపార విభాగం మరింతగా విస్తరిస్తుందని అదానీ తెలిపారు. గ్రూప్‌లోని ఇతర వ్యాపారాలకు కూడా ఇది వ్యూహాత్మక అవకాశాలు సృష్టించగలదని ఆయన వివరించారు. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఎంఐఏఎల్)లో జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్‌కు చెందిన 50.50 శాతం వాటాలతో పాటు మైనారిటీ షేర్‌హోల్డర్ల వాటాలను కూడా కొనుగోలు చేస్తున్నట్లు అదానీ ఎయిర్‌పోర్ట్స్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నిస్సందేహంగా అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌పోర్టు. దీనితో పాటు నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మా ఆరు విమానాశ్రయాల పోర్ట్‌ఫోలియోకు తోడవుతుంది. ఈ పరిణామం మా ఇతర వ్యాపారాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకునేందుకు కూడా ఉపయోగపడగలదు‘ అని అదానీ ఒక ప్రకటనలో వివరించారు. 21 శతాబ్దంలోని టాప్ 5 అంతర్జాతీయ మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటిగా ముంబై మారనున్న నేపథ్యంలో దేశీయంగా ఇది ప్రధాన ఎయిర్‌పోర్ట్‌గా మార్చగలదని ఆయన పేర్కొన్నారు. విమాన ప్రయాణికుల సంఖ్య అయిదు రెట్లు పెరుగుతుందన్న అంచనాలతో దేశీయంగా 200 పైచిలుకు ఎయిర్‌పోర్టులు అదనంగా నిర్మించే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. టాప్ 30లోని ఒక్కో నగరానికి రెండు విమానాశ్రయాలు అవసరమవుతాయని అదానీ తెలిపారు. ఇందుకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేసేందుకు అదానీ ఎయిర్‌పోర్ట్స్ సర్వసన్నద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. -
ముంబై ఎయిర్‌పోర్టు : అదానీకే మెజారిటీ వాటా
సాక్షి,ముంబై: అంచనాలకు అనుగుణంగానే గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ముంబైలో భారతదేశపు రెండవ అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (మియాల్)లో 74 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఈ మేరకు అదానీ రెగ్యులేటరీ సమాచారంలో తెలిపింది. ఈ లావాదేవీ కింద ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీవీకె గ్రూపులో 50.5 శాతం వాటాతోపాటు, మైనారిటీ భాగస్వాములైన ఎయిర్పోర్ట్ కంపెనీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (ఎసిఎస్ఎ) 10 శాతం, బిడ్వెస్ట్ 13.5 శాతంవాటా, మొత్తం 23.5 శాతం వాటాను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. మరో 26 శాతం ఎయిర్‌ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంటుంది. మిగిలిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అదానీ గ్రూప్ ప్రకటించింది. అయితే ఈ వాటా అమ్మకాల ప్రయత్నాలను అడ్డుకోవాలని చూసిన ఇన్ఫ్రా దిగ్గజం జీవీకే కోర్టును ఆశ్రయించింది. కానీ రుణ భారంతో పాటు ఆర్థిక అవకతవకలపై సీబీఐ విచారణతో చిక్కుల్లో పడ్డ జీవీకే నిధులను సమకూర్చుకోలేక వైఫల్యం చెందింది. కాగా పారిశ్రామిక దిగ్గజంగా వెలుగొందుతున్నఅదానీ గ్రూప్ ‘భారతదేశపు ప్రముఖ విమానాశ్రయ ఆపరేటర్’ కావాలనే ప్రణాళికలను బహిరంగంగా వెల్లడించిన అదానీ ఆవైపుగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే లక్నో, జైపూర్, గౌహతి, అహ్మదాబాద్, తిరువనంతపురం, మంగళూరుల్లో ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ‘అదానీ’ ల్యాండింగ్!
న్యూఢిల్లీ: రుణ భారంతో పాటు ఆర్థిక అవకతవకలపై సీబీఐ విచారణతో సతమతమవుతున్న ఇన్ఫ్రా దిగ్గజం జీవీకే గ్రూప్ తాజాగా ప్రతిష్టాత్మక ముంబై విమానాశ్రయ ప్రాజెక్టు నుంచి నిష్క్రమించనున్నట్లు తెలుస్తోంది. పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (ఎంఐఏఎల్)లో మెజారిటీ వాటాలను కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎంఐఏఎల్‌లో జీవీకే గ్రూప్‌నకు ఉన్న 50.5 శాతం వాటాలతో పాటు మైనారిటీ భాగస్వాములైన ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ సౌతాఫ్రికా (ఏసీఎస్ఏ), బిడ్వెస్ట్ గ్రూప్ నుంచి మరో 23.5 శాతం వాటాలను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించి జీవీకే, అదానీ గ్రూప్‌ల మధ్య ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిగినట్లు, అంతిమంగా ముంబై ఎయిర్పోర్ట్ నుంచి జీవీకే నిష్క్రమించే అవకాశాలే ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్‌పై పలు టీమ్‌లు కసరత్తు చేస్తున్నాయని, మరికొద్ది వారాల వ్యవధిలోనే ప్రాథమిక వివరాలను ప్రకటించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. సుమారు రూ. 705 కోట్లు నిధులు పక్కదారి పట్టించిందన్న ఆరోపణల మీద జీవీకే గ్రూప్‌పై సీబీఐ విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఈ డీల్ వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గతేడాది నుంచే అదానీ కసరత్తు .. ఎంఐఏఎల్‌లో జీవీకే గ్రూప్‌నకు 50.5 శాతం, బిడ్ సర్వీసెస్ డివిజన్ మారిషస్ (బిడ్వెస్ట్)కు 13.5 శాతం, ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ సౌతాఫ్రికాకు 10 శాతం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (ఏఏఐ)కు 26 శాతం వాటాలు ఉన్నాయి. బిడ్వెస్ట్ వాటాలను అదానీ గ్రూప్ గతేడాది మార్చిలో రూ. 1,248 కోట్లకు కొనుగోలు చేయాలని ప్రయత్నించింది. అయితే, ఈ విషయంలో ముందుగా తమకే అధికారం ఉంటుందంటూ జీవీకే గ్రూప్ ఈ డీల్‌ను అడ్డుకుంది. కానీ, బిడ్వెస్ట్ వాటా కొనుగోలు చేసేంత స్థాయిలో నిధులను సమకూర్చుకోలేకపోయింది. దీంతో వివాదం కోర్టుకు చేరింది. ప్రస్తుతం జీవీకే గ్రూప్ ఆర్థిక పరిస్థితులు గణనీయంగా దిగజారడంతో అదానీ గ్రూప్‌నకు తన వాటా కూడా అమ్మేసి వైదొలిగే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పోర్టుల నుంచి ఎయిర్‌పోర్టుల వరకూ.. నౌకాశ్రయాల నుంచి విమానాశ్రయాల దాకా అదానీ గ్రూప్ భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరిస్తోంది. లక్నో, జైపూర్, గువాహటి, అహ్మదాబాద్, తిరువనంతపురం, మంగళూరులో ఎయిర్పోర్ట్ అథారిటీ నిర్మించిన 6 నాన్–మెట్రో ఎయిర్‌పోర్టుల నిర్వహణ కాంట్రాక్టులను దక్కించుకుంది. ఇక ఎంఐఏఎల్‌ను కూడా దక్కించుకుంటే ప్రభుత్వ రంగ ఏఏఐ మినహా ప్రైవేట్ రంగంలో అతిపెద్ద విమానాశ్రయాల ఆపరేటర్‌గా అదానీ నిలవనుంది. అంతర్జాతీయ స్థాయి ఇన్ఫ్రాతో విమానశ్రయాలను అభివృద్ధి చేయడం ద్వారా దేశంలోనే అతి పెద్ద ఎయిర్పోర్ట్ డెవలపర్‌గా ఎదగాలని భారీ లక్ష్యం నిర్దేశించుకున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ ఇటీవలే తన వార్షిక నివేదికలో వెల్లడించింది. తాజా డీల్ ఆ లక్ష్య సాధనకు తోడ్పడనుంది. గట్టెక్కేందుకు జీవీకే ప్రయత్నాలు.. రుణభారంతో సతమతమవుతున్న జీవీకే గ్రూప్ తమ జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్‌లో 79 శాతం వాటాలను విక్రయించేందుకు గతేడాది అక్టోబర్‌లో అబు దాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ), కెనడాకు చెందిన పబ్లిక్ సెక్టార్ పెన్షన్ (పీఎస్పీ) ఇన్వెస్ట్మెంట్స్, ప్రభుత్వ రంగ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 7,614 కోట్లు. ఈ నిధులను హోల్డింగ్ కంపెనీల రుణభారాన్ని తగ్గించుకునేందుకు వినియోగించుకోవాలని జీవీకే గ్రూప్ భావించింది. అయితే, ఈ డీల్ పూర్తయిందా లేదా అనేది ఇప్పటికీ వెల్లడి కాలేదు. ప్రస్తుతం మాత్రం ఎంఐఏఎల్‌లో వాటాలను అమ్ముకునేందుకు జీవీకే ప్రమోటర్లకు కాస్త వెసులుబాటు ఇచ్చేందుకు ఎన్ఐఐఎఫ్, ఏడీఐఏ, పీఎస్పీ ఇన్వెస్ట్మెంట్స్ అంగీకరించినట్లు సమాచారం. ఎంఐఏఎల్ ఖాతాల ఆడిట్ .. జీవీకే హోల్డింగ్స్‌పై సీబీఐ విచారణ నేపథ్యంలో ఎంఏఐఎల్‌కు చెందిన గడిచిన 10 సంవత్సరాల ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ నిర్ణయించింది. ఇందుకోసం డెలాయిట్ సంస్థను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. కంపెనీకి రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్షియానికి ఎస్బీఐ సారథ్యం వహిస్తోంది. చట్టప్రకారం మోసం ఆరోపణలపై ఎస్బీఐ కూడా విచారణ జరపాల్సి ఉంటుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. -
అదానీ చేతికి ముంబై ఎయిర్పోర్ట్?
సాక్షి, ముంబై: అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్) త్వరలోనే ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (ఎంఐఏఎల్) లో భారీ వాటాను సొంతం చేసుకోనుంది. పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్వహణ లీజును సొంతం చేసుకున్నఅదానీ తాజాగా మియాల్ లో 74 శాతం వాటాను దక్కించుకోనుంది. దీంతో దేశంలో జీఎంఆర్ గ్రూప్ తరువాత అదానీ గ్రూప్ అతిపెద్ద విమానాశ్రయాల ఆపరేటర్‌గా అవతరిస్తుంది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్‌లో జీవీకే గ్రూప్‌నకు చెందిన 50.5 శాతం వాటాను అదానీ కొనుగోలు చేయనుంది. ఈ మేరకు ఈ వారాంతంలో అదానీ గ్రూప్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని బిజినెస్ స్టాండర్డ్ తెలిపింది. అలాగే 23.5 శాతం ఇతర వాటాలను కూడా కొనుగోలు చేయనుంది. బిడ్వెస్ట్ కు చెందిన 13.5 శాతం వాటా, ఏసీఎస్ఏ 10 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. దీంతో ఎంఐఏఎల్‌లో అదానీ వాటా 74 శాతానికి చేరుతుంది. ఇందుకోసం అదానీ గ్రూప్ దాదాపు 15 వేల కోట్ల రూపాయలను చెల్లించనుంది. తద్వారా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ, బ్రాండింగ్ అదానీ గ్రూప్ చేతిలోనే ఉండనుంది. కాగా 50 సంవత్సరాల లీజుకు ఆరు విమానాశ్రయాలను అదానీకి అప్పగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని సంస్థ అహ్మదాబాద్, లక్నో, మంగళూరు, జైపూర్, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాలను తన ఆధీనంలోకి తీసుకుంటుంది. అదానీ గ్రూప్ ఈ 6 విమానాశ్రయాలను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య రీతిలో నిర్వహించడానికి, అభివృద్ధికి హక్కులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. -
జీవీకే ఎయిర్‌పోర్టులో 49% వాటా విక్రయం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను నిర్వహిస్తున్న జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్‌లో 49 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు దిగ్గజ కంపెనీలు ముందుకొచ్చినట్టు సమాచారం. ఇందుకోసం అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ), నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్(ఎన్ఐఐఎఫ్) కన్సార్షియంతో కెనడాకు చెందిన పబ్లిక్ సెక్టార్ పెన్షన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ (పీఎస్పీ ఇన్వెస్ట్మెంట్స్) చేతులు కలుపుతోంది. కన్సా ర్షియంలో ఈ కంపెనీలన్నిటికీ సమాన వాటా ఉండ నుంది. డీల్ విలువ సుమారు రూ.6,000 కోట్లుగా తెలుస్తోంది. ఎన్ఐఐఎఫ్, ఏడీఐఏలు ఈక్విటీ, డెట్ రూపంలో నిధులు సమకూర్చనున్నాయి. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను (ఎంఐఏఎల్) రూ.12,000 కోట్లుగా విలువ కట్టినట్టు సమాచారం. కొత్త ఇన్వెస్టర్లు జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ బోర్డులో చేరనున్నారు. సంస్థ కార్యకలాపాల్లోనూ పాలుపంచుకోనున్నారు. రుణ భారం తగ్గించుకోవడానికే..: ముంబైలోని చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎంఐఏఎల్ నిర్వహిస్తోంది. ఎంఐఏఎల్‌లో జీవీకే వాటా 50.5% కాగా, బిడ్ సర్వీసెస్ డివిజన్‌కు (మారిషస్) 13.5%, ఏసీఎస్ఏ గ్లోబల్‌కు 10%, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి 26% వాటా ఉంది. ముంబై విమానాశ్రయాన్ని 2006 నుంచి నిర్వహిస్తున్న జీవీకే.. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును రూ.16,704 కోట్లతో నిర్మిస్తోంది. డెవలప్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఎంఐఏఎల్‌కు 74%, సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు(సిడ్కో) మిగిలిన వాటా ఉంది. 2020 మధ్యలో ఈ కొత్త విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఇటీవల ప్రకటించారు. కాగా, జీవీకే రూ.5,750 కోట్ల వరకు రుణ భారాన్ని తగ్గించుకోవడానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్ఐఐఎఫ్, ఏడీఐఏతో నాన్ బైండింగ్ ఒప్పందాన్ని చేసుకుంది. తాజా డీల్‌తో వచ్చిన నిధులతో ఎంఐఏఎల్‌లో బిడ్వెస్ట్, ఏసీఎస్‌ఏలకు ఉన్న వాటాలను జీవీకే కొనుగోలు చేయనుంది. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యెస్ బ్యాంకుల్లో సంస్థకున్న రుణ భారాన్ని తగ్గించుకోనుంది. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్స్ బిజినెస్‌కు రూ.8,000 కోట్ల అప్పు ఉంది. -
జీవీకే ఎయిర్‌పోర్ట్స్‌కు చుక్కెదురు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో వాటాను 74 శాతానికి పెంచుకోవాలనుకున్న జీవీకే ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. కోర్టు తీర్పుతో దక్షిణాఫ్రికాకు చెందిన బిడ్వెస్ట్ గ్రూప్‌నకు ఊరట లభించింది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో (ఎంఐఏఎల్) ఈ గ్రూప్ కంపెనీ అయిన బిడ్ సర్వీసెస్ డివిజన్‌కు (మారిషస్) ఉన్న 13.5 శాతం వాటాను థర్డ్ పార్టీకి విక్రయించుకోవచ్చని జస్టిస్ సంజీవ్ నరూలా తీర్పు వెలువరించారు. అంతేగాక వాటా విక్రయాన్ని నిలిపివేయాలంటూ గతంలో ఇదే కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేశారు. బిడ్ సర్వీసెస్ డివిజన్ నుంచి వాటా కొనుగోలు విషయంలో డీల్‌ను సకాలంలో పూర్తి చేసే ఉద్దేశం జీవీకే కంపెనీ కనబరచలేదంటూ కోర్టు వ్యాఖ్యానించింది. అయితే బిడ్ సర్వీసెస్ వాటాను దక్కించుకోవడానికి అదానీ గ్రూప్ ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం. ఇదీ కేసు నేపథ్యం.. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తనకున్న వాటాను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్ ఒకరు ఆసక్తి కనబరుస్తున్నారంటూ జీవీకే ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్‌కు కొన్ని నెలల క్రితం బిడ్ సర్వీసెస్ డివిజన్ నోటీసు ఇచ్చింది. దీంతో రైట్ ఆఫ్ ఫస్ట్ రెఫ్యూజల్ అస్త్రాన్ని జీవీకే ప్రయోగించింది. బిడ్వెస్ట్ వాటాతోపాటు ఏసీఎస్ఏ గ్లోబల్ నుంచి 10 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు జీవీకే కసరత్తు చేసింది. ఈ ప్రక్రియ పూర్తి అయితే జీవీకే ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ వాటా 50.5 శాతం నుంచి 74 శాతానికి చేరుతుంది. ఈ డీల్ కోసం జీవీకే రూ. 2,171.14 కోట్లు చెల్లించాలి. అయితే నిధులు లేకపోవడంతో డీల్ పూర్తి చేసేందుకు సెప్టెంబర్ 30 వరకు సమయం ఇవ్వాలని బిడ్వెస్ట్ను జీవీకే కోరింది. అంత వరకు వేచి చూసేది లేదని, ఇన్వెస్టర్ పెట్టుబడితో సిద్ధంగా ఉన్నారంటూ బిడ్వెస్ట్ తేల్చి చెప్పింది. దీంతో జీవీకే కోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుంది. తాజాగా కోర్టు తీర్పుతో బిడ్వెస్ట్ వాటా విక్రయానికి అడ్డంకులు తొలగిపోయాయి. -
రుణభారం తగ్గుదలపై జీవీకే కసరత్తు
మరిన్ని ఆస్తుల అమ్మకంపై దృష్టి రాజస్థాన్‌లో రహదారి ప్రాజెక్టు విక్రయంపై చర్చలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారీ రుణ భారాన్ని తగ్గించుకునే దిశగా మరిన్ని ఆస్తుల విక్రయంపై జీవీకే పవర్ మరింతగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాజస్థాన్‌లోని ఒక రహదారి ప్రాజెక్టు విక్రయించడంపై దృష్టి పెట్టింది. డియోలీ-కోటా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు దాదాపు తుది దశలో ఉన్నట్లు వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా సంస్థ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 332.16 కి.మీ. మేర ఉన్న ఈ ప్రాజెక్టు కార్యకలాపాలు గతేడాది ఆగస్టులో పాక్షికంగా ప్రారంభమయ్యాయి. మార్చి 31 నాటికి ఇది రూ. 28 కోట్ల ఆదాయం ఆర్జించింది. మరోవైపు, జీవీకే కన్సార్షియం సారథ్యంలోని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఎంఐఏఎల్).. స్థానిక జీవీకే స్కైసిటీలో అయిదు ప్లాట్లను లీజుకిచ్చే దిశగా బిడ్లను ఆహ్వానించింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో సర్వీస్డ్ అపార్ట్మెంట్లు, హోటళ్లు తదితరాలతో పదేళ్లలో 20 మిలియన్ చ.అ. మేర స్కైసిటీని వ్యాపార సముదాయంగా తీర్చిదిద్దాలని ఎంఐఏఎల్ యోచిస్తోంది. ఈ క్రమంలో స్థలాల లీజుకు సంబంధించి డిపాజిట్లు, రెంటు మొదలైన వాటి ద్వారా కంపెనీకి కనీసం రూ.1,500 కోట్ల మేర రాగలవని ఎస్టేట్ కన్సల్టెంట్ల అంచనా. దాదాపు రూ. 22,500 కోట్ల మేర ఉన్న రుణభారాన్ని తగ్గించుకునేందుకు కొన్నాళ్ల క్రితమే బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో మెజారిటీ వాటాలను ఫెయిర్‌ఫ్యాక్స్ హోల్డింగ్‌కు సుమారు రూ.2,100 కోట్లకు సంస్థ విక్రయించింది.