రుణభారం తగ్గుదలపై జీవీకే కసరత్తు
మరిన్ని ఆస్తుల అమ్మకంపై దృష్టి
రాజస్థాన్‌లో రహదారి ప్రాజెక్టు విక్రయంపై చర్చలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారీ రుణ భారాన్ని తగ్గించుకునే దిశగా మరిన్ని ఆస్తుల విక్రయంపై జీవీకే పవర్ మరింతగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాజస్థాన్‌లోని ఒక రహదారి ప్రాజెక్టు విక్రయించడంపై దృష్టి పెట్టింది. డియోలీ-కోటా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు దాదాపు తుది దశలో ఉన్నట్లు వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా సంస్థ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 332.16 కి.మీ. మేర ఉన్న ఈ ప్రాజెక్టు కార్యకలాపాలు గతేడాది ఆగస్టులో పాక్షికంగా ప్రారంభమయ్యాయి. మార్చి 31 నాటికి ఇది రూ. 28 కోట్ల ఆదాయం ఆర్జించింది. మరోవైపు, జీవీకే కన్సార్షియం సారథ్యంలోని ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (ఎంఐఏఎల్).. స్థానిక జీవీకే స్కైసిటీలో అయిదు ప్లాట్లను లీజుకిచ్చే దిశగా బిడ్లను ఆహ్వానించింది.
ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో సర్వీస్డ్ అపార్ట్‌మెంట్లు, హోటళ్లు తదితరాలతో పదేళ్లలో 20 మిలియన్ చ.అ. మేర స్కైసిటీని వ్యాపార సముదాయంగా తీర్చిదిద్దాలని ఎంఐఏఎల్ యోచిస్తోంది. ఈ క్రమంలో స్థలాల లీజుకు సంబంధించి డిపాజిట్లు, రెంటు మొదలైన వాటి ద్వారా కంపెనీకి కనీసం రూ.1,500 కోట్ల మేర రాగలవని ఎస్టేట్ కన్సల్టెంట్ల అంచనా. దాదాపు రూ. 22,500 కోట్ల మేర ఉన్న రుణభారాన్ని తగ్గించుకునేందుకు కొన్నాళ్ల క్రితమే బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో మెజారిటీ వాటాలను ఫెయిర్‌ఫ్యాక్స్ హోల్డింగ్‌కు సుమారు రూ.2,100 కోట్లకు సంస్థ విక్రయించింది.