
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను నిర్వహిస్తున్న జీవీకే ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్‌లో 49 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు దిగ్గజ కంపెనీలు ముందుకొచ్చినట్టు సమాచారం. ఇందుకోసం అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ఏడీఐఏ), నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్(ఎన్‌ఐఐఎఫ్) కన్సార్షియంతో కెనడాకు చెందిన పబ్లిక్ సెక్టార్ పెన్షన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ (పీఎస్‌పీ ఇన్వెస్ట్‌మెంట్స్) చేతులు కలుపుతోంది. కన్సా ర్షియంలో ఈ కంపెనీలన్నిటికీ సమాన వాటా ఉండ నుంది. డీల్ విలువ సుమారు రూ.6,000 కోట్లుగా తెలుస్తోంది. ఎన్‌ఐఐఎఫ్, ఏడీఐఏలు ఈక్విటీ, డెట్ రూపంలో నిధులు సమకూర్చనున్నాయి. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను (ఎంఐఏఎల్) రూ.12,000 కోట్లుగా విలువ కట్టినట్టు సమాచారం. కొత్త ఇన్వెస్టర్లు జీవీకే ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ బోర్డులో చేరనున్నారు. సంస్థ కార్యకలాపాల్లోనూ పాలుపంచుకోనున్నారు.
రుణ భారం తగ్గించుకోవడానికే..: ముంబైలోని చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎంఐఏఎల్ నిర్వహిస్తోంది. ఎంఐఏఎల్‌లో జీవీకే వాటా 50.5% కాగా, బిడ్ సర్వీసెస్ డివిజన్‌కు (మారిషస్) 13.5%, ఏసీఎస్‌ఏ గ్లోబల్‌కు 10%, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి 26% వాటా ఉంది. ముంబై విమానాశ్రయాన్ని 2006 నుంచి నిర్వహిస్తున్న జీవీకే.. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్టును రూ.16,704 కోట్లతో నిర్మిస్తోంది. డెవలప్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ ప్రాతిపదికన చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఎంఐఏఎల్‌కు 74%, సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు(సిడ్కో) మిగిలిన వాటా ఉంది. 2020 మధ్యలో ఈ కొత్త విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఇటీవల ప్రకటించారు. కాగా, జీవీకే రూ.5,750 కోట్ల వరకు రుణ భారాన్ని తగ్గించుకోవడానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్‌ఐఐఎఫ్, ఏడీఐఏతో నాన్ బైండింగ్ ఒప్పందాన్ని చేసుకుంది. తాజా డీల్‌తో వచ్చిన నిధులతో ఎంఐఏఎల్‌లో బిడ్‌వెస్ట్, ఏసీఎస్‌ఏలకు ఉన్న వాటాలను జీవీకే కొనుగోలు చేయనుంది. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యెస్ బ్యాంకుల్లో సంస్థకున్న రుణ భారాన్ని తగ్గించుకోనుంది. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్స్ బిజినెస్‌కు రూ.8,000 కోట్ల అప్పు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment