Abu Dhabi Investment
-
యూపీఎల్‌లో నాలుగు దిగ్గజాల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఆగ్రోకెమికల్ దిగ్గజం యూపీఎల్‌లో నాలుగు అంతర్జాతీయ సంస్థలు మైనారిటీ వాటాలు కొనుగోలు చేస్తున్నాయి. యూపీఎల్ ప్రకటన ప్రకారం ఇందుకోసం అబు దాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ), బ్రూక్‌ఫీల్డ్, కేకేఆర్, టీపీజీ వేర్వేరుగా రూ. 4,040 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అగ్రి–టెక్ ప్లాట్‌ఫాం యూపీఎల్ ఎస్‌ఏఎస్‌లో ఏడీఐఏ, బ్రూక్‌ఫీల్డ్, టీపీజీ 9.09 శాతం వాటాల కోసం 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,580 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తున్నాయి. దీనికోసం యూపీఎల్ ఎస్ఏఎస్ ఈక్విటీ వేల్యుయేషన్‌ను 2.2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 17,380 కోట్లు)గా లెక్కకట్టారు. ఇక, 2.25 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. రూ. 18,450 కోట్లు) వేల్యుయేషన్‌తో ’అడ్వాంటా ఎంటర్ప్రైజెస్ – గ్లోబల్ సీడ్స్ ప్లాట్‌ఫాం’లో కేకేఆర్ రూ. 2,460 కోట్లు (300 మిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేస్తోంది. మరోవైపు, గ్లోబల్ క్రాప్ ప్రొటెక్షన్ ప్లాట్‌ఫాంగా వ్యవహరించే యూపీఎల్ కేమ్యాన్లో ఏడీఐఏ, టీపీజీ 22.2 శాతం కొనుగోలు చేస్తున్నాయి. అయితే, ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడి కాలేదు. -
రిలయన్స్ జియోలో ఏఐడీఏ పెట్టుబడి
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫార్మ్స్‌ల్లో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అధారిటీ(ఏఐడీఏ) జియో ప్లాట్‌ఫార్మ్స్‌ల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. జియోలో 1.16 శాతం వాటా కోసం ఏఐడీఏ రూ.5,684 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. గత ఏడు వారాల్లో జియోలో వచ్చిన ఎనిమిదవ పెట్టుబడి ఇది. ఈ ఎనిమిది ఒప్పందాల ద్వారా వచ్చిన మొత్తం పెట్టుబడుల విలువ రూ.97,856 కోట్లకు చేరింది. ఇటీవలే ఫేస్ బుక్, విస్టా ఈక్విటీ పార్ట్ నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, తదితర సంస్థలు రిలయన్స్ జియోలో పెట్టుబడులు పెట్టాయి. తాజా పెట్టుబడితో జియో ఈక్విటీ వాల్యుయేషన్(విలువ) రూ.4.91 లక్షల కోట్లు చేరుకోగా.. ఎంటర్ప్రైజ్ వాల్యుయేషన్(విలువ) రూ.5.16 లక్షల కోట్లుగా ఉంది. తాజాగా అబుదాబి ఇన్వెస్ట్ మెంట్ అధారిటీ పెట్టుబడి పెట్టడంతో సంస్థ మరింత వృద్ధి చెందుతుందని రిలయన్స్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. చదవండి: మరో మెగా డీల్ : అంబానీ కల నెలవేరినట్టే! -
7,614 కోట్లు సమీకరించిన జీవీకే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగంలో ఉన్న జీవీకే గ్రూప్ రుణ భారం తగ్గించుకునే పనిలో ఉంది. ఇందులో భాగంగా జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్‌లో 79.1 శాతం వాటాను విక్రయించింది. తద్వారా రూ.7,614 కోట్లు సమీకరించింది. అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ), పబ్లిక్ సెక్టార్ పెన్షన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ (పీఎస్పీ ఇన్వెస్ట్మెంట్స్), నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌తో (ఎన్ఐఐఎఫ్) ఈ మేరకు జీవీకే పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ కంపెనీలైన జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్, జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ మధ్య ఆదివారం ఒక ఒప్పందం కుదిరింది. డీల్ తదనంతరం జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్‌లో జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్, ఏడీఐఏ, పీఎస్పీ ఇన్వెస్ట్మెంట్స్, ఎన్ఐఐఎఫ్ వాటాదారులుగా ఉంటాయి. జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్‌లో జీవీకే గ్రూప్ వాటా 20.9 శాతానికి పరిమితం అవుతుంది. డీల్‌లో భాగంగా ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్, నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను రూ.9,608 కోట్లుగా విలువ కట్టారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో.. డీల్ ద్వారా వచ్చిన నిధులను ప్రాథమికంగా హోల్డింగ్ కంపెనీల్లో సుమారు రూ.5,500 కోట్ల రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగించనున్నారు. అలాగే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్‌లో (ఎంఐఏఎల్) జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ తన వాటాను పెంచుకోనుంది. ఇందుకోసం ఎంఐఏఎల్‌లో దక్షిణాఫ్రికా సంస్థలు అయిన బిడ్వెస్ట్, ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ సౌత్ ఆఫ్రికాలకు (ఏసీఎస్ఏ) ఉన్న వాటాను కొనుగోలు చేయనుంది. ఎంఐఏఎల్‌లో బిడ్‌వెస్ట్‌కు 13.5 శాతం, ఏసీఎస్ఏకు 10 శాతం వాటా ఉంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీవీకే గ్రూప్ కంపెనీ అయిన ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. ఇక కొత్తగా నిర్మితమవుతున్న నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి ప్రాజెక్టును ఎంఐఏఎల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో (ఎన్ఎంఐఏ) ఎంఐఏఎల్‌కు 74 శాతం వాటా ఉంది. నిష్క్రమణ కోసం.. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్‌లో (ఎంఐఏఎల్) వాటాదారులైన బిడ్వెస్ట్, ఏసీఎస్ఏ ఎప్పటి నుంచో తప్పుకోవాలని చూస్తున్నాయి. ఈ రెండు సంస్థలకు ఉన్న 23.5 శాతం వాటాను అదానీ కొనుగోలు చేయాలని భావించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో అదానీ ప్రయత్నానికి అడ్డుకట్ట పడ్డట్టే. ఎంఐఏఎల్‌లో జీవీకే గ్రూప్‌నకు 50.5 శాతం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 26 శాతం వాటా ఉంది. బిడ్వెస్ట్, ఏసీఎస్ఏల నుంచి 23.5 శాతం వాటా దక్కించుకోవడం ద్వారా.. జీవీకే గ్రూప్ వాటా 74 శాతానికి చేరనుంది. అయితే రైట్ ఆఫ్ ఫస్ట్ రెఫ్యూజల్ కింద ఈ ఏడాది ప్రారంభంలో బిడ్వెస్ట్ తన 13.5 శాతం వాటాను విక్రయించనున్నట్టు జీవీకేకు తెలిపింది. అందుకు జీవీకే అంగీకరించింది. వాటా కింద ఇవ్వాల్సిన రూ.1,248 కోట్ల చెల్లింపు ఆలస్యం కావడంతో ఢిల్లీ హైకోర్టును బిడ్వెస్ట్ ఆశ్రయించింది. హైకోర్టు సూచన మేరకు వివాదాల పరిష్కార ట్రిబ్యునల్‌ను బిడ్వెస్ట్ ఆశ్రయించింది. అక్టోబరు 31లోగా ఈ చెల్లింపు పూర్తి చేయాలని జీవీకేను ట్రిబ్యునల్ ఆదేశించింది. జీవీకే నిర్వహణలోనే.. వాటా విక్రయం తర్వాత ఎయిర్పోర్ట్ వ్యాపార నిర్వహణ, బ్రాండింగ్ అంతా జీవీకే గ్రూప్ కిందనే ఉంటాయని సంస్థ తెలిపింది. గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టర్లు వెనుక ఉండడం ఎంఐఏఎల్, ఎన్ఎంఐఏ విస్తరణకు కలిసి వస్తుందని వివరించింది. ఎయిర్‌పోర్టుల వ్యాపారం మరింత బలంగా ఎదిగేందుకు దోహద పడుతుందని తెలిపింది. ఎంఐఏఎల్, నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా జీవీకే రెడ్డి, ఎండీగా జీవీ సంజయ్ రెడ్డి కొనసాగనున్నారు. వాస్తవానికి ఎయిర్పోర్ట్ వ్యాపారంలో 49 శాతం వాటాను ఏడీఐఏ, ఎన్ఐఐఎఫ్లకు విక్రయించాలన్న ప్రతిపాదనపై ఏప్రిల్‌లో సంతకాలు జరిగాయి. -
జీవీకే ఎయిర్‌పోర్టులో 49% వాటా విక్రయం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను నిర్వహిస్తున్న జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్‌లో 49 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు దిగ్గజ కంపెనీలు ముందుకొచ్చినట్టు సమాచారం. ఇందుకోసం అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ), నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్(ఎన్ఐఐఎఫ్) కన్సార్షియంతో కెనడాకు చెందిన పబ్లిక్ సెక్టార్ పెన్షన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ (పీఎస్పీ ఇన్వెస్ట్మెంట్స్) చేతులు కలుపుతోంది. కన్సా ర్షియంలో ఈ కంపెనీలన్నిటికీ సమాన వాటా ఉండ నుంది. డీల్ విలువ సుమారు రూ.6,000 కోట్లుగా తెలుస్తోంది. ఎన్ఐఐఎఫ్, ఏడీఐఏలు ఈక్విటీ, డెట్ రూపంలో నిధులు సమకూర్చనున్నాయి. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను (ఎంఐఏఎల్) రూ.12,000 కోట్లుగా విలువ కట్టినట్టు సమాచారం. కొత్త ఇన్వెస్టర్లు జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ బోర్డులో చేరనున్నారు. సంస్థ కార్యకలాపాల్లోనూ పాలుపంచుకోనున్నారు. రుణ భారం తగ్గించుకోవడానికే..: ముంబైలోని చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎంఐఏఎల్ నిర్వహిస్తోంది. ఎంఐఏఎల్‌లో జీవీకే వాటా 50.5% కాగా, బిడ్ సర్వీసెస్ డివిజన్‌కు (మారిషస్) 13.5%, ఏసీఎస్ఏ గ్లోబల్‌కు 10%, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి 26% వాటా ఉంది. ముంబై విమానాశ్రయాన్ని 2006 నుంచి నిర్వహిస్తున్న జీవీకే.. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును రూ.16,704 కోట్లతో నిర్మిస్తోంది. డెవలప్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఎంఐఏఎల్‌కు 74%, సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు(సిడ్కో) మిగిలిన వాటా ఉంది. 2020 మధ్యలో ఈ కొత్త విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఇటీవల ప్రకటించారు. కాగా, జీవీకే రూ.5,750 కోట్ల వరకు రుణ భారాన్ని తగ్గించుకోవడానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్ఐఐఎఫ్, ఏడీఐఏతో నాన్ బైండింగ్ ఒప్పందాన్ని చేసుకుంది. తాజా డీల్‌తో వచ్చిన నిధులతో ఎంఐఏఎల్‌లో బిడ్వెస్ట్, ఏసీఎస్‌ఏలకు ఉన్న వాటాలను జీవీకే కొనుగోలు చేయనుంది. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యెస్ బ్యాంకుల్లో సంస్థకున్న రుణ భారాన్ని తగ్గించుకోనుంది. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్స్ బిజినెస్‌కు రూ.8,000 కోట్ల అప్పు ఉంది. -
గ్రీన్కో ఎనర్జీలో రూ.1,530 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పునరుత్పాదక ఇంధన రంగంలో ఉన్న గ్రీన్కో ఎనర్జీలో సింగపూర్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ జీఐసీతోపాటు అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీలకు చెందిన కంపెనీలు సుమారు రూ.1,530 కోట్లు పెట్టుబడి పెట్టాయి. దీంతో గ్రీన్‌కోలో మెజారిటీ వాటాదారుగా జీఐసీ నిలిచింది. 1,000 మెగావాట్లకుపైగా పవన, జల విద్యుత్ ప్రాజెక్టులను గ్రీన్కో నిర్వహిస్తోంది.