GVK Airport
-
అదానీ–జీవీకే ఎయిర్పోర్ట్ ఒప్పందానికి సీఐఐ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్‌కు ఉన్న మెజారిటీ వాటాలను (50.50 శాతం) అదానీ గ్రూప్ కొనుగోలు చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇతరుల ప్రయోజనాలకు ఎటువంటి భంగం కలగకుండా కొన్ని షరతులకు లోబడి (గ్రీన్ చానెల్) ఇరు సంస్థల మధ్య ఈ ఒప్పందానికి మార్గం సుగమం అయ్యింది. ముంబై విమానాశ్రయంలో మెజారిటీ వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు ఆగస్టులో అదానీ గ్రూప్ తెలిపింది. ప్రస్తుత ప్రమోటరు జీవీకే సంస్థకు ఇందులో ఉన్న రుణభారాన్ని కొనుగోలు చేసి, ఈక్విటీ కింద మార్చుకోవడంతో పాటు ఇతర మైనారిటీ షేర్‌హోల్డర్ల వాటాలను కూడా దక్కించుకోనున్నట్లు వెల్లడించింది. దీని ప్రకారం జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ సంస్థ అయిన జీవీకే ఎయిర్పోర్ట్ డెవలపర్స్ (జీవీకే ఏడీఎల్) రుణాన్ని అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్(ఏఏహెచ్) బ్యాంకర్ల నుంచి కొనుగోలు చేయనుంది. స్టాక్ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఎంఐఏఎల్)లో జీవీకే ఏడీఎల్‌కు ఉన్న 50:50% వాటాతో పాటు ఎయిర్‌పోర్ట్స్ కంపెనీ ఆఫ్ సౌతాఫ్రికా (ఏసీఎస్ఏ), బిడ్వెస్ట్ గ్రూప్ సంస్థలకు ఉన్న 23.5# వాటాలను కూడా (మొత్తం 74%) అదానీ కొనుగోలు చేయనుంది. తద్వారా దేశీయంగా విమానాశ్రయాల నిర్వహణ లో అతి పెద్ద ప్రైవేట్ సంస్థగా ఆవిర్భవించనుంది. -
జీవీకే ఎయిర్‌పోర్టులో 49% వాటా విక్రయం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను నిర్వహిస్తున్న జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్‌లో 49 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు దిగ్గజ కంపెనీలు ముందుకొచ్చినట్టు సమాచారం. ఇందుకోసం అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ), నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్(ఎన్ఐఐఎఫ్) కన్సార్షియంతో కెనడాకు చెందిన పబ్లిక్ సెక్టార్ పెన్షన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ (పీఎస్పీ ఇన్వెస్ట్మెంట్స్) చేతులు కలుపుతోంది. కన్సా ర్షియంలో ఈ కంపెనీలన్నిటికీ సమాన వాటా ఉండ నుంది. డీల్ విలువ సుమారు రూ.6,000 కోట్లుగా తెలుస్తోంది. ఎన్ఐఐఎఫ్, ఏడీఐఏలు ఈక్విటీ, డెట్ రూపంలో నిధులు సమకూర్చనున్నాయి. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను (ఎంఐఏఎల్) రూ.12,000 కోట్లుగా విలువ కట్టినట్టు సమాచారం. కొత్త ఇన్వెస్టర్లు జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ బోర్డులో చేరనున్నారు. సంస్థ కార్యకలాపాల్లోనూ పాలుపంచుకోనున్నారు. రుణ భారం తగ్గించుకోవడానికే..: ముంబైలోని చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎంఐఏఎల్ నిర్వహిస్తోంది. ఎంఐఏఎల్‌లో జీవీకే వాటా 50.5% కాగా, బిడ్ సర్వీసెస్ డివిజన్‌కు (మారిషస్) 13.5%, ఏసీఎస్ఏ గ్లోబల్‌కు 10%, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి 26% వాటా ఉంది. ముంబై విమానాశ్రయాన్ని 2006 నుంచి నిర్వహిస్తున్న జీవీకే.. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును రూ.16,704 కోట్లతో నిర్మిస్తోంది. డెవలప్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఎంఐఏఎల్‌కు 74%, సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు(సిడ్కో) మిగిలిన వాటా ఉంది. 2020 మధ్యలో ఈ కొత్త విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఇటీవల ప్రకటించారు. కాగా, జీవీకే రూ.5,750 కోట్ల వరకు రుణ భారాన్ని తగ్గించుకోవడానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్ఐఐఎఫ్, ఏడీఐఏతో నాన్ బైండింగ్ ఒప్పందాన్ని చేసుకుంది. తాజా డీల్‌తో వచ్చిన నిధులతో ఎంఐఏఎల్‌లో బిడ్వెస్ట్, ఏసీఎస్‌ఏలకు ఉన్న వాటాలను జీవీకే కొనుగోలు చేయనుంది. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యెస్ బ్యాంకుల్లో సంస్థకున్న రుణ భారాన్ని తగ్గించుకోనుంది. ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్స్ బిజినెస్‌కు రూ.8,000 కోట్ల అప్పు ఉంది. -
జీవీకే ఎయిర్‌పోర్ట్స్‌కు చుక్కెదురు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో వాటాను 74 శాతానికి పెంచుకోవాలనుకున్న జీవీకే ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. కోర్టు తీర్పుతో దక్షిణాఫ్రికాకు చెందిన బిడ్వెస్ట్ గ్రూప్‌నకు ఊరట లభించింది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో (ఎంఐఏఎల్) ఈ గ్రూప్ కంపెనీ అయిన బిడ్ సర్వీసెస్ డివిజన్‌కు (మారిషస్) ఉన్న 13.5 శాతం వాటాను థర్డ్ పార్టీకి విక్రయించుకోవచ్చని జస్టిస్ సంజీవ్ నరూలా తీర్పు వెలువరించారు. అంతేగాక వాటా విక్రయాన్ని నిలిపివేయాలంటూ గతంలో ఇదే కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేశారు. బిడ్ సర్వీసెస్ డివిజన్ నుంచి వాటా కొనుగోలు విషయంలో డీల్‌ను సకాలంలో పూర్తి చేసే ఉద్దేశం జీవీకే కంపెనీ కనబరచలేదంటూ కోర్టు వ్యాఖ్యానించింది. అయితే బిడ్ సర్వీసెస్ వాటాను దక్కించుకోవడానికి అదానీ గ్రూప్ ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారం. ఇదీ కేసు నేపథ్యం.. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తనకున్న వాటాను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్ ఒకరు ఆసక్తి కనబరుస్తున్నారంటూ జీవీకే ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్‌కు కొన్ని నెలల క్రితం బిడ్ సర్వీసెస్ డివిజన్ నోటీసు ఇచ్చింది. దీంతో రైట్ ఆఫ్ ఫస్ట్ రెఫ్యూజల్ అస్త్రాన్ని జీవీకే ప్రయోగించింది. బిడ్వెస్ట్ వాటాతోపాటు ఏసీఎస్ఏ గ్లోబల్ నుంచి 10 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు జీవీకే కసరత్తు చేసింది. ఈ ప్రక్రియ పూర్తి అయితే జీవీకే ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ వాటా 50.5 శాతం నుంచి 74 శాతానికి చేరుతుంది. ఈ డీల్ కోసం జీవీకే రూ. 2,171.14 కోట్లు చెల్లించాలి. అయితే నిధులు లేకపోవడంతో డీల్ పూర్తి చేసేందుకు సెప్టెంబర్ 30 వరకు సమయం ఇవ్వాలని బిడ్వెస్ట్ను జీవీకే కోరింది. అంత వరకు వేచి చూసేది లేదని, ఇన్వెస్టర్ పెట్టుబడితో సిద్ధంగా ఉన్నారంటూ బిడ్వెస్ట్ తేల్చి చెప్పింది. దీంతో జీవీకే కోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుంది. తాజాగా కోర్టు తీర్పుతో బిడ్వెస్ట్ వాటా విక్రయానికి అడ్డంకులు తొలగిపోయాయి. -
మార్చిలోపు జీవీకే ఎయిర్పోర్ట్ ఐపీవో!
ఎయిర్పోర్ట్ వ్యాపారంపైనే ప్రధానంగా దృష్టి ఐదేళ్లలో 20 కోట్ల ప్రయాణికుల నిర్వహణ సామర్థ్య లక్ష్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విద్యుత్, ఇన్ఫ్రా రంగంలో పోటీ అధికంగా ఉండటంతో విమానాశ్రయాల అభివృద్ధి, నిర్వహణ వ్యాపారంపై అధికంగా దృష్టిసారించాలని నిర్మాణ రంగ కంపెనీ జీవీకే ఇన్ఫ్రా నిర్ణయించింది. వచ్చే ఐదేళ్లలో ఎయిర్పోర్ట్ విభాగంలో ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. వచ్చే ఐదేళ్లలో తమ ఎయిర్‌పోర్టుల ద్వారా ఏటా 20 కోట్ల మంది ప్రయాణించే స్థాయికి వ్యాపారాన్ని వృద్ధి చేయాలని జీవీకే నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశీయ, అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవడంపై కంపెనీ దృష్టిసారించింది. ఇప్పటికే జీవీకే ఇండోనేషియాలో రెండు విమానాశ్రయాలను, దేశంలో ముంబై, బెంగళూరు విమానాశ్రయాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు ఇప్పుడు నవీ ముంబైలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఎయిర్పోర్ట్ బిడ్డింగ్‌లో కూడా జీవీకే పాల్గొంది. అలాగే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపడుతున్న చిన్న విమానాశ్రయాల అభివృద్ధిలో కూడా తాము పాలుపంచుకోనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. విద్యుత్, రహదారుల ప్రాజెక్టులకు బిడ్డింగ్ పిలిస్తే 30 కంపెనీల వరకు పోటీపడుతున్నాయని, అదే ఎయిర్పోర్ట్ విభాగంలో పోటీ తక్కువగా ఉండటంతో దీనిపై అధికంగా దృష్టిసారిస్తున్నట్లు గతంలో జీవీకే గ్రూపు వైస్ చైర్మన్ జీ.వీ. సంజయ్ రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రైవేటు రంగంలో జీవీకే, జీఎంఆర్ కంపెనీలు స్వంతంగా నాలుగు విమానాశ్రయాలను నిర్వహిస్తున్నాయి. కానీ ఇప్పుడు నవీ ముంబై ఎయిర్పోర్ట్ కాంట్రాక్టుకు హిరనందానీ, టాటా రియల్టీ సంస్థలు విదేశీ భాగస్వామ్య కంపెనీలతో కలిసి బిడ్డింగ్ దాఖలు చేయడం విశేషం.విమానాశ్రయాలపై అధికంగా దృష్టిసారిస్తున్న జీవీకే గ్రూపు ఎయిర్పోర్ట్ విభాగాన్ని లిస్టింగ్ చేయడం ద్వారా నిధులు సేకరించడానికి రంగం సిద్ధం చేసుకుంది. నవీ ముంబై ఎయిర్పోర్ట్ బిడ్డింగ్ వ్యవహారం తేలిన వెంటనే ఐపీవో ముసాయిదా పత్రాలను దాఖలు చేయడానికి కంపెనీ వేచి చూస్తున్నట్లు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరంలోపు(2016 మార్చిలోగా) ఐపీవోకి రావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు జీవీకే ఇన్ఫ్రా సీఎఫ్‌వో ఇసాక్ జార్జ్ తెలిపారు. దీనికి సంబంధించి ముసాయిదా పత్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే సెబీకి దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఐపీవో ద్వారా కనీసం రూ. 3,500 కోట్లు సమీకరించాలన్నది కంపెనీ ఆలోచన. నవీ ముంబై బిడ్డింగ్ వ్యవహారం మరో 4 రోజుల్లో తేలనున్నట్లు సమాచారం. ఇప్పటికే ముంబై ఎయిర్‌పోర్టు నిర్వహిస్తున్న జీవీకేకి నవీ ముంబై ఎయిర్పోర్ట్ బిడ్డింగ్‌లో ఫస్ట్ రైట్ ఆఫ్ రెఫ్యూజల్ అవకాశం ఉండటంతో తమకే ఈ బిడ్డింగ్ వస్తుందన్న నమ్మకంతో కంపెనీ వర్గాలున్నాయి. దేశంలో తొలిసారిగా రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న నగరంగా ముంబై రికార్డులకు ఎక్కనుంది. -
జీవీకేలో వాటాల ‘బదిలీ’...
ప్రమోటర్ల వాటా వెర్టెక్స్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పీకి - అది కూడా ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా... - ఇటీవలే ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఎల్ఎల్పీగా మారిన వెర్టెక్స్ - అప్పుల బాధ్యతను తొలగించుకునే మార్గం: మార్కెట్ వర్గాలు - పన్నుల భారం తగ్గించుకోవటానిక్కూడా అంటున్న నిపుణులు - ఆలస్యం కానున్న జీవీకే ఎయిర్‌పోర్టు ఐపీవో హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవీకే ఇన్ఫ్రా కౌంటర్లో ఏదో జరుగుతోంది. ఇన్ఫ్రాతో పాటు ఎయిర్‌పోర్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, ఇతర వ్యాపారాల్లో ఉన్న ఈ గ్రూప్ ప్రమోటర్లు... కొద్దిరోజులుగా దీన్లో తమకున్న వ్యక్తిగత వాటాలను తాము యజమానులుగా ఉన్న మరో కంపెనీలోకి బదలాయిస్తున్నారు. అది కూడా నేరుగా కాదు. ఓపెన్ మార్కెట్ ద్వారా. ప్రమోటర్లుగా ఉన్న జీవీ కృష్ణారెడ్డి కుటుంబం తమ షేర్లను మార్కెట్లో విక్రయిస్తుంటే... వారే యజమానులుగా ఉన్న మరో కంపెనీ వీటిని మార్కెట్ నుంచి కొంటోంది. మొత్తానికి చూస్తే ప్రమోటర్ల వాటా వారి దగ్గరే ఉంటోంది. కానీ వ్యక్తిగతంగా వారి చేతుల్లో నుంచి... వేరొక కంపెనీలోకి!! ఎందుకిలా..? ఒకేసారిగా కాకుండా విడతల వారీగా ఎందుకిలా చేస్తున్నట్లు? ఇవీ సాధారణ ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న ప్రశ్నలు. ప్రమోటర్లు వారి వ్యక్తిగత వాటాలను తమ దగ్గర్నుంచి వేరొక హోల్డింగ్ కంపెనీకి బదలాయించటం కొత్త విషయమేమీ కాదు. జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ (జీవీకే పీఐఎల్) విషయంలో కూడా జరుగుతున్నదదే. కాకపోతే... సదరు హోల్డింగ్ కంపెనీని ఈ మధ్యే ప్రైవేట్ లిమిటెడ్ నుంచి లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ (ఎల్ఎల్పీ)గా మార్చటమే చర్చకు తావిస్తోంది. పెపైచ్చు ఈ పేరు మార్చాకే వాటాల బదిలీ ఊపందుకుంది. ఇప్పటివరకూ ప్రమోటర్ హోల్డింగ్ కంపెనీగా ఉన్న వెర్టెక్స్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఈ మధ్యే వెర్టెక్స్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పీగా మార్పుచేస్తూ రిజిస్టర్ చేశారు. ఇలా మార్చకముందు... వెర్టెక్స్‌కు జీవీకేలో 8.91 శాతం వాటా ఉండేది. కానీ రిజిస్ట్రేషన్‌ను మార్చాకా, వాటాల బదిలీ ఊపందుకుని... ఇపుడది ఏకంగా 34 శాతానికి చేరుకుంది. జీవీ కృష్ణారెడ్డి కుటుంబానికి జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాలో మొత్తంగా 54.25 శాతం వాటా ఉండటం గమనార్హం. వెర్టెక్స్‌కు వాటాలు బదలాయించిన అనంతరం... అంటే ఇపుడు వ్యక్తిగతంగా ఏ ఒక్క ప్రమోటర్కూ జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రాలో 5 శాతానికి మించి వాటా లేదు. మున్ముందు ఈ వాటాలు కూడా వెర్టెక్స్ ఎల్ఎల్పీలోకి బదలాయించే అవకాశం ఉందన్నది మార్కెట్ వర్గాల మాట. అప్పుల భారం పెరగటం వల్లేనా? 2007 నాటి ఆర్థిక సంక్షోభం దెబ్బకు మిగతా అన్ని ఇన్ఫ్రా కంపెనీల మాదిరే జీవీకే కూడా భారీగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. పూర్తిగా నష్టాల్లో ఉన్న ఈ కంపెనీకి ఇప్పటికీ సుమారు రూ.25,000 కోట్ల అప్పులున్నాయి. కొన్ని ఆస్తులు విక్రయించి రుణభారం తగ్గించుకుందామని ఇటీవల ప్రయత్నాలు చేసినా... దాదాపు అన్ని ఇన్ఫ్రా కంపెనీలూ ఇదే పద్ధతిని అనుసరిస్తుండటంతో కొనుగోలు చేసేవారు కూడా ముందుకు రావటం లేదు. ఈ అప్పుల బాధ్యతలను వ్యక్తిగతంగా తొలగించుకోవడానికే తమ వాటాలను వెర్టెక్స్ ఎల్ఎల్పీకి బదలాయిస్తున్నారనేది నిపుణుల విశ్లేషణ. సాధారణంగా లిమిటెడ్ కంపెనీలో అప్పులు చెల్లించలేని పరిస్థితి తలెత్తితే, అప్పుడు తనఖా పెట్టిన ఆస్తులతో పాటు... వాటి విలువలు సరిపోని పక్షంలో కొన్నిసార్లు ప్రమోటర్ల వ్యక్తిగత ఆస్తులు కూడా జవాబుదారీగా ఉండాల్సి రావచ్చు. అదే ఎల్ఎల్పీలో అయితే వ్యక్తిగత ఆస్తుల జోలికొచ్చే అవకాశం ఉండదు. అందుకే ప్రమోటర్లు తమ హోల్డింగ్ కంపెనీని ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఎల్ఎల్పీగా మార్చి... దానికి షేర్లు బదలాయిస్తున్నారని, ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా వాటాలు మార్చడానికి ఇదే కారణం కావొచ్చన్న అభిప్రాయాన్ని మార్కెట్ వర్గాలు వ్యక్తంచేస్తున్నాయి. వెర్టెక్స్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పీలో నూరు శాతం వాటా జీవీ కృష్ణారెడ్డి కుటుంబానిదే. కృష్ణారెడ్డి ఆయన భార్య ఇందిరా రెడ్డికి 34% వాటా ఉండగా... తనయుడు సంజయ్ కుటుంబానికి 33%, కుమార్తె శాలిని కుటుంబానికి 33% వాటా ఉంది. ‘జీవీకే ఇన్ఫ్రా ఒకవేళ అప్పులు తీర్చడంలో విఫలమైతే వెర్టెక్స్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పీకి ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చేమో గానీ దీన్లో వాటాదారులుగా ఉన్న వారి సొంత ఆస్తుల జోలికొచ్చే వీలుండదు’ అని ట్యాక్సేషన్ నిపుణుడొకరు పేర్కొన్నారు. ‘ప్రైవేట్ లిమిటెడ్‌తో పోలిస్తే ఎల్ఎల్పీ విషయంలో నిబంధనలు తక్కువ. పెపైచ్చు డివిడెండ్ పన్ను సహా కొన్ని పన్నులు కూడా తప్పించుకునే వీలుంటుంది’ అని మరో ఆడిటర్ అభిప్రాయపడ్డారు. ఎయిర్పోర్ట్స్ఐపీవో వాయిదా? జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా కింద ఉన్న కంపెనీల్లో లాభాల్లో ఉన్న ఒకే ఒక వ్యాపార విభాగం ఎయిర్‌పోర్ట్స్. దీన్ని ప్రత్యేక కంపెనీగా విడదీసి స్టాక్ మార్కెట్లో నమోదు చేయాలన్న ఆలోచనను సంస్థ తాత్కాలికంగా వాయిదావేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతుండటం, ఈ మధ్య ఐపీవోలకు వచ్చిన కంపెనీలకు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా ఆదరణ లభించకపోవడం ఈ వాయిదాకు కారణంగా తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ వ్యాపారాన్ని స్టాక్ మార్కెట్లో నమోదు చేయడం ద్వారా సుమారుగా రూ. 3,000 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. త్వరలో ఐపీవోకి రానున్న రూ. 2,500 కోట్ల ఇండిగో ఎయిర్‌లైన్స్ ఐపీవో తర్వాత జీవీకే గ్రూపు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.