జీవీకేలో వాటాల ‘బదిలీ’... | Transfer of shares GVK | Sakshi
Sakshi News home page

జీవీకేలో వాటాల ‘బదిలీ’...

Published Tue, Sep 29 2015 1:06 AM | Last Updated on Sun, Sep 3 2017 10:08 AM

జీవీకేలో వాటాల ‘బదిలీ’...

జీవీకేలో వాటాల ‘బదిలీ’...

ప్రమోటర్ల వాటా వెర్టెక్స్ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పీకి
- అది కూడా ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా...
- ఇటీవలే ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఎల్‌ఎల్‌పీగా మారిన వెర్టెక్స్
- అప్పుల బాధ్యతను తొలగించుకునే మార్గం: మార్కెట్ వర్గాలు
- పన్నుల భారం తగ్గించుకోవటానిక్కూడా అంటున్న నిపుణులు
- ఆలస్యం కానున్న జీవీకే ఎయిర్‌పోర్టు ఐపీవో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
జీవీకే ఇన్‌ఫ్రా కౌంటర్లో ఏదో జరుగుతోంది. ఇన్‌ఫ్రాతో పాటు ఎయిర్‌పోర్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, ఇతర వ్యాపారాల్లో ఉన్న ఈ గ్రూప్ ప్రమోటర్లు... కొద్దిరోజులుగా దీన్లో తమకున్న వ్యక్తిగత వాటాలను తాము యజమానులుగా ఉన్న మరో కంపెనీలోకి బదలాయిస్తున్నారు. అది కూడా నేరుగా కాదు. ఓపెన్ మార్కెట్ ద్వారా. ప్రమోటర్లుగా ఉన్న జీవీ కృష్ణారెడ్డి కుటుంబం తమ షేర్లను మార్కెట్లో విక్రయిస్తుంటే... వారే యజమానులుగా ఉన్న మరో కంపెనీ వీటిని మార్కెట్ నుంచి కొంటోంది. మొత్తానికి చూస్తే ప్రమోటర్ల వాటా వారి దగ్గరే ఉంటోంది. కానీ వ్యక్తిగతంగా వారి చేతుల్లో నుంచి... వేరొక కంపెనీలోకి!! ఎందుకిలా..? ఒకేసారిగా కాకుండా విడతల వారీగా ఎందుకిలా చేస్తున్నట్లు? ఇవీ సాధారణ ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న ప్రశ్నలు.
 
ప్రమోటర్లు వారి వ్యక్తిగత వాటాలను తమ దగ్గర్నుంచి వేరొక హోల్డింగ్ కంపెనీకి బదలాయించటం కొత్త విషయమేమీ కాదు. జీవీకే పవర్ అండ్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ (జీవీకే పీఐఎల్) విషయంలో కూడా జరుగుతున్నదదే. కాకపోతే... సదరు హోల్డింగ్ కంపెనీని ఈ మధ్యే ప్రైవేట్ లిమిటెడ్ నుంచి లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్ (ఎల్‌ఎల్‌పీ)గా మార్చటమే చర్చకు తావిస్తోంది. పెపైచ్చు ఈ పేరు మార్చాకే వాటాల బదిలీ ఊపందుకుంది. ఇప్పటివరకూ ప్రమోటర్ హోల్డింగ్ కంపెనీగా ఉన్న వెర్టెక్స్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఈ మధ్యే వెర్టెక్స్ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పీగా మార్పుచేస్తూ రిజిస్టర్ చేశారు. 

ఇలా మార్చకముందు... వెర్టెక్స్‌కు జీవీకేలో 8.91 శాతం వాటా ఉండేది. కానీ రిజిస్ట్రేషన్‌ను మార్చాకా, వాటాల బదిలీ  ఊపందుకుని... ఇపుడది ఏకంగా 34 శాతానికి చేరుకుంది. జీవీ కృష్ణారెడ్డి కుటుంబానికి జీవీకే పవర్ అండ్ ఇన్‌ఫ్రాలో మొత్తంగా 54.25 శాతం వాటా ఉండటం గమనార్హం. వెర్టెక్స్‌కు వాటాలు బదలాయించిన అనంతరం... అంటే ఇపుడు వ్యక్తిగతంగా ఏ ఒక్క ప్రమోటర్‌కూ జీవీకే పవర్ అండ్ ఇన్‌ఫ్రాలో 5 శాతానికి మించి వాటా లేదు. మున్ముందు ఈ వాటాలు కూడా వెర్టెక్స్ ఎల్‌ఎల్‌పీలోకి బదలాయించే అవకాశం ఉందన్నది మార్కెట్ వర్గాల మాట.
 
అప్పుల భారం పెరగటం వల్లేనా?
2007 నాటి ఆర్థిక సంక్షోభం దెబ్బకు మిగతా అన్ని ఇన్‌ఫ్రా కంపెనీల మాదిరే జీవీకే కూడా భారీగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. పూర్తిగా నష్టాల్లో ఉన్న ఈ కంపెనీకి ఇప్పటికీ సుమారు రూ.25,000 కోట్ల అప్పులున్నాయి. కొన్ని ఆస్తులు విక్రయించి రుణభారం తగ్గించుకుందామని ఇటీవల ప్రయత్నాలు చేసినా... దాదాపు అన్ని ఇన్‌ఫ్రా కంపెనీలూ ఇదే పద్ధతిని అనుసరిస్తుండటంతో కొనుగోలు చేసేవారు కూడా ముందుకు రావటం లేదు. ఈ అప్పుల బాధ్యతలను వ్యక్తిగతంగా తొలగించుకోవడానికే తమ వాటాలను వెర్టెక్స్ ఎల్‌ఎల్‌పీకి బదలాయిస్తున్నారనేది నిపుణుల విశ్లేషణ. సాధారణంగా లిమిటెడ్ కంపెనీలో అప్పులు చెల్లించలేని పరిస్థితి తలెత్తితే, అప్పుడు తనఖా పెట్టిన ఆస్తులతో పాటు... వాటి విలువలు సరిపోని పక్షంలో కొన్నిసార్లు ప్రమోటర్ల వ్యక్తిగత ఆస్తులు కూడా జవాబుదారీగా ఉండాల్సి రావచ్చు. అదే ఎల్‌ఎల్‌పీలో అయితే వ్యక్తిగత ఆస్తుల జోలికొచ్చే అవకాశం ఉండదు.

అందుకే ప్రమోటర్లు తమ హోల్డింగ్ కంపెనీని ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఎల్‌ఎల్‌పీగా మార్చి... దానికి షేర్లు బదలాయిస్తున్నారని, ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా వాటాలు మార్చడానికి ఇదే కారణం కావొచ్చన్న అభిప్రాయాన్ని మార్కెట్ వర్గాలు వ్యక్తంచేస్తున్నాయి. వెర్టెక్స్ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పీలో నూరు శాతం వాటా జీవీ కృష్ణారెడ్డి కుటుంబానిదే. కృష్ణారెడ్డి ఆయన భార్య ఇందిరా రెడ్డికి 34% వాటా ఉండగా... తనయుడు సంజయ్ కుటుంబానికి 33%, కుమార్తె శాలిని కుటుంబానికి 33% వాటా ఉంది. ‘జీవీకే ఇన్‌ఫ్రా ఒకవేళ అప్పులు తీర్చడంలో విఫలమైతే వెర్టెక్స్ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పీకి ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చేమో గానీ దీన్లో వాటాదారులుగా ఉన్న వారి సొంత ఆస్తుల జోలికొచ్చే వీలుండదు’ అని ట్యాక్సేషన్ నిపుణుడొకరు పేర్కొన్నారు. ‘ప్రైవేట్ లిమిటెడ్‌తో పోలిస్తే ఎల్‌ఎల్‌పీ విషయంలో నిబంధనలు తక్కువ. పెపైచ్చు డివిడెండ్ పన్ను సహా కొన్ని పన్నులు కూడా తప్పించుకునే వీలుంటుంది’ అని మరో ఆడిటర్ అభిప్రాయపడ్డారు.
 
ఎయిర్‌పోర్ట్స్‌ఐపీవో వాయిదా?
జీవీకే పవర్ అండ్ ఇన్‌ఫ్రా కింద ఉన్న కంపెనీల్లో లాభాల్లో ఉన్న ఒకే ఒక వ్యాపార విభాగం ఎయిర్‌పోర్ట్స్. దీన్ని ప్రత్యేక కంపెనీగా విడదీసి స్టాక్ మార్కెట్లో నమోదు చేయాలన్న ఆలోచనను సంస్థ తాత్కాలికంగా వాయిదావేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతుండటం, ఈ మధ్య ఐపీవోలకు వచ్చిన కంపెనీలకు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా ఆదరణ లభించకపోవడం ఈ వాయిదాకు కారణంగా తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్ వ్యాపారాన్ని స్టాక్ మార్కెట్లో నమోదు చేయడం ద్వారా సుమారుగా రూ. 3,000 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. త్వరలో ఐపీవోకి రానున్న రూ. 2,500 కోట్ల ఇండిగో ఎయిర్‌లైన్స్ ఐపీవో తర్వాత జీవీకే గ్రూపు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement